Thursday, October 11, 2007

ప్రభుత్వ కప్ ట్వెంటీ(ట్వెంటీ-11)

.

కొత్తగా కట్టిన రాజీవ్ గాంధి (ఉప్పల్) స్టేడియం.

క్రిక్కిరిసిన జనసందోహం. గాలి కూడా మాట్లాడ్డం ఆపేసింది. కూలి పోవాలనుకున్న బ్రిడ్జిలు ఆగిపోయాయి. పేలి పోవాలనుకున్న బాంబులు పేలడం మానేసాయి.

చివరి ఓవర్…

చివరి బాల్….

చివరి వికెట్…

గెలవటానికి కావలసినవి అయిదు పరుగులు. కొడితే సిక్సే కొట్టాలి.

క్రీజులో పించ్ హిట్టర్ వై.ఎస్. పంచ ఊడిపోతుందేమోనని అంపైర్ అనుమతితో బెల్టు తెప్పించుకొని దాని మీద వేసుకున్నాడు. బెల్టు తెచ్చిన సూరీడు వికెట్ల వెనక కీపింగ్ చేస్తున్న మైసూరా రెడ్డిని కొర కొరా చూశాడు వై.ఎస్. ఎక్కడున్నా వెనకుండే తన బదులు ఎవరో వుండడం చూసి ఓర్వలేక. సూరీడు వై.ఎస్. తాగేసిన నీళ్ళ బాటిల్ తీసుకొని బయటకొచ్చేశాడు. వై.ఎస్. 99 మీదున్నాడు.


అవతలి టీం కెప్టెన్ అయిన చంద్ర బాబు ఫీల్డింగ్ సరి చేస్తున్నాడు. సీనియర్ క్రికెటర్లయిన దేవేందర్ గౌడ్, ఎర్రం నాయుడులు సలహాలు ఇద్దామా వద్దా అని ఆలోచించి ఎందుకొచ్చిన గొడవలే అని చెబితే హరికృష్ణకు చెబుదాం అని వెళ్ళి వై.ఎస్. కు ఏ వైపున బాల్ వేస్తే దొరికిపోతాడో చెప్పారు.

హరి కృష్ణ వెంటనే చంద్ర బాబు దగ్గరికెళ్ళి “బావా! నువ్వు ఈ బాల్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వేస్తే వై.ఎస్. ఈజీగా దొరికిపోతాడు” అని చెప్పాడు.

“నేను మారాను అని చెప్పినంత మాత్రాన అందరి సలహాలు తీసుకుంటున్నట్టు కాదు. మామూలు బౌలింగ్ బదులు రౌండ్ ద వికెట్ బౌల్ చేస్తానని అర్థం. పేస్ లోనూ, లెంగ్త్ లోనూ తేడా వుండదు.” అని చెప్పి వికెట్ కీపర్ కి వెనకాల బౌండరీ లైను దగ్గర వెళ్ళి నిలబడ మన్నాడు.”నేను స్లిప్స్ లో వుంటా బావా” అని చెప్పబోయి మాట్లాడలేక బౌండరీ లైను దగ్గరకి వెళ్ళిపోయాడు.


వై.ఎస్. పొజిషన్ లో నిలబడి బ్యాటును గ్రౌండ్ కేసి కొట్టి ఏదో అనుమానమొచ్చి అంపైర్ నడిగి మళ్ళీ గార్డు తీసుకున్నాడు. వెనక నుండి మైసూరా రెడ్డి స్లెడ్జింగ్ మొదలు పెట్టాడు.

“చూడుబ్బీ.. వై.ఎస్సూ! ఈ తూరి నువ్వయిపోయినావ్బో. బాల్ కొట్టే ముందు నీ పంచి చూసుకోబ్బీ అది ఊడిపోతా వుంది. ఇంగేం బాల్ కొడతావ్. బ్యాటు పైకెత్తితే పంచి కిందుంటుంది.అబ్బుడు నువ్వు పటా పట్టీల డ్రాయర్ తో ఇడుపుల పాయలో మడికి అండ గొట్టిన సీను గుర్తొచ్చుంది. ”

వై.ఎస్. బ్యాట్ను నేల కేసి దబా దబా బాదుతూ కంగారుగా ఆలోచించాడు ‘ ఇప్పుడే కదా బెల్టు పెట్టుకుంది అదెందుకు ఊడిపోతుంది ‘ అని సర్ది చెప్పుకొని తన ట్రేడ్ మార్కు గుర్తుకు రాగానే ఓ చిరు నవ్వు నవ్వాడు.


రైట్ ఆర్మ్ మీడియం స్పిన్నర్, ఆల్రౌండర్ చంద్ర బాబు బాలు కు బాగా ఎంగిలి పూసి తొడల మీద రుద్దుకుంటున్నాడు. బౌలింగ్ పాయింటు దగ్గర కెళ్ళి వికెట్ల వైపు తిరిగి పరుగెత్తుతూ ఆలోచించాడు. ఈ ఒక్క వికెట్ పడిపోతే విజయం తమదే. మళ్ళీ ఓ అయిదేళ్ళు మనల్ని ఎవ్వడూ అడగడు. ఈ సారి పాద యాత్రలకు చేతి యాత్రలకు అసలు అనుమతి ఇవ్వకూడదు ఇస్తే గిస్తే పొర్లుడు యాత్రలకు అనుమతి ఇవ్వాలి అని బలంగా అనుకున్నాడు.


అక్కడ క్రీజులో వై.ఎస్. ఫీల్డింగ్ మొత్తం చూసుకున్నాడు. కొడితే లాంగాన్ లో ఎర్రం నాయుడి మీదుగా సిక్సర్ కొట్టాలి. అక్కడ మంచి గ్యాప్ వుంది. బాల్ లో తేడా వస్తే కవర్స్ లో వున్న దేవేందర్ గౌడ్ మీదుగా సిక్సర్. దేవేందర్ గౌడ్ కు తాను పంపించిన సందేశం “క్యాచ్ వదిలేస్తే తరువాత తమ ప్రభుత్వం కాంగ్రేస్ లో చేర్చుకొని తెలంగాణా ఇచ్చేసి ముఖ్యమంత్రి ని చెయ్యడం” అందించారో లేదో అని ఓ క్షణం అనుమానపడ్డాడు.

నాన్ స్ట్రైకర్ కె.వి.పి. అసహనంగా కదులుతున్నాడు. అంతకు ముందే చంద్ర బాబు చేతిలో డకౌటైన రోశయ్య స్థానం లో వచ్చాడు.

వై.ఎస్. బ్యాట్ ఊపుతూ చంద్ర బాబు చేతుల్నే చూస్తున్నాడు. చివరి బాలు చంద్ర బాబు చేతి నుండి విడుదలయింది. అది సుడులు తిరుగుతూ లెగ్ సైడు వెళ్ళబోతూ వైడు అవుదామా వద్దా అని సందేహించింది. అంతలో వై.ఎస్. సగం పిచ్ దాటి పది మీటర్లు ముందుకు వచ్చి బ్యాటును బలంగా అడ్డంగా ఊపాడు.


మిస్సయింది.!!!


బాల్ చంద్ర బాబు మాట్లాడే స్వభావాన్ని వంట బట్టించుకుని చాలా నిదానంగా వికెట్ల దగ్గరికి వెళుతోంది. అంత పెద్ద బ్రహ్మిణి ప్లాంటుకు ఎంత వేగంగా పర్మిషన్ తెచ్చాడో అంతే వేగంగా వెనక్కి వచ్చి గింగిరాలు తిరిగుతున్న బాలును రివర్సు స్వీప్ చేసి "నీకు పావలా వడ్డీకే అప్పిస్తానే" అని బ్యాట్ తో గాల్లోకి లేపాడు. అది గాల్లో యువరాజ్ సింగ్ కొట్టిన 119 మీటర్లను దాటేసి 150 మీటర్ల ఎత్తుకు వెళ్ళి బౌండరీ లైను వైపు వెళ్తోంది.


అది చూసి కె.వి.పి. కళ్ళు మూసుకుని పరుగు కోసం పరిగెత్తాడు. వై.ఎస్. చిరునవ్వు నవ్వుతూ పరుగులు పెడుతూ బాల్ ను చూస్తున్నాడు.


మైసూరా రెడ్డి గుడ్లప్పగించి చూడ్డం తప్ప ఇంకేమీ చెయ్యలేక పోయాడు.


చంద్ర బాబు మాత్రం హరి కృష్ణ ను చూసి అరుస్తూ
“క్యాచ్..క్యాచ్… నువ్వు దాన్ని పట్టుకుంటే నీతో తెలుగయ్య.. ఈ కప్పు నేనెవ్వర్నీ పట్టుకోనివ్వను అనే సినిమా తీస్తా. అందులో ఇలియానా, త్రిషా హీరోయిన్స్ ” అన్నాడు.

“బిపాసా బసూతో ఐటం సాంగుందా..” అన్నాడు హరికృష్ణ

“కావాలంటే బ్రిట్నీ స్పియర్స్ కూడా” అరిచాడు చంద్ర బాబు

“నువ్వు ప్రధాన మంత్రయితే నన్ను ముఖ్య మంత్రిని చేస్తావా”

“కావాలంటే నిన్ను రాష్ట్రపతిని కూడా చేస్తా. ముందు ఆ బాలును క్యాచ్ పట్టు” చెయ్యి ఫ్లాట్ గా పెట్టి అరిచాడు చంద్ర బాబు.

అది విన్న హరి కృష్ణ ఆ బాలు పట్టుకోవడానికి వెనక్కి పరిగెడుతున్నాడు.

బాలు కిందకొస్తోంది…

కాలు బౌండరీ రోపు దగ్గరకెళ్తోంది…

బాలు దగ్గర కొచ్చేసింది…

కాలు బౌండరీ రోపు ను తాకుతోంది.

బాలు చేతుల్లో పడ బోతోందనగా హరికృష్ణకి కాలు రోప్ మీదుందని తెలిసింది.

ఇక అది క్యాచే అని డిసైడ్ అయిపోయి కడియం శ్రీహరి, అయ్యన్న పాత్రుడు, అశోక్ గజ పతి రాజు ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. స్టేడియం లో వున్న తెలుగు దేశం అభిమానులు
“క్యాచ్ టైగర్..క్యాచ్…."

"క్యాచ్..టైగర్..క్యాచ్” అని అరుస్తున్నారు.

బాలును చూస్తూ రెండుచేతులతో బాలును పట్టుకోబోతూ క్షణంలో వెయ్యో వంతు సమయంలో హరికృష్ణ రోప్ మీద కాలును తీశేశాడు. బాలు రెండు అరిచేతుల్లో పడింది. ఇక వేళ్ళు మూసుకోవడమే మిగిలింది.


వై.ఎస్. "నువ్వు చేతులు సరిగ్గా కడుక్కున్నావా లేక నన్ను
కడగమంటావా ..." అని గర్జించాడు.


……

……

అంతే

మూసుకోబోతున్న వేళ్ళు తడబడ్డాయి……

బాలు కింద బడింది.


క్యాచ్ డ్రాప్…సీతయ్య ఈ బాలును పట్టుకోలేదు.


వెంటనే తేరుకున్న హరికృష్ణ అది బౌండరీ లైనును దాటక పోతే చాలు అని కింద పడ్డ బాలు మీద సీతయ్య సినిమాలో సిమ్రన్ మీద పడ్డట్టు పడ్డాడు. సిమ్రన్ “దొంగ సచ్చినాడా “ అని తోసేస్తే పక్కకు దొర్లినట్టు ఆ బాలును పట్టుకుని మైసూరా రెడ్డి వైపుకు విసిరాడు. మైసూరా రెడ్డి దాన్ని ఒడుపుగా పట్టుకుని వికెట్లను గిరాటేసి మూడో పరుగు తీస్తున్న వై.ఎస్. ను ఆపి “వురికెత్తింది చాల్లేబ్బీ. ఇంగ కడప లోక సభ సీటు నాదే” అన్నాడు. అది చూసి కె.వి.పి. అక్కడే క్రీజులో కూలిపోయాడు.


కాంగ్రేసు అభిమానులలో కలకలం బయలు దేరింది. తెలుగు దేశం అభిమానులు జయ జయ ధ్వానాలు మొదలు పెట్టారు. స్టేడియంలో వున్న వై.ఎస్.అభిమానులు జేబులోనుండి కడప బాంబులు తియ్యడానికి సిద్ధమవుతున్నారు.


వై.ఎస్.మాత్రం యమదొంగ లో జూ.ఎన్టీఆర్ గదను ఎత్తినట్టు బ్యాట్ ను భుజం మీద పెట్టుకుని చిరునవ్వు నవ్వి, కళ్ళెగరేసి “చూద్దాం… థర్డంపైర్ ఏమి చెబుతున్నాడో చూడు” అన్నాడు. మైసూరాకి బొబ్బిలి ఎం.పి. ఎలక్షన్ సీను గుర్తుకు వచ్చింది.


జెయింట్ స్క్రీన్ మీద హరికృష్ణ బాలును క్యాచ్ పట్టుకోవడం చూపిస్తున్నారు. బాలు చేతుల్లోనుండి జారిపొవడం హరికృష్ణ దాని మీద పడ్డం కనిపిస్తోంది. ఆ షాట్ ని ముందుకు వెనక్కి చూపిస్తున్నారు. ఊహూ.. ఈ యాంగిల్ లో ఏమీ కనిపించడం లేదు. ఇంకో యాంగిల్లో చూపిస్తున్నారు. అందులో సైడు నుండి స్పష్టంగా కనిపిస్తోంది.


బాలు చేతుల్లోనుండి జారగానే గ్రౌండు మీద పడి……

పడి…

పడి…


బౌండరీ రోపును తాకి వెనక్కి వచ్చింది. కాంగ్రేస్ అభిమానుల కోలాహలం చెప్పఖ్ఖర్లేదు. దాన్ని ఫోర్ గా ప్రకటించాడు థర్డంపైర్ సురేష్ రెడ్డి. ఇంకేం స్కోరు టై అయింది.


అంపైర్లు వై.ఎస్.ను, చంద్ర బాబును పిలిచి చెప్పారు. స్కోరు టై అయింది కాబట్టి బౌలవుట్ పెడతాం అయిదుగురు బౌలర్ల పేర్లు ఇమ్మన్నారు. “బౌలవుట్ లో అయిదు కన్నా ఎక్కువ బంతులుండవ్. అది టై అయితే మరో మూడు బంతులు గట్రా లుండవు. డిఫెండింగ్ చాంపియెన్ కే కప్పు ఇస్త్తాం” అని కూడా చెప్పారు.


వై.ఎస్. తర్జన భర్జనలు పడి అగ్రెసివ్ బౌలర్ జె.సి దివాకర్ రెద్ది, స్పిన్నర్ రోశయ్య, మీడియం పేసర్ ఎమ్మెస్ సత్యనారాయణ, పార్ట్ టైం బౌలర్ బొత్స సత్యనారాయణ, స్లో బౌలర్ దాసరి నారాయణ రావు పేర్లు ఇచ్చాడు.


చంద్ర బాబు ముందుగానే ఆలోచించి పెట్టుకున్న లిస్టు ఇచ్చేశాడు. అందులో ఫాస్ట్ బౌలర్ కె.ఇ.కృష్ణమూర్తి, స్పిన్నర్ లాల్ జాన్ భాషా, స్లో బౌలర్ బాబు మోహన్, ఆల్రౌండర్ హరికృష్ణ, పార్ట్ టైం బౌలర్ కోడెల శివ ప్రసాద్ వున్నారు.


వై.ఎస్. బొమ్మ అన్నాడు. అంపైర్ టాస్ ఎగరేశాడు. బొమ్మ పడింది. వై.ఎస్. టాస్ గెలిచాడు. వెంటనే రెండువైపులా బొమ్మ వున్నా ఆ నాణాన్ని అంపైర్ జేబులో వేసేసుకున్నాడు. వై.ఎస్. అంపైర్ వైపు చూసి ఓ చిర్నవ్వు నవ్వాడు. అంపైర్ ఎవరికీ కనిపించకుండా రెండు వేళ్ళు చూపించి రెండు సార్లు టాస్ గెలిపించాను కాబట్టి నాకు రెండు సెజ్ కాంట్రాక్టులు ఇవ్వాలి అని సైగ చేశాడు. దానికి వై.ఎస్. కోడ్ బాషలో సరే అన్నాడు. తమ వాళ్ళే మొదట బోలింగ్ చేస్తారన్నాడు.


బౌలవుట్ మొదలయింది.

మొదట జె.సి దివాకర్ రెడ్డి బాలును చేతిలోకి తీసుకొని బాంబు వేసినట్టు వేశాడు. మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. కాంగ్రేస్ అభిమానులు అరిచారు.

ఇక తెలుగుదేశం తరపున మొదటి బాల్ ను హరికృష్ణ కిచ్చాడు చంద్ర బాబు. అప్పటికే క్యాచ్ పట్టనందుకు తిట్లు బాగ తిని వున్నందున కోపంగా ఆ బాలును తీసుకొని ఖాళీ గా వున్న వికెట్ల వైపు చూసి “నేను ఎవ్వరి బాలూ వెయ్యను “ అని వేశాడు. మిడిల్ స్టంప్, ఆఫ్ స్టంప్ విరిగి అవతల పడ్డాయి. తెలుగు దేశం శిబిరం లో ఆనందోత్సాహాలు.


స్కోరు సమానం 1-1.
మొదటి బంతి తరువాత పట్టిక
కాంగ్రేస్ : 1
తె.దే.: 1


తరువాత రోశయ్య బాలు వేశాడు. అది మూడు మైళ్ళ వైడు అయింది. ఫస్టంపైర్ రెండు చేతులూ చాపి ఎగురుకుంటూ బౌండరీ లైను దగ్గర కెళ్ళి “వైడు” అన్నాడు. లెగ్ అంపైర్ పరుగెత్తుకెళ్ళి ఫస్టంపైర్ చెవిలో చెప్పాడు “ఏరా నువ్వు వై.ఎస్. ఊరి నుండి వచ్చావా? రూల్సు అసలు తెలిసినట్లు లేదు. ఇది బౌలవుట్. రెగ్యులర్ బౌలింగ్ కాదు ” అని చెప్పగానే నాలుక్కరచుకుని టోపి తీసి మొహమ్మీద పెట్టుకున్నాడు.

“హత్తెరి. ఆపరేషన్ జరిగినప్పట్నుండి చెయ్యి సరీగా పనిచెయ్యడం లేదు” అన్నాడు రోశయ్య. స్కోర్ అక్కడే.

ఈ సారి కె.ఇ.కృష్ణమూర్తి వేసిన బాలు కొద్దిలో వికెట్లను మిస్సయింది. తె.దే. అభిమానులు నీరు కారి పోయారు.


స్కోరు 1-1.
రెండో బంతి తరువాత పట్టిక
కాంగ్రేస్ : 1-0
తె.దే.: 1-0


బొత్స సత్యనారాయణ వచ్చి వై.ఎస్. ను అడిగాడు. “ఏటి? నా పేరు లిస్టులోనుండి గానీ పీకేశారేటి. నాను వికెట్లను పీకీసి పిచ్ ని తవ్వీసి సీకాకుళం లో ఎయ్యనేటి. ఏటి? ఉత్తరాంధ్ర కావాల్ని నన్ననమంటావేటి. ” మారు మాటాడకుండా బాలు ఇచ్చేశాడు వై.ఎస్. బొత్స వేసిన బాలు లెగ్ స్టంప్ ను పగల గొట్టింది.


ఇక లాల్ జాన్ భాషా బాలును తీసుకొని “అరే ఇస్కీ…..మారో వికెట్స్ కో” అని గట్టిగా అరిచి వేశాడు. మూడు వికెట్లూ కింద పడ్డాయి. “ఇన్షా అల్లా..” అని ఆనందంగా వెళ్ళిపోయాడు. తె.దే. ఆనందం.


మళ్ళీ స్కోరు సమానం 2-2
మూడో బంతి తరువాత పట్టిక
కాంగ్రేస్ : 1-0-1
తె.దే. : 1-0-1


నాలుగో బాలు ను వెయ్యబోయే ముందు వై.ఎస్. దాసరిని పిలిచి చెప్పాడు. “తిప్పి తిప్పి వెయ్యాకుండా నేరుగా వికెట్ల వైపు వెయ్యండి”. అది విన్న దాసరికి చిర్రెత్తుకొచ్చింది.

“ఎఁవిటి…హేవనుకుంటున్నావయ్యా నన్ను? ఆఁ? ఈ బాలు వికెట్ల మీద పడాలా లేక వికెట్లే ఈ బాలును మీద వేయించుకోవాల? బాలు వికెట్ల మీద పడ్డా వికెట్లు బాలు మీద పడ్డా అవుటు అవుటే కదయ్యా? అవుటయ్యేది బ్యాట్స్ మెన్నేనయ్యా . బాలు తెల్లగా వున్నా, ఎర్రగా వున్నా అది వెళ్ళాల్సింది వికెట్ల వైపేనయ్యా. బాలు గుండ్రంగా తిరిగి వెళ్ళిందా, చతురస్రాకారంగా తిరిగి వెళ్ళిందా అని చెప్పడం ముఖ్యం కాదయ్యా…నేను నడుచుకుంటూ వెళ్ళి బాలు వేసినా..పరుగెత్తుకుంటూ వెళ్ళి బాలు వేసినా.. బౌలింగ్ బౌలింగేనయ్యా. బాలు గాల్లోకి లేచినా.. గాల్లోకి బాలు లేచినా…” అని ఇంకా చెప్పబోతుండగా వై.ఎస్. కింద పడిపోయాడు. సూరీడు వెంటనే ఓ గ్లాసు నీళ్ళు తాగించి కూచోబెట్టాడు.


“ఆ అదీ మన దెబ్బంటే. ఈ సారికి ఈ డోసు చాల్లే” అని బాల్ తీసుకొని బౌలింగ్ పాయింట్ కు వెళ్ళాడు. బౌల్ చేసే ముందు బాలును చేత్తో తన కళ్ళ కెదురుగా పెట్టుకుని “ఎఁవే..నా పరువు నిలబెట్టవే. చెప్పిందే పది సార్లు తిప్పి తిప్పి చెప్పడం నా అలవాటే..అలాగే నువ్వు కూడా పిచ్ మీద పడిన చోటే ఎగిరెగిరెగిరి పడక నేరుగా వికెట్ల మీద పడు….ఎఁ?..... ఓసేయ్ వికెట్లమ్మా... ” అని బాల్ ను వేశాడు. అది పాము లాగా బుస్సు బుస్సు అనుకుంటూ వికెట్ల పక్కనుండి వెళ్ళిపోయింది. తె.దే. వాళ్ళు “బూ” అని అరిచారు.

దాసరి వెంటనే జేబులో నుండి సెల్ ఫోను తీసి ”ఆ.. ఆడియో ఫంక్షన్ వుందామ్మా? నేను ఇప్పుడే వచ్చేస్తా నమ్మా. ఆ క్యాసెట్ కవరు నేనే చింపుతా మీరు చింపకండమ్మా..” అని డ్రెస్సింగ్ రూం లోకి రాకుండా గ్యాలరీలోకి వెళ్ళి పోయాడు.

బాలు కోడెల శివ ప్రసాద్ చేతుల్లోకి వచ్చింది. “నా ఇంట్లో బాంబులున్నాయంటారా. మీ ఇళ్ళలో బాంబులు పెట్టేస్తా” అని బాలు వేస్తే అది ఫుల్ టాసయి వికెట్ల వెనకాల పడింది. “ఇంకో సారి చెప్తా నీ సంగతి “ అని రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాంగ్రేస్ వాళ్ళు “బూ…” అని అరిచారు.

స్కోరు 2-2. ఒక్క బాలు మాత్రం మిగిలింది.
నాలుగో బంతి తరువాత పట్టిక
కాంగ్రేస్ : 1-0-1-0
తె.దే. : 1-0-1-0


అందరి లోనూ ఉత్కంఠత పెరిగి పోయింది. కొంత మంది కళ్ళు మూసుకున్నారు.

బౌలవుట్ చివరి బాల్ ను ఎమ్మెస్ సత్యనారాయణ వెయ్యాలి. దాసరి అనుభవంతో ఈయనేం మాట్లాడతాడో అసలే ఈయనకి నోటి దురదెక్కువ అని నోరు తెరవకుండా ఇచ్చేశాడు. రైలుటికెట్ కొన్లేదని రైలు రావడం ఆగుతుందా? కూత పెట్టుకుంటూ రైలొస్తుంది.

“నేను వికెట్లను కూలగొడితే నన్ను గవర్నర్ గిరీకి సోనియమ్మకు రెకమెండ్ చేస్తావా” అన్నాడు.

“ముందు వికెట్లను పడగొట్టండి”

“అలా కాక పోతే నన్ను మళ్ళీ మంత్రి వర్గం లోకి తీసుకుంటావా”

“లెట్స్ సీ…”

“తెలంగాణా ఇప్పించి నన్ను ముఖ్యమంత్రిని చేస్తావా”

“మీరు బాలు వేస్తారా నన్ను వెయ్యమంటారా ? ”

“ఒద్దులే నేనే వేస్తా” అని బాలు తీసుకోని “నేనే గనుక సెంటర్ లో చక్రం తిప్పుంటే మూడు వికెట్లు ఏక్ ధం లో ఎగిరి పోవల్ల” అని బాలును ముద్దు పెట్టుకొని వేశాడు. అది వికెట్ల మీద కాకుండా నేరుగా స్టాండ్స్ లో వున్న కె.సి.ఆర్. ఒళ్ళో పడింది.

కె.సి.ఆర్. అక్కడి నుండి “అన్నా! గందుకే జెప్తా. జర ఇనుకోయే మా టి.ఆర్.ఎస్.లోకి రాయే అని. మా దర్వాజా లెప్పుడూ తెరిచే వుంటయ్. తెలంగాణ భవన్ ల నీకోసం అత్తర్ జల్లి రూం రడీగా పెట్నం. ఈడ కొస్తే గడ్ బిడ్ ఏముండదు. సంజాయించకుండా రాయే. నీ దిల్ కుష్ చెయ్యనీకి గావాల్నంటే గా కరిమ్నగర నీకే ఇనాంగా ఇస్తా. మా హరీష్ రావ్కి గుస్స రాకుండా నే జెబ్తలె.”

ఎమ్మెస్ మాట్లాడకుండా వెళ్ళి డ్రెస్సింగ్ రూం లో కూచున్నాడు.

ఇక తె.దే. పార్టీ వాళ్ళ హంగామా ఎక్కువయింది. ఈ ఒక్క బాలు వికెట్లను పడగొడితే కప్పు వాళ్ళదే. ఈ బాలును వెయ్యాల్సింది సినీ నటుడు బాబూ మోహన్. చంద్ర బాబు బాబూ మోహన్ ను పిలిచి ల్యాప్టాప్ లో చూపిస్తూ “చూడండి బాబూ మోహన్ గారూ. ఇది మనకు ఆఖరు అవకాశం. ఈ సారి మిస్సయి డ్రా అయితే అంతే సంగతులు వాళ్ళకు కప్పు మనకు చిప్ప. మీరు గనుక ఈ విధంగా బాలు వేసినట్లయితే తప్పకుండా వెళ్ళి ఆ విధంగా వికెట్లకు తగులుతుంది. అప్పుడు ఈ ప్రభుత్వం మనదే. మీరు వికెట్లను పడగొడితే మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా. మీరు ఏమీ మనసులో పెట్టుకోకుండా నిండు హృదయంతో విసిరెయ్యండి. మిగిలింది నేను చూసుకుంటా.” అన్నాడు.

బిక్క మొహం వేసుకొని చేతులు తిప్పుతూ, చీదుకుంటూ “ఏమి చూసుకోవడమో ఏందో. గీ పాలిటిక్స్ ను నమ్ముకుని వస్తే ఇట్ల గవర్నమెంటు పాయె. అట్లా సినిమా చాన్సులూ పాయె. ఇట్లా బాలేసేది మా స్కూల్లో చెప్పకండా పాయిరి. ఏందిరో దేవుడో.” అని అనుకుంటా వుంటే సౌందర్య ప్రత్యక్షమయ్యి “చూడు బాబూ మోహన్ గారు. మనం మాయలోడు సినిమాలో డ్యాన్సు చేసిన ‘చినుకు చినుకు అందెలతో...‘ పాట గుర్తుకు తెచ్చుకొని బాలు వెయ్యండి. విజయం మీదే” అని చెప్పి మాయమయింది.


బాబూ మోహన్ ఉబ్బి తబ్బిబ్బయి పోయాడు. గుటకలేస్తూ ”అయ్యో..అమ్మో.. సౌందర్యా! ..ఎఁల్దుకూ... ఎఁమిటీ ఎలా అని ఆలోచించకుండా వేసేస్తా బాలు… ఇదిగో… ఇప్పుడే… వేసేస్తున్న…నే వేస్తున్నా…నే వేసేస్తా..నే వేసేసా.. “ అని గట్టిగా కళ్ళు మూసుకొని బాలు వేశాడు.


స్టేడియం మొత్తం చిన్న కాంట్రాక్టులకు సి.ఎం. సంతకం పెట్టినా వినిపించేంత నిశ్శబ్దం…


బాలు వికెట్ల వైపుకు గంటకు 1.61290323 మైక్రో మీటర్ల స్పీడుతో దూసుకు వెళుతోంది.


అది ఇరవై మీటర్లు దాటిన తరువాత ఫలితం చెప్పబడుతుంది.

.

తరువాతి టపా : చెనిక్కాయిలు ఉడకేసుకుందాం రా రా

21 comments:

మేధ said...

హ్హహ్హ బావుందండీ, నిజంగానే, క్రికెట్ మ్యాచ్ కళ్ళ ముందు జరుగుతున్నట్లుంది..! మొత్తానికి పెద్దలందరినీ తీసుకొచ్చేసి ఆడించారు కదా...

Winner said...

హ.. హా. హా..

ఈ టపాలో నువ్వు రాజకీయ క్రీడా విహారి
చంపావు టెన్షన్ తో నవ్వించి మరోసారి
ఎలా వస్తాయి నీకు ఐడియాలు ప్రతీసారీ
అందుకో అభివందనాలు ఇంక్కొక్క సారి

-ప్రసాదం

oremuna said...

బాగుంది, చాలా బాగుంది. నే బ్లాగ్ సన్యాసం తీసుకుంటున్నాను :) ఈనాడు జ్యోతి, మొన్నగు పేపర్ల గురించి ఉంటే ఇంకా బాగుండేది. ఈసోజీ రావును వదిలేసారు అనవసరంగా.

Chandra V said...

అదిరింది. కాసేపు టెన్షన్ పెట్టేసారు.
మీ క్రియేటివిటీకి జోహార్లు.

Burri said...

వండర్ పుల్ .. ఈ టపాతో విహారి గారు రవిశాస్త్రిని మించి పోయినాడు.

-మరమరాలు

Naveen Garla said...

85/100

చదువరి said...

చివరికేమవుద్దా అనే ఉత్సుకతను కష్టమ్మీద ఆపుకుని మొత్తం చదివాను. చాలా కట్టుదిట్టంగా రాసుకుంటూ వచ్చారు, చివరిదాకా. మళ్ళీ మళ్ళీ చదువుకునే టపా.
మీరు స్టార్లిచ్చుకున్నారు చూసారూ.. మీ పాత జాబులు! దీని ముందు అవన్నీ బలాదూర్! దీనికేసుకోండి ఓ డజను స్టార్లు. ఈ ఏటి మేటి టపా అంటూ ఏదన్నా పోటీ పెడితే ఇది ఖచ్చితంగా ఓ క్యాండేటు!

కొత్త పాళీ said...

అబ్బా విహారీ, నువ్వేమనుకోనంటే ఒక మాటంటానబ్బా. నీ టపాలు పూర్వకాలపు రాజకపూరు సినిమాల్లాగానూ ఈ కాలపు రాజమౌళి సినిమాల్లాగానూ ఉంటున్నాయబ్బా. అంటే .. వాటిల్లో చూసి ఆనందించడానికి చాలానే ఉంటుంది .. నిడివే కొంచెం అతి. నా మట్టుకి నాకు క్లుప్తత ఇష్టం.

Anonymous said...

@ మేధ గారు,

నెనర్లు.

@ ప్రసాదం గారు,

మీ కవితకు నా జోహార్నెనర్లు.

@ చావా గారు,

మీరు సన్యాసం తీసుకుంటే బ్లాగర్లందరూ మీ ఆశ్రమంలోనే వుంటారు.
నెనర్లు.

@ చంద్ర శేఖర్ గారు,

నెనర్లు. అలా టెన్షన్ పెట్టానంటే నా ఉద్ధేశ్యం నెరవేరినట్లే.

@ మరమరాలు గారు,

నెనర్లు.
రవిశాస్త్రి నేనా? యువరాజ్ సింగ్ కాదా? అంటే రజీలన్న మాట. వండేల్లోకి కూడా వస్తా:-)

@ నవీన్ గారు,

డిస్టింక్షన్ అన్నమాట. నెనర్లు.

@ చదువరి గారు,

అంతగా నచ్చిందా మీకు. నెనర్లు.:-)

నాకు ఇంకా ఎక్కువ నచ్చింది. కాకపోతే ప్రతిస్పందన అంతగా లేదనిపించింది. డైరక్టరుకు సినిమా నచ్చితే సరిపోదు. ప్రేక్షకుడికి నచ్చినప్పుడే అది హిట్టు.

@ కొత్త పాళి,

ఈ మధ్యన నా బుర్రలో పెరుగుతున్న మేఘమిదే. నాకు అసాధ్యమైన తగ్గింపు ను ప్రయత్నిస్తా. :-)


-- విహారి

cbrao said...

చక్కటి హాస్యం రాయగలరని, మరో మారు నిరూపితమయ్యింది. రాజకీయులతో ఆడుకున్నట్లే, పేపరోళ్లతో (ఈనాడు, జ్యొతి, వార్త వగైరా పత్రికలు) ఆడుకొంటే అది మరో 20/20 అవగలదు.అప్పుడు మరో దుమ్ము దులిపే విహారి కాగలడు.

వెంకట రమణ said...

టపా అదిరింది, నేను కూడా చదువరి గారిలానే చివరకు ఏమవుతుందో అనే ఆతృతను ఆపుకొని మరీ చదివాను. చివరవరకూ కథనంలో ఏ మాత్రం పట్టు తగ్గకుండానడిపించారు. అభినందనలు..

Chari Dingari said...

కుమ్మేసావన్నా....మీ టపాలు నాలాంటి వారికి స్పూర్తి దాయకం.........

Anonymous said...

@ రావ్/వెంకటరమణ/నరహరి గార్లకు,

నెనర్లు.

-- విహారి

వికటకవి said...

@విహారి,

నా అభిప్రాయమిక్కడ.

http://teluguvadini.blogspot.com/2007/10/blog-post_13.html

Unknown said...

ఎందప్ప ఇది..ఆఖరి తూరిన ఏమయ్యిందో చెప్పకుండా పూడిస్తే ఎట్టా?? టెన్షన్ తట్టుకోలేకుండ్యాను

Unknown said...

bagundhi

Naga Pochiraju said...

చాలా కాలానికి మీ బ్లాగు చదవడం వీలు అయ్యింది
మనసారా నవ్వేసాను.
అచ్చు క్రికెట్టు మాచు చూస్తున్న అనుభూతి కలిగించారు
మీకు మీరే సాటి

శక్తి said...

nizamyna match cusinta utkantha gaa cadivaa. navvakunda vundalekapoyaa humour lo yerramsetti sai ni mincipoyaaru.

శక్తి said...

హమ్మయ్య! ఇన్నాళ్ళకి మీకు కామెంట్ పోస్ట్ చెయ్యగలిగాను. username, password అని అడుగుద్ది ఎలాగో అర్థం అయ్యేదిగాదు. ఇప్పటికి అర్థం అయ్యింది. మీ కామెడి చాలాబాగుంది. యెర్రంశెట్టి సాయి గుర్తొస్తున్నారు. జోకులకి నవ్వలేక చచ్చాను. నేను నవ్వడమేకాదు ఒక 30 మంది నవ్వుంటారు. ప్యూర్ ఒరిజనల్ కామెడి. ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు నా బ్లాగు చూసినందుకు.

Unknown said...

విహరించేశారుగా....

oremuna said...

కొత్త ప్లేయర్లు
కొత్త టీంలు వచ్చాయి
ఇప్పుడు పార్ట్ టూ కి సమయం వచ్చినట్టుంది.