Wednesday, October 10, 2007

సింహావలోకనం

ఎలాగయితేనేం వంద టపాలు పూర్తయ్యాయి. మొదట్లో అనుకున్నా వంద టపాలు పూర్తి చెయ్యడం పెద్ద గొప్పేమీ కాదులే అందుకోసం బ్లాగుకు ఫ్రేము కట్టడం ఎందుకు అని. ఈ మధ్యనే ‘ఊరందరిదీ ఒక దారయితే ఉలిపి కట్టె దొకదారి’ అనే సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడకూడదు నువ్వు కూడ జన జీవన స్రవంతి లో కలవాలి అని గడ్డి పీకుతున్నప్పుడు బుద్ధుడు గాంధీ రూపంలో వచ్చి కర్రెత్తి జ్ఞానోదయం చేసి వెళ్ళాడు. మహాను భావులు చెప్పిన తరువాత జవదాటడం కూడానా అని వందవ టపా అలా విడుదల చేశా. ఇప్పుడు ఆ వందని సింహావలోకనం చేసుకుందామని ఈ ప్రయత్నం. ఈ వందలో నావి కానివి 6. నా బ్లాగు వారోత్సవం పూర్తయితే సొంతంగా వంద రాసినట్టు లెఖ్ఖ. కవితల బ్లాగుని, నాటకాల బ్లాగుని ఈ కూడికలో కలపడం లేదు.


నేను బ్లాగులు మొదలు పెట్టింది నాలో నాకు తెలీకుండా వున్న శక్తి ఏంటొ పరీక్షించుకుందామనే బులపాటం తో. నా కోసం మాత్రమే రాసుకుంటున్నా అని చెప్పే సాహసం, ధైర్యం రెండూ లేవు. వ్యాఖ్యలు నా కోసం టపాలు అందరి కోసం. మొదట్లో నన్ను నేను పరీక్షించుకోడానికి ప్రయోగశాల లాగ బ్లాగు ఉపయోగపడింది. ఆ పరీక్షల్లో అప్పుడప్పుడూ అత్తెసరి మార్కులొచ్చినా, స్టేటు ఫస్టు రాకపోయినా వీలున్నంతలో మండలం ఫస్టు అనే స్థాయి కనిపించింది. సరేలే కాస్త తెలుగు మీద పట్టు వుంటుంది ఇలా రాస్తూ పోతే అని అనిపించి రాయడం మొదలు పెట్టా.


నువ్వు పిండి మెత్తగా రుబ్బి మంచి వంటకాలు చేస్తున్నావు అని కొంత మంది నా భుజాల మీద వాళ్ళ చేతులు వదిలేసి ‘ అప్పుడప్పుడూ సెభాష్..సెభాష్ అంటూ ఈ బులపాటం గాని భుజాన్ని తట్టండి అని కీ ఇచ్చి వెళ్ళిపోయారు ‘ . నా భుజాల మీద నా చేతులకు తోడు ఇంకొన్ని చేతులు తోడవటంతో వైన్ తాగుతూ కోడిని గ్రిల్లు మీద పెట్టి కాల్చుకుని, దాన్ని గిల్లుకుని తినే సమయాన్ని కొంచెం తగ్గించి ఇందులో ప్రవేశించా.


అలా మీ అందరి ఆదరాభిమానాలు ఎంతగా వున్నాయో చెప్పడానికి ఈ మధ్య కొత్తపాళి, ఇస్మాయిల్, నేను సైతం, a-z, సి.బి.రావ్ గార్లు నేను నాలుగు వారాలుగా రాయకపోయే సరికి నా గురించి వాకబు చేయడం ఒక ఉదాహరణ. ఇంత అభిమానాన్ని చూపిస్తున్న బ్లాగు లోక జనులందరికి నా మనహ్ ప్రణామములు. ఇక నేను బ్లాగులు ఎలా రాస్తాను అంటే. ఇది అదని కాకుండా అన్నీ బ్లాగాలని అనిపిస్తుంది అందరిలాగే. అన్నింటిలోనూ ఎంతో కొంత హాస్యం లేకుండ రాయడం నా వల్ల కాని పని కొందరి లాగా. ఏదైనా రాయాలనుకుంటే బుర్ర లోకొచ్చిన దాన్ని కీ బోర్డు మీద టక టక లాడించేస్తా. రాసే దాని మీద విషయ సేకరణ దాదాపు శూన్యం. చెప్పుకుంటూ బోతే చాట భారతం అవుతుంది.

ఇక ఇప్పటి వరకు నాకు బాగా నచ్చినవాటి మీద నా విశ్లేషణ. ఇందులో సొంత డబ్బా సౌండెక్కువ( గులక రాళ్ళు ఎక్కువ కలిపా) వుంటుంది కాబట్టి మీ ఎలక చెవులు జాగ్రత్త. ప్రపంచ కప్ 20/20 జ్వరం చాలా మందికి వుంది కాబటి అదే స్పూర్తి తో టాప్ ట్వెంటీ ఇస్తున్నా “ప్రభుత్వ కప్ ట్వెంటీ/ (ట్వెంటీ – 11)” వచ్చేముందు.


1. మా యవ్వ – 1

మొదటి మురిపెపు బ్లాగు టపా. అసలు బ్లాగులన్నీ ఈ తరహాలోనే రాయాలని మొదలు పెట్టాను. ఇది చిత్తూరు మాండలీకంలో రాయబడింది. భారత దేశంలో ప్రతి యాభై కిలోమీటర్లకి వేష భాషల్లో, తినే తిండిలో ఎంతో తేడా వుంటుంది. అలాగే ఇందులో కూడా. గట్టిగా నలభై కిలోమీటర్లు లేని మా యవ్వ వాళ్ళ ఊరికి మా ఊరికి భాషలో తేడా వుంటుంది. మొదటిది కదా అన్నీ సవ్యంగా కుదరక పోయినా బాగానే రాశానన్న తృప్తి మిగిలింది.

* * * * న్నర చుక్కలు.


2. నా భాషా పరిజ్ఞానం

ఇది రాసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా రాసేశా. రాసినప్పుడు మెదడు తరంగాలు బీటా దశలో వుంటే మళ్ళీ చదివిన తరువాత నవ్వుల్తో గామా దశకు చేరింది. బహుశా ఇదే నేను బాగా రాయగలననే నమ్మకాన్ని ఇచ్చిందేమో.

* * * * * చుక్కలు


3. వీసా వచ్చె పాస్పోర్ట్ పోయె

పైది ప్రేరేపించిన ఆలోచనోత్సాహంతో దీన్ని కూడా రాశాను. ఇది సరదా సంఘటనలను గుర్తుకు తెచ్చుకొని రాసిన టపా. బెంగుళూరు మహా నగరంలో ఒకే రోజులో పాస్పోర్ట్ ఎలా సంపాదించాలో చెప్పే టెక్నిఖ్ఖులు వున్న టపా. మధ్యలో కన్నడ కస్తూరి కూడ కొంత దొర్లుతుంది.

* * * న్నర చుక్కలు


4. కాకి పిల్ల కాకికి ముద్దు

ఇండీ బ్లాగర్స్ వాళ్ళు ఉత్తమ బ్లాగుల అవార్డు ఇస్తున్నారంటే నా బ్లాగును చక్క గా అలంకరించి పెట్టి ‘బెస్టు డిజైన్ బ్లాగు ‘ అవార్డుకు ప్రతిపాదించి ఓట్లెయ్యమని అభ్యర్థిస్తూ రాసిన టపా.

* * * చుక్కలు


5. కలిసుందాం లేకుంటే నోరు మూసుకుందాం

వజ్రోత్సవాలు చూసిన తరువాత కలిగిన జుగుప్సతో రాసింది. వంద సంవత్సరాల తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకునే సంబరాలు ఎలా వుంటాయో తెలియ చెప్పడానికి అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ఎలా వుంటుందో ఊహించి ఫాంటసీ గా రాసినది. చివరలో నున్న అద్భుతమైన క్లైమాక్స్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది.


* * * * * చుక్కలు


6. బ్లాగు వాగుడు

బ్లాగులను క్రెకెటర్లతో పోలుస్తూ రాసిన టపా. అప్పటికి ప్రపంచ కప్ సమ్మెట పోట్లేమీ లేవు. బాగా హిట్టయిన టపా. వెరైటీల ప్రయత్నంలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన టపా. వ్యాఖ్యానాలు కూడ క్రెకెటర్ల లాగానే వున్నాయి.

* * * * * చుక్కలు


7. ఏకవీర

ఇండీ బ్లాగర్ల ఉత్తమ డిజైన్ బ్లాగుల పోటీలో వున్నాననుకుంటే దాన్ని తీసుకెళ్ళి ఉత్తమ తెలుగు బ్లాగుల పోటీలో వేశారు. అది చూసి చిర్రెత్తుకొచ్చి రాసిన టపా. ఇందులో ప్రత్యేకత ఏంటంటే నేను ఓటు వెయ్యకున్నా నాకు ఎవరో ఒక ఓటు వేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాసిన టపా.

* * * * చుక్కలు.


8. బ్లాగు అవిడియాలు

రాసిన తరువాత నేనేనా ఇది రాసింది అని అనిపించింది. బ్లాగడానికి విషయం అఖ్ఖర్లేదు కూడలుంటే చాలు అని చెబుతుంది. నేను చదివినప్పుడల్ల కిత కిత పెట్టే టపా.

* * * * * చుక్కలు


9. నా ఏడో తరగతి మొట్టి కాయలు

అందరికీ హిందీ వస్తుంది నా ఒక్కడికే రాదు. ఎందుకు రాదో ఎలా రాలేదో చెబుతూ స్కూల్లో అన్ని చోట్లా సెభాషనిపించుకుంటున్నా హింది లో మటాషనిపించుకొని మా క్లాసు అమ్మాయి చేతిలో మొట్టి కాయలు తిన్న వైనం. గిలి గింతలు పెట్టే సన్నివేశాలతో హాస్యంగా రాసిన టపా.

* * * * * చుక్కలు


10. బ్లాగు ప్రస్థానం

పొద్దు లో “ ఈ నెల అతిధి” శీర్షిక కోసం రాసిన వ్యాసం. నేను బ్లాగుల్లోకి ఎలా వచ్చానో చెబుతూ నా ప్రస్థానాన్ని చెప్పుకున్న బ్లాగాత్మ కథ.

* * * * చుక్కలు


11. భక్తులమొర ఆలకిస్తాను గానీ

డబ్బు, అధికారం, ఇమేజ్ వుంటే మన దేశంలో దేన్నయినా సాధించ వచ్చు అంటూ సెటైరికల్ గా తిరుపతిలో జరుగుతున్న తంతు రాసిన వైనం.


* * * చుక్కలు



12. అదృష్టం ఎన్ని సార్లు తలుపు కొడుతుంది

నాకు బాగా నచ్చి నేను ఎంతో కష్టపడి రాసిన టపా. బహుశా ఇది ఫ్లాపేమో నని అనుమానం. అమెరికా ట్రాఫిక్ టికెట్ల అగచాట్లు చెప్పుకుంటూ నా గోడు వెళ్ళబోసుకుంటూ..

* * * * * చుక్కలు


13. సీనుగాడి ఇండియా ప్రయాణం

నెహ్రూ లాగా పంచ వర్ష ప్రణాలికతో మొదలు పెట్టింది ఇది. అమెరికాలో వుంటున్న సీనుగాడు ఇండియా వెళ్ళే టప్పుడు ఎదుర్కునే అనుభవాలు ఇందులో వున్నాయి. ఇది ప్రవాసభారతీయులందరికి ఎదురయ్యే పరిస్థితులే. ఇప్పటికి మూడు భాగాలు పూర్తయ్యాయి. మూడో భాగం తన్నిందేమో అనే ఉద్ధేశ్యంతో రైలింజెన్ ఆఫ్ చేసి దండకా రణ్యంలోకి వెళ్ళి పోయా.

* * * * * చుక్కలు


14. సినిమా నటుల బ్లాగులు

ఇదొక ఇన్‌స్టంట్ టపా. సినిమా వాళ్ళు బ్లాగులు రాస్తే ఎలా వుంటాయో చెపుతుంది. తక్కువ ఖర్చు ఎక్కువ రాబడి.

* * * * చుక్కలు


15. కామెంటు అవిడియాలు

బ్లాగుల మీద బ్లాగేసిన ఇంకో టపా. ఉబుసు పోక లో నంబర్ వన్. తెనాలి రామలింగడు, బీర్బలూ ఆవహించినప్పుడల్లా ఇలాంటివి పుట్టుకొస్తాయి.

* * * * చుక్కలు



16. ఆనంద రావ్ అనుభవాలు

కార్టూనిస్టు మల్లిక్ చే కార్టూన్ గీయించుకునే అదృష్టం కలిగిన టపా. అమెరికాలో తెలుగు సంఘాల ఉత్సవాలు ఎలా వుంటాయో చెప్పే సెటైర్. ఇది తెలుగు వన్ వారిచే అమెరికాలో నడపబడుతున్న తెలుగు టైమ్స్ లో వచ్చింది.

* * * * చుక్కలు



17. అబ్బో వాషింగ్టన్

వాషింటన్ రోడ్ల తీరు తెన్నుల గురించి రాసింది. నాకు నచ్చి ఇతరులకు అంతగా నచ్చని మరో టపా.


* * * * * చుక్కలు


18. ఆపరేషన్ కుర్రో కుర్రు

“ఇవాళ నిన్ను కడిగేస్తా “ డైలాగు అందరికీ గుర్తుండే వుంటుంది. దాని మీద వేసిన సెటైర్. మీ ఫోనుకొచ్చేమర్కెతింగ్ కాల్స్ తప్పించుకోవాలంటే ఈ టపా తప్పక చదివి తీరాలి.

* * * * * చుక్కలు


19. ఈ రోజు ఆంధ్ర రాజీవ జీవి దినచర్య

నేను రెండు నిముషాల్లో రాసిన టపా ఏదైనా వుంటే అదే ఇది. రెండు నిముషాల శ్రమ ను రెండు వారాలు ఆస్వదించాను.

* * * * * చుక్కలు


20. వందవ టపా — భ్లాగోళ జంభ

తెలుగు బ్లాగుల సంఘం వాళ్ళు ఒక ఉత్సవాన్ని జరుపుకుని దానికి అతిథులు గా వై.ఎస్.ను చంద్ర బాబు ను పిలిస్తే ఎలా వుంటుందో చెప్పే సరదా మిమిక్రీ వీడియో. మొదట్లో అపరిచితుడు గెటప్ తరువాత ఎల్.బి.శ్రీరాం అదనపు ఆకర్షణలు. ఇరవై నాలుగ్గంటలు కూడా దాటకుండా 330 పేజ్ లోడ్లు దాటిన టపా కూడా ఇదే( బ్లాగర్లు/బ్లాగుచదువర్లు పెరిగారు).


ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే రెండు రోజులకే డబ్బాలు డిస్ట్రిబ్యూటర్ ఇంటికి వచ్చినట్లు అయిన టపా. ఎంతో సంతృప్తి గా చేసిన టపా. దాదాపు ఓ పది మందికి చూపించి అయిదు మంది అదిరింది(?) అంటే తీసుకొచ్చి బ్లాగులో పెట్టా. రాకేశ్వరుడు అప్పుడెప్పుడో చెప్పిన ‘ పది ఉపాయాలు .. ‘ కు ఖచ్చితంగా నప్పుతుంది. కష్టం నూరు పాళ్ళు. ఫలితం రెండు పాళ్ళు కు ఇదే ఉదాహరణ.(ఇది పూర్తిగా నాకు దురద పుట్టి చేసింది మరి) ఉపోధ్ఘాతం ఎక్కువై (తరువాత పీకేశా) వీడియో కూడా ఎక్కువై జనాలను ఇబ్బంది పెట్టింది. సాఫ్టువేర్ ఇబ్బందుల వల్ల ఆడియో మిక్సింగ్ అనుకున్నట్లుగా పూర్తి చెయ్యక పోవడం పెద్ద తప్పు. మొదటి వీడియో నే అలా క్లోనింగ్ చేసి బ్లాగు ఆత్మతో మాట్లాడుతున్నట్టు తియ్యడం రానారె చెప్పినట్లు ధైర్యమైన పనే. ఫెడేల్ ఫెడేల్మని లెంప కాయలు బాగా వేసిన టపా. ఇది చేసిన మేలు ఏంటంటే ఇలాంటివి మరిన్ని చెయ్యాలనె కసిని పెంచడం.

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అన్న పాటలో …..అనుభవమ్ము వచ్చు అనే చరణాన్ని పదే పదే గుర్తు చేసిన టపా.

* * * * * చుక్కలు



అన్నీ రాసే సరికి నాకు 99 చుక్కలు కనిపించాయి. కొలీగ్ తో కేఫిటేరియా కెళ్ళి బాసును కొంత సేపు తిట్టుకుంటే కానీ మనసు ప్రశాంతంగుండదు.


తరువాతి టపా : ప్రభుత్వ కప్ ట్వెంటీ/(ట్వెంటీ-11)
.

5 comments:

Daamu said...

విహారి..


ఛాలా బాగుంది అండి మీ టపా.

అర్ర్ర్రె.. అసలు మన పిలగోడు.. ఏంధి కలకడ ఎర్రకోట పల్లి పిలగోడు టపా బలె రాస్తా ఉండాడె అని చూసిన.. భలే రాసినావబ్బ..

నాది కూదా పీలేరే. చాన రొజులుకి మన యాస చూసి నాకు ఎంధొ ఎంధొ అయ్యింధి అనుకొ అసలు..


ఇప్పటికి ఇంతె .. ఇంగా సానా కమెంట్స్ ఇస్త లెయ్.. ఇప్పుడె గదా నీ బ్లోగ్ సదవదం మొదలు పెట్టింది ఇంగా కొన్ని సదివి అఫ్ఫుడు రాస్తా.. ఉంటా నబ్బ...

విహారి(KBL) said...

వందవ టపా ఎప్పుడు వేసారు నేను చూడనేలేదు.
మీరు ఇలాగే మరిన్ని టపాలు రాసి మమ్మలని అలరించాలి.

netizen నెటిజన్ said...

మీ టాప్ ట్వంటీ చదివినతరువాత వాఖ్యా వస్తుంది!

Anonymous said...

@ దామోదర్ గారు,

నెనర్లు.

మీది పీలేరా. మా ఊరికి దగ్గరే. తొందరగా బ్లాగు ప్రారంభించి మీ విశేషాలు చెప్పండి.

@ విహారి గారు,

ఈ మధ్య అందరి పరిస్థితి అలానే వుంది. తొందరగా వందవ టపా (ఓపిగ్గా) చూసి మీ భ్ప్రాయం చెప్పండి.

@ నెట్టిజెన్ గారు,

చూద్దాం ఎంత మంది చెబుతారో.

-- విహారి

Unknown said...

అద్భుతం. అచ్చమైన చిత్తూరు యాస లాగ ఉంది.
I love my accent.