Monday, July 23, 2007

అబ్బో వాషింగ్టన్

అమెరికా వచ్చి చాన్నాళ్ళయింది. చానా అంటే శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి గా వున్నప్పుడు అడుగుపెట్టా ఈ రంగుల దేశంలో. వచ్చినప్పుడయితే అనుకున్నా ఇదో పెద్ద కార్ల ఫ్యాక్టరీ వున్న దేశం అని. అప్పుడు దిగిన చోటు అలాంటిది. రోడ్డు మీద నడుస్తుంటే మనుషులందరూ కార్లో మాత్రమే కనిపించే వాళ్ళు ఏదో గ్రహాంతర వాసులు కనిపించినట్టు. ఆ కొత్తలో తెలిసిన ఫ్రెండొకడు కనిపిస్తే “భారత్ బ్రాండ్” అలవాటు ప్రకారం భుజం మీద చెయ్యి వేసి నడవబోతే విసిరి కొట్టాడు “ఉష్ ఇక్కడ అబ్బాయిలు అబ్బాయిల మీద చెయ్యి వేసి నడవకూడదు. అలా నడిస్తే బాగుండదు”.

“మరి మనకిప్పుడు ఉన్నట్టుండి అమ్మాయిలెలా దొరుకుతారు రా చెయ్యి వేసుకోడానికి ? నీకెవరైనా తెలుసేమిటి”

“నాకెవరూ తెలీదు నువ్వు మాత్రం నా భుజం మీద చెయ్యి వెయ్యద్దు అంతే” అన్నాడు.

అమెరికా అంటే ఇదే ఏ ఎండకాగొడుగు పట్టాలి లేకపోతే ఎండిపోవడమో మునిగిపోవడమో జరుగుతుంది.


** ***


కాలంతో పాటూ డ్రైవింగ్ లైసెన్సూ, కారూ వచ్చింది. సంవత్సర జీతం మొత్తం పోసి కారు కొనేసి అప్పట్లో సంచలనానికి కేంద్ర బిందువయి “వీడు బాగు పడడు”, “వీడికి కొవ్వెక్కువ”, “వీడూ వీడి కారూ” లాంటి సినిమా టైటిల్స్ వచ్చేశాయి. మనము జాలిం లోషన్ కు పెద్ద వాడకం దారు. “రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ” అని పిలిచి బొట్టు పెట్టి వీలయితే ఓ జాకెట్టు ముక్క లేక కట్ బనీన్ పళ్ళెం లో పెట్టి (పీట్జా కొనిపెట్టి) ఊరంతా, కొండలంతా, ఏర్ పోర్టంతా తిప్పే వాడిని.


ఇండియా వెళ్ళే సూట్ కేసులు నా కారు డిక్కీ ఎక్కకుండా విమానం ఎక్కేవి కాదు. అలా డిక్కీ చూడలేదంటే తిరుమల వేంకటేశ్వర స్వామిని చూసి లడ్డూ తిననంతగా ఫీల్ అయిపోయేవి సూట్ కేసులు. ఎక్కడ ఎవరు దారి తప్పినా 411(అమెరిక ఎంక్వయిరీ) కు కాల్ చేస్తే నా సెల్ నంబరు రింగయ్యేది.


** ***


కాలం మారింది. తానా సంబరాలొచ్చాయి. వాషింగ్టన్ వెళ్ళాల్సొచ్చింది. ఇంతకు ముందు వెళ్ళాను కానీ ఆ ఎపిసోడ్ ఇప్పుడు రాస్తే.. మా ఆవిడ చూస్తే.. ఇదే చివరి టపా అవుతుంది. మా వూరికి వాషింగ్టన్ కు చాలా తేడాలున్నాయి. మా ఊరు ఎండిపోయిన మైదానంలాగుంటే వాషింగ్టన్ పచ్చని చెట్ల తో అడవి లాగుంటుంది. వర్జీనియా ఈజ్ ఫార్ లవర్స్ అంటారు. మా ఊళ్ళో ఎటు వైపు చూసినా రెండు మైళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి రాష్ట్రంలో అవినీతి కనిపించినట్టు. వర్జీనియాలో ఎక్కడ చూసినా చెట్లు కనిపిస్తాయి అధికారులకు ధర్మం నాలుగు పాదాల కనిపించినట్టు.


అక్కడే వచ్చిన చిక్కంతా. ఆ చెట్లు చూసుకుంటూ కారు నడిపితే exit మిస్సయిపోయి న్యూయార్కులోనో న్యూజెర్సీలోనో తేలుతాము. అన్నీ వంకర టింకర రూట్లే. ఒక మైలుకు వంద ఎక్జిట్లు వుంటాయి. అందులో మళ్ళీ ఏ, బి, సి, డి. లు. వాటిని తీసుకుంటే మళ్ళీ ఒకటీ , రెండూ, మూడు ఎక్కాలొస్తాయి. ఒక సారి మిస్సయితే చాలు తిరిగి తిరిగి గ్యాస్ స్టేషంకు వెళ్ళాసొస్తుంది. అందుకని వెళ్ళిన రెండో రోజుకల్లా "ఆఫీసు డిపో" కెళ్ళి పెద్ద పేపర్ క్లిప్పులు రెండు జతలు కొన్నా. నడిపేటప్పుడు కంటి రెప్పలు మూసుకు పోకుండా పెట్టుకునేందుకు. ఒక జత నాకు రెండో జత మా ఆవిడకి. అవేమిరూట్లో కానీ "హైవే" లోకి వెళ్ళగానే ఇంకో ఎగ్జీట్ వచ్చేస్తుంది. ఎవడూ దారి ఇవ్వకుండా తొందరగా లేన్ మారకపోతే మళ్ళీ ఆ ఎక్జిట్ తీసుకోవాల్సి వస్తుంది. లూప్ లైను గానుగెద్దు లాగా తిరుగుతూనే వుండాలి అదృష్టం బాగోలేక పోతే.


తానా సంబరాల్లో చరసాల ప్రసాద్ తో పాటు అప్పుడెప్పుడో పుష్కరం కింద తప్పి పోయిన స్నేహితులు కూడా కనపడ్డారు. వాళ్ళందరిని రెండు మూడు సార్లు కౌగలించుకున్నా. ఇక వాళ్ళను కూడా కలవాల్సి వచ్చింది. ప్రసాద్ గారు కూడా తమ ఇంటికి భోజనానికి రమ్మన్నారు. సరే అంటే ప్రసాద్ గారు తమ ఇంటికి ఎలా రావాలో సూచనలు పంపించారు పక్కా తెలుగులో.


అవి ఇలా వున్నాయి. 95 తూర్పు తీసుకోండి, 395 పడమర తీసుకోండి, 195 ఉత్తరం తీసుకోండి ఆ తరువాత అక్కడ చిల్లర దుకాణం కనిపిస్తుంది అక్కడ ఎడమ వైపుకు తిరగండి, తరువాత మందుల దుకాణం కనిపిస్తుంది అక్కడ కుడి వైపుకు తిరగండి … ఇలా ఏవీ కనిపించక పోతేమీ జేబు చూసుకోండి మీ సెల్ ఫోను కనిపిస్తుంది అప్పుడు నాకు ఫోను చెయ్యండి అని చెప్పారు. మరి తెలుగు బ్లాగా మజాకా.


95, 195, 295...వగైరా రూట్లు చూసిన తరువాత అర్థమయిందేంటంటే అక్కడ రోడ్లకు నంబర్లేసేవారికి లెక్కలు సరీగా రావని. అంటే ఒక్కట్ల స్థానంలో కూడికలు చేత కావు కేవలం వందల స్థానంలో మాత్రం కలపడమొస్తుంది. రూటు నంబర్లన్నీ 95,195… అలా 895 వరకు వున్నాయి.


కంటి క్లిప్పులు బాగా పనిచేశాయి. ప్రసాద్ గారి ఇల్లు దారి తప్పోకుండా చేరుకున్నాము. బెల్లు కొట్టగానే వాళ్ళ పిల్లలు ప్రణతి, ప్రధంలు తలుపు తీశారు. కాసేపటికి వారి శ్రీమతి గారు వచ్చారు. ప్రణతి ఆడ పిల్లలతో తప్ప మగ పిల్లలతో ఎవరితోనూ ఆడుకోదట, మా వాడూ కూడా మగ పిల్లలతో తప్ప ఆడ పిల్లలతో ఆడూకోడు. అదేమి విచిత్రమో గానీ వాళ్ళిద్దరూ చక్కగా కలిసి ఆడుకున్నారు. కాసేపటికి ప్రసాద్ గారు వచ్చారు. ప్రసాద్ గారి దగ్గర డబ్బులు చాలా వున్నాయి. అందుకే 12 బొమ్మల వున్న పిల్లల డి.వి.డి. ని బాగా డబ్బులు పెట్టి కొన్నారు. వాళింట్లో మనీ ప్లాంట్ వుంది మరి. ఇంకా పై అంతస్తులో పి.వి. నరసిం హారావు, కింది అంతస్తులో అంపశయ్య నవీనూ వున్నారు. అంటే వారి పుస్తకాలు వున్నాయన్నమాట. అవే కాక ఇంకా చాలా వున్నాయి ఒక్కో రూములో వున్నప్పుడు ఒక్కోటి చదువుతారన్నమాట.


కాసేపటికి వాళ్ళింట్లో నే పెంచిన గోంగూర తో చేసిన పచ్చడి, ఇంకా బోలెడు వంటకాలు తినేసి ఆక్వేరియం చూద్దామని బాల్టిమోర్ కు బయలు దేరాం. అక్కడి నుండి బాల్టి మోరుకు సూచనలు ఇవ్వకుండా తనను వెంబడించమని చెప్పారు. మామూలుగా ఎప్పుడూ రారాజు లాగా ముందు పోతూ వుంటే వెనక నన్ను ఫాలో అయ్యేవాళ్ళు అలాంటిది ఆ రోజుకు నేను సామంత రాజును అయిపోయా.


ముందు వ్యానూ.. వెనక కారూ.... ముందు రారాజు ..వెనక సామంత రాజు. రారాజు ఒక మలుపు తిరిగితే సామంత రాజు కూడా అదే మలుపు. అప్పుడప్పుడూ మధ్యలో ధూర్జటిలు. అలా ఆ రోజు జీవితం చాలా మలుపులు తిరిగి తిరిగి కారు కు కళ్ళు తిరిగే సమయానికి బాల్టిమోర్ చేరుకున్నాము. బాల్టిమోర్ లో పార్క్ చేసి దగ్గరనున్న ఆక్వేరియం కు వెళ్ళాం.


ముందర చెస్ట్ బెల్టులో (మనూళ్ళల్లో దాసరోళ్ళు (షికారీలు) పిల్లల్ని జోలిలో పక్కకు వేసుకుంటారు కదా అలాంటి సెటప్పే ఇది. కాకపోతే ముందుకు వుంటుంది) వేళాడుతూ చిన బుడ్డోడు వెనక బ్యాక్ ప్యాక్ లో వాడి సరంజామా. ముందర కెమరా పట్టుకుని క్లిక్కులిచ్చుకుంటూ మా ఆవిడ. వీడియో కెమరా ప్రసాద్ చేతుల్లోకి వెళ్ళి పోయింది. అలా ఆక్వేరియం కొంత చూసి అందులోని డాల్ఫిన్ షోకు వెళ్ళాం. దాన్ని పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు.


అది అయిపోయి డాల్ఫిన్ షోహాల్లో నుండి అలా బయటకు వస్తున్నామో లేదో సైరన్లు మోగడం మొదలు పెట్టాయి. ముందు పిల్లలూ మా ఆవిడ వెళ్ళి పోయారు. రెండు బిల్డింగ్స్ మధ్యలో వున్న బ్రిడ్జి మీద నడుస్తున్న మాకు రెండు వైపుల వున్న తలుపులు మూసుకు పోయాయి. ఆటో మేటిక్ తలుపులు కాబట్టి అలా మూసుకున్నాయి. అందరి బుర్రలు కామన్ గా బిన్ లాడెన్ గాడి బొమ్మ వేసుకున్నాయి.


అయిపోయింది ఇన్నాళ్ళూ రహస్యంగా వున్నోడు ఇప్పుడు బయట పడ్డాడు అనుకున్నాం. "ధైర్యే సాహసి ఉబ్బసమే దగ్గు" అని గెట్టిగా తలుపులు తోస్తే తెరుచుకున్నాయి. అలా వచ్చామో లేదో “అందరూ బయటికి వెళ్ళండి ..బయటికి వెళ్ళండి” అని హడావుడి గా పంపించేశారు. తిరుపతి బస్టాండులో బఠాణీలు అమ్ముకునే సీను ఊహించుకుంటూ బయటకు పరుగులు పెట్టాము. ఫైరింజనూ, ప్యారామెడిక్సూ, పోలీసు అందరూ బిల బిల మంటూ వచ్చేశారు. అందరూ లోపలికెళ్ళే వాళ్ళూ వచ్చేవాళ్ళే విషయం చెప్పే వాళ్ళెవరూ లేరు. బయట ఓ గంట సేపు నిలబెట్టారు మమ్మల్ని. అక్కడే వున్న స్టార్బక్సుకు వెళ్ళి కాఫీ తాగి వచ్చాము. కాఫీ మహత్యమో ఏమో ఇక మీరు లోపలికెళ్ళ డానికి లేదు ఇంటికెళ్ళండెహె అన్నారు. మీ టికెట్ డబ్బుల గురించి రేపు మాట్లాడుకోండి అని పంపించేశారు.


ఇక చేసేదేమీ లేక ఉస్సూరుమంటూ అక్కడినుండి బయలు దేరాము. ప్రసాద్ గారి కుటుంబం నుండి సెలవు తీసుకుని ఎవరి వాహనాల్లో వారు బయలు దేరాము తిరిగి వెళ్ళి పోవడానికి. కొంత దూరం వరకు రారాజు-సామంత రాజులు ఆట ఆడి నా రూటు రాగానే నేను రారాజు అయిపోయి మేమున్న ఊరి వైపు బయలుదేరాము ఆఫీసు డిపోలో కొన్న క్లిప్పులను కంటి రెప్పలకు పెట్టుకుని.
:

8 comments:

జ్యోతి said...

భలే ఉంది మీ ప్రయాణంలో పదనిసలు. ఇదేనా ప్రసాద్ చెప్పిన అక్వేరియమ్ కథ...

ప్రసాద్ said...

హ్హ హ్హ హ్హ నవ్వలేక నవ్వలేక ఛస్తున్నా! రక్షించు బాబూ. ఇకముందు మరీ ఇంత కామెడీ పండించకు.
నేను ఈ అక్వేరియం కథను "విహారి అడుగు పెడితే అగ్గే!" అని టైటిల్ పెట్టి రాద్దామనుకున్నా! కానీ నేను రాస్తే జనాలకు విసుగు వస్తుంది విహారి రాస్తే నవ్వు వస్తుందని వూరుకున్నా.

--ప్రసాద్
http://blog.charasala.com

ప్రసాద్ said...

ఇప్పుడు మీ బ్లాగు చాలా బరువును కోల్పోయి లేడిపిల్లలా చెంగుచెంగున వచ్చేస్తోంది. వీక్షకుల అభిప్రాయాలను త్వరితంగా మన్నించినందులకు కృతజ్ఞతలు.

--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

తూర్పుకు తిరగండి, ఎడమకు తిరగండి, దుకాణం ....
ప్రసాదుగారు జిందాబాద్! పొట్ట చెక్స్.

Niranjan Babu Pulipati said...

విహారి.. మస్తు కామెడి గా రాశారు .. :) చాలా బాగుంది.. :)

ప్రవీణ్ గార్లపాటి said...

భలే గడిచిందే ప్రసాద్ గారితో...

ప్రసాద్ said...

రూటు 95కు ఆనుకొని లేదా అందులోంచి మొదలయ్యే పెద్ద రూట్ల నంబర్లలో 95 వుంటుంది. వందల స్థానంలో మరో అంకె చేరుతుంది. అదికూడా బెల్ట్ రోడ్డు (రింగ్ రోడ్డు) అయితే సరి అంకె వందల స్థానంలో కలుస్తుంది, కాకుంటే బేసి అంకె కలుస్తుంది.
95 మీద కీంద ఫ్లోరిడా నుండీ పైన మెయిన్ వరకూ వెళ్తుంటే వచ్చిన నంబర్లే మళ్ళి వస్తాయి. అయితే వచ్చిన రూట్ నంబరు అదే రాష్ట్రంలో మళ్ళీ రాదు.
ఇక్కడ వాషింగ్టన్‌లో 95 నిట్ట నిలువుగా పోతే దాన్ని కలుపుతూ సిటీ మధ్యలోకి పోయేది 395. సిటీ చుట్టు వుండే బెల్ట్ రోడ్డు 495.
ఇక 95 నుండీ BWI Airport కలిపేది 195.
95 నుండీ బాల్టిమోర్ సిటీ మద్యలోకి తీసుకెళ్ళేది 395. 95 నుండీ బాల్తిమోర్ చుట్టు వుండే బెల్ట్‌రోడ్డును కలిపేది 695.
95 నుండీ ఇంకో వైపు తూర్పు తీరం వైపు వెళ్ళేది 895.
రోడ్డు నంబర్లకీ ఓ పద్దతి.
--ప్రసాద్
http://blog.charasala.com

రవి వైజాసత్య said...

వామ్మో 95 అంటేనే దడ..పొరబాటున ఉదయంకానీ, సాయంత్రం కానీ 95 ఎక్కితే చచ్చినట్టే. మోకాళ్లు కిర్రుమనే దాకా బ్రేకులు నొక్కుతుంటారు.