Friday, April 04, 2008

భూ తో మొదలయ్యే పదాలు...

:::::::::


మనబడి రెండు త్రైమాసికాలు పూర్తయ్యాయి. మూడో త్రైమాసికం మొదలయ్యే రోజు గతం లో జరిగిన పాఠ్యాంశాలు పిల్లలు గుర్తు పెట్టుకున్నారో లేదో చూద్దామని ప్రశ్నలు వెయ్యడం మొదలు పెట్టా. అడిగిన వాటిలో చాలా మటుకు ఠకీ ఠకీ మని చెప్పేశారు. ఇక చివరగా కొన్ని అక్షరాలు చెబుతూ ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు చెప్పమన్నాను. ఒక్కో దానికి తమకు గుర్తున్న వన్నీ చెప్పేశారు. ఇన్ని అడిగాం కదాం నా పేరు గుర్తు పెట్టుకున్నారో లేదోనని ఓ అక్షరం చెప్పా.

"భూ తో మొదలయ్యే పదాలు చెప్పండి"

మొదటగా చెయ్యెత్తింది మా బుడ్డోడు. ఇక వెంటనే ఇంకో అయిదు చేతులు పైకి లేచాయి " నేను చెబుతా..నేను చెబుతా.." అని.మా బుడ్డోడు ఏమి చెబుతాడో నాకు తెలుసు. అనుమానం లేదు ఖచ్చితంగా వాడు నా పేరే (భూపతి విహారి) చెబుతాడు అనే నమ్మకంతో వాడి నడక్కుండా మిగతా అందర్ని అడిగా.

ఒక్కొకళ్ళు భూమి, భూదేవి, బూంది (శబ్దం అదేగా)..... అని చెప్పేశారు. చివరగా మా బుడ్డోడి నడిగా.

"భూమిక.." ఎగిరి గంతేసి చెప్పాడు.

చుక్కలు నా కళ్ళ ముందు ఎగురుకుంటూ కనిపించాయి. క్లాసయిన తరువాత వళ్ళో కూచోబెట్టుకుని
"చిట్టి కన్నలూ!!! నువ్వు నా పేరెందుకు చెప్పలేదురా?"
"కావాలనే చెప్పలేదు"
"నీ కావలనే దొంగ లెత్తుకెళ్ళా. నీకు భూమిక ఎలా తెలుసురా దొంగ భధవా (భడవ+వెధవ)? ఆవిడ నెక్కడ చూశావ్"
"టి.వి. లో వచ్చిన మిస్సమ్మ సినిమా లో చూశా"
"!!!"

మా టీవికీ జై

:::::::::

8 comments:

రాఘవ said...

హహ్హహ్హ... :D బావుంది

కొత్త పాళీ said...

తండ్రిని మించిన తనయుడు లేదా నీవు నేర్పిన విద్యయే .. అనే సినిమా .. టట్టాడై .. హాస్య డవిలాగులా బేహా్రి, భూపతి విహారి డైరెక్ష్న్‌లో .. హీరో .. పెద్ద బుడ్డోడు .. హీరోయిన్‌ .. ఎవరో మీకే తెల్సు!

రానారె said...

ఇంకేం ఫరవాలేదు. భూమిక వంటబట్టిందంటే మీవాడి తెలుగుభాషా జ్ఞానానికి మంచి భూమిక ఏర్పాటయిందన్నమాటే! :))

విహారి(KBL) said...

మీకు ఉగాది శుభాకాంక్షలు

seenu said...

రూపాయి తో డాలర్ విలువ తగ్గినట్లు రాన్రాను మీ బ్లాగు సైజు తగ్గడం కొంచెం బాధగా వుంది.ఎనీ వే బ్లాగర్లందరికీ ఉగాది శుభాకాంక్షలు.

phani said...

"భధవా" ప్రయోగం అద్భుతం.అందరికీ "సర్వధారి"నామ సంవత్సర శుభాకాంక్షలు.

Unknown said...

మీ బుడ్డోడు చెప్పింది ఒక "చుక్క" పేరే కదండీ? మీకు ఏయే చుక్కలు కనిపించారేమిటి? ;-)

Anonymous said...

అందరికీ నెనర్లు

-- విహారి