Tuesday, June 12, 2007

డబుక్కు జర జర డుబుక్కు

(ఎప్పట్నుండో హెడ్లైన్ మాత్రమే రాసి పక్కన పెట్టిన వ్యాసానికి ఈ రోజు ఊపిరి వచ్చింది.)


ఎండా కాలం ఒచ్చిందంటే జాలు ఇంగ పిల్లోళ్ళందురుకీ పండగ. నాకబ్బుడు గెట్టిగా ఏడెనిమిది సమత్సరాలు గూడా లేవు. ఎబ్బుడు జూసినా ఆ చెరువుల కల్ల బాయిల కల్ల బడి తిరిగే పనే ఇరవై నాలుగ్గంటలూ. ఇస్కూల్లో లాస్ట్ రోజు స్కూలు పిల్లోడు ఒగడు రెండు చేతులూ చాంపుకొని దాని మింద రిజిస్టరు ని పెట్టుకోని క్లాసులోకి ఒచ్చేది కిటికీలో నుండి కనబడితే జాలు పక్కనోడిని ఆనందంతో వాడి రెట్ట మింద గిల్లేసి కొట్టేసి “ఒరేయ్ శేఖిర్ గా ఆడ జూడ్రా లీవులు చెప్పే బుక్కు ఒస్తా వుంది” అంటే.

దానికి వాడు రెట్ట రుద్దుకుంటా “అవును య్యోవ్ పొద్దున్నుండి అనుకుంటానే వుండా ఈ బుక్కు ఇంగా రాలేదేంది అని. ఇంగొచ్చేసింది గదా. మ్యాడం దాన్ని జదివి పొట్టి సంతకం పెట్టేస్తుంది. ఇంగ మనం లీవులంతా చేనుకాడికి, మడికాడికి పోవచ్చు. ఈ తూరి మామిడికాయిలు ఎక్కువ గదా మా తోపు లో కొచ్చేయ్ ఆడ మనం ఆడుకుందాం”.

“సరేరా ఆ పురుషోత్తంగాడిని మాత్రం పిలొద్దు మనం. వాడు మొన్న అత్తిరాసం ఇమ్మంటే ఈలా”.
“అట్లే లే య్యా”


ఇంతలో మ్యాడం ఆ బుక్కు తెచ్చినోడి నుండి బుక్కు తీసుకోని జదువుతుంది “ఈ సంవత్సరం బడి అయిపోయింది. మీ అందరికి ఈ రోజు నుండి అంటే ఏప్రిల్ 23 నుండి జూన్ 12 దాకా లీవూలు ఇస్తున్నారు. బడి జూన్ 13 వ తేదీ తెరుస్తారు. ఒకటో తరగతి పిలకాయలు రెండో తరగతికి. రెండో తరగతి పిలకాయలు మూడో తరగతికి పోతారు”. అంతే ఇంగేముంది ఇంకు పేనా తీసి సంతకం పెట్టి ఆ బుక్కు తెచ్చినోడికిచ్చేస్తే వాడు వాని నాలుగో క్లాసుకు వెళ్ళి పోతాడు. అంటే పక్క బిల్డింగ్ అన్న మాట. అందులో మూడు నాలుగు, అయిదు క్లాసులకు ఒగ అయివోరు వుంటాడు. ఆ అయివోరే లీవులు ఇస్తాడు. వాడు వెళ్ళిపోంగానే ఆ పెంకులిస్కూలు టాపు ఎగిరిపోయేటట్టు అందురూ అరుస్తారు. మ్యాడం “రేయ్, సైలంట్ గా వుండండి. ఇంగో గంట్లో స్కూల్ ఇసిపిట్టే బెల్లు గొడతారు అబ్బుడు అందురూ ఇంటికి పోవచ్చు.


ఇప్పుడు పైన చెప్పిన సీను చిత్తూరు జిల్లా, లద్దిగం గ్రామం లోని ప్రాథమిక పాఠశాల, డెబ్బయ్యవ దశకం. ఆ మ్యాడం మా అమ్మ. ఆ అయివోరు మా నాన్న. మొత్తం స్కూల్ స్టాఫ్ ఇద్దరే.బెల్లు కొట్టేదానికి మాత్తరం ఎబ్బుడూ అయిదోక్లాసు పిలకాయలుంటారు


“రేయ్, వసంతగా మీ బాయిలో నీళ్ళుండాయా ఈ సారి” అయివోరి చిన్న కొడుకు అడుగుతాడు. వాడి పేరు ఇంత వరకు తెలీక పోతే మీకు ఉక్కు ఫ్యాక్టరీ ఒకటిన్నర సమత్సరంలో కట్టెయ్యొచ్చనే తెలివి తేటలూ,నాలెడ్జి వుందన్నమాట. మీకంత విషయం లేదనుకుంటే వాడి పేరు ఈ బ్లాగు ఓనరి పేరు.

“ఈ తూరి చానా ఒచ్చేసినాయి య్యోవ్. ఎంతొచ్చినాయంటే మా బాయి చెరువులో మునిగి పూడిసింది”

“అయితే ఈ తూరికి మనం ఈత చెరువు మిందనే గొడదాం. మీ ఎనుముల్ని మేపేదానికి మీ యన్న తీస్కోనొస్తాడా నువ్వే నా”

“నా వల్ల్యాడవుతుంది సామి వాటిని సమాళిచ్చేదానికి? మా అధికారప్పన్న రావాల్సిందే” గర్వంగా చెప్పాడు.

“సరేలేరా ఎనుములొస్తాయి గదా వాటి మిందెక్కి చెరువులోకి పోదాం”


ఇంతలో సీను గాడు “య్యోవ్! ఈ తూరి హరికథలు ఎబ్బుడో తెలుసా నీకు”

“నాకెట్ల తెలు స్సుంది.మీ నాయినే గదా అన్నీ మాట్లాడేది పొయ్యి మీ నాయిన్నడుగు”

“అది కాదు గానీ నువ్వు బొయ్యి మ్యాడం నడుగు చీరామనవమి ఎబ్బుడో. అబ్బుడే గదా హరికథలు జెప్పేది”

“నువ్వుండు నేను బొయ్యి అడిగొస్తా”

నంగుకుంటూ టేబుల్ దగ్గిరికి బొయ్యి “మ్మా, ఈ తూరి హరికథలెబ్బుడు.”

“ఇంగో మూడు వారాలుంది" అమ్మ జెబుతుంది.

చొక్కా కాలరుతో ముక్కు తుడుచుకొని సీనుగాడి దగ్గిరికొచ్చి “రేయ్ ఇంగా మూడు వారాలే నంట్రా”

“అయ్యో అబ్బుడేనా నేను కొండయ్యగారి పల్లికి మా యవ్వోళ్ళూరికి ఎబ్బుడు బొయ్యేది ఇట్లయితే”

“ఈ తూరికి కాకపోతే వచ్చే తూరి పోవచ్చులే. ఇంగా దసరాలీవులుండాయి, సంకురేత్రి లీవులుండాయి”

“అవును గదా నేను ఆ సంగతే మరిసి బొయినా. మేము గానుగాడతా వుండాము రేపుట్నుండి లీవూలే గదా నువ్వొస్తావా? నీకు తట్ట బెల్లమూ, నక్కిలి ఇస్తా”

“యాడరా సామి యెండ్లెక్కువు గదా అంద్దూరం ఒచ్చేదానికి... మాయమ్మ చంపేస్తుంది. ఎట్లో ఒగట్ల టోకరా ఇచ్చి వచ్చేస్తాలే.”

ఇంతలో స్కూలు బెల్లు కొట్టేస్తారు. అబ్బుటి దాక కసి గా వున్న రమేష్ గ్యాడు పక్కన వున్న సూరిగాణ్ణి గెట్టిగా గిల్లేసి వురుకెత్తి పూడిసినాడు. పోతా పోతా ”దొంగ నాకొడకా! ఆ పొద్దు నా దగ్గిర బాగా కమ్మర కట్ట్లు ,బొండాలూ …… దినేసి నీ పెన్సిలిమ్మంటే ఈవా? నువ్విబ్బుడేమి జేసుకుంటావో జేసుకో పో నేను ఈ పొద్దు రాత్తిరికే మా యత్తోల్లూరికాడికి బోతా వుండా”


గిల్లిచ్చుకున్న సూరి గాడికి రమేష్ గాడు దొరకలా. సూరి గాడు మ్యాడం దగ్గిరికి బొయ్యి వేణు మాధవ టైప్ ఫేసు పెట్టి “మ్యాడా, వాయ్యో.. ఆ నా కొడుకు నన్ను గిల్లేసి పూడిసి నాడు మ్యాడా” అని బావురు మణ్యాడు.

“వాణి సంగతి స్కూలు తెరిచినబ్బుడు జెబ్తా. నువ్వింటికి బో” మ్యాడం చెబ్తుంది.

అట్లా మొదులయిన లీవూలు ఇంటి కాడ రొండు రోజులు సైలెంట్ గా జరుగుతాయి. అదేందో! చానా మంది పిలకాయలకు పగులు స్కూలు, సాయంత్రం పూట వుంటే గింటే కొంజేపు ప్రైవేటు వుంటాది. మిగతాటబ్బుటంతా లీవూలే. నాకు మాత్తరం పగులు స్కూలు మిగతా టైమంతా ప్రైవేటే. సాయంత్రం పూటా ప్రైవేటే, లీవూల్లోనూ ప్రైవేటే. ఏం జేసేది ఇంట్లో ఇద్దురు టీచుర్లు వుండి పాయిరి.సాపుటేరు ఇంజినీరు సాపుటేరు ఇంజినీరిని జేసుకుణ్యట్టు అబ్బుడు టీచురు టీచుర్ని జేసుకునే ఓళ్ళమో.అబ్బుడబ్బుడూ అనిపిస్తాది నాకు ఒగరి తర్వాత ఒగరు ప్రైవేటు జెప్పేదానికి జేసుగున్యారేమో అని.


రొండు రోజులు పొన్లే పాపం అని ఒదిలేసి తరువాత ఇంట్లో పాఠాలు జెబ్తారు.

“బుక్కులు దెచ్చుకోని చదువుకోరా”

“నేను తరూవాత సాయంత్రం జదువుతాలే”

“ఇబ్బుడేం జేస్తావ్”

“శంకరప్పోళ్ళ ఇంట్లో ఆవు ఈనిందంట. దూడ పెయ్య భొలే వుందంట నేను బొయ్యి జూసొస్తా”

“నువ్వు బోక పోతే దూడ పాల్దాగేది మానెయ్యదులే గానీ నువ్వు గూచోని జదువుకో”

“అమ్మ నేను బోతానే…వా..వా”

“నువ్వు నోరు మూసుకోని చదువుకో”

“డబుక్కు జర జర డుబుక్కు…డబుక్కు జర జర డుబుక్కు” అని వీధిలో నుండి సిగ్నల్లు. అవతల వీదిలో రౌండ్లేస్తున్న రెడ్డెప్ప, కిశోర్ గాళ్ళు.

“డబుక్కు జర జర డుబుక్కు…డబుక్కు జర జర డుబుక్కు” ఈ సారి కిశోర్ గాడు కొంచెం గెట్టిగా.

ఎలాగయినా ఈ రోజు చెరువు కాడికి పోవాల్సిందే. టోకరా మార్గాల కోసం వెదుకులాట.

“డబుక్కు జర జర డుబుక్కు…డబుక్కు జర జర డుబుక్కు” వీధి సందులోనుండి చిన్న గా మాయమయి పోతా వుంది. దొంగ నాయాళ్ళు నన్ను ఒదిలేసి పోతా వుండారు.

“మ్మా, నేను చింతోపు కాడికి పోవల్ల అర్జంటుగా”

“సరే బిర్నే పొయ్యి రా ఆడా ఈడా పెత్తనాలు జెయ్యద్దు”

“సరే నాకు తెలుసులే”

“రేయ్…రేయ్…”పక్కింట్లోకి బొయ్యి “రేయ్ వసంతా! రా రా చెరువు కాడికి బోదాము”

“వసంత గాడు వాళ్ళ నాయింతో పాటు బేల్దార్ పనికి బోయినాడుప్ప” వసంత గాడి అమ్మ.

“రేయ్..రేయ్..” ఎదురింటి అరుణ్ గాడి ఇంటికి బొయ్యి “అరుణ్ గ్యా, వస్తావా రా చెరువు కాడికి బోదాము”

“మా వోడు రాడు పో. వానికి ఇంటి కాడ పనుంది” వాడి నాన్న.

మెల్లిగా అరుణ్ గ్యాడికి ఇనిపిచ్చేటట్టుగా “రేయ్ నేనూ సీని గ్యాడూ ఓనిమి దగ్గర వుంటాం నువ్వొచ్చేసేయ్” అని చెప్పి ని గాడి ఇంటి కాడికి పోతే వాడు ఎద్దుల బండికి కడిచీల పీకేసి ఆ కందినితో ఆడుకుంటా వుండాడు.

నన్ను జూసి “ఇంత సేపా నువ్వోచ్చేదానికి బిర్నే పోదాం పద చెరువు కాడికి” అణ్యాడు కడిచీల చక్రానికి పెట్టి కందిని చొక్క కు తుడుచుకొని.

ఓనిమి కాడికి బోయినామో లేదో ఆడ రెడ్డెప్ప, వాల్ల చిన్న తమ్ముడు ఇంగా కిశోర్ గాడు వుండారు. వాల్లని జూసే సరికి అరుణ్ గాడు గుర్తు రాలా.”బిర్నే పదండ్రా మళ్ళా లేటయిపోతుంది” అని చెరువు కాడికి పరిగెత్తినాం.

అట్ల రెండు మూడు గంటలు ఆడేసి ఇంటికి తిరిగొస్తావుంటే ఎదురుగా ఇంగో బ్యాచి వాళ్ళు చెరువు కాడికి బోతావుండేది జూసి వాళ్ళతో కలిసి మళ్ళీ చెరువులో మోకాలీతలు. బాగా అలిసిపొయ్యి ఇంటికి తిరిగొస్తావుంటే గంగయ్యోళ్ళ మామిడి తోపు కాడికి వచ్చానో లేదో చేతిలో చింత బర్ర బట్టుకోని మా యమ్మ వెయిటింగ్.

మా యమ్మని, ఆ చింత బర్రని జూసి ఇంగ కాలి బాటొదిలేసి చేన్లంబడి ఇంటికి వురుకెత్తినా. ఇంటికి మా యమ్మొచ్చేసరికి చేతిలో బుక్కు పట్టుకుని “రామయ్య ఆ ఊరిలో పెద్ద మోతుబరి. వారి ఇంటి ముందు జామ చెట్టు కలదు. ఇంటి వెనక పెద్ద పెరడు కలదు…. ” అని జదవతా వుంటే.

“నీ వీపు వెనక ఇప్పుడు దద్దుర్లు వచ్చును…నీ మూతి ముందు పళ్ళు రాలును…నీ చేతులకు వాతల వచ్చును “ అని మా యమ్మ ప్రైవేట్లో పెద్ద ప్రైవేట్ జెప్పేది.


అలా ఎన్నో ప్రైవేట్లకు గురి అయినా డబుక్కు జర జర డుబుక్కు…డబుక్కు జర జర డుబుక్కులు మాత్రాం ఎన్ని వూర్లు మారినా మానలేదు. దాని ప్రావీణ్యం తో నాలుగంతస్థుల లోతున్న బాయిలోకి దూకడం. పెద్ద బాయిని ఇరవై రోఉండ్లెయ్యటం వచ్చింది.

5 comments:

cbrao said...

ఏప్రిల్ 23 నుండి జూన్ 12 దాకా లీవూలు ఇస్తున్నారు. బడి జూన్ 13 వ తేదీ తెరుస్తారు. -విహారి

ఓయ్! చిన్నోడా! సెలవులయిపోనాయి. ఇప్పుడేం చేస్తావంట?

Anonymous said...

విహారి గారు
అప్రస్తుతం కాని, మీ పేర ఓ చిన్న క'పిత్వం' (కొద్దిగా పైత్యం ఎక్కువయ్యిందంటారా ??)

విహారీ !! బ్లాగుల బేహారీ !!
నీ రాక ముందు ఇదో కలహారి
వొచ్చాక రోజూ బ్లాగులహరి
నీ మరో పేరే ఆనంద విహారి

(కలహారి అనేది ఎడారి)

Moyin said...

మీరు అలా తిరిగి తిరిగి, మి పేరు సార్థకం చెసుకున్నారు మరి, విహారి అని. బావుందండి మి ఫ్లాష్ బాక్.

జ్యోతి said...

వావ్!!హైదరాబాదులో వానలు ముంచేస్తుంటే నువ్వేమో బ్లాగులో మమ్మల్ని నవ్వుల వాన కురిపిస్తున్నావ్. బాబోయ్. ఇక నవ్వడం మా వల్ల కాదు .

Unknown said...

ఇది చదువుతుంటే రానారె రాసినట్టనిపించింది.
బావున్నాయి మీ చిన్ననాటి ముచ్చట్లు. మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవన్నీ మిస్సు :)