Thursday, March 08, 2007

బ్లాగు అవిడియాలు

బ్లాగులో ఏమైనా రాద్దామని ఎప్పుడు మొదలు పెట్టినా నేననుకున్న విషయం మీద ఎవరో ఒకరు వాళ్ళ బ్లాగుల్లో రాసేస్తున్నారు. అదేం చోద్యమో?(బుగ్గలు నొక్కునున్నా..) అందరికీ నా బుర్రలో వున్న విషయాలు ఎలా తెలుస్తున్నాయో? నేను కొంచెం తెరిచిన బుర్ర టైపు(open minded) అయినంత మాత్రాన అందరూ నా బుర్ర లో చిన్న 'పిప్పెట్టు ' పరికరాన్ని వుంచి కొంచెం కొంచెం తీసుకెళ్ళి పోవడమేనా? ఇది చానా అన్యాయం అంతే కాకుండా అందరూ ఆగ్రహించాల్సిన సమయం. బ్లాగ్జనులందరూ ఒక్క చోట చేరి ఆలోచించాల్సిన సమయమిది.

చూడండి నా బుర్రలో వచ్చిన కొన్ని ఆలోచనలు మచ్చుకు ఇక్కడ విశదీకరిస్తున్నాను. ఇవన్నీ ఎలా కాపీ చేయబడ్డాయో కూడా చూడండి.

రోజూ మా బుడ్డోడు స్కూలు కెళ్తాడు దాని మీద రాద్దామని మొదలుపెట్టా. కానీ అంతలో "శ్రీ కృష్ణ దేవరాయలు" గారు "పొద్దున బడికి ఎలా వెళ్ళాలి" అని ఒక టపా రాసేశారు. సరేలే ఒకరికొచ్చిన ఆలొచనలు ఇంకొకరికి ఎందుకు రాకూడదు అని సరిపెట్టుకొని పిల్లలు ఎలా వుంటారు వాళ్ళని ఎలా సరిదిద్దాలి అని రాద్దామని మొదలుపెడుతున్నా. అంతలోనే దానిమీద కూడా మ్యూసింగ్స్ లో "Management lessons" అంటూ ఒక టపా వచ్చేసింది. ఏం చెద్దామబ్బా అనుకుంటూ ఒక డైట్ కోక్ పట్టుకుని ఆలోచిస్తూ వుంటే, అసలు ఈ డైట్ కోక్ మీదనే ఒక వ్యాసం ఎందుకు రాయకూడదు అనుకుని బుర్రకు కీ ఇచ్చా. అదే కాస్త పవర్ రావడానికి వెనకటి కాలంలో గ్రాంఫోన్ రికార్డులకు వున్నట్టు నా చెవికి ఒకతిప్పే హ్యాండిల్ వుంది. దాన్ని పట్టుకుని రెండు రౌండ్లేశా. ఇక బుర్ర లోకి లెక్కకు మిక్కిలిగా దాని చరిత్ర వచ్చి పడింది. దాన్ని ఏరుకుని, కూర్చుకుని అటు చూసే సరికి ఏముంది Japes ద్వారా బయటకు వచ్చేసింది. ఇది మాయో,బ్రమో అనుకుంటూ వుంటే "ఆర్థిక మర్మ" చిదంబరం గారు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇంకేం నా బ్యాంక్ బ్యాలన్స్ తో సహా టపా ఊపెయ్యోచ్చు అనుకొని కీబోర్డు నొక్కే ముందు కూడలి లో refresh కొట్టా. జాతీయ వాది అంబానాథ్ గారి టపా నన్ను చూసి ఇక "నువ్వు టపా రాసినట్టే! వెళ్ళి కాసేపు లెక్కలు నేర్చుకొని రాపో భడవా" అంది.

ఇలా కాదని ఇంట్లో పైకొకసారి కిందకొకసారి పరిగెత్తి (డాక్తర్ చెప్పాడ్లే ఇలా పరుగులు పెట్టకపోతే నూవు తొందరగా పైకి పరుగులు పెడతావ్ అని) తరువాత బయటకు వెళ్ళి నిచ్చెన ఎక్కి దిగి ఇంట్లో కొచ్చీ రాగానే బుర్రలోకి ఎస్.ఎం.ఎస్ వచ్చింది. "అవును నీ ఉద్యోగానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి కదా..కొత్త ఉద్యోగం చూసుకోవాలి చూసుకున్న తరువాత మారేటప్పుడు ఎలా మాట్లాడాలి అనే దాని మీద రాయవో!" అని.

మంచి మేత అని దూరేలోపు "కంపెనీ మారేప్పుడు" అని ఇంకో టపా కూడల్లో. ఇలా కాదు కంటికి ఏది కనిపిస్తే దాని మీద రాసెయ్యాలి అని ఇల్లంతా చూస్తున్నా.బుడ్డోడు బుద్ధిగా రంగులేస్తున్నాడు వాడి దగ్గరున్న కాగితం మీద. ఈ సారి దీనిమీద "రంగు పడుద్ది" అనే హెడ్డింగ్ తో కాలేజీ లో హోళీ చేసిన కేళీ విలాసం అని రాసే లోపు "శొధన" లోనుండి "నీ కన్నా ముందు నేను నీకు రంగేశా నల్లగా..నీ ముఖం ఎర్రగా!!" అని వినిపించింది.

ఈ బ్లాగులోళ్ళు నన్ను నిద్ర పోనివ్వట్లేదు కదా అదే టైపులో "కాలాన్ని నిద్ర పోనివ్వను" అనే పేరుతో కనీసం ఒక కవితన్నా రాద్దామని కూడలిని refresh చేసా. ఏమీ కనిపించలా...ఆహా నేను అనుకున్నది ఇంకా ఎవ్వరూ అనుకోలా..ఇక నేను ప్రవహించనా వరదలా అని ఎందుకైనా మంచిది అని తేనె గూడుని refresh చేశా. అర్జంటుగా వెళ్ళాసిన చోటుకి వెళ్ళేటప్పుడు లాస్టు బస్సు ను క్యాన్సిల్ చేశాం అన్న వార్త విన్నట్టు అదే పేరు..కాకపోతే బ్లాగులో కాదు. పొద్దులో స్వాతి గారు రాసిన సమీక్ష. ఆచార్య ఎన్. గోపి రాసిన "కాలాన్ని నిద్ర పోనివ్వను" అనే కవితా సంపుటి మీద.


వెధవ బతుకు వెధవ జన్మ కనీసం మరుసటి జన్మ లో...మరుసటి జన్మలో...అవుడియా. పునర్జన్మ మీద ఓ కవిత. "పునర్జన్మా..పుటుక్..పుటుక్. పునర్జన్మా..లటుక్..లటుక్" అని రాసి నా బ్లాగులో పెట్టేముందు చూస్తే "సాల భంజికలు" కింద "పునర్జన్మ" ప్రత్యక్షం. నాగ రాజు గారు అసలే సాహిత్యం లో కొట్టిన పిండి. నేను పోటీ గా రాస్తే నా పరిస్తితి...గుటుక్..గుటుక్.

అన్నీ మానేసి కాసేపు క్రీడా వార్త ల్లోకి వెళితే ఎక్కడ చూసినా క్రికెట్ గొడవే. ఎవడు పడితే వాడు నేను ఆ కప్పులో ఇలా ఆడా...ఈ కప్పులో ఇలా ఎందుకు ఆడలేక పోయా..వాడెందుకు బాలు ఒదిలేశాడు...వీడెందుకు బ్యాటు పడేశాడు అనే వాటి మీద వార్తలు కోకొల్లాలు. వీళ్ళకే ఇంత వుంటే సొంత బ్లాగున్న నాకు అంతా లేదా అని చెవి హ్యాండిల్ రెండు సార్లు తిప్పా. నా హైస్కూల్ క్రికెట్ గుర్తొచ్చింది. ఇంకో రెండు సార్లు హ్యాండిల్ పట్టుకుని రయ్..రయ్ మని రౌండ్లేశా. ఎదురింటి సీని గాడు బాలు వేస్తే నేను బ్యాటు తో వాడి ముక్కు మీద సిక్సర్ కొట్టిన విషయం గుర్తొచ్చింది. వాడి ముక్కు మీద ఇప్పటికీ వున్న నా సింగిల్ వికెట్ Trademark గుర్తొచ్చింది.

ఇంకేం అవన్నీ రాసేస్తే ఓ ఇరవై టపా లవుతాయి అందునా మన తెలుగు బ్లాగులోళ్ళకు క్రికెట్ పిచ్చి తక్కువ కదా అని సంబరపడి "ఇక నన్నెవ్వరూ ఆపలేరు".." సీతయ్యకు మూడొచ్చింది" అని పైకొకసారి ఎగిరి "నాకు డబుల్ స్ట్రాంగ్ కాఫీ" అని మా ఆవిడకు వినిపించేట్టు అరిచా. దానికి ఆవిడిచ్చిన చూపు చూసి " నీ క్కూడ కావాలా మేడం" అని సర్దేసి నేనే వెళ్ళి ఓ పేద్ద అరకప్పు కాఫీ చేసుకొచ్చి ఎర్రగా మారిన చెవిని మరో సారి మెలేసి బుర్రిత్ర (బుర్ర లోని చరిత్ర) లో నుండి బయట పడ్డ కళా ఖండాల్నిఒక దాని పక్కన ఒకటి పెట్టి రాస్తుండగా పడింది అణు బాంబు. "నా క్రికెటింగ్ కేరీర్" అని ప్రవీణ్ నుంచి. ఇక నా టైటిల్ " నా క్రికెట్ బేర్..బేర్..నా అవిడియాలు తుర్..తుర్.."

ఇలా కాదని మా ఆవిడకు చెప్పా నువ్వు "రొయ్యల వేపుడు బాగానే చేస్తావ్ కాదా. దాని విధానం చెప్పెయ్.. నీ పేరు పెద్ద పెద్ద అక్షారాలతో పెడతా" అని. (పేరుకు పెద్ద అక్షరాలు అంటే అందులో నా పేరు వుంటుంది కదా అవి మాత్రమే పెద్ద అక్షరాలన్న మాట..మిగతావి చాలా చిన్నవి అంటే అదేదో డిటర్జెంట్ కపెనీ వాళ్ళు చెప్పినంతన్నమాట). పాపం శ్రీమతి విహారి చెప్పినంత సేపు నిలవలేదు ఆనందం. ఇంకేం మీరందరూ వూహించిందే..."రొయ్యల చుక్క కూర..రొయ్యల టమాటో కూర" బ్లాగులో విడతలు విడతలు గా ప్రత్యక్షం. ఇందులో పేరు చెప్పాల్సిన పని లేదు చెప్పాలొస్తే 500 సార్లు చెప్పాలి అందుకని నేను చెప్పను.

ఇక అన్నీ పక్కన పెట్టి టీ.వి. చూస్తుంటే ఆకలేసింది. నూడుల్స్ తినాలనిపిస్తే "ఓ ప్లేట్ నూడుల్స్" అని ఆర్డరేసి వంట గదిలోకెళ్ళి నేనే తయారు చేసుకొచ్చి (ఎందుకో ఈ పాటికి అర్థమయ్యుంటుంది..కాకపోతే మళ్ళీ మెదటి నుండి చదవండి) దాన్ని ఓ గుంత గిన్నెలో వేసి ఫోర్క్ కూడ తోడుగా పెట్టి సోఫాలో చార్గిలపడి తింటుంటే ఫొర్కు నోట్లో గుచ్చుకుంది. చెవి హ్యాండిల్ తిప్పకుండానే ఈ సారి ఓ మాంచి సృజనాత్మక అవిడియా....ఫోర్క్ మీద ఓ టపా!!! ఫోర్కు స్పూను ఓ ప్రేమ జంట...దాని అవినాభావ సంబందం.. ఇంతవరకు ఎవ్వరూ తాకని విషయం. ఎడమ చెవి గిర్రుమని తిరిగి కుడి చెయ్యిని కూడలి లోకి పోనిచ్చింది. నా లాప్టాప్ మీద లేజెర్ షో "దరిద్రుడు స్నానానికెళితే వడగళ్ళ వాన" ఓ రెండు క్షణాలు కనిపించి మాయమయి పోయి దాని వెనక "హరివిల్లు" లో ఫొర్కు..దాని పెళ్ళాం స్పూను మీద ఓ వేడుక. నా మెదడులోనుండి ఇంకో లేజర్ షో "ఇక నువ్వు బ్లాగులు రాయడం ఆపెయ్..చదవడం మాత్రం చెయ్".

నేనొదల్తానా అంత తేలిగ్గా.. ఇవాళ ఏదో ఒకటి రాసెయ్యాలి ఇది నా ప్రతిభ కు మరియు వెనక్కు పోని ధీరత్వానికి పరీక్ష. అంటే ఏదో ఒకటి రాయాలి..రాసి తీరాలి. చిన్నప్పటి విషయం ఏదైనా రాస్తే అదే ఏ పొలం గురుంచో..పుట్ర గురించో రాస్తే.

తరువాతి చర్య..చెవి హ్యాండిల్ తిప్పుట...ఇంకో సారి తిప్పుట... జరిగాక "నా ధీరత్వం" హెడ్డింగు పెట్టి నలుగయిదు సార్లు చదువుకుని. రెండు మూడు సార్లు అరిచి..ఒక్క సారి ముద్దు పెట్టుకుని. కీ బోర్డును నొక్క బోతుంటే అసంకల్పితంగా నా బుర్ర చదివిన నా రీమోట్ ఎలక ఇంకో కిటికీ తెరిచి కూడలి లో ప్రసాద్ గారి "నా ధీరత్వం" చూపించి టాం అండ్ జెర్రి లో టాం ను ఓడించిన తరువాత చూసే చూపు చూసి తోకెత్తి గాల్లో సున్న వేసి "బోడి గుండు వెధవా" అన్నట్టు "కిసుక్" అంది. టాం కష్టాలు లాగా ఎన్ని కష్టాలో అని ఆలోచించినప్పుడు "ఎంత కష్టం-ఎంత కష్టం" అని సరిగమలు లోనుండి అరుపులు వినపడ్డాయి.

ఇక ఇలా కాదని అన్నీ ఆపేసి ఇంట్లోని టేప్ రికార్డర్ లో తెలుగు పాటలు పెట్టా... అందులోనుంచి "తొలి సంధ్య వేళలో..తొలి పొద్దు పొడుపులో" పాట వస్తోంది. ఈ పాట కూడ బ్లాగులో వచ్చేసిందని ఎవరైనా చెపితే దానికి ప్రేరణ నేనేనని మనవి చెసుకుంటున్నాను.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మన బ్లాగులోళ్ళందరూ కలిసి కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. అవేంటంటే

1. ఎట్టి పరిస్తితులలోనూ మా ఇంటి చుట్టూ తిరిగి నా అవిడియాలను కాపీ చెయ్యకూడదు.
2. ఎవరికి ఏమి అవిడియాలు వచ్చినా అవి నా దగ్గర వున్నాయో లేవో ముందుగా కనుక్కోవాలి.
3. వాటికి సమాధానమియ్యడానికి నాకు వారం రోజులు గడువు ఇవ్వాలి. వాటిని రాష్ట్రపతి లాగే తొక్కి పెట్టే అధికారాన్ని ఇవ్వాలి.
4. నేను అనుమతి ఇచ్చాకే వాటి మీద మీరు మీ బ్లాగుల్లో రాయాలి.
5. మరీ బ్లాగు ప్రపంచంలో మీ గొప్పగా పేరు వచ్చేసేటట్టయితే దానికి సహాయం (అంటే పెట్టుకునేందుకు అనుమతి) చేసిన వాడిగా నా పేరు వెయ్యాలి లేదా నా పేరే పెట్టుకోవాలి.
6. ఇవన్నీ చెయ్యడానికి ఇష్టపడని వాళ్ళను బ్లాగర్ల గుంపులో వాళ్ళందరూ కలిసి బాదెయ్యాలి.
7. ఎవర్నీ అయిదువందల టపాలు పూర్తి చేసుకోనివ్వకూడదు. టపాలను 1.1, 1.2 ,1.3 అని పెంచుకుంటూ పోవాలి.
8. ఎప్పటికప్పుడు నేను ఇంకో తీర్మానం తయారు చేసే అవకాశమివ్వాలి.


బ్లాగుసూత్ర విహారి.

13 comments:

shadruchulu said...

అబ్బా ఆశ దోశ అప్పడం పిజ్జా బర్గర్ కాదూ!

radhika said...

అబ్బా..పడీ పడీ నవ్వానండి.మీరు పెట్టిన షరతులు అదిరిపోయాయి.అలాగే కానీయండి "అయ్యో పాపం విహారి" గారు.

సత్యసాయి కొవ్వలి said...

Mr and Mrs శైలజామూర్తి సినిమాలో బ్రహ్మానందం ఒక అడుగు ముందుకు వేసి నాకు రాబోయే ఐడియా వాడికొచ్చిందంటాడు. మీ బాధ అర్ధమయ్యింది. మా సానుభూతులు.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం said...

ఏడాది క్రితం బ్లాగులన్నీ కలిపి పట్టుమని పాతిక ఉండేవి కావు.ఇప్పుడు బ్లాగులు పెరిగిపోవడంతో ఒకరికి వచ్చిన ఆలోచనలే ఏకకాలంలో ఇంకొకరికి వచ్చే అవకాశం భేషుగ్గా ఉంది. నా బాధ మీ బాధకి పూర్తిగా వ్యత్యస్తం. నాకు రాయాల్సింది చాలా కనబడుతోంది.రాసే తీఱిక లేదు. ఏం చెయ్యాలి ?

Swathi said...

అమ్మో.. ఎంత గడుసుతనం!!
ఎవరేం రాసినా మీ అంతగా ఎవరూ నవ్వించలేరులెండి..
మీ బ్లాగ్ మేమమందరం రిలాక్స్ అయ్యే స్థలం..keep it up

ప్రవీణ్ గార్లపాటి said...

బ్లాగకనే బ్లాగేసారుగా మీరు...
చాలా చతురులండీ బాబూ. మా అందరికీ కాపీ రైట్లేమీ లేవు, మీరు అవిడియాలు

"ఇష్టమొచ్చినట్టు వాడుకోవచ్చు, ఎవడికీ లెక్క చెప్పక్కర్లేదు".

అన్నట్టు మీ సిక్స్త్ సెన్స్ బాగా పని చేస్తున్నట్టుంది, కూడలి డౌనయినప్పుడు మిమ్మల్నడుగుతా ఏమి రాయాలనుకుంటున్నారో.

spandana said...

నవ్వుల విహారీ,
నవ్వి నవ్వి కుదేలయ్యాను. నా అవిడియా వేరొకళ్ళకు వస్తోంది వస్తోంది అంటూనే ఇంత మంచి ఎవరికీ తట్టని అవిడియాను ఎంత చక్కగా లాగించారు.
సరదా సరదాగా అన్ని బ్లాగులూ చుట్టొచ్చారు.
ఈసారి నేను రాసే ముందు మీ పర్మిషన్ తప్పకుండా తెలుసుకుంటానోచ్!

--ప్రసాద్
http://blog.charasala.com

కొత్త పాళీ said...

I feel your pain :-)
Here's an idea - carve yourself a niche market :-))
Well, OTOH, looking at the comments on this post I think you already did :-)))

Nagaraju Pappu said...

మీ తీర్మానాలన్నింటికీ నేనొప్పేసుకొంటా - ఒక షరతుమీద, మీ అవిడియాలు కొన్ని అప్పు ఇవ్వాలి మరి?

Anonymous said...

@ జ్యొతి గారూ,

మీరు షడ్రుచులు బ్లాగ్ పెట్టి నాకు ఆశ దోశ అప్పడం అని ఏవీ లేకుండా చెయ్యడం ఏమీ బాగలేదు.

@ రాధిక గారూ,

మీరీ మధ్య టూమచ్ గా నవ్వుతున్నారు :-)

@ సత్యసాయి గారూ,

మీ సానుభూతిని నా అనుభూతిలో కలిపేసా.

@ సుబ్రమణ్యం గారూ,

మీ కొచ్చే ఆలోచనలు అందరికీ రావు లెండి. కావాలంటే నా వీకెండ్ లు ఇస్తా. వాటిని ఉపయోగించుకోండి :-)

@ స్వాతి గారూ,

మీరిక్కడికి వచ్చి రిలాక్సవుతున్నారా? ఆ మాట చెప్పరే? ముందు ఇక్కడ పార్కింగ్ ఫీజు కట్టండి రిలాక్సవుతున్నందుకు.

@ ప్రవీణ్ గారూ,

ఎనీ టైం..ఎనీ ప్లేస్ .. ఎనీ అవిడియాస్ ...కాల్ 1-800-అవుడియాస్.

@ ప్రసాద్ గారూ,

మీరు నా దగ్గర అనుమతి తీసుకోక పోతే మీ కీ బోర్డు అసలు అక్షరాలు చూపించదు మీ మానిటర్ లో.

@ కొత్త పాళీ గారూ,

thanks

@ నాగర్ రాజు గారూ,

అలాగే ఎన్ని కావాలంటే అన్ని అప్పు తీసుకోండి. మీరు వేంకటేశ్వరుడనుకోండి నన్ను కుబేరుడనుకోండి :-)

విహారి

తెలుగు'వాడి'ని said...

ప్రవీణ్ గారు అన్నట్లు బ్లాగకనే బ్లాగేశారు మీరు. మీ జాబులలోని స్క్రిప్ట్ నిజంగా ఒక అధ్భుతం. ముఖ్యంగా మధ్యమధ్యలో సింపుల్ గా (మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి స్టైల్ ను గుర్తుకు తెచ్చే) మీరు వదిలే డైలాగ్స్ - "నాకు డబుల్ స్ట్రాంగ్ కాఫీ" అని మా ఆవిడకు వినిపించేట్టు అరిచా. దానికి ఆవిడిచ్చిన చూపు చూసి " నీ క్కూడ కావాలా మేడం" అని సర్దేసి నేనే వెళ్ళి ఓ పేద్ద అరకప్పు కాఫీ చేసుకొచ్చి" - చదువుతుంటే పొట్ట చెక్కలయ్యేలా ఒకటే నవ్వులు. మీ నుంచి ఇలాంటి మంచి జాబులు రావటంకోసమైనా, మిగతా బ్లాగర్లు అందరూ మీ అవుడియాలు ఎలాగైనా దొంగిలించి మీ కన్నా ముందే ఏదో ఒకటి రాసేయాలని కోరుకుంటూ..........

Ramya said...

రాయటానికి ఏమీ దొరక లేదంటూనే బ్రహ్మాండగా రాసేసారు.రెండున్నర గంటల కామెడి సినిమాకు కావలసినంత కథ వుంది మీటపాలో.

Japes said...

చిత్తం అండి :) !
ప్రవీణ్ అన్నట్టు "బ్లాగకనే బ్లాగేసారుగా మీరు..."
Sorry for the late comment :)