Thursday, June 21, 2007

సీనుగాడి ఇండియా ప్రయాణం. – 3

:


లేఖిని
వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

అలా కారు కీస్ కోసం పరుగులు పెడుతున్న సీనుగాడికి కారు “గీ..గీ.. కుయ్యువ్..కుయ్యువ్…వుళ..వుళ.. హాండా..బోండా ” అని సౌండు వినిపించే సరికి కారు కీస్ కోసం కాక కారు దగ్గరికి ఇంట్లోని డోరు ద్వారా గరాజ్ లోకి పరుగెత్తాడు. అసలే కారు గరాజ్ మూసి వుండటం వల్ల కారు చేసే శబ్దం తో పాటు వెలుగుతూ ఆరిపోతూ వున్న కారు లైట్లు కనిపించాయి.అది చూసిన సీనుగాడికి విఠలా చార్య సినిమాలో ఒంటి కన్ను రాక్షసుడి గుహ సాక్షాత్కరించింది. ఎంత స్పీడుగా వచ్చాడో అంతే స్పీడుగా పి.టి. ఉష ను తలుచుకుని 'మాస్క్' సినిమాలోని జిం కారీ లా సుడి గాలి అయిపోయి కూతురున్న గదిలోకి ప్రవేశించాడు.



“తుర్ర్.. బుర్ర్.. కె..కె. కేకే.. తుర్ర్ బుర్ర్” అనుకుంటూ చేతిలో కారు కీస్ తో ఆడుకుంటూ కనిపించింది పుత్రికా రత్నం. దగ్గరకు పోయి “చీ..చీ.. బుజ్జి.. కన్నా.. కారు కీస్ ఇవ్వమ్మా” అని కీస్ తీసుకోబోయాడు. కారు కీస్ వెనక్కి తీసేసుకుని తన చిన్ని కాలుతో ఒక్క తన్ను తన్నింది. ఆ తన్నుడికి సీనుగాడి కళ్ళద్దాలు గాల్లో రెండు పల్టీలు వేసి కింద పడబోతే మహమ్మద్ కైఫ్ లాగా మూడు పల్టీలు వేసి ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు. మళ్ళీ దగ్గరకు పోయి “నా చిట్టి తల్లి కదూ ఆ కీస్ ఇచ్చెయ్యమ్మా” అని ముందుకు వంగాడు.


ఈ సారి కీస్ పక్కన పడేసి “తుర్ర్..తుర్ర్…” అని చొంగ తో ఓ పెద్ద గాలి బుడగ చేసి సీనుగాడి మొహమంతా పావనం చేసింది. మొహం కో-ఆప్టెక్స్ కట్ బనీనుతో తుడుచుకుని మళ్ళీ దగ్గరకి వెళ్ళి “నీకు అన్నీ మీ అమ్మ బుద్దులే వచ్చాయి. వేలెడంత లేవు కానీ నాతోనే ఆటలాడుకుంటున్నావే…”



అంతలో అలివేలు పేద్ద కేక పెట్టింది “ ఏమండీ ఇందాకా మీరు ఫోనులో వుంటే అమ్మాయి ఏడుస్తోందని ఏమీ దగ్గర లేక పోతే కారు కీస్ దాని చేతిలో పెట్టాను. అది ఆడుకుంటూ పానిక్ బటన్ నొక్కినట్లుంది.ఆ కీస్ తీసుకొని కారు సౌండును కాస్త ఆపండి వినలేక పోతున్నా.”



“అవును ఆ కాస్త సౌండే నువ్వు వినలేక పోతే. మూడేళ్ళ నుండు నీ నుండి వస్తున్న సౌండు వింటున్న నా పరిస్తితేంటి” అని మనసులో అనుకుని. ”ఆ..ఆ అలాగే తీసుకుంటున్నా” అన్నాడు. కారు కీస్ తీసుకోబోతే బుడ్డిది ఎడమ చేతిలోకి కీస్ తీసుకొని కుడి చేత్తొ సీనుగాడి చెంప మీద ఒక్కటిచ్చింది. ఛెంపలు నిమురుకుంటూ “ఏదో కళ్ళు అందంగా వున్నాయి కదా అని ఒక మంచి పేరు హరిణి అని పెడితే నాకు హరి హరాదులు గుర్తుకు వచ్చేటట్టు చేస్తావా? నీకు మీ అమ్మమ్మా వాళ్ళు పెట్టిన వీర వెంకట బాల త్రిపుర జ్ఞాన మంగ సుబ్బాయమ్మ అనే పేరే ఖాయం చేసుండాల్సింది.నిన్ను స్కూల్లో వేసేటప్పుడు ఆపేరుతోనే రిజిస్టర్ చేయిస్తా. అలా కాదు గానీ ఈ రొజునుండి నిన్ను బుడిగి అని పిలుస్తా”


హరిణి రెండు కాళ్ళతో “డిష్యుం.. డిష్యుం…” ఈ సారి సీనుగాడి గడ్డం అతిధ్యం స్వీకరించింది.


ఇలా అయితే నా పని హైద్రాబాద్ లో సిటీ బస్సెక్కిన ప్యాసింజర్ లా అయిపోతుందని బుర్రని గోడకే పదును పెట్టాడు. నగేష్ గాడికి కొడుకు పుట్టబోయే ముందు తను ప్రజెంట్ చేసిన బుక్కు గుర్తుకు వచ్చింది. బాల నేరస్తుల శిక్షణాలయం నుండి తప్పించుకుని వచ్చిన తరువాత డా: బాల్యేష్ జెఠ్మలాని వ్రాసిన ఆ బుక్కు పేరు “పిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి”. వాడికి ఇచ్చేముందుపి తనకు భవిష్యత్తులో అవసరమవుతుందేమోనని ఆ బుక్కుని కంఠతా బట్టీ వేసేసి కవర్ నలిగిపోతే ఈనాడు పేపర్ తో అట్ట వేసి ఇచ్చేశాడు. అప్పుడు తను చేసిన తెలివి పనికి ఒక్కసారి సంబరపడిపోయాడు. వెంటనే ఆ బుక్కుని గిర్రు మని రౌండేసి పదకొండో పేజీ దగ్గర ఆగి పోయాడు తన కీవర్డ్ సెర్చ్ కి మ్యాచ్ కాగానే. “పిల్లలు పాతది మరచి పోవాలంటే కొత్తది ఏదయినా అలవాటు చెయ్యాలి” అదే ఆ పేజీ సారాంశం.ఇప్పుడు కారు కీస్ మరిచిపోవాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి. నా కళ్ళద్దాలు ఇచ్చేస్తే..ఆహా భేషయిన అవుడియా. వెంఠనే అమల్లో పెట్టేశాడు.


అంతవరకు రెండు చేతులతో కీస్తో ఆడుకుంటున్న హరిణి కారు తాళాన్ని ఎడమ చేతిలోకి తీసుకుని కుడి చేత్తో కళ్ళద్దాలు తీసుకుని రెండింటితో ఆడుకోవటం మొదలు పెట్టింది. తాళాలు లాక్కో బోతే “వా…. వా…” అని రాగం మొదలుపెట్టింది.


“ఏమండీ ఇంకా ఎంత సేపు? ఆసలే కారు సౌండుకు చెవులు పగిలి పోతుంటే మీరు అమ్మాయిని ఏడిపిస్తారా?” బయటి నుండి అలి వేలు మండిపాటు.


చివరికి ఇలా కాదని అరబిక్ ట్యూన్స్ తో వున్న తెలుగు పాట లో నేటివిటీ కోసం వీణ సౌండును ఇరికించినట్లు కారు తాళాలు అలానే వుంచి కారు రీమోట్ లాక్ తో పానిక్ సౌండును ఆపు చెయ్యగలిగాడు. వెంటనే పాంటాప్ తీసుకుని “పిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి “ బుక్కులోని 11 వ పేజీ సూత్రం కొందరికి మాత్రం వర్తించదు అని రాసుకున్నాడు.



అప్పటికే సమయం మించిపెఒవడం వల్ల పుత్రికా రత్నాన్ని అలానే కారు సీట్లో వుంచి కారు సీటును తీసుకెళ్ళి కారులో పెట్టాడు.

అంతలో వేలు వచ్చి కారులో కూర్చుంది. సీనుగాడు లోపలికి వెళ్ళి డ్రెస్సు మార్చుకుని బూట్లు వేసుకుని వచ్చి కారు సీట్లో కూర్చున్నాడు.

“ఇంకా ఎందుకాలస్యం కారు స్టార్ట్ చెయ్యండి” అలివేలు.

“ఈ..ఈ..” అని పళ్ళికిలించాడు.

“ఆ ఇకిలిపేమిటి కారు స్టార్ట్ చెయ్యక”

ఈ సారి కళ్ళు మాత్రమే తిప్పాడు బేబీ సీటు వంక చూపిస్తూ.

“అలసిపొయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ లా ఆ కళ్ళు తిప్పడమేమిటి తిన్నగా చెప్పచ్చుగా”

కళ్ళు తిప్పటంలో అనుభవం వచ్చేసిందో లేక అలివేలు అర్థం చేసుకుందో…” ఓ.. కారు కీసు పాప దగ్గర వుండిపోయాయా” అని

“బుజ్జు కన్నా! నాన్న కారు కీస్ ఇచ్చెయ్యమ్మా” అనగానే బుడిగి కీస్ తీసి వాళ్ళమ్మ చేతిలో పడేసింది. ఆ సీను చూసిన సీనుగాడికి “పిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి” అనే బుక్కుని పర పరా చింపేసి డా: బాల్యేష్ జెఠ్మలానీను కారు కిందేసి తొక్కించేయాలన్నంత కోపమొచ్చింది.


అలివేలిచ్చిన కీస్ తీసుకుని మళ్ళీ పళ్ళికిలించాడు కార్ స్టార్ట్ చెయ్యకుండా.


“మళ్ళీ ఏమయింది మీకు….ఓహో కళ్ళద్దాలు లేవా? ఆగండి” అని బుడిగిని చూసి “ చీ చూడమ్మా నాన్నకు రోడ్డు సరీగా కనిపించ దంట ఇవి లేక పోతే ఏ ట్రక్కంకుల్ నో, గ్రాండ్ మా కారునో గుద్దేస్తాడు. ఈ సారి నాన్నారొక్కరే కారెక్కినప్పుడు మనం ఇంట్లో వుండి కళ్ళద్దాలతో ఆడుకుందాం. ఓ సారిచ్చెయ్యమ్మా!. కావాలంటే కారు దిగిన తరువాతా మళ్ళీ ఇస్తాలే.”


బుడిగి తల అడ్డంగా ఊపింది.


“ఏమండీ మీ పర్సు ఇలా ఇవ్వండి” అని పర్సు తీసుకొని బుడిగికి ఇవ్వగానే కళ్ళద్దాలు ఇచ్చేసింది.పాం టాప్ తీసుకుని ఏదో నోట్ చేసుకో బోయాడు.


"ఇంతవరకు రాసింది చాల్లే"


అలివేలు ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకుని కారు స్టార్ట్ చేసాడు. తన పర్సు బదులు అలివేలు హ్యాండ్ బ్యాగ్ ఇవ్వచ్చుగదా అనే చచ్చు ప్రశ్నలు వెయ్యలేదు సీనుగాడు, ద జెంటిల్ మెన్. డా: దుమారం రాసిన బుక్కులు చదవడం వల్ల కలిగిన జ్ఞానం అది.


కారు పార్కింగ్ లాట్లో ఆపాడో లేదో దూరంగ ఒక దేశీ జంట కనిపించింది. వాళ్ళు కనిపించగానే అలివేలు “అదిగో చూడండీ ఎవరో దేశీలు” అంది.

“సర్లేవే దేశీలు షాపింగ్ చెయ్యరా ఏంటి” అన్నాడు కారు పార్క్ చేసి. కారు తాళాలు బుడిగికి ఇచ్చేసి తన పర్సు తీసుకుని కారు సీటును స్ట్రాలర్ లో పెట్టాడు.


అలా కొంత దూరం రాగానే ఆ దేశి జంట వీళ్ళ దగ్గరకు వచ్చి పలకరించింది.


“హలో, హౌ ఆర్యూ? ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యు బిఫోర్” అన్నాడు.

సీనుగాడి బుర్రలో ఎర్ర లైటు దేదీప్యమానంగా వెలిగి పోతోంది. తరువాత ఏమంటాడో కూడా తెలుసు.

“హె యు లైక్ తెలుగు పీపుల్. ఆర్ యు ఫ్రం ఆంధ్రా?” మళ్ళీ తనే అన్నాడు.


మిగిలిన సీనంత సీనుగాడికి అర్థమయి పోయింది. తర్వాత వాడు “మీరేమి చేస్తారు అంటాడు. మనము అడక్కపోయినా వాడికో బిజినెస్ వుందంటాడు.దాని పేరు ఈ కామర్సంటాడు. దానికో బంగారు తీగుందంటాడు.తొంగుంటే మీ నోట్లే కరిగిస్తానంటాడు. దాన్ని మీ ఇంట్లో వేస్తానంటాడు. వాడి వెనకో మిలియనుందంటాడు. రెసిడ్యువల్ ఇన్ కమంటాడు. నువ్వు ముగ్గుర్ని చేర్పించాలంటాడు. తరువాత పిరమిడ్ అంటాడు. మమ్మీ లంటాడు, ఈజిప్టు అంటాడు, ఆఫ్రికా అంటాడు. వీళ్ళ దుంప తెగ ఇంతకు ముందు ఇలాంటోళ్ళు ఒంటరి గాళ్ళనే పట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఏకంగా జంట గా వచ్చి జంటలకే టెండర్ వేస్తున్నారు. ఇలా ఆలోచించేలోపే ఆ వచ్చినోడి ఆవిడో మరే ఆవిడో తెలీదు కానీ అలివేలుతో తొక్కుడు బిళ్ళాడేసి, “అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ” అన్నంత క్లోస్ అయిపోయి బుడిగిని ఎత్తుకొని ఆడిస్తోంది.

ఇలా పరిచయాలు పెంచుకొని వాళ్ళ స్కీముల్లో చేరమని వెంట పడతారు. ఇక్కడే తుంచెయ్యటం మంచిది.

“మాస్టారూ మీది హైద్రాబాదా” ఆ సచ్చినోడి పలక్రింపు.

“కాదు పులివెందుల”

“మీరేమి చేస్తుంటారు”

“బాంబులు తయారు చేస్తుంటా”

“మీరు భలే జోకులు వేస్తారు. మీ లాంటి వాళ్ళుంటే మా బిజినెస్ చాలా బాగా ప్రాస్పర్ అవుతుంది. ఇంతకూ మీరు ఖాళీ సమయాల్లో ఏమి చేస్తుంటారు”

“రేప్ లు చేస్తుంటా” ఆ వచ్చినావిడ వైపు కొర కొరా చూస్తూ అన్నాడు సీనుగాడు,అప్పుడప్పుడూ ద ఫైర్ ఇంజెన్.

సీను అర్థమయి పోయిన ఆ దేశీ జంట పరుగో పరుగు.

“ఎందుకండీ వాళ్ళనలా బెదర్గొట్టేశారు” అలివేలు.

“నీకు అన్నీ చెప్పా గానీ ఈ ఒక్క ఎపిసొడ్ గురించి చెప్పలేదు కదూ. ఇలా కొంత మంది పరిచయాలు పెంచుకొని మీ బాసుని కాల్తో తన్నెయ్, మీ కంపెనీని గోటితో గోకెయ్ అని చెప్పి ప్రమోషన్ స్కీములంటూ ఇంటికొచ్చి పడతారు. ఇంట్లో వున్న చెట్లకు పుట్లకు డాలర్లు కాస్తాయ్ అని చెప్తారు”

“అవేమి స్కీములండీ?”

“ఇప్పుడవన్నీ ఎందుకులే తొందరగా పదా ఎవరన్న దేశీలు ఇలా పలకరించారంటే దానర్థం వాళ్ళకు ఇలాంటి ఈ-కామర్స్ బిజినెస్ లున్నాయని అర్థం. ఇలాంటోళ్ళను చూడగానే వై.యెస్. కిలారి పాల్ ను చూసినట్టు చూడాలి”


“అలాగలాగే ఏదో అడిగాం కదా అని పెద్ద యండమూరి లాగ కథ చెప్పకండి. ముందు ఈ స్ట్రాలర్ తీసుకుని బుడ్డి దాన్ని ఆడిస్తూ వుండండి”


మాల్ లోకి ప్రవేశించారు. ముందు అలివేలు నడుస్తుంటే వెనక స్ట్రాలర్ తోసుకుంటూ సీనుగాడు. అక్కడ వెళ్తున్న అందమైన అమ్మాయిల వంక అలివేలు వంకా చూసుకుంటూ “ప్చ్! పెళ్ళప్పుడు వర్షం సినిమాలో త్రిష లాగుండే నా భార్య ఇప్పుడు కిత కితలు సినిమాలో అల్లరి నరేష్ భార్య గీతా సింగ్ లాగా అయిపోయింది” అనుకున్నాడు. నడక లో కొంచె వెనక పడ్డాడు సీను గాడు. వాళ్ళావిడ కనిపించక్ పోయేసరికి ఆత్రంగ వెతికాడు ఒక షాపు దగ్గర. అక్కడ అలివేలు ఎవరో దేశీ జంటతో మాట్లాడుతోంది.


“ఎన్ని చెప్పినా వినదు ఈ అలివేలు. మళ్ళీ ఏ ఆమ్వే జంటో క్విక్ స్టార్ జంటో తగిలినట్లుంది. లాభం లేదు ఈ సారి దులుపెయ్యాలి అని ఆంజేయ స్వామి దండకం అక్కడే నాలుగు సార్లు చదివి కానిఫిడెన్స్ వచ్చాకా అయిదో సారి చదువుకుంటూ దగ్గరికి వచ్చాడు.

“హె శ్రీనివాస్, బావున్నావా? నువ్వు ఇండియా వెళుతున్నావని తెలిసింది.” పాత ఆఫీసులో పని చేసే మనొహర్. వాళ్ళావిడతో కలసి షాపింగ్ కు వచ్చినట్టున్నాడు.


“హె మనోహర్ బావున్నా నువ్వెలా వున్నావ్?”


“బాగున్నా. మొత్తానికి మూడేళ్ళ తరువాత వెళ్తున్నావ్. హైద్రాబాద్ చాల మారిపోయింది తెలుసా? అక్కడ సైట్లు ఏమైనా కొంటున్నావా? నా బామర్ది రియాల్టర్ గా పని చేస్తున్నాడు.” మనోహర్

“అవునండీ మా తమ్ముడు బాగానే సంపాదిస్తున్నాడు అక్కడ. మీకు కావాలంటే చెప్పండి కొంచెం తక్కువకు ఇప్పిస్తాడు" వాళ్ళావిడ.
"అప్పిస్తాడా?" సీనుగాడు

"లేదండీ కావాలంటే అప్పిప్పిస్తాడు"

"అప్పిస్తాడా?"

"అలాంటి పనులు చెయ్యడండీ"

"నా దగ్గిర ఓ నాలుగు వేలు రూపాయలు మిగలచ్చు. దానితో ఏదయినా ప్లాటు కొనచ్చా?"

"నాలుగు వేలతో ఏమీ రాదండీ"

"నాలుగు వేలు డౌన్ పేమెంటు ఇచ్చినా ఏమీ రాదా"

"రాదండీ"

"అలా అయితే నాకేమీ ఒద్దండి"

ఇదంతా చూసిన మనోహర్ కల్పించుకొని "అరె శ్రీనివాస్ ఈ మధ్య బాగా జోకులు వేస్తునావ్. అది సరే గానీ ఈ మాల్ కి ఇండియా షాపింగ్ కోసం వచ్చారా"

"లేదు కాంబోడియా కెళ్ళి ఇక్కడ కొన్న డ్రెస్సులు అక్కడ ఒరంగ్ ఉటాన్ లకు వేసి టైటుగా వున్నాయో లూజుగా వున్నాయో కనుక్కుందామని"

"అబ్బా నవ్వ లేక చచ్చిపోతున్నా శ్రీనివాస్. ఇక ఆపేయ్"

"అలాగే ఇక మేము వెళ్ళమా?"

"అరే చెప్పడం మర్చిపోయా నువ్వు ఇండియా వెళ్తున్నావని తెలిసే మేము కూడా షాపింగ్ కు వచ్చాం."

నేను ఇండియా వెళ్తుంటే వీడు షాపింగ్ చెయ్యడమేమిటి? ఎర్ర బల్బు పెద్ద కాంతితో "నువ్వు మళ్ళీ డమాల్" అంది.

"అలాగా! ఏం పాపం మీరు ఇండియా వెళ్ళేటప్పుడు డబ్బుల్లేవా?"

"వున్నాయి కానీ మొన్న ఇండియాకు ఫోను చేసినప్పుడు నా తమ్ముడికి ఒక మంచి రీమోట్ కంట్రోల్ హెలికాప్టర్ కావాలన్నాడు. అది కొని మీ చేత పంపిద్దామని అనుకొ...."

"వేలూ. డూ యూ నో హూ దిస్ ఫెల్లో ఈజ్?. లెట్స్ డూ అవర్ షాపింగ్ ఫాస్ట్" అని స్ట్రాలర్ నెట్టుకుంటూ అక్కడున్న గుంపులోకి దూరిపోయాడు.

మనోహర్, వాళ్ళావిడ తేరుకుని చూసేసరికి సీనుగాడి ఫ్యామిలీ మొత్తం మాయం.

"నీ జిమ్మడ! నువ్వు ఏదయిన సైటు కొను హైద్రాబాదు లో మా తమ్ముడికి చెప్పి ఏదో ఒక లిటిగేషన్ పెట్టిచేస్తా" అని శాపనార్థాలు పెట్టింది మనోహర్ వాళ్ళావిడ.

వాళ్ళనుండి తప్పించుకొచ్చిన సీనుగాడు సోనీ షాపులో దూరి 62'' టీ.వి. వెనక నక్కి దాక్కునాడు. అక్కడ ఎవరూ దేశీలు లేరు అని తెలిసినప్పుడు మాత్రం బయటికి వస్తున్నాడు.

"వేలూ, ఇలా అయితే మనము షాపింగ్ చేసినట్లే. నేను వెళ్ళి ఆ ఫుడ్ కోర్టు పక్కన మూల నున్న టేబుల్ దగ్గర దాక్కోని మన బుడ్డి దాన్ని చూసుకుంటూ వుంటాను నువ్వు షాపింగ్ ముగించుకొని వచ్చెయ్" అన్నాడు.

"అలాగే పాప జాగ్రత్త" అని అలివేలు వెళ్ళి పోయింది.

ఫుడ్ కోర్టు లో మూల వున్న టేబుల్ దగ్గరకెళ్ళి అటు వైపు తిరిగి కారు సీట్లోకి మొహం పెట్టి పాపతో ఆడుకుంటున్నట్లు నటిస్తూ వున్నాడు.

ఇంతలో బుడ్డిదానికి ఆకలి వేసి కెవ్వు మంది. పాపం ఆకలిగా వున్నట్లుంది పాలు కలుపుదామని తల పైకెత్తి పాల డబ్బా కోసం ఇటు తిరిగాడు.

"అరే సీను! నువ్వా ఎవడో సన్నాసి వెధవనుకున్నాను" ఎత్తుపళ్ళ నరసిం హం గాడు.

(సశేషం)

10 comments:

జ్యోతి said...

హి హి హి,,,పెద్దగా నవ్వే ఓపిక లేదు బాబు. సీనుగాడు ఇండియా కొచ్చి వెళ్ళాక నవ్వాలో, అతడి పరిస్థితిని చూసి అతనితో పాటు ఏడ్వాలో ఆలోచిస్తా...........

Naga said...

హ2

Kamaraju Kusumanchi said...
This comment has been removed by the author.
Laxman said...

:) అ.రా.

Niranjan Pulipati said...

భలే సరదాగా వుంది అండీ.. :) ఇక తరువాతి భాగం కోసం ఎదురు చూస్తున్నాము :)

రాధిక said...

సీను గాడి ఇండియా ప్రయాణం ఎప్పుడు మొదలువుతుంది సారూ?మా లగేజీ ఇచ్చి ఎన్ని నెలలయింది?ఇంకా బయలుదేరడే?

Ghanta Siva Rajesh said...

అయ్యా చిన్న మనవి
నెను ఆపిసు లొ కుర్చుని మీ బ్లగులు చదువుతుంటె మిగిలిన వాళు వింతగ చుస్తునారు. దయచెసి శబ్దం రకుండా నవటం యలగొ సెలవిచి పుణ్యం కటుకొండి

మీనాక్షి said...

Hi VIHARI gaaru.
mee tapaa chadivi navvi..navvi..navvi..navvi..navvi na bujji potta noppeDutundi.....
chuuuuuuuper...

okkadu007 said...

emandi maa vallu u.s vellaraaa ani sava godutunte vaallaki mee posts chupinchi nooru mooyistunnanu andi. thank you so much

okkadu007 said...

nextpart eppudu maasttaaaaaaaaru