Friday, March 28, 2008

అమెరికాలో సైకిలునేమంటారంటే .......



:::::::::

నాగరాజు గారి సైకిలోపాఖ్యానం చదివిన తరువాత ఇది రాయక తప్పింది కాదు.మా సిలికానాంధ్ర మనబడి గడుగ్గాయి రాసిన సమాధానం గుర్తుకు వచ్చింది. అమెరికాలో పిల్లలకు తెలుగు నేర్పడానికి సిలికానాంధ్ర వారు పలు రాష్ట్రాల్లో మనబడి అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు తెలుగు నేర్పుతున్నారు.ఇప్పటికి అందులో రెండు త్రైమాసికాలు పూర్తయ్యాయి.ఇంకో త్రైమాసికం పూర్తయితే "ప్రవేశము" తరగతి పూర్తవుతుంది.ప్రతి త్రైమాసికానికి ఒక ఆఖరి పరీక్ష వుంటుంది.ఇప్పటికి ఓ యాభై గంటల తరగతులు నడుచుంటాయి.దానికే పిల్లగాళ్ళందరూ తెలుగు ఇరగ దీసేస్తున్నారు. ఘనత ఏదన్న వుందంటే అది సిలికానాంధ్ర వారి మనబడి కార్యవర్గానికే చెందుతుంది.




రెండవ త్రైమాసిక పరీక్షల్లో భాగంగా ఖాళీలను పూరింపుము అనే వర్గములో పైన సైకిలు బొమ్మ చూపించి కింద __కిలు అని ఇవ్వబడింది. ఓ బుడ్డోడు (మా బుడ్డోడు కాదు )ఆ బొమ్మను చూడగానే వాడి బైక్ గుర్తొచ్చిందేమో బైకిలు అని రాసి పడేశాడు. అంటే అమెరిక బైక్ ని తెలుగైజ్ చేసేశాడన్నమాట.




బైక్: అమెరికా దేశంలో మన సైకిలును బైక్ అందురు.



:::::::::

Tuesday, March 25, 2008

ఈ వారం సిద్ధ బుద్ధ (బ్లాగు బొట్లు)



:::::::::


"ఆయ్యగారూ సీజన్ కాక పోయినా మన తోటలో మల్లె చెట్టు విరగ పూసింది"
"మల్లె పూవు మల్లె పూవు అంటారు అది నల్లబడితే ఎవరు దాన్ని చూస్తారు?..."

"మీరు చాలా రోజులుగా ఈ మల్లెలు పూయడం కోసం చూస్తున్నారు కదా?"
"ఎన్నాళ్ళో.... వేచిన ఉదయం ఈనాడే... ఎదురవుతుంటే...ఇన్ని నాళ్ళు దాగిన హృదయం.."

"ఆ చీకటిలో ఎందుకు కూచుంటారు ఇలా బయటికొచ్చి కూచోండి .."
"చీకటిలో కారు చీకటిలో కాలమనె కడలిలో శోకమనె పడవ లో ఏదరికో .... ఏ దిశకో ...."

"మీ మనసు కేదో అయింది కాస్త చల్ల గాలి కోసం బయటికెళ్ళొద్దాం రండి"
"పిల్ల గాలి ఊదింది పిల్లంగ్రోవీ.... పల్లవించింది ఊగింది గున్న మావీ... మా పల్లె మారింది రేపల్లెగా మనసేమో పొంగింది పాల వెల్లిలా ..."

"ఆ పాటలు చాలు గానీ ఇలా రండి.."
"ఇదే పాటా... ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను..పలకలేను వలపులన్నీ పాటలో దాచుకుంటాను.."

"పాడుదురు గానీ .. రండి అలా కారులో ఊరు చుట్టి వద్దాము"
"కారున్న మైనరు... కాలం మారింది మైనరు.. మా చేతికి వచ్చాయి తాళాలు..."

"ఏడుకొండల వాడా ఏంటయ్యా మా అయ్యగారిని ఇలా చేశావు "
"ఏడు కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పని చేశావు తిరుమలేశా... చెట్టు మీది కాయలు సముద్రమ్లో ఉప్పులు.."

"మీరలా పరాగ్గా వుంటే బావుండదు "
"బహు పరాక్ .. రాజూ వెడలె రభసకు టడ్డడాయ్..టడ్డడాయ్. రాజు వెడలె రవి తేజము లలరగ కుడి ఎడమల డాల్ కత్తులు మెరయంగా… రాబందుల గుండెలు దడ దడ లాడగ ..."

"మీరేదో లోకంలో వున్నట్టున్నారు"
"అదిగో నవలోకం వెలసే పిలిచే......"

"ఏంటి నాటకాలు గానే వేస్తున్నారా?"
"కనపడని చెయ్యేదో... నడుపుతోంది నాటకం. ఆ నాటాకాన నువ్వు నేనూ ఆట బొమ్మలం.... కీలు బొమ్మలం...."

"ఏంటి జీవితం మీద విరక్తి కల్పిస్తున్నారు నాకు"
"ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరూ సొంతమూ..ఎంతవరకీ బంధమూ..."

"ఇప్పుడర్థమయింది.మీ మనసుకో మంచి మాట శోభన్ బాబు గురించి చెప్పనా?"
"శోభన్ బాబు గురించయితే ఎంతయినా చెప్పు."

"స్వర్గం లో ఇంద్రుడు చాలా కంగారుగా వున్నాడట"
"శోభన్‌ బాబు గురించి చెప్పమంటే ఇంద్రుడు గురించి చెబ్తావే పరాచకాలాడకు "

"శోభన్ బాబు వల్లే ఇంద్రుడు కంగారు పడుతున్నాడు."
"అయ్యో ఏందుకు?"

"ఇంద్రుడి దగ్గరున్న రంభ , ఊర్వశి, మేనక, తిలోత్తమ తదితర అందాల రాశులందరూ ఇంద్రుడిని వదిలేసి వెళ్ళి పోతున్నారట"
"దానికి శోభన్ బాబు కు సంబంధమేంటి?"

"అందాల నటుడు డ్రీం బాయ్ వస్తున్నాడని ఆయన్ని చూడ్డానికి వెళ్ళిపోయారట ఇంద్రుణ్ణి ఎవరూ పట్టించుకోవడం లేదట"
"హహ్హ హహ్హ హ్హా..హహ్హ..మరి మా సోగ్గాడు 'చరణ కింకిణులు గల్లు గల్లు మన...' అని పాడితే ఆ ఉడుగ్గాడు (ప్రతి దానికి ఉడుక్కుంటాడు ఉద్యోగం పోతుందేమో అని) కుళ్ళు కోడా. ఇక స్వర్గం లో వున్న వాళ్ళు డ్రీం బాయ్ ఎవరంటే చూపడానికి వేలు భూమి మీదకి పెట్టి చూపనక్కర లేదు. ఇదిగో మన పక్కనే వున్నాడు అంటారు."

:::::::::



సినీ మాయా జగత్తులో గ్లామర్, ఇమేజ్ అనే భయంకరమైన వ్యసనాల రుచి చూసినా కాలి గోటితే నెట్టేసి, తాను వద్దనుకున్న తరువాత తన సమీపం లోకి కూడా రానీయకుండా అదుపులో పెట్టగలిగిన విలక్షణమైన వ్యక్తి మరింక పుట్ట బోడంటే అతిశయోక్తి కాదు. నటులు వస్తారు పోతారు. ఇమేజ్ కోసం స్వంత వ్యక్తులను గాలికి వదిలేస్తారు. అసలు రంగు వేసుకున్నవాళ్ళు నిజ జీవితం లో నటించని వాళ్ళుంటారని కుటుంబం విలువేంటో ఈ తరం వాళ్ళకు చాటి చెప్పిన శోభన్‌ బాబు గారు స్వర్గస్తులయ్యారంటే నమ్మ బుద్ది కావటం లేదు. అంతటి వ్యక్తి గురించి ఎంత ఆపుకుందామన్న ఆగని ఆశ్రువులు. అందుకే ఆయనకు అంజలి ఘటిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఆశ్రువులలో కొన్ని ఇలా బ్లాగు బొట్ల రూపంలో ....



:::::::::



Thursday, March 20, 2008

బ్లాగు వీర లేవరా డిగ్గడాని కెళ్ళరా

హెడ్డింగ్ చూడగానే పెద్ద ఫుడ్డు లేదని అర్థమయిపోతుంది. తెలుగు బ్లాగుల్లో ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్న డిగ్గింగ్ జల్లెడ లో వచ్చేసింది. ప్రస్తుతానికి గుడ్డు దశలో వుందని చెబుతున్న “ఆ నలుగురు నిర్వాహకులు” తొందరలోనే దాన్ని ఇమగో దశకు తీసుకెళ్ళి మరిన్ని రంగులతో శోభాయమానం చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పటికే నేను చెప్పాల్సిందంతా చావా, రావ్, జ్యోతక్క గార్లు చెప్పేశారు కాబట్టి నేను చెప్పే దేమీ లేదు. మైకు పట్టిన రాజకీయ నాయకుడికి మైకు ఒదల బుద్ది కానట్టు టపా మొదలు పెడితే ఠావు పుట అయినా రాయాలి అని మా బ్లాగ్మండల సామి హిట్ల దీక్ష లో వున్నప్పుడు ఉపదేశించారు.



డిగ్గడానికెందుకురా తొందర అని కళ్ళు కూడల్లో, కాళ్ళు కుర్చీలో పెట్టి కూర్చోకుండా జల్లెడ వోటు సైటు టికెట్ కొనుక్కుని మూషికయానం చేసి ల్యాండ్ అయ్యా. కొద్ది సేపు కూడా ఆలస్యం చెయ్యకుండా అక్కడున్న నక్షత్రాలను నొక్కడం మొదలు పెట్టాను. అక్కడ అంటే ఏ టపాకి అని అశ్చర్యంగా అడగరని నాకు తెలుసు. జన్మ వృత్తాంతం అంతా తెలిసిన వాళ్ళు కదా. నొక్కిన నక్షత్రం అయిదు కాదని అనుకునే వాళ్ళెవరూ లేరనే నా ఆత్మ విశ్వాసం. నొక్కింది నా సైటు లంకెల్నే అనే విషయం తెలిసిపోయుంటుంది. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని మార్చేంత మొనగాడిని కాదు.ఆ గౌరవానికి సూచకంగా అంటే గుళ్ళో ప్రసాదం నచ్చితే నెత్తిన టవలేసుకొని మళ్ళీ లైన్లో నిలబడినట్లు మరో సారి నొక్కా. ఇది రిగ్గింగు కింద కొస్తుంది అది చట్ట బద్దం కాదు, నేరార్హం, శిక్షార్హం, కుయ్యోయ్ ర్హం , మొయ్యోర్హం అని అనిపిస్తే మీరు ముప్పై ఏళ్ళు గాఢ మైన సుషిప్తావస్తలోకి వెళ్ళి ఇప్పుడే నిద్ర మేల్కొని పాచి పళ్ళతో బ్లాగులు చూస్తున్నట్టు లెక్క. రిగ్గింగు అన్నది ఎవరు బడితే వాళ్ళకు దక్కే అవకాశం కాదు. ఏ పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టమో.



మొదటి సారి నొక్కినప్పుడు "నొక్కినందుకు నెనర్లు" అని ఎయిర్ ఇండియా మహారాజులా వందనం అంది. రెండో సారి మాత్రం "ఇప్పటికే ఓటు వేసినారు" అని చెప్పింది. మళ్ళీ మళ్ళీ నొక్కా. ప్రతి సారి "ఇప్పటికే ఓటు వేసినారు" అని చెబుతుంటే నాకు మాత్రం "వై.ఎస్.ను నేనే ముఖ్యమంత్రిని చేశా, ఇందిరా గాంధీని నేనే ప్రధాన మంత్రిని చేశా.. వై.ఎస్.ను నేనే ముఖ్యమంత్రిని చేశా, ఇందిరా గాంధీని నేనే ప్రధాన మంత్రిని చేశా… వై.ఎస్.ను నేనే ముఖ్యమంత్రిని చేశా, ఇందిరా గాంధీని నేనే ప్రధాన మంత్రిని చేశా" అని ఎవరో అన్నట్లు వినబడింది. అప్పుడే విపరీతమైన రోషం పుట్టుకు వచ్చింది. ప్రపంచం లో వున్న సాఫ్టువేర్ ఇంజినీర్లందరిలోకి తెలుగు వాడే గొప్ప అని ప్రూవ్ చేసుకునే సమయం ఆసన్నమైందని ఐ.పి. అడ్రెస్ మార్చి మళ్ళీ నొక్కా. ప్చ్… మళ్ళీ మార్చా. నొక్కా. మళ్ళీ ఉప్చే. అలా చాలా ప్చ్ లు అయ్యాక ఈ సైటు డెవలప్ చేసినోడూ తెలుగోడే, సాటి తెలుగు వాడికి గౌరవం ఇవ్వాలనే తలపుతో చివరి సారిగా గట్టిగా ప్చ్ అని నొక్కడం ఆపేసి ఈ టపా రాశా.



నీతి: కొన్ని సైట్లను రిగ్గ వచ్చు కానీ జల్లెడను ప్రస్తుతానికి రిగ్గలేము డిగ్గడం మాత్రం చేయవచ్చు .

ఉపసంహారం: ఏమీ లేదు.

Wednesday, March 19, 2008

ఈ వారం సిద్ధ -- బుద్ధ (శంషాబాద్, బ్లాగర్ స్పెషల్స్)



:::::::::



"రేయ్ సిధ్ధా! ఏమిటీమధ్య కనిపించినోళ్ళందరికీ వంగి వంగి దండాలు పెడుతున్నావ్?"
"మీతో మా చెడ్డ చిక్కొచ్చిపడిందండీ. ప్రతి దానికి ఏదో వంక పెడతారు. ఇకాపండి అయ్యా మీరేమనబోతున్నారో నాకు తెలుసు. నేనేమన్నా వై.ఎస్సా ఆ వచ్చినోళ్ళందరూ డి.కె.ఆదికేశవులు నాయుడు లాంటి వారా అని క్లాసు పీక్కండి."

"అదే చెప్పబోతున్నా డి.కె.కొడుక్కి చిరంజీవి పెట్టబోయే పార్టీ టికెట్టు ఇచ్చి పుంగనూరు నుండి పోటీ చేయించే సూచనలున్నాయని వై.ఎస్. అందరిని కలుపుకు పోతున్నాడు. నువ్వు కూడా అలా అందర్ని కలుపుకుంటున్నావేమో అని అడిగా."
"మిమ్మల్ని నేను కొన్నాళు వదిలి వెళ్ళిపోతే మేలేమో"

"నువ్వు ప్రతిపక్షం లా తయారయ్యావు కదరా"
"అదే.... ఆ సెటైరే వద్దనేది.... నేను పిచ్చోడి లాగా వున్నానా? "

"సరేలే వదిలెయ్. అలా కాసేపు ఊరు తిరిగొద్దాం రా"
"తిరిగేంత సీను లేదు. వామ పక్షమూ, రామ పక్షమూ బందులూ ధర్నాలూ అంటున్నాయి"

"సుందరయ్య గారి స్పెషల్ అన్నమాట.రామ పక్షమేంది?"
"మన దైవం శ్రీరాముడి 'జై శ్రీరామ్‌' పార్టీ. అయ్యగారూ!... ఈ దేవాదుల ప్రాజేక్టేంటి?"

"అదే ఎత్తిపోతల ప్రాజెక్టు. నీళ్ళను తక్కువ ఎత్తునుండి ఎక్కువ ఎత్తుగల ప్రదేశాలకు పంప్ చేస్తారు"
"ఏత్తి పోతలంటే ఈ సంచిలో వున్న డబ్బును ఆ సంచిలోకి వాళ్లే ఎత్తిపోసుకోవడం కాదా?"

"అదే సరయిన అర్థం.మామూలు ప్రాజెక్టుల్లో వీళ్ళే వాళ్ళకు డబ్బులిస్తారు. ఇలాంటి వాటిల్లో వాళ్ళే ఎంత కావాలంటే అంత చేత్తో ఎత్తి తీసుకోవచ్చు. బఫే డిన్నర్ లా"
"ఈ ప్రాజెక్టు చాలా నాణ్యంగా రూపుదిద్దికుంటుందంట"

"అవును. ఆ చెప్పిన ఇంజినీరుకు కొన్ని ఎక్కువ నాణేలు... బంగారువి గిట్టు బాటయ్యాయట "
"శంషా బాద్ ఏర్పోర్ట్ కూడా భారత దేశానికి కోహినూర్ వజ్రమంత పేరు తెస్తుందట కదా"

"వజ్రమంత పేరేమో గానీ రాజీవ్ పేరు పెట్టి మేడం దగ్గర చాలా మార్కులు వేసుకుంటున్నారు. కొన్నాళ్ళ తరువాత గూగుల్లో రాజీవ్ అని కొడితే రాజీవ్ విమానాశ్రయం, రాజీవ్ నౌకాశ్రయం, రాజీవ్ రైల్వే స్టేషన్‌, రాజీవ్ బస్ స్టేషన్‌, రాజీవ్ ధర్మల్ స్టేషన్‌, రాజీవ్ పోలీస్ స్టేషన్‌, రాజీవ్ ఆయిల్ స్టేషన్‌, రాజీవ్ టీ స్టేషన్‌, రాజీవ్ జూ స్టేషన్‌ అని వస్తాయి. అప్పుడు పరీక్షల్లో ఏ ప్రశ్నకయినా రాజీవ్ అని రాసేస్తే బోలెడు మార్కులే మార్కులు."
"శంషాద్ విమానాశ్రయానికి ఏ గోడవ లేకుండా వుండాలంటే నా దగ్గరో అవుడియా వుంది"

"అబ్బా అవుడియానా అదేదో చెప్పు ఆ రెండు పత్రికలలో వచ్చేట్టు చూస్తా"
"విమానాశ్రయానికి రైట్ బ్రదర్స్ అని పేరు పెడితే సరి"

"ఎంత చక్కగా చెప్పావురా ఇంటి పైకప్పు చార్మినార్ ఆస్బెస్టాస్ సిమెంటు రేకులతో వేయిస్తే సరి అన్నట్టు. కొత్త పత్రిక సాక్షి కి పంపించు "
"అయ్యగారూ, సాక్షి సినిమాలో నటించినందుకు రంగారావుకి సాక్షి రంగారావు అనే పేరు స్థిరపడింది కదా. అలాగే సాక్షి పత్రికను పెడుతున్న జగన్‌ కు సాక్షి జగన్‌ అని పేరొస్తుందా "

"ఏమో రావచ్చేమో?"
"మీ బుర్రకు పవరు తగ్గినట్టుంది. పత్రిక పెడుతోంది ఆ రెండు పత్రికల మీద కక్ష తో కదా అందువల్ల కక్షి జగన్‌ అని పేరు రావచ్చు"

"పేర్లు పెట్టడం లో స్పెషల్ అయ్యావన్నమాట సరే ఇప్పుడు నేను కొన్ని స్పెషల్ ప్రశ్నలేస్తా నువ్వు సమాధానం చెప్పు"
"అడుక్కోండి .. అంటే అడగండి"

"లేఖలు రాయడం లో స్పెషల్ ఎవరు?"
"దత్తన్న"

"దీక్షలు చెయ్యడం, విరమించడం లో స్పెషల్?"
"మంద కృష్ణ మాదిగ"

"నోర్ముయ్ అనడంలో స్పెషల్?"
"వై.ఎస్."

"ఏది కనిపించక పోయినా అందుకు ఆంధ్రోల్లే కారణం అనడం లో స్పెషల్?"
"కె.సి.ఆర్."

"నన్నంటే కాలుస్తా అనడం లో స్పెషల్?"
"గోనె ప్రకాశ్ రావ్."

"కామెంట్లలో బ్రేవో అనడం లో స్పెషల్?"
"కొత్తపాళి"

"కామెంట్లలో ఆయ్ అనడం లో స్పెషల్?"
"ప్రవీణ్ గార్లపాటి"

"అదుర్స్, సూపరో సూపరు అనడం లో స్పెషల్?"
"రాధిక"

"హాస్య టపా చూడగానే డమాల్ మని పడిపోయే వాళ్ళలో స్పెషల్?"
"రానారె"

"నువ్వు కామెంటుకోబ్బా, నేను కామెంటు రాయనబ్బ అనే వాళ్ళలో స్పెషల్?"
"తోట రాముడు"

"బోయింగ్ విమానమంత జాబు రాస్తే హెలికాప్టరంత రిప్లయ్"
"వీవెన్"

"కళల మీద అభిమానంతో దానికోసం శ్రమించే వాళ్లను ఏమంటారు"
"కళాకారులు"

"కళల మీద అభిమానంతో వున్న డబ్బును తగలేసి పోషించేవాళ్ళను ఏమంటారు"
"గులాకారులు"

విన్నపమైన గమనిక(మొట్టికాయలకి హెల్మెట్) : బ్లాగర్ల గురించి రాసినది పూర్తిగా నిజం కాదు(అంటే కొంత నిజముందా అని డీకేస్టీ పదవుచ్చుకోని చెవిలో దుర్భిణి పెట్టుకొని బయలు దేరకండి). కొంత(చాలా అంటే బావుండదని) నాటకీయత జోడించి రాసింది. నొచ్చుకుంటే ‘సచ్చినోడని'(దరిద్రపు వెధవా అనమంటే బాగుండదు కదా) గిచ్చినట్లు చెప్పండి.


:::::::::


Tuesday, March 11, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ( రాజీనామాలు, కిలారి పాల్)

...


"అయ్యగారూ నా బ్యాటూ బాలూ కనిపించడం లేదు. మీరేమన్నా చూశారా?"

"చూశారా కాదు దాచేశారా అని అడుగు బావుంటుంది. మనోళ్ళు ఆస్ట్రేలియా మీద గెలిచినందుకు పది కోట్లిచ్చారు గదా. అది చూసి మళ్ళీ నువ్వు గోచీ ఎగ్గడతావని వాటిని దాచేశా."

"మీకు నేను పైకి రావడం ఇష్టం లేదు లాగుంది. ఇలాగయితే నేను రాజీనామా చేసేస్తా. "

"నీ టర్మేమీ అయిపోలేదు నువ్వు రాజీనామా చెయ్యడానికి. ఇంకా ఓ ముప్పై ఏళ్ళు ఉద్యోగం చెయ్యొచ్చు. నీ పదవికొచ్చిన నష్టమేమీ లేదు గానీ పొలం లో పనిచెయ్యడానికి కూలీలను పిలిచావా లేదా?"

"మన చేనులో పని చెయ్యడానికి కూలీలు ఎవ్వరూ రావటం లేదండి"

"ఎందుకురా? మనమేమీ తక్కువ కూలీ ఇవ్వడం లేదు కదా. రోజుకు 100 రూపాయలు ఇస్తున్నాం కదా. రావడానికేం? కొంపదీసి నువ్వు ఇన్‌స్పైర్ అయిపోయి కమీషన్ నొక్కెయ్యడం లేదు గదా?"

"నేనేదో సూరీడు అయినట్టు మీరు వై.ఎస్. అయినట్టు ఫీలింగొకటి. నాకంత అదృష్టమా చెప్పండి. అందరూ తెలివి మీరి పోయారు."

"తెలివి మీరడమెంటి ఏమీ పని చెయ్యకుండా డబ్బులొచ్చేస్తున్నాయా ఏంది?"

"ఇందిరమ్మ ఉపాధి హామీ పథకం కింద 100 రూపాయలు ఇచ్చేస్తున్నారు గదా "

"మనమిస్తోంది అంతే కదా"

"అక్కడే మీరు కేరెట్ తిన్నారు. మన దగ్గరికొస్తే రోజంతా కష్టపడాలి. అక్కడికెళితే పని చేసినా చెయ్యక పోయినా రికార్డుల్లో పేరు రాసుకుంటే చాలు నూరు రూపాయలొస్తుంది."

"ఏంటి అంత సులభంగానా? అందరికీ ఇస్తున్నారా?"

"అక్కడే కొంచెం తేడా వుంది. కాంగ్రేసు సానుభూతి పరులకు బేషుగ్గా ఇస్తున్నారు. ఇంకొంత మంది అలా నటిస్తూ అటు వైపే వెళ్ళి పోతున్నారు."

"ఇలాగయితే కొద్దో గొప్పో భూములున్న రైతులెలా బతుకు తారు?"

"అయిదెకరాల కన్నా ఎక్కువున్న రైతులకు ఋణాల మాఫీ లేదు కదా. వాళ్ళు వున్నదమ్ముకోని జై కాంగ్రేస్ అని అందులో చేరి పోతారు."

"ఏ రకంగా చూసినా కాంగ్రేస్ కే అనుకూలమన్న మాట. ఇలాంటివి బయటకు రావటం లేదా?"

"వస్తున్నాయి. ఇలాంటి వార్తలు వచ్చినందుకే రాసిన విలేఖరులు జె.సి.దివాకర్ రెడ్డి మీటింగుల నుండి గాల్లో లేచి బయటికి వచ్చారు. కొన్నాళ్ళాగితే ఇంకొంచెం పైకి పోతారు. అందుకే పై లోకాల నుండి మాలాంటి వారిని ఆదుకోడానికి ఒక మనిషి వచ్చాడు."

"ఏదో కొత్త విషయం లాగుందే. "

"మీకు కొత్తగానే వుంటుంది. మాలాంటోళ్ళకు అది పాతదే. మా లాంటి దీనులను, అభాగ్యులను ఆదుకొనే దీన జన బాంధవుడు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు"

"ఇది పాత విషయమే నువ్వు మాట్లాడేది వై.ఎస్.గురించే. ఆ ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ చూపించే ప్రకటనలు చూస్తే అందరు ముఖ్యమంత్రులు ఇలాగే అనిపిస్తారు."

"చా! వై.ఎస్. గురించి ఎవరు చెప్పారు మీరే అలాంటివి చూసి పడి పోతారు. నేను మాట్లాడేది ఆయన గురించి కాదు"

"ఇక మిగిలిందెవరు చిరంజీవే"

"నన్ను క్రికెట్ పిచ్చంటారు గానీ మీకే ఆ రాజకీయాల పిచ్చి ఎక్కువ అందుకే చిరంజీవి అంటున్నారు.మీరిప్పుడు కేరెట్ కేక్ తిన్నారు."

"వైఎస్సూ, చిరంజీవి కాకుండా ఇంకెవరబ్బా..ఆ గుర్తొచ్చింది. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్"

"ఈ సారి కేరెట్ హల్వా తిన్నారు. నేను మాట్లాడేది మా దీన సందు పార్టీ నేత కె.ఏ.పాల్ గురించి"

"ఓహో ఆయనా? ఎన్నారై పార్టీ అన్నమాట. ఏదో సందు చూసుకుని పార్టీ పెట్టినట్టు అది దీన సందు అంటావే. అది దీన బంధు అనుకుంటా"

"ఏదో ఒక గొంది.అందుకే అందులో కెళ్ళి ఇరుక్కుందామనుకుంటున్నా."

"ఏందుకో?"

"చేరితే నన్ను ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు."

"చిరంజీవిని చేస్తానన్నట్టున్నాడు"

"అయితే ఉప ముఖ్యమంత్రి నవుతా."

"దాసరి తీసిన ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా చూశావా?"

"లేదు. ఏం అందులో నాలాంటోడు ముఖ్యమంత్రి కానీ అవుతాడా ఏంది?"

"అలాంటిదే. ఒక బడుగు వాడైన దాసరి, ముఖ్యమంత్రి అవడానికి ఎగస్పార్టీ ఎమ్మెల్యేలందరికి ఉప ముఖ్యమంత్రి పదవిస్తానని ఆశ పెడతాడు. దానితో సిగ్గు లేని వెధవలందరూ వాళ్ళ పార్టీ జెండా ఎత్తేసి ఈ పార్టీలోకి వచ్చేస్తారు."

"అంటే అవతలి పార్టీ నాయకుడికి కూడా?"

"వాడికి మాత్రం ప్రత్యేకమైన పదవి ఇస్తాడు."

"అదేదో చెప్పండి నేను ఆ పదవి ఇమ్మని అడుగుతా."

"అది ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి "

"నన్ను బాగా ఇరికిస్తారే? ఇలానే అంటూ వుండండి ఏదో ఓ రోజు మా చిరంజీవి పార్టీ పెట్టి పాద యాత్రో, చేతి యాత్రో అంటాడు అప్పుడు నేను జంపు జోగయ్య అవుతా."

"చేతి యాత్రలు కూడా వున్నాయా?"

"నడిచి వెళ్ళి ప్రజలని చూస్తే అవి పాద యాత్రలు. హెలికాప్టర్లో వెళుతూ గాల్లో నుండి చెయ్యి ఊపితే అవి చేతి యాత్రలు."

"ఇంకా నయం కూడలి చాట్ రూము లో కొచ్చి ప్రచారం చేసుకుంటే ఛాట్ యాత్ర, బ్లాగు సమావేశాల్లోకొచ్చి చెబితే బ్లాగు యాత్ర అని చెప్పలేదు"


***




"ఇప్పుడు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏంచేస్తారు."

"వచ్చే ఏలక్షన్స్ లో పోటీ చేస్తారు. ఓ నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ రాజీనామా చేస్తారు.జాబ్ సెక్యూరిటీ."


**



"వై.ఎస్. తను కడపను మాత్రమే అభివృద్ధి చేస్తున్నాడనే ఘోరాతి ఘోరమైన నిందను పోగొట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ అంతా అభివృద్ధి చెయ్యాలంటే ఏమి చెయ్యాలి?"

"ప్రధాన మంత్రిని చెయ్యాలి."


:::::::


Tuesday, March 04, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (అంబర బడ్జెట్, తుపాకీ రాముడు)




"అయ్యగారూ మన తోటలో హర్భజన్ సింగులెక్కువయి పోయారు"

"ఆ ఉపమానాలేంటి నువ్వేమన్నా హేడెన్ అనుకుంటున్నావా? హేడెన్ కేదో కొవ్వెక్కి హర్భజన్ ను కలుపు మొక్కంటే నువ్వు కలుపు మొక్కల్ని హర్భజన్ అంటావా? ఆ మొక్కలు పీకేసి ఆవులకు ఆహారంగా వెయ్యి మంచి పాలిస్తాయి. ఈ మధ్య ఏ పెద్ద హీరో సినిమా రిలీజు కాక పాలాభిషేకాలు ఆగిపోయాయి. ఏదో ఉండవల్లి పుణ్యమా అని ఆవు పాలకు మంచి డిమాండ్ వుంది ఈ సీజన్లో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్ రైళ్ళలో పెప్సీకి బదులు మజ్జిగ అమ్మిపెడతా అని తరువాత ఆ ఊసే ఎత్తలా."

"పెప్సీ ఆపించకపోయినా పెళ్ళి కాని ఆడపిల్లలకు రైల్లో ఫ్రీ టికెట్ ఇప్పిస్తున్నాడు కదా."

"దాని కిందే నీకు కొన్ని జిమ్మికులు కనిపించడం లేదు. మామూలు రైళ్ళని ఎక్స్ ప్రెస్ రైళ్ళు అని చెప్పి ఎక్స్ట్రా డబ్బు వసూలు చేస్తున్నాడు గదా.నువ్వు సిగరెట్లు తాగుతావా"

"లేదు"

"అయితే నీకొచ్చిన నష్టమేమీ లేదు."

"నాలాంటోళ్ళకు డబ్బేమన్న తిరిగొస్తుందా?"

"నువ్వేమన్నా అమెరికాలో పుట్టావా? అమెరికాలో $150K వరకు సంపాదించేవాళ్ళకు బుష్షు $1200.00 చెక్కిస్తున్నాడు. మన చిదంబరమేమో RS150K వరకు టాక్సు మినహాయింపు ఇచ్చాడు. "

"మనమేం ఆర్థిక మాంద్యం లో లేం.అయినా మన అభివృద్ధి శాతం 9.5 కదా "

"అది అప్పుడు. ఇప్పుడు 8.7 శాతం "

"వ్యయసాయం లో 3.5 వృద్ధి వుంది కదా?"

"ఇప్పుడు 2.6 మాత్రమే అందుకే కాబోలు రైతుల కోసం 60,000 కొట్ల రూపాయల మాఫీ చేశారు."

"అది కూడా మా తుపాకీ రాముడు జైపూర్ లో రైతు గర్జన చెయ్యబట్టి"

"రైతు గర్జన జైపూర్లోనా విజయవాడలోనా?"

"జైపూర్లోనే?"

"మీ తుపాకీ రాముడెవడ్రోయ్? ఇదేదో కొత్త పేరు లాగుందే "

"అది పొన్నాల లక్ష్మయ్య పెట్టిన పేరు."

"ఎందుకు?"

"రైతులను కాల్చుకు తిన్నాడని పెట్టిన పేరు. "

"ఎవరికి?"

"చంద్ర బాబు కు"

::::::::

"మనకు బడ్జెట్ లో తుపాకులు ఫ్రీ గా గానీ సప్ప్లై చేసేస్తున్నారా?"

"అలాంటిది నేనెక్కడా చదవ లేదే. అప్పుడో సారి పవన్ కళ్యాన్ చేతిలో, ఇంకోసారి ప్రశాంత్ రెడ్డి చనిపోయినప్పుడు తుపాకుల గురించి విన్నాను తప్ప ఇంకెక్కడా చూడ లేదు."

"గోనె ప్రకాశ రావ్ తనకేదన్న జరిగితే వెళ్ళి మధు యాష్కీ బుర్రకాయ్ ని డాం ...డాం అని పేల్చేస్తానన్నాడు కదా."

"ఎవరు ఎవరి బుర్రకాయలు పేల్చినా ఏం జరగదు. కాల్చిన తరువాత సరదాగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి బిర్యాని తినేసి వచ్చి ఇంట్లో వున్న కుక్కలకు బిస్కట్లు తినిపించుకుంటూ కాలం గడపోచ్చు.తరువాత అది ఆత్మహత్య అని చెప్పేస్తారు. ఆ చచ్చినోడికి చేతులు లేకపోయినా గొళ్ళేనికి తుపాకీ ఆనించి గొడుగు తో ట్రిగ్గర్ నొక్కాడని నొక్కి వక్కాణించేస్తారు."

"అంతేనా శిక్షలు గట్రాలు వుండవా?"

"వుంటాయి అలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను దేవుడు శిక్షిస్తాడట."

"ఈ శిక్షలు గట్రాలు మనకొద్దు గానీ ఏవన్నా సరదా బ్లాగుంటేచెప్పండి"

"ఇదిగో ఈ మధ్య వచ్చిన ఈ పావని గారి బ్లాగు చూడు"


:::::::