Monday, March 12, 2007

క్రికెట్ గళ్ళ పట్టీ

తాకేసింది...తాకేసింది అందర్ని తాకేసింది.
వచ్చేసింది... వచ్చేసింది అందరికి వచ్చేసింది.

దాని పేరు క్రికెట్ జ్వరమంట.

కొన్ని లక్షల పని గంటల్ని తుంగలో తొక్కడానికి తెర లేచింది. ఏ ఇద్దరు దేశీ లను చూసినా ఇదే మాట. ఎక్కడెక్కడ్నుండో మొదలయి క్రికెట్ తోనే అంతమయ్యే సంభాషణలు. దానికి తోడు మా ఆఫీసులో దాని మీద "పూల్" పందేలు. అదెలాగంటే...

"పూల్" లో కెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఓ అయిదు రూపాయలివ్వాలి అదే అయిదు డాలర్లు లెండి, మన భాషలో అలానే నన్నమాట. అయిదు క్షవరం అయ్యాక ఓ గళ్ళ పట్టె కాగితం అంటే "ఎక్సెల్ షీట్" ఇస్తారు అందులో ఈ ప్రపంచ కప్పులో పాల్గొనే పదహారు దేశాల పేర్లుంటాయి.వాళ్ళ లో ఎవరు ఏ దశకు పోతారో ముందుగానే మనం మాయదర్పణం లో చూసినట్టు చెప్పెయ్యాలి. చూట్టం తెలీక పోతే ఇంటెర్నెట్ లోకెళ్ళి చూసి తెలుసుకోవాలి. అందులోని దశలు ఈ విధంగా వుంటాయి.


1."అష్ట దిగ్గజాలు" దశ (Super 8)
2."అర్ధ దిగ్గజాలు" దశ (Semi-Finals)
3."దిగ్గజాలు" దశ (Finals)
4."అసలు దిగ్గజం" దశ(Winner)


ముందుగానే ఇవన్నీ గళ్ళ పట్టీలో మనకన్నా తక్కువ పని వున్న లేదా ఏ పని లేని వాడో పెట్టేసి వుంటాడన్నమాట. ఆ పెట్టినోడి కన్నా కాస్త పని వున్న పని(కిరాని)మంతులు (నాలాంటోళ్ళు) వాటి పేర్ల కెదురుగా దేశాల పేర్లను రాసుకుంటూ పోవాలి.

మనకు కొద్దిగా నచ్చని వాటి పేర్లను "దిగ్గజాలు" కిందా.
ఇంకొంచెం ఎక్కువ నచ్చని దేశాలను "అర్ధ దిగ్గజాలు" కింద,
ఇంకాస్త నచ్చని వాటిని "అష్ట దిగ్గజాలు" కిందా రాసేస్తామన్నమాట.


మనం ఎప్పుడూ పనీ పాటా లేకుండా మాట్లాడుకొనే జట్టు పేరు "అసలు దిగ్గజం" కింద రాసేస్తామన్నమాట.

అలా అన్ని చోట్లా రాసేసి ఆ పెద్ద "పనిమంతుడి" కి ఇచ్చెయ్యాలి. అలా ఇవ్వడానికి ఈ రోజే చివరి రోజని ఆ మధ్యెప్పుడో ఏమీ పన్లేనప్పుడు వచ్చి అయిదు రూపాయలు తీసుకొని మరీ చెప్పి వెళ్ళాడు. అలా అందరి డబ్బులూ జేబులో పెట్టుకుని జేబు వుబ్బుగా అయిపోయిన తరువాత వెళ్ళిపోయాడ్లే. అప్పివ్వమంటే "అప్పు గిప్పు జాంతానే" అన్నాడు. ఆ డబ్బులు గుడ్లూ...పిల్లలూ లాంటి వేమీ పెట్టవంట.


ఈ ఆట చాలా తెలివిగా వుంటుంది. క్రికెట్టు అనుకుంటే మీరు అట్టు మీద చెయ్యెట్టి నట్టే. ఆ డబ్బులు ఆట అన్న మాట. మీరు సూచించిన జట్టు అదే మీకు నచ్చినట్టు అనిపించే జట్టు ఒక్కో దశకు వెళ్ళినప్పుడు ఆ దశను పట్టి మీకు బోల్డన్ని పాయింట్లు వచ్చేస్తాయి. మీరు గారెల బుట్ట దగ్గర నిల్చున్నప్పుడు ఎవరైనా మిమ్మలని గట్టి గా తన్నేస్తే మీకు అన్ని పాయింట్లూ వచ్చేసి ఆ డబ్బులన్నీ మీ జేబులో కొచ్చేసి జేబు ఉబ్బుగా అయిపోతుందన్నమాట. నాకు ఎప్పుడూ తన్నే అలవాటే కానీ తన్నించుకునే అలవాటు లేదు కాబట్టి నేను గారెల బుట్టకు దూరంగా నిలబడి ఎవరైనా నిలబడతారేమో తందామని "ఆస్ట్రేలియా" అనే జట్టుకు "దిగ్గజం" తిలకం దిద్దేసి వెనక్కెళ్ళి నిలుచున్నా.

నా "గళ్ళ పట్టీ" ఇలాగుంది.

1."అష్ట దిగ్గజాలు" దశ,

ఇండియా, వెస్టిండీస్,సౌ.ఆ.,ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, పాక్, న్యూజిల్యాండ్.

2."అర్ధ దిగ్గజాలు" దశ,

ఇండియా, సౌ.ఆ.,ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్

3."దిగ్గజాలు" దశ

ఇండియా, ఆస్ట్రేలియా.

4."అసలు దిగ్గజం" దశ.

ఆస్ట్రేలియా


గమనిక: నా అంచనా తప్పు కావాలని అందరూ దీవించండి. అంటే ఇండియా కప్పు కొట్టాలన్న మాట. అలా కప్పు కొడితే మీకందరికి తలో సాసరు బహుమతి ఇస్తా.


క్రికెట్ విహారి

...

2 comments:

radhika said...

నేనొప్పుకోను.అన్నన్నా..తప్పు తప్పు .ఇలాంటివి చెయ్యకూడదు "బెట్టింగుల విహారిగారూ ".బుద్దిగా వెళ్ళి బజ్జోండి. [j/k]

ప్రవీణ్ గార్లపాటి said...

వావ్...
మీరు నమ్ముతారో లేదో గానీ, నిన్నే మా ఆఫీసులోనూ ఇదే తరహా మొదలయ్యింది. ఎగ్జాక్ట్లీ సేం టు సేం. కానీ నేను పార్టిసిపేట్ చెయ్యట్లేదు లేండి.