Thursday, July 19, 2007

సాంకేతికులు సహాయ పడగలరు…

(టపా రాయడం చేసితిని. డబ్బాలో వేయుట మరిచితిని. కొన్ని సవరణలు చేసి ఇప్పుడు నా ఎర్ర డబ్బాలో వేసితిని)


క్రిందటి ఒక విజ్ఞప్తి టపాలో టపాల రేటింగ్ గురించి రాశా. దర్శనాలు ఎక్కువయ్యయి గానీ వోటేసిన వాళ్ళు ఎవ్వరూ కనపడలేదు ఒకరిద్దరు తప్ప. కామెంట్లు బోలెడు వచ్చాయి లెండి కాస్త సంతోషం. ఇంకా సంతోషించే విషయమేంటంటే నా బ్లాగు కొంచెం నెమ్మదిగా లోడు అవుతోంది అని ప్రవీణూ, ప్రసాదూ, శ్రీనివాసూ, విశ్వనాథూ, రావు గారూ, రాధిక గారు నొక్కి వక్కాణించారు. ముందుగా వారికి ధన్యవాదాలు. ఎటూ సొంత గూటికి వెళ్ళే ప్రయత్నంలో వున్నాము కదా దీని గురించి అంతగా పట్టించుకోవడమెందుకని అనుకున్నా. కానీ పరిస్థితి తీరం దాటి వాయుగుండం గా మారింది. మా ఆఫీసులో కూడా చాలా స్లోగా లోడు అవుతోంది. ఇది నెట్ వర్క్ సమస్యేమోనని అనుకున్నా. అందువల్లే కామెంట్లకు సమాధానం కూడా ఇవ్వలేక పోయా. ఇలా అయితే మనల్ని జనాలు మర్చిపోతారని కాస్త పరిశోధన చేసా బ్లాగు నమూనా(Template) మీద. అప్పుడర్థమయిందేంటంటే కొంత కాలం క్రిందట టపా రేటింగ్ కోసమని spotback.com దగ్గర్నుండి కొంత కోడ్ తీసుకొచ్చి నమూనాలో నాటా. అదే ఇప్పుడు బ్లాగుకు కార్బన్ డయాక్సైడు అయి కూర్చుంది. ఇంతకు ముందోసారి ఇలానే స్లో అయితే దాన్ని పీకి పడేశా. కానీ కొందరి బ్లాగుల్లో బాగానే కనిపించడం, గోళ్ళు ఏపుగా పెరగడం వల్ల వంటి దురద ఎక్కువై మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నమూనాలో ఎక్కడెక్కడో కలిపా.


ఇందాకా గుంపులో చూస్తే నా పేజీ లోడు అవడానికి సమయం పడుతోందని చెప్పడం చూశాను. రిప్లై ఇవ్వడానికి కుదరడం లేదు. గుంపు సాఫ్టు వేర్ కు కూడా ఏదో మాయరోగం వచ్చింది. ఇన్నిరోజులు అంత నెమ్మదిగా నడుస్తున్నా నా బ్లాగును సందర్శిస్తున్నారంటే నేనెంత అదృష్టవంతుడిని(ఇక్కడ గంగమ్మ జాతర డప్పుల డ్యాన్సు సీను పెట్టుకోండి).

“ఆ విధంగా” నిదానంగా లోడు అవుతోందని పిల్లి మెడలో గంట కట్టిన వందటపాల ప్రవీణుడికి కృతజ్ఞతలు. ఆ గంటను టంగు టంగు మని మోగించి నా చెవుల్లో తుప్పు రేగ్గొట్టిన మిగిలిన అందరికి కూడా కృతజ్ఞుణ్ణి.


తప్పదని చేతికి గ్లౌస్ వేసుకొని అంతా ఓవర్ హాలింగ్ చేశా ఇప్పుడు. ఇప్పుడు బ్లాగు ముదుకన్నా వేగంగా లోడు అవుతోంది. బొమ్మలయితే తొందరగానే కనిపిస్తున్నాయి కానీ రంగులు లోడవటానికి సమయం తీసుకుంటుందేమోనని అనుమానం. ఇక్కడ నాకొస్తున్న సందేహాలు.


1. బొమ్మలు ఒకటో రెండో వున్నంత మాత్రాన పేజ్ లోడ్ కు ఎక్కువ సమయం తీసుకుంటుందా? కొన్ని ఇతర వెబ్ సైట్లలో(బ్లాగులు కాదు) ఎన్ని బొమ్మలున్నా ఇంత సమయం తీసుకోవడం లేదు.

2. రంగుల బ్యాక్ గ్రవుండ్ వుంటే (అది కూడా బూడిద రంగు) సమయం తీసుకుంటుందా?

3. www.spotback.com వారి రేటింగ్ సిస్టం మాత్రమే అలా లోడు సమయాన్ని తినేస్తుందా? అంతరంగం, శోధన బ్లాగులు కూడా కొంచెం గూడ్సు బండి లా నడుస్తున్నాయి. నా మదిలో కొంచెం ఫర్వాలేదు. ఇంకెవరి సైట్లలో రేటింగ్ సదుపాయం వున్నట్టు కనపడలేదు.

4. టపా లో విషయం ఎక్కువయితే విహరిణి(browser?) యూనీ కోడ్ ను render చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందా? ఆ మధ్య కొన్ని బ్లాగుల్లో సునామీ కామెంట్లు వచ్చినప్పుడు కూడా కాస్త నెమ్మది అయిపోయాయి.

5. ఉచిత సత్రాలు (బ్లాగుస్పాటు, వర్డు ప్రెస్సు) వాడటం వల్ల లోడు తక్కువైన ఎడల, సొంత గృహం నిర్మించుకొన్నప్పుడు కాస్త తొందరగా పేజీలు లోడు అవుతాయా?


కాస్త మీ చేతికి గ్రీసు అంటించుకొని సాయం చేస్తే జై కొడతా. :-)


:

11 comments:

మాకినేని ప్రదీపు said...

ఇప్పుడు తొందరగానే లోడవుతుంది. ఇంకొద్దిగా తొందరగా లోడవ్వాలంటే ఎడమపక్క నున్న సైడుబారుని కుడిపక్కకు తీసుకుని రండి. ఆ తరువాత మీ బ్లాగు "మొదటి పేజీలో" ఒకేసారి కనపడే పోస్టుల సంఖ్యను 2 లేక 3 పోస్టులుగా చేయండి.

అలాగే మీరు పారాగ్రాఫుల కొద్దీ రాసేయకుండా ఒకటి రెండు లైన్ల మాత్రమే ఉండే పొస్టులు రాసేస్తే అప్పుడు మీ బ్లాగు చక్ చక్ మని లోడై కూర్చుంటుంది :)

Srinivas Ch said...

ఇప్పుడు మీ(మా)బ్లాగ్ వేగంగా లోడ్ అవుతుంది. ముఖ్యంగా పైన హెడర్లో ఇమేజి తీసేసాకా వేగం పెరిగింది అని అనుకుంటున్నాను. నాకు తెలిసి పక్కన ఉన్న సైడ్-బార్ ఎటువైపు ఉన్నా ఫరవాలేదు. ఎందుకంటే అది ఎలాగూ లోడ్ అవ్వాల్సిందే కదా. అలాగే ప్రదీప్ గారు అన్నట్లు బ్లాగ్లో డీఫాల్ట్ గా కనపడే టపాలు ఒక 3-4 ఉండేలా చేయండి.

ఇక చివరగా మీ టపాలను ఇలాగే కొనసాగించండి. అంతే కాని వేగంగా లోడ్ కావడం కోసం టపాలు చిన్నవిగా వ్రాయకండి. మీ టపాలు చదవడం మాకెంతో ఇష్టం.

మాకినేని ప్రదీపు said...

నేను అలా సైడుబారుని కుడిపక్కకు జరపమని చెప్పటానికి కారణం లేకపోలేదు. సాధారణంగా అందరి బ్లాగులలో ఆ బ్లాగు HTMLను పరిశీలిస్తే సైడుబారుకు సంబందించిన HTML బ్లాగు పోస్టు తరువాత వస్తుంది, కానీ ఇక్కడ విహారిగారి బ్లాగులో సైడుబారు HTML మొదటగా లోడవుతంది.

సాధారణంగా బ్రవుజర్లు సమాచారాన్ని లొడవుతుండంగానే చూపించేస్తూ ఉంటాయి. మొదటగా పోస్టు కనపడిపోతే, ఆ తరువాత సైడుబారు మెల్లగా లోడయినా కూడా చదివేస్తున్నప్పుడు అది తెలియదు.

విహారిగారి సైడుబారులో కూడా అసలు పోస్టంత సమాచారం ఉంది...

padma i. said...

మీ బ్లాగు ఇంతకుముందు నా maxthon ని crash చేసేది. మీ sourcecode నేను చూడలేదు కానీ, firefox లో webdeveloper extension తో document size (Information tab, View Document size) ఎంత ఉందో చూసాను. మొన్న అది 325KB ఉంది. ఇది stylesheets, javascript, images etc., అన్నీ కలుపుకుని. ఆ సంఖ్య మీరు బొమ్మలు తగ్గించాక 299KB, అందులో బొమ్మలే ఇంచుమించు 225KB ఉన్నాయి. చాలా standards ప్రకారం ఇది *చాలా* ఎక్కువ. మొదటి పేజీలో images size తగ్గించడమో, సంఖ్య తగ్గించడమో చెయ్యచ్చు.
మీ banner image original గా చాలా బావుంది, అది మీ individuality ని తెలియజేస్తోంది.

ఇంకొక సలహా ఏమిటంటే, కూడలి, తెవికీ బొత్తాలని లేఖిని/వీవెన్ సైటునించి లింకు చేయకుండా
ఎవరికి వారే blogger సైటులోనే పెట్టుకోవచ్చు కదా! లేఖిని కి లింకు చేస్తే వాళ్ల bandwidth
వృధా అవుతుంది. చాలా మటుకు images అన్నీ ఒకచోటే ఉంటే pages తొందరగా లోడు అవుతాయి కూడా.
blogger లో wordpress లో లాగ excerpts మాత్రమే చూపించే సౌకర్యం లేదనుకుంటాను? -- padma i.

వీవెన్ said...

పద్మ గారూ, బాండువిడ్తు సమస్య ఇంకా లేదు. బొత్తాలన్నీ వాటివాటి సైట్లలోనే ఉంటే (ఇప్పుడున్నట్లు), అవి ప్రతీసైటుకి లోడు అవ్వాల్సిన అవసరం ఉండదు.

ఎవరికి వారు వాటిని వారివారి సైట్లలో పెట్టుకుంటే వాటిని అందరి బ్లాగులకీ ఒక్కొక్కసారి విహరిణి (browser) దిగుమతి చేసుకోవాల్సివస్తుంది.

విహారీ, మీ బ్లాగులో ప్రస్తుతం statcounter ఎక్కువ టైము తీసుకుంటుంది. చార్టులు మీకు పంపిస్తా.

జ్యోతి said...

హమ్మయ్య!!

cbrao said...

బ్లాగు త్వరగా load అవటానికి, ప్రదీప్ సూచనలు బాగున్నై.Stat Counter slow చేస్తే, ఏమి చెయ్యాలి? అయినా, ప్రస్తుతము బాగానే లోడ్ అవుతుంది. ఇన్ని టపాలు, ఇంత వేగంగా ఎలా రాస్తున్నారు? బహుశా మీ శ్రీమతి మీకు ప్రత్యేకంగా ఇచ్చే ' బ్లాగోమాల్ట్ ' లో అసలు రహస్యం ఉందనుకొంటా. ఆ Blagomalt formula ఏమిటో మాకు కూడా చెప్పండి. నాకు బ్లాగుశక్తి కావాలి.

ప్రవీణ్ గార్లపాటి said...

థాంక్యూ...
చెప్పినందుకు తప్పుగా అనుకోకుండా వెంటనే సరి చేసినందుకు. మాకిష్టమయిన మీ బ్లాగు అందరూ చదవాలనే ఉద్దేశం.
ఇక పోతే మీరు ఇది చూడండి (http://www.websiteoptimization.com/services/analyze/wso.php?url=http://vihaari.blogspot.com/2007/07/blog-post_19.html)

అలాగే మీ హోమ్ పేజీ కి కూడా చూడండి.
(http://www.websiteoptimization.com/services/analyze/wso.php?url=http://vihaari.blogspot.com/)

ముఖ్యంగా మీ హెడర్ 66 KB ఉంది. దానిని గనక మీరు 50% క్వాలిటీ లో పెడితే 32 KB అవుతుంది. మీకు పంపిస్తా దానిని. చూడండి. కానీ కొద్దిగా క్వాలిటీ దెబ్బతింటుంది.

ఇంకో సూచన. మీరు గనక వేరే సైట్ల నుంచి ఇమేజీ లు అనుసంధానిస్తే ఫాస్ట్ గా ఉండే సైట్ల నుంచి అనుసంధానించండి.

పేజీ కి టపాలు తగ్గించండి. హోంపేజీ తొందరగా లోడ్ అవుతుంది.

ప్రవీణ్ గార్లపాటి said...

మీ ఈమెయిలు దొరకలేదు.
ఇదిగో మీ హెడర్ (medium quality తో) http://hotimg6.fotki.com/a/64_103/145_172/blog_header_medium.jpg

Anonymous said...

@ ఇందులో పాలుపంచుకున్న అందరికీ,

ధన్యవాదాలు. మీ సలహాలు అమూల్యమైనవి. ధన్యోస్మి.

@ ప్రదీపు గారు,

మొదటి పేజీలో పోస్టుల సంఖ్య తగ్గించాను.

@ శ్రీనివాస్ గారు,

హెడర్ బారును మళ్ళీ పెట్టేశాను. మరీ అంద విహీనంగా వుంది అది లేకుండా. లోడు బాగానే వుంది.

@ పద్మ గారు,

మీ బ్రౌజర్ ను క్రాష్ చేసిందా? అయ్యో అప్పుడే చెప్పుంటే కొన్ని మార్పులు చేసేవాడినిగా.

మీ విశ్లేషణ బావుంది. ఏమిటి 325KB ఎక్కువా? ఇది బ్లాగుసైట్లకే నా లేక అన్ని వెబ్ సైట్లకేనా? సొంత గూటికెళ్ళినప్పుడు మళ్ళీ ప్రయోగాలు చేస్తా.

బ్యానర్ మళ్ళీ పెట్టేశా.

@ వీవెన్ గారు,

మీ ఈ-మెయిల్ అందింది. మీరు చెప్పింది కరక్టే. statcounter కూడా ఒక సమస్య అనుకుంటా. కొత్త విషయాలు తెలిశాయి మీవల్ల.

@ జ్యోతక్కా,

నేను కూడా డబల్ హమ్మయ.

@ రావు గారు,

బ్లాగో మాల్ట్ లేదు గానీ, ఓపికో వీటా వుంది దాన్ని రోజూ రెండు సార్లు తాగితే సరిపోతుంది.

@ ప్రవీణూ,

మీరు చెప్పబట్టే కదా ఇప్పుడు లోడు తగ్గించా. హెడరును మారుస్తా. కొంచెం సమయం కావాలి.

హమ్మయ్య websiteoptimization లాంటివి వున్నాయని తెలిసింది.

-- విహారి

శోధన said...

నాకూ అలా అనిపించే కొత్త చోట కొత్త టెంప్లేట్ తో ప్రయోగం చేస్తున్నాను. టపాల కోసం మన తెలుగు బ్లాగుల నుంచి కొన్ని టపాలను వాడాను. ఇది అన్ని వెబ్ విహారిణిలలో కనిపించేటట్లు ఈ ప్రయోగం పూర్తి అయ్యాక శోధన పునఃప్రారంభం అవుతుంది.

http://blogger-testing-1.blogspot.com/