Wednesday, March 19, 2008

ఈ వారం సిద్ధ -- బుద్ధ (శంషాబాద్, బ్లాగర్ స్పెషల్స్):::::::::"రేయ్ సిధ్ధా! ఏమిటీమధ్య కనిపించినోళ్ళందరికీ వంగి వంగి దండాలు పెడుతున్నావ్?"
"మీతో మా చెడ్డ చిక్కొచ్చిపడిందండీ. ప్రతి దానికి ఏదో వంక పెడతారు. ఇకాపండి అయ్యా మీరేమనబోతున్నారో నాకు తెలుసు. నేనేమన్నా వై.ఎస్సా ఆ వచ్చినోళ్ళందరూ డి.కె.ఆదికేశవులు నాయుడు లాంటి వారా అని క్లాసు పీక్కండి."

"అదే చెప్పబోతున్నా డి.కె.కొడుక్కి చిరంజీవి పెట్టబోయే పార్టీ టికెట్టు ఇచ్చి పుంగనూరు నుండి పోటీ చేయించే సూచనలున్నాయని వై.ఎస్. అందరిని కలుపుకు పోతున్నాడు. నువ్వు కూడా అలా అందర్ని కలుపుకుంటున్నావేమో అని అడిగా."
"మిమ్మల్ని నేను కొన్నాళు వదిలి వెళ్ళిపోతే మేలేమో"

"నువ్వు ప్రతిపక్షం లా తయారయ్యావు కదరా"
"అదే.... ఆ సెటైరే వద్దనేది.... నేను పిచ్చోడి లాగా వున్నానా? "

"సరేలే వదిలెయ్. అలా కాసేపు ఊరు తిరిగొద్దాం రా"
"తిరిగేంత సీను లేదు. వామ పక్షమూ, రామ పక్షమూ బందులూ ధర్నాలూ అంటున్నాయి"

"సుందరయ్య గారి స్పెషల్ అన్నమాట.రామ పక్షమేంది?"
"మన దైవం శ్రీరాముడి 'జై శ్రీరామ్‌' పార్టీ. అయ్యగారూ!... ఈ దేవాదుల ప్రాజేక్టేంటి?"

"అదే ఎత్తిపోతల ప్రాజెక్టు. నీళ్ళను తక్కువ ఎత్తునుండి ఎక్కువ ఎత్తుగల ప్రదేశాలకు పంప్ చేస్తారు"
"ఏత్తి పోతలంటే ఈ సంచిలో వున్న డబ్బును ఆ సంచిలోకి వాళ్లే ఎత్తిపోసుకోవడం కాదా?"

"అదే సరయిన అర్థం.మామూలు ప్రాజెక్టుల్లో వీళ్ళే వాళ్ళకు డబ్బులిస్తారు. ఇలాంటి వాటిల్లో వాళ్ళే ఎంత కావాలంటే అంత చేత్తో ఎత్తి తీసుకోవచ్చు. బఫే డిన్నర్ లా"
"ఈ ప్రాజెక్టు చాలా నాణ్యంగా రూపుదిద్దికుంటుందంట"

"అవును. ఆ చెప్పిన ఇంజినీరుకు కొన్ని ఎక్కువ నాణేలు... బంగారువి గిట్టు బాటయ్యాయట "
"శంషా బాద్ ఏర్పోర్ట్ కూడా భారత దేశానికి కోహినూర్ వజ్రమంత పేరు తెస్తుందట కదా"

"వజ్రమంత పేరేమో గానీ రాజీవ్ పేరు పెట్టి మేడం దగ్గర చాలా మార్కులు వేసుకుంటున్నారు. కొన్నాళ్ళ తరువాత గూగుల్లో రాజీవ్ అని కొడితే రాజీవ్ విమానాశ్రయం, రాజీవ్ నౌకాశ్రయం, రాజీవ్ రైల్వే స్టేషన్‌, రాజీవ్ బస్ స్టేషన్‌, రాజీవ్ ధర్మల్ స్టేషన్‌, రాజీవ్ పోలీస్ స్టేషన్‌, రాజీవ్ ఆయిల్ స్టేషన్‌, రాజీవ్ టీ స్టేషన్‌, రాజీవ్ జూ స్టేషన్‌ అని వస్తాయి. అప్పుడు పరీక్షల్లో ఏ ప్రశ్నకయినా రాజీవ్ అని రాసేస్తే బోలెడు మార్కులే మార్కులు."
"శంషాద్ విమానాశ్రయానికి ఏ గోడవ లేకుండా వుండాలంటే నా దగ్గరో అవుడియా వుంది"

"అబ్బా అవుడియానా అదేదో చెప్పు ఆ రెండు పత్రికలలో వచ్చేట్టు చూస్తా"
"విమానాశ్రయానికి రైట్ బ్రదర్స్ అని పేరు పెడితే సరి"

"ఎంత చక్కగా చెప్పావురా ఇంటి పైకప్పు చార్మినార్ ఆస్బెస్టాస్ సిమెంటు రేకులతో వేయిస్తే సరి అన్నట్టు. కొత్త పత్రిక సాక్షి కి పంపించు "
"అయ్యగారూ, సాక్షి సినిమాలో నటించినందుకు రంగారావుకి సాక్షి రంగారావు అనే పేరు స్థిరపడింది కదా. అలాగే సాక్షి పత్రికను పెడుతున్న జగన్‌ కు సాక్షి జగన్‌ అని పేరొస్తుందా "

"ఏమో రావచ్చేమో?"
"మీ బుర్రకు పవరు తగ్గినట్టుంది. పత్రిక పెడుతోంది ఆ రెండు పత్రికల మీద కక్ష తో కదా అందువల్ల కక్షి జగన్‌ అని పేరు రావచ్చు"

"పేర్లు పెట్టడం లో స్పెషల్ అయ్యావన్నమాట సరే ఇప్పుడు నేను కొన్ని స్పెషల్ ప్రశ్నలేస్తా నువ్వు సమాధానం చెప్పు"
"అడుక్కోండి .. అంటే అడగండి"

"లేఖలు రాయడం లో స్పెషల్ ఎవరు?"
"దత్తన్న"

"దీక్షలు చెయ్యడం, విరమించడం లో స్పెషల్?"
"మంద కృష్ణ మాదిగ"

"నోర్ముయ్ అనడంలో స్పెషల్?"
"వై.ఎస్."

"ఏది కనిపించక పోయినా అందుకు ఆంధ్రోల్లే కారణం అనడం లో స్పెషల్?"
"కె.సి.ఆర్."

"నన్నంటే కాలుస్తా అనడం లో స్పెషల్?"
"గోనె ప్రకాశ్ రావ్."

"కామెంట్లలో బ్రేవో అనడం లో స్పెషల్?"
"కొత్తపాళి"

"కామెంట్లలో ఆయ్ అనడం లో స్పెషల్?"
"ప్రవీణ్ గార్లపాటి"

"అదుర్స్, సూపరో సూపరు అనడం లో స్పెషల్?"
"రాధిక"

"హాస్య టపా చూడగానే డమాల్ మని పడిపోయే వాళ్ళలో స్పెషల్?"
"రానారె"

"నువ్వు కామెంటుకోబ్బా, నేను కామెంటు రాయనబ్బ అనే వాళ్ళలో స్పెషల్?"
"తోట రాముడు"

"బోయింగ్ విమానమంత జాబు రాస్తే హెలికాప్టరంత రిప్లయ్"
"వీవెన్"

"కళల మీద అభిమానంతో దానికోసం శ్రమించే వాళ్లను ఏమంటారు"
"కళాకారులు"

"కళల మీద అభిమానంతో వున్న డబ్బును తగలేసి పోషించేవాళ్ళను ఏమంటారు"
"గులాకారులు"

విన్నపమైన గమనిక(మొట్టికాయలకి హెల్మెట్) : బ్లాగర్ల గురించి రాసినది పూర్తిగా నిజం కాదు(అంటే కొంత నిజముందా అని డీకేస్టీ పదవుచ్చుకోని చెవిలో దుర్భిణి పెట్టుకొని బయలు దేరకండి). కొంత(చాలా అంటే బావుండదని) నాటకీయత జోడించి రాసింది. నొచ్చుకుంటే ‘సచ్చినోడని'(దరిద్రపు వెధవా అనమంటే బాగుండదు కదా) గిచ్చినట్లు చెప్పండి.


:::::::::


9 comments:

దీపారాధన said...

సిద్ధ-బుద్ధ సంవాదం చాలాబాగుంది. కీప్ ఇట్ అప్

nuvvusetty said...

ఆయ్, బ్రేవో, అదుర్స్..సూపరో సూపర్.
ఇంక పదాలు దొరకటంలా విహారి,మొత్తానికి అదిరింది.

-----------
వర్డ్ ప్రెస్ బ్లాగర్లు కూడా కామెంట్ ఇచ్చేవిధంగా మీ బ్లాగులో సెట్ చేయండి దయచేసి.

సుగాత్రి said...

ఎప్పటిలాగే విహారి గారి హాస్యచతురతకు 10/10.

ఐతే సార్, మీ లంకెల్లో ఒక పొరబాటు దొర్లిందండీ. రానారె పేరు మీద కూడా తోటరాముడికే లైనేశారు.

(ఏం లేదు. "తప్పులెన్నడంలో" నాకో స్పెషల్ కుర్చీ వేస్తారని ఒక చిన్న దురాశ. :-))

రాధిక said...

అదుర్స్..సూపరో సూపర్ :)

Anonymous said...

"వామ పక్షమూ, రామ పక్షమూ", ఎత్తిపోతలు
-మీ మార్కు స్పార్కులు!

రాఘవ said...

మేష్టారూ, నాకు తెలియకడుగుతాను (ఎవరైనా తెలిసడుగుతారా అనకండేం), మీకిన్నిన్ని అవుడియాలు యెక్కణ్ణించొస్తాయండీ బాబు? ఇంకో కొశ్చను. చెవిలో దుర్భిణి యేంటండీ వెరైటీగా, అదేవైఁనా పెన్షిళా వడ్రంమేస్త్రిలా చెవిలో పెట్టుకు తిరగడానికి? చెవి వాచిపోతుందండీ.

రానారె said...

ఢమాల్ (మని పడిపోయానన్నమాట)

"గూగుల్లో రాజీవ్" డైలాగు చదివి గట్టిగా పైకి నవ్వుకున్నాను. రాఘవగారి సందేహమే నాదీ. ఇన్నిన్ని అడివియాలెక్కణ్ణించొస్తాయి మీకని!

ప్రవీణ్ గార్లపాటి said...

ఆయ్ఁ... నన్నే పట్టేస్తారా ?

Anonymous said...

ఎక్కడో "కేక" వినపడలేదా?