Friday, June 29, 2007

ఐ ఫోను – ఎన్టీఆర్

:

ఈ ఐ ఫోనుకు ఎన్టీఆర్ కు లంకెంటని “హా”శ్చర్య పోకండి. నేను మాట్లాడ బోయేది క్రేజు గురించి అనగా వెర్రి వేయి టైపులు గురించి .


మొన్నా మధ్య అంటే కొన్ని నెలల క్రితం షాపింగ్ కు వెళితే Best Buy షాపు పక్కన సందులో కుర్చీలు వేసుకుని బీరు తాగుతూ, దుప్పట్లు కప్పుకుని ల్యాప్ టాప్ మీద సినిమాలు చూసుకుంటున్నారు కొంత మంది. ఏంటి సంగతి అని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది ఆ రోజు రాత్రి హ్యారీ పాటర్ పుస్తకం విడుదల అవుతోందట. దాన్ని కొనటానికి అలా లైన్లో ఎదురుచూస్తున్నారు. ఆ పుస్తకం మీద వాళ్ళకున్న మక్కువ అంతది మరి. ఇలా ఎంత మందున్నారో అని చూస్తే అది కాస్త హనుమంతుడి తోక లాగా పక్క షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళింది. ఇలాంటి లైను గనుక మన దగ్గర వుంటే “చాయ్..చాయ్ గరం చాయ్“ అని బక్కెట్లో కప్పులేసుకుని అమ్మేవాళ్ళూ, “ టైం పాస్ బఠాణీ సార్, టైం పాస్ బఠాణీ సార్” అని గంపలో రూపాయి పొడవు కూడా లేని చుట్టిన పేపర్లో వేసిన బఠాణీలు అయిదు రూపాయలకు అమ్మేవాళ్ళూ కనిపిస్తారు. ఇక్కడ (అమెరికా) అభివృద్ధి చెందేసిన దేశం కనుక అలాంటి కప్పులోళ్ళను, బఠాణీ గాళ్ళను రానివ్వరు. వారి స్థానాల్లో కెమరాలూ, మైకులు పట్టుకున్న ముద్దు గుమ్మలు కనిపిస్తారు. పైన ఏ “9 న్యూస్” వాడో “తొంభై తొమ్మిదో న్యూస్” వాడో హెలికాప్టర్ లో నుండి ఇంకో కెమరా కిందికి పెట్టి ఫీట్లు చేస్తూ ఆ లైను చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఏ దిక్కుమాలినాడో రాత్రంతా మేల్కొని పొద్దున్నే ఎండ బడకుండా ఓ పుస్తకాన్ని మొహమ్మీద వేసుకుని గురకలు పెట్టేవాడు కనిపిస్తే వాడి ముఖాన్ని క్లోజప్ లో చూపిస్తారు. ఇలాంటి సీను మళ్ళీ ప్రత్యక్షం ఇప్పుడు ఐఫోన్లకోసం.

అసలు విషయంలోకి వచ్చేముందు మన క్రేజు గురించి కొంచెం. నేను మదనపల్లె లో ఇంటర్ చదివేటప్పుడు మా రూము పక్కన ఒక టీ కొట్టు వుండేది. అందులో మస్తాన్ అని ఒక ఎన్టీఆర్ వీరాభిమాని వుండేవాడు. అవి జస్టిస్ చౌదరి, కొండ వీటి సిం హం లాంటి అన్న గారి సినీ జగత్తు శుక్ల మహర్దశ రోజులు. మస్తాన్ టీ కొట్టులో పనిచేస్తున్నందుకు రోజుకు మూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు. అతనికి ఇల్లు కూడా వుండేది కాదు. ఆ వీరాభిమాని అన్న గారి ఫోటో ఫ్రేము ఒకటి చేయించుకున్నాడు ఓ ఇరవై రూపాయలు పెట్టి. దాన్ని దాచుకొనేదానికి స్థలం లేక మా రూములో పెట్టేవాడు. రెండు మూడు రోజులకొకసారి రూముకు వచ్చి ఆ ఫోటో తీసి తనివి తీరా చూసుకుని మళ్ళీ ఆ ఫోటో రూములో భద్రంగా పెట్టి వెళ్ళి పోయేవాడు. పరీక్షలయిపోయాక మేము రూము ఖాళీ చేసేటప్పుడు ఎంతో బాధ పడ్డాడు ఆ ఫోటో పెట్టుకోడానికి మళ్ళీ భద్రమైన చోటు దొరుకు తుందో లేదోనని.


ఐఫోన్లో కొస్తే ఈ ఐఫోన్ల గురించి ఇప్పటికే తెలుగు బ్లాగుల్లోకి వచ్చేశాయి వాటి గురించి ఇక్కడోసారి , ఇక్కడోసారి, ఓపికుంటే ఇక్కడింకోసారి చదువుకోవచ్చు. ఈసారి మాత్రం దీని క్రేజు బాగా నషాలానికంటింది (స్పెల్లింగ్ ప్లీజ్..) మన శివాజీ సినిమా లాగా. వాడెవడో శుక్ర వారం సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యే ఐ ఫోను కొనడానికి సోమ వారం పొద్దున 4 గంటలకు న్యూయార్క్ ఆపిల్ స్టోర్స్ ముందు కుర్చీ వేసుకుని ఎదురుచూస్తున్నాడట. ఇంకోడెవడో దీన్ని కొనటానికి వాడి బైకూ, కారూ రెండూ అమ్మేశాడట ( రెండూ కలిపి అయిదొందల డాలర్లు చెయ్యలేదేమొ). టి.వి. లో వార్తలు పెడితే చాలు ఎవడో ఒకడి ముక్కులో మైకు పెట్టైసి వాడు చెప్పే సోది అంతా వినిపించేస్తున్నారు. వాడు వాడి జబ్బ మీద వున్న తేళ్ళూ పాముల పచ్చ బొట్లు చూపిస్తూ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఇంకొకావిడెవరో నోట్లోని నాలుక మీదున్న రింగులు బయటికి వెళ్ళబెట్టి "నా రింగూ.. ఐ ఫోను రంగూ" అని పళ్ళికిలించేస్తోంది. అందరూ శుభలేఖ సినిమాలో సుధాకర్ అన్నట్టు "బికాజ్ ఐ లవ్ ఐఫోన్" అంటున్నారు.ఇలా లైన్లో వున్నోళ్ళకు నీళ్ళూ, జ్యూసులు అందించే ధర్మ దాతలు కొందరు.


ఇదిలా వుండగా ఆపిల్ కంపెనీ వాళ్ళ లెక్క ప్రకారం 2010 కి వీళ్ళు ఒక కోటి ఐఫోన్లు అమ్ముతారంట. మన GDP ఇప్పుడు ఒక బిలియెన్ డాలర్లు(1$=40Rs). అంటే 2010 కి వాళ్ళ అమ్మకాలు ఇప్పటి మన GDP కి అయిదింతలు.



మన భారత్ లో 2008 కి కానీ విడుదల కావట. కొసమెరుపెంటంటే వీటిని $25 కి unlock చేస్తామని డిల్లీ పాలిక బజార్ వాళ్ళు చెబుతున్నారట. జై హైటెక్ భారత్.


:


లేఖిని
వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.

:

Thursday, June 28, 2007

పెళ్ళాం ఊరెళితే……

:


లేఖిని
వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.

:


కొండలు నిర్మించబడతాయి ఇలా.

రోజుకు మూడు బీర్లు తాగి సోఫా మీద వేసి
తాగేసిన టీ కప్పులు సింకులోకి విసిరేసి
వదిలేసిన బట్టలు గుట్టగా పడేసి
ఇంటికొచ్చిన ఉత్తరాలు చింపి పోసి

ఇంకా అడ్డూ ఆపు లేకుండా

అన్ని రూముల్లో ఒకే చానల్ పెట్టుకొని ఇల్లంత తిరగొచ్చు. నో చక్రవాకం, నో లక్ష్మి, నో ఝాన్సీ…నో సీరియెల్స్. నో వంటా వార్పూ చానెళ్ళు.
షేవింగ్ చేసుకునేప్పుడు కొళాయి తిప్పెయ్యొచ్చు నిరంతరంగా.
టూత్ పేస్టు మూత ఒపెన్ చేసి పెట్టచ్చు.
పాలు ఎన్ని సార్లయిన పొంగించొచ్చు బర్నర్ మార్చుకుంటూ.

ఆహా ఏమి హాయిలే.



:

Tuesday, June 26, 2007

నాకు నచ్చని బ్లాగులు -- సరికొత్త శీర్షిక

:


లేఖిని
వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.

:


ఈ మధ్య నాకు నచ్చని టపాలు కొన్ని వస్తున్నాయి.వాటిని అరికట్టాలనే కోరికతో ఎంతో వినూత్నమైన, విశిష్టమైన, విలక్షణమైన, విభీషణమైన,భయంకరమైన, భీభత్సమైన, రౌద్రమైన....ఇంకా....ఇంకా ఇలాంటి వెన్నో లాంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టా. ఈ దెబ్బ తో నాకు నచ్చని "ఖిచ్ ఖిచ్" టపాలన్నీ మాయం. అదేమిటంటే చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నా. నాకు నచ్చని బ్లాగుల పేర్లు దిష్టి బొమ్మలాగా, బూడిద గుమ్మడికాయ లాగా, నల్ల తాడుకు చుట్టిన పటిక రాయి లాగా, ఎండి పోయిన నిమ్మకాయ లాగా ఇక్కడ వేలాడ దీస్తాను. అంటే గింటే ఏమీ లేదు అలాంటి వాటిని ప్రతి రోజూ "ఈ రోజు నాకు నచ్చని బ్లాగు(లు)" కింద వాటి పేర్లు వేలాడ దీస్తా. మళ్ళీ అంటే ఇది కూడలికి(తేనెగూడు, తెలుగుబ్లాగర్స్ కు కూడా) దిష్టి చుక్కన్నమాట. ఎన్ని దిష్టి చుక్కలున్నాయో చూసుకోవాలంటే పక్కనో లుక్కేయ్యాలి.


:

Monday, June 25, 2007

ఈ మధ్య రిలీజయిన సస్పెన్స్, హారర్, ఎమోషనల్ సినిమాలు.

:


లేఖిని
వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

హమారా కోచ్:

క్రికెట్ మీద సినిమాలు రాలేదన్న క్రికెట్ అభిమానుల దురద ఈ సినిమా తీరుస్తుంది. “దురదాకు పూసుకున్నోడికి గోక్కున్నంత” అనే ట్యాగ్ లైన్ చక్కగా నప్పుతుంది. మన దేశ క్రికెట్ తీరుతెన్నుల గురించి అందులో మన క్రికెట్ భవిష్యత్తు గురించి ఎంతో పాటుపడుతున్న కొందరు ICCB పెద్దలు తీసిన ఈ చిత్రం ఈ మధ్య వచ్చిన సస్పెన్స్ మరియూ హారర్ చిత్రాలను మరిపించింది. మొదట వై మోర్ ను కోచ్ గా తీస్కుని వస్తామని బాగ ప్రచారం కల్పించి జాన్ జింబురే ని కోచ్ పదవికి పరిశీలిస్తున్నామని చెప్పి ప్రేక్షకులను ట్విస్టుకు గురి చేస్తాడు దర్శకుడైన దురార్. విదేశీ కోచ్ వద్దన్న గనిల్ సువాస్కర్ జాన్ జింబురే పేరును ప్రతి పాదించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. క్లైమాక్స్ లో వై మోర్ ను , జాన్ జింబురే ను కాదని ఇంకొకరిని ఇంటర్వూ కి పిలిచి అతన్ని సెలెక్ట్ చేశామని చెబుతారు ICCB పెద్దలు. చివరకు అతను కోచ్ పదవిని స్వీకరించాడా లేదా? అతను భారత దేశానికొచ్చిన తరువాత ఎదురుపడ్డ ప్రమాదకర సన్నివేశాల్ని ఎలా ఎదుర్కొంటాడు అన్నవి తుంగ పార్కర్ స్క్రీన్ ప్లే లో తెలుసుకోవాల్సిందే. తప్పక చూడండి మీ అభిమాన క్రికెట్ టి.వి. లో.


ది ప్రెసిడెంట్:


ఇది సమిష్టిగా మూడు కూటములు కలిసి తీసిన చిత్రం. దర్శకులు ఇంకా ఎక్కువే. తెర మీద పేర్లు అయిపోగానే ప్రేక్షకులందరికి అర్థమయిపోతుంది వచ్చే ప్రెసిడెంట్ ఎవరో. అధికార పక్షం నిలిపిన అభ్యర్థే అందునా మహిళా రాష్ట్రపతి వస్తున్నారని అందరూ అనుకున్నంతలో మూడో కూటమి తయారయి అంతవరకు ప్రజల మన్నలు పొందుతున్న రాష్ట్రపతి పేరును తెర పైకి తీసుకు రావడంతో మొదలవుతుంది అనుకోని ఉత్కంఠ. ఎవరు నామినేషన్ వేస్తారో, ఎవరు విత్ డ్రా చేసుకుంటారో, ఎవరు గెలుస్తారో అనే ఉద్విగ్నం కలుగుతుంది. ఒకర్ని మించి మరొకరు స్వచ్చమైన రాజకీయ పరిభాషలో ‘సంప్రదాయకరంగా’ మాట్లాడుకుంటారు. అక్కడినుండి అంధికార రాజకీయ రాబంధులు తమ కడుపులోని కుళ్ళును నోటి ద్వారా రప్పించడంతో తెర మొత్తం జుగుప్సా కరంగా అసహ్యంగా మారుతుంది. మిక్కిలి పవిత్రమైన పదవిని ఎలా మకిలీ చెయ్యచ్చో ఈ నకిలీ ప్రజా సేవకులను చూసి తెలుసుకోవల్సిందే. చివరికి మూడో కూటమి ప్రతిపాదించిన వ్యక్తి భావోద్వేగానికి గురి అయి ఈ మాలిన్యంలో నేనుండలేనని చెప్పిన తరువాత కథ ముగుస్తుంది. తనే ప్రేక్షకులందరి చేత ‘సెభాష్’ అనిపించుకొంటాడు. సినిమా అంతా అయిన తరువాత ప్రేక్షకులు ఒక భావో ద్వేగానికి(వాంతులకు, వికారాలకు) గురికావడం సమిష్టిగా పనిచేసిన దర్శకుల నైపుణ్యానికి ప్రతీక. ఇందులో నటించిన పూలూ ప్రసాద్ పలావ్ అందరి కన్నా ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు.


-- :0: --

Thursday, June 21, 2007

సీనుగాడి ఇండియా ప్రయాణం. – 3

:


లేఖిని
వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

అలా కారు కీస్ కోసం పరుగులు పెడుతున్న సీనుగాడికి కారు “గీ..గీ.. కుయ్యువ్..కుయ్యువ్…వుళ..వుళ.. హాండా..బోండా ” అని సౌండు వినిపించే సరికి కారు కీస్ కోసం కాక కారు దగ్గరికి ఇంట్లోని డోరు ద్వారా గరాజ్ లోకి పరుగెత్తాడు. అసలే కారు గరాజ్ మూసి వుండటం వల్ల కారు చేసే శబ్దం తో పాటు వెలుగుతూ ఆరిపోతూ వున్న కారు లైట్లు కనిపించాయి.అది చూసిన సీనుగాడికి విఠలా చార్య సినిమాలో ఒంటి కన్ను రాక్షసుడి గుహ సాక్షాత్కరించింది. ఎంత స్పీడుగా వచ్చాడో అంతే స్పీడుగా పి.టి. ఉష ను తలుచుకుని 'మాస్క్' సినిమాలోని జిం కారీ లా సుడి గాలి అయిపోయి కూతురున్న గదిలోకి ప్రవేశించాడు.



“తుర్ర్.. బుర్ర్.. కె..కె. కేకే.. తుర్ర్ బుర్ర్” అనుకుంటూ చేతిలో కారు కీస్ తో ఆడుకుంటూ కనిపించింది పుత్రికా రత్నం. దగ్గరకు పోయి “చీ..చీ.. బుజ్జి.. కన్నా.. కారు కీస్ ఇవ్వమ్మా” అని కీస్ తీసుకోబోయాడు. కారు కీస్ వెనక్కి తీసేసుకుని తన చిన్ని కాలుతో ఒక్క తన్ను తన్నింది. ఆ తన్నుడికి సీనుగాడి కళ్ళద్దాలు గాల్లో రెండు పల్టీలు వేసి కింద పడబోతే మహమ్మద్ కైఫ్ లాగా మూడు పల్టీలు వేసి ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు. మళ్ళీ దగ్గరకు పోయి “నా చిట్టి తల్లి కదూ ఆ కీస్ ఇచ్చెయ్యమ్మా” అని ముందుకు వంగాడు.


ఈ సారి కీస్ పక్కన పడేసి “తుర్ర్..తుర్ర్…” అని చొంగ తో ఓ పెద్ద గాలి బుడగ చేసి సీనుగాడి మొహమంతా పావనం చేసింది. మొహం కో-ఆప్టెక్స్ కట్ బనీనుతో తుడుచుకుని మళ్ళీ దగ్గరకి వెళ్ళి “నీకు అన్నీ మీ అమ్మ బుద్దులే వచ్చాయి. వేలెడంత లేవు కానీ నాతోనే ఆటలాడుకుంటున్నావే…”



అంతలో అలివేలు పేద్ద కేక పెట్టింది “ ఏమండీ ఇందాకా మీరు ఫోనులో వుంటే అమ్మాయి ఏడుస్తోందని ఏమీ దగ్గర లేక పోతే కారు కీస్ దాని చేతిలో పెట్టాను. అది ఆడుకుంటూ పానిక్ బటన్ నొక్కినట్లుంది.ఆ కీస్ తీసుకొని కారు సౌండును కాస్త ఆపండి వినలేక పోతున్నా.”



“అవును ఆ కాస్త సౌండే నువ్వు వినలేక పోతే. మూడేళ్ళ నుండు నీ నుండి వస్తున్న సౌండు వింటున్న నా పరిస్తితేంటి” అని మనసులో అనుకుని. ”ఆ..ఆ అలాగే తీసుకుంటున్నా” అన్నాడు. కారు కీస్ తీసుకోబోతే బుడ్డిది ఎడమ చేతిలోకి కీస్ తీసుకొని కుడి చేత్తొ సీనుగాడి చెంప మీద ఒక్కటిచ్చింది. ఛెంపలు నిమురుకుంటూ “ఏదో కళ్ళు అందంగా వున్నాయి కదా అని ఒక మంచి పేరు హరిణి అని పెడితే నాకు హరి హరాదులు గుర్తుకు వచ్చేటట్టు చేస్తావా? నీకు మీ అమ్మమ్మా వాళ్ళు పెట్టిన వీర వెంకట బాల త్రిపుర జ్ఞాన మంగ సుబ్బాయమ్మ అనే పేరే ఖాయం చేసుండాల్సింది.నిన్ను స్కూల్లో వేసేటప్పుడు ఆపేరుతోనే రిజిస్టర్ చేయిస్తా. అలా కాదు గానీ ఈ రొజునుండి నిన్ను బుడిగి అని పిలుస్తా”


హరిణి రెండు కాళ్ళతో “డిష్యుం.. డిష్యుం…” ఈ సారి సీనుగాడి గడ్డం అతిధ్యం స్వీకరించింది.


ఇలా అయితే నా పని హైద్రాబాద్ లో సిటీ బస్సెక్కిన ప్యాసింజర్ లా అయిపోతుందని బుర్రని గోడకే పదును పెట్టాడు. నగేష్ గాడికి కొడుకు పుట్టబోయే ముందు తను ప్రజెంట్ చేసిన బుక్కు గుర్తుకు వచ్చింది. బాల నేరస్తుల శిక్షణాలయం నుండి తప్పించుకుని వచ్చిన తరువాత డా: బాల్యేష్ జెఠ్మలాని వ్రాసిన ఆ బుక్కు పేరు “పిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి”. వాడికి ఇచ్చేముందుపి తనకు భవిష్యత్తులో అవసరమవుతుందేమోనని ఆ బుక్కుని కంఠతా బట్టీ వేసేసి కవర్ నలిగిపోతే ఈనాడు పేపర్ తో అట్ట వేసి ఇచ్చేశాడు. అప్పుడు తను చేసిన తెలివి పనికి ఒక్కసారి సంబరపడిపోయాడు. వెంటనే ఆ బుక్కుని గిర్రు మని రౌండేసి పదకొండో పేజీ దగ్గర ఆగి పోయాడు తన కీవర్డ్ సెర్చ్ కి మ్యాచ్ కాగానే. “పిల్లలు పాతది మరచి పోవాలంటే కొత్తది ఏదయినా అలవాటు చెయ్యాలి” అదే ఆ పేజీ సారాంశం.ఇప్పుడు కారు కీస్ మరిచిపోవాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి. నా కళ్ళద్దాలు ఇచ్చేస్తే..ఆహా భేషయిన అవుడియా. వెంఠనే అమల్లో పెట్టేశాడు.


అంతవరకు రెండు చేతులతో కీస్తో ఆడుకుంటున్న హరిణి కారు తాళాన్ని ఎడమ చేతిలోకి తీసుకుని కుడి చేత్తో కళ్ళద్దాలు తీసుకుని రెండింటితో ఆడుకోవటం మొదలు పెట్టింది. తాళాలు లాక్కో బోతే “వా…. వా…” అని రాగం మొదలుపెట్టింది.


“ఏమండీ ఇంకా ఎంత సేపు? ఆసలే కారు సౌండుకు చెవులు పగిలి పోతుంటే మీరు అమ్మాయిని ఏడిపిస్తారా?” బయటి నుండి అలి వేలు మండిపాటు.


చివరికి ఇలా కాదని అరబిక్ ట్యూన్స్ తో వున్న తెలుగు పాట లో నేటివిటీ కోసం వీణ సౌండును ఇరికించినట్లు కారు తాళాలు అలానే వుంచి కారు రీమోట్ లాక్ తో పానిక్ సౌండును ఆపు చెయ్యగలిగాడు. వెంటనే పాంటాప్ తీసుకుని “పిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి “ బుక్కులోని 11 వ పేజీ సూత్రం కొందరికి మాత్రం వర్తించదు అని రాసుకున్నాడు.



అప్పటికే సమయం మించిపెఒవడం వల్ల పుత్రికా రత్నాన్ని అలానే కారు సీట్లో వుంచి కారు సీటును తీసుకెళ్ళి కారులో పెట్టాడు.

అంతలో వేలు వచ్చి కారులో కూర్చుంది. సీనుగాడు లోపలికి వెళ్ళి డ్రెస్సు మార్చుకుని బూట్లు వేసుకుని వచ్చి కారు సీట్లో కూర్చున్నాడు.

“ఇంకా ఎందుకాలస్యం కారు స్టార్ట్ చెయ్యండి” అలివేలు.

“ఈ..ఈ..” అని పళ్ళికిలించాడు.

“ఆ ఇకిలిపేమిటి కారు స్టార్ట్ చెయ్యక”

ఈ సారి కళ్ళు మాత్రమే తిప్పాడు బేబీ సీటు వంక చూపిస్తూ.

“అలసిపొయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ లా ఆ కళ్ళు తిప్పడమేమిటి తిన్నగా చెప్పచ్చుగా”

కళ్ళు తిప్పటంలో అనుభవం వచ్చేసిందో లేక అలివేలు అర్థం చేసుకుందో…” ఓ.. కారు కీసు పాప దగ్గర వుండిపోయాయా” అని

“బుజ్జు కన్నా! నాన్న కారు కీస్ ఇచ్చెయ్యమ్మా” అనగానే బుడిగి కీస్ తీసి వాళ్ళమ్మ చేతిలో పడేసింది. ఆ సీను చూసిన సీనుగాడికి “పిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి” అనే బుక్కుని పర పరా చింపేసి డా: బాల్యేష్ జెఠ్మలానీను కారు కిందేసి తొక్కించేయాలన్నంత కోపమొచ్చింది.


అలివేలిచ్చిన కీస్ తీసుకుని మళ్ళీ పళ్ళికిలించాడు కార్ స్టార్ట్ చెయ్యకుండా.


“మళ్ళీ ఏమయింది మీకు….ఓహో కళ్ళద్దాలు లేవా? ఆగండి” అని బుడిగిని చూసి “ చీ చూడమ్మా నాన్నకు రోడ్డు సరీగా కనిపించ దంట ఇవి లేక పోతే ఏ ట్రక్కంకుల్ నో, గ్రాండ్ మా కారునో గుద్దేస్తాడు. ఈ సారి నాన్నారొక్కరే కారెక్కినప్పుడు మనం ఇంట్లో వుండి కళ్ళద్దాలతో ఆడుకుందాం. ఓ సారిచ్చెయ్యమ్మా!. కావాలంటే కారు దిగిన తరువాతా మళ్ళీ ఇస్తాలే.”


బుడిగి తల అడ్డంగా ఊపింది.


“ఏమండీ మీ పర్సు ఇలా ఇవ్వండి” అని పర్సు తీసుకొని బుడిగికి ఇవ్వగానే కళ్ళద్దాలు ఇచ్చేసింది.పాం టాప్ తీసుకుని ఏదో నోట్ చేసుకో బోయాడు.


"ఇంతవరకు రాసింది చాల్లే"


అలివేలు ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకుని కారు స్టార్ట్ చేసాడు. తన పర్సు బదులు అలివేలు హ్యాండ్ బ్యాగ్ ఇవ్వచ్చుగదా అనే చచ్చు ప్రశ్నలు వెయ్యలేదు సీనుగాడు, ద జెంటిల్ మెన్. డా: దుమారం రాసిన బుక్కులు చదవడం వల్ల కలిగిన జ్ఞానం అది.


కారు పార్కింగ్ లాట్లో ఆపాడో లేదో దూరంగ ఒక దేశీ జంట కనిపించింది. వాళ్ళు కనిపించగానే అలివేలు “అదిగో చూడండీ ఎవరో దేశీలు” అంది.

“సర్లేవే దేశీలు షాపింగ్ చెయ్యరా ఏంటి” అన్నాడు కారు పార్క్ చేసి. కారు తాళాలు బుడిగికి ఇచ్చేసి తన పర్సు తీసుకుని కారు సీటును స్ట్రాలర్ లో పెట్టాడు.


అలా కొంత దూరం రాగానే ఆ దేశి జంట వీళ్ళ దగ్గరకు వచ్చి పలకరించింది.


“హలో, హౌ ఆర్యూ? ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యు బిఫోర్” అన్నాడు.

సీనుగాడి బుర్రలో ఎర్ర లైటు దేదీప్యమానంగా వెలిగి పోతోంది. తరువాత ఏమంటాడో కూడా తెలుసు.

“హె యు లైక్ తెలుగు పీపుల్. ఆర్ యు ఫ్రం ఆంధ్రా?” మళ్ళీ తనే అన్నాడు.


మిగిలిన సీనంత సీనుగాడికి అర్థమయి పోయింది. తర్వాత వాడు “మీరేమి చేస్తారు అంటాడు. మనము అడక్కపోయినా వాడికో బిజినెస్ వుందంటాడు.దాని పేరు ఈ కామర్సంటాడు. దానికో బంగారు తీగుందంటాడు.తొంగుంటే మీ నోట్లే కరిగిస్తానంటాడు. దాన్ని మీ ఇంట్లో వేస్తానంటాడు. వాడి వెనకో మిలియనుందంటాడు. రెసిడ్యువల్ ఇన్ కమంటాడు. నువ్వు ముగ్గుర్ని చేర్పించాలంటాడు. తరువాత పిరమిడ్ అంటాడు. మమ్మీ లంటాడు, ఈజిప్టు అంటాడు, ఆఫ్రికా అంటాడు. వీళ్ళ దుంప తెగ ఇంతకు ముందు ఇలాంటోళ్ళు ఒంటరి గాళ్ళనే పట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఏకంగా జంట గా వచ్చి జంటలకే టెండర్ వేస్తున్నారు. ఇలా ఆలోచించేలోపే ఆ వచ్చినోడి ఆవిడో మరే ఆవిడో తెలీదు కానీ అలివేలుతో తొక్కుడు బిళ్ళాడేసి, “అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ” అన్నంత క్లోస్ అయిపోయి బుడిగిని ఎత్తుకొని ఆడిస్తోంది.

ఇలా పరిచయాలు పెంచుకొని వాళ్ళ స్కీముల్లో చేరమని వెంట పడతారు. ఇక్కడే తుంచెయ్యటం మంచిది.

“మాస్టారూ మీది హైద్రాబాదా” ఆ సచ్చినోడి పలక్రింపు.

“కాదు పులివెందుల”

“మీరేమి చేస్తుంటారు”

“బాంబులు తయారు చేస్తుంటా”

“మీరు భలే జోకులు వేస్తారు. మీ లాంటి వాళ్ళుంటే మా బిజినెస్ చాలా బాగా ప్రాస్పర్ అవుతుంది. ఇంతకూ మీరు ఖాళీ సమయాల్లో ఏమి చేస్తుంటారు”

“రేప్ లు చేస్తుంటా” ఆ వచ్చినావిడ వైపు కొర కొరా చూస్తూ అన్నాడు సీనుగాడు,అప్పుడప్పుడూ ద ఫైర్ ఇంజెన్.

సీను అర్థమయి పోయిన ఆ దేశీ జంట పరుగో పరుగు.

“ఎందుకండీ వాళ్ళనలా బెదర్గొట్టేశారు” అలివేలు.

“నీకు అన్నీ చెప్పా గానీ ఈ ఒక్క ఎపిసొడ్ గురించి చెప్పలేదు కదూ. ఇలా కొంత మంది పరిచయాలు పెంచుకొని మీ బాసుని కాల్తో తన్నెయ్, మీ కంపెనీని గోటితో గోకెయ్ అని చెప్పి ప్రమోషన్ స్కీములంటూ ఇంటికొచ్చి పడతారు. ఇంట్లో వున్న చెట్లకు పుట్లకు డాలర్లు కాస్తాయ్ అని చెప్తారు”

“అవేమి స్కీములండీ?”

“ఇప్పుడవన్నీ ఎందుకులే తొందరగా పదా ఎవరన్న దేశీలు ఇలా పలకరించారంటే దానర్థం వాళ్ళకు ఇలాంటి ఈ-కామర్స్ బిజినెస్ లున్నాయని అర్థం. ఇలాంటోళ్ళను చూడగానే వై.యెస్. కిలారి పాల్ ను చూసినట్టు చూడాలి”


“అలాగలాగే ఏదో అడిగాం కదా అని పెద్ద యండమూరి లాగ కథ చెప్పకండి. ముందు ఈ స్ట్రాలర్ తీసుకుని బుడ్డి దాన్ని ఆడిస్తూ వుండండి”


మాల్ లోకి ప్రవేశించారు. ముందు అలివేలు నడుస్తుంటే వెనక స్ట్రాలర్ తోసుకుంటూ సీనుగాడు. అక్కడ వెళ్తున్న అందమైన అమ్మాయిల వంక అలివేలు వంకా చూసుకుంటూ “ప్చ్! పెళ్ళప్పుడు వర్షం సినిమాలో త్రిష లాగుండే నా భార్య ఇప్పుడు కిత కితలు సినిమాలో అల్లరి నరేష్ భార్య గీతా సింగ్ లాగా అయిపోయింది” అనుకున్నాడు. నడక లో కొంచె వెనక పడ్డాడు సీను గాడు. వాళ్ళావిడ కనిపించక్ పోయేసరికి ఆత్రంగ వెతికాడు ఒక షాపు దగ్గర. అక్కడ అలివేలు ఎవరో దేశీ జంటతో మాట్లాడుతోంది.


“ఎన్ని చెప్పినా వినదు ఈ అలివేలు. మళ్ళీ ఏ ఆమ్వే జంటో క్విక్ స్టార్ జంటో తగిలినట్లుంది. లాభం లేదు ఈ సారి దులుపెయ్యాలి అని ఆంజేయ స్వామి దండకం అక్కడే నాలుగు సార్లు చదివి కానిఫిడెన్స్ వచ్చాకా అయిదో సారి చదువుకుంటూ దగ్గరికి వచ్చాడు.

“హె శ్రీనివాస్, బావున్నావా? నువ్వు ఇండియా వెళుతున్నావని తెలిసింది.” పాత ఆఫీసులో పని చేసే మనొహర్. వాళ్ళావిడతో కలసి షాపింగ్ కు వచ్చినట్టున్నాడు.


“హె మనోహర్ బావున్నా నువ్వెలా వున్నావ్?”


“బాగున్నా. మొత్తానికి మూడేళ్ళ తరువాత వెళ్తున్నావ్. హైద్రాబాద్ చాల మారిపోయింది తెలుసా? అక్కడ సైట్లు ఏమైనా కొంటున్నావా? నా బామర్ది రియాల్టర్ గా పని చేస్తున్నాడు.” మనోహర్

“అవునండీ మా తమ్ముడు బాగానే సంపాదిస్తున్నాడు అక్కడ. మీకు కావాలంటే చెప్పండి కొంచెం తక్కువకు ఇప్పిస్తాడు" వాళ్ళావిడ.
"అప్పిస్తాడా?" సీనుగాడు

"లేదండీ కావాలంటే అప్పిప్పిస్తాడు"

"అప్పిస్తాడా?"

"అలాంటి పనులు చెయ్యడండీ"

"నా దగ్గిర ఓ నాలుగు వేలు రూపాయలు మిగలచ్చు. దానితో ఏదయినా ప్లాటు కొనచ్చా?"

"నాలుగు వేలతో ఏమీ రాదండీ"

"నాలుగు వేలు డౌన్ పేమెంటు ఇచ్చినా ఏమీ రాదా"

"రాదండీ"

"అలా అయితే నాకేమీ ఒద్దండి"

ఇదంతా చూసిన మనోహర్ కల్పించుకొని "అరె శ్రీనివాస్ ఈ మధ్య బాగా జోకులు వేస్తునావ్. అది సరే గానీ ఈ మాల్ కి ఇండియా షాపింగ్ కోసం వచ్చారా"

"లేదు కాంబోడియా కెళ్ళి ఇక్కడ కొన్న డ్రెస్సులు అక్కడ ఒరంగ్ ఉటాన్ లకు వేసి టైటుగా వున్నాయో లూజుగా వున్నాయో కనుక్కుందామని"

"అబ్బా నవ్వ లేక చచ్చిపోతున్నా శ్రీనివాస్. ఇక ఆపేయ్"

"అలాగే ఇక మేము వెళ్ళమా?"

"అరే చెప్పడం మర్చిపోయా నువ్వు ఇండియా వెళ్తున్నావని తెలిసే మేము కూడా షాపింగ్ కు వచ్చాం."

నేను ఇండియా వెళ్తుంటే వీడు షాపింగ్ చెయ్యడమేమిటి? ఎర్ర బల్బు పెద్ద కాంతితో "నువ్వు మళ్ళీ డమాల్" అంది.

"అలాగా! ఏం పాపం మీరు ఇండియా వెళ్ళేటప్పుడు డబ్బుల్లేవా?"

"వున్నాయి కానీ మొన్న ఇండియాకు ఫోను చేసినప్పుడు నా తమ్ముడికి ఒక మంచి రీమోట్ కంట్రోల్ హెలికాప్టర్ కావాలన్నాడు. అది కొని మీ చేత పంపిద్దామని అనుకొ...."

"వేలూ. డూ యూ నో హూ దిస్ ఫెల్లో ఈజ్?. లెట్స్ డూ అవర్ షాపింగ్ ఫాస్ట్" అని స్ట్రాలర్ నెట్టుకుంటూ అక్కడున్న గుంపులోకి దూరిపోయాడు.

మనోహర్, వాళ్ళావిడ తేరుకుని చూసేసరికి సీనుగాడి ఫ్యామిలీ మొత్తం మాయం.

"నీ జిమ్మడ! నువ్వు ఏదయిన సైటు కొను హైద్రాబాదు లో మా తమ్ముడికి చెప్పి ఏదో ఒక లిటిగేషన్ పెట్టిచేస్తా" అని శాపనార్థాలు పెట్టింది మనోహర్ వాళ్ళావిడ.

వాళ్ళనుండి తప్పించుకొచ్చిన సీనుగాడు సోనీ షాపులో దూరి 62'' టీ.వి. వెనక నక్కి దాక్కునాడు. అక్కడ ఎవరూ దేశీలు లేరు అని తెలిసినప్పుడు మాత్రం బయటికి వస్తున్నాడు.

"వేలూ, ఇలా అయితే మనము షాపింగ్ చేసినట్లే. నేను వెళ్ళి ఆ ఫుడ్ కోర్టు పక్కన మూల నున్న టేబుల్ దగ్గర దాక్కోని మన బుడ్డి దాన్ని చూసుకుంటూ వుంటాను నువ్వు షాపింగ్ ముగించుకొని వచ్చెయ్" అన్నాడు.

"అలాగే పాప జాగ్రత్త" అని అలివేలు వెళ్ళి పోయింది.

ఫుడ్ కోర్టు లో మూల వున్న టేబుల్ దగ్గరకెళ్ళి అటు వైపు తిరిగి కారు సీట్లోకి మొహం పెట్టి పాపతో ఆడుకుంటున్నట్లు నటిస్తూ వున్నాడు.

ఇంతలో బుడ్డిదానికి ఆకలి వేసి కెవ్వు మంది. పాపం ఆకలిగా వున్నట్లుంది పాలు కలుపుదామని తల పైకెత్తి పాల డబ్బా కోసం ఇటు తిరిగాడు.

"అరే సీను! నువ్వా ఎవడో సన్నాసి వెధవనుకున్నాను" ఎత్తుపళ్ళ నరసిం హం గాడు.

(సశేషం)

Wednesday, June 20, 2007

బ్లాగదాభి రామ బ్లాగర -- 5

:

గుండె నిండు టపానొక్కటైనను చాలు
హండ్రెడయిననేమి చెత్త టపాలు
స్పూర్తి కలుగు టపా పక్షానికొక్కటైనను చాలు
బ్లాగదాభి రామ బ్లాగర విహారి


గంగి గోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వధాభి రామ వినుర వెమ

:

Friday, June 15, 2007

ఇంగ్ కవిత

కొందరు బ్లాగింగూ
ఇంకొందరు నాగింగూ

కొందరు అలిగింగూ
ఇంకొందరు గులుగింగూ

కొందరు లాగింగూ
ఇంకొందరు రన్నింగూ

కొందరు రిగ్గింగూ
ఇంకొందరు మగ్గింగూ

కొందరు లింకింగూ
ఇంకొందరు లింపింగూ

కొందరు రీడింగూ
ఇంకొందరు స్లీపింగూ

కొందరు హైడింగూ
ఇంకొందరు హైబర్నేటింగూ

రాస్తా ఏదైనా అందరూ కూడలింగే
అపుడో... . ఇపుడో.... ఎపుడో ....


ఏమీ తోచక పోతే "పరదేశి" సినిమా లో పాట ".... కొందరు నూడుల్సూ.. ఇంకొందరు బర్గర్సూ.." వింటుంటే వచ్చిన హైపర్ పైత్య పేరడీ ఇది.

Wednesday, June 13, 2007

కామెంటు అవిడియాలు.

:


ఈ మధ్య తెలుగు బ్లాగులు కుప్పలు తెప్పలు గా వచ్చేస్తున్నాయ్. ఇదొక మంచి పరిణామం. ఏదో ఒకటి బరుకుతూనే వున్నారు. వార్తలు చదివడం తక్కువయిపోయి బ్లాగులు పట్టుకుని వేలాడే వాళ్ళెంత మందో. నా మటుకు నేనయితే మొన్నా మధ్య ఆఫీసులో కోడ్ రాస్తూ Clob datatype తో variable ఎలా డిక్లేర్ చేశానంటే clob_data బదులు blog_data అని. కంపైల్ చేస్తే ఇంకే ముంది? స్క్రీన్ నిండా అక్షింతలే. అలా బ్లాగులు చదివి అలసిపోయి వ్యాఖ్యలు రాయడానికి సమయం లేకుండా పోతున్న వాళ్ళ కోసం రాసింది ఇది. చెప్పాలనుకున్నది inscript లోనో RTS లోనో టైపు చేసి రాసే బాధ తప్పించుకోడానికి కొన్ని మార్గాలు అన్వెషించా. అన్నింటికి పుట అక్షరాలు కనిపెడితే ఎలా వుంటుంది అనే “మంచి దుర్మార్గపు” ఆలోచన వచ్చింది.(దుర్మార్గులలో కూడా మంచాళ్ళుంటారని అందరూ సహృదయత అర్థం చేసుకుంటారు కదూ). ఈ పుట అక్షరాలనే SMS లో వాడుతారు కదా. కొంచెం తిలకించండి. వీలయితే మీరూ కలపండి.


1. బా. (బావుంది)
2. చా.బా. (చాలా బావుంది)
3. చా.చా.బా (చాలా చాలా బావుంది)
4. అ.వు. (అధ్భుతంగా వుంది)
5. మ.వు. (మహాద్భుతంగా వుంది)
6. ఏ. (ఏడ్చినట్లుంది)
7. బా.రా. (బాగా రాసారు)
8. చా.బా.రా.(చాలా బాగా రాసారు)
9. అ.రా. (అద్భుతంగా రాసారు)
10. చ. (చండాలంగుంది)
11. చా.చ. (చాలా చండాలంగుంది)
12. బా.చె. (బాగా చెప్పారు)
13. చ.బా.చె. (చాలా బాగా చెప్పారు)
14. సూ. (సూపర్)
15. సూ.సూ. (సూపరో సూపరు)
16. అరి. (అదిరింది)
17. ఆ.చే.వ్యా.(ఆలోచింప చేసే వ్యాసం)
18. వీ.బు.రా.(వీళ్ళకు బుద్ది రాదు)
19. బా.నా. (బాగా నవ్వించారు)
20. బా.లో.సు.(బ్లాగు లోకానికి సుస్వాగతం)
21. అర్స్. (అదుర్స్)
22. అ.గొ.సా. (అదర గొట్టే సారు)
23. మ.వ్య.అ.ధ్య.(మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు)
24. హ1 (హహ్హ)
25. హ2 (హ..హ్హ..హ్హ)
26. ఆ.ట. (ఆలోచింప చేసే టపా)
27. చి. (చిమపెశావ్ పో)
28. మ.ట.ఎ.(మరిన్ని టపాల కోసం ఎదురుచూస్తూ)
29. మీ.వి.చా.బా.(మీ విశ్లేషణ చాలా బావుంది)
30. మీ.హా. (మీకు హ్యట్సాఫ్)
31. మీ.బ్లా.నా.బ్లా.ఒ. (మీ బ్లాగు నాకు నచ్చిన బ్లాగుల్లో ఒకటి)
31. మీ.క.చా.బా. (మీ కవితలు చాలా బావుంటాయి)
32. చా.రో.మ.ట. (చాలా రోజులకు మంచి టపా చూసా.)

Tuesday, June 12, 2007

డబుక్కు జర జర డుబుక్కు

(ఎప్పట్నుండో హెడ్లైన్ మాత్రమే రాసి పక్కన పెట్టిన వ్యాసానికి ఈ రోజు ఊపిరి వచ్చింది.)


ఎండా కాలం ఒచ్చిందంటే జాలు ఇంగ పిల్లోళ్ళందురుకీ పండగ. నాకబ్బుడు గెట్టిగా ఏడెనిమిది సమత్సరాలు గూడా లేవు. ఎబ్బుడు జూసినా ఆ చెరువుల కల్ల బాయిల కల్ల బడి తిరిగే పనే ఇరవై నాలుగ్గంటలూ. ఇస్కూల్లో లాస్ట్ రోజు స్కూలు పిల్లోడు ఒగడు రెండు చేతులూ చాంపుకొని దాని మింద రిజిస్టరు ని పెట్టుకోని క్లాసులోకి ఒచ్చేది కిటికీలో నుండి కనబడితే జాలు పక్కనోడిని ఆనందంతో వాడి రెట్ట మింద గిల్లేసి కొట్టేసి “ఒరేయ్ శేఖిర్ గా ఆడ జూడ్రా లీవులు చెప్పే బుక్కు ఒస్తా వుంది” అంటే.

దానికి వాడు రెట్ట రుద్దుకుంటా “అవును య్యోవ్ పొద్దున్నుండి అనుకుంటానే వుండా ఈ బుక్కు ఇంగా రాలేదేంది అని. ఇంగొచ్చేసింది గదా. మ్యాడం దాన్ని జదివి పొట్టి సంతకం పెట్టేస్తుంది. ఇంగ మనం లీవులంతా చేనుకాడికి, మడికాడికి పోవచ్చు. ఈ తూరి మామిడికాయిలు ఎక్కువ గదా మా తోపు లో కొచ్చేయ్ ఆడ మనం ఆడుకుందాం”.

“సరేరా ఆ పురుషోత్తంగాడిని మాత్రం పిలొద్దు మనం. వాడు మొన్న అత్తిరాసం ఇమ్మంటే ఈలా”.
“అట్లే లే య్యా”


ఇంతలో మ్యాడం ఆ బుక్కు తెచ్చినోడి నుండి బుక్కు తీసుకోని జదువుతుంది “ఈ సంవత్సరం బడి అయిపోయింది. మీ అందరికి ఈ రోజు నుండి అంటే ఏప్రిల్ 23 నుండి జూన్ 12 దాకా లీవూలు ఇస్తున్నారు. బడి జూన్ 13 వ తేదీ తెరుస్తారు. ఒకటో తరగతి పిలకాయలు రెండో తరగతికి. రెండో తరగతి పిలకాయలు మూడో తరగతికి పోతారు”. అంతే ఇంగేముంది ఇంకు పేనా తీసి సంతకం పెట్టి ఆ బుక్కు తెచ్చినోడికిచ్చేస్తే వాడు వాని నాలుగో క్లాసుకు వెళ్ళి పోతాడు. అంటే పక్క బిల్డింగ్ అన్న మాట. అందులో మూడు నాలుగు, అయిదు క్లాసులకు ఒగ అయివోరు వుంటాడు. ఆ అయివోరే లీవులు ఇస్తాడు. వాడు వెళ్ళిపోంగానే ఆ పెంకులిస్కూలు టాపు ఎగిరిపోయేటట్టు అందురూ అరుస్తారు. మ్యాడం “రేయ్, సైలంట్ గా వుండండి. ఇంగో గంట్లో స్కూల్ ఇసిపిట్టే బెల్లు గొడతారు అబ్బుడు అందురూ ఇంటికి పోవచ్చు.


ఇప్పుడు పైన చెప్పిన సీను చిత్తూరు జిల్లా, లద్దిగం గ్రామం లోని ప్రాథమిక పాఠశాల, డెబ్బయ్యవ దశకం. ఆ మ్యాడం మా అమ్మ. ఆ అయివోరు మా నాన్న. మొత్తం స్కూల్ స్టాఫ్ ఇద్దరే.బెల్లు కొట్టేదానికి మాత్తరం ఎబ్బుడూ అయిదోక్లాసు పిలకాయలుంటారు


“రేయ్, వసంతగా మీ బాయిలో నీళ్ళుండాయా ఈ సారి” అయివోరి చిన్న కొడుకు అడుగుతాడు. వాడి పేరు ఇంత వరకు తెలీక పోతే మీకు ఉక్కు ఫ్యాక్టరీ ఒకటిన్నర సమత్సరంలో కట్టెయ్యొచ్చనే తెలివి తేటలూ,నాలెడ్జి వుందన్నమాట. మీకంత విషయం లేదనుకుంటే వాడి పేరు ఈ బ్లాగు ఓనరి పేరు.

“ఈ తూరి చానా ఒచ్చేసినాయి య్యోవ్. ఎంతొచ్చినాయంటే మా బాయి చెరువులో మునిగి పూడిసింది”

“అయితే ఈ తూరికి మనం ఈత చెరువు మిందనే గొడదాం. మీ ఎనుముల్ని మేపేదానికి మీ యన్న తీస్కోనొస్తాడా నువ్వే నా”

“నా వల్ల్యాడవుతుంది సామి వాటిని సమాళిచ్చేదానికి? మా అధికారప్పన్న రావాల్సిందే” గర్వంగా చెప్పాడు.

“సరేలేరా ఎనుములొస్తాయి గదా వాటి మిందెక్కి చెరువులోకి పోదాం”


ఇంతలో సీను గాడు “య్యోవ్! ఈ తూరి హరికథలు ఎబ్బుడో తెలుసా నీకు”

“నాకెట్ల తెలు స్సుంది.మీ నాయినే గదా అన్నీ మాట్లాడేది పొయ్యి మీ నాయిన్నడుగు”

“అది కాదు గానీ నువ్వు బొయ్యి మ్యాడం నడుగు చీరామనవమి ఎబ్బుడో. అబ్బుడే గదా హరికథలు జెప్పేది”

“నువ్వుండు నేను బొయ్యి అడిగొస్తా”

నంగుకుంటూ టేబుల్ దగ్గిరికి బొయ్యి “మ్మా, ఈ తూరి హరికథలెబ్బుడు.”

“ఇంగో మూడు వారాలుంది" అమ్మ జెబుతుంది.

చొక్కా కాలరుతో ముక్కు తుడుచుకొని సీనుగాడి దగ్గిరికొచ్చి “రేయ్ ఇంగా మూడు వారాలే నంట్రా”

“అయ్యో అబ్బుడేనా నేను కొండయ్యగారి పల్లికి మా యవ్వోళ్ళూరికి ఎబ్బుడు బొయ్యేది ఇట్లయితే”

“ఈ తూరికి కాకపోతే వచ్చే తూరి పోవచ్చులే. ఇంగా దసరాలీవులుండాయి, సంకురేత్రి లీవులుండాయి”

“అవును గదా నేను ఆ సంగతే మరిసి బొయినా. మేము గానుగాడతా వుండాము రేపుట్నుండి లీవూలే గదా నువ్వొస్తావా? నీకు తట్ట బెల్లమూ, నక్కిలి ఇస్తా”

“యాడరా సామి యెండ్లెక్కువు గదా అంద్దూరం ఒచ్చేదానికి... మాయమ్మ చంపేస్తుంది. ఎట్లో ఒగట్ల టోకరా ఇచ్చి వచ్చేస్తాలే.”

ఇంతలో స్కూలు బెల్లు కొట్టేస్తారు. అబ్బుటి దాక కసి గా వున్న రమేష్ గ్యాడు పక్కన వున్న సూరిగాణ్ణి గెట్టిగా గిల్లేసి వురుకెత్తి పూడిసినాడు. పోతా పోతా ”దొంగ నాకొడకా! ఆ పొద్దు నా దగ్గిర బాగా కమ్మర కట్ట్లు ,బొండాలూ …… దినేసి నీ పెన్సిలిమ్మంటే ఈవా? నువ్విబ్బుడేమి జేసుకుంటావో జేసుకో పో నేను ఈ పొద్దు రాత్తిరికే మా యత్తోల్లూరికాడికి బోతా వుండా”


గిల్లిచ్చుకున్న సూరి గాడికి రమేష్ గాడు దొరకలా. సూరి గాడు మ్యాడం దగ్గిరికి బొయ్యి వేణు మాధవ టైప్ ఫేసు పెట్టి “మ్యాడా, వాయ్యో.. ఆ నా కొడుకు నన్ను గిల్లేసి పూడిసి నాడు మ్యాడా” అని బావురు మణ్యాడు.

“వాణి సంగతి స్కూలు తెరిచినబ్బుడు జెబ్తా. నువ్వింటికి బో” మ్యాడం చెబ్తుంది.

అట్లా మొదులయిన లీవూలు ఇంటి కాడ రొండు రోజులు సైలెంట్ గా జరుగుతాయి. అదేందో! చానా మంది పిలకాయలకు పగులు స్కూలు, సాయంత్రం పూట వుంటే గింటే కొంజేపు ప్రైవేటు వుంటాది. మిగతాటబ్బుటంతా లీవూలే. నాకు మాత్తరం పగులు స్కూలు మిగతా టైమంతా ప్రైవేటే. సాయంత్రం పూటా ప్రైవేటే, లీవూల్లోనూ ప్రైవేటే. ఏం జేసేది ఇంట్లో ఇద్దురు టీచుర్లు వుండి పాయిరి.సాపుటేరు ఇంజినీరు సాపుటేరు ఇంజినీరిని జేసుకుణ్యట్టు అబ్బుడు టీచురు టీచుర్ని జేసుకునే ఓళ్ళమో.అబ్బుడబ్బుడూ అనిపిస్తాది నాకు ఒగరి తర్వాత ఒగరు ప్రైవేటు జెప్పేదానికి జేసుగున్యారేమో అని.


రొండు రోజులు పొన్లే పాపం అని ఒదిలేసి తరువాత ఇంట్లో పాఠాలు జెబ్తారు.

“బుక్కులు దెచ్చుకోని చదువుకోరా”

“నేను తరూవాత సాయంత్రం జదువుతాలే”

“ఇబ్బుడేం జేస్తావ్”

“శంకరప్పోళ్ళ ఇంట్లో ఆవు ఈనిందంట. దూడ పెయ్య భొలే వుందంట నేను బొయ్యి జూసొస్తా”

“నువ్వు బోక పోతే దూడ పాల్దాగేది మానెయ్యదులే గానీ నువ్వు గూచోని జదువుకో”

“అమ్మ నేను బోతానే…వా..వా”

“నువ్వు నోరు మూసుకోని చదువుకో”

“డబుక్కు జర జర డుబుక్కు…డబుక్కు జర జర డుబుక్కు” అని వీధిలో నుండి సిగ్నల్లు. అవతల వీదిలో రౌండ్లేస్తున్న రెడ్డెప్ప, కిశోర్ గాళ్ళు.

“డబుక్కు జర జర డుబుక్కు…డబుక్కు జర జర డుబుక్కు” ఈ సారి కిశోర్ గాడు కొంచెం గెట్టిగా.

ఎలాగయినా ఈ రోజు చెరువు కాడికి పోవాల్సిందే. టోకరా మార్గాల కోసం వెదుకులాట.

“డబుక్కు జర జర డుబుక్కు…డబుక్కు జర జర డుబుక్కు” వీధి సందులోనుండి చిన్న గా మాయమయి పోతా వుంది. దొంగ నాయాళ్ళు నన్ను ఒదిలేసి పోతా వుండారు.

“మ్మా, నేను చింతోపు కాడికి పోవల్ల అర్జంటుగా”

“సరే బిర్నే పొయ్యి రా ఆడా ఈడా పెత్తనాలు జెయ్యద్దు”

“సరే నాకు తెలుసులే”

“రేయ్…రేయ్…”పక్కింట్లోకి బొయ్యి “రేయ్ వసంతా! రా రా చెరువు కాడికి బోదాము”

“వసంత గాడు వాళ్ళ నాయింతో పాటు బేల్దార్ పనికి బోయినాడుప్ప” వసంత గాడి అమ్మ.

“రేయ్..రేయ్..” ఎదురింటి అరుణ్ గాడి ఇంటికి బొయ్యి “అరుణ్ గ్యా, వస్తావా రా చెరువు కాడికి బోదాము”

“మా వోడు రాడు పో. వానికి ఇంటి కాడ పనుంది” వాడి నాన్న.

మెల్లిగా అరుణ్ గ్యాడికి ఇనిపిచ్చేటట్టుగా “రేయ్ నేనూ సీని గ్యాడూ ఓనిమి దగ్గర వుంటాం నువ్వొచ్చేసేయ్” అని చెప్పి ని గాడి ఇంటి కాడికి పోతే వాడు ఎద్దుల బండికి కడిచీల పీకేసి ఆ కందినితో ఆడుకుంటా వుండాడు.

నన్ను జూసి “ఇంత సేపా నువ్వోచ్చేదానికి బిర్నే పోదాం పద చెరువు కాడికి” అణ్యాడు కడిచీల చక్రానికి పెట్టి కందిని చొక్క కు తుడుచుకొని.

ఓనిమి కాడికి బోయినామో లేదో ఆడ రెడ్డెప్ప, వాల్ల చిన్న తమ్ముడు ఇంగా కిశోర్ గాడు వుండారు. వాల్లని జూసే సరికి అరుణ్ గాడు గుర్తు రాలా.”బిర్నే పదండ్రా మళ్ళా లేటయిపోతుంది” అని చెరువు కాడికి పరిగెత్తినాం.

అట్ల రెండు మూడు గంటలు ఆడేసి ఇంటికి తిరిగొస్తావుంటే ఎదురుగా ఇంగో బ్యాచి వాళ్ళు చెరువు కాడికి బోతావుండేది జూసి వాళ్ళతో కలిసి మళ్ళీ చెరువులో మోకాలీతలు. బాగా అలిసిపొయ్యి ఇంటికి తిరిగొస్తావుంటే గంగయ్యోళ్ళ మామిడి తోపు కాడికి వచ్చానో లేదో చేతిలో చింత బర్ర బట్టుకోని మా యమ్మ వెయిటింగ్.

మా యమ్మని, ఆ చింత బర్రని జూసి ఇంగ కాలి బాటొదిలేసి చేన్లంబడి ఇంటికి వురుకెత్తినా. ఇంటికి మా యమ్మొచ్చేసరికి చేతిలో బుక్కు పట్టుకుని “రామయ్య ఆ ఊరిలో పెద్ద మోతుబరి. వారి ఇంటి ముందు జామ చెట్టు కలదు. ఇంటి వెనక పెద్ద పెరడు కలదు…. ” అని జదవతా వుంటే.

“నీ వీపు వెనక ఇప్పుడు దద్దుర్లు వచ్చును…నీ మూతి ముందు పళ్ళు రాలును…నీ చేతులకు వాతల వచ్చును “ అని మా యమ్మ ప్రైవేట్లో పెద్ద ప్రైవేట్ జెప్పేది.


అలా ఎన్నో ప్రైవేట్లకు గురి అయినా డబుక్కు జర జర డుబుక్కు…డబుక్కు జర జర డుబుక్కులు మాత్రాం ఎన్ని వూర్లు మారినా మానలేదు. దాని ప్రావీణ్యం తో నాలుగంతస్థుల లోతున్న బాయిలోకి దూకడం. పెద్ద బాయిని ఇరవై రోఉండ్లెయ్యటం వచ్చింది.

Monday, June 11, 2007

సినిమా నటుల బ్లాగులు

సినిమా వాళ్ళు బ్లాగులు రాయటం మొదలు పెడితే వాళ్ళ బ్లాగుల పేర్లు.


బాలకృష్ణ............బ్లాగు సింహా రెడ్డి (కాప్షన్: ఒక్క టపా తో చంపేస్తా)

చిరంజీవి............బ్లాగ్ లీడర్(ఒక్క టపా రాస్తే కామెంట్లు గడ గడ రాలాల)

వెంకటెష్ ............బొబ్బిలి బ్లాజ(బలపం పట్టి బ్లాగు రాయ్)

నాగార్జున ...........బ్లాగ్ మణి 9846(నా టపాక్కొంచెం మెంటల్)

మోహన్ బాబు........బ్లాగు రౌడీ(ల్యాప్ టాపూ, డెస్కు టాపూ ఏ బ్యాక్ ప్యాకులో లేని సిల్లీ నాకొడుకుని)

జునియర్ ఎన్టీఆర్......బ్లాది కేశవ రెడ్డి (అమ్మతోడు అడ్డంగా బ్లాగేస్తా...కామెంటేసి పో)

మహేష్ బాబు.........పోకిరోడి బ్లాగు(టపా రాసామా లేదా అన్నది కాదు ముఖ్యం కూడలిలో కనిపించిందా లేదా అన్నది ముఖ్యం)

సాయి కుమార్........రేయ్ రేయ్ రేయ్ రేయ్(కనిపించని నా నాలుగో మనసే ఈ బ్లాగ్)

ఆర్.నారాయణ మూర్తి ..ఒరేయ్ బ్లాగోడా(దమ్ముంటే టపాకి కామెంట్ రాయ్)

ఆలీ...............చేట చేట(యు నో బ్లాగ్ లాస్ట్.. కామెంట్ ఫస్ట్.. నో కూడలి... నో కాట్రవెల్లి)

బ్రహ్మానందం .........టిక్కుం టిక్కుం(అను ఓ తొక్కలో బ్లాగు)

ఎల్.బి.శ్రీరాం ........మరదే మండుద్ది(పుసుక్కుమని కామెంట్ రాసి పో)

తరుణ్.............మనసంతా బ్లాగే(ఎప్పుడూ బ్లాగే వయసే ఇది)

హరికృష్ణ ...........బ్లాగయ్య(ఎవ్వడి బ్లాగూ చూడడు)

అల్లరి నరేష్ .........బ్లాగు బాబు ఎల్.కే.జీ.(వీడి మొఖానికో బ్లాగు)



రాజకీయ నాయకులు బ్లాగు పెడితే


వై.ఎస్. ............జగమంతా జగన్(అంతా కె.వి.పి. చూసుకుంటాడు)

చంద్ర బాబు...........ఆ విధంగా(బ్లాగు పిలవకున్నా కదలి రా)

ఎమ్మెస్సార్...........నిజం చెబుతా(చంద్ర బాబు చాలా మంచోడు)

కె.కె...............ఇట్స్ నాట్ ద పాయింట్(అగైన్ ఇట్స్ నాట్ ద పాయింట్)

కె.సి.ఆర్............ఖబడ్దార్(బ్లాగులోళ్ళు దొంగ నాయాళ్ళు)



.........................:0:................................

Thursday, June 07, 2007

ధ.దే.ఈ.శు. -- జోకు

.


అలిపిరి ని దాటి తిరుమల కొండ మీదికి బస్సు వెళుతోంది. ఆ బస్సు లో ఒకతను లేచి ముందుకు వెనక్కు నడుస్తున్నాడు.

అది చూసి బస్సు డ్రైవర్ అడిగాడు."ఎందుకు అలా ముందుకు వెనక్కు నడుస్తున్నావు వెళ్ళి కూచోవచ్చు కదా"

"లేదు నేను కొండకు నడిచి వస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకోవాలి కదా కూచుంటే అదెలా కుదురుతుంది అందుకని ఇలా నడుస్తున్నాను".



.

సీనుగాడి ఇండియా ప్రయాణం - 2

:

అలాగ ఫోను ముందుకు వెళ్ళిన సీనుగాడు” (ఇది ఖచ్చితంగా ఛంద్ర బాబు నాయిడు డవిలాగుకు కాపీ కాదని మరొక్కసారి మీ అందరికి మనవి చేసుకుంటున్నాను) ఫోను ఎత్తగానే అవతల లైన్లో సుబ్రమణ్యం గాడు “ఒరేయ్ మామా నువ్వు ఇండియా వెళ్తున్నావని నాకు చెప్పనే లేదు కదరా. ఎన్ని రోజులకు కెళ్తున్నావ్”


“నేనూ వెళ్ళాలనుకోలేదు కానీ మా బుడ్డి దానికి గుండు తిరుపతిలోనే కొట్టించాలనేసరికి హడావుడి గా టికెట్స్ బుక్ చేసాను. మా బాస్ గాడు పెళ్ళానికి విడాకులు ఇచ్చేసిన ఆనందంలో నా లీవు కూడా సాంక్షన్ చేసశాడు. నేను అయిదు వారాలు వుండి వచ్చేస్తా. మా ఆవిడ కూతురు ఇంకొన్నాళ్ళు……”


మధ్యలో కట్ చేస్తూ “సర్లే మామా నువ్వెళ్తున్నావంటే నాకు చాలా ఆనందంగా వుంది”


నే వెళ్తే వీడికేమి ఆనందం? కొంపదీసి నా కారుని ఉద్యోగం కోసం ఇండియానుండి వచ్చిన వీడి బామ్మర్ది కు గానీ ఇమ్మంటాడా? వీడికి మాత్రం చచ్చినా ఇవ్వకూడదు అని నిర్ణయించేశాడు.


“నేను వెళ్తే నీకు ఆనందమెందుకురా? నాకు డబ్బులు ఖర్చయి పోతే నీకు ఆనందమా”


“అది కాదు మామా, నువ్వు వెళ్తుంటే నాకు కూడా ఇండియా వెళ్తున్నంత ఆనందంగా వుంది”


అనుమానం లేదు వీడు ఖచ్చితంగా నా కారుకి టెండర్ పెట్టినట్టున్నాడు. వీడు పప్పులు నేను వుడకెయ్యను గా అనుకున్నాడు.


“నీకు ఇండియా మీద అంత ప్రేమయితే నువ్వు కూడా ఓ సారి వెళ్ళచ్చుకదా”


“వెళ్దామనే అనుకున్నా కానీ ఈ సారి నయాగర వెళ్దామని మా ఆవిడ అనేసరికి ఆగిపోయా. అవును మామా నువ్వు ఏ ఫ్లయిటుకు వెళ్తున్నావ్?”


అంటే వీడు కూడా నా సూట్ కేసును పావనం చెయ్యాలనుకుంటున్నట్టున్నాడు. తప్పించుకునే మార్గమే లేదు. “నేను లూఫ్థాన్సా లో వెళ్తున్నారా రా”


“మంచి ఫ్లయిట్ రా డబ్బులు పోతే పోయినాయి కానీ జర్నీ కంఫర్టబుల్ గా వుంటుంది. నేను కూడా దాన్లోనే వెళ్ళా చాలా సార్లు. ఈ మధ్య లగేజీ తక్కువ చేసినట్టున్నారు కదా?”


ఆహ మంచి చాన్సిచ్చాడు తప్పించుకోవచ్చు.”అవున్రా చాలా కష్టమయి పోతా వుంది.”


“రేయ్ నువ్వు తిరపతికి పోతున్నావు కదా. నీకు అక్కడ ఏమయినా సహాయం కావాలా? మనకు కొంచెం హవా వుంది అక్కడ”


ఈ సుబ్రమణ్యం గాడు ఎంత మంచివాడు అడక్కుండా సహాయం చేస్తానంటున్నాడు. ఎంతయినా వీడికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని రొమ్మంతా ఉబ్బిచ్చుకోని వాళ్ళావిడ వైపు గర్వంగా చూశాడు తిరపతి కొండ మీద సిఫారసులు చేసే ఫ్రెండ్ దొరికాడని చెప్పడానికి.


“అవున్రా కొంచెం హెల్ప్ కావాలి ఎంత ట్రై చేసినా కాటేజీలు దొరకడం లేదు.”


“నువ్వేమీ ఫికర్ కావద్దురా మనోడొకడున్నాడక్కడ వాడికి ఫోన్ చేస్తా అంతా వాడు చూసుకుంటాడు”


“సరేరా అతని నంబరివ్వు నేను కూడా ఫోను చేసి మాట్లాడతా” ఉబ్బి తబ్బిబ్బయి పోయాడు రొమ్ము పది మీటర్ల డయామీటర్ తో పెద్ద బెలూన్ లాగా అయిపోయింది.


“వాడి ఫోన్ నంబరు ఆఫీసులో వుంది మండే ఆఫీసుకు ఫోన్ చెయ్యి నంబరిస్తా”


“సరేరా మండే ఫోన్ చేస్తా ఇక ఫోన్ పెట్టేస్తా మా ఆవిడని షాపింగ్ కు తీసుకెళ్ళాలి ఇండియా షాపింగ్ చాలా మిగిలిపోయింది”.


“మామా చిన్న హెల్ప్”


“చెప్పరా నీకన్నానా”


“ఏం లేదు నా తమ్ముడికి నైకీ షూ కొన్నా. నువ్వేమనుకోక పోతే కొంచెం తెసుకెళ్తావా”


పది మీటర్ల బెలూను రెండు మిల్లీ మీటర్ల కు వచ్చేసింది. వాళ్ళావిడ వీడి వైపు చూస్తున్నా చూడనట్టు అటువైపు తిరిగి మాట్లాడ్డం మొదలు పెట్టాడు. తప్పుతుందా వీడు కనీసం ఏదో హెల్ప్ చేస్తానంటున్నాడు.” అలాగేరా రేపో ఎల్లుండో వచ్చి షూస్ ఇచ్చి వెళ్ళు” డీలా పడిపోయి చెప్పాడు.


“చాలా థ్యాంక్స్ రా మామా” అని ఫోను పెట్టేశాడు సుబ్రమణ్యం.


“వేలూ మనం ఇంకా ఎంత షాపింగ్ చెయ్యాలి”


“అప్పుడే ఏమయిపోయింది ఇంకా మా తమ్ముడికి ఐపాడూ, చెల్లికి జీన్సు ఫాంట్లూ, లిప్టిక్సూ కొనాలి, ఇంకా మా అన్నయ్య కొడుక్కి ఎక్స్ బాక్స్ కొనాలి కదా?”


“మొన్న ఆ డాలర్ స్టొర్స్ లో చాలా కొన్నాం కదా?”


“చీ అవన్నీ మా వాళ్ళకు ఇవ్వడానికి కాదు. మీ బంధువులకూ, మీ పక్కింటి వాళ్ళకూ, మా పక్కింటి వాళ్ళకూ. అవన్నీ బయట ఖరీదయిన చోట్ల కొనాలంటే మన దగ్గర అంత డబ్బుండద్దూ? కాస్త బ్యాలన్స్డ్ గా ఖర్చు పెట్టుకోవాలి కదా” అని సొంతింటి ఆర్థిక సూత్రాన్ని విప్పి చెప్పింది.


అది విని వుడుక్కున్న సీను గాడు ఏమీ మాట్లాడ లేక “అవును కదా అలా ఖర్చు పెట్టుకుంటూ పోతే మనకేమీ మిగలదు. ఎంతయినా నీ నేర్పరితనం ఎవరికీ రాదులే” అన్నాడు డా|| దుమారం రాసిన "భార్యను సంతోష పెట్టడమెలా" అనే బుక్కులోని పన్నెండో పేజీని గుర్తుకు తెచ్చుకుని.


“మన పాపకు పాలు పట్టాలి వెళ్ళి చూడండి నిద్ర లేచిందేమో” అంది అలి వేలు.


“అలాగే” అని ఇంకో రూములో పడుకున్ని వున్న కూతుర్ని చూసి వచ్చాడు. చక్కగా నిద్రపోతున్న పాప ను తనివి తీర చూసుకుని గుండు కొట్టిన తరువాతేలా వుంటుందో పాపం అనుకున్నాడు. ఆ రూములో నుండి బయటకు వచ్చాడో లేదో మళ్ళీ ఫోను “తొక్కలో తిమ్మిరి..పిక్కలో జాంగిరి.. డొక్కలో డిరి డిరి”


వెళ్ళి కాలర్ ఐడి చూశాడు. ఈ సారి ప్రైవేట్ కాలర్ అని వచ్చింది. తీద్ధామా వద్దా అని అలోచించి ఏమయితే అది అయ్యిందిలే అని ఫోను తీశాడు. అవతల లైన్లో వేణు గోపాల్. ఈయనెందుకు నాకు ఫోను చేశాడు అని అనుకున్నాడు.


“నమస్కారమండి శ్రీనివాస్ గారు, బావున్నారా” అని అడిగాడు వేణు గోపాల్.


వేణు గోపాల్ తను పని చేసే ఆఫీసులోనే పని చేస్తాడు. వీకెండ్ ఫోను చేసి మాట్లాడుకునేంత పెద్ద క్లోస్ కాదు. వాళ్ళబ్బాయి బర్త్ డే కి పిలవడానికి ఫోను చేశాడేమో అనుకున్నాడు.


“ఆ.. నమస్కారమండి. ఏంటి విశేషాలు”


“మీరు వచ్చే వారం ఇండియా వెళుతున్నారట గదా , మీరు చాలా అదృష్ట వంతులండీ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి పోతుంటారు”


వీడొకడు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బీడి కాల్చుకోవటానికి నిప్పు కావాలన్నాడట వెనకటికెవడో. నేను వెళ్ళక వెళ్ళక ఇప్పుడు వెల్తుంటే ఎవడో ఫ్రీ టికెట్టిస్తుంటే నెలకో సారి ఇండియా వెళ్తున్నట్టు సెటైరొకటి. ఈ నంగి గాడికి ఎప్పుడన్నా ఓ సారి నా ఫ్ల్యాష్ బ్యాక్ వినిపించాల్సిందే అనుకున్నాడు.


“ఎంత అదృష్టమో వచ్చే ఫోన్ల ద్వారా తెలుస్తోంది లెండి”


“అయ్యో అదేంటండి నేనేమన్నా తప్పు మాట్లాడానా? మాట్లాడితే క్షమించండి”


“మీరేమీ మాట్లాడ లేదు గానీ. మీరెందుకు ఇప్పుడు ఫోను చేశారో నాకు తెలుసు. మీ గొట్టం తమ్ముడికో అన్నకో ఏదన్న పిండం తీసుకెళ్ళమని నాకిస్తారు. నేను దాన్ని తీసుకెళ్ళి ఇండియాలో పిండ ప్రదానం చెయ్యాలి అంతే కదా” అన్నాడు కోపంగా.


“చా అలాంటి పిండాలు లాంటి వేమీ లేవండి. నాకు గొట్టం, పైపూ, కొళాయి లాంటి వారెవరూ లేరు. మీరు అమెరికా వచ్చేముందు నీటి పారుదల శాఖ లో గానీ పనిచేశారా?” కూల్ గా అడిగాడు వేణు.


“అలా కాకపోతే మీ నాన్నకో అమ్మకో రెండు మూడు బంగారు బిస్కట్లు తీసుకెళ్ళమని చెప్తారు అంతే కదా”


“మీరు భలే సరదాగా మాట్లాడుతారు శ్రీనివాస్ గారు. మీరు ఇలాగే ఎప్పుడూ మీ శ్రీమతి ని నవ్విస్తూ వుంటారా” కూల్ కూల్ గా చెప్పాడు వేణు.


“అవును మా ఆవిడ నా జోకులకు ఖల్ ఖల్ మని నవ్వి పెళ్ళు పెళ్ళు న వాంతి చేసుకుంటుంది. కావాలంటే మీ ఆవిడ ను కూడా పంపించండి. మీ కెందుకు ముందు అసలు విషయంలోకి రండి”


“మీరు అంత సుకుమారంగా, వినయంగా చెప్పిన తరువాత చెప్పకుండా ఎలా వుంటాను. మీరు ఇండియా వెళ్తున్నారు కదా అని నేను ఏమీ లగేజీ ఇవ్వడం లేదు” శాంత మూర్తి వేణు నొచ్చుకుంటూ చెప్పాడు.


లగేజీ ఏమీ ఇవ్వడం లేదు అన్న ఒక్క మాటకు అంటార్కిటికా అంత చల్ల బడి పోయాడు సీను గాడు. పది రోజుల అంధకారం పోయి ఒక్క సారిగా వెలుతురు వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు నవ్వినట్టు, రాజశేఖర్ రెడ్డి హైటెక్ సిటీలో ఒక ఎకరా పోలం రాసిచ్చినట్టు ఫీలయ్యాడు.


“ఓహ్ అలాగా అయితే చెప్పండి వేణు గారూ ఎందుకు ఫోను చేశారో”


“ఆ ఏమీ లేదండి మీరు ఇండియా వెళ్ళేటప్పుడు మా ఏడేళ్ళ కొడుకును కూడా తీసుకెళతారా? హైదరాబాద్ ఏర్పోర్టులో దిగగానేఎ మా నాన్నా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు”


'ఏడేళ్ళంటే కాస్త చెప్పినట్టు వింటాడు. వాడికి చెడ్డీలు వేసేపని ముడ్డి తుడిచే పని చెయ్యక్కరలేదు. పైగా చంటి దానికి ఆడుకోటానికి పనికొస్తాడూ అని తెగ సంబర పడి పోయి “అయ్యో చిన్న పిల్లాడిని తీసుకెళ్ళడానికి అభ్యంతర మేంటండీ.మీరు నిరభ్యంతరంగా పంపించచ్చు” అనేశాడు. పాపం వేణు వాళ్ళ అబ్బాయి క్రమ శిక్షణ తెలియని సీను గాడికి తనెంత తప్పు చేశాడో అప్పుడు తెలియలేదు.


“చాలా థ్యాంక్సండి. మిమ్మల్ని డైరెక్టుగా ఏర్పోర్టులో కలుస్తానండి.” అని ఫోను పెట్టేశాడు.


“వేలూ మనం ఇండియా వెళ్ళేటప్పుడు మనతో పాటు వేణు గారి వాళ్ళ అబ్బాయి కూడా వస్తాడట కాస్త తోడు గా వుండమని అడిగారు. నేను సరే నని చెప్పేశాను.”


అలివేలు సీను గాడి వైపు గుర్రుగా చూసింది.


“అది కాదు పిల్ల వాడు కదా మన పాప కు కూడ కాస్త తోడుగా వుంటాడని నిన్ను అడక్కుండానే చెప్పేశాను.” వేడికోలు గొంతు తో చెప్పాడు.


అలి వేలు కాస్త చల్ల బడింది. “సరే లెండి ఇంకెప్పుడూ అలా హామీ లివ్వద్దు.” అని క్షమించేసింది.


మళ్ళీ ఫోను రింగయింది. శీను గాడు ఫోను తీసుకోబోతుండగా అలివేలు అడ్డుపడి చెప్పింది “ఇదుగో ముందుగానే చెబుతున్నా అడ్డమైన వాళ్ళందరికి వాళ్ళ గడ్డంతా ఇండియా మోసుకెళ్తామని చెప్పకండి” అంది.


“అరే నా మంచి అలివేలు నీ మాట నేనెప్పుడన్నా కాదన్నానా? యువ్ ఆర్ చో చ్వీట్. నీ మాటలు చాలా విలువైనవి.” అన్నాడు “దాంపత్య జీవితంలో సుఖాలు” అన్న బుక్కులోని 58 వ పేజీ గుర్తుకు తెచ్చుకొని. ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ 59 వ పేజీలోని విషయం గుర్తుకు రాలేదు.


ఫోను తీసి కాలర్ ఐడె చూస్తే అది ఇండియా నంబరు. ఇంతవరకు ఇక్కడి వాళ్ళే తమ లగేజీ ఇస్తారనుకుంటే ఇప్పుడు ఇండియానుండి ఫోను చేసి ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు కూడా తయారయినట్టున్నారు అనుకొని ఫోను తీశాడు.


“ఒరేయ్ లడ్డూ, నేన్రా మీ అమ్మని. ఫోను తీయడానికి ఇంత సేపా?”


“లేదమ్మా కాస్త బిజీ గా వుండి…”


“సరేలే మనవరాలు ఎలా వుంది, కోడలు పిల్ల బానే వుందా?”


“మనవరాలు నిద్ర పోతోంది. వేలూ తో మాట్లాడతావా?” అని నాలుక్కరుచుకున్నాడు.


“వేలేంటి”


“అబ్బా అది కాదు కొడలు తో మాట్లాడుతావా అని”


“ఒద్దులే ఇండియా వస్తున్నారుగా ఇక్కడ తీరిగ్గా మాట్లాడు కోవచ్చు. అసలు నేనెందుకు ఫోను చేశానంటే వచ్చేటప్పుడు ఓ పదో పరకో గోల్డ్ కాయిన్స్ తీసుకొని రా”


“ఏంటి పదా? నేనేమన్న గూగుల్ కంపెనీలో పని చేస్తున్నాననుకుంటున్నావా?”


“ఆ మాత్రం సంపాదించకపోతే అమెరికాకు వెళ్ళడమెందుకు. అసలు నాకు తెలీక అడుగుతా ఆ కో-ఆపరేటివె సొసైటీలో కొనుక్కొని ఆ పోస్టాఫీసు డబ్బులుతో సేవ్ చేసుకొని ఏమి సంపాదిస్తున్నావ్ రా?


“అమ్మా అది కో-ఆపరేటివ్ సొసైటీ కాదు. Costco అన్ని తక్కువ ధరకు అన్నీ అమ్మే డిస్కౌంట్ స్టోర్స్. పోస్టాఫీసు డబ్బులు కాదు. Mail-in-rebates అని ఏవన్నా కొంటే కొన్ని రిబేట్ కూపన్లు ఇస్తారు. వాటిని ఫిలప్ చేసి పంపిస్తే తరువాత మెయిల్లో చెక్కు డబ్బులు పంపిస్తారు”.


“ఆ ఏదో ఒకటి నాలుగ్గీక్కోడానికి కూడ పనికి రావు నీ సేవింగ్ డబ్బులు. ఎలాగోలా తగలడి కనీసం అయిదు గోల్డ్ కాయిన్స్ అన్నా తీసుకొని రా. సరేనా ఫోను పెట్టేస్తా”


ఆహా ఏమి నా జీవన సౌందరయ్యము అనే మెడిమిక్స్ సోప్ వాళ్ళ ప్రకటన గుర్తు వచ్చింది సీనుగాడికి.


“ఏమండీ రెడీ అయ్యారా పాపను తీసుకెళ్ళి కార్ సీట్లో వేసి కారు స్టార్ట్ చెయ్యండి నేను వస్తున్నా. లేటుగా వెళ్తే ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్ మాల్ లో రష్ ఎక్కువుంటుంది.”


“ఆహా ఏమి నా జీవన సౌందరయ్యము..ప్రకృతి నుండి పుట్టింది ఆయుర్వేదం…నా మనసు నుండి పుట్టింది నిర్వేదం “ అని బయటకు అనేసి ఎవరూ వినలేదు కదా అని కారు కీస్ కోసం పరిగెత్తాడు.


(సశేషం)

Wednesday, June 06, 2007

సమస్య సమస్యను పరిష్కరిస్తుంది

ఇంద్ర సభ అయిపోయింది అందరూ వారి వారి విశ్రాంతి గదులకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. సభ ప్రారంభ మయినప్పట్నుండి ఎస్.వి.రంగారావు ఎన్టీఆర్ ను గమనిస్తూనే వున్నాడు. ఎన్టీఆర్ ఎంతో విచారంగా కనిపించాడు. అది చూసిన ఎస్వీ రంగా రావ్ తన పక్క నున్న పి.వి.నరసింహా రావు చెవిలో ఏదో వూదాడు. పి.వి.నరసింహా రావు వడివడిగా అడుగులు వేసి పరుగున ఎన్టీఆర్ ను చేరాడు.


“ఏమిటి రామా రావ్ గారు ఎందుకు విచారంగా వున్నారు?” పి.వి. అడిగాడు.


“ఎందుకు లెండి బ్రదర్ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది” ఎన్టీఆర్ సమాధానం.


“అది కాదండీ బాధ చెప్పుకుంటే తగ్గుతుంది ఆనందం పంచుకుంటే పెరుగుతుంది. మీరేమీ అనుకోకపోతే మీ విచారానికి కారణం సెలవిస్తే మాకు తోచిన సాయం చేస్తాం” అన్నాడు పి.వి.


“ఏముంది బ్రదర్ మొన్ననే నా పుట్టిన రోజు నా తెలుగు తమ్ముళ్ళు ఘనంగా చేశారని ఆనందించాను. నా గురించి మహానాడులో గొప్పగా కూడా చెప్పారు. కనిష్ట జామాత కూడా నా గురించి అంత బాగా చెబుతాడనుకోలేదు”.


“అవును నేను కూడా గమనించాను. మన తెలుగు దేశంలో మీ మీద ప్రేమ చెక్కు చెదర్లేదు. అందులో విచారించడానికి ఏముంది చెప్పండి” పి.వి. చెప్పాడు.


“అంతటితో ఊరుకున్నారా? మహా నాడులో నా గురించి చెప్పినదానికి నా జ్యేష్ట పుత్రిక ఒక ప్రకటన ఇచ్చింది. దానికి విరుగుడుగా తెలుగు తమ్ముళ్ళు ఇంకో ప్రకటన ఇచ్చారు. అంతటితో ఆగక జ్యేష్ట జామాత ఇంకో సెటైరు”


అంతలో అక్కడికి వచ్చిన ఎస్వీఆర్ “చూడు సోదరా నువ్వేమీ బాధ పడకు ఏ డొంగ్రే ఎలా మాట్లాడినా మీ గొప్పతనం ఎక్కడికీ పోదు. సింహం ఆంధ్ర లోకంలో వున్నా ఇంద్ర లోకంలో వున్నా సింహం సింహమే” అన్నాడు పులి బోన్లో వున్నా బయట వున్నా పులి పులేరా డోంగ్రే అన్న దాన్ని గుర్తుకు తెచ్చుకొని.


“అలా కాదు బ్రదర్ నేను సింహన్నే కానీ నా తోక పట్టుకుని వీళ్ళు పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. నేను పార్టీ పెట్టిందే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం. అది పుట్టినదే కాంగ్రేసు కు వ్యతిరేకంగా. తెలుగు వాడు ప్రధాని అవుతున్నాడని మన బ్రదర్ పి.వి. నంద్యాలలో ఎం.పి.గా నిలబడినప్పుడు పోటీ కూడా పెట్టలేదు. అంతటి తెలుగు అభిమానిని నా బొమ్మ పేరు పెట్టుకుని నా గురించి చులకనగా మాట్లాడుతారా?”


“నిర్భయంగా మాట్లాడలేని అర్భకులు. కాసుకు కొరగాని హీనుల కేకలకు కలత వలదు సోదరా..కలత వలదు” అన్నాడు ఎస్వీఆర్


“నా మనసు కుదుట పడటం లేదు బ్రదర్”


“చూడండి రామా రావు గారు, మీరు దానికే ఇంత చింతిస్తే మొదటి తెలుగు ప్రధాని అయిన నా పార్ధీవ శరీరాన్ని సరీగా దహనం చెయ్యకుండా కట్టెలకోసం కక్కుర్తి పడ్డ మా వాళ్ళనేమనాలి. ఏదయినా సమస్య వస్తే దానికి పరిష్కారము ఏంటో తెలుసా? ఎప్పుడైనా సమస్య వస్తే.. ఎప్పుడైనా సమస్య వస్తే.. ఎప్పుడైనా సమస్య వస్తే.. దానికి పరిష్కారం.. దానికి పరిష్కారం..”


“మా మతులు గతి తప్పి పోవుచున్నవి. ఆలసింపక ఆ ఆలోచనను అనుగ్రహించండి అది ఆచరణీయమో కాదో తేల్చి చెప్పెదము” అన్నాడు ఎస్వీఆర్.


“బ్రదర్ మీరు మమ్ములను మరింత విచారమునకు గురి చేయుచున్నారు. తొందరగా చెప్పండి” అన్నాడు ఎన్టీఆర్.


“ఏదయినా సమస్య పరిష్కరించాలంటే దానికి ఒకటే మార్గం ఏమీ చేయకుండా పోయినచో సమస్య సమస్యను పరిష్కరిస్తుంది. మీరు ఇదొక సమస్య అనుకొన్న ఏడల ఈ సమస్యను సమస్య పరిష్కరిస్తుందని ఊరుకోండి చాలు ” అన్నాడు పి.వి.


“అవును బ్రదర్ మీరు చెప్పింది కరక్టే అనవసరంగా నా మనసును పాడు చేసుకున్నాను. ఇక వస్తాను బసవ తారకం గారు నా కోసం ఎదురు చూస్తున్నారు.గుంటూరు శేషేంద్ర శర్మ గారు మొన్ననే వచ్చారు. వారికి అన్ని సౌకర్యాలూ చూసిపెడతానని చెప్పాను. సతీ సమేతంగా వెళ్ళి వారిని కలిసి వచ్చెద.”.



--: 0 :--

Friday, June 01, 2007

సీనుగాడి ఇండియా ప్రయాణం - 1

ఎట్టకేలకు సీను గాడికి లీవు దొరికింది ఇండియా వెళ్ళడానికి. అమెరికా వచ్చిన తరువాత దాదాపు ప్రతి సంవత్సరం టంచనుగా ఇండియా వెళ్ళేవాడు. పెళ్ళయిన తరువాతే దానికి బ్రేక్ పడింది. పెళ్ళికాక ముందు మెయిల్లో వచ్చిన ఫోటోలు చూసి “ఆహా ఈవిడే నా స్వప్న సుందరి” అనుకుంటూ పరుగెత్తుకుని వెళ్ళే వాడు. గంతులేసుకుంటూ ఆ అమ్మాయిని చూడ్డానికి వెళితే ఆ అమ్మాయితప్ప అందరూ చాలా బాగ కనిపించేవారు పక్కింటి సుబ్బాయమ్మ వెనకింటి వెంకాయమ్మ తో సహా. అమ్మాయిని చూడగానే పి.సి.శ్రీరాం తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు వచ్చే వాళ్ళు కాదు.

ఆ అమ్మాయి ఫోటో తీసినోడిని పెట్టి ఒక తెలుగు సినిమా తప్పకుండా తీయాలని తలపు కలిగేది కానీ అమ్మాయిని మాత్రం చూడ బుద్దేసేది కాదు. అలా తిరిగి తిరిగి విమానంలో ఫ్రీక్వెంట్ ఫ్లైయెర్ 1000K మెంబర్షిప్పు వచ్చి బిజినెస్ క్లాసులో సీటు అప్ గ్రేడ్ ఫ్రీగా ఇవ్వడం మొదలు పెట్టారు ఏర్ లైన్స్ వాళ్ళు. ఇలా కుదరదు వీడు ఇలా ప్రతి సారి విమానమెక్కి ఇండియా వస్తే ఫ్రీక్వెంట్ ఫ్లైయెర్ తో పాటు ఫ్రీ మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తారని వాడి వేలు విడిచిన మేనమామ కూతురొకటుంటే ఆవిడనిచ్చి పెళ్ళి చేశేశారు వాళ్ళ అమ్మా నాన్నా. "అలివేలూ ఆణి ముత్యమా..." అని పాడుకుంటూ పెళ్ళి చేసేసుకున్నాడు. స్వప్న సుందరి కల్లోకి రావడం మానేసింది అప్పట్నుండి. అలా అలివేలును చేసుకున్న సీనుగాడు “ఆ నాలుగో ఆల్బంలో మూడో అమ్మాయినో లేక రెండో అల్బంలో ఆరో ఫోటోలో వున్న అమ్మాయినో చేసుకునుంటే ఎంత బావుండేదో” అని ఎప్పుడో ఓ సారి అనుకుంటూ వుంటాడు.


కాల చక్రం గుర్రు మనకుండ గుర్రెట్టి నిద్రపోవడం వల్ల గిర్రు మని నాలుగు సంవత్సరాలు తిరిగి పోయాయి. ఈ నాలుగేళ్ళలో అలివేలు ఇచ్చిన కానుక ఓ బుజ్జి బుడ్డిది. ఈ బుజ్జి బుడ్డిది పుట్టినపుడు సహాయం కోసమని అత్తా మామల్ని వీసా మీద సొంత ఖర్చులతో రప్పించడం వల్ల సీనుగాడు జేబు కురచనయి పోయింది. దానికి తోడు వాళ్ళు వున్న అయిదు నెలలు అమెరికా అంతా తిప్పి చూపించేసరికి కురచగా నున్న జేబు కాస్తా మాయమయిపోయి డాలర్లు మొత్తం అంకుల్ శ్యాం బ్యాంకులో పడ్డాయి.


ఇదిగో ఇప్పుడు మళ్ళీ పెన్నీ పెన్నీ కూడ బెట్టి ఇండియాకు ప్రయాణం కట్టాడు. ఎంత కుదరదన్నా బుడ్డి దానికి పుట్టు వెంట్రుకలు తిరపతి లోనే తీయించాలని వాడి అమ్మ బలవంత పెడితే ఎటూ తనకు బాగానే క్షవరం అయింది తను కూడా గుండు కొట్టించుకుంటే సింబాలిక్ గా వుంటుందని ఇండియాకు టికెట్లు బుక్ చేశాడు. పనిలో పనిగా అలివేలు కు కూడా గుండు చేయిస్తే పూర్ణ సింబాలిక్ గా వుంటుందనే అద్భుతమైన ఆలోచన రావడంతోటే పర్యవసానాలు తెలియక ఆలి అలివేలు తో ఓ మాట అన్నాడు.



అలా అనడం ఆలస్యం అలివేలు ఆకాశమంతెత్తుకు ఎగిరి “ఏం తమాషాలు చేస్తున్నావా? పోతేపోనీలే అని పెళ్ళి చేసుకుంటే నాకు గుండు కొట్టే ప్రొగ్రాం కూడా పెట్టావా? ఇలాంటి అలోచనలు దాని పిండాకూడూ లాంటి వేమన్నా వుంటే ఇప్పుడే మొగ్గలో తుంచేయ్ లేక పోతే ‘భార్యను వేధిస్తున్న ఎన్నారై’ అని ఈనాడు పేపర్లో హెడ్లైన్ వస్తుంది జాగ్రత్త” అని తన స్టయిల్లో మెత్తగా చెప్పింది.


సీనుగాడు అనుకున్నాడు, అవును నిజమే ఏదో అదృష్టం వుండ బట్టి పెళ్ళి జరిగింది గానీ రోజూ తెలుగు పేపర్లలో వచ్చే ఎన్నారై వేధింపులు వార్తలు చదివి తనకు పిల్ల నెవడు ఇచ్చేవాడు. మొత్తానికి అలివేలు మంచి లాజిక్కులే మాట్లాడుతుంది అని లోలోన సంబరపడ్డాడు లాజిక్కైన పెళ్ళాం దొరికిందని. ఆయినా ఈ పేపరోళ్ళకు ఇంకేం పని లేదేమో ఎప్పుడూ అలా పెళ్ళాన్ని గోక్కు తింటున్న ఎన్నారై, ఇలా పెళ్ళాని పీక్కు తింటున్న ఎన్నారై, వెరైటీగా పెళ్ళాన్ని కొరుక్కుతింటున్న ఎన్నారై అని రాస్తారు. వీళ్ళ సర్క్యులేషన్ వందకి పడిపోవు గాకా అని మనస్పూర్తి గా దీవించేశాడు. ఇదే కో రికను తిరపతి కి పోయినప్పుడు గుర్తుపెట్టుకొని వెంకటేసును అడగాలి అనుకొని మరచిపోతానేమో నని పాంపైలెట్ తీసి అందులో రాసుకున్నాడు.


అలా రాసుకోవడం చూసిన అలివేలు “ఇగో మిమ్మల్నే అలాగే రుబ్బురోలు, అప్పడాల కర్ర కూడా రాసుకో మర్చిపోతానేమో దాంట్లో రాసుకో” అంది.


“మొన్ననే కదా వేలూ ఒక అప్పడాల కర్ర ఇండియెన్ స్టోర్స్ లో కొన్నావ్ దానికేమయింది ఇప్పుడు” అన్నాడు.


“ఇదిగో ఇట్లాంటి మాటలే మాటాడొద్దని చెప్పేది. ఇక్కడ దొరికేవన్నీ నాసిరకం అప్పడాల కర్రలు. చూడ్డానికి నాజూగ్గ వుంటాయి కానీ ఒక్క రుద్దుడు కే విరిగిపోతాయి”


“అవును నిజమే అలాగే రాసుకుంటా” అన్నాడు. మనసులో మాత్రం ‘నేనెంత అదృష్టవంతుడిని. ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కసారి కూడా మా ఆవిడ దాన్ని నామీద ప్రయోగించలేదు ఆఫీసులో మాధవ్ ఎప్పుడూ బుర్ర తడుముకుంటూనే వుంటాడు. అమెరికా వచ్చినా వాళ్ళావిడ ఏమీ మారలేదు.’ అని చాలా గర్వంగా కూడా ఫీలయ్యాడు.


అంతలో “తొక్కలో తిమ్మిరి.. పిక్కలో జాంగిరి.. డొక్కలో డిరి డిరి..” అనే కొత్త పాట రింగ్ టోను వినిపిస్తే వెళ్ళి సెల్ ఫోను తీశాడు. అవతల లైన్లో సత్తి గాడు. తీసి హలో అన్నాడో లేదో “ఒరేయ్ సీనుగా, నువ్వు వచ్చే వారం ఇండియా వెళుతున్నావట గా సురేష్ గాడు ఫోను చేసి చెప్పాడు. రేయ్ నేను ఒక సెల్ ఫోను, డీవీడీ ప్లేయరు, ఒక లాప్టాప్ ఇస్తా తీసుకెళ్ళు. ఏర్ పోర్టుకు నా తమ్ముడు వచ్చి పికప్ చేసుకుని తీసుకెళతాడు.”


“ఒరేయ్ అదికాదు సెల్ ఫోను తీసుకెళతా కానీ డీవీడీ ప్లేయరు, లాప్టాప్ తీసుకెళ్ళాలంటే కొంచెం బరువెక్కువుంటుంది లగేజీ కష్టం రా”.

“ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా.నేను ఇండియానుండి వచ్చినప్పుడల్లా నీకు మీ అమ్మా వాళ్ళు ఇచ్చిన అమ్మాయి ఫోటోలు ఎన్ని సార్లు తీసుకుని రాలేదు.”


“అదికాదు రా కావాలంటే నేను ఈ సారి వచ్చేటప్పుడు నీకూ కొన్ని అమ్మాయిల ఫోటోలు తీసుకుని వస్తా”


“ఈ మాట మా ఆవిడకు చెప్పనా?”


“ఒద్దురా నాయినా ఏదో నోరు జారి అలా మాట్లాడా. మా ఆవిడ డోసు నాకు చాలు అసలే మీ ఆవిడ డోసు ఎంతుందో మొన్న రాకేష్ పార్టీలో చూశా. అయినా ఒక సారి రెండు ఫోటోలు ఇండియానుండి తెచ్చినంత మాత్రాన నా చేత లాప్టాప్ ఏమీ బాగా లేదురా”


“లాప్టాప్ చాలా బాగుంది దాని గురుంచి నువ్వేమీ భయపడకు మొన్నా థ్యాంక్స్ గివింగ్ సేల్ లో నాలుగ్గంటలు లైన్లో నిలబడి మరీ కొన్నా. మళ్ళీ చెప్పలేదు అనద్దు వచ్చేటప్పుడు నాకు కొన్ని టవల్లూ, బనీన్లూ, అండర్వేర్లు కొనుక్కొని రా. ఎక్కడంటే అక్కడ షాపర్స్ స్టాపూ, ఫాంటలూన్లో కొనొద్దు. అక్కడ రేటు ఎక్కువ. మీ కాలనీ లోనే వుండే జౌళి అంగడిలో కొని కొంచెం చీప్ గా దొరుకుతాయి. సరేరా నువ్వు బిజీగా వున్నావేమో రెండ్రోజుల్లో మీ ఇంటికొచ్చి పాకెట్ ఇచ్చిపోతా.” అని ఫోను పెట్టేశాడు.



“వేలూ లగేజీ కొచెం ఎక్కువయ్యేటట్లు వుంది నీ మేకప్ సామాను కొంచెం తగ్గిద్దామా?”


“అదే మరి మండుద్ది. మేకప్ లేకుండ ఇండియా పోతే అక్కడ నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వరూ. అలాంటి ప్రోగ్రాములు ఒద్దని ఇందాకే గదా అంట”


“అవును అన్నావుకదా మర్చిపోయా. నువ్వు నీ పని చూసుకో”


“తొక్కలో తిమ్మిరి.. పిక్కలో జాంగిరి.. డొక్కలో డిరి డిరి..” అని రింగ్ టోను మళ్ళీ. ఫోను తీసి హలో అన్నాడు.

(సశేషం)