Monday, June 25, 2007

ఈ మధ్య రిలీజయిన సస్పెన్స్, హారర్, ఎమోషనల్ సినిమాలు.

:


లేఖిని
వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

హమారా కోచ్:

క్రికెట్ మీద సినిమాలు రాలేదన్న క్రికెట్ అభిమానుల దురద ఈ సినిమా తీరుస్తుంది. “దురదాకు పూసుకున్నోడికి గోక్కున్నంత” అనే ట్యాగ్ లైన్ చక్కగా నప్పుతుంది. మన దేశ క్రికెట్ తీరుతెన్నుల గురించి అందులో మన క్రికెట్ భవిష్యత్తు గురించి ఎంతో పాటుపడుతున్న కొందరు ICCB పెద్దలు తీసిన ఈ చిత్రం ఈ మధ్య వచ్చిన సస్పెన్స్ మరియూ హారర్ చిత్రాలను మరిపించింది. మొదట వై మోర్ ను కోచ్ గా తీస్కుని వస్తామని బాగ ప్రచారం కల్పించి జాన్ జింబురే ని కోచ్ పదవికి పరిశీలిస్తున్నామని చెప్పి ప్రేక్షకులను ట్విస్టుకు గురి చేస్తాడు దర్శకుడైన దురార్. విదేశీ కోచ్ వద్దన్న గనిల్ సువాస్కర్ జాన్ జింబురే పేరును ప్రతి పాదించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. క్లైమాక్స్ లో వై మోర్ ను , జాన్ జింబురే ను కాదని ఇంకొకరిని ఇంటర్వూ కి పిలిచి అతన్ని సెలెక్ట్ చేశామని చెబుతారు ICCB పెద్దలు. చివరకు అతను కోచ్ పదవిని స్వీకరించాడా లేదా? అతను భారత దేశానికొచ్చిన తరువాత ఎదురుపడ్డ ప్రమాదకర సన్నివేశాల్ని ఎలా ఎదుర్కొంటాడు అన్నవి తుంగ పార్కర్ స్క్రీన్ ప్లే లో తెలుసుకోవాల్సిందే. తప్పక చూడండి మీ అభిమాన క్రికెట్ టి.వి. లో.


ది ప్రెసిడెంట్:


ఇది సమిష్టిగా మూడు కూటములు కలిసి తీసిన చిత్రం. దర్శకులు ఇంకా ఎక్కువే. తెర మీద పేర్లు అయిపోగానే ప్రేక్షకులందరికి అర్థమయిపోతుంది వచ్చే ప్రెసిడెంట్ ఎవరో. అధికార పక్షం నిలిపిన అభ్యర్థే అందునా మహిళా రాష్ట్రపతి వస్తున్నారని అందరూ అనుకున్నంతలో మూడో కూటమి తయారయి అంతవరకు ప్రజల మన్నలు పొందుతున్న రాష్ట్రపతి పేరును తెర పైకి తీసుకు రావడంతో మొదలవుతుంది అనుకోని ఉత్కంఠ. ఎవరు నామినేషన్ వేస్తారో, ఎవరు విత్ డ్రా చేసుకుంటారో, ఎవరు గెలుస్తారో అనే ఉద్విగ్నం కలుగుతుంది. ఒకర్ని మించి మరొకరు స్వచ్చమైన రాజకీయ పరిభాషలో ‘సంప్రదాయకరంగా’ మాట్లాడుకుంటారు. అక్కడినుండి అంధికార రాజకీయ రాబంధులు తమ కడుపులోని కుళ్ళును నోటి ద్వారా రప్పించడంతో తెర మొత్తం జుగుప్సా కరంగా అసహ్యంగా మారుతుంది. మిక్కిలి పవిత్రమైన పదవిని ఎలా మకిలీ చెయ్యచ్చో ఈ నకిలీ ప్రజా సేవకులను చూసి తెలుసుకోవల్సిందే. చివరికి మూడో కూటమి ప్రతిపాదించిన వ్యక్తి భావోద్వేగానికి గురి అయి ఈ మాలిన్యంలో నేనుండలేనని చెప్పిన తరువాత కథ ముగుస్తుంది. తనే ప్రేక్షకులందరి చేత ‘సెభాష్’ అనిపించుకొంటాడు. సినిమా అంతా అయిన తరువాత ప్రేక్షకులు ఒక భావో ద్వేగానికి(వాంతులకు, వికారాలకు) గురికావడం సమిష్టిగా పనిచేసిన దర్శకుల నైపుణ్యానికి ప్రతీక. ఇందులో నటించిన పూలూ ప్రసాద్ పలావ్ అందరి కన్నా ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు.


-- :0: --

2 comments:

కొత్త పాళీ said...

అయ్యొయ్యో ఇంత మంచి టపాకి ఒక్క కామెంటు లేదే?
కిసుక్కు పకపక కాదుగానీ ముసిముసి నవ్వులు, దాంతోనే మన ప్రజల రెండు favorite passtimesకి పట్టిన దుస్థితి చూసి కొంచెం విషాదమూ కలిగాయి.
మరికొన్ని రాజకీయుల పేర్లు -
జిలయలిత, దంచ్రబాబు నాయుడు, పలాయనసింగ్ యాదవ్ ...

విశ్వనాధ్ said...

అసలే సినిమా పరిశ్రమ కధల కొరతలో ఉంది.
మీరిలాంటి మలుపుల మసాళా కధలు రాసేస్తే కాపీ కొట్టేసే ప్రమాదముంది
మీ కధలను అర్జెంటుగా రిజిష్టర్ చేయించుకోండి.