Tuesday, July 17, 2007

ఒక విజ్ఞప్తి

బ్లాగరయ్యా మరియూ బ్లాగరమ్మా,


మీ అందరికి ఒక విజ్ఞప్తి. వేదిక మీద పాడే గాయకుడికి ఉత్సాహం రావాలంటే చప్పట్లు అవసరం, మంచి సినిమాలు రావాలంటే వాటికి ఆదరణ అవసరం. అంటే డబ్బులు పెట్టి సినిమా టికెట్లు కొనాలి. అలాగే బ్లాగులు కూడా ఉత్సాహంతో రాయాలంటే బాగున్నాయంటే చెప్పడం అవసరం. బాగాలేవంటే అలాంటివి ఇక రాయరు. బ్లాగు హిట్ల కోసం కొందరు రాయొచ్చు. అలాంటి వాటి జోలికి నేను వెళ్ళడం లేదు. నామటుకు నేను వీలయినంత సరదాగా వుండాలని, రాయాలని ప్రయత్నిస్తా. కొందరికి కవితలు నచ్చచ్చు, కొందరికి కథలు నచ్చొచ్చు, కొందరికి ఫోటోలు నచ్చచ్చు, కొందరికి రాజకీయాలు నచ్చచ్చు, ఇంకొందరికి విషయ పుష్టి కలవి నచ్చచ్చు. వారి వారి సమయాన్ని బాట్టి అందులో వేలు పెట్టచ్చా లేదా అని నిర్ణయించుకొంటారు. నాకున్న సమయంలో నేనయితే బ్లాగుల్ని చదవటానికి సూపర్ ఫాస్టు రైలెక్కి రయ్యిమని చదివేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అందరిది ఇదే పరిస్థితి అనుకుంటా. అటువంటి పరిస్థితులలో టపా బాగుందో లేదో చెప్పటానికి కామెంట్లు రాయలేక పోయే వారికోసం కొన్ని సదుపాయాలొచ్చాయి. అవేంటంటే టపాని రేటింగ్ చెయ్యడం. ఈ రేటింగ్ పద్దతి చాలా బ్లాగుల్లో వుంది కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నేను నా బ్లాగులో పెట్టి నెలన్నర పైనే అయింది. ఏ ఒకటో రెండో టపాలు తప్పా వేరే వాటికి ఎవరూ రేటింగ్ చెయ్యడం లేదు. బ్లాగు “కొట్టుడులు” లేవా అంటే టపా రాసిన ప్రతి సారి 150 పైగా “కొట్టుడులు” వస్తాయి కూడలి, తేనెగూడు పుణ్యమా అని. అందుకనే పని కట్టుకుని ఒక టపా రాయవలసి వస్తోంది. మీరు టపా చదివిన తరువాత ఏదో ఒక రేటింగ్ ఇవ్వండి. అది ఒకటి కావచ్చు అయిదు కావచ్చు. ఇంకాస్త సమయముంటే కామెంట్లు రాయొచ్చు.

మీరు ఫీడ్ బ్యాక్ ఇవ్వకపోతే నేను రాయడం మానేస్తా అనే స్టేట్మెంట్లు ఇచ్చే రోజులు కాకపోయే. అలాంటి దొకటి ఇస్తే కామెంట్లు వెంటనే వచ్చి పడతాయి “ పోరా బోడిగా నువ్వు రాస్తే ఎంత రాయక పోతే ఎంత “ అనో లేక “ నీ బ్లాగులు చదవలేక చస్తున్నా బతికించావ్ రా “ అనో.

ఆ విధంగా నేను చేసిన విజ్ఞప్తి మన్నించి నా బ్లాగులోనూ ఇంకా కొన్ని బ్లాగుల్లోనూ వున్న రేటింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోండి మరియూ ఉపయోగంలో పెట్టండి. మీరు ఉపయోగించాలంటే ఇక్కడికెళ్ళండి .

10 comments:

ప్రవీణ్ గార్లపాటి said...

ఓకే... నే కొన్ని రోజులు టపాలు మానేసి కామెంట్లు మాత్రమే రాయనేంటి ?
అన్నట్టు మీ బ్లాగు హెడర్ మరీ పెద్దదయిపోయిందండీ. లాప్టాప్ లో చూస్తే సగం పేజీ వరకూ హెడరే వస్తుంది. అదీ కాక ఈ పక్క ఆ పక్క డిస్ట్రాక్షన్స్ మళ్ళీ :)

రానారె said...

కామెంటు.

Viswanath said...

ఎవరి పోస్ట్ వద్దయినా క్లిక్ చేసిన వెంటనే వారి బ్లాగ్ చక్ మని ఓపెన్ అయిపోతుంది. ఒక్క మీ బ్లాగ్ మాత్రమే తన్నుకొంటూ గిలగిల కొట్టుకొంటూ మెల్లగా వస్తుంటుంది. కొంచెం బరువు తగ్గిస్తే గురూగారూ ...

మాకినేని ప్రదీపు said...

అలాగే కామెంటుతా. కానీ పోస్టుకు పెట్టిన పేరు నాకు నచ్చి దానిని చదవటానికి వెళ్ళేసరికి, అప్పటికే ఆ పోస్టుకు బోలెడన్ని కామెంట్లు ఉంటున్నాని, మన కామెంటుని, కామెంట్లేలేని మంచి పోస్టుల కోసం దాసుకుంటున్నాను.

ప్రసాద్ said...

ఇంత చెప్పినా ఎవరూ రేటింగ్ ఇవ్వలేదు. నేనిచ్చా!

అవును. మీ బ్లాగు లోడ్ అవడమూ బరువే! స్క్రోల్ అవడమూ బరువే!

--ప్రసాద్
http://blog.charasala.com

Srinivas Ch said...

మిగతా బ్లాగ్లతో పొల్చుకుంటే నిజంగా మీ బ్లాగ్ చాలా నెమ్మదిగా లోడ్ అవుతుంది. పైగా మీ బ్లాగ్ హెడర్ చాలా పెద్దగా ఉంది. పక్కన ఉన్న బాక్సులే ఎక్కువ స్థలము ఆక్రమిస్తున్నాయి. పైగా మీ బ్లాగ్ 1024*800 రిసల్యూషన్ లో చూస్తుంటే నాకు బ్రవుసర్లో హారిజాంటల్ స్క్రోల్బార్ వస్తుంది.

cbrao said...

మీ Blog load కావటానికి ఇంత సమయమా? కొన్నిసార్లు ఎదురు చూపులులలో శక్తి నశించి కామెంట్ రాయటానికి patience ఉండటం లేదు.టపా చదవకనే వెనుతిరిగిన సందర్భాలు ఉన్నై. ఇవ్వాళ నా అదృష్టం బాగుండి త్వరగా, సరిగా load అయ్యింది. Comments రాయటానికి shortcuts కావాలి. Telegraphic Greetings లో 1,2,3,4,5,6.. అలా ఒకో సంఖ్యకు ఒకో సందేశం ఉన్నట్లుగా కావాలి. కొన్ని ఉదాహరణలు ఇస్తాను.
Comments లో 1 ఉంటే అర్థం ' వ్యాసం బాగా రాసారు '
2)ఉంటే ' చాల బాగుంది. మంచి రచనకు అభినందనలు '
3)50 టపాలు పూర్తి అయిన సందర్భంలో, మీకు నా శుభాకాంషలు
4)మీ వివాహజీవితం శుభప్రదముగా సాగాలి.
5)మీ భారత పర్యటనలో మమ్ములను కలువగలరు.

టపాలు ఎక్కువైన ఈ సమయములో, ఇలాంటి pre-written వ్యాఖ్యలు అవసరము. ఇలాంటి వ్యాఖ్యలు అన్నింటినీ e-telugu.org లో వ్యాఖ్యలకు దగ్గరిదారులు అనే శీర్షిక create చేసి అందరూ పంపగలరు.అన్నింటినీ పరిశీలించి, ఒక standard list తయారు చేస్తాము ఇక్కడ.

netizen said...

రావుగారి కామెంట్ బావున్నట్టుందే!

radhika said...

విహారి గారూ మీ బ్లాగు నాకు ఇంటర్నెట్ ఎక్ష్ప్లోరర్ లో లోడ్ అవ్వట్లేదు.నాకు ఫైర్ఫాక్స్ లో తెలుగు సరిగా కనపడదు.సొ మీ పోస్ట్లన్ని మిస్ అయిపోతున్నాను.బాధగా వుంది.ఈ కామెంట్ కూడా మంటనక్క లో రాస్తున్నాను. నిన్నే కొత్తగా ఒకటి కనిపెట్టాను.మంటనక్కలో మీ బ్లాగు ఓపెన్ చేసి అది కాపీ చేసి లేఖిని లో వుంచి చూస్తె బానె కనపడుతుంది.కాని అంత చెయ్యడం కష్టం గా వుంది.ఏదో ఒకటి చేసి మీ బ్లాగు సులువుగా చదవగలిగే భాగ్యం కలిగించండి.

Anonymous said...

@ ప్రవీణూ,

నే చెప్పేది రేటింగ్ గురించి :-)

@ రానారె,

నవ్వులు.

@ విశ్వనాథ్ గారు,

మార్పులు చెయ్యబడ్డాయి. థాంకులు.

@ ప్రదీపు గారు,

నా టపాల్లో నాకు నచ్చిన కొన్నింటికి కామెంట్లేలేవు. మీ బ్యాంకులోనివి కొన్ని తీసి అందులో పెట్టండి.

@ ప్రసాద్,

రేటింగ్ ను ఇప్పుడు పీకి పాతరేశా :-)

@ శ్రీనివాసూ,

మార్పులు చెయ్యబడ్డాయి. థాంకులు.

@ రావ్ గారు,

ఇంతకు ముందో టపా "కామెంటు అవుడియాలు" అని రాసాను. మిస్సయుంటే మళ్ళీ ఓ సారి చదవండి.

@ నెట్టిజెన్ వారూ,


అవును కదా.

@ రాధిక గారు,

అదన్న మాట సంగతి. రాసిన ప్రతి టపాకు ముందు కామెంటు వచ్చేది మీ నుండే అలాంటిది మీ నుండి రాకపోయేసరికి నా టపాల్లో సరుకు తగ్గిందని అనుకుంటున్నా. అది కాదన్న మాట సంగతి.

నాకు IE లో బాగానే కనిపిస్తోందే. బహుశా లోడవక పోవడాన అల్ల అయుండచ్చు. మళ్ళీ ఓ సారి ప్రయత్నించి చెప్పండి.

-- విహారి