ఈ వారం సిధ్ద - బుద్ధ (13-Aug-07)
***
“ఒరేయ్ సిద్ధా ! ఈ మధ్య బ్లాగులు చూశావట్రా?”
“లేదయ్య ఎక్కడా! మీరు ఆ కంప్యూటర్ దగ్గర నుండి కాస్త జరిగితే కదా చూసేదానికి. ఇంతకు ముందు అయితే మీరు అన్నీ చదివేశాక నేను కూడా కాసేపు దాని మీద కెలికే వాడిని”
“అవున్రా బ్లాగుల గురించి చెప్పాక నీకు కూడా వాటి నషాళం తలకెక్కి దాని మాయలో పడి పోయావ్ నాకు ఫిల్టర్ కాఫీ తెమ్మంటే బ్రూ కాఫీ తెస్తున్నావ్. పూరీలో చపాతీలో చెయ్యమంటే ఇడ్లీలు నా నెత్తిన పెడుతున్నావ్. ఇది ఏమీ బాగా లేదురా”
“అసలు సంగతి చెప్పండి అయ్యగారూ”
“నువ్వు కూడుకుని కూడుకుని బ్లాగులు చదువుతావు. ఎప్పుడయినా అవి బాగున్నాయో లేదో చెప్పావా?”
“అయ్యో దానికెక్కడ టైముంటుందయ్య గారూ. అయినా చెప్పాలని రూలేమన్నా వుందా? నాకు నచ్చితే రాస్తా లేక పోతే లేదు”
“రేయ్ టపాలు బాగుంటే కామెంట్లు రాస్తారు లేక పోతే లేదు.అది ఈ మధ్య గమనించా.”
“అంటే మీ టపాలు బాలేవన్నట్టేనా”
“మరంతే కదరా. బాగుంటే బాగుందంటారు. బాలేదని చెప్పడానికి మొహమాటం అంతే. చాన్నాళ్ళనుండి రాస్తున్నాము కదా ఏదో తెలిసినోడని వదిలేస్తున్నారు.”
“అంతే కదా అయ్యగారూ ఎవరైనా మొహమ్మీద బాలేదంటే బాధ పడతారు గదా”
“దానిమీదనే కొత్తపాళి గారు చెప్పారు. వ్యక్తి ని విమర్శించడం వేరు, విషయాన్ని విమర్శించడం వేరు. దాన్ని తెలుసుకోలేక పోవటం దురదృష్టం అని”
“మీరు మీ టపాలను విమర్శిస్తే ఊర్కుంటారా?”
“ఏం నేనేమన్నా ముఖ్యమంత్రి ననుకుంటున్నావట్రా వెళ్ళి వాళ్ళ బ్లాగుల మీద బాంబులు వెయ్యడానికి”
“అలాగా విషయాన్ని విమర్శిస్తే వాళ్ళ అహం దెబ్బ తినదా ?”
“అలా అందరూ అనుకోర్రా. అలా అనుకుంటే మనమేమీ చెయ్యలేము కదా”
“బ్లాగులెక్కువయి పోతున్నాయి కదా వాటి మీద ఎవరైన సలహాలూ సూచనలూ ఇవ్వచ్చు గదా?”
“వాటి కొరకే వీవెనుడూ, ప్రవీణుడూ, వెంకట రమణుడూ, ఇప్పుడు కొత్తగా శ్రీధరుడు వీడియోలతో సహా ఇస్తున్నారుగా”
“అవి సాంకేతిక సలహాలు. నేను చెప్పేది మొత్తం బ్లాగుల కొరకు ఏమైనా ఇవ్వచ్చు కదా”
“నీకు ఈ మధ్య ఏమీ పనీ పాటా వున్నట్టు లేదురా. ఆ తమిళ డబ్బింగు జెమినీ టి.వి.ఎక్కువ చూస్తున్నట్టున్నావ్. అందుకే నాకు సలహాలు ఇస్తున్నావు. గత ఆరేడు నెలల నుండే గదా తెలుగు బ్లాగులు పుంజుకుంటున్నాయి. ఇది ఇంకా శైశవ దశలోనే వుంది అని నా అభిప్రాయం. అది దాటిన తరువాత పెద్దలెవరైనా వుంటే వాళ్ళు సలహాలిస్తారు”
“ఏం మీరు ఇవ్వకూడదా?”
“నేను కోలి లో బోలి ని నాకెందుకు”
“అంటే ఏంటి అయ్యగారూ”
“నేను కోటి లింగాలలో బోడి లింగాన్ని. ఏదో దురద కొద్దీ తమాషా టపాలు రాస్తుంటా నాకెందుకు అవన్నీ.”
“అయ్యగారూ..?”
“ఇంకొద్దు ఆపేయ్ ఆ టి.వి. లో తస్లీమా నస్రీన్ గురించి వస్తోంది అది చూడు”
***
11 comments:
కామెంట్ చేస్తే బ్లాగు మంచిదో సుత్తిదో తెలిసిపోతుంది.
కాని బ్లాగుకి కౌంట్ పెరిగి, కామెంట్ లేకపోతే, వందల్లో ఇదొక బ్లాగు అని లెక్క!
రెండూ లేక పోతే బాధే లేదు, ఎవ్వడూ ఇంకా చూడనట్టే కదా!
ఎక్కువ శాతం చివరి కాటగిరీలో పోతున్నట్లున్నాయి.
http://sreenyvas.wordpress.com
అయ్యో ఎంత మాటన్నారు.మీ టపాలను మించిన హాస్యం ఎక్కడా వుండదని అందరూ నొక్కి వక్కాణిస్తుంటేనూ.ఏదో ఖాళీ లేక అందరూ చదువు కుని,నవ్వుకుని వెల్లిపోతున్నాము అంతే.అయినా ప్రతీ టపా సూపరు అని ఎన్ని సార్లు రాయాలి చెప్పండి?మాకూ బోరు కొడుతుంది.ఈ సారేమయినా చెత్త టపా రాయండి.కామెంట్ మార్చి రాస్తాము.
మీ బ్లాగ్ లొ పొస్ట్ లు బాగొకపొవటం ఎమిటండి.
సుపర్ ఐతే.
kOli lO bOli - kotta prayOgam addiriMdi!!
కొంతమంది బ్లాగు, బాగున్నా కూడా వ్యాఖ్య వ్రాయరు. ఎందుంటే ఇంకొడేవరో చెబుతారు కదా ఆ విషయం.
* radhika said...
"ప్రతీ టపా సూపరు అని ఎన్ని సార్లు రాయాలి
చెప్పండి?"
అలాఅని విషయాన్ని చర్చిస్తూ రాయడానికి అందులో విషయం ఉండాలి కదా?!
సీనియర్ బ్లాగర్లు మీరు, జూనియర్స్ కి సలహాలు ఇవ్వొచ్చుకదా!
గుంపుల్లొ కొంతమంది సభ్యులవుతున్నారు..తమ బ్లాగుల గురించి అప్డట్స్ ఇవ్వడానికి మాత్రమే. ఒకక్కసారి గుంపు ఉద్దేశాలను దాటి కూడా ఈ సందేశాలు వెళుతున్నవి.
గణాంకాలు బానే వున్నవి. బ్లాగింగిలో కన్సిస్టన్సి ఏది?
మొక్కఐ వంగనిది మానై వంగుతుందా?
* "ఇది ఇంకా శైశవ దశలోనే వుంది అని నా
అభిప్రాయం."
ఇప్పుడే దానికి ఒక స్వచంద ప్రవర్తనా నియమావళి ఏర్పరిస్తే బాగుంటుంది.
"అయ్యగారూ!! తమరు పోతులూరి వీరబ్రహ్మయ్యగారే కదూ? సిద్దయ్యతో ఇంత చనువుగా మాట్లాడగలిగేవారు ఇంకెవరుంటారు"
ఐతే ఇప్పుడు ఏంటంట? బ్లాగు బాగా రాయకున్నా, తిట్టాలనిపించినా కామెంట్ చేయమాంటావ్. రైట్.. మరి తప్పుగా అనుకోవద్దు .
@ వికటకవి గారు,
బ్లాగుల్లో కామెంటు చేసి వాటికి సమాధానాలు ఇవ్వకపోయినా తరువాత కామెంటులు రావు. టపా బాగున్నా ఆసాంతం చదివించేటట్లు వుంటే తప్పకుండా ఓ వ్యాఖ్య రాస్తారు.
@ రాధిక గారు, విహారి-2 గారు,
ఏదో అలా అనేస్తున్నారు గానీ నా టపాలు నాకయితే కొన్ని నచ్చడం లేదు. అలా బాగులేని వాటి గురించి భవిష్యత్తులో బావున్నాయో లేదో చెబుతారని ఈ టపా రాసా.
@ teresaa గారు,
ధన్యవాదాలు.
@ నెట్టిజెన్ గారు,
కరక్టే అలా కొంత మంది వుంటారు.
నన్ను సీనియెర్ బ్లాగరరంటున్నారు. అదేం కాదండోయ్. నేను మీకన్నా కొచెం ముందొచ్చుండచ్చు అంతే. ఇక్కడ సీనియారిటీ ప్రాధాన్యం కాదు. బ్లాగోగులు తెలుసున్న వారెవరైనా సలహాలు ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు పుచ్చుకునే స్థైర్యం కూడా వుండాలి. "మనం" లోనుండి మొదలుపెడితే వచ్చిన స్పందన చూసి "నా ఇష్టం" అనేవరకు వెళ్ళకుండా చూసుకోవడం చాలా కష్టం తోనూ రిస్కుతోనూ కూడుకున్న పని.
స్వచ్చంద ప్రవర్తనా నియమావళి ఏర్పరచడం "పెద్ద మనుషల ఒప్పందం" లాంటిది. అవసరమైతే వాడుకోవటం లేకపోతే పక్కనెయ్యడం జరుగుతుంది. ఈ టపా మొదలు పెట్టింది కొన్ని చెణుకులు పేల్చడానికి. అవి నామీదనుండే మొదలవుతాయి.
@ రానారె,
అవును బ్లాగు చరిత్ర రాయడానికొచ్చిన బ్రహ్మయ్యే :-)
@ జ్యోతక్క,
మరదే కదా అడుగుతోంట. విషయ విమర్శ కావాలి అని.
-- సిద్ధ బ్రహ్మ విహారి
chala chala bagundnadi me blog
nenu kotta blogerni
ఒక టపా నచ్చి ఇంకొక టపా నచ్చక పోతే, "ఇది బాగుంది; ఇది బాగోలేదు; ఇది నచ్చింది; ఇది నచ్చలేదు;" అని వ్రాసేవాడిని. కానీ అన్నీ నచ్చేస్తుంటే నన్నేమి చేయమందురు విహారివర్యా? ప్రతీ టపా క్రింద "ఒహో! ఆహా! సూపరు! సూపరు!" అంటూ భట్రాజుల పాత్ర వహించమంటారా?
raju
Post a Comment