Friday, March 30, 2007

ధ.దే.ఈ.శు. -- జోకు

టీచర్: ఒరేయ్ రామూ ఉన్నట్టుండి దేవుడు ప్రత్యక్షమై "నీకు ఏం కావాలో కోరుకో" అంటే నువ్వేమడుగుతావ్?

రాము: నాకు పది కోట్లు కావాలని అడుగుతా మాస్టారూ.

టీచర్: అదే నేనయితే ఏమి కోరుకుంటానో తెలుసా? మంచి బుద్ది ప్రసాదించమని కోరుకుంటా

రాము: అంతేలే మాస్టారూ ఎవరికి ఏది లేక పోతే దాన్ని కోరుకుంటారు.

టీచర్ : ? ? ?

Thursday, March 29, 2007

డబ్బు సంపాదించడం ఎలా....ఇలా

ఇరవై ఏడేళ్ళ యువకుడు జమైకా బీచ్ లో సంతోషంగా మార్గరీటా తాగుతూ తన పక్క నున్న అమ్మాయి అందాలను తనివి తీరా చూసుకుంటూ ఉల్లాసంగా మాట్లాడుతున్నాడు. అక్కడి రిసార్ట్ కు విచ్చేసిన అతిధులందరిలోనూ ఎక్కువ టిప్ ఇచ్చే వారెవరైనా వున్నారంటే అతనే. అతని పేరే విజయ్ వల్లభ్. ఆంధ్ర దేశంలో పుట్టిన వాడు. తన కున్న ఇంగ్లీషు పరిజ్ఞానంతో అక్కడ వున్న అందరిని బొల్తా కొట్టించేస్తున్నాడు. ఆ రిసార్ట్ లో పని చేసే యువతులందరూ అతనికి సపర్యలు చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు అతనితో చనువుగా మెలుగుదామా అని పరితపించి పోతున్నారు.

సాయంత్రమయిన తరువాత ఒక యువతి ఒయ్యారాలు ఒలక బోసుకుంటూ ఇంకో పెగ్గు మార్గరీటా అతని గ్లాసులో పోసి అతను ఎలాంటివాడో ఎంత సంపన్నుడో కనుక్కోవాలని ప్రయత్నం మొదలు పెట్టింది.

"హాయ్ స్వీటీ, మే ఐ నొ యువర్ హాబీస్" అంది.
"ఐ లైక్ టూ బీ స్మార్ట అండ్ విన్ ఎవ్రీవన్" అన్నాడు విజయ్.
"ఓ నాటీ! ఐ వుడ్ లైక్ టూ నొ యువర్ బ్యాక్ గ్రవుండ్ ప్లీజ్" అంది మత్తు కళ్ళతో ఇంకో గ్లాసు మందు అతని నోట్లో పోస్తూ.

అప్పటికే మైకం లో వున్న ఆ యువకుడు చెప్పడం మొదలు పెట్టాడు.


** ** **

నేనొక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వాడిని. అందరిలాగే ఎన్నో ఆశలతో చదువుకోవాలి ప్రయత్నించాను. తెలివి తేటలు ఎన్ని వున్నా కొన్ని సామాజిక పరిస్థితులవల్ల నా చదువు డిగ్రీ మధ్యలో ఆగిపోయింది. అప్పుడే ఒక ధనవంతుల ఇంట్లో పని చెయ్యడానికి అవకాశం వచ్చింది. ఆ ఇంట్లో నేను ఒక పని మనిషి, డ్రైవరూ తప్ప ఎవరూ వుండే వాళ్ళు కాదు. అప్పుడప్పుడూ పార్టీలు జరిగినప్పుడు వుండే సందడి తప్ప మిగతా సమయాల్లో ఎవరూ వుండేవాళ్ళు కాదు. ఆ ఇంట్లో యజమానికి అన్ని ఆధునిక వసతులూ వుండేటివి. ఎవ్వరూ లేక పోవడం వలన నాకు అక్కడ వున్న కప్యూటరే మంచి స్నేహితుడయింది. రోజూ దాని ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాను.

ఇంటెర్నెట్ చాట్ ద్వారా ఎంతో మంది తో పరిచయం ఏర్పడింది. సరిహద్దులు చెరిగి పోయాయి. భాషలు అడ్డు రాలేక పోయాయి. అంతా గ్లోబలైజేషన్ మహిమ. ఇలాంటి పరిస్తితులలో మొదలైంది రియల్ ఎస్టేట్ హవా. ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఆకాశాన్నంటిన భూముల ధరల గురించి మాట్లాడుకోవటం మొదలయింది. పట్టుమని పది వేలు కూడా లేని ఎకరం భూమి రాత్రికి రాత్రే కోట్లలో పలకడం సర్వ సాధారణమయి పోయింది. ఇలాంటి పరిస్తితులను నాకనుకూలంగా మార్చుకోవాలని నేను, చాట్ల ద్వార పరిచయమయిన ఇతర యువకులతో కలిసి ఒక పకడ్బందీ వ్యూహాన్ని తయారు చేశా. తలా కొంత డబ్బు సేకరించి ఒక అంతర్జాతీయ బిజినెస్ సంస్థ ను నెలకొల్పాను. దానికి కావాల్సిన ఏర్పాట్లనీ ఇండియాలో నేనే చూసుకున్నాను. హవాలా ద్వారా డబ్బులు ఇండియాకు చేరాయి.

పథకం ప్రకారం తరువాత చెయ్యవలసిన పనులు ఇక్కడి రాజకీయనాయకులతో పరిచయం పెంచుకోవడం. ఆ పని చెయ్యడానికీ, రిజిస్టరు చేసిన సంస్థకు పబ్లిసిటీ ఇవ్వడానికీ మంచి సహకారం లభించింది. ఇండియాలో కాస్త అభివృద్ది చెందుతున్న పట్టణాలను, నగరాలను ఎంచుకుని ఆ చుట్టుపక్కల వున్న భూములనన్నింటిని తక్కువ ధరలకు బినామీ పేర్లతో కొనుగోలు చేసి రిజిస్టర్ చేసేశాను.

తరువాత మొదలయింది జగన్నాటకం. ఓ మాంచి ముహూర్థం చూసుకుని జర్మనీ నుండి జర్మన్ లు నలుగురు, జపాన్ నుండి జపనీయులు ముగ్గురు, స్విట్జర్ల్యాండ్ నుండి ముగ్గురు, అలా ప్రతి దేశం నుండి కొంత మంది విజిటర్ వీసాల మీద ఒక్కో వారం గ్యాప్ తో ఇండియాకు వచ్చారు. రోజూ వారి అద్దె తో ఒక హెలికాప్టర్ మాట్లాడుకున్నాము. ఒక్కో దేశం వారు ఇండియాలో దిగగానే వారు చెయ్యవలసిన పనల్లా కోట్లూ సూట్లు వేసుకుని వాళ్ళ దేశాల్లోని ప్రముఖ కంపెనీల లోగోలు పెట్టుకొని హెలికాప్టర్ లో అంతకు ముందే మేము కొన్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి వాళ్ళ బాషలో ఏదో రీసెర్చ్ చేస్తున్నట్టు మాట్లాడుకోవడమే.

అది చూసిన ఆ అమాయక జనాలు అక్కడ ఎదో పెద్ద కంపెనీ పెడుతున్నట్టు భ్రమపడి పోయేవాళ్ళు. వాటిని బల పరచడానికి ఆ రెండో రోజే కొన్ని ప్రభుత్వ వాహనాల్లో అంటే అంబాసిడర్ కారూ, మారుతీ జీప్ లో అక్కడ పని చేసే రెవెన్యూ సిబ్బందిని తీసుకెళ్ళి వాళ్ళ చేత ఆ చెట్లూ పుట్లను పరిశీలింపచేసి పెద్ద మందు పార్టీ ఇచ్చేవాడిని. ఇది చాలు అక్కడి వాళ్ళకు ఏదో జరిగిపోతుందన్న భావన కలిగించడానికి. ఒక దేశం వాళ్ళు వచ్చి వెళ్ళిన తరువాత ఇంకో దేశం వాళ్ళు హెలికాప్టర్ లో అక్కడికి వెళ్ళి భూముల్ని కొండల్ని కొలిచేవాళ్ళు.

ఓ వారం తిరిగేసరికి ఆ చుట్టు పక్కల భూములు రెండు మూడు వందల రెట్లు పెరిగిపోయేవి. నేను కొన్న భూములను ఆ మాయ ధరలకు అమ్మేసి చేతులు దులుపేసుకునేవాడిని.ఒక్కో చోట పెట్టిన ముప్పై నలభై లక్షల ఖర్చుకు కొన్ని కోట్లు వచ్చేవి. అలా కనీసం ఇరవై చోట్ల సృష్టించిన కృత్రిమ డిమాండ్ల తో నా బ్యాంక్ ఖాతాలు కొన్ని వందల కోట్లు చేరుకున్నాయి. ఇప్పుడు నాకున్న డబ్బుతో ఇండియాలో వున్న అధికారులను, మంత్రులను నా గుప్పిట్లో వుంచుకున్నా. నేను చేసింది తప్పు అని నిరూపించడానికి ఎవరి దగ్గరా ఏ ఆధారాలు లేవు.

** **

"ఓహ్ స్వీటీ! అంత డబ్బు పెట్టుకుని ఏ స్విట్జర్ల్యాండో పోకుండా ఇక్కడికెందుకొచ్చావ్"" అంది బుగ్గలతో అతని బుగ్గలు నొక్కుతూ.

"ఇక్కడ ఎదో సరదాగ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ చూసి ఓ నలభై రోజులు గడిపి వెళ్దామనుకున్నా. కానీ మా 'టీం ఇండియా ' ఇలా 'డాం ఇండియా ' అవుతుందని ఊహించ లేక పోయా. ఇలా అవుతుందని ముందే వూహించి వుంటే ఓ ఇరవై కోట్లు పడేసి ఏ బాంగ్లా దేశ్ నో శ్రీ లంకనో కొని పడేసి వుండేవాడిని. ఎంతయినా నాక్కూడా కొంచెం దేశ భక్తి వుంది" అన్నాడు విజయ్.

"ఓ యువ్ ఆర్ సొ పేట్రియటిక్, ఐ లవ్ యూ" అంటూ అతన్ని హత్తుకు పోయింది.

Tuesday, March 20, 2007

టెలీఫోను వాయిస్ మెసేజ్ ఎలా పెట్టాలంటే..

ఎవరో అన్నట్టు 'నవ్యత జీవితానికి సుగంధం వంటిది'( "variety is the spice of life" ని కొంచెం మార్చా) అని. నేను ఇలాంటి వెరైటీ పన్లు చాలా నే చేశేవాడిని కాలేజీ రోజుల నుండి. అమెరికా వచ్చిన కొత్తలో చూశా ఎవరి ఇంటికి ఫోను చేసినా వాళ్ళు లేనప్పుడు వచ్చే ఫోను మెస్సేజ్ సాధారణంగా "నేను లేను నీ మెసేజ్ పెట్టు" అనో, "అడ్డడ్డే నేను మిస్సయిపోయా నీ ఫోను...నీ మెసేజ్ పెట్టు", "ఫోను చేసినందుకు ఏడిసాం(సంతోషం) నువ్వు నీ పేరు చెప్పుకొని నీ ఫోన్ నంబరు ఇచ్చుకో" అనో లేదా "నీ ఫోన్ నంబరు చెప్పు" అనో వుండేటివి. అవన్నీ చూసి విసిగి పోయి నేను సెపరేటు గా రూము తీసుకున్నప్పుడు నా ఫోనులో ఇలా మెసేజ్ పెట్టా.

"Welcome to the kingdom of bhoopathi vihaari. The king is on move. please leave your name and number. King will return your call as soon as he reaches his fort"

ఈ మెసేజ్ చూసిన/విన్న వాళ్ళలో నవ్వని వాళ్ళుంటే ఒట్టు. కొంత మందయితే నవ్వుతూ అసలు విషయం మరిచి పోయి మళ్ళీ ఫోను చేసి మెసేజ్ పెట్టేవాళ్ళు. ఇంకొందరయితే నేను ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఇంటికి ఫోను చేసి ఆ పక్కనున్న వాళ్ళకు వినిపించే వాళ్ళు.

"మడిశన్నాక కూసింత కళాపోసన వుండాల.."

ఓ రెండేళ్ళకు ఆ మెసేజ్ మారిపోయింది మా ఆవిడ రంగప్రవేశం చేశాక.

Thursday, March 15, 2007

ధ.దే.ఈ.శు. మా పండు గాడి జోకు

చాలా కాలమయింది అని ఓ రోజు మా వాడికి తెలుగు అక్షరాలు దిద్దిద్ధామని వాడిని పిలిచి చెప్పా.

“పండూ, ఓ సారి లాఫ్ట్లో కెళ్ళి రైటింగ్ ప్యాడ్ తీసుకురా నీకు తెలుగు అక్షరాలు నేర్పిస్తా” అని.
వాడు ఎంతకీ వెళ్ళకుండా అక్కడే వుండి ఆడుకుంటున్నాడు. మరో సారి వాడిని పిలిచి గట్టిగా అడిగా
“ఎందుకురా వెళ్ళలేదు” అని.
దానికి వాడు “మై లెగ్ ఈజ్ థింకింగ్ అండ్ ఇట్ డిడ్ నాట్ టెల్ మీ టు గో” అన్నాడు.
అంటే వాడి ఉద్ధేశ్యం ఇంకా ఆలోచిస్తున్నా అని.
“అలా కాదు నాన్నా, థింకింగ్ చేసేది లెగ్ కాదు హెడ్డు” అని చెప్పా.
వాడు సరే అని బుర్రూపాడు గోడ గడియారం లో గంట లాగా.

ఇంకో రోజు అడిగా “నాన్నా! వెళ్ళి నీ రైటింగ్ బోర్డ్ తీసుకొని రా” అని.
వాడు వినిపించికొని కూడా వెళ్ళ లేదు.ఈ దేశంలో మనం ఇరగ దీసే సీను లేదు.
భారత్ లో అయితే వంశ పారం పర్యంగా కొడుకులు నాన్నల చేత తన్నించుకుంటారు.దానికి
ఇక్కడ పులుస్టాప్ పెడతాం. సరే అని దగ్గరకు పిలిచి అడిగా
“ఏంటి సంగతి ఎందుకు వెళ్ళలేదు” అని. దానికి సమాధానం.
“నాన్నా! మై హెడ్ ఈజ్ స్టిల్ థింకింగ్ అండ్ ఇట్ డిడ్ నాట్ టాక్ టు మై లెగ్ ఎట్”.

తెలుగు నాన్న బోల్తా పడ్డాడు.

Monday, March 12, 2007

క్రికెట్ గళ్ళ పట్టీ

తాకేసింది...తాకేసింది అందర్ని తాకేసింది.
వచ్చేసింది... వచ్చేసింది అందరికి వచ్చేసింది.

దాని పేరు క్రికెట్ జ్వరమంట.

కొన్ని లక్షల పని గంటల్ని తుంగలో తొక్కడానికి తెర లేచింది. ఏ ఇద్దరు దేశీ లను చూసినా ఇదే మాట. ఎక్కడెక్కడ్నుండో మొదలయి క్రికెట్ తోనే అంతమయ్యే సంభాషణలు. దానికి తోడు మా ఆఫీసులో దాని మీద "పూల్" పందేలు. అదెలాగంటే...

"పూల్" లో కెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఓ అయిదు రూపాయలివ్వాలి అదే అయిదు డాలర్లు లెండి, మన భాషలో అలానే నన్నమాట. అయిదు క్షవరం అయ్యాక ఓ గళ్ళ పట్టె కాగితం అంటే "ఎక్సెల్ షీట్" ఇస్తారు అందులో ఈ ప్రపంచ కప్పులో పాల్గొనే పదహారు దేశాల పేర్లుంటాయి.వాళ్ళ లో ఎవరు ఏ దశకు పోతారో ముందుగానే మనం మాయదర్పణం లో చూసినట్టు చెప్పెయ్యాలి. చూట్టం తెలీక పోతే ఇంటెర్నెట్ లోకెళ్ళి చూసి తెలుసుకోవాలి. అందులోని దశలు ఈ విధంగా వుంటాయి.


1."అష్ట దిగ్గజాలు" దశ (Super 8)
2."అర్ధ దిగ్గజాలు" దశ (Semi-Finals)
3."దిగ్గజాలు" దశ (Finals)
4."అసలు దిగ్గజం" దశ(Winner)


ముందుగానే ఇవన్నీ గళ్ళ పట్టీలో మనకన్నా తక్కువ పని వున్న లేదా ఏ పని లేని వాడో పెట్టేసి వుంటాడన్నమాట. ఆ పెట్టినోడి కన్నా కాస్త పని వున్న పని(కిరాని)మంతులు (నాలాంటోళ్ళు) వాటి పేర్ల కెదురుగా దేశాల పేర్లను రాసుకుంటూ పోవాలి.

మనకు కొద్దిగా నచ్చని వాటి పేర్లను "దిగ్గజాలు" కిందా.
ఇంకొంచెం ఎక్కువ నచ్చని దేశాలను "అర్ధ దిగ్గజాలు" కింద,
ఇంకాస్త నచ్చని వాటిని "అష్ట దిగ్గజాలు" కిందా రాసేస్తామన్నమాట.


మనం ఎప్పుడూ పనీ పాటా లేకుండా మాట్లాడుకొనే జట్టు పేరు "అసలు దిగ్గజం" కింద రాసేస్తామన్నమాట.

అలా అన్ని చోట్లా రాసేసి ఆ పెద్ద "పనిమంతుడి" కి ఇచ్చెయ్యాలి. అలా ఇవ్వడానికి ఈ రోజే చివరి రోజని ఆ మధ్యెప్పుడో ఏమీ పన్లేనప్పుడు వచ్చి అయిదు రూపాయలు తీసుకొని మరీ చెప్పి వెళ్ళాడు. అలా అందరి డబ్బులూ జేబులో పెట్టుకుని జేబు వుబ్బుగా అయిపోయిన తరువాత వెళ్ళిపోయాడ్లే. అప్పివ్వమంటే "అప్పు గిప్పు జాంతానే" అన్నాడు. ఆ డబ్బులు గుడ్లూ...పిల్లలూ లాంటి వేమీ పెట్టవంట.


ఈ ఆట చాలా తెలివిగా వుంటుంది. క్రికెట్టు అనుకుంటే మీరు అట్టు మీద చెయ్యెట్టి నట్టే. ఆ డబ్బులు ఆట అన్న మాట. మీరు సూచించిన జట్టు అదే మీకు నచ్చినట్టు అనిపించే జట్టు ఒక్కో దశకు వెళ్ళినప్పుడు ఆ దశను పట్టి మీకు బోల్డన్ని పాయింట్లు వచ్చేస్తాయి. మీరు గారెల బుట్ట దగ్గర నిల్చున్నప్పుడు ఎవరైనా మిమ్మలని గట్టి గా తన్నేస్తే మీకు అన్ని పాయింట్లూ వచ్చేసి ఆ డబ్బులన్నీ మీ జేబులో కొచ్చేసి జేబు ఉబ్బుగా అయిపోతుందన్నమాట. నాకు ఎప్పుడూ తన్నే అలవాటే కానీ తన్నించుకునే అలవాటు లేదు కాబట్టి నేను గారెల బుట్టకు దూరంగా నిలబడి ఎవరైనా నిలబడతారేమో తందామని "ఆస్ట్రేలియా" అనే జట్టుకు "దిగ్గజం" తిలకం దిద్దేసి వెనక్కెళ్ళి నిలుచున్నా.

నా "గళ్ళ పట్టీ" ఇలాగుంది.

1."అష్ట దిగ్గజాలు" దశ,

ఇండియా, వెస్టిండీస్,సౌ.ఆ.,ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, పాక్, న్యూజిల్యాండ్.

2."అర్ధ దిగ్గజాలు" దశ,

ఇండియా, సౌ.ఆ.,ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్

3."దిగ్గజాలు" దశ

ఇండియా, ఆస్ట్రేలియా.

4."అసలు దిగ్గజం" దశ.

ఆస్ట్రేలియా


గమనిక: నా అంచనా తప్పు కావాలని అందరూ దీవించండి. అంటే ఇండియా కప్పు కొట్టాలన్న మాట. అలా కప్పు కొడితే మీకందరికి తలో సాసరు బహుమతి ఇస్తా.


క్రికెట్ విహారి

...

Friday, March 09, 2007

ధ.దే.ఈ.శు. జోకు

ఒక ఇంట్లో రిటైరయిపోయిన ముసలావిడ, ముసలాయన మాట్లాడుకుంటున్నారు.
వాళ్ళ చర్చ ఆధ్యాత్మిక విషయాల మీదికి మళ్ళింది.

ముసలమ్మ : ఏమిటో దేవుడు వున్నాడో లేదో తెలీదు. వుంటే మనకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు.
ముసలాయన: లేదు దేవుడు తప్పకుండా వున్నాడు.

ముసలమ్మ : వుంటే నువ్వు చూశావా?
ముసలాయన: చూడలేదు కానీ నాకు రోజు సహాయం చేస్తుంటాడు.

ముసలమ్మ : నువ్వు చూడకుండా నీకు సహాయం చేస్తున్నాడా? అదెలాగా?
ముసలాయన: నేను రాత్రిళ్ళు లేచి బాత్రూముకు వెళ్ళేటప్పుడు ఆ చీకట్లో నాకోసం తలుపు తెరవగానే లైట్ వేస్తున్నాడు.

ముసలమ్మ : అంటే ఇన్నాళ్ళూ మన ఫ్రిజ్ లో బాత్రూం పోస్తోంది మీరన్నమాట. నేను ఆ ఫ్రిజ్ కడుక్కోలేక చస్తున్నా. వుండండి మీ సంగతి చెబుతా.
ముసలాయన: ???

Thursday, March 08, 2007

బ్లాగు అవిడియాలు

బ్లాగులో ఏమైనా రాద్దామని ఎప్పుడు మొదలు పెట్టినా నేననుకున్న విషయం మీద ఎవరో ఒకరు వాళ్ళ బ్లాగుల్లో రాసేస్తున్నారు. అదేం చోద్యమో?(బుగ్గలు నొక్కునున్నా..) అందరికీ నా బుర్రలో వున్న విషయాలు ఎలా తెలుస్తున్నాయో? నేను కొంచెం తెరిచిన బుర్ర టైపు(open minded) అయినంత మాత్రాన అందరూ నా బుర్ర లో చిన్న 'పిప్పెట్టు ' పరికరాన్ని వుంచి కొంచెం కొంచెం తీసుకెళ్ళి పోవడమేనా? ఇది చానా అన్యాయం అంతే కాకుండా అందరూ ఆగ్రహించాల్సిన సమయం. బ్లాగ్జనులందరూ ఒక్క చోట చేరి ఆలోచించాల్సిన సమయమిది.

చూడండి నా బుర్రలో వచ్చిన కొన్ని ఆలోచనలు మచ్చుకు ఇక్కడ విశదీకరిస్తున్నాను. ఇవన్నీ ఎలా కాపీ చేయబడ్డాయో కూడా చూడండి.

రోజూ మా బుడ్డోడు స్కూలు కెళ్తాడు దాని మీద రాద్దామని మొదలుపెట్టా. కానీ అంతలో "శ్రీ కృష్ణ దేవరాయలు" గారు "పొద్దున బడికి ఎలా వెళ్ళాలి" అని ఒక టపా రాసేశారు. సరేలే ఒకరికొచ్చిన ఆలొచనలు ఇంకొకరికి ఎందుకు రాకూడదు అని సరిపెట్టుకొని పిల్లలు ఎలా వుంటారు వాళ్ళని ఎలా సరిదిద్దాలి అని రాద్దామని మొదలుపెడుతున్నా. అంతలోనే దానిమీద కూడా మ్యూసింగ్స్ లో "Management lessons" అంటూ ఒక టపా వచ్చేసింది. ఏం చెద్దామబ్బా అనుకుంటూ ఒక డైట్ కోక్ పట్టుకుని ఆలోచిస్తూ వుంటే, అసలు ఈ డైట్ కోక్ మీదనే ఒక వ్యాసం ఎందుకు రాయకూడదు అనుకుని బుర్రకు కీ ఇచ్చా. అదే కాస్త పవర్ రావడానికి వెనకటి కాలంలో గ్రాంఫోన్ రికార్డులకు వున్నట్టు నా చెవికి ఒకతిప్పే హ్యాండిల్ వుంది. దాన్ని పట్టుకుని రెండు రౌండ్లేశా. ఇక బుర్ర లోకి లెక్కకు మిక్కిలిగా దాని చరిత్ర వచ్చి పడింది. దాన్ని ఏరుకుని, కూర్చుకుని అటు చూసే సరికి ఏముంది Japes ద్వారా బయటకు వచ్చేసింది. ఇది మాయో,బ్రమో అనుకుంటూ వుంటే "ఆర్థిక మర్మ" చిదంబరం గారు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇంకేం నా బ్యాంక్ బ్యాలన్స్ తో సహా టపా ఊపెయ్యోచ్చు అనుకొని కీబోర్డు నొక్కే ముందు కూడలి లో refresh కొట్టా. జాతీయ వాది అంబానాథ్ గారి టపా నన్ను చూసి ఇక "నువ్వు టపా రాసినట్టే! వెళ్ళి కాసేపు లెక్కలు నేర్చుకొని రాపో భడవా" అంది.

ఇలా కాదని ఇంట్లో పైకొకసారి కిందకొకసారి పరిగెత్తి (డాక్తర్ చెప్పాడ్లే ఇలా పరుగులు పెట్టకపోతే నూవు తొందరగా పైకి పరుగులు పెడతావ్ అని) తరువాత బయటకు వెళ్ళి నిచ్చెన ఎక్కి దిగి ఇంట్లో కొచ్చీ రాగానే బుర్రలోకి ఎస్.ఎం.ఎస్ వచ్చింది. "అవును నీ ఉద్యోగానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి కదా..కొత్త ఉద్యోగం చూసుకోవాలి చూసుకున్న తరువాత మారేటప్పుడు ఎలా మాట్లాడాలి అనే దాని మీద రాయవో!" అని.

మంచి మేత అని దూరేలోపు "కంపెనీ మారేప్పుడు" అని ఇంకో టపా కూడల్లో. ఇలా కాదు కంటికి ఏది కనిపిస్తే దాని మీద రాసెయ్యాలి అని ఇల్లంతా చూస్తున్నా.బుడ్డోడు బుద్ధిగా రంగులేస్తున్నాడు వాడి దగ్గరున్న కాగితం మీద. ఈ సారి దీనిమీద "రంగు పడుద్ది" అనే హెడ్డింగ్ తో కాలేజీ లో హోళీ చేసిన కేళీ విలాసం అని రాసే లోపు "శొధన" లోనుండి "నీ కన్నా ముందు నేను నీకు రంగేశా నల్లగా..నీ ముఖం ఎర్రగా!!" అని వినిపించింది.

ఈ బ్లాగులోళ్ళు నన్ను నిద్ర పోనివ్వట్లేదు కదా అదే టైపులో "కాలాన్ని నిద్ర పోనివ్వను" అనే పేరుతో కనీసం ఒక కవితన్నా రాద్దామని కూడలిని refresh చేసా. ఏమీ కనిపించలా...ఆహా నేను అనుకున్నది ఇంకా ఎవ్వరూ అనుకోలా..ఇక నేను ప్రవహించనా వరదలా అని ఎందుకైనా మంచిది అని తేనె గూడుని refresh చేశా. అర్జంటుగా వెళ్ళాసిన చోటుకి వెళ్ళేటప్పుడు లాస్టు బస్సు ను క్యాన్సిల్ చేశాం అన్న వార్త విన్నట్టు అదే పేరు..కాకపోతే బ్లాగులో కాదు. పొద్దులో స్వాతి గారు రాసిన సమీక్ష. ఆచార్య ఎన్. గోపి రాసిన "కాలాన్ని నిద్ర పోనివ్వను" అనే కవితా సంపుటి మీద.


వెధవ బతుకు వెధవ జన్మ కనీసం మరుసటి జన్మ లో...మరుసటి జన్మలో...అవుడియా. పునర్జన్మ మీద ఓ కవిత. "పునర్జన్మా..పుటుక్..పుటుక్. పునర్జన్మా..లటుక్..లటుక్" అని రాసి నా బ్లాగులో పెట్టేముందు చూస్తే "సాల భంజికలు" కింద "పునర్జన్మ" ప్రత్యక్షం. నాగ రాజు గారు అసలే సాహిత్యం లో కొట్టిన పిండి. నేను పోటీ గా రాస్తే నా పరిస్తితి...గుటుక్..గుటుక్.

అన్నీ మానేసి కాసేపు క్రీడా వార్త ల్లోకి వెళితే ఎక్కడ చూసినా క్రికెట్ గొడవే. ఎవడు పడితే వాడు నేను ఆ కప్పులో ఇలా ఆడా...ఈ కప్పులో ఇలా ఎందుకు ఆడలేక పోయా..వాడెందుకు బాలు ఒదిలేశాడు...వీడెందుకు బ్యాటు పడేశాడు అనే వాటి మీద వార్తలు కోకొల్లాలు. వీళ్ళకే ఇంత వుంటే సొంత బ్లాగున్న నాకు అంతా లేదా అని చెవి హ్యాండిల్ రెండు సార్లు తిప్పా. నా హైస్కూల్ క్రికెట్ గుర్తొచ్చింది. ఇంకో రెండు సార్లు హ్యాండిల్ పట్టుకుని రయ్..రయ్ మని రౌండ్లేశా. ఎదురింటి సీని గాడు బాలు వేస్తే నేను బ్యాటు తో వాడి ముక్కు మీద సిక్సర్ కొట్టిన విషయం గుర్తొచ్చింది. వాడి ముక్కు మీద ఇప్పటికీ వున్న నా సింగిల్ వికెట్ Trademark గుర్తొచ్చింది.

ఇంకేం అవన్నీ రాసేస్తే ఓ ఇరవై టపా లవుతాయి అందునా మన తెలుగు బ్లాగులోళ్ళకు క్రికెట్ పిచ్చి తక్కువ కదా అని సంబరపడి "ఇక నన్నెవ్వరూ ఆపలేరు".." సీతయ్యకు మూడొచ్చింది" అని పైకొకసారి ఎగిరి "నాకు డబుల్ స్ట్రాంగ్ కాఫీ" అని మా ఆవిడకు వినిపించేట్టు అరిచా. దానికి ఆవిడిచ్చిన చూపు చూసి " నీ క్కూడ కావాలా మేడం" అని సర్దేసి నేనే వెళ్ళి ఓ పేద్ద అరకప్పు కాఫీ చేసుకొచ్చి ఎర్రగా మారిన చెవిని మరో సారి మెలేసి బుర్రిత్ర (బుర్ర లోని చరిత్ర) లో నుండి బయట పడ్డ కళా ఖండాల్నిఒక దాని పక్కన ఒకటి పెట్టి రాస్తుండగా పడింది అణు బాంబు. "నా క్రికెటింగ్ కేరీర్" అని ప్రవీణ్ నుంచి. ఇక నా టైటిల్ " నా క్రికెట్ బేర్..బేర్..నా అవిడియాలు తుర్..తుర్.."

ఇలా కాదని మా ఆవిడకు చెప్పా నువ్వు "రొయ్యల వేపుడు బాగానే చేస్తావ్ కాదా. దాని విధానం చెప్పెయ్.. నీ పేరు పెద్ద పెద్ద అక్షారాలతో పెడతా" అని. (పేరుకు పెద్ద అక్షరాలు అంటే అందులో నా పేరు వుంటుంది కదా అవి మాత్రమే పెద్ద అక్షరాలన్న మాట..మిగతావి చాలా చిన్నవి అంటే అదేదో డిటర్జెంట్ కపెనీ వాళ్ళు చెప్పినంతన్నమాట). పాపం శ్రీమతి విహారి చెప్పినంత సేపు నిలవలేదు ఆనందం. ఇంకేం మీరందరూ వూహించిందే..."రొయ్యల చుక్క కూర..రొయ్యల టమాటో కూర" బ్లాగులో విడతలు విడతలు గా ప్రత్యక్షం. ఇందులో పేరు చెప్పాల్సిన పని లేదు చెప్పాలొస్తే 500 సార్లు చెప్పాలి అందుకని నేను చెప్పను.

ఇక అన్నీ పక్కన పెట్టి టీ.వి. చూస్తుంటే ఆకలేసింది. నూడుల్స్ తినాలనిపిస్తే "ఓ ప్లేట్ నూడుల్స్" అని ఆర్డరేసి వంట గదిలోకెళ్ళి నేనే తయారు చేసుకొచ్చి (ఎందుకో ఈ పాటికి అర్థమయ్యుంటుంది..కాకపోతే మళ్ళీ మెదటి నుండి చదవండి) దాన్ని ఓ గుంత గిన్నెలో వేసి ఫోర్క్ కూడ తోడుగా పెట్టి సోఫాలో చార్గిలపడి తింటుంటే ఫొర్కు నోట్లో గుచ్చుకుంది. చెవి హ్యాండిల్ తిప్పకుండానే ఈ సారి ఓ మాంచి సృజనాత్మక అవిడియా....ఫోర్క్ మీద ఓ టపా!!! ఫోర్కు స్పూను ఓ ప్రేమ జంట...దాని అవినాభావ సంబందం.. ఇంతవరకు ఎవ్వరూ తాకని విషయం. ఎడమ చెవి గిర్రుమని తిరిగి కుడి చెయ్యిని కూడలి లోకి పోనిచ్చింది. నా లాప్టాప్ మీద లేజెర్ షో "దరిద్రుడు స్నానానికెళితే వడగళ్ళ వాన" ఓ రెండు క్షణాలు కనిపించి మాయమయి పోయి దాని వెనక "హరివిల్లు" లో ఫొర్కు..దాని పెళ్ళాం స్పూను మీద ఓ వేడుక. నా మెదడులోనుండి ఇంకో లేజర్ షో "ఇక నువ్వు బ్లాగులు రాయడం ఆపెయ్..చదవడం మాత్రం చెయ్".

నేనొదల్తానా అంత తేలిగ్గా.. ఇవాళ ఏదో ఒకటి రాసెయ్యాలి ఇది నా ప్రతిభ కు మరియు వెనక్కు పోని ధీరత్వానికి పరీక్ష. అంటే ఏదో ఒకటి రాయాలి..రాసి తీరాలి. చిన్నప్పటి విషయం ఏదైనా రాస్తే అదే ఏ పొలం గురుంచో..పుట్ర గురించో రాస్తే.

తరువాతి చర్య..చెవి హ్యాండిల్ తిప్పుట...ఇంకో సారి తిప్పుట... జరిగాక "నా ధీరత్వం" హెడ్డింగు పెట్టి నలుగయిదు సార్లు చదువుకుని. రెండు మూడు సార్లు అరిచి..ఒక్క సారి ముద్దు పెట్టుకుని. కీ బోర్డును నొక్క బోతుంటే అసంకల్పితంగా నా బుర్ర చదివిన నా రీమోట్ ఎలక ఇంకో కిటికీ తెరిచి కూడలి లో ప్రసాద్ గారి "నా ధీరత్వం" చూపించి టాం అండ్ జెర్రి లో టాం ను ఓడించిన తరువాత చూసే చూపు చూసి తోకెత్తి గాల్లో సున్న వేసి "బోడి గుండు వెధవా" అన్నట్టు "కిసుక్" అంది. టాం కష్టాలు లాగా ఎన్ని కష్టాలో అని ఆలోచించినప్పుడు "ఎంత కష్టం-ఎంత కష్టం" అని సరిగమలు లోనుండి అరుపులు వినపడ్డాయి.

ఇక ఇలా కాదని అన్నీ ఆపేసి ఇంట్లోని టేప్ రికార్డర్ లో తెలుగు పాటలు పెట్టా... అందులోనుంచి "తొలి సంధ్య వేళలో..తొలి పొద్దు పొడుపులో" పాట వస్తోంది. ఈ పాట కూడ బ్లాగులో వచ్చేసిందని ఎవరైనా చెపితే దానికి ప్రేరణ నేనేనని మనవి చెసుకుంటున్నాను.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మన బ్లాగులోళ్ళందరూ కలిసి కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. అవేంటంటే

1. ఎట్టి పరిస్తితులలోనూ మా ఇంటి చుట్టూ తిరిగి నా అవిడియాలను కాపీ చెయ్యకూడదు.
2. ఎవరికి ఏమి అవిడియాలు వచ్చినా అవి నా దగ్గర వున్నాయో లేవో ముందుగా కనుక్కోవాలి.
3. వాటికి సమాధానమియ్యడానికి నాకు వారం రోజులు గడువు ఇవ్వాలి. వాటిని రాష్ట్రపతి లాగే తొక్కి పెట్టే అధికారాన్ని ఇవ్వాలి.
4. నేను అనుమతి ఇచ్చాకే వాటి మీద మీరు మీ బ్లాగుల్లో రాయాలి.
5. మరీ బ్లాగు ప్రపంచంలో మీ గొప్పగా పేరు వచ్చేసేటట్టయితే దానికి సహాయం (అంటే పెట్టుకునేందుకు అనుమతి) చేసిన వాడిగా నా పేరు వెయ్యాలి లేదా నా పేరే పెట్టుకోవాలి.
6. ఇవన్నీ చెయ్యడానికి ఇష్టపడని వాళ్ళను బ్లాగర్ల గుంపులో వాళ్ళందరూ కలిసి బాదెయ్యాలి.
7. ఎవర్నీ అయిదువందల టపాలు పూర్తి చేసుకోనివ్వకూడదు. టపాలను 1.1, 1.2 ,1.3 అని పెంచుకుంటూ పోవాలి.
8. ఎప్పటికప్పుడు నేను ఇంకో తీర్మానం తయారు చేసే అవకాశమివ్వాలి.


బ్లాగుసూత్ర విహారి.

Friday, March 02, 2007

కొలరాడో ఉగాది ఉత్సవాలు -- 'గజల్ శ్రీనివాస్'

ఇందు మూలంగా సకల జనులకు తెలియ చేయడమేమనగా ఇక్కడ అనగా డెన్వర్ మహా నగరం, కొలరాడో రాష్ట్రం లో ప్రతి ఏటా జరిగే తెలుగు ఉగాది ఉత్సవాలు ఈ నెల 24 న జరప తలపెట్టినారు. వీటిని కొలరాడో తెలుగు సంఘం వారు జరుపుతున్నారు.

మీరు ఇక్కడ వున్న ఎడల లేదా ఆ రోజు ఇక్కడ ఉన్న ఎడల లేదా మీ బంధు..బంధు..బంధువులు ఉన్న ఎడల లేదా మీ మిత్ర..మిత్ర..మిత్రులెవరైనా వున్న ఎడల ఈ టపా ను ఆసాంతం చదవలసిందిగా ప్రార్థన.

(అక్కడే లంకెట్టా నేను. నేను మీ మిత్రుడైతే మీరు చచ్చినట్టు చదవాల్సిందే....అబ్బో ఈ మధ్య నాకు భలే తెలివొచ్చేస్తోంది..సెభాష్ సెభాష్. భుజం మీద)

ఏ ఏటి కా ఏడు నాణ్యమైన కార్యక్రమాలను ఇక్కడి తెలుగు వాళ్ళకు అందిస్తున్నారు కొలరాడో తెలుగు సంఘం వారు. ప్రతి సంవత్సరం ఉగాది, దీపావళి మరియు పిక్నిక్ లే కాకుండా అప్పుడప్పుడూ ఉచితంగా కళా కారుల ప్రదర్శనలు మరియూ తెలుగు సినిమాలను కూడ అందిస్తున్నారు. ప్రతి ఉగాది కి, దీపావళికి సాంస్కృతిక కార్యక్రమాల తో పాటు షడ్ర సోపేతమైన కమ్మని భోజనం కూడా అతిథులకు ఇస్తున్నారు. పిక్నిక్ అప్పుడు ఆటపాటలతో పాటు వివిధ రకాల బహుమతులు కూడా ఇస్తారు. పీట్జా ల తో పాటు పెరుగన్నం అందించడంలో ఈ సంఘానికి సాటి మరెవ్వరూ లేరు.

కేవలం నామమాత్రపు కుటుంబ సభ్యత్వం తో ఇంటిల్లి పాదికి ఇన్ని అందజేస్తున్న తెలుగు సంఘం బహుశా అమెరికాలో మరెక్కడా లేదంటే అతి శయోక్తి కాదేమో.

ఇన్ని వున్న ఈ తెలుగు సంఘ కార్య క్రమాల్ని చూడ్డానికి ఒక్క సారి విచ్చేయండి. అది కూడా ఈ మన తెలుగు ఉగాది కోసం. చిన్న పిల్లలకు "పద్య పఠనం" తో పాటూ ఈ సారి "ఉగాది కవితల పోటీ" పెడుతున్నారు. ఎవరైనా ఈ పోటీలలో కానీ లేక ఏవైనా సంస్కృతిక కార్యక్రమం లో కానీ పాల్గొన దలచుకుంటే మీరు కొలరాడో తెలుగు సంఘం సాలెగూడుకు వెళ్ళి మీ వివరాలని నమోదు చెసుకోవచ్చు లేదా cotelugu@yahoo.com అనే ఈ-చిరునామా కు ఉత్తరం పెట్టొచ్చు.


ప్రత్యేకం.. ప్రత్యేకం : ఈ సారి మన సుమధుర గజల్ గాయకులు 'గజల్ శ్రీనివాస్' గారు ఇక్కడి తెలుగు జనులను ఉర్రూతలూగించడానికి ఈ ఉగాదికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. (ఈ ఒక్క ముక్క ముందే చెప్పుంటే ఈ సంఘం గురించి గొప్పలు చెప్పే బాధ తప్పేదేమో)


ఎవరైనా తమ బిజినెస్ కు పబ్లిసిటీ కావాలనుకుంటే ఈ సాంవత్సరిక డైరెక్టరీలో ప్రచురించుకోవచ్చు. దానికి అడ్వర్టజెమెంట్ పరిమాణము బట్టి ధర వుంటుంది


బ్లాగు సోదర/సోదరీమణులకు,


మీరు ఈ ఉగాది కార్యక్రమాలకు ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవల్సిందిగా అభ్యర్తిస్తున్నాను. ఏదైనా కార్యక్రమం వుంటే బాగుంటుందనుకుంటే వెంటనే రెండు ముక్కలు లేదా నాలుగింతలు ముక్కలు వ్రాయండి.

ఈ సారి మన తెలుగు బ్లాగు గురించి "సాంవత్సరిక డైరెక్టరీ" లో ఒక వ్యాసం రాయలనుకుంటున్నాను.


అబ్బో అబ్బో
తెలుగు సంఘ విహారి.

ధ.దే.ఈ.శు. -- జోకు

ఆడవాళ్ళ గురించి మగవాళ్ళకు తెలిసిన పది విషయాలు.

1.



2.



3.



4.



5.



6.



7.



8.



9.



10.