Thursday, March 29, 2007

డబ్బు సంపాదించడం ఎలా....ఇలా

ఇరవై ఏడేళ్ళ యువకుడు జమైకా బీచ్ లో సంతోషంగా మార్గరీటా తాగుతూ తన పక్క నున్న అమ్మాయి అందాలను తనివి తీరా చూసుకుంటూ ఉల్లాసంగా మాట్లాడుతున్నాడు. అక్కడి రిసార్ట్ కు విచ్చేసిన అతిధులందరిలోనూ ఎక్కువ టిప్ ఇచ్చే వారెవరైనా వున్నారంటే అతనే. అతని పేరే విజయ్ వల్లభ్. ఆంధ్ర దేశంలో పుట్టిన వాడు. తన కున్న ఇంగ్లీషు పరిజ్ఞానంతో అక్కడ వున్న అందరిని బొల్తా కొట్టించేస్తున్నాడు. ఆ రిసార్ట్ లో పని చేసే యువతులందరూ అతనికి సపర్యలు చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు అతనితో చనువుగా మెలుగుదామా అని పరితపించి పోతున్నారు.

సాయంత్రమయిన తరువాత ఒక యువతి ఒయ్యారాలు ఒలక బోసుకుంటూ ఇంకో పెగ్గు మార్గరీటా అతని గ్లాసులో పోసి అతను ఎలాంటివాడో ఎంత సంపన్నుడో కనుక్కోవాలని ప్రయత్నం మొదలు పెట్టింది.

"హాయ్ స్వీటీ, మే ఐ నొ యువర్ హాబీస్" అంది.
"ఐ లైక్ టూ బీ స్మార్ట అండ్ విన్ ఎవ్రీవన్" అన్నాడు విజయ్.
"ఓ నాటీ! ఐ వుడ్ లైక్ టూ నొ యువర్ బ్యాక్ గ్రవుండ్ ప్లీజ్" అంది మత్తు కళ్ళతో ఇంకో గ్లాసు మందు అతని నోట్లో పోస్తూ.

అప్పటికే మైకం లో వున్న ఆ యువకుడు చెప్పడం మొదలు పెట్టాడు.


** ** **

నేనొక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వాడిని. అందరిలాగే ఎన్నో ఆశలతో చదువుకోవాలి ప్రయత్నించాను. తెలివి తేటలు ఎన్ని వున్నా కొన్ని సామాజిక పరిస్థితులవల్ల నా చదువు డిగ్రీ మధ్యలో ఆగిపోయింది. అప్పుడే ఒక ధనవంతుల ఇంట్లో పని చెయ్యడానికి అవకాశం వచ్చింది. ఆ ఇంట్లో నేను ఒక పని మనిషి, డ్రైవరూ తప్ప ఎవరూ వుండే వాళ్ళు కాదు. అప్పుడప్పుడూ పార్టీలు జరిగినప్పుడు వుండే సందడి తప్ప మిగతా సమయాల్లో ఎవరూ వుండేవాళ్ళు కాదు. ఆ ఇంట్లో యజమానికి అన్ని ఆధునిక వసతులూ వుండేటివి. ఎవ్వరూ లేక పోవడం వలన నాకు అక్కడ వున్న కప్యూటరే మంచి స్నేహితుడయింది. రోజూ దాని ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాను.

ఇంటెర్నెట్ చాట్ ద్వారా ఎంతో మంది తో పరిచయం ఏర్పడింది. సరిహద్దులు చెరిగి పోయాయి. భాషలు అడ్డు రాలేక పోయాయి. అంతా గ్లోబలైజేషన్ మహిమ. ఇలాంటి పరిస్తితులలో మొదలైంది రియల్ ఎస్టేట్ హవా. ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఆకాశాన్నంటిన భూముల ధరల గురించి మాట్లాడుకోవటం మొదలయింది. పట్టుమని పది వేలు కూడా లేని ఎకరం భూమి రాత్రికి రాత్రే కోట్లలో పలకడం సర్వ సాధారణమయి పోయింది. ఇలాంటి పరిస్తితులను నాకనుకూలంగా మార్చుకోవాలని నేను, చాట్ల ద్వార పరిచయమయిన ఇతర యువకులతో కలిసి ఒక పకడ్బందీ వ్యూహాన్ని తయారు చేశా. తలా కొంత డబ్బు సేకరించి ఒక అంతర్జాతీయ బిజినెస్ సంస్థ ను నెలకొల్పాను. దానికి కావాల్సిన ఏర్పాట్లనీ ఇండియాలో నేనే చూసుకున్నాను. హవాలా ద్వారా డబ్బులు ఇండియాకు చేరాయి.

పథకం ప్రకారం తరువాత చెయ్యవలసిన పనులు ఇక్కడి రాజకీయనాయకులతో పరిచయం పెంచుకోవడం. ఆ పని చెయ్యడానికీ, రిజిస్టరు చేసిన సంస్థకు పబ్లిసిటీ ఇవ్వడానికీ మంచి సహకారం లభించింది. ఇండియాలో కాస్త అభివృద్ది చెందుతున్న పట్టణాలను, నగరాలను ఎంచుకుని ఆ చుట్టుపక్కల వున్న భూములనన్నింటిని తక్కువ ధరలకు బినామీ పేర్లతో కొనుగోలు చేసి రిజిస్టర్ చేసేశాను.

తరువాత మొదలయింది జగన్నాటకం. ఓ మాంచి ముహూర్థం చూసుకుని జర్మనీ నుండి జర్మన్ లు నలుగురు, జపాన్ నుండి జపనీయులు ముగ్గురు, స్విట్జర్ల్యాండ్ నుండి ముగ్గురు, అలా ప్రతి దేశం నుండి కొంత మంది విజిటర్ వీసాల మీద ఒక్కో వారం గ్యాప్ తో ఇండియాకు వచ్చారు. రోజూ వారి అద్దె తో ఒక హెలికాప్టర్ మాట్లాడుకున్నాము. ఒక్కో దేశం వారు ఇండియాలో దిగగానే వారు చెయ్యవలసిన పనల్లా కోట్లూ సూట్లు వేసుకుని వాళ్ళ దేశాల్లోని ప్రముఖ కంపెనీల లోగోలు పెట్టుకొని హెలికాప్టర్ లో అంతకు ముందే మేము కొన్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి వాళ్ళ బాషలో ఏదో రీసెర్చ్ చేస్తున్నట్టు మాట్లాడుకోవడమే.

అది చూసిన ఆ అమాయక జనాలు అక్కడ ఎదో పెద్ద కంపెనీ పెడుతున్నట్టు భ్రమపడి పోయేవాళ్ళు. వాటిని బల పరచడానికి ఆ రెండో రోజే కొన్ని ప్రభుత్వ వాహనాల్లో అంటే అంబాసిడర్ కారూ, మారుతీ జీప్ లో అక్కడ పని చేసే రెవెన్యూ సిబ్బందిని తీసుకెళ్ళి వాళ్ళ చేత ఆ చెట్లూ పుట్లను పరిశీలింపచేసి పెద్ద మందు పార్టీ ఇచ్చేవాడిని. ఇది చాలు అక్కడి వాళ్ళకు ఏదో జరిగిపోతుందన్న భావన కలిగించడానికి. ఒక దేశం వాళ్ళు వచ్చి వెళ్ళిన తరువాత ఇంకో దేశం వాళ్ళు హెలికాప్టర్ లో అక్కడికి వెళ్ళి భూముల్ని కొండల్ని కొలిచేవాళ్ళు.

ఓ వారం తిరిగేసరికి ఆ చుట్టు పక్కల భూములు రెండు మూడు వందల రెట్లు పెరిగిపోయేవి. నేను కొన్న భూములను ఆ మాయ ధరలకు అమ్మేసి చేతులు దులుపేసుకునేవాడిని.ఒక్కో చోట పెట్టిన ముప్పై నలభై లక్షల ఖర్చుకు కొన్ని కోట్లు వచ్చేవి. అలా కనీసం ఇరవై చోట్ల సృష్టించిన కృత్రిమ డిమాండ్ల తో నా బ్యాంక్ ఖాతాలు కొన్ని వందల కోట్లు చేరుకున్నాయి. ఇప్పుడు నాకున్న డబ్బుతో ఇండియాలో వున్న అధికారులను, మంత్రులను నా గుప్పిట్లో వుంచుకున్నా. నేను చేసింది తప్పు అని నిరూపించడానికి ఎవరి దగ్గరా ఏ ఆధారాలు లేవు.

** **

"ఓహ్ స్వీటీ! అంత డబ్బు పెట్టుకుని ఏ స్విట్జర్ల్యాండో పోకుండా ఇక్కడికెందుకొచ్చావ్"" అంది బుగ్గలతో అతని బుగ్గలు నొక్కుతూ.

"ఇక్కడ ఎదో సరదాగ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ చూసి ఓ నలభై రోజులు గడిపి వెళ్దామనుకున్నా. కానీ మా 'టీం ఇండియా ' ఇలా 'డాం ఇండియా ' అవుతుందని ఊహించ లేక పోయా. ఇలా అవుతుందని ముందే వూహించి వుంటే ఓ ఇరవై కోట్లు పడేసి ఏ బాంగ్లా దేశ్ నో శ్రీ లంకనో కొని పడేసి వుండేవాడిని. ఎంతయినా నాక్కూడా కొంచెం దేశ భక్తి వుంది" అన్నాడు విజయ్.

"ఓ యువ్ ఆర్ సొ పేట్రియటిక్, ఐ లవ్ యూ" అంటూ అతన్ని హత్తుకు పోయింది.

4 comments:

radhika said...

వావ్ సో వీజీ...బుర్ర వుంటే చాలన్న మాట.

ప్రవీణ్ గార్లపాటి said...

అదేదో అమలు చేసి మమ్మల్ని పార్ట్‌నర్లుగా చేర్చుకోగూడదూ ?

కథ బాగుంది, ఇప్పుడు జరుగుతున్న విచిత్రాల మీద మంచి విసురే.

Anonymous said...

రాధిక గారు/ప్రవీణ్ గారూ,

నేనొక పథ్కాన్ని రచించా మీరు కూడా భాగస్వాములయితే బావుంటుంది. తలా రెండు కొట్ల రూపాయలు పెట్టు బడి పెట్టండి :-)

పెట్టుబడి విహారి

parvathi said...

aboo intha easy na dabu sampadinchadam .........nee dagara ani kotlu uanyi kada naku ara koti ivvuu malli 1 samvatsaram lo 1ara koti add chesi istanu............