Tuesday, March 11, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ( రాజీనామాలు, కిలారి పాల్)

...


"అయ్యగారూ నా బ్యాటూ బాలూ కనిపించడం లేదు. మీరేమన్నా చూశారా?"

"చూశారా కాదు దాచేశారా అని అడుగు బావుంటుంది. మనోళ్ళు ఆస్ట్రేలియా మీద గెలిచినందుకు పది కోట్లిచ్చారు గదా. అది చూసి మళ్ళీ నువ్వు గోచీ ఎగ్గడతావని వాటిని దాచేశా."

"మీకు నేను పైకి రావడం ఇష్టం లేదు లాగుంది. ఇలాగయితే నేను రాజీనామా చేసేస్తా. "

"నీ టర్మేమీ అయిపోలేదు నువ్వు రాజీనామా చెయ్యడానికి. ఇంకా ఓ ముప్పై ఏళ్ళు ఉద్యోగం చెయ్యొచ్చు. నీ పదవికొచ్చిన నష్టమేమీ లేదు గానీ పొలం లో పనిచెయ్యడానికి కూలీలను పిలిచావా లేదా?"

"మన చేనులో పని చెయ్యడానికి కూలీలు ఎవ్వరూ రావటం లేదండి"

"ఎందుకురా? మనమేమీ తక్కువ కూలీ ఇవ్వడం లేదు కదా. రోజుకు 100 రూపాయలు ఇస్తున్నాం కదా. రావడానికేం? కొంపదీసి నువ్వు ఇన్‌స్పైర్ అయిపోయి కమీషన్ నొక్కెయ్యడం లేదు గదా?"

"నేనేదో సూరీడు అయినట్టు మీరు వై.ఎస్. అయినట్టు ఫీలింగొకటి. నాకంత అదృష్టమా చెప్పండి. అందరూ తెలివి మీరి పోయారు."

"తెలివి మీరడమెంటి ఏమీ పని చెయ్యకుండా డబ్బులొచ్చేస్తున్నాయా ఏంది?"

"ఇందిరమ్మ ఉపాధి హామీ పథకం కింద 100 రూపాయలు ఇచ్చేస్తున్నారు గదా "

"మనమిస్తోంది అంతే కదా"

"అక్కడే మీరు కేరెట్ తిన్నారు. మన దగ్గరికొస్తే రోజంతా కష్టపడాలి. అక్కడికెళితే పని చేసినా చెయ్యక పోయినా రికార్డుల్లో పేరు రాసుకుంటే చాలు నూరు రూపాయలొస్తుంది."

"ఏంటి అంత సులభంగానా? అందరికీ ఇస్తున్నారా?"

"అక్కడే కొంచెం తేడా వుంది. కాంగ్రేసు సానుభూతి పరులకు బేషుగ్గా ఇస్తున్నారు. ఇంకొంత మంది అలా నటిస్తూ అటు వైపే వెళ్ళి పోతున్నారు."

"ఇలాగయితే కొద్దో గొప్పో భూములున్న రైతులెలా బతుకు తారు?"

"అయిదెకరాల కన్నా ఎక్కువున్న రైతులకు ఋణాల మాఫీ లేదు కదా. వాళ్ళు వున్నదమ్ముకోని జై కాంగ్రేస్ అని అందులో చేరి పోతారు."

"ఏ రకంగా చూసినా కాంగ్రేస్ కే అనుకూలమన్న మాట. ఇలాంటివి బయటకు రావటం లేదా?"

"వస్తున్నాయి. ఇలాంటి వార్తలు వచ్చినందుకే రాసిన విలేఖరులు జె.సి.దివాకర్ రెడ్డి మీటింగుల నుండి గాల్లో లేచి బయటికి వచ్చారు. కొన్నాళ్ళాగితే ఇంకొంచెం పైకి పోతారు. అందుకే పై లోకాల నుండి మాలాంటి వారిని ఆదుకోడానికి ఒక మనిషి వచ్చాడు."

"ఏదో కొత్త విషయం లాగుందే. "

"మీకు కొత్తగానే వుంటుంది. మాలాంటోళ్ళకు అది పాతదే. మా లాంటి దీనులను, అభాగ్యులను ఆదుకొనే దీన జన బాంధవుడు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు"

"ఇది పాత విషయమే నువ్వు మాట్లాడేది వై.ఎస్.గురించే. ఆ ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ చూపించే ప్రకటనలు చూస్తే అందరు ముఖ్యమంత్రులు ఇలాగే అనిపిస్తారు."

"చా! వై.ఎస్. గురించి ఎవరు చెప్పారు మీరే అలాంటివి చూసి పడి పోతారు. నేను మాట్లాడేది ఆయన గురించి కాదు"

"ఇక మిగిలిందెవరు చిరంజీవే"

"నన్ను క్రికెట్ పిచ్చంటారు గానీ మీకే ఆ రాజకీయాల పిచ్చి ఎక్కువ అందుకే చిరంజీవి అంటున్నారు.మీరిప్పుడు కేరెట్ కేక్ తిన్నారు."

"వైఎస్సూ, చిరంజీవి కాకుండా ఇంకెవరబ్బా..ఆ గుర్తొచ్చింది. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్"

"ఈ సారి కేరెట్ హల్వా తిన్నారు. నేను మాట్లాడేది మా దీన సందు పార్టీ నేత కె.ఏ.పాల్ గురించి"

"ఓహో ఆయనా? ఎన్నారై పార్టీ అన్నమాట. ఏదో సందు చూసుకుని పార్టీ పెట్టినట్టు అది దీన సందు అంటావే. అది దీన బంధు అనుకుంటా"

"ఏదో ఒక గొంది.అందుకే అందులో కెళ్ళి ఇరుక్కుందామనుకుంటున్నా."

"ఏందుకో?"

"చేరితే నన్ను ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు."

"చిరంజీవిని చేస్తానన్నట్టున్నాడు"

"అయితే ఉప ముఖ్యమంత్రి నవుతా."

"దాసరి తీసిన ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా చూశావా?"

"లేదు. ఏం అందులో నాలాంటోడు ముఖ్యమంత్రి కానీ అవుతాడా ఏంది?"

"అలాంటిదే. ఒక బడుగు వాడైన దాసరి, ముఖ్యమంత్రి అవడానికి ఎగస్పార్టీ ఎమ్మెల్యేలందరికి ఉప ముఖ్యమంత్రి పదవిస్తానని ఆశ పెడతాడు. దానితో సిగ్గు లేని వెధవలందరూ వాళ్ళ పార్టీ జెండా ఎత్తేసి ఈ పార్టీలోకి వచ్చేస్తారు."

"అంటే అవతలి పార్టీ నాయకుడికి కూడా?"

"వాడికి మాత్రం ప్రత్యేకమైన పదవి ఇస్తాడు."

"అదేదో చెప్పండి నేను ఆ పదవి ఇమ్మని అడుగుతా."

"అది ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి "

"నన్ను బాగా ఇరికిస్తారే? ఇలానే అంటూ వుండండి ఏదో ఓ రోజు మా చిరంజీవి పార్టీ పెట్టి పాద యాత్రో, చేతి యాత్రో అంటాడు అప్పుడు నేను జంపు జోగయ్య అవుతా."

"చేతి యాత్రలు కూడా వున్నాయా?"

"నడిచి వెళ్ళి ప్రజలని చూస్తే అవి పాద యాత్రలు. హెలికాప్టర్లో వెళుతూ గాల్లో నుండి చెయ్యి ఊపితే అవి చేతి యాత్రలు."

"ఇంకా నయం కూడలి చాట్ రూము లో కొచ్చి ప్రచారం చేసుకుంటే ఛాట్ యాత్ర, బ్లాగు సమావేశాల్లోకొచ్చి చెబితే బ్లాగు యాత్ర అని చెప్పలేదు"


***




"ఇప్పుడు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏంచేస్తారు."

"వచ్చే ఏలక్షన్స్ లో పోటీ చేస్తారు. ఓ నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ రాజీనామా చేస్తారు.జాబ్ సెక్యూరిటీ."


**



"వై.ఎస్. తను కడపను మాత్రమే అభివృద్ధి చేస్తున్నాడనే ఘోరాతి ఘోరమైన నిందను పోగొట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ అంతా అభివృద్ధి చెయ్యాలంటే ఏమి చెయ్యాలి?"

"ప్రధాన మంత్రిని చెయ్యాలి."


:::::::


7 comments:

రాఘవ said...

హహ్హహ్హ... ప్రధానమంత్రిని చేయడమన్నది నిజంగా మైండ్ బ్లోయింగ్ :D

Anonymous said...

pradhaaa matraaa ....

ha ha

రానారె said...

నిస్సందేహంగా మీరు కామెడీ కింగ్. వార్తాపత్రికలు అందరూ రోజూ చదువుతారు. వాటిని వడబోసి యిలాంటి నాణ్యమైన హాస్యరసాన్ని తయారుచేయడం మీకే సాధ్యం. భూపతిగారు జిందాబాద్!!

netizen నెటిజన్ said...

విహారి..అప్,అప్!

phani said...

మొత్తానికి మా చిరంజీవి పత్రికలతో పాటూ బ్లాగుల్లోనూ హాట్ టాపిక్ అయినందుకు అభిమానులమైన మాకు చాలా సంతోషంగా వుంది.జై విహారి.

mohanraokotari said...

adirindayya vihari, time pass chenakkayalu, continue aipondi

Anonymous said...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the Home Theater, I hope you enjoy. The address is http://home-theater-brasil.blogspot.com. A hug.