Friday, August 03, 2007

ధ.దే.ఈ.శు.— జోకు

:


మొన్న తానా సమావేశాలు జరిగినప్పుడు మేడసాని మోహన్ వారి అష్టావధానానికి హాజరు అయ్యాను. అందులో పృచ్చకుల్లో ఒకరైన కూచిబొట్ల ఆనంద్ గారు సంధించిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ మేడసాని గారు ఈ కింది జోకు చెప్పారు.


“ఈ లోకంలో ఆడ వారి మాటను జవ దాటగల వారెవరైనా వుంటారా” అని శ్రీ కృష్ణ దేవరాయలు గారికి అనుమానం వచ్చిందట. వెంటనే తన ప్రధాన మంత్రి ని పిలిచి అడిగాడట. “మాహా మంత్రీ! నేను భారత దేశంలోని రాజ్యాలెన్నింటినో జయించాను. నేనంటే భయపడని వారు ఎవరూ లేరు ఈ భూమ్మీద. అలాంటి నేను కూడా మా రాణీ గారంటే భయపడవలసి వస్తోంది. అసలు ఈ భూమి మీద ఆడవారంటే భయ పడని వారెవరన్నా వున్నారేమో తెలుసుకోవాలని కుతూహలంగా వుంది” అని అడిగాడట.


“లేదు ప్రభూ! ఇంత వరకు అలాంటి మగధీరుడు పుట్టలేదు” అన్నాడు మహా మంత్రి.


“లేదు లేదు అలాంటి వారు మన సువిశాల సామ్రాజ్యంలో ఎక్కడో ఒక చోట వుండే వుంటారు. అటువంటి వారు వున్నారో లేదో కనుక్కోవడానికి మన మంత్రివర్గ సహచరులందరిని రప్పించి సమావేశాన్ని ఏర్పాటు చేయించండి” అన్నాడు శ్రీ కృష్ణ దేవరాయలు.


“అలాగే ప్రభూ మన మంత్రి వర్గంలోని 14 మంది మంత్రులనూ రప్పించి రేపే సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తాను”

“సమావేశం లో 28 కుర్చీలని వేయించండి. ఒక వైపు 14 కుర్చీలు ఇంకోవైపు 14 కుర్చీలు వేయించండి. భార్య మాట జవదాటని వారిని ఒక వైపు, మిగిలిన వారిని ఇంకో వైపు కూర్చోమని మా మాట గా వారికి తెలియ చెప్పండి”

“అలాగే ప్రభూ!” అని ప్రధాన మంత్రి గారు సమావేశాన్ని ఏర్పాటు చేయించారు.

తరువాతి రోజు సమా వేశం మొదలయింది.

ఒక్కో మంత్రీ వస్తున్నారు. వచ్చి భార్యంటే భయపడే వాళ్ళున్న వైపు వేసిన కుర్చీల్లో కూర్చుంటున్నారు. 13 మందీ అటువైపే కూర్చున్నారు. చివరలో వచ్చిన ఒక్కే ఒక్క మంత్రి భార్యంటే భయపడని వారున్న వైపు కూర్చున్నాడు.

అది చూసి శ్రీ కృష్ణ దేవరాయలు వారు లేచి, “సెభాష్ మంత్రి వర్యా! మీలాంటి వారు మా విజయనగర సామ్రాజ్యంలో వున్నందుకు మాకు గర్వంగా వుంది. చూశారా ప్రధాన మంత్రీ! ఇలాంటి మగధీరులు వున్నారంటే మీరు నమ్మలేదు. ఇలా 14 మందికి ఒకరు నిష్పత్తి ప్రకారం మా రాజ్యం లో కొన్ని వేల మంది వుంటారు. ఇంత ధైర్యమైన మంత్రికి తప్పకుండా సన్మానం చెయ్య వలసిందే…”

“క్షమించండి ప్రభూ. ఆ సన్మానానికి నేను అర్హుడను కాను” అన్నాడు ఆ 14వ మంత్రి.

“ఏమిటి ఏమయింది” అన్నారు శ్రీ కృష్ణ దేవరాయలు.

“ఏమీ లేదు ప్రభూ మీరిలా భార్య విధేయులను కనుక్కోవాలనే పరీక్ష పెట్టారనే విషయం అంతః పురంలోనే కాదు రాజ్యమంతా తెలిసిపోయింది. అలా ఈ విషయం మా ఆవిడ చెవిన కూడ బడింది. నేను అలా పది మందిలో భార్యా విధేయుడననే విషయం బయట పడ కూడదని మా ఆవిడ తలపోసింది. అందుకనే ఆవిడ చెప్పినట్లు ఈ వైపు కూర్చున్నాను ప్రభూ.”


:

6 comments:

Naga Pochiraju said...

ఈ టపా కూడా మీరు మీ శ్రీమతి కనుసఙ్ఞలలోనే రాసారా...??

మీకు చెప్పేంతదాన్ని కాను,అక్కడక్కడా అక్షరదోషాలను సవరిస్తే చూడముచ్చటేస్తుంది

సత్యసాయి కొవ్వలి Satyasai said...

'జవదాటగల వారు ఎవరైనా ఉంటారా?' అని ఉండాలి ప్రశ్న.
మీరు మీ ఆవిడమాట మీరగలరో లేదో తెలియదు కానీ, మీరు తీసేసిన పరదాల సాక్షిగా బ్లాగర్ల మాట జవదాటలేరని తెలిసింది.
:)))

జ్యోతి said...

ఏ కాలమైనా ఏ దేశమైనా ఏ మగాడు తన ఇల్లాలి మాట మీరజాలగలేడు. .ఒప్పుకోరు ..అంతే..

gravitation said...

ఈ జోకులు తెలుగులో చదివితే బావుంటుంది. ఆ మధ్య ఇలాంటివి ఇంగ్లీశ్ లో చదివాను అంత బాగా లేవు. నేను ఈ మధ్యనే www.quillpad.in/telugu చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత తెలుగు బాగా ఇంటెర్నెట్ లో వాడుతున్నర్ని తెలిసింది.Thanks for the joke and please keep posting.

Anonymous said...

@ లలిత గారు,

అవునని నిజం చెప్పేస్తారా ఎవరైనా. :-)

అక్షర దోషాలు కొన్ని మాత్రమే వున్నాయి ఈ టపాలో. కొన్ని పాత వాటిలో అబ్బో చాలా. అయినా చెప్పినందుకు ధన్యవాదాలు. ఏదైనా చెప్పాలంటే మొహ మాటం లేకుండా చెప్పండి.

@ సత్య సాయి గారు,

మార్పు చేశాను.

నేను అందరి వాడినీను. అందుకే అందరి మాటా వింటాను :-)

@ జ్యొతక్కోయ్,

అలా జీవిత రహస్యాలను బట్ట బయలు చేస్తారా ఎవరైనా?

@ gravitation గారు,

జోకు బాగున్నందుకు థ్యాంక్స్. కాకపోతే మీ graviTation pull ఎక్కువయింది. కొంచెం తగ్గించండి :-)

-- విహారి

రాఘవ said...

కం.చాలా బాగా వ్రాస్తిరి.
మీలాగే నేను కూడ నిత్యం రాజీవ్
లీలలు గానం చేసే
కాలక్షేపం గురించి ఆలోచిస్తా.