Thursday, March 20, 2008

బ్లాగు వీర లేవరా డిగ్గడాని కెళ్ళరా

హెడ్డింగ్ చూడగానే పెద్ద ఫుడ్డు లేదని అర్థమయిపోతుంది. తెలుగు బ్లాగుల్లో ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్న డిగ్గింగ్ జల్లెడ లో వచ్చేసింది. ప్రస్తుతానికి గుడ్డు దశలో వుందని చెబుతున్న “ఆ నలుగురు నిర్వాహకులు” తొందరలోనే దాన్ని ఇమగో దశకు తీసుకెళ్ళి మరిన్ని రంగులతో శోభాయమానం చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పటికే నేను చెప్పాల్సిందంతా చావా, రావ్, జ్యోతక్క గార్లు చెప్పేశారు కాబట్టి నేను చెప్పే దేమీ లేదు. మైకు పట్టిన రాజకీయ నాయకుడికి మైకు ఒదల బుద్ది కానట్టు టపా మొదలు పెడితే ఠావు పుట అయినా రాయాలి అని మా బ్లాగ్మండల సామి హిట్ల దీక్ష లో వున్నప్పుడు ఉపదేశించారు.



డిగ్గడానికెందుకురా తొందర అని కళ్ళు కూడల్లో, కాళ్ళు కుర్చీలో పెట్టి కూర్చోకుండా జల్లెడ వోటు సైటు టికెట్ కొనుక్కుని మూషికయానం చేసి ల్యాండ్ అయ్యా. కొద్ది సేపు కూడా ఆలస్యం చెయ్యకుండా అక్కడున్న నక్షత్రాలను నొక్కడం మొదలు పెట్టాను. అక్కడ అంటే ఏ టపాకి అని అశ్చర్యంగా అడగరని నాకు తెలుసు. జన్మ వృత్తాంతం అంతా తెలిసిన వాళ్ళు కదా. నొక్కిన నక్షత్రం అయిదు కాదని అనుకునే వాళ్ళెవరూ లేరనే నా ఆత్మ విశ్వాసం. నొక్కింది నా సైటు లంకెల్నే అనే విషయం తెలిసిపోయుంటుంది. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని మార్చేంత మొనగాడిని కాదు.ఆ గౌరవానికి సూచకంగా అంటే గుళ్ళో ప్రసాదం నచ్చితే నెత్తిన టవలేసుకొని మళ్ళీ లైన్లో నిలబడినట్లు మరో సారి నొక్కా. ఇది రిగ్గింగు కింద కొస్తుంది అది చట్ట బద్దం కాదు, నేరార్హం, శిక్షార్హం, కుయ్యోయ్ ర్హం , మొయ్యోర్హం అని అనిపిస్తే మీరు ముప్పై ఏళ్ళు గాఢ మైన సుషిప్తావస్తలోకి వెళ్ళి ఇప్పుడే నిద్ర మేల్కొని పాచి పళ్ళతో బ్లాగులు చూస్తున్నట్టు లెక్క. రిగ్గింగు అన్నది ఎవరు బడితే వాళ్ళకు దక్కే అవకాశం కాదు. ఏ పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టమో.



మొదటి సారి నొక్కినప్పుడు "నొక్కినందుకు నెనర్లు" అని ఎయిర్ ఇండియా మహారాజులా వందనం అంది. రెండో సారి మాత్రం "ఇప్పటికే ఓటు వేసినారు" అని చెప్పింది. మళ్ళీ మళ్ళీ నొక్కా. ప్రతి సారి "ఇప్పటికే ఓటు వేసినారు" అని చెబుతుంటే నాకు మాత్రం "వై.ఎస్.ను నేనే ముఖ్యమంత్రిని చేశా, ఇందిరా గాంధీని నేనే ప్రధాన మంత్రిని చేశా.. వై.ఎస్.ను నేనే ముఖ్యమంత్రిని చేశా, ఇందిరా గాంధీని నేనే ప్రధాన మంత్రిని చేశా… వై.ఎస్.ను నేనే ముఖ్యమంత్రిని చేశా, ఇందిరా గాంధీని నేనే ప్రధాన మంత్రిని చేశా" అని ఎవరో అన్నట్లు వినబడింది. అప్పుడే విపరీతమైన రోషం పుట్టుకు వచ్చింది. ప్రపంచం లో వున్న సాఫ్టువేర్ ఇంజినీర్లందరిలోకి తెలుగు వాడే గొప్ప అని ప్రూవ్ చేసుకునే సమయం ఆసన్నమైందని ఐ.పి. అడ్రెస్ మార్చి మళ్ళీ నొక్కా. ప్చ్… మళ్ళీ మార్చా. నొక్కా. మళ్ళీ ఉప్చే. అలా చాలా ప్చ్ లు అయ్యాక ఈ సైటు డెవలప్ చేసినోడూ తెలుగోడే, సాటి తెలుగు వాడికి గౌరవం ఇవ్వాలనే తలపుతో చివరి సారిగా గట్టిగా ప్చ్ అని నొక్కడం ఆపేసి ఈ టపా రాశా.



నీతి: కొన్ని సైట్లను రిగ్గ వచ్చు కానీ జల్లెడను ప్రస్తుతానికి రిగ్గలేము డిగ్గడం మాత్రం చేయవచ్చు .

ఉపసంహారం: ఏమీ లేదు.

2 comments:

కొత్త పాళీ said...

ఇదేంటీ మర్చేశావూ? మొదట్సారి క్లిక్కినప్పుడు కొత్తపెళ్ళికూతుర్లా సిగ్గుపడింది అని చూసి ఎంతో ముచ్చటేసి వ్యాఖ్య రాయబోయాను. ఇంతలో ఏదో టెక్నికల్ ఇబ్బంది వచ్చి అదికాస్తా పీకల్సొచ్చింది .. ఇంఅత్లో నువ్వు అచ్చు మార్చేశావు! అసలెందుకు మార్చటం .. ఆ వాక్యం ఎంతో బావుంది!

Anonymous said...

మాస్టారూ, అది తమరేనా? కొత్త అని మాత్రం పేరొచ్చింది. కొత్తపాళీ అని రాలేదు. విషయమేంటంటే " నొక్కినందుకు నెనర్లు" అనే డైలాగు కాస్త కోడి రామకృష్ణ సినిమాలో డైలాగు లా అనిపించకూడదని మార్చేశా. అదన్న మాట విషయం.

-- విహారి