Monday, April 28, 2008

అమెరికా తెలుగు బ్లాగర్ల సమావేశం

హైదరాబాదు వాళ్ళు బిర్యానీ తింటూ, బెంగుళూరు వాళ్ళు బిసిబెళే బాతు తింటూ ఎడతెరిపి లేకుండా బ్లాగు సమావేశాలు ఏర్పాటు చేసేస్తున్నారని అమెరికా బ్లాగర్లకు ఆవేశం ఆరడుగులు పుట్టుకొని వచ్చింది. ఇకూరుకుంటే లాభం, వడ్డీ లేదని ల్యాప్టాప్ లాగ్గట్టి (గోచీ ఎగ్గట్టి కి ప్రత్యామ్నాయ నుడికారం@రిజిస్టర్డు) తెగ బాధ పడిపోయారు. అమెరికాలో వున్న అమెరికన్లకు మన ఇంగ్లీషు అర్థం కాలేదని తెలుగు నేర్పిస్తున్న తెలుగు బ్లాగర్లకు ఇంకెంత సత్తా వుండాలి అని విహారి ఓ వేగు రాసేసి గిలారి కి పంపించాడు. గిలారి ఆలస్యం చెయ్యకుండా తూర్పు తీర ప్రాంతంలో వున్న తులారి కి, మధ్య ప్రాంతంలో వున్న మహారికి, పడమటి తీర ప్రాంతం లో వున్న పహారికి, కొండ ప్రాంతం లో వున్న కొహారికి తంతి కొట్టాడు. అన్నింట్లోనూ ఒకటే సారాశం.

"ఇరగ దీద్ధాం..."

అందరూ అనుకున్న సమయానికి సమావేశ స్థలానికి చేరుకున్నారు.

పాల్గొన్నవాళ్ళు: తుహారి, పహారి, మహారి, కొహారి, విహారి
పాల్గొనలేక పోయిన వాళ్ళు : జిలారి, దులారి, దురదారి, గోకారి
ప్రదేశం : కాకులు దూరేసిన కారడవి, చీమలు దూరేసిన చిట్టడవి
సమయం : సూర్యుడు మాడు మాడ్చేటప్పుడు

చర్చించిన అంశాలు మరియూ తీసుకొన్న నిర్ణయాలు:

1. అమెరికాలో అందరి చేత తెలుగు మాట్లాడించాలి. ప్రత్యేకంగా జార్జి బుష్షు చేత. ఆ తరువాత ఓబామాకు, హిల్లరీకు కూడా నేర్పించాలి. నేర్చుకుంటే వచ్చే అధ్యక్ష ఎన్నికలలో తెలుగు వాళ్ళందరూ వాళ్ళకే ఓట్లు వేస్తారని తెలియ చెప్పాలి. ఎన్ని ఓట్లు వున్నాయో తెలుసుకోవడానికి ఇంతవరకు అమెరికా ఇచ్చిన వీసాలు పరిశీలించుకోమని చెప్పాలి. ఆ సంఖ్యను రెండు తో గుణించుకోమని చెప్పాలి. ఈ పని సమావేశంలో పాల్గొన్న వాళ్ళు ఎవ్వరూ చెయ్యలేరని నాగలోకం నాగరాజు గారికి అప్పజెప్పారు.

2. అమెరికాలో వున్న తెలుగు సంఘాల వెబ్సైట్లను తెలుగు లోకి మార్చే ప్రయత్నం అందరూ చెయ్యాలి. కాకపోతే అందరు చేసేపని ఒక్కడే చెయ్యగలడని ఈ పనిని ఈ మధ్య కాలం లో బ్లాగులను కొండెక్కించిన చరసాల ప్రసాద్ గారికి అప్పగించాలి అని ఏకగ్రీవంగా నిర్ణయించేశారు.

3. వచ్చే ఆటా సమావేశాల్లో బ్లాగుల గురించి ఏదన్నా చెప్పాలి. అలా చెప్పడానికి సరైన వ్యక్తి ఎవరూ అని తెలీక బుర్ర బద్దలు కొట్టుకొని రెండు బుర్రలు పగిలిన తరువాత వికీపీడియన్ రవి వైజా సత్య పేరు పైకి వచ్చింది. ఊరు మారిన తరువాత పత్తాలేకుండా పోయాడని ఈ పని గుత్తగా అప్పజెప్పితే సొంత డబ్బులతో ఆటా కెళ్ళు బ్లాగు సౌరభాలు వెదజల్లుతాడని బుర్రకు అప్పుడే కుట్లేసుకున్నాయన చెప్పాడు. ఈయనే ఎందుకంటే మిగిలిన బ్లాగర్లందరూ ఇంట్లో ముగ్గురికో నలుగురికో వంట చేసి పెట్టాలి. ఈయనయితో వాళ్ళావిడకొక్కరికే వంట చెయ్యాలి. బోలెడంత సమయం మిగులుతుందని అలా డిసైడయిపోయారు.

4. మోటర్ సిటీలో (డెట్రాయిట్) లో మోటార్లు నడుపుకోకుండా సాహితీ సమావేశాలు, పిల్లలకు పద విజ్ఞాన పోటీలు అంటూ తిరుగుతున్న కొత్త పాళికి బ్లాగుల మీద భాగవతం రాయాలని పురమాయించారు. వాటిని వైజా సత్యాకిస్తే ఆయన తిప్పలు ఆయన పడతాడని అందరూ చేతులు దులుపుకున్నారు.

5. హైనెకిన్ బీరు తాగి, కౌబాయ్ రాష్ట్రం లో కౌబాయ్ లాగా నడుముకు గన్నట్టుకుని, నెత్తిన టోపీ ఎట్టుకొని హై హీల్సు వేసుకున్న భామలతో బీచి వాలీ బాలు ఆడుకోకుండా బ్లాగులో బంతాట ఆడుతున్న రానారె ని తన కారుకు తెలుగు బ్లాగులు స్టిక్కర్ పెట్టుకొని తెలుగు వాళ్ళున్న చోటికెళ్ళి కార్ హంక్ చెయ్యాలని చెప్పారు. రానారె గురించి మాట్లాడుకుంటుంటే అమెరికన్ అశరీర వాణి ఇలా చెప్పింది "అలా తెలుగు కోసం పాటు పడుతూ ప్రతి సెంటర్ లోనూ గూగులమ్మ పద్యాలు పాడితే అమెరికాలో తెలుగు బ్లాగుల మీద మక్కువ వున్న అమ్మాయి తన వెంట పడే అవకాశముంది". అవకాశమేనా లేక భగవత్సంకల్పమా అని తిరిగి ప్రశ్నిస్తే అమెరికన్ అశరీర వాణిని తిరిగి ప్రశ్నించకూడదని వెళ్ళి పోయింది.

6. ఈ మధ్య డాటరీ గిరీ కోసం ఊరు మారిన కృష్ణదేవరాయలును ఆస్పత్రి కొచ్చే ప్రతి పేషంటుకు బిల్లుతో పాటు బ్లాగు పుస్తకం ఇవ్వమని ఆదేశించడం జరిగింది. ఒక వేళ ఉద్యోగం పోతే ఇంకొ సారి పరీక్షలకు తయారయ్యేప్పుడు పోయిన సారి కన్నా పదకొండు ఎక్కువగా " బెస్ట్ ఆఫ్ లక్ లు " చెబుతామని గ్యారంటీ ఇచ్చారు.

7. పెళ్ళి ప్రకటనల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన వికటకవి కి కొత్తగా పెళ్ళయి అమెరికాలో అడుగుపెట్టే తెలుగు వాళ్ళకు గాలం వేసి ఎయిర్ పోర్టులో కస్టమ్స్ వాళ్ళను దాటగానే వాళ్ళ చేతిలో ఒక బ్లాగు పుస్తకం పెట్టే పని ఇచ్చారు. ఒక వేళ వాళ్ళు పుస్తకం తీసుకోకపోతే వెంటనే కస్టమ్స్ ఆఫీసరు దగ్గరికెళ్ళి వీళ్ళు హైదరాబాద్ లో లష్కరే తోయిబా తీవ్రవాద గ్రూపు కు చెందిన వాళ్ళు అని చెవిలో చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చెయ్యాలి.

8. వచ్చే బ్లాగర్ల సమావేశం కేవలం మహిళా బ్లాగర్లతోనే చేయించి బ్లాగు ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించాలి అని నిర్ణయించారు. ఈ బాధ్యతని రాధిక, లలిత, నిషిగంధ, చేతన (అమెరికానేనా?) గార్లకు అప్పగించారు.


రహస్యంగా తీసుకొన్న కొన్ని నిర్ణయాలు(అమెరికా బ్లాగర్ల గీత పెద్ద గీత కావాలంటే):

1. హైదరాబాద్ లో కార్యక్రమాలు జరగ కుండా చెయ్యాలంటే వీవెన్ కు తెలుగు మరిచి పోయి ఏ అస్సామీనో, ఇసుజులూ నో మాత్రమే గుర్తుండేట్లు ఇక్కడ తయారు చేసిన "డింగో మతి"మందు ఇవ్వాలి. ఇంకా ఎవరైనా సహాయపడితే వాళ్ళను కొత్తగా కడుతున్న ఫ్లై ఒవర్ల కింద సమావేశాలు పెట్టుకోమని సలహా ఇవ్వాలి. ఏ ఫ్లై ఓవర్ ఇలాంటి పనులకు ప్రాడక్టివో తెలుసుకోవడానికి సెలక్షన్ అడ్వైసు కోసం సూరీడుని కలవాలి. చదువరి చేసిన తెలుగు బ్లాగు సంఘం రిజిస్ట్రేషన్‌ చెల్లదని సాక్షి పత్రికలో ఒక అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వాలి.

2. బెంగులూరులో ఎప్పుడూ సమావేశాలనే ప్రవీణ్ కు బ్లాగు పుస్తకం రోజుకొకటి రిలీజు చెయ్యాలని ఆదేశాలివ్వాలి. ఆ పనిలో పెడితే గానీ ఈ పని మరిచి పోడు. చెయ్యనంటే ఓ మిలియన్ రోజులు బ్లాగుల నుండి బహిష్కరించాలి. వినకపోతే డా: రాజ్ కుమార్ అభిమాన సంఘ వాళ్ళకు కన్నడ వ్యతిరేకి అని చెప్పి ఫోను చేసి పెట్టెయ్యాలి. ఇంకా వీలయితే హొగెనేకల్ నీళ్ళు కర్నాటక వి కాదు అని కూడా అన్నాడని ఎస్.ఎం.ఎస్. చెయ్యాలి.

3. మద్రాసులో ఇంకెవరన్నా సమావేశాలు నిర్వహిస్తామని ఉత్సాహం చూపిస్తుంటే వాళ్ళు ఎల్.టి.టి.ఈ. తీవ్రవాదులని రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించాలి. ఒక వేళ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి స్నేహితులు అని అనుమానముంటే సి.బి.ఐ. వాళ్ళకు కూడా చెప్పాలి.

4. వైజాగ పట్టణం లో దేవరపల్లి రాజేంద్ర కుమార్ ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడైనా బ్లాగు సమావేశాలు పెట్టే ప్రమాదముంది కాబట్టి, తన మంత్రి పదవి పోవడానికి ఈ రాజేంద్రే కారణమని టి.సుబ్బరామి రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన పూజలోనుండి రాగానే మెళ్ళో రుధ్రాక్షమాల వేసుకొని ఎదురు వెళ్ళి చెప్పాలి.

5. గుజరాత్ నువ్వు సెట్టి బ్రదర్స్ కు పైకెత్తి కట్టిన లుంగీలా కనిపించే షార్ట్స్ తో ఇంట్లోని వార్డ్ రోబ్ నింపెయ్యాలి. దెబ్బకు బ్లాగు సమావేశాలు గుర్తుకు రాకూడదు.

6. పై అయిదు నిర్ణయాలు ప్రతి సమావేశంలోనూ తీసుకోవాలి.

గమనిక: ఈ టపాకి అమెరికాలోని ఇతర బ్లాగర్లకి ఏ మాత్రం సంబంధం లేదని వివరించువాడను. ఇది కేవలం నా బుర్ర లోనుండి పుట్టిందనియూ, మిగిలిన వారెవరూ బాధ్యులు కారు అనియూ చెప్పుచున్న వాడను. తిట్లూ, శాపనార్థాలూ నాకిచ్చి పొగడ్తలూ, పొంగించటాలు మిగిలిన అమెరికా బ్లాగర్లకివ్వాలని ఒకే ఒక కోరిక కోరుచున్న వాడను. చాలా మంది అమెరికా బ్లాగర్లను మరిచిపోయినానని గుర్తొస్తే నా పేరు గజిని అని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పుచున్న వాడను.

ఇట్లు,
విహారి
(ఎలక్ట్రానిక్ చేవ్రాలు)

18 comments:

శరత్ said...

Nice!

వికటకవి said...

చాలా మంది అమెరికా బ్లాగర్లను మరిచిపోయినానని గుర్తొస్తే నా పేరు గజిని :-) అదుర్స్.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

@విహారి: హాహాహా
అయ్యా ఆయనసలే పదవీ వియోగ విరహ తీవ్రతలో ఉన్నారు.మీ సూచన అందుకుని తెలుగులో బ్లాగడం మొదలెడతాడేమో అని భయంగా ఉంది.
ఇప్పటిలో అంటే సుమారు 2012 వరకూ ఇసాపట్నం లో బ్లాగర్ల సమా వేశాలు జరగవని మీకు హామీ ఇస్తున్నా,ఎందుకంటే వాటి నిర్వహణకు నేను తగనని పెద్దలు తేల్చారు.పైగా చంద్రబాబునాయుడి మీకోసం ఎప్పుడు మాఊరొస్తుందా అని వైజాగ్ పొలిమేరల్లోనే ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నా.అలా బిజీ నేను

ప్రవీణ్ గార్లపాటి said...

మీరన్ని తీసుకునే బదులు భారతం వాళ్ళందరూ కలిసి ఒకటే నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో ఉండే తెలుగుబ్లాగర్ల సంఘానికీ, ప్రతీ నెలా సమావేశాలకీ విహారి అధ్యక్షత వహించాలని. :)

యూ ఆర్ బాక్... అండ్ రాకింగ్...

రాధిక said...

బాగున్నాయి నిర్ణయాలు.మరి నిజం సమావేశం ఎప్పుడు?

Budaraju Aswin said...

soooooper

జ్యోతి said...

ఏంటి ఇరగదీసేది?? అందరికి అన్ని పనులు అప్పజెప్పి, నువ్వేం చేస్తావ్? ఇలా మాటలతోకోటలు కట్టడమా? పైగా ఇక్కడ సమావేశాలు చేసుకునేవారికి ఏదో ఒకటి కావలనుకోవడమా? హన్నా!! హై వాళ్లు నెలకోసారి కలుస్తున్నారు, బెంగలూరులో కనీసం మూడునెల్లకోసారి. మరి మీ అమెరికావాళ్లు ఏమ్ చేస్తున్నారు. ఏడాదికోసారా. ఎన్నికలలాగా ఐదేళ్లకోసారా? మీకే పనులు ఉంటాయి.మాకు ఉండవా? ఇలా ఉత్తుత్తి సమావేశాలు కాకుండా, నిజంగా జరపండి. లేకుంటే కూడలి కబుర్లలో ఒక గది అద్దెకు తీసుకుని మీరందరు సమావేసమవ్వండి.

మాకినేని ప్రదీపు said...

విజయవాడ సమావేశం లాంటి పెద్దగీతను మరిచిపోయారు.

cbrao said...

అమెరికా తెలుగు బ్లాగర్ల డేటా సేకరించారా? 19th September 2008 న డెట్రాయిట్ లో అమెరికా తెలుగు బ్లాగర్ల సమావేశం పెడదామా?

నిషిగంధ said...

:))) చెప్పి మరీ ఇరగదీసారు కదండీ!

మనవి ఇండియాలో వాళ్ళ లాగా బస్సులెక్కి, స్కూటర్లెక్కి కలుసుకునే దూరాలు కాదు కాబట్టి కనీసం ఫోన్లో అయినా సమావేశం అవ్వచ్చు ఏమంటారు? ఇక కేవలం మహిళా బ్లాగర్ల సమావేశం అంటే ఇంకా సూపర్.. బోల్డన్ని కబుర్లు (అమ్మలక్కల) చెప్పుకోవచ్చు :-)

Giri said...

:))

Anonymous said...

ఒరేయ్ విహారి ఎదవా,

ఏటనుకున్నావ్ రా బ్లాగర్ల సంఘమంటే? నీగురించి నువ్వు ఎంతన్నా సుత్తి కొట్టుకో. అంతే కానీ ఊరుకోకుండా మిగిలిన బ్లాగర్ల పేర్లు ఇందులోకి లాగి వళ్ళకి పనులు చెబుతున్నట్లు నటిస్తావా? వాళ్ళకు తెలిసిందంటే మీ ఊరుకొస్తారు, మీ ఇంటికొస్తారు, మీ గరాజ్ లోకొస్తారు, మీ బేస్మెంట్ లోకొస్తారు, మీ బ్యాక్ యార్డు లో కొస్తారు ...(వస్తే బ్లాగర్ల మీటింగు పెట్టుకోవచ్చనే వెధవ ఆలొచనలు పెట్టుకోకు) ఇక తరువాత సీను కోసం సమరసింహా రెడ్డి సినిమా క్యాసెట్టేసుకోని చూడు. ఇంకోసారి ఇలా జరిగిందంటే నీ బ్లాగు "బ్లాస్థాపితం" అయిపోతుంది జాగ్రత్త.

-- విహారి ఆత్మ

రానారె said...

ఆజ్ఞ ప్రభూ! యండాకాలం వచ్చేసినట్టుంది కనుక బీచిలో కాకపోయినా, అక్కడినుంచి తెప్పించిన ఇసకలోనే సుగ్రీవాగ్రజసుతక్రీడ మళ్లీ మొదలయింది. కాకపోతే హైకెనిన్ బదులు గ్యాటొరేడు. భామలు బయటనుంచి చూస్తున్నారు, ఆడటం కుదరలేదు - హైహీల్సు వేసుకున్నారుగనుక. :)

Raj said...

నాకు ఉపాధ్యక్ష పదవి ఇప్పించాలి. లేకపోతే నేనే వేరేగా కెనడా తెలుగు బ్లాగర్ల సంఘం పెట్టేసి అధ్యక్షుణ్ణి అవుతా. ;)

ambatisreedhar said...

Very nice discussions.

ambatisreedhar said...

Very nice discussions.

Niranjan Pulipati said...

చాలా బాగుంది.. ప్రతి విషయం తోనూ హాస్యం పండిస్తున్నారు.

Anonymous said...

@ శరత్, శ్రీధర్, గిరి, అశ్విన్‌ , నిరంజన్‌,

ధన్యవాదాలు.

@ వికటకవి,

గజిని బ్యాండ్ ఎయిడ్ అన్నట్టు. ధన్య వాదాలు.

@ రాజేంద్ర,

కొంచెం జాగ్రత్త. మీ ఊరికొచ్చేసరికి మీ ఊర్లో కరంటు వుండదు.

@ ప్రవీణ్,

మేము ప్రజాస్వామ్య వాదులం. మీచే నామినేట్ చెయ్యబడం.:-) ఏఁ నేను సవ్యంగా భారత్ రావడం ఇష్టం లేదా?

ధన్య వాదాలు.

@ రాధిక గారు,

హుమ్‌..ఇప్పుడు మీరే సమావేశం పెట్టేసుకున్నారు నేనేం చెప్పనబ్బా?


@ జ్యోతక్కో,

పైన ప్రవీణ్కు రాసిన సమాధానమే నీకు కూడా.

@ ప్రదీపు,

నేను చేసినది గోఱమైన తప్పు. ఇంత పెద్ద గీతను మరిచిపోయాను. అందుకే గజిని స్టిక్కర్ అతికించుకుంది.

@ రావ్ గారు,

అబ్బే అట్టాంటి పన్లేమీ చెయ్యలేదు. డెట్రాయిట్ లో కొత్తపాళి గారున్నారు కదా పెట్టుకోవచ్చు.

@ నిషిగంధ గారు,

ధన్యవాదాలు.

ఇంకేం చాలా కబుర్లే చెప్పుకున్నారు మొన్న. ఇక అమెరికా మహిళా బ్లాగర్ల సమావేశం రద్దు చేసేశాం.

@ విహారి ఆత్మగా,

ఆ ముక్కేదో ముందే చెప్పి చావొచ్చు గా..క్షమించాలి ఏడవొచ్చుగా..

@ రానారె,

దిగ్విజయోస్తు.

@ రాజ్ గారు,

అన్ని పోస్టులు ఖాళీ మీకు కావాల్సిన పోస్టు తీసుకోవచ్చు.

-- విహారి