Thursday, November 20, 2008

ఎకానమీ సునామీ... దీనిక్కొంచెం మెంటల్.

* * * * * * * *

అన్ని దేశాల ఎకానమీలు సున్నా అయి సున్నకెంత విలువుందో చూపిస్తాం అని సునామీ సృష్టిస్తున్నాయి. దీనికి మెంటలా అంటే అవును. ఓ రోజు తారా జువ్వలా రివ్వున ఎగసి పడుతుంది ఇంకో రోజున తుస్సు తుపాకీ అని పుటుక్కుమని నేల పడుతుంది. అక్టోబరు మొదటి వారం లో రికార్డు స్థాయిలో అమెరికా డౌ జోన్సు ఇండెక్సు 800+ పాయింట్ల పతనం..(చరిత్ర సృష్టించింది) మళ్ళీ వారం తిరక్కుండానే రికార్డు స్థాయిలో 800+ పాయింట్ల వృద్ధి..(మళ్ళీ చరిత్ర సృష్టించింది). సహజంగా ఏ దేశం సంక్షోభంలో పడినా ఆ దేశపు కరెన్సీ చతికిల పడుతుంది.(సోవియట్ రష్యా కింద పడ్డప్పుడు రూబుళ్ళ విలువెంతుందో అందరికీ గుర్తుండే వుంటుంది. రష్యాకు రూబుళ్ళలో మనమివ్వాల్సిన డబ్బు ఏ అయిదో, పదో శాతానికి పడికిపోయింది). కానీ అమెరికా డాలర్ విలువ ప్రపంచం లోని ప్రతి కరెన్సీ తోనూ పెరుగుతోంది. గుడ్డిలో మెల్లంటే ఇదే. మతులు పోతున్న ఈ సమయములో దిగుమతులకు ఊరట. ఖజానా ఖాళీ అయితే ఇదేం ఊరట అంటే అయిసు ముక్క లేకపోయినా అయిసు పుల్ల చీక్కోడం లోని తృప్తి ఇదే. ఇక మన రూపాయి నువ్వెక్కడ అంటే నేను హాఫ్ సెంచురీ నాటవుట్ అంటోంది. జనవరిలో 21,000దాటి చుక్కల్లెక్కేసిన బొంబాయి స్టాకు ఇండెక్సు ఇప్పుడు ఎనిమిది వేల దగ్గర ఎగరలేక పీక్కు పోయిన రెక్కలతో బిక్క చచ్చి పోయింది.

ఈ దెబ్బలకి ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోవడం సంగతేమో గానీ ప్రాడక్టివిటీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రతోడూ పనిచ్చిన పదినిముషాలకు పూర్తి చేసి ఇంకా పనేమన్నా వుందా సార్ అని అడుగుతున్నారు. లేకపోతే ఉద్యోగానికి ఎసరొస్తుందని భయం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు ఎంత బాగా పని చేసినా పింకు స్లిప్పు బారి నుండి తప్పించుకోవడం సులభతరమే కాదు.

ఇప్పటికే భారత్ లో కొన్ని కంపెనీలు కొంత మందిని పిప్ (పర్ఫార్మెన్సు ఇంప్రూవ్మెంట్ ప్లాన్) లో పెట్టాయి.మరి కొంత మందికి శనక్కాయలకు బదులు సున్నలు చేతిలో పెట్టాయి. ఈ కేటగిరీల లో వున్న వాళ్ళ మీద మొదట దెబ్బ పడుతుంది. సాధారణంగా మొదటి దశ పింకు(ఉద్వాసన) స్లిప్పు ఇచ్చే ముందు సరీగా పని చెయ్యక పోవడం, తోటి ఉద్యోగులతో సఖ్యత గా లేకపోవడం, ఇంటర్నెట్ చూడ్డం, పని వేళల్లో కేఫిటేరియాలో చక్కర్లు కొట్టడం లాంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటాయి. ఇందులో ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు కూడా వుంటారు. ఇక రెండో దశ లో ఎవరు మిగతా వారికన్నా తక్కువగా పని చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి వుంటుంది.

ఇప్పుడున్న పరిస్థితులతో ఉద్యోగం కాపాడుకోవాలంటే ఒంట్లోని మత్తును పక్కన పెట్టి ఒళ్ళు వంచి పని చెయ్యడం ఉత్తమం. ఒకప్పుడు "ఆఁ నన్నెవడు పీకుతాడు" అని మీసాలు మెలేసి నిమ్మకాయలు నిలబెట్టిన వీర సామ్రాట్టులు నీరసంతో ఆ నిమ్మకాయలు పిసికి జ్యూసు తాగి ఎక్ స్ట్రా గా పని చేస్తున్నారు పీరియెడ్. ఆఫీసులో బెస్టు ఇంటర్నెట్ యూజర్ అవార్డు రాక ముందే అంతర్జాల సందర్శనం పూర్తిగా ఆపేస్తే మంచిది. దాని బదులు ఆ సమయాన్ని కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కోసం కేటాయిస్తే మరీ మంచిది. ఎందుకంటే గ్రహ చారమో, ఉప గ్రహాచారమో బాలేక ఉద్యోగం ఉష్ కాకయితే బయట ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ. వాళ్ళతో పోటీ పడి కాకిలాగ కావు కావు మంటే వేరే ఉద్యోగాలు రావు. ఓ నెల క్రితం మా కంపీనీ వాళ్ళకు ఒక డి.బి.ఏ. (డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్) కోసం 140 రెస్యూమే లు వచ్చాయి. అంతకు ముందు ఒకటీ అరా కూడా వచ్చేవి కాదు. భారత్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి వుందనుకుంటున్నా.
* * * * * * * *

బాగా పని చేసినా పీకేస్తారు కదా అంటే ఒక్కోసారి నా ఫ్రెండుకు జరిగినట్లు జరగచ్చు. అతను కాలిఫోర్నియాలో పని చేస్తాడు. రెండు రూపాయల పనేదన్నా వుంటే పావలా జీతం తీసుకుంటున్న అతనికి ఇచ్చేవారు. పావలాలు తీసుకుంటూ శనాది వారాలు కూడా పని చేస్తూ వాళ్ళకు చాలా రూపాయలు మిగలబెట్టే వాడు. ఇంత చేసినా పరిస్థితి బాలేదని కంపెనీలో దశల వారీగా పింకు స్లిప్పులు ఇవ్వడం మొదలు పెట్టారు. కంపెనీ వాళ్ళేమో ఉదారంగా, పీకేసిన ప్రతోడికీ సంవత్సరం సర్వీసుకు ఒక నెల జీతం చొప్పున సెవెరన్సు ప్యాకేజీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ లెక్కన మనకూ ఎనిమిది నెలల జీతమొస్తుందని లెక్కలేసుకొని భారత్ కి తిరిగి వెళ్ళి పోదామని సంబరంగా వున్నాడు. తన ఇల్లు అమ్ముకోని భారత్ కు ఓ ట్రిప్పు వెళ్ళి వచ్చాడు. శని గ్రహం దాటొస్తే ఉపగ్రహం తీసుకెళ్ళి దింపొచ్చినట్లు ఓ ప్రమోషనిచ్చి రెండు సెనిక్కాయలు చేతిలో పెట్టి మూట సెనిక్కాయలు ఖర్చయ్యే చోటికి బదిలీ చేస్తామన్నారు. అసలే వున్న సెనిక్కాయలు భారత్ లో ఖర్చు పెట్టుకొచ్చాడు వాళ్ళిచ్చిన రెండు సెనిక్కాయలు ఒద్దని చెప్పేశాడు.పావలాకే బాగా పని చేస్తాడని ఉద్యోగం లో నుంచీ పీకనూ లేదు. ఇప్పుడు ఉప గ్రహాలను చూస్తే పారిపోతున్నాడు.

ఇంత ఎకానమీ తంతున్నా కొంత మంది తమ ఎంజాయ్ మెంట్ లు మాత్రం మానటం లేదు. ఇక్కడ నా ఫ్రెండోళ్ళ ఆఫీసులో ఎవడో వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఆ సాయంత్రం పెద్ద మందు పార్టీ ఇచ్చార్ట ఆఫీసు వాళ్ళందరూ కలిసి. ఇక మీడియా వాళ్ళయితే ఓబామా వైట్ హౌసుకు తీసుకెళ్ళడానికి ఏ కుక్కయితే బావుంటుంది అని కొన్ని కుక్కపిల్లలను సెలక్టు చేసి ఓటింగుకు పెట్టారు. ఈ కుక్క పిల్లల్లో కూడా తక్కువ అలర్జీ వున్న బొచ్చు కుక్క పిల్లల ఫోటోలు పట్టుకొచ్చి పెట్టారు. ఒబామా పిల్లల్లో ఒకరికి అలర్జీలున్నాయట మరి. రా.త.దె.కొ.

ఇంత జరుగుతున్నా షాపింగు చేసే వాళ్ళకోసం థాంక్సు గివింగు బ్లాక్ ఫ్రైడే వస్తోంది.కొనేవాళ్ళు కొంటూనే వుంటారు. ఇప్పుడే చాలా స్టోర్లవాళ్ళు ప్రోత్సాహక బహుమతులు ఇస్తుంటారు. మీరు అమెరికాలో వుండి అలాంటి డీల్సు కోసం ఎదురు చూస్తుంటే నేడే సందర్శించండి డీల్ అంకుల్..డీల్ అంకుల్..డీల్ అంకుల్... దీనికి నీకు ఏమి సంబంధం అంటే నేనే ఆ డీల్సు లోడర్ని, క్లీనర్ని, ఓనర్ని. ఎందుకు మొదలెట్టావ్ అంటే ఉద్యోగం పోతే బ్యాకప్ కోసం. మా ఆఫీసులో రెండు సునామీలు తప్పించుకున్నా ఇప్పటికి. పోయిన్నెల్లోనే ఒకటి జరిగింది. ఇంకోటొస్తే తప్పించుకుంటానో లేదో తెలీదు. అందుకే ఈ డీల్ మావయ్య.. ఇందులోంచి మీరు ఏ స్టోరు లో కొనాలంటే ఆ స్టోరు లింకు మీద నొక్కి ఆ స్టోరు నుండి కొనుగోళ్ళు చెయ్యొచ్చు. పన్లో పనిగా మీ స్నేహితులకు వాళ్ళ స్నేహితులకు కూడా చెప్పండి. హ్యాప్పీ డీల్సూ...

* * * * * * * *


చివరగా నా ప్రశ్న నా సమాధానం:
ప్రశ్న: 2001 లో కూడా ఎకానమీ తన్నింది కదా. అప్పుడు లేనిది ఇప్పుడెందుకంత పరిస్థితి వచ్చింది.
సమాధానం: అప్పుడు వాలు వీధి పెట్టుబడులలో నేను వున్నాను కాబట్టి ఒడ్డున పడింది. ఇప్పుడు నేను లేనుగా.
* * * * * * * *

8 comments:

నాగప్రసాద్ said...

పరిస్థితి చక్కబడే వరకు నేను కూడా ప్రాజెక్ట్ extend చేసుకుని కాలేజి లోనే ఇంకో ఆరు నెలల పాటు స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటే బెటరనుకుంటా. :)

నాగప్రసాద్ said...

మధ్యలో అడ్డంగా ఒక గీత పెట్టారు ఎందుకని?.

లక్ష్మి said...

1. ఇప్పుడున్న పరిస్థితులతో ఉద్యోగం కాపాడుకోవాలంటే ఒంట్లోని మత్తును పక్కన పెట్టి ఒళ్ళు వంచి పని చెయ్యడం ఉత్తమం.

2. ఆఫీసులో బెస్టు ఇంటర్నెట్ యూజర్ అవార్డు రాక ముందే అంతర్జాల సందర్శనం పూర్తిగా ఆపేస్తే మంచిది. దాని బదులు ఆ సమయాన్ని కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కోసం కేటాయిస్తే మరీ మంచిది.
Thanks for those messages

శ్రీనివాస్ పప్పు said...

చేతులు కాలాక ఆకులు పట్టుకోడం అంటే ఇదేనా?

దేవన said...

టైటిల్ అదిరింది.

కొత్త పాళీ said...

మీదైన సటైల్లో ఘుమాయించారు. పోలికలు బ్రహ్మాండం.
కానీ ఒకటి. పని శ్రద్ధగా చేసుకోడం, నకరాలెయ్యక పోడం లాంటివి ఆచరణీయాలే .. సందేహం లేదు. కానీ, ఒకవేళ ఆ పింకుస్లిప్పు గానీ ఖర్మకాలి చేతబడితే, అదే మన వేల్యూ, కంపెనీ దృష్టిలో మనకి విలువలేదు అనే లాంటి దిగదుడుపు ఆలోచనలఓ దిగజారి పోకండి.

రానారె said...

వేటూరి తయారుచేసిన పదం - వయస్సునామీ.
విహారి తయారీ - ఎకాన మీ సునామీ.
సాక్షి తాజాతయారీ - సుమానీ ;-)

phani said...

ఇటువంటి సమస్యలుంటాయనే నేను సాఫ్ట్ వేర్ చదువు,కొలువు వద్దనుకున్న్నా.అయ్యేయస్,అయిపియస్ లాంటివి కాకుండా నా లాంటి చిరుద్యోగులకు ఏ బాధ లేదు.