Friday, October 12, 2007

మీర్రాసిన టపా హిట్టా ఫట్టా – విశ్లేషణాత్మక వ్యాసం

.


బ్లాగు లో టపా రాసిన ప్రతిసారి అది అందరినీ చేరిందో లేదో లేక ఎంతమందికి నచ్చిందో అని ప్రతి బ్లాగరు అనుకొంటాడు/ది. ఇది ప్రతి బ్లాగరుకున్న సహజ బలోపేతమైన బలహీన లక్షణం. ఈ లక్షణాలు లేక పోతే అసలు బ్లాగరే కాదు. పైత్యం ప్రకోపించి నాకు ఈ లక్షణాలు లేవు అని ఎదురొస్తే అన్నీ అనుభవించేసి మోక్షాన్ని సాక్షాత్కరించుకొన్న “యోగి బ్లాగరు” అని నమస్కరించి పక్కకు తప్పుకుంటాన్నేను.

వృత్తం గుండ్రంగా వుంటుంది అని చెప్పడానికి కాగితం మీద వృత్త లేఖిని పెట్టి పెన్సిల్ భుజానేసుకుని చుట్టూ రౌండు కొట్టి చూపించడం కంటే చంద్రుడి లాగా గుండ్రంగా వుంటుంది అని చెప్పడం తేలిక. అలాగే ఇప్పుడు సౌలభ్యం కోసం సరళంగా బ్లాగులను సినిమాలు అనుకొందాం. బ్లాగర్లలో కొంత మంది చిరంజీవులు ఉండచ్చు, కొంతమంది బాలకృష్ణలు వుండచ్చు. ఇంకొంతమంది మహేష్ బాబులు, మరికొంతమంది జూ.ఎన్టీఆర్ లు అయుండచ్చు. కేవలం రికార్డులకోసం వీళ్ళ పేర్లను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. బ్లాగులు రాసేటైపుకు ఈ రంగులేసుకునే వాళ్ళ ఇమేజిలకు సంబంధం లేదు. మామూలుగా అయితే కామెంట్లు బాగా వస్తే ఆ టపా హిట్టయినట్టు లెక్క. కొన్ని సార్లు కామెంట్లు లేకపోయినా అది హిట్టు కింద లెక్క కట్టచ్చ్చు. అదెలానో వివరంగా తెలుసుకుందాం.

హిట్లు:

మీరొక టపా రాసిన వెంటనే అంటే ఇరవై నాలుగ్గంటల్లో టపీ టపీ మని 150+ హిట్లు వచ్చాయంటే మీరు మహా బ్లాగరు కింద లెక్క. అంటే చిరంజీవి, జూ.ఎన్టీఆర్ సినిమాలకు భారీ ఓపనింగ్స్ వచ్చినట్టు. ఇంకా ఎక్కువ హిట్లు వస్తే ఎక్కువ సెంటర్లలో ఓపన్ అయిన మాంచి క్రేజీ కాంబినేషన్ సినిమా అన్నట్టు. అలా కాకుండా కొంచెం కిందకి అంటే 100-150 మధ్య హిట్లు వస్తే రవితేజా, ప్రభాస్ రేంజు వున్న టపా అన్నట్టు. అంతకన్నా కింద అంటే 50-100 మధ్యలో వస్తే మీ బ్లాగు శ్రీహరి, శ్రీకాంత్, తొట్టెంపూడి వేణు లాంటి క్రేజు వున్న టపా అన్నట్టు. 50 కన్న తక్కువ వస్తే మీ బ్లాగు కూడల్లోనూ , తేనెగూడులోనూ , తెలుగు బ్లాగర్స్ లోనూ , జల్లెడలోనూ ఎక్కడా లేనట్టు. ఒక వేళ వున్నా అంత తక్కువ వచ్చాయంటే మీరు కొత్త బ్లాగరు కావచ్చు లేక పోతే పబ్లిసిటీ ఏమాత్రాం లేని “ఒరేయ్ నా గుడిసె పీకరా” సినిమాలాగా మీ టపా కి పేరు పెట్టినట్టు. పాత బ్లాగరయ్యి ఈ రేంజులో హిట్లు వస్తే టపాలు రాయడం మానేసి “విహారి బ్లాగు శిక్షణాలయం” లో మూడు నెలల ప్రాథమిక కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలి. గొప్ప దసరా, దీపావళి తగ్గింపు ధరలు నడుస్తున్నాయి. తెలుగు బ్లాగులు రాయాలనుకుంటున్న ఆంగ్ల బ్లాగరులకు పది శాతం అదనపు తగ్గింపు.

ఎంత భారీ ఓపనింగ్స్ వచ్చినా ఆంధ్రావాలా, అందరివాడు సినిమాల్లాగా తుస్సు మనే సినిమాలు కూడా వుంటాయి. అలాంటి టపాకు ఒక్క కామెంటు కూడా రాదు. వచ్చినా ఆ కామెంట్లు రాసిన వాళ్ళు ఆ బ్లాగుకు గుడ్డి పంకా (బ్లైండ్ ఫ్యాన్) అయుంటారు. వాళ్ళు సినిమా రిలీజుకు ముందు నాన్న జేబులో డబ్బు కొట్టేసి ఆ డబ్బుతో హీరో కటవుట్ కు పాలాభిషేకం చేసి, బ్యానర్లు కట్టే అభిమానుల్లాగా “ఇరగదీశావ్ గురు” అనే మాటల్ని clipboard లో, రెండు పెగ్గులు రమ్ము కడుపులో సేవ్ చేసుకొని వస్తారు. ముందు కామెంటు పోస్టు చేసి తరువాత టపా చదువుతారు. తీరా చదివిన తరువాత అంత బాగా లేదనిపిస్తే “స్టోరీ బాగా లేదు కానీ.. బాసు మాత్రం యాక్షన్ చింపేశాడు” అనే వీరా(ర్రి)భిమాని టైపులో “శైలి బాగా వుంది.. తీసుకున్న సబ్జక్టు బాలేదు” అని కామెంటు రాస్తారు. వీటిని హిట్టు కింద పరిగణలోకి తీసుకోనక్కర లేదు.

కొన్ని టపాలకు హిట్లు కూడలి కామెంట్ల విభాగం నుండి వస్తాయి. ఇవి “వర్డ్ ఆఫ్ మౌత్” కింద పబ్లిసిటీకి నోచుకునేవి. మొదట 70 కి దగ్గరి ప్రాంతంలో హిట్లు వచ్చినా ఈ దెబ్బకి అవి అమాంతం 150 కి చేరుకుంటాయి. ఇందులో, కూడల్లో మీ టపా కనిపించగానే "థూ ఈడొకడు వీడి మొఖానికొక బ్లాగు” లేదా " వీడి టపా చదివితే నేను మళ్ళీ కుళ్ళుకోవాలి. నేను వీడి బ్లాగు చదవను"“ అని అనుకునే వాళ్ళు ఎవరైనా వుంటే వాళ్ళు కూడా ఈ లిస్టులో వచ్చి పడతారు. అప్పుడు కూడా మీ టపా హిట్టే. ఇక్కడే టపా విజయానికి కిటుకు లన్నీ ఆధార పడి వుంటాయి.

సందర్భ ప్రకటన:

టపా హిట్టు చేయు విధానంబెట్టిదన…. సునీతా విలియమ్స్ భారత దేశం గర్వించ తగ్గ మహిళ అని టపా రాశారనుకోండి. ఠాఠ్ అసలు ఈవిడ భారద్ధేశపు మహిళ కాదు. ఇక్కడ పుట్టని వాళ్ళు భారతీయులు కాదు. దేశాన్ని వదిలి వెళ్ళి పోయిన వాళ్ళు అని చిన్న దొంగ కామెంటు ఒకటి రాసుకుంటే చాలు. నివాస భారతీయులు ఒక వైపున ప్రవాస భారతీయులు ఇంకో వైపున నిలబడి కీబోర్డులనుండి నాగాస్త్రాలు, వారుణాస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు వదులుకుంటారు. మీరప్పుడు పుట్టపర్తి విమానాశ్రయం దగ్గర చంద్రుని లో బాబా ని చూద్దామని వచ్చిన 10 వేల మంది జనాలకు “ఇదిగో ఆ మేఘం కింద బాబా, అదిగో ఆ మేఘం పైన బాబా” అని ఉత్సాహ పరిచినట్టు “ప్రవాస భారతీయులు కొంత మంది అలా అని ఒప్పుకుంటున్నా కానీ... నా ఉద్ధేశ్యమేంటంటే.."అని దీర్ఘాలు తీస్తూ.. కొంచెం ఆవు నెయ్యి, కొంచెం ఇరాక్ పెట్రోలు పొయ్యాలి. ఇక 100+ హిట్ల నుండి వెయ్యి హిట్లకు చేరుకోనే బృహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుడి పూజ లేకుండానే జరిగిపోతుంది. ఇలాంటి మరిన్ని కిటుకుల కోసం నేడే “విహారి బ్లాగు శిక్షణాలయం” లో చేరండి. గొప్ప దీపావళి తగ్గింపు ధరలు.

సందర్భ ప్రకటన సమాప్తం.

“ఆపరేషన్ దుర్యోధన” టైపు టపాలు:

ఒక్కోసారి మీ బ్లాగు, హిట్లు లేని శ్రీకాంత్ లాగా తయారయ్యిందనుకుంటే “ఆపరేషన్ దుర్యోధన” లాంటి టపా ఒకటి రాయాలి. అంటే అందులో అవసరం లేకపోయినా కొన్ని అభ్యంతర కర ప్రేలాపనలు వుండాలి. అది కనుక్కున్నట్టు కొన్ని కామెంట్లు రాసి కూడలి లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలాంటి టపాలు కూడా హిట్టు కిందే లెక్క మీరు అదే పనిగా ఇలా రాస్తే.

డబ్బింగ్ టపాలు:


ఏ ఇసిజులూ బాషలోనో, సెసొతో బాషలోనో బాగా హిట్టయిన గొర్రె తోక నుండి విమానం ఇంధనం అనే విషయాన్ని తెలుగు లోకి అనువదించే టపాలు ఈ కోవ కిందికి వస్తాయి. వీటికి మూలాధారం ఇచ్చేస్తే ఆటోమేటిగ్గా మీ టపా ఫ్లాపవుతుంది. అలా కాకుండా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం రెఫెరెన్సులు ఇచ్చుకుంటూ రాసేస్తే అది బాగా హిట్టయిన టపా. మంచి విషయం చెప్పారు అని కామెంటేస్తారు. మీ కన్నా ముందుగా ఇంకెవరన్నా చదివేసి (ఆ ఇసిజులూ,సెసొతో బాషలో ) దీన్ని అక్కడ చదివినానోచ్ అని కామెంటు రాస్తే వెంటనే దాన్ని యువరాజ్ సిక్సు లాగా బ్లాగవతలకి కొట్టి పడేస్తే మీ టపా హిట్టే.

“భ్లాగోళ జంభ” టపాలు:

ఇవి సాధారణంగా అన్ని సీజన్లలో హిట్టవుతాయి. ఇందులో విషయమంతా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు బ్లాగు చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడమే కాకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు భూమి మీద జరిగే అన్ని విషయాలూ ఇందులో ఇరికించబడతాయి. అంటే భూగోళం లో భ్లాగోళం లాగా. ఇవెప్పుడూ నిత్య నూతనంగా వుంటాయి. అచేతనంగా వున్న కొందరు బ్లాగర్లను కూకట్ పల్లి నుండి దిల్‌సుఖ్ నగర్ కు అయిదు నిముషాల్లో చేరుకున్నంతగా దిల్ ఖుష్ చేస్తాయి. ఆహా నేను కూడా ఇలా రాస్తే ఎంత బావుంటుంది అని బ్లాగర్లు రోజుకు ఒక్క సారన్నా అనుకొంటారు. అలా అనుకోలేదంటే వాళ్ళు బ్లాగుకుళ్ళుకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ బ్లాగ్వేస్టుజీ స్వాముల వారి ఆశ్రమం నుండి వచ్చిన వారయుంటారు. ఇలాంటి వారితో ఫోనులో మాట్లాడం గానీ, కాఫీ కెళ్ళడం గానీ చెయ్య కూడదు. ఎందుకంటే వీళ్ళు టపావేస్ట్ చూర్ణం మీచేత తాగించేస్తారు. ఇలా మారు వేషం లో తిరిగే కుళ్ళు కోటి మఠం భక్తులు పేర్లు ఒక శిక్షణాలయం లో రికార్డు గావించ బడ్డాయి. అర్థం కాకపోతే “విహారి శిక్షణాలయం” ను సంప్రదించండి. గొప్ప తగ్గింపు ధరలు. (ఇది చాలా అడ్వాన్సుడు కోర్సు. ఈ కోర్సుకు ప్రత్యేక ప్రీమియెం ఫీజులు కలవు. ఈ శిక్షణాలయం కరస్పాండెంట్/సి.ఈ.ఓ. వ్యక్తిగత పర్య వేక్షణ లో కోర్సు సా……..గుతుంది)

ముష్టి కామెంట్ల టపాలు:

హిట్లు వచ్చినా కామెంట్లు 5 అంతకన్నా తక్కువగా వస్తే, తరుణ్ సినిమా రిలీజ అయిన నాలుగు వారాలు బాలకృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు నటించిన ఏ సినిమా రిలీజ్ కానట్టు. గతి లేక మీ బ్లాగుకొచ్చినట్లు అని అర్థం. అప్పుడు వచ్చేవి ముష్టి కామెంట్లు. ఇలాంటి సమయాల్లో వెంటనే ఇంకో టపా రాయడం ఉత్తమం. ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదు అనే సామెత అసలు గుర్తుకు రాకూడదు.

దండోరా టపాలు:

మా పనిమనిషి ముక్కులో మిరపకాయ దూరింది. డాక్టరు పనిమనిషి ముక్కు కోసి (ఇక్కడ డాక్టరు వచ్చి పని మనిషి గా ఎందుకు చేరింది అని యక్షుడు మెదడు తడిమితే తెలుగు సినిమాలు, తెలుగు సీరియళ్ళూ తగ్గించండి. వీలయితే కంటాపరేషన్ చేసుకొని గంతలు కట్టుకోండి. డాక్టరు వేరు పనిమనిషి వేరు. మళ్ళీ వేరు, ఖాండము అని యక్షుడు గోటితో గోకితే పవర్ సప్లై ఆపేయండి) తీసిన తరువాత ఆ మిరపకాయ తో చేసిన కూర వెజిటేరియనా నాన్ వెజిటేరియనా మీ అభిప్రాయం చెప్పండి, దీన్ని చర్చించండి, టెంపులీకరించండి, మసీదీకరించండి, గురుద్వారీకరించండి అంటూ టపాలు తొందరపడి రాసేస్తే అది హిట్టవదు. ఎవరూ కామెంట్లివ్వరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ “రణం” సినిమా. ఈ సినిమాని ఏ పెద్ద స్టారో లేక వాడి గొట్టం బంధువో తీసుంటే సూపర్ డూపర్ హిట్టయుండేది. గోపి చంద్ కాబట్టి సక్సెస్ తో ఆగి పోయింది. ఫ్రంటు పుల్లింగూ బ్యాకు పుషింగూ లేకుండా వచ్చిన సినిమా హీరో స్క్రీన్ మీద ఎంత రక్తం చిందించినా హిట్టవదు కదా అలాగే ఇదీను. అలా “వెతో ములా” (వెనుక నుండి తోపుడు ముందు నుండి లాగుడు) లేని వాళ్ళకు బ్లాగు శిక్షణ అవసరం. మీ బ్లాగుల్లో “ఈ బ్లాగు విహారి శిక్షణాలయం సెర్టిఫైడు” అని పెట్టుకుంటే SAP సెర్టిఫికేషన్ వున్నట్టు.

“సందు చూసి” (టైమింగ్) టపాలు:

ఏదన్నా మంచి టపా వస్తే దాని లాంటిదే ఇంకో టపా రావడం. స్టూవర్టు పురం పోలీసు స్టేషన్ సినిమా పెద్ద క్రేజు తో రిలీజయింది అది హిట్టో పట్టో దేవుడికెరుకు. ఆ సమయంలో భానుచందర్ నటించిన స్టూవర్టు పురం దొంగలు అనే సినిమా ఒకటి వచ్చింది. వాళ్ళయితే డబ్బులు బాగానే దండుకున్నారు. ఇప్పుడు యమ దొంగ వచ్చిన సమయంలో యమ గోల మళ్ళీ మొదలైంది వచ్చింది. యమ దొంగ పబ్లిసిటీలో సగం ఉచితంగా వీళ్ళకొచ్చి మూడున్నర కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత కు డబ్బు పంట పండించింది. అదిప్పుడు కాస్తా 15 కోట్లకు చేరుకుందట. విషయం అర్థమైపోయింది కదా ఇలాంటి టపా రాసుంటే అది తప్పకుండా హిట్టవుతుంది.

కాఫీ లాంటి టపాలు:

టపా రాసిన ఇరవై నాలుగ్గంటల్లో 50 హిట్లు ఆ తరువాత రోజు 50 హిట్లు, ఆ తరువాత రోజు 50 హిట్లు వచ్చి పదికి పైగా కామెంట్లు వస్తే మీరు ఆహ్లాదకరంగా శేఖర్ కమ్ముల స్టైల్లో “ఆనంద్” టపా రాసినట్టు. వీటికి హాలు నిండినది బోర్డు వుండదు కానీ హార్టు నిండినది అని అనుకుంటూ వుంటారు. వీటికి రోజుకు 5 చొప్పున కామెంట్లు వుంటాయి లేదా ఇంకొకరు ఈ టపాను ఎక్కడో ఒక చోట తమ టపాల్లో పేర్కొంటారు.

టోఫూ లాంటి చల్లని టపాలు:

బ్లాగుల్లో ప్రత్యేకమైనవి వున్నాయి అవి కవితల బ్లాగులు, ఫోటోల బ్లాగులు, సేకరణల బ్లాగులు. ఏ కొంచెమో తప్ప పూర్తిగా కమర్షియల్ కాని సినిమాల టైపు. వీటి యజమానులు కె.విశ్వనాథ్, సింగీతం శ్రీనివాస రావ్, బాపు, శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళు. పూర్తిగా తమకోసమే రాస్తున్నట్టు వుంటాయి. బ్లాగుల మీద సదభిప్రాయం వున్న వాళ్ళందరూ హిట్లు గానే పరిగణించాలి. ఇందులో ప్రతి టపానూ హిట్టే. కామెంట్లకు సంబంధం లేదు. ఇలాంటి టపాలు రాసే వాళ్ళు శిక్షణా లయంలో గెస్టు లెక్చరర్ గా వస్తారు.

ఉచిత శిక్షణ : ఇప్పటికే బ్లాగులు మొదలు పెట్టి పేరు సంపాదించుకొన్న బ్లాగరులను ఈ శిక్షణా లయం లో ఉచితంగా చేర్చుకొంటారు. వాళ్ళ హిట్లూ ఫట్లూ గట్రా సాక్ష్యాలు తీసుకు రాగలిగితే చాలు. ఈ ప్రమోషన్ చూసి పదో తరగతీ.. ఇంటర్మీడియెట్టూ.. స్టేట్ ఫస్టూ .. ఎంసెట్ కోచింగూ.. కార్పొరేట్ కాలేజీ లో ఫ్రీ అడ్మిషన్ గుర్తుకు వస్తే మిమ్మల్ని చేర్చుకోరు.

అసందర్భ ప్రేలాపన :

మీ బుర్రలో యక్షుడి సందేహాలు – నా బుర్రలోని దక్షుడి సమాధానాలు:

ఇంతకూ ఈ టపా హిట్టా ఫట్టా అంటే ఓ వారం తరువాత వచ్చి చూడండి. ఓ పది కామెంట్లు వుంటే సక్సస్, ఇరవై వుంటే హిట్టు, ముప్పై వుంటే సూపర్ హిట్టు. నలభైకి పైన ఎన్ని వచ్చినా సూపర్ డూపర్ హిట్టే. ఈ బ్లాగు చరిత్రలో ఇరవై ఎప్పుడూ దాట లేదు కాబట్టి హిట్టూ, సూపర్, డూపర్ లాంటివి వుండవని ముందుగానే సెటిలైపోవచ్చు. వెంకటేషూ, రాజేంద్ర ప్రసాదూ సినిమాలలో పెట్టిన పెట్టుబడి గ్యారంటీ. అందులోనూ సక్సస్లే ఎక్కువున్నాయి కాబట్టి ఇది ఆ టైపు బ్లాగు. కాకపోతే వెంకటేష్ లాగా డబ్బింగులు వుండవు.

మరి ఇరవై కామెంట్లు కూడా లేకుండా శిక్షణా లయమా అని యక్షుడు మళ్ళీ నిద్దర లేస్తే అయ్యేయెస్ ట్రైనింగు ఇవ్వడానికి అయ్యేయెస్సు అయుండఖ్ఖర్లేదు అనే దర్జా సమాధానం ఎనర్జిటిక్కావుంది. అదే మన లౌజిక్కు :-)

రేపే విడుదల : ఇంకేం లేవు.ఈ వారానికి ఒదిలేస్తా.

21 comments:

రాధిక said...

చూస్తూ వుండంది ఈ టపా బంపర్ హిట్టే.నా బ్లాగు ఏ కోవలోకొస్తుందో తేల్చుకోవాలి.మీరు మాత్రం చిరంజీవి కోవలోకొస్తారు.

విహారి(KBL) said...

ఇంతకి శిక్షణాలయంలో జాయిన్ అవ్వాలంటే ఎలాగో రాయలేదు.

Srini said...

మీ టపాలు అన్ని కూడా సూపర్ హిట్టు టైపు, నేనైతే మీ బ్లాగుకి పెద్ద పంకా, కూలరు..

Winner said...

ఈ టపా సూపర్ డూపర్ హిట్టే. ఆనుమానం లేదు.

ప్రసాదం

చైతన్య కృష్ణ పాటూరు said...

విహరి గారు,

రచ్చ చేసారండి(మా వూర్లో ఈ పదాన్ని సూపర్ అనటానికి వాడతారులెండి). నేను ఈ రోజే బ్లాగు మొదలెట్టాను. మీ శిక్షణాలయంలో ఎలా చేరాలో చెబితే వెంటనే చేరిపోతాను. కామెంట్ రాసి మీ బ్లాగు కలెక్షన్లు పెరగటానికి ఉపయోగపడే నాలాటి వారికి ఫీజులో తగ్గింపు వుండాలి మరి.

వేణు said...

ఆన్ లైన్ శిక్షణ ఏమైనా ఇవ్వగలరా... :-)

మీ వేణు

netizen నెటిజన్ said...

ఇదా మీరు చేస్తున్న పని - ఇన్నాళ్ళు మీ టపాలు లేకపోతే ఏమ్‌దో అనుకుంటి.

మీ “విహారి బ్లాగు శిక్షణాలయం” మూడు టపాలు, ఆరు బ్లాగులుగా వర్ధిల్లాలని ఆశిస్తూ..

braahmii said...

టపా చాలా బాగుంది. గుడ్డి విసనకర్ర లా కాకుండా మనస్పూర్తిగా చెబుతున్నాను. పంకా కన్నా నాకు విసనకర్ర బాగా నచ్చుతుంది. మీరిలా టపాల ద్వారా మొత్తం విహారి శిక్షణాలయం రహస్యాలన్నీ బయట పెట్టేస్తే డబ్బులిచ్చి ఎవరు చేరతారు. తగ్గింపు ధరలను ఎవరు వాడుకుంటారు.చెప్పండి.

కొత్త పాళీ said...

One of your best. This time I actually managed to follow your logic and most of the references :-))

netizen నెటిజన్ said...

భయమ్ వెస్తోంది.
ఈ వాఖ్యాలు, వాళ్ళ అమ్‌చనాలు, వాటిని అందుకునే ప్రయత్నంలో - విలియమ్ సిడ్నీ పొర్టర్ వ్రాసిన "Confessions of a Humorist" పరిస్థితి వస్తుందేమోనని.

జ్యోతి said...

నేను విహారి బ్లాగు శిక్షణాలయానికి ప్రిన్సిపల్‌ని,క్యాషియర్‌ని. ఎందుకంటే. నాకు టపా రాయగానే ఒక్క రోజులో 300 తగ్గకుండా హిట్లు వస్తాయి. మొన్న పెళ్ళైనవారికి మాత్రమే టపాకి మాత్రం 654 వచ్చారు. నువ్వు ఎలాగూ నాకు ప్రచండ బ్లాగరి అనే బిరుదు ఇచ్చావుగా. సో నేనే భారతదేశానికి నీ శిక్షణాలయానికి ఇన్‌చార్జిని.నువ్వు ఎలాగూ బిజీగా ఉంటావుగా.నేను చూసుకుంటాగా అన్ని సంగతులు ముఖ్యంగా డబ్బులు. ఒకె.

mohanrazz said...

ఈ టపా ని హిట్ చేయడానికి నా contribution..ఒక కామెంట్ ..

Anonymous said...

@ రాదిక గారు,

మీ బ్లాగులు టోఫూ లాంటి చల్లని టపాలు.

నేను చిరంజీవి టైపు ఏంటండీ. నేను రాజ బాబు, రాజేంద్ర ప్రసాద్ టైపు. ఎప్పుడో ఓ సారి రాజ బాబు లాగ "మనిషి రోడ్డున పడ్డాడు", రాజేంద్ర ప్రసాద్ లాగా "ముద్ద మందారం" టైపు సినిమాల్లో నటిస్తుంటానంతే.

@ విహారి గారు,

శిక్షణాలయం లో చేరాలంటే ఎలానో తరువాత ఇంకో టపా రాస్తా.

@ శ్రీనివాస్ గారు,

నెనర్లండి.

@ ప్రసాదం గారు,

ఇది సక్ససే నండి. అనుభవం తో చెప్తున్నాగా :-)

@ చైతన్య గారు,

మీకు 5% అదనపు తగ్గింపు.

@ వేణు గారు,

మా అకడమిక్ టీం. ఈ విషయం మీద పని చేస్తోంది. అది తయారు అవగానే మీకు కబురు పెడతాను.

@ నెట్టిజెన్ గారు,

మరి అంతే కాలం ఆలోచిస్తే ఇలాంటి టపాలే వస్తాయి. మూ.ట. ఆ.బ్లా. కాదండి. ఆ.ట.మూ.బ్లా. :-)

@ బ్రహ్మి గారు,

ఇది డెమో కదా అలానే వుంటుంది.

@ కొత్తపాళి గారు,

నేనెక్కడా రెఫెరెన్సులు ఇవ్వలేదు కానీ.ఒక్క్ లైనులో మాత్రం గత అనుభవం రాశా. మిగంతా అంతా ఉబుసుపోక.

@ నెట్టిజెన్ గారు,

ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. నేను దాన్నో పట్టు పడతా.

ఒక్కోసారి ఆటలో అరటి పళ్ళు దొరుకుతాయి. వాటిని గుటుక్కుమని మింగెయ్యాలి. తొక్క మాత్రం తొక్కకుండా దూరంగా పడెయ్యాలి.

@ జ్యోతక్కో,

నీకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాత్రమిస్తా. ఎంత ప్రచండ బ్లాగరి అయితే మాత్రం నా ఖజానాకు గండి కొడదామనే.

@ మోహన్ రాజ్ గారు,

మీ వ్యాఖ్యకు ధన్యుణ్ణి.

-- బ్లాగు నిర్వచనం నేర్చుకుంటూ హిట్ల కోసం మాత్రమే టపాలు రాసే విహారి :-)

Naveen Garla said...

నేను రాసే పోస్టుకు...మహా అంటే..ఓ డెబ్బయ్ మంది వంద మంది వస్తారు. ఒక్క రోజు మాత్రం రెండు వేల మంది పైన వచ్చరు.

Naveen Garla said...

గత వారం మాత్రం యువరాజ్ లాగా వరుస సిక్సర్లు కొట్టావు విహారి :)

Kamaraju Kusumanchi said...

అసలు కామెంట్ రాస్తే నాకేంటి? అహ నాకేంటీ అంట? :-)

మీరు రాసిన అన్ని టపాలూ హిట్టేనండీ! సందేహంబు వలదు!

సత్యసాయి కొవ్వలి Satyasai said...

మంచి విశ్లేషణాత్మకంగా ఉంది. ఈ నావ్యాఖ్య 100 వ్యాఖ్యల తో సమానం- అంటేమీ టపా సూపర్ డూపర్ హిట్.

Anonymous said...

ఆస్ట్రేలియాని వరల్డ్ కప్పు నుంది విహారిని బ్లాగ్గుంపుల నుండీ పక్కన పెట్టకపొతే వీళ్ళని దాటిముందుకెళ్ళటం మరొకళ్ళకి సాధ్యం కాదు.

నేను చెప్పగలిగింది ఇంతేనబ్బాయ్.....

ఏకాంతపు దిలీప్ said...

@విహారి గారు
మీరు పుట్టగానే ఏడ్చి ఉండరు... :) నవ్వి ఉంటారు...

subose santh said...

hi
i read ur TAPA.it is very good and with my comment, it is HIT.

వర్మ said...

విహారి గారు ఎంత బ్లాగుల్లో ఎంత పరిణతి సాధిస్తే ఇంత బాగా వ్రాయగలుగుతారండి. really its excellent ....