Tuesday, July 03, 2007

జైలుకు వెళితే డబ్బులు…. బ్యాంకులోనే

:


తండ్రి: స్కూలుకు వెళ్ళి బాగా చదుకోవాలి తెలిసిందా.
కొడుకు: ఏం ఎందుకు స్కూలుకు వెళ్ళాలి?

తండ్రి: స్కూలుకు వెళ్ళి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలొస్తాయి. మంచి జీతాలొస్తాయి అప్పుడు సుఖంగా ఉండొచ్చు.
కొడుకు: అంటే బాగ డబ్బులొస్తాయా?

తండ్రి: అవును.
కొడుకు: అందుకోసం స్కూలుకెళ్ళి చదువుకోవాలా. నేను వెళ్ళను.

తండ్రి: నువ్వు వెళ్ళక పోతే మక్కెలిరగ దంతా. ఏమనుకుంటున్నావో.
కొడుకు: నేను స్కూలుకెళ్ళను జైలు కెళత బాగా డబ్బులొస్తాయి.

తండ్రి: జైలు కెళితే దబ్బులొస్తాయా? అదెలాగా?
కొడుకు: ఆ మాత్రం తెలీకుండా తండ్రి వెలా అయ్యావ్?
ఓ తండ్రి అవాక్కయ్యాడు.


** ** **

“మావా నువ్వా పురుగుల మందు తాగొద్దు మావా. నువ్వు సచ్చిపోతే మాగతేంగానూ నువ్వు తగొద్దు మావా ”
“లేదే నేనొక్కడే తాగడం లేదు మీ అందరికీ కూడా ఇస్తా. అందరం కలిసి సచ్చిపోదాం”

“ఇప్పుడంత కష్టమేమొచ్చింది మావా. ఏదో కలో గంజో తాగి గుట్టుగా బతుకు తున్నాం గదా మావ”
“పొలానికి చేసిన అప్పులు ఎవడు తీరుస్తారే మంగీ, అప్పులోళ్ళు రోజు ఇంటికొచ్చి పాణం తీస్తా వుండారు”

“నాయినా నువ్వేమీ బాధ పడొద్ధు. నేను డబ్బులు సంపాయిత్తా” పది హేనేళ్ళ కొడుకు.
“నువ్వెట్ట సంపాయిత్తావు నాయినా నీకు జదువు గూడా రాదు. మీ అయ్య జేసే పని కూడా నెర్చుకోక పోతివి”

“అది కాదే అమ్మా నేను జైలుకు పోతా బాగా డబ్బులొస్తాయి”
“అదెట్ట కుదురుద్ది జైలుకు బోతే చిప్ప కూడే కందా”?

“మీకు తెల్వదా జైలుకు బోతే కొన్ని కోట్లు వస్తాయి”
ఓ తండ్రి , ఓ తల్లి అవాక్కయ్యారు.


** ** **

అమెరికాలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ

ఫ్రెండు: రేయ్ మామా ఇక్కడ వుండడం నా వల్ల కాదురా.
ఇంకో ఫ్రెండు:ఏమి రా ఏమయింది.

ఫ్రెండు: ఏమయింది ఏదో సంపాయించి పొడిచేద్దామని ఇక్కడి కొచ్చామా. తీరాచూస్తే ఏముంది సంవత్సరం చివర్లో చూస్తే బ్యాంకు బ్యలెన్సు ముక్కి మూలిగి పది వేలు కూడా దాటడం లేదు. అది కూడా ఓ ఇండియా ట్రిప్ వేస్తే హాంఫట్.
ఇంకో ఫ్రెండు: అంత డబ్బులు లేక పోయినా ఉన్నంతలో లైఫ్ చాలా హ్యాప్పీ కదరా మామా.

ఫ్రెండు: అలా కాదురా ఇక్కడి కన్నా ఇండియాలో డబ్బులు సంపాదించడం ఈజీ. అందుకోసం నేను ఇండియా వెళ్ళి పోతున్నా.
ఇంకో ఫ్రెండు: ఇండియా లో డబ్బులు సంపాదించడం ఈజీనా. అదెలాగో చెప్పి పుణ్యం కట్టించు కోరా.

ఫ్రెండు: అందులో ఏముది జైలు వెళితే సరి.
ఇంకో ఫ్రెండు: ఇదేంది రో “అందులో ఆలోచించ డానికేముంది చార్మినార్ రేకులు వేయిస్తే సరి” అన్నత ఈజీగా జైలుకు వెళితే సరి అంటున్నావ్. రాత్రి మందు గానీ ఎక్కువయిందా.

ఫ్రెండు: లేదురా బాగా ఆలోచించి చెబుతున్నా. ఇండియాలో జైలు కెళితే సంవత్సరానికి 33 కొట్లకు పైగా మిగలబెట్టచ్చు.
ఇంకో ఫ్రెండు: అంటే దాదాపు ఎనిమిది మిలియెన్లు.

ఫ్రెండు: అందుకే నేను ఇండియా వెళ్ళి ఓ మూడు సంవత్సరాలు జైల్లో వుంటా. మా ఆవిడను, పిల్లలను అత్తగారింట్లో ఒదిలేస్తా. ఓ వంద కోట్లు వస్తాయి. మిగిలిన లైఫంతా హ్యప్పీనే. ఈ ప్రమోషన్లు, వీసాలు, గ్రీనుకార్డులు గొడవే వుండదు.
ఇంకో ఫ్రెండు: నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నేను అయిదు సంవత్సరాలు వుంటా. జైలు నుండి బయటికొచ్చిన తరువాత ఏ ఐశ్వర్యా రాయ్ చెల్లెల్నో, త్రిషా కజిన్నో చేసుకోవచ్చు.

ఫ్రెండు: పదా రేపే వెళ్ళి పోతున్నాం.
పక్కనున్న ఇంకొన్ని “ఫ్రెండులు” అవాక్కయ్యారు.


** ** **

డిల్లీ లో సుప్రిం కోర్టు కిట కిట లాడి పోతోంది. దేశ విదేశాల నుండి వచ్చిన విలేఖర్లూ, వీడియో గ్రాఫర్లూ ఎంతో మంది కోర్టు బయట ఎదురు చూస్తున్నారు. సి.ఎన్.ఎన్., ఎన్.బి.సి., జీ టి.వి., స్టార్ టి.వి. మొదలైన దేశ విదేశీ చానెళ్ళకు కోర్టు ఆవరణలోని షామియానాల కింద ముందు సీట్లు ఇవ్వబడ్డాయి. దూరదర్శన్ విలేఖర్లూ, వీడియో గ్రాఫర్లూ షామియానా కి అవతల గోడ దగ్గర బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు.


కేసు లో వాదోప వాదాలు మొదలు పెట్టచ్చని చెప్పే ముందు ఇద్దరు టైలర్లు వచ్చారో లేదో నని వాకబు చేసి వారు వచ్చారని తెలుసుకొని ఇలా మాట్లాడారు జడ్జి గారు“దేశాన్ని కుదిపి వేసిన ఈ సమస్య నేరుగా సుప్రిం కోర్టు విచారణ కు రావడం బహుశా దేశంలో ఇదే మొదటి సారి. అంతే కాకుండా కొన్ని లక్షల మంది తమంతకు తామే జైలుకు వెళతామని దరఖాస్తు పెట్టుకోవడం ప్రపంచ చరిత్రలోనే మొట్ట మొదటి సారి. ఆ దరఖాస్తు లో ముందుగానే తమకు సంవత్సరానికి ముప్పై కోట్లు ఇవ్వమని కోరడము ఎంతో ఆశ్చర్యకరం. అంత అరుదైన ఈ కేసును వాదించ బోయే లాయర్లకు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు వాదోప వాదాలు చేసుకునే టప్పుడు హింసకు తావు లేకుండా అహింసా యుతంగా వాదించాలని నా మనవి.”

అలా జడ్జి చెప్పగానే లాయర్లు తమ వాద పటిమ తో కొర్టు హాలును రణ రంగాన్ని మరపింప చేశారు. కొర్టు లో వాదించే లాయర్ల గౌన్లు వాదించి ఒకరి గౌన్లు ఒకరు చింపెయ్యగానే ఇద్దరు టైలర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గౌన్లు కుట్టేసి ఇచ్చేస్తున్నారు విచారణ ఆగి పోకుండా. అలా ఏక బిగిన ఆరు గంటల పాటు సాగిన విచారణ జడ్జి ఇచ్చిన బ్రేక్ తో అగి పోయింది. కాసేపు విరామం ప్రకటించారు తమ తీర్పు ని తయారు చెయ్యడానికి.

ఈ అరగంట లో బెట్టింగ్స్ కొన్ని కోట్లలో జరిగాయి తీర్పు ఎలాగుంటుందోనని. సి.ఎన్.ఎన్. అందించిన వివరాల ప్రకారం భీమవరం లో 45 కోట్లు, హైదరాబాద్ లో 70 కోట్లు, ముంబాయి లో 120 కోట్లు, దుబాయ్ లో 100 కోట్లకు పైగా జరిగినట్టు తెలిసింది.

విరామం అనంతరం జడ్జ్ తీర్పు చదవడం మొదలు పెట్టారు.

“సంచలనం సృష్టించిన ఈ కేసు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిది. ఇంత సంచలనానికి కారణ మైనది ఇంతకు ముందు యావద్భారతాన్ని కుదిపేసిన ఓ కుంభ కోణం కేసు తీర్పు. ముప్పై వేల కోట్ల స్టాంపుల కుంభ కోణానికి కారణమైన అందులోని ముద్దాయికి పడ్డ శిక్ష పద మూడేళ్ళ జైలు మరియూ 102 కోట్ల జరిమానా. ముద్దాయి తాను 102 కోట్లు చెల్లించ లేననగానే ఇంకో 3 ఏళ్ళు జైలు శిక్ష ని అనుభవించమని చెప్పడం ఈ సంచలనానికి కేంద్ర బిందువయింది. దాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని లక్షల మంది పౌరులు తమను కూడా జైళ్ళలో పెట్టి “102 కోట్లు 3 ఏళ్ళ జైలు” లెక్క ప్రకారం సంవత్సరానికి ముప్పై కోట్లు ఇవ్వాలని పిటీషన్ పెట్టడం జరిగింది. ఇలా పౌరుల మనసులను మార్చివేసిన ఆ స్టాంపుల కుంభకోణం లోని వ్యక్తికి ఇచ్చిన మూడు సంవత్సరాల కారాగార సదుపాయాన్ని రద్దు చేస్తూ, అతని బంధువుల పేర్ల మీద వున్న ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోమని ఆదేశించడమైనది. ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష ను విధిస్తున్నాం” అని చెప్పి ముగించి బయటకు వస్తున్న ఆయన్ను ఒక విలేఖరి అడిగాడు.

“మరి 30,000 కోట్లు తిన్నా మిగతా పెద్దల సంగతేమిటి”
“సాక్ష్యం వుంటే వాళ్ళకు కూడా శిక్ష వేస్తాం నా చేతుల్లో ఏమీ లేదు”

“అంటే వాళ్ళు తప్పించుకున్నట్లేనా?”
“నో కామెంట్ ప్లీజ్”.


** ** **

ఇదంతా టి.వి. లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న మూడేళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నతో.

“నాన్నాలూ! బెత్తింగ్ ఏజెంత్ అయితే డబ్బులు బాగా వత్తాయా. నేను పెద్దయ్యాక బెత్తింగ్ కంపెనీ పెళతా”.

ఇంకో తండ్రి అవాక్కయ్యాడు మళ్ళీ.
** ** **


గమనిక: బ్లాగుకు వారానికి పైగా సెలవు. సమయం అనుకూలిస్తే తానా సభల విశేషాలు ప్రతి రోజూ ఆ మూడు రోజులూ.


:లేఖిని
వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.

:

2 comments:

Srinivas Ch said...

అహా ఏమి సస్పెన్సు, వాహ్ వాహ్.మొదలెట్టిన దగ్గరనుంచి చివర వరకు అసలు జైలు కెలితే డబ్బులు ఎలా వస్తాయో అని ఊహించుకుంటూ చదివాననుకో. అలాగే మీ దగ్గర నుంచి తానా విశేషాలతో కూడిన టపాల కోసం ఎదురుచూస్తూ...

Anonymous said...

@ శ్రీనివాస్ గారు,

థాంకులు.

-- విహారి