Thursday, April 24, 2008

సూపర్ సీన్స్ (చెంప కదిలితే....)

* * * *


విలన్ సారుకు చాలా కోపం వచ్చేస్తుంది. రమ్మంటే రాదా? ఎన్ని సార్లు ఎదురుగా వచ్చి పోరాడినా హీరో గాడు మూతి మీద గుద్దుతా వుంటాడు. బిల్లేమో డాక్టర్ దంతేశ్వర్ కి వెళుతుంది. తనొక్కసారి గాల్లో ఎగిరితే హీరో అయిదు సార్లు గాల్లోకి ఎగురుతాడు. తన చాకు రౌడీ లందరూ చాక్ పీసు లా విరిగి పడడుతుంటే చూడలేక వెనకనుండొచ్చి ఓ పెద్ద కారు సైలెన్సర్తో హీరో బుర్ర మీద డింగుమని ఒకటిస్తాడు. దెబ్బకు హీరో గారు సైలన్సయిపోయి బజ్జుంటాడు. అలానే వుంచేస్తే మళ్ళీ గాల్లోకి లేచి తంతాడని తీసుకెళ్ళి ఓ జీపు లో పడేస్తారు. విలనేమో జీపులో పెట్రోలు తీసి తగలేస్తాడని(అప్పుడు బేరల్ పెట్రోలు పదో ఇరవయ్యో డాలర్లే ఇప్పట్లా నూట ఇరవై డాలర్లు కాదు) థియేటరంతా ఎదురు చూస్తే విలన్ సారేమో వెరైటీగా ఓ పెద్ద గొయ్యి తవ్వి అందులోకి హీరో గార్ని, జీపు గార్ని తోసేస్తాడు. తోసేటప్పుడు హీరో ఎవ్వరికీ తెలియకుండా బయటికి దూకేస్తాడు అని థియేటర్లో అందరూ మరొక్క సారి ఎదురు చూస్తారు. ఎందుకంటే అప్పటికే అలా చాలా సార్లు ఎదురు చూడగానే జరిగిపోతుంటాయి కాబట్టి. కానీ అలాంటి దేమీ జరగదు. అలా చూస్తూ వుండగానే కొంచెం కాళ్ళూ చేతులూ విరిగిన ఆకు రౌడీలందరూ కలిసి థార్ ఎడారినుండీ తెచ్చిన ఇసుక బస్తాలు తెచ్చి, విప్పేసి ఆ ఇసుక నంతా వేసి ఆ గొయ్యి ని మూసేస్తారు. హీరో గారు కొంచెం, కొంచెం కళ్ళు తేలేస్తారు.

మొత్తం ఇసుక తోసేసిన తరువాత ఒక కేసు కింగు ఫిషర్ బీరు, ఒక కేసు కళ్యాణి బీరు వస్తాయి. వాటిని ఓపెన్ చేసి తాక్కుంటూ, ఊక్కుంటూ విలన్ సారు డెన్ కు వెళ్ళి పోతారు. ఈ గొయ్యికీ విలన్ డెన్‌ కు దూరమెంత అంటే రెండు బీర్లు అయిపోయేంత.

అక్కడ డెన్లో.....

హీరో గారి చెల్లెల్ని విలన్ సారు బంధించి వుంటాడు. హీరో ను భూస్థాపితం చేశాం అని చెప్పి బీరు బాటిల్లోని చివరి రెండు చుక్కల్ని వేలు పెట్టి తీసి తాగే(నాకే)స్తాడు.

హీరో లేడు.

హీరో చెల్లెలుంది.

విలనున్నాడు.


తరువాత సీను ఏంటని వై.వి.ఎస్.చౌదరిని గానీ, గుండు కొట్టుకున్న ఏ గోవిందాన్ని గానీ అడిగినా చెప్పేస్తారు. విలన్ ఆ సీను లో అనుభవమంతా ప్రదర్శిస్తూ వుండగా అప్పుడు జరుగుతుంది ఓ మాహాద్భుతం.


"అన్నయ్యా..." అని అరుస్తుంది హీరో చెల్లెలు.

"హహ్హ....హహ్హా" అని అరుస్తాడు విలన్ సారు.

"అన్నయ్యా..."

"పిలు..పిలు వాడి నెప్పుడో పాతి పెట్టేశాం" అంటాడు పుచ్చిపోయిన పంటి తో ఇంకో బీరు బాటిలు ఓపన్ చేస్తూ.

"అన్నయ్యా..."

తరంగాలు...............

గాలిలో తరంగాలు...........

అలలు.................

అలలు అలలుగా తరంగాలు....

ఒక తరంగం.............

రెండు తరంగాలు..........

మూడు తరంగాలు.........

ఇంకో నాలుగో అయిదో....అంతే....


పాతి పెట్టబడిన గొయ్యిలోకి కెమరా వెళుతుంది (డైరెట్రు సారు తీసుకెళతాడు).....


గాల్లో తరంగాలు.........

గొయ్యిలోకి తరంగాలు......

ఇసుకలోకి తరంగాలు......

జీపులోకి తరంగాలు.......

అన్నయ్యా అని పిల్చే తరంగాలు..

హీరో చెవిలోకి తరంగాలు.......

హీరో చెంపలోకి తరంగాలు......

చెంప బదులు..పులి తల .....

పులి తల బదులు హీరో చెంప...

చెంప...పులి...
పులీ...చెంపా..

(మధ్య మధ్యలో బిస్లరీ వాటర్ చుక్కలు..)

చెంపా...పులీ...
పులీ...చెంపా...

(మళ్ళీ బిస్లరీ వాటర్..)

పులి కదులుతుంది..చెంప కదులుతుంది..
చెంప చాలా సార్లు కదులుతుంది..
స్క్రీను కదులుతుంది..

కొంత మంది ప్రేక్షకులు కదులుతారు..

మళ్ళీ ఇంకోసారి అంతే....

జీపు స్టార్టవుతుంది........

ముందు బెంచీల వాళ్ళు ఎనిమిది సార్లు విజిల్ వేస్తారు.
వెనక బెంచీల వాళ్ళు ఇంకో రకం విజిల్ ఆరు సార్లు వేస్తారు.
చాలా వెనక బెంచీల వాళ్ళు ముందు బెంచీల విజిల్స్ మూడు సార్లు వేస్తారు.

విజిల్ వెయ్యని వాళ్ళు థియేటర్ బయటుంటారు.


కెమరా గొయ్యి లోనుండి బయటికొచ్చేస్తుంది.జీపు కూడా వచ్చేస్తుంది.
కెమరా విలన్ సారు డెన్ లోకి వెళుతుంది.కెమరా కన్నా ముందే జీపు వెళ్ళి విలన్ సారును గుద్దు తుంది.

ఇంకోసారి అంతే..... విలన్ సారు కేమవదు.

చెల్లెలేమో....."అన్నయ్యా.."
అన్నయ్యేమో..."చెల్లెమ్మా..."

ఓ పాట?

"నో కెమరాలో రీలు లేదు డబ్బంతా ఇసుక కొనడానికే సరిపోయింది" అని డైరెట్రు సారు చెబుతాడు.

మళ్ళీ స్క్రీనంతా కసా పిసా మస.

హీరో సేఫ్..............
హీరో చెల్లెలు సేఫ్.........
బయటికొచ్చిన ప్రేక్షకులు సేఫ్..

ఇది ఒకానొక తెలుగు సినిమాలోని క్లైమాక్స్ సీను. సినిమా పేరు గుర్తుంటే చెప్పుకోండి.త్వరలో మరో సూపర్ సీన్ తో మీ ముందుకు.

* * * *

17 comments:

రానారె said...

ఇది ఏ సినిమానో తెలీదుగానీ, చివర్లో హీరో వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యుంటుంది. అందుకే నాకు గుర్తులేదు. ;-)

sujatha said...

సినిమా ఏదైతే ఏం లెండి, ఖచ్చితంగా సినిమాలో మాత్రం ఈ టపా చదివినప్పుడొచ్చినంత నవ్వు మాత్రం రాదు. ఏడుపొస్తుంది. నిజంగా బలే నవ్వించార్లెండి!

క్రాంతి said...

మీరు చెప్పింది ఏ సినిమానో సరిగ్గా గుర్తు రావటం లేదు కాని,"బంగారం" సినిమా క్లైమాక్స్ కూడ ఇలానే ఉంటుంది మన ఊహకి అందని ట్విస్ట్ లతో

dhrruva said...

Hahaa.a.. Film Name "PULI"

hero "chiRu"... tempt ayyi rendu saarlu choosa chiinnapudu kadhaa ani ;)))))

కొత్త పాళీ said...

నవ్వుల విహారికి జోహార్లు!

రాధిక said...

హ హ్హ హ్హ...పులా?ఇప్పుడు చిరు తమ్ముడు పవన్ పులి వస్తున్నట్టుంది?

Niranjan Pulipati said...

మా సిరు అన్నియ్య సినిమా నే. :) యధావిధిగా మీ పోష్టు కత్తి కమాల్ :)

నాగరాజా said...

అలలు ~ తరంగాలు (1-5), ఇసుక, చెంపా ~పులి కలగలిపితే సూపర్ టపా. పళ్ళు ఇకిలించి చదవాల్సి వచ్చింది :)

seenu said...

హాయ్ విహారి గారు,మీరు చెప్పిన స్టొరి మన తెలుగు సినిమాల్లొ సాధారణంగా కనిపించె స్టొరిసె.అందువల్ల నెను ఏసినిమా అనీ చెప్పలేక పొతున్నాను.

phani said...

మొత్తానికి ప్రతి సారి మీ బ్లాగ్ లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మా చిరు నామ స్మరణ జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషం.

డా.స్మైల్ said...

ఓ సూపర్ టపా తర్వాత వచ్చిన టపాయేమో అంతగా నచ్చలేదు. కానీ 7/10 ఇవ్వొచ్చు:-)

ప్రవీణ్ గార్లపాటి said...

ఉందీ... ఇదీ సినిమాలో ఉందీ...

క్రాంతి గారు:
బంగారం నేను చూసిన, (శిక్ష అనుభవించిన) సినిమాలలో పై మెట్టు మీదుంటుంది.

మిగతా వారికి:

"పులి" అనే చిరంజీవి సినిమా నేను చూసానా ??

డాక్టరు గారు:
మీకీ టపా నచ్చకపోవడానికి ఇంకో కారణం పై చిరు పులి అవడం కూడానా ? :)

Budaraju Aswin said...

మీ టపా కత్తి
నేనేం తక్కువంటూ
తొడకొట్టి వెనక్కు పంపాడూ గా ట్రైన్ ని మన బాలయ్యా ...

Anonymous said...

@రానారె,

ఈ సినిమా మిస్సయితే చాలా మిస్సయినట్లే.సినిమా ఫ్లాపేమో అని నాకు అనుమానం.

@సుజాత గారు,

నెనర్లు.

@క్రాంతి గారు,

బంగారం లో లాంటిలాంటి బంగారం లాంటి సీన్లు వున్నాయా. అందుకే అది ఇత్తడై కూర్చుంది.

@ దృవ గారు,

మీరే మిలియనీరు లేదా మీరే కోటీశ్వరుడు. కనిపెట్టేశారు కదా.

@ కొత్తపాళి,

నెనర్లు.

@ రాధిక గారు,

ఇందులో బాల భీముడి లాగా హీరోను కట్టేసి సముద్రం లో వేసేస్తారేమో. అప్పుడు ఏ తిమింగలం నోట్లోనుండో బయటికి వచ్చే భయంకరమైన సీను వుంటుంది.

@ నిరంజన్‌ ,

బానే గుర్తుందే? మీకు కూడా ఓ అవార్డు.

@ నాగరాజ గారు,

నెనర్లు. వచ్చే టపాకి చెంపలు చీల్చి నవ్వాలి :-)

@ సీను గారు,

అంత గొప్ప సీను సాధారణం అంటారా? అదో ట్రెండ్ సెట్టర్ అయితే.

@ ఫణి గారు,

మీ చిరు రాబోయే కాలం చాలా వస్తాడు పార్టీ పెడితే. నాకు చిరు అంటే వ్యతిరేకమేమీ లేదు.

@ డాక్టర్ సాబ్,

మీరు పరీక్షల్లో పేపర్లు దిద్దడానికి వెళ్ళకండి. అందరూ ఫెయిలయి పోతారు.

అయినా నెనర్లు.

@ ప్రవీణ్ ,

ఆశ్చర్యం!!!! చిరు పంకా అయుండి ఈ సినిమా చూడ లేదా.


@ అశ్విన్‌ గారు,

నెనర్లు.

బాలయ్యేం ఖర్మ ఇలాంటి సీన్స్ గొప్పవని చెప్ప బడే కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా వున్నాయి. వీలు చూసి వాటి గురించి కూడా రాస్తా.

-- విహారి

bolloju ahmad ali baba said...

మీ బ్లాగు చాలా బాగుంది

బ్లాగంటె ఇలా ఉండాలా అని నేను నేర్చుకుంటున్నాను.

నాబ్లాగు చూసి సలహాలివ్వండి>

బొల్లోజు బాబా

http://sahitheeyanam.blogspot.com/

Kamaraju Kusumanchi said...

చెంప...పులి...
పులీ...చెంపా..

(మధ్య మధ్యలో బిస్లరీ వాటర్ చుక్కలు..)

చెంపా...పులీ...
పులీ...చెంపా...

(మళ్ళీ బిస్లరీ వాటర్..)

పులి కదులుతుంది..చెంప కదులుతుంది..
చెంప చాలా సార్లు కదులుతుంది..
స్క్రీను కదులుతుంది..


ఆహా! ఏమి describe చేసారు విహారి గారు! కళ్ళముందు సినిమా చూపించారు అసలు. తెగ నవ్వించారనుకోండి.

Anonymous said...

రేపు జూన్‌లో మీ కాల్‌షీట్స్ ఇస్తే ఇరగదీయవచ్చు.
కేకలే కేకలు.
విజిజిల్సే విజిల్సు!
ఏమంటారు?