ఈ వారం సిద్ధ – బుద్ద (27-Aug-07)
.
“సిద్ధా… సిద్ధా…”
“…...”
“ఓరేయ్ సిద్ధా ఎక్కడున్నావ్రా”
“….”
“వార్నీ ఇక్కడున్నావా. ఆ టివి దగ్గరేం చేస్తున్నావ్. ఏంత పిలిచినా ఉలక్కుండా పలక్కుండా కూచున్నావ్”
“…”
“మాట్లాడ వేరా.”
“నాకు చానా బాధగా వుందయ్యా”
“ఆ.. ఇప్పుడర్థమయింది. ఆ హైదరబాద్ బాంబు పేలుళ్ళ గురించి నువ్వింకా బాధ పడుతున్నావా. సరేలే నేనే వెళ్ళి కాఫీ పట్టుకొస్తా నీక్కూడా. వెళ్ళి ఆ వరండాలో కుర్చీ వెయ్యి”
“అయ్యా ఇగో ఆ చెట్టు దగ్గర వేసా కుర్చీ”
“సరేలే. ఇదిగో ఈ కాఫీ తీసుకో. ఎంత సేపు అలా టి.వి. చూసి మనసును బాధ పెట్టుకుంటావ్.అందుకే ఇలా బయట కూర్చుందామని చెప్పా. నాకు కూడా బాధ గా వుంది. ఆ రాక్షసులను కనిపిస్తే చంపెయ్యాలన్నంత కసి వుంది.”
“అవునయ్యా.. ఆ దొంగ నాకొడుకులు కనిపిస్తే ఒళ్ళంతా కోసేసి ఉప్పూ కారం పట్టిస్తా.”
“సరేలే సిద్ధా. కొంచెం ప్రశాంతంగా వుండు. నీకొకటి చెప్పనా”
“చెప్పండయ్య”
“ఆ మొహమ్మీద గాటేమిటి?”
“అదే నయ్య పొద్దున షేవింగ్ చేసుకుంటా వుంటా తెగింది. ఆ గంబోరే బ్లేడు మంచిది కాదు.”
“ఒరేయ్ బ్లేడు కొనుక్కునే ముందు అది మంచిదో కాదే తెలుసుకోవాలి లేకపోతే అది వెంట్రుకల బదులు శరీరాన్ని కోస్తుంది. అలాగే ఈ ప్రభుత్వాలు కూడా. వీళ్ళను ఎన్నుకునే ముందు ఆలోచించాలి. వీళ్ళ నిర్వాకాల వల్లే భిన్నత్వంలో ఏకత్వం గా జీవించే మన ప్రజల మధ్య చిచ్చు రేగింది. దాన్ని ఆసరాగా తీసుకొని విదేశీ శక్తులు లోనికి ప్రవేశించాయి.”
“అయినా అంతలా పేలే బాంబులు ఎలా తయారు చేస్తున్నారు ఈ నా కొడుకులు”
“అలాంటి వాళ్ళకు సహాయం చెయ్యడానికి కొన్ని లంచగొండి గాళ్ళు వున్నారు కదా మన దేశంలో.”
“అంటే..”
“ఏం లేదు. ఓ లక్ష పడేస్తే ఓ XYZ Explosives అని రిజిస్టరు చేసుకోవచ్చు. ఇంకో రాష్ట్రం నుండి ఈ కంపెనీ పేరు మీద పేలుడు పదార్థాలు, ఆయుధాలు కావాల్సినన్ని కొనుక్కోవచ్చు. ఇంకొంచెం కష్టపడితే విదేశాల నుండి కూడ తెప్పించుకోవచ్చు. వీలయితే వరద బాధితులకు పోట్లాలు విసిరి నట్టు విమానంలో నుండి కిందకు వేయించుకోవచ్చు.”
“ఓ మీరు చెప్పేది 1995 లో కురులియా మీద పడేసినా ఆయుధాల గురించా..”
“అవును అప్పుడు అవి ఏదో హిందూ ఉగ్రవాద సంస్థలకు చేర వెయ్యడానికి అన్నారు…”
“కొన్నాళ కిందటి బాంబే పేలుళ్ళు, మొన్నటికి మొన్న జరిగిన మక్కా మసీదు పేలుళ్ళు. మన వాళ్ళు పెద్ద నేర్చుకుందేమీ లేదు.”
“అయ్య గారొ ఇలానే కొన్నాళు జరిగితే ఏమవుతుంది."
"ఆ ఏమవుతుంది. ఇజ్రాయిల్ వాళ్ళు రోజూ బాంబు పేలుళ్ళకు, కాల్పులకు అలవాటు పడినట్టు అలవాటు పడి పోతారు. ఇజ్రాయిల్ లో బాంబు పేలుడు జరిగిన గంట కంతా ఆ రోడ్డు లో మనుషులు మామూలుగా నడిచి వెళ్ళి పోతుంటారట”
“మనకా దౌర్భాగ్యం పట్ట కుండా వుంటే చాలు. అయినా మన వాళ్ళకు జ్ఞాపక శక్తి తక్కువ లెండి. ఇవన్నీ తొందరగా మరిచి పోతారు”
“అది సరే నీ జ్ఞాపక శక్తి ఎంతుందేంటి”
“నా దానికేం బ్రహ్మాండం అయ్యగారూ”
“అవునా మరి ఆ మిరప చెట్లకు నీళ్ళు పొయ్యలేదేమిట్రా.”
“మర్చి పోయానయ్యగారూ… ఇయ్యి మంచి నషాలానికంటే మిరపకాయలు. మసాల కూరకి బాగా పనికొస్తాయి."
“సరే నువ్వలా నీళ్ళు పోసిరా నేను బ్లాగులు చుట్టోస్తా”
“అయ్య గారూ ఈ మద్దెన నాకు బ్లాగులు నచ్చడం లేదు”
“అదేమిట్రా అందరూ ఒకరిని మించి ఒకరు రాస్తుంటేనూ”
“లేదయ్య బాగా కిక్కెక్కించే మసాలా బ్లాగులు రావడం లేదు”
“నీ దుంపతెగ ఇవి తెలుగు బ్లాగులు రా అందులో మసాలాలు కావలంటే ఈ టివి9 పెట్టుకో లేదంటే గ్రేట్ ఆంధ్ర వెబ్ సైటుకు వెళ్ళు ఈ వైపుకు రావద్దు”
“అబ్బా నేను చెప్పేది అదికాదండీ. వివాదాస్పద టపాలు రావటం లేదు అదే నా బాధ”
“నిన్ను గానీ కలహ భోజన ప్రియుడు నారదుడు పూనాడా? ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ ఎంతో ఎత్తుకు ఎదిగారు. అలాంటివి అప్పుడప్పుడూ వస్తున్నాయి కానీ పెద్దగా ఎవరూ ఖాతరు చెయ్యటం లేదు”
“అదే కదా నా బాధ అలా ఎవరన్నా రాసినా వాటికి రిపీటెడ్ మౌసు క్లిక్కులే కానీ కీ బోర్డు క్లిక్కులు పడ్డం లేదు.”
“ఇప్పుడిప్పుడే ఆవేశాలకు లోను కాకుండా ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవిస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ ఓనమాలు లో వచ్చిన ఈ టపానే . ఇందులో లలిత గారు, స్టాలిన్ గారు ఇచ్చుకొన్న సమాధానాలు వారి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి.”
“అయితే ఇట్టాంటి కోరికలేం పెట్టుకోవద్దంటారు”
“అనే కదా అంట. ఒరేయ్ వెళ్ళి ఇంకో ఫిల్టర్ కాఫీ పట్రా. నాకు కాఫీ పెద్ద అడిక్టు అయిపోయింది.”
“అయ్య గారూ, కొంత మంది మరీ బ్లాగులకు అడిక్టు అయిపోతున్నారేమో అని అనిపిస్తోంది”
“అవున్రా నిద్దర్లో కూడా మెలుకువొస్తే కాసేపు ఎలుక ముక్కుని పొడుస్తున్నట్టున్నారు కొందరు”
“అలా చేస్తే వాళ్ళ ఆరోగ్యాలు పాడవవూ”
“నువ్వో పని చెయ్యి అలాంటి బ్లాగర్ల అమ్మా నాన్నల ఫోను నంబర్లు కనుక్కొని విషయం చెప్పేసెయ్. ముందు కాఫీ చేసి తీసుకుని రా”
“ఇగోండి కాఫీ. నా బతుకు జైలు బతుకు అయిపోయింది. మా ఊర్లో సినిమా స్టార్ లాగ వుండే వాడిని. ఇప్పుడు జైల్లో వున్న సంజయ్ దత్ లాగా అయిపోయాను”
“ఆ సంజయ్ దత్ ఇప్పుడు జైళ్ళో ఎందుకున్నాడు”
“ఏంటి లేడా”
“నేను నీకు అప్పుడే చెప్పా గదా చూస్తూ వుండు కొన్నాళ్ళకే బయటకు వస్తాడు అని. నీకో సంతోష పడే వార్త చెప్పనా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ జైల్లో వున్నాడ్లే”
“ఇప్పుడు కొంచెం తృప్తి గా వుంది. ఇంక బ్లాగు విశేషాలు కొన్ని చెప్పండి”
“ఆ ఏముంది ఎప్పుడు అందరి బ్లాగుల్లో కామెంట్ల కళ నింపే రాధిక గారు ఓ నెల తరువాత ఒక టపా రాశారు.”
“కొద్ది కాలం లోనే వంద టపాలు రాసేసిన వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు”
“వంద టపాలు పెడేల్ పెడేల్ మని రాసిన ప్రసాదం గారు ఈ మధ్యే ఓ రెండు టపాలు రాసి ప్రసాదం చేతిలో పెట్టారు.”
“అలాగే తిరుపతి లడ్డూ ప్రసాదం తినటానికెళ్ళిన లోకేష్-బ్రహ్మిణీలు టిటిడి వాళ్ళకు యభై లక్షరిచ్చారంట. టి.వి.లో చూశా.”
“అదేమన్నా జేబులోనుండి పెట్టిందా? ఎన్టీఆర్ ట్రస్టు నుండి వచ్చింది.”
“అయ్య గారూ టి.టి.డి చేర్మెన్ కావాలంటే ఏమి చదువుండాలి”
“ముఖ్యమంత్రి బందువై వుండాలి..”
.