Thursday, July 26, 2007

ఆపరేషన్ కుర్రో కుర్రు.

ఈ మధ్య ఈ సన్నాయి నొ(డొ)క్కుల మార్కెటింగ్ కాల్స్ ఎక్కువయిపోయాయి. ఎన్నో విధాలుగా ట్రై చేసినా అవి రావడం మాత్రం ఆగలేదు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొందామని చింత పిక్కల చిన్నారావ్ వాళ్ళూరికి స్వామి చిటికానంద వస్తే వెళ్ళి కలిశాడు. చిన్నా రావ్ గోడు విన్న ఆయన ఓ పెద్ద చిటికేసి "చిన్నా చితకా ప్రయోగాలు పనికిరావు దేన్నయినా సరే సీరియెస్ గా ప్రయత్నిస్తే సఫలం కాకపోవు.ప్రత్నించు. చిటికోస్తు " అని దీవించారు. సరే స్వామీ అదే మహా భాగ్యం అని ఇంకో పెద్ద చిటికేసి నమస్కారం పెట్టి ఇంటికొచ్చాడు.


ఇంట్లో చిటికెలేసుకుంటూ ఆలోచిస్తే ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. దానికి "ఆపరేషన్ కుర్రో కుర్రు" అని పేరు పెట్టి ఒక కమిటీ వేసాడు. అందులో ప్రెసిడెంట్ ఒకరు, వైస్ ప్రెసిడెంట్ ఒకరు, కమిటీ మెంబరు ఒకరు అని ముగ్గుర్ని నియమించాడు. ఏక గ్రీవ ప్రతిపాదనలే చిన్నారావుకు ఇష్టం. మూడు పొస్టులూ చిన్నారావే తీసుకున్నాడు ఏ ప్రతిపాదన అయినా ఏక గ్రీవంగా జరగాలని. ఎవరెవరూ అని గుర్తు పట్టడం చాలా వీజీ. ప్రెసిడెంట్ అన్ని దుస్తులూ ధరించి వుంటాడు. వైస్ ప్రెసిడెంటుకు చొక్కా వుండదు బనీను వుంటుంది. కమిటీ మెంబరుకు అది కూడా వుండదు.


**

ఓ మాంచి రోజు చూసుకుని కమిటీ సమావేశ మయింది. ప్రెసిడెంట్ లేచి చెప్పాడు "ఈ మార్కెటింగ్ కాల్స్ నుండి బయట పడాలంటే ఒకటే మార్గం అది ఏంటంటే ఎవరు మాట్లాడినా తెలుగులో నే సమాధానం చెప్పడం".

వైస్ ప్రెసిడెంట్ లేచి (చొక్కా తీసేసి) "అధ్యక్షా! నేను అనుకున్నదే మీరు కూడా అనుకున్నారు. ఇలాంటి హింసించే కాల్స్ అరికట్టాలంటే వాళ్ళు ఏ బాషలో మాట్లాడినా మనము తెలుగులోనే మాట్లాడాలి".

కమిటీ మెంబెర్ లేచి( బనీను తీసేసి) "అధ్యక్షా!, ఉపాధ్యక్షా!. నా నాలుక మీదున్నదే మీ నాలుకల మీదున్నది. మీరు చెప్పిన వాటినన్నింటికి ఒప్పేసుకుంటున్నా" అని చెప్పి కూచున్నాడు.

ప్రెసిడెంట్ (చొక్కా, బనీను తొడిగేసుకుని) "కొనుక్కో..కొనుక్కో అని భిక్ష గాళ్ళ మాదిరి అడుక్కొని మన సమయాన్ని వృధా చేస్తున్న ఇలాంటి ఫోను కాల్స్ అరికట్టడానికి వారితో తెలుగులో నే మాట్లాడాలని తీర్మానించడమైంది" అని చెప్పి సమావేశాన్ని ముగించేశాడు.

**

ఫోను ట్రింగ్..ట్రింగ్…

చిన్నారావ్: " హలో.."

అవతల: " హాయ్ గ్రుద్ మార్నింగ్… కనై స్ప్రీక్ త్రూ చిహింత పీకుల్ చిహిన్నా .." ( మిడిల్ ఈస్ట్ నుండి కాల్)

చిన్నారావ్: " పీకింగ్"

అవతల: " హాయ్ హబ్ ఆర్ యూ.."

చిన్నారావ్: "చండాలంగా.."

అవతల: " వాత క్రెదిత్ కార్ద్స్ ధూ యు యూ…"

చిన్నారావ్: " ఒరేయ్ బుడ్డోడా! ఇలా రారా ఇదిగో మీ అంకుల్ ఎవరో మిడిల్ ఈస్టు నుండి పీకింగ్".

బుడ్డోడు: " ఒహ్ రియల్లీ…ఓ మ్యాన్ (ఫోను తీసుకుని) హలో.."

అవతల: " హలో సార్ ఆర్యూ విద్మీ.."

బుడ్డోడు: " హలో అంకుల్…ఎ..వ.లు..మీ..లు"

అవతల: " హలో సార్. థ్యాంక్యూ సార్. దూ యూ నీద్ ఎనీ క్రెదిథ్ కార్ద్స్"

బుడ్డోడు: " హె..క్రేయాన్స్?...ఎపులు తెస్కొని వస్తావంకుల్"

అవతల: " వ్రుద్ యు లైక్ వన్"

బుడ్డోడు: " యెస్.. థ్యాంక్యూ అంకుల్."

బుడ్డోడూ ఫోను చిన్నారావుకిచ్చి వెళ్ళిపోయాడు.

చిన్నారావ్:" హలో.."

అవతల: "థ్యంక్యూ మిస్తర్ చిహింత పీకల. యు బిల్ రిసీవ్ పాకెత్ ఇన్ తెన్ తూ పిప్టీన్ దేస్. హ్యాబ్ ఎ వందర్పుల్ దే"

చిన్నారావ్: "ఒరేయ్..ఒరేయ్.." అవతల ఫోను కట్.


**


ఫోను ట్రింగ్..ట్రింగ్…

చిన్నారావ్: " హలో.."

అవతల: " హాయ్ గుదా ఈవానిన్..ఆర్ యూ మిస్టర్ చిహింతా పీకుల చీహి.. " ( ఈ సారి చైనా నుండి ఓ అమ్మాయి)

చిన్నారావ్ : " యా పీకింగ్.."

అవతల: " దిద్ ఐ స్పీక్ యువా నేం కరెల్లీ …."(కిల కిల మని నవ్వింది)

చిన్నారావ్: " యా.." (ఆ నవ్వుకు పడిపోయాడు)

అవతల: " థ్యాంకా.. సా.. ధూ యూ హ్య వాటా ఫిల్టా అట్ యువా హో"(Do you have water filter at your home)

చిన్నారావ్: " నో.. ర్మూసుకో"

అవతల: " నో సా. సో యూ నీ వా (So you need one). ఆ ద వాట పొల్ల్యూట సా.(all the water polluted sir). ఫా హెల్ధీ బా యూ షు ఊజ్ వీటా ఫిల్టా(for the healthy body you should use Vita filter). డూ యూ ఆడా వన్ సా(Do you order one sir)"

చిన్నారావ్: (చిర్రెత్తుకొచ్చి) " ఎహే …వేస్ట్..పోరీ.."

అవతల: " థ్యంకూ ఫా సేయిన్.. యెస్ సా. యా ప యూ రిక్యెస్ట్ వుయ్ సెంద్ ఇత్ అల్లీ అండ్ ఫాస్త్" (as per your request we will send it fast and early)

చిన్నారావ్: " అమ్మా తల్లీ.. ఆగవే.."

అవతల:" థంక్యా ఒనాగైన్ "(thank you once again)

చిన్నా రావ్ తల పట్టుకున్నాడు.


**

ఆపరేషన్ "కుర్రో కుర్రు" కమిటీ మళ్ళీ సమావేశమైంది.

"తెలుగులో మాట్లాడ్డం కొంచెం ఫలితాలని ఇస్తోంది. కానీ కావాల్సిన ఫలితమివ్వలేదు. ఈ సారి మరింత మెరుగైన మార్గాలని వెతకాలి" ప్రెసిడెంట్ చెప్పాడు.

వైస్ ప్రెసిడెంట్ లేచి (చొక్కా తీసేసి) "అధ్యక్షా! ???123000, 123000???"

కమిటీ మెంబరు లేచి(బనీను తీసేసి) "అధ్యక్షా!, ఉపాధ్యక్షా!, ???123000, 123000???"

ప్రెసిడెంట్ లేచి (చొక్కా బనీను వేసుకుని) "సభ్యులారా! నేను కూడ ???123000, 123000???. కాబట్టి వెంటనే అమలులో పెడదాం" అని చెప్పి సమావేశాన్ని ముగించేశాడు.


**

ఫోను ట్రింగ్..ట్రింగ్…

చిన్నారావ్ ఫోను చెవిలో పెట్టుకుంటే అవతల ఎవరో ఒక అమ్మాయి గొంతు. "ఇవాళ నీ పని అయిపోయిందే" అని మనసులో అనుకొని హలో కూడా చెప్పలేదు. ఫోనును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు తను గట్టిగా చెవులు మూసుకుని. అయిదు నిముషాల తరువాత ఫోను హ్యండ్సెట్ పగిలి పోయి వుండడం చూశాడు. పోతే పొయిందిలే అని ఇంకోటి కొనుక్కున్నాడు.

నెలయింది.. రెణ్ణెల్లయింది…మూడు నెలలయ్యాయి.

హాశ్చర్యం!!!

ఒక మార్కెటింగ్ కాల్ కూడా రావడం లేదు. చిన్నారావ్ కు క్యూరియాసిటీ పెరిగిపోయింది. తనకెందుకు మార్కెటింగ్ కాల్స్ రావడం లేదో ఆరా తీద్ధామని గూగుల్లో వెతికాడు. "చిన్నా రావ్ చిటకా – మార్కెటింగ్ కాల్స్ గుటకా" అనే హెడ్లైంతో ప్రతి పేపర్లో, ఫొరంస్ లో, బ్లాగుల్లో కనపడుతోంది.తన ప్రయోగం విజయవంత మై దేశం మొత్తం దాన్నే అనుసరిస్తున్నారట. అది చూసి తెగ సంబర పడి పోయాడు చింత పిక్కల చిన్నారావ్.


మళ్ళీ "ఆపరేషన్ కుర్రో కుర్రు" కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అది దిగ్విజయంగా పూర్తి అయిపొయిందని షాంపైన్ బాటిల్ ఓపన్ చేసి మూడు గ్లాసుల్లో పోసు చొక్కా వేసుకుని ఒక గ్లాసు, చొక్కా తీసేసి ఒక గ్లాసు, బనీను కూడా తీసేసి ఒక గ్లాసు తాగేసి తూలుకుంటూ హాయిగా గుర్రుపెట్టాడు.


**

అసలారోజు ఏమి జరిగిందంటే…..

ఊహించగలరా?

చిన్నారావ్ ఫోను తీసుకెళ్ళి జెమిని టి.వి.లో మాట్లాడుతున్న రాజకీయ నాయకుడి ప్రసంగం ముందు పెట్టాడు.

ఫోను అవతల: " హలో గుద్ మార్నింగ్. చిహింత పిక్కల్"

ఇవతల: " ఏమే…ఏమేమే.."

అవతల: " సర్.."

ఇవతల: " ఏమనుకుంటున్నావ్ నువ్వు. ఏమిటే నువ్వు మాట్లాడేది…"

అవతల: " ఎక్స్ క్యూజ్ మీ.."

ఇవతల: " ఏమనుకుంటున్నావ్ నువ్వు. నిన్నివాళ కడిగేస్తా..అసలు నిన్ను ఇవాళ కడిగేస్తా"

అవతల: " సార్ ..ఐ క్యాంట్…."

ఇవతల: " ఏందే నువ్వు మాట్లాడేది.. అసలు నేను మాట్లాడ్డం అయిపోయిన తరువాత ఓ ఇంద్ర వాణి! అసలెందుకు ఈ కంపెనీ లో చేరానా అని అనుకొంటావ్"

అవతల: " హలో ..మ్యానేజెర్.."

ఇవతల: " ఐ యాం నాట్ ఈల్డింగ్..ఐ యాం నాట్ ఈల్డింగ్. ఏమే ఫోను చేస్తావా నువ్వు?.ఫోను చేస్తావా నువ్వు?. నేను మాట్లాడ్డం అయిపోయిన తరువాత ఇంద్ర వాణీ. ఈ భూమ్మీద ఎందుకు పుట్టానా. ఈ కంపెనీలో ఇలాంటి జాబులో ఎందుకు చేరానా అనుకుంటావ్.. ఏమిటే…నువ్వు…"

అవతల: " మ్యానేజెర్ సార్… ఐ యం రిజైనింగ్ టూ మై జబ్…"

ఇవతల: " నేను మాట్లాడ్డం పూర్తయ్యాక….."

హ్యాండ్సెట్ పెద్ద విస్పోటనంతో పేలి పోయింది.


**

10 comments:

జ్యోతి said...

హ హ హ హ సూపర్‍గుంది……………...నేనూ ఓ కొత్త ప్రయోగం చేస్తా ఇలాంటి కాల్చేసేవాళ్ళని కడిగేయడానికి....

sravan said...

అదిరింది సార్. నాకు స్టోరీ కంటే సస్పెన్స్, సర్పైస్ ఎలిమెంట్ బాగా నచ్చాయి.

-- శ్రవణ్

budugu said...

హహ్హహ్హహ్హా....చాలా బాగుంది....

నేనుసైతం said...

విహారా! మజాకా! అదిరింది సోదరా!
-నేనుసైతం
http://nenusaitham.wordpress.com

Viswanath said...

హవ్ దిద్ యు గెత్తింగ్ దీస్ సూపరు సూపరు ఐదియాలూ సర్.వాత్ సీక్రెత్

Lalithaa Sravanthi Pochiraju said...

అదిరిందండీ....క్షమించాలి..కడిగారండీ

cine abhimani said...

అచ్చ తెలుగులో కేక పుట్టించారండి

Raghava said...

ఒక్ఖముక్కలో చెప్పాలంటే శభాష్.

Ssreddy said...

బాగుంది....

Anonymous said...

@ అందరికి,

శత కోటి ధన్య వాదాలు.

-- విహారి