Friday, June 01, 2007

సీనుగాడి ఇండియా ప్రయాణం - 1

ఎట్టకేలకు సీను గాడికి లీవు దొరికింది ఇండియా వెళ్ళడానికి. అమెరికా వచ్చిన తరువాత దాదాపు ప్రతి సంవత్సరం టంచనుగా ఇండియా వెళ్ళేవాడు. పెళ్ళయిన తరువాతే దానికి బ్రేక్ పడింది. పెళ్ళికాక ముందు మెయిల్లో వచ్చిన ఫోటోలు చూసి “ఆహా ఈవిడే నా స్వప్న సుందరి” అనుకుంటూ పరుగెత్తుకుని వెళ్ళే వాడు. గంతులేసుకుంటూ ఆ అమ్మాయిని చూడ్డానికి వెళితే ఆ అమ్మాయితప్ప అందరూ చాలా బాగ కనిపించేవారు పక్కింటి సుబ్బాయమ్మ వెనకింటి వెంకాయమ్మ తో సహా. అమ్మాయిని చూడగానే పి.సి.శ్రీరాం తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు వచ్చే వాళ్ళు కాదు.

ఆ అమ్మాయి ఫోటో తీసినోడిని పెట్టి ఒక తెలుగు సినిమా తప్పకుండా తీయాలని తలపు కలిగేది కానీ అమ్మాయిని మాత్రం చూడ బుద్దేసేది కాదు. అలా తిరిగి తిరిగి విమానంలో ఫ్రీక్వెంట్ ఫ్లైయెర్ 1000K మెంబర్షిప్పు వచ్చి బిజినెస్ క్లాసులో సీటు అప్ గ్రేడ్ ఫ్రీగా ఇవ్వడం మొదలు పెట్టారు ఏర్ లైన్స్ వాళ్ళు. ఇలా కుదరదు వీడు ఇలా ప్రతి సారి విమానమెక్కి ఇండియా వస్తే ఫ్రీక్వెంట్ ఫ్లైయెర్ తో పాటు ఫ్రీ మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తారని వాడి వేలు విడిచిన మేనమామ కూతురొకటుంటే ఆవిడనిచ్చి పెళ్ళి చేశేశారు వాళ్ళ అమ్మా నాన్నా. "అలివేలూ ఆణి ముత్యమా..." అని పాడుకుంటూ పెళ్ళి చేసేసుకున్నాడు. స్వప్న సుందరి కల్లోకి రావడం మానేసింది అప్పట్నుండి. అలా అలివేలును చేసుకున్న సీనుగాడు “ఆ నాలుగో ఆల్బంలో మూడో అమ్మాయినో లేక రెండో అల్బంలో ఆరో ఫోటోలో వున్న అమ్మాయినో చేసుకునుంటే ఎంత బావుండేదో” అని ఎప్పుడో ఓ సారి అనుకుంటూ వుంటాడు.


కాల చక్రం గుర్రు మనకుండ గుర్రెట్టి నిద్రపోవడం వల్ల గిర్రు మని నాలుగు సంవత్సరాలు తిరిగి పోయాయి. ఈ నాలుగేళ్ళలో అలివేలు ఇచ్చిన కానుక ఓ బుజ్జి బుడ్డిది. ఈ బుజ్జి బుడ్డిది పుట్టినపుడు సహాయం కోసమని అత్తా మామల్ని వీసా మీద సొంత ఖర్చులతో రప్పించడం వల్ల సీనుగాడు జేబు కురచనయి పోయింది. దానికి తోడు వాళ్ళు వున్న అయిదు నెలలు అమెరికా అంతా తిప్పి చూపించేసరికి కురచగా నున్న జేబు కాస్తా మాయమయిపోయి డాలర్లు మొత్తం అంకుల్ శ్యాం బ్యాంకులో పడ్డాయి.


ఇదిగో ఇప్పుడు మళ్ళీ పెన్నీ పెన్నీ కూడ బెట్టి ఇండియాకు ప్రయాణం కట్టాడు. ఎంత కుదరదన్నా బుడ్డి దానికి పుట్టు వెంట్రుకలు తిరపతి లోనే తీయించాలని వాడి అమ్మ బలవంత పెడితే ఎటూ తనకు బాగానే క్షవరం అయింది తను కూడా గుండు కొట్టించుకుంటే సింబాలిక్ గా వుంటుందని ఇండియాకు టికెట్లు బుక్ చేశాడు. పనిలో పనిగా అలివేలు కు కూడా గుండు చేయిస్తే పూర్ణ సింబాలిక్ గా వుంటుందనే అద్భుతమైన ఆలోచన రావడంతోటే పర్యవసానాలు తెలియక ఆలి అలివేలు తో ఓ మాట అన్నాడు.అలా అనడం ఆలస్యం అలివేలు ఆకాశమంతెత్తుకు ఎగిరి “ఏం తమాషాలు చేస్తున్నావా? పోతేపోనీలే అని పెళ్ళి చేసుకుంటే నాకు గుండు కొట్టే ప్రొగ్రాం కూడా పెట్టావా? ఇలాంటి అలోచనలు దాని పిండాకూడూ లాంటి వేమన్నా వుంటే ఇప్పుడే మొగ్గలో తుంచేయ్ లేక పోతే ‘భార్యను వేధిస్తున్న ఎన్నారై’ అని ఈనాడు పేపర్లో హెడ్లైన్ వస్తుంది జాగ్రత్త” అని తన స్టయిల్లో మెత్తగా చెప్పింది.


సీనుగాడు అనుకున్నాడు, అవును నిజమే ఏదో అదృష్టం వుండ బట్టి పెళ్ళి జరిగింది గానీ రోజూ తెలుగు పేపర్లలో వచ్చే ఎన్నారై వేధింపులు వార్తలు చదివి తనకు పిల్ల నెవడు ఇచ్చేవాడు. మొత్తానికి అలివేలు మంచి లాజిక్కులే మాట్లాడుతుంది అని లోలోన సంబరపడ్డాడు లాజిక్కైన పెళ్ళాం దొరికిందని. ఆయినా ఈ పేపరోళ్ళకు ఇంకేం పని లేదేమో ఎప్పుడూ అలా పెళ్ళాన్ని గోక్కు తింటున్న ఎన్నారై, ఇలా పెళ్ళాని పీక్కు తింటున్న ఎన్నారై, వెరైటీగా పెళ్ళాన్ని కొరుక్కుతింటున్న ఎన్నారై అని రాస్తారు. వీళ్ళ సర్క్యులేషన్ వందకి పడిపోవు గాకా అని మనస్పూర్తి గా దీవించేశాడు. ఇదే కో రికను తిరపతి కి పోయినప్పుడు గుర్తుపెట్టుకొని వెంకటేసును అడగాలి అనుకొని మరచిపోతానేమో నని పాంపైలెట్ తీసి అందులో రాసుకున్నాడు.


అలా రాసుకోవడం చూసిన అలివేలు “ఇగో మిమ్మల్నే అలాగే రుబ్బురోలు, అప్పడాల కర్ర కూడా రాసుకో మర్చిపోతానేమో దాంట్లో రాసుకో” అంది.


“మొన్ననే కదా వేలూ ఒక అప్పడాల కర్ర ఇండియెన్ స్టోర్స్ లో కొన్నావ్ దానికేమయింది ఇప్పుడు” అన్నాడు.


“ఇదిగో ఇట్లాంటి మాటలే మాటాడొద్దని చెప్పేది. ఇక్కడ దొరికేవన్నీ నాసిరకం అప్పడాల కర్రలు. చూడ్డానికి నాజూగ్గ వుంటాయి కానీ ఒక్క రుద్దుడు కే విరిగిపోతాయి”


“అవును నిజమే అలాగే రాసుకుంటా” అన్నాడు. మనసులో మాత్రం ‘నేనెంత అదృష్టవంతుడిని. ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కసారి కూడా మా ఆవిడ దాన్ని నామీద ప్రయోగించలేదు ఆఫీసులో మాధవ్ ఎప్పుడూ బుర్ర తడుముకుంటూనే వుంటాడు. అమెరికా వచ్చినా వాళ్ళావిడ ఏమీ మారలేదు.’ అని చాలా గర్వంగా కూడా ఫీలయ్యాడు.


అంతలో “తొక్కలో తిమ్మిరి.. పిక్కలో జాంగిరి.. డొక్కలో డిరి డిరి..” అనే కొత్త పాట రింగ్ టోను వినిపిస్తే వెళ్ళి సెల్ ఫోను తీశాడు. అవతల లైన్లో సత్తి గాడు. తీసి హలో అన్నాడో లేదో “ఒరేయ్ సీనుగా, నువ్వు వచ్చే వారం ఇండియా వెళుతున్నావట గా సురేష్ గాడు ఫోను చేసి చెప్పాడు. రేయ్ నేను ఒక సెల్ ఫోను, డీవీడీ ప్లేయరు, ఒక లాప్టాప్ ఇస్తా తీసుకెళ్ళు. ఏర్ పోర్టుకు నా తమ్ముడు వచ్చి పికప్ చేసుకుని తీసుకెళతాడు.”


“ఒరేయ్ అదికాదు సెల్ ఫోను తీసుకెళతా కానీ డీవీడీ ప్లేయరు, లాప్టాప్ తీసుకెళ్ళాలంటే కొంచెం బరువెక్కువుంటుంది లగేజీ కష్టం రా”.

“ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా.నేను ఇండియానుండి వచ్చినప్పుడల్లా నీకు మీ అమ్మా వాళ్ళు ఇచ్చిన అమ్మాయి ఫోటోలు ఎన్ని సార్లు తీసుకుని రాలేదు.”


“అదికాదు రా కావాలంటే నేను ఈ సారి వచ్చేటప్పుడు నీకూ కొన్ని అమ్మాయిల ఫోటోలు తీసుకుని వస్తా”


“ఈ మాట మా ఆవిడకు చెప్పనా?”


“ఒద్దురా నాయినా ఏదో నోరు జారి అలా మాట్లాడా. మా ఆవిడ డోసు నాకు చాలు అసలే మీ ఆవిడ డోసు ఎంతుందో మొన్న రాకేష్ పార్టీలో చూశా. అయినా ఒక సారి రెండు ఫోటోలు ఇండియానుండి తెచ్చినంత మాత్రాన నా చేత లాప్టాప్ ఏమీ బాగా లేదురా”


“లాప్టాప్ చాలా బాగుంది దాని గురుంచి నువ్వేమీ భయపడకు మొన్నా థ్యాంక్స్ గివింగ్ సేల్ లో నాలుగ్గంటలు లైన్లో నిలబడి మరీ కొన్నా. మళ్ళీ చెప్పలేదు అనద్దు వచ్చేటప్పుడు నాకు కొన్ని టవల్లూ, బనీన్లూ, అండర్వేర్లు కొనుక్కొని రా. ఎక్కడంటే అక్కడ షాపర్స్ స్టాపూ, ఫాంటలూన్లో కొనొద్దు. అక్కడ రేటు ఎక్కువ. మీ కాలనీ లోనే వుండే జౌళి అంగడిలో కొని కొంచెం చీప్ గా దొరుకుతాయి. సరేరా నువ్వు బిజీగా వున్నావేమో రెండ్రోజుల్లో మీ ఇంటికొచ్చి పాకెట్ ఇచ్చిపోతా.” అని ఫోను పెట్టేశాడు.“వేలూ లగేజీ కొచెం ఎక్కువయ్యేటట్లు వుంది నీ మేకప్ సామాను కొంచెం తగ్గిద్దామా?”


“అదే మరి మండుద్ది. మేకప్ లేకుండ ఇండియా పోతే అక్కడ నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వరూ. అలాంటి ప్రోగ్రాములు ఒద్దని ఇందాకే గదా అంట”


“అవును అన్నావుకదా మర్చిపోయా. నువ్వు నీ పని చూసుకో”


“తొక్కలో తిమ్మిరి.. పిక్కలో జాంగిరి.. డొక్కలో డిరి డిరి..” అని రింగ్ టోను మళ్ళీ. ఫోను తీసి హలో అన్నాడు.

(సశేషం)

14 comments:

ప్రవీణ్ గార్లపాటి said...

మా విహారి గారు కథలు రాస్తున్నార్రో...(సారీ కథో కథానికో)
సీను గాడు ఇండియా ఎప్పుడొస్తాడో.

రానారె said...

ఇంకేం! డింగో డింగు :))
విహారికదా, విహారమే కథావస్తువయినట్లుంది.
ఇండియా వెళ్లేవారికీ, అక్కడినుంచీ వచ్చేవారికీ మిత్రులనుబడువారి లగేజీ మోయడం మాత్రం తప్పదేమో.

radhika said...

అనుకుంటూనేవున్నాను మీరు కధలు మొదలు పెడతారని.శుభారంభం చేసారు.అదిరింది.చూస్తుంటే శ్రీనుగాడు మహా మంచోడులా కనిపిస్తున్నాడు.పాపం ఎక్కువ కష్టపెట్టకండి.తరువాతి భాగం త్వరగా..

Lalithaa Sravanthi Pochiraju said...

"తొక్కలో తిమ్మిరి.. పిక్కలో జాంగిరి.. డొక్కలో డిరి డిరి..”

పాటా చాలా బాగుంది.
నాకు రింగ్ టోన్ గా కావాలండి.
ఈ సంవత్సరం ఉత్తమ పాట గా బంగారు నంది గెల్చుకునే కళ ఉట్టిపడుతోంది.

ప్రసాద్ said...

కథ అదిరింది. తరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నా. మొత్తం మీద NRI కష్టాలు రాస్తున్నారన్నమాట.

--ప్రసాద్
http://blog.charasala.com

శ్రీనివాసరాజు said...

కధ చాలా బాగుంది.. నవ్వలేక చచ్చా..

ఇలానే మరిన్ని మాకు అందించగలరు..

బందరుబ్లాగరుడు said...

బాగుంది బాగుంది. సీనుగాడు ఇండీయా వెళ్లే లోపు తప్పక వాళ్ల ఆవిడ చేత దెబ్బలు తింటాడనిపిస్తుంది కానివ్వండి. మంచి రసపట్టులొ ఉంది కధ.

Sudhakar said...

చాలా బాగుంది. very realistic.

శ్రీ said...

బాగుందండీ సీనుగాడి ప్రయాణం!

వెంకట రమణ said...

కథ చాలా బాగుంది. తరువాత భాగంకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

leo said...

:-)

రాకేశ్వర రావు said...

ఇది చదివాక పెళ్ళంటే భయం వేస్తుంది.

srinivas said...

చాల సహజంగా ఉంది. ఇక్కడ జరిగే విషయాలని చాల చక్కగా చెప్పారు.

ప్రియమైన నీకు......... said...

మల్లిక్ ని అనుసరించినట్టున్నారు.....చాలా బాగుంది....