Wednesday, April 23, 2008

ఐయాం నాటే లెజెండ్

:::::::::


ఇది చిరంజీవి ఇచ్చిన స్టేట్ మెంట్ కాదు. బాలకృష్ణ ఇచ్చింది అంతకన్నా కాదు. మరీ ముదురుగా మోహన్ బాబేమో అని అనుమానమొస్తే టైడ్ తో ఓ సారి, వై.ఎస్. నోటితో ఓ సారి బుర్రని కడిగి తళ తళ లాడిన తరువాత మళ్ళీ నెత్తి మీద బొర్లించుకోవాలి. ఇది నాకై నేను అయిదారు టి.వి. కెమెరాల ముందు ప్రాక్టీసు చేసి ఇచ్చిన స్టేట్ మెంట్.

ఐయాం నాటే లెజెండ్ అనగానే తెలుగు సినిమాల కన్నా హాలీ వుడ్ సినిమాలే బావుంటాయనే వాళ్ళకు టక్కున గుర్తుకు వచ్చేది "ఐ యాం లెజెండ్" సినిమా. ఆ సినిమా లో ప్రపంచం లో వున్న ఓ ఆరు బిలియెన్ల మందికి ఓ దిక్కుమాలిన వైరస్ వస్తుంది. అది సోకిన వాళ్ళు, ఎండ మీద పడితే ఎండ్రిన్ తాగినోళ్ళలా గిల గిలా తన్నుకుని పైకెళ్ళి పోతారు. అందువల్ల వాళ్ళు రాత్రిళ్ళు మాత్రం సంచరిస్తుంటారు. మన హీరో విల్ స్మిత్ను మాత్రం వైరస్ ఏమీ చెయ్యదు. అదెలా అంటే నాకు తెలీదు. నేను హాలీ వుడ్ సినిమాలు భాషా మాదిరి ఒక్క సారే చూస్తా. అర్థం చేసుకోడానికి ప్రయత్నించను. స్మిత్తే మో ఎంచక్కా న్యూ యార్క్ లో వాల్ స్ట్రీట్ మధ్యలో పగటి పూట సల్మాన్ ఖాన్ లెవల్లో జింకలు వేటాడుకుంటూ, బాంబర్ల మీద గోల్ఫ్ ఆడుకుంటూ సమయం గడిపేస్తుంటాడు. అప్పుడప్పుడూ రీసెర్చ్ కూడా చేస్తుంటాడు. ఆయన గారికో "రాము" అనే కుక్క తోడుంటుంది కాస్టవే సినిమాలో టామ్‌ హ్యాంక్సుకు ఫుట్ బాల్ తోడున్నట్లు. సాయంత్రం ఆరవగానే "కుయ్యోవ్…కుయ్యోవ్" అంటుంది. ఏంటి కుక్కను కున్నారా? కుక్కను కుంటే తెలుగు ప్రేక్షకుడు, గడియారం అనుకుంటే హాలీవుడ్ ప్రేక్షకుడు. అంటే ఆ టైమొచ్చిందంటే ఎక్కడున్నా చెడ్డీ ఎగ్గట్టుకొని ఇంటికెళ్ళి పోవాల్సిందే. లేక పోతే వైరస్ వచ్చిన వాళ్ళు బయటికొచ్చి .. ఆఁ బయటికొచ్చి ...... ఏమవు తుంది? ఫ్యాక్షన్ సినిమాల్లో సుమోలు ఏమవుతాయి? కొన్ని సినిమాల్లో పదడుగులు ఎగురుతాయి, ఇంకొన్ని సినిమాల్లో ఇరవై అడుగులు ఎగురుతాయి. ఇదీ అంతే. ఇక్కడ తొడ గొడతారు. అక్కడ వైరసు లూ, గ్యాస్ లీకులు జరుగుతాయి. స్క్రీన్ మీద సేం టూ సేం. భీభత్సం.


ఈ సినిమాలో 'రాము'కూడా చివర్లో యజమాని కోసం ప్రాణ త్యాగం చేస్తుంది. ఓనరు స్మిత్ కూడా అప్పుడు గట్టిగా కావిళించుకుని "రాము..రాము.. " అని ఓ పది కన్నీటి భొట్లు కారుస్తాడు. అసందర్భంగా ఒక విషయం. మన భారత్ లోని సినిమాలలో ఓ సలీం భాయ్ నో, ఓ ఫాదర్ పీటర్ నో స్నేహానికి గుర్తుగా, త్యాగానికి సింబల్ గా విలన్ చేతుల్లో గాయ పడి జై హింద్ అని పైకెళ్ళి పోతాడు. ఆలాగే హాలీ వుడ్ సినిమాల్లో కూడా ఓ మెక్సికన్ బ్రదర్ నో, ఆఫ్రికన్ బ్రో నో త్యాగానికి గుర్తుగా చూపించేస్తుంటారు. ఈ సినిమాలో ఆఫ్రికనాయన హీరో కాబట్టి వేరే త్యాగాలేమీ వుండవ్.

హెడ్డింగేంటి? ఈ లెజెండేంటి? అని మీకు అస్సలు అనుమానం రాలేదనే విషయం బాగా అర్థమై పోయింది (ఇంకా చదువుతున్నారంటే). ఇప్పుడు చెబుతోంది నేను సినిమా గురించి కాదు. గడియారము, వైరస్ గురించి మాత్రమే. సినిమాలో సాయంత్రం ఆరు గంటలకు విల్ స్మిత్ ఇంటికెళితే నేను (మేము) మాత్రం ఇంట్లోనే ఆరు గంటల కోసారి మందులేసుకుని, ఆరు సెకండ్ల కోసారి ముక్కు చీదుకుంటూ కాలం గడిపేశాం. మరి ఈ లెజెండు గొడవేంటి? ఇంట్లో అందరికీ వైరస్ వచ్చి ముక్కుతూ మూలుగుతూ వుంటే నేను మాత్రం కొన్ని రోజులు "ఐ యాం లెజెండ్" అని విర్ర వీగా.ఓ ఫైను మార్నింగు ఆ వైరస్ కాస్తా నా వొంట్లోకి రాగానే "ఐ యాం నాటే లెజెండ్" అని డిక్లేర్ చేశా. అదీ హెడ్డింగులోని సారాంశం.

అలా ఫ్లూ వైరస్ సోకిన తరువాత జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలు యధాతథంగా మీముందు..

:::::::::


జీవితం మన్మొహన్ సింగు లాగా నడుస్తోంది నా ప్రమేయమేమీ లేకుండా. దగ్గు మందులూ, తుమ్ము మందులూ, జ్వరం మందులూ అని పేర్లు రాసుకోని నాలుగు బీరువాలు కొనుక్కోని ఒక్కో బీరువాకు ఒక్కొక్కరి పేరు రాసుకొని అవసరమైనప్పుడల్లా బీరువా తలుపులు తీసి సీసా మూతలు ఓపన్ చేసి ఒకరికి ఒక మూత, ఇంకొకరికి అర మూత, ఇంకొకరికి కాల (పావు) మూత పోసి మందులు తాగుతూ ఆనందంగా గడిపేస్తున్న రోజులవి.

"దగ్గేరా అన్నిటికి మూలం..." అని నే పాడితే

"చిట్టి చిలకమ్మా! దగ్గు వచ్చిందా...ఎక్కడికొచ్చింది ? నా గొంతులోకొచ్చింది..." అని చిన్నోడు కోరస్ ఇచ్చేవాడు. అదేంది నువ్వు దగ్గట్లేదు అని మా ఆవిడనడగటమాలస్యం.

"దగ్గమని నన్నడగ వలెనా పరవశించి దగ్గనా.." అని మా ఆవిడ.

"రబ్బరు దగ్గులు.. రబ్బరు దగ్గులు తెచ్చానే...రిబ్బను దగ్గులు..రిబ్బను దగ్గులు తెచ్చానే..నువ్వంటే దగ్గి..దగ్గి చస్తానే..." అని ఇంకో బుడ్డోడు. ఇప్పుడు వీడు లేటెస్ట్ గా యమ దొంగ ఫ్యాను కూడా.

అలా దగ్గుల పాట ఫ్యామిలీ సాంగు గా ఫిక్సయిపోతుందేమో అని భయపడున్న రోజులు. రమ్యమైన రెండవ రోజు, ముచ్చటైన మూడో రోజూ, నాణ్యమైన నాలగవ రోజు అయిపోగానే అందమైన అయిదో రోజు ఇంట్లో ఫోను "ట్రింగు.. ట్రింగు.." మంది "ఖళ్ళు.. ఖళ్ళు.." శబ్దాల్ని చేదిస్తూ.

"హలో మిస్టర్ దోని!!! థ్యాంక్స్ ఫార్ యూసింగ్ అవర్ క్లీనెక్స్ ప్రాడక్ట్స్.(కిసుక్...) ట్రూ యువర్ గార్బేజ్ డిస్పొసల్ వ్యాన్ వుయ్ కేం టూ నో దట్ యువర్ గార్బేజ్ బిన్ టోటలీ ఫిల్లెడ్ విద్ అవర్ క్లీనెక్స్ ప్రాడక్ట్స్. వుయ్ ఈవన్ డిడ్ అ సీక్రెట్ సర్వే. ఆల్ యువర్ నోసెస్ ఆర్ రెడ్డిష్ లైక్ ఆపిల్ (కిసుక్...) పర్టిక్యులర్లి యువర్ బుడ్డోడి ముక్కు (కిసుక్...) డూ యూ నీడ్ ఎనీ మోర్ బాక్సస్.. కిసుక్.." అన్నది ఒక మగ గొంతు.

"నో థ్యాంక్స్. కిసుక్.. వుయ్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్టాక్ అండ్ వుయ్ హ్యావ్ కాస్ట్కో స్టోర్స్ నియర్ బై. కిసుక్.." అన్నా.

"సార్ యాక్చువల్లీ అవర్ సి.ఈ.ఓ. వాంటెడ్ టూ మీట్ యూ పెర్సనల్లీ. బట్ అన్‌ఫార్చునేట్లీ హీ హ్యాస్ టూ గో టూ ఒలింపిక్ టార్చ్ రన్. వుయ్ ఆర్ గివింగ్ స్పెషల్ డిస్కౌంట్స్ ఫార్ యూ, 10% ఫార్ బీయింగ్ యాన్‌ఇండియెన్ ఇన్ అమెరిక అండ్ 10% ఫార్ టెలుగు పర్సన్ అండ్ 5% ఫార్ చౌడేపల్లి పర్సన్"

అదేంటో ఆశ్చర్యంగా మొదటి సారిగా ఒక తెలుగు వాడు ఇంగ్లీషు మాట్లాడినా ఇంకో సారి రిపీట్ చెయ్యమనకుండా అర్థమయిపోయి వెంటనే తిరుగు సమాధాన మొచ్చింది. ఈ మధ్య ఒక గుడి కూడా లేని ఊళ్ళో పోటా పోటీగా రెండు గుళ్ళొస్తున్నా ఏ గుడి కెళితే ఏమి దొబ్బులో అని దేనికి కూడా వెళ్ళలేదు. కాబట్టి దేవుడు తన హస్తం తిప్పి కొత్త వరాలిచ్చే చాన్సు లేదు. ఎక్కడో ఏదో మతలబుంది.

"నో...నా కొద్దు."

"సార్ అలా అనకండి సార్.."

"నాకొద్దన్నాను కదా"

"అలా అంటే ఎలా సార్? ఒక్క మగాడు,జై చిరంజీవ లాంటి సినిమాలు చూడని వాడిలాగా అంత కఠినంగా మాట్లాడ కూడదు సార్. కాస్త పెద్ద మనసు తో కనికరించండి"

...... అరే తెలుగు లో మాట్లాడుతున్నాడు.....

"తెలుగొచ్చా.."

"అవును సార్..అమెరికా ఎకానమీ బాగ దొబ్బింది కదా. ఈ మధ్య అన్నీ ఇండియాకు అవుట్ సోర్సు చెయ్యడమే కాకుండా అమ్మకాల్ని పెంచుకోడానికి కస్టమర్ ప్రోఫైల్ చూసి ఏ భాష మాట్లాడితే బుట్ట లో పడి పోతాడో ఆ భాష వాడిని ఇందుకు పురమాయిస్తున్నారు. తొందర్లో బ్లాగులోళ్ళను బుట్టలో వేసుకోడానికి కూడలి ట్రైనింగు కూడా పెట్టబోతున్నారు సార్ "

"బాత్ రూం లో వుంటే కిటికీ తలుపులు తెరిచి 'ఐడియా' అనేదానికన్నా ఇదేదో బానే వుందే..సరే నువ్వు నాకు నచ్చినట్లు మాట్లాడ తావా?"

"అవును సార్.."

"మీదే వూరు?"

"... సార్"

"మాదే ఊరు..?"

"చౌడే పల్లి సార్. అందుకే మీకు అయిదు శాతం అదనపు తగ్గింపు"

"అదే? ఎందుకలా.."

"మీ ఊరోళ్ళు సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా నలుగురితో పంచుకుంటారట కదా. అలాగే మీకొచ్చిన రోగాన్ని ఇంకో పది మందికి పంచితే మా వ్యాపారం బావుంటాది కద్సార్. అందుకనే మీరు మా ప్రిఫర్డ్ కస్టమర్."

"బానే వుంది కానీ నువ్వు మా వూరి యాస లో మాట్లాడితే ఆర్డర్ ప్లేస్ చేస్తా.."

......గీక్…గీక్….గీక్….గీక్....

"ఏంటీడు ఫోను పెట్టేసి నట్టున్నాడు. మరదే నా తో పెట్టుకుంటే ఇలానే వుంటుంది. "

:::::::::


అన్ని అనారోగ్య సెలవులు అయిపోయాయి ఇక నువ్వు ఆఫీసు కొచ్చి ఏడువు అన్నారు ఆఫీసు వాళ్ళు.

ఏలాగోలా గుండెను(ఊపిరి తిత్తులు అని చదువు కోవాలి) చిక్కబట్టుకొని ఆఫీసుకొచ్చా ఖళ్ళు ..ఖళ్ళు .. మని దగ్గుకుంటూ. బ్యాడ్జి స్కాన్ చెయ్య గానే సెక్యూరిటీ వాడు కెవ్వు మని కేకేసి పానిక్ బటన్ నొక్కబోయి తమాయించుకుని ఇది తెలిసిన ఫేసే అని వంటికున్న బ్లూ కోటు మొహాని కేసుకొని దూరంగా జరిగి 'హాయ్' అన్నాడు. టెన్సింగ్ నార్వే కాంచనజంగా చివరి కాలు (లాస్టు లెగ్గు) కష్టపడి ఎక్కినట్లు ఒక్కో మెట్టుకో దగ్గును దానం చేసి మెట్లు ఎక్కేసి వస్తుంటే ఫ్లోర్ మొత్తం కుర్చీలు జరుపుకుని ఒక వైపు కు వెళ్ళి పోయారు. ఏమంటే 'మాకందరికి ఇక్కడే సుఖంగా వుంటుంది ఇంకో రెండు వారాలు' అన్నారు. వీళ్ళ సుఖానికి సుఖ వ్యాధులు వచ్చి తగలబడి పోనూ అని ఒక్కడే కుర్చీలో కూలబడి పని చేసుకున్నా.

సద్ది పెట్టె లోనుండి తీసిన అన్నం వేడి చేసుకొద్దామని క్యాంటీనుకు వెళితే అక్కడున్న వాళ్ళు కొత్తగా కట్టిన బ్రిడ్జి కూలిపోతున్నట్టు హాహా కారాలు చేసుకుంటూ దారిచ్చేశారు నెత్తిన తట్టలో పిల్లంగట్టె ఓనరును పెట్టుకుని యమునా నదిని దాటుతున్న వసుదేవుడికి దారిచ్చినట్టు. (హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు టెన్ కమాండ్మెంట్స్ సినిమాలో క్లైమాక్స్ లో మోసస్ ఎర్ర సముద్రం దాటే సీను గుర్తుకు తెచ్చు కోవాలని హింటు). ఇక మీటింగుల్లో అయితే రైల్వే ఎంక్వయిరీ లో అడినట్లు కొచ్చెన్లు వేసే వాళ్ళు. నేనేమో కౌంటర్ లో కూచున్న ఎంక్వైరీ ఆఫీసర్ లా పది ప్రశ్నలకు ఒక సమాధానం చెప్పే వాడిని. అలా నాఖ్యాతి ఈ నోటా ఆ నోట బడి ఖండాంతరాలకు వ్యాపించింది.

చాలా మంది డబ్బు యావ తో కె.సి.ఆర్. కూలి పనితో అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకుందామని వేరే చానల్సు చూస్తునప్పుడు "టి.వి. తొంభై తొమ్మిది సార్లు" లో వచ్చిన నా ఇంటర్వూ యధా తథంగా.

న్యూస్ రీడర్ న్యూటన్ రమేష్ : అమెరికాను కుదిపివేస్తున్న మహమ్మారి ఫ్లూ వైరస్.ట్రింగ్..ట్రింగ్..బుడక్..బుడక్.. ఈ వ్యాధి బారిన ఎన్నో అమెరికన్ల కుటుంబాలే కాకుండా మన ప్రవాసాంధ్రులు కూడా దీని బారిన బడ్డారు. దీని రుచి మరిగి తమ జేబుకు చిల్లు వేసుకోవడమే కాకుండా క్రెడిట్ కార్డుకు పెద్ద పెద్ద రంధ్రాలు వేసు కుంటున్నారని తెలుస్తోంది. దీని గురించి మా "టి.వి. తొంభై తొమ్మిది సార్లు" ప్రత్యేకంగా అందిస్తోన్న ప్రత్యేక కథనం. దీని కోసం ప్రత్యేకంగా మా రిపోర్టర్ రియాజ్ మరియూ ప్రత్యేక కెమరా తో కెమరామెన్ కరీం అమెరికా నుండి అందిస్తున్న సంచలన కథనం. హలో! రియాజ్! మీరు అక్కడ మన ప్రవాసాంధ్రుని ఇంట్లోనే వున్నారా? అక్కడ మీరు గమనించిన విశేషాలేంటి చెప్పండి. రియాజ్? రియాజ్??? ఏదో సాంకేతిక లోపం అనుకుంటా. హలో కెమరామెన్ కరీం మీరు ఇప్పుడు మీ కెమరాని మన ప్రవాసాంధ్రుని ఇంట్లోకి జూం చేసి చూపించగలరా? వీలయితే వారు ముక్కు చీది పడేసిన న్యాప్కిన్లు, వాడేసిన టాబ్లేట్ కవర్లు, తాగేసిన టానిక్ బాటిళ్ళూ లాంటి వాటి మీద ఫోకస్ చేసి చూపించండి. ఇంకా వీలయితే ఎవరి మొఖమయినా వాడి పోయుంటే వారి ముఖాన్ని మరింత దీనంగా చూపించండి. ఆ దృశ్యాలను కళ తప్పించడానికి మళ్ళీ మన గ్రాఫిక్స్ టీముకు పని కల్పించకండి.

ఫోనులొ: హలో..న్యూస్ రీడర్ న్యూటన్‌ రమేష్?...న్యూస్ రీడర్ న్యూటన్‌ రమేష్?

న్యూస్ రీడర్: హలో? ఇది బ్యాకప్ భజ గోవిందం గొంతు లాగుందే?

భజ గోవిందం: అవును నేను బ్యాకప్ భజ గోవిందన్నే.

న్యూస్ రీడర్: అదేమిటి మీరు వాళ్ళకు బ్యాకప్ గా వుండాలి గానీ మీరే ఫ్రంట్ లైనులో కొచ్చారేమిటి?

భజ గోవిందం: విషయమేంటంటే రమేష్ వాళ్ళు అమెరికాలో దిగ గానే అక్కడి కస్టం ఆఫీసర్ మన వాళ్ళ పాస్ పోర్ట్ మీద తుమ్మాడు రమేష్ . ఆ పాస్ పోర్టును మన వాళ్ళు తుడుచు కోకుండా పాస్ పోర్ట్ తిరిగి ఇచ్చిన ఆనందం లో ముద్దు పెట్టుకున్నారు రమేష్. ఆ దెబ్బకు వాళ్ళక కూడా ఫ్లూ వచ్చి మందులేసుకుంటూ హోటల్ రూములోనే వుండి పోయారు రమెష్ .

న్యూస్ రీడర్: అలాగయితే మన ప్రొడ్యూసర్ కు చెప్పి వాళ్ళ పాస్ పోర్ట్ క్యాన్సిల్ చేయించమని చెబుతాను. మీరు ఇప్పుడు అక్కడే మన ప్రవాసాంధ్రుని ఇంట్లోనే వున్నారా భజ గోవిందం ?

భజ గోవిందం: అవును రమేష్, ఇప్పుడు నేను ఆ ఇంటి యజమానితో మాట్లాడు తున్నాను. మీరందరు కాఫీ తాగకుండా శ్ర్ధ్ధద్ధగా వినండి రమేష్. చూడండి విహారి గారు, మీకు ఇలా ఈ ఫ్లూ వైరస్ రావడానికి కారణమేమనుకుంటున్నారు?

విహారి: ఖళ్...ఖళ్...

భజ గోవిందం: అర్థమయింది మీ మీద ఎవరో తుమ్మడం వల్ల వచ్చింది కదా? ఈ సారి ఫ్లూ షాట్ వేయించుకోలేదా?

విహారి: నేను... ఖళ్...ఖళ్...ఒక సారి..ఖళ్ .. మా డాక్టర్...ఖళ్..

భజ గోవిందం: మీరు ఫ్లూ షాట్ వేయించుకున్నా రావడానికి కారణం ఈ సంవత్సరం ఫ్లూ షాట్ మందులో పవర్ తక్కువ వుండటం వల్ల అని మీ డాక్టర్ చెప్పారు కదా. మీరు దీనికి ఏ మందులు వేసుకుంటున్నారు.

విహారి: ఖళ్...

భజ గోవిందం: మీరు టమీ ఫ్లూ వేసుకుంటారని తెలిసింది. మీ బుడ్డోళ్ళను ఇంటర్వూ చెయ్యొచ్చా?

విహారి: ఖళ్ లాగే.

భజ గోవిందం: చిన్న బుడ్డోళ్ళిద్దరూ కెమరాలు కనిపించగానే బేస్ మెంట్ లోకి పారి పోయారు రమేష్. ఆందువల్ల వాళ్ళను ఇంటర్వూ చెయ్యడానికి కుదర్లేదు. ఇక మీరు ఇతరులకు చెప్పే జాగ్రత్తలు ఏమన్నా వున్నాయా?

విహారి: అవేంటంటే ..ఖళ్..

భజ గోవిందం: రమెష్, ఇప్పుడు ఈయనేం చెబుతున్నారంటే. మన "టి.వి. తొంభై తొమ్మిది సార్లు" మరింత అభివృధ్ధి చెందాలని, నాలాంటి రిపోర్టర్ లు ఎక్కువ మంది వుండాలని, నాలాంటి వాళ్ళు మాత్రమే అంకిత భావంతో పని చేస్తారని, నా రాక ఆయనని ఎంతో ఆనందానికి గురి చేసిందని, భవిష్యత్తులో నా చేతే ఇంటర్వూ చేయించుకోవాలని వుందని అంటున్నారు. చివరిగా న్యూస్ రీడర్ న్యూటన్ రమేష్కు ధన్యవా దాలు తెలుపుతూ బ్యాకప్ భజ గోవిందం ఫ్రం అమెరిక.

న్యూస్ రీడర్: థ్యాంక్యూ బ్యాకప్ భజన గోవిందం,క్షమించాలి భజ గోవిందం! "టి.వి. తొంభై తొమ్మిది సార్లు" ను విష్ చేసిన మన ప్రవాసాంధ్రుడు తొందరగా కోలుకోవాలి కోరుకుంటూ. ఇక "మీ కోసం" రథాన్ని నడిపేప్పుడు టైరు పంక్చరయితే చెయ్యాలి,ఎవర్నన్నా గుద్దేసి బుర్ర లో పుర్రె పగిలిపోతే ఏం చెయ్యాలి లాంటి వాటి గురించి తెలుసుకోడానికి ఫ్రాన్సు నుండి వచ్చిన ట్రైనర్ నుండి మెళకువలు నేర్చుకుంటున్న హరికృష్ణ పై ప్రత్యేక కథనం బ్రేక్ తర్వాత...

:::::::::


అన్నీ సమసి పోయాయి ఇక నేను మామూలు మనిషి నవుతున్నా అని డిక్లేర్ చెయ్యడానికి స్టేట్మెంట్ రాద్దామని పెన్నూ, పేపర్ తీసుకోబోయేంతలో ఊపిరి తిత్తులు చాలా ఉద్వేగానికి లోనయి ఎపిగ్లాటిస్ ను ఉరకలు పెట్టించింది. ఏపిగ్లాటిస్ అనందం పట్టలేక జగదేక వీరుని కథలో ఎన్టీఆర్ లాగా డోలు, మద్దెల, వీణ, ఘటం అన్నీ కలగలిపి "నా దిరి..దిరి..నా దిరి.. దిరి.. దిరి ..దిరి.. దిరి.. దిరి.." అని స్వర పేటికను సాక్షి పత్రిక రామోజీ రావును వాయించినట్లు వాయించింది. అలా పలు రసాయనిక, భౌతిక చర్యలకు లోనై అమ్రీష్ పురి గొంతు, సి.ఎస్.ఆర్. గొంతు రెండూ మిక్సీ లో క్రష్ చేసి వెడల్పాటి బాణలిలో పోసి కో వై సరళ గొంతుతో డ్రెసింగ్ చేసినట్లయింది నా గొంతు. నా గొంతులోనుండి వచ్చిన ఒక సాంపిల్ డైలాగ్ "హేయ్ రాజన్!!! మహా ద్రష్టా కాల్ భైరవా!!! ఓరేయ్ పొట్టి బ్రహ్మం, నీ గ్రుండు పీకేస్తాన్రో!!!"

వైరస్ వచ్చిందని వార్షికోత్సవాలు ఆగవు కదా. ఏ ముద్దూ ముచ్చటా లేని ఆ రోజు వచ్చిందని మేమేడుస్తుంటే ఓ ఫ్రెండు భారత్ నుండి ఐడియా సెల్ ఫోనులో నుండి కాల్ చేశాడు విష్ చేద్దామని. నీ ఐడియా సెల్ ఫోనుకి బిల్లెక్కువొస్తుంది అని నేను బ్రిలియంట్ ఐడియా తో రిలయన్సు నుండి ఫోను చేస్తానని ఫోను పెట్టేసా. ఆ ఫోను పెట్టేసిన వెంటనే గొంతు రీ-రికార్డింగుకు గురయిందని, మిక్సింగులు జరిగాయని అర్థం చేసుకుంటారనుకుంటాను. అర్థం చేసుకోలేకపోతే ఇప్పుడొచ్చిన ప్రమాదమేమీ లేదు గానీ ఇప్పుడు అర్థం చేసుకోమని మనవి.

తీరిక చేసుకుని భారత్ కు ఫోను చేశా.

"హలో.." నేను

"హలో..ఎవరూ?" అవతల భారత్ నుండి.

"హలో.. నేనే"

"హలో కస్తూరీ నువ్వా. ఎలా వున్నావ్. ఎన్నాళ్ళయింది నీ గొంతు విని. అప్పుడెప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కాలేజీ లో నేనిచ్చిన ప్రేమ లేఖకి సమాధానంగా ఇప్పుడు ఫోను చెస్తున్నావా కస్తూరీ...ఇప్పుడు ఫోను చేస్తున్నావా కస్తూరీ..." వాడి గొంతు గద్గదంగా మారిపోయింది.
నా కెందుకో మూగ మనసులు సినిమాలో ఏఎన్నార్ గుర్తు వచ్చాడు.

"ఒరేయ్..ఒరేయ్.."

"అవును కస్తూరి...నువ్వు ప్రేమగా ఒరేయ్ అనే పిలుపు వినే నేను నిన్ను ప్రేమించాను. ఎంతో మంది కాంపిటీషన్ వున్నా ఈ ప్రేమ పిలుపు కోసమే నీ వెంట పడ్డాను. నీకు గుర్తుందా ఆ మహేష్ గాడు నిన్ను బైక్ మీద తీసుకెళ్తానని అన్నా వినకుండా నాతో నా సైకిల్ మీద వెనక క్యారియెర్ మీద కూర్చుని వచ్చిన రోజు? క్యారియర్ స్ప్రింగు ఊడి పోయి నీ పైట అందులో ఇరుక్కుపోయి చిరిగి పోతే ఆ చిరిగిన ధారపు పోగులను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా. మళ్ళీ ఇన్నాళ్ళకు.." అవతల వాడు గుమ్మడి లాగా కళ్ళు తుడుచుకోవటం మొదలు పెట్టాడు.

"నువ్వా ఏడుపు కాస్త ఆపుతావా"

"ఎలా ఆపగలను కస్తూరీ? జయంతి కి కన్నీళ్ళు, ఆర్.నారాయణ్ మూర్తికి ఆవేశం ఆగుతుందా చెప్పు.. కస్తూరీ చెప్పు..కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇప్పుడు నువ్వు నా ప్రేమను అంగీకరిస్తున్నావని మాత్రం చెప్పకు. నేను పాత సినిమాల్లో శోభన్ బాబు లా, కొత్త సినిమాల్లో జగపతి బాబు లా మారే మనిషిని కాదు. నాకు పెళ్ళయి పోయింది. ఇప్పుడు ఇద్దరు కూతుళ్ళు కూడా. నిన్ను నా హృదయం లో మాత్రమే వుంచుకోగలను. ఏ అపార్ట్మెంట్లోనూ వుంచుకోలేను. నీకు రెండు రూపాయిల బియ్యమైతే కొనగలను కానీ. ఏ కూరగాయలూ కొనలేను"

"అలా అనకు ప్రియతమా. కావాలంటే బియ్యం సాంబార్, బియ్యం చట్నీ, బియ్యం పెరుగు, బియ్యం వేపుడు, బియ్యం కుర్మా చేసి పెడతా.."

"నన్ను తీవ్రమైన సంఘర్షణకు లోను చేస్తున్నావ్ కస్తూరి. కావాలంటే అంభికా దర్భార్ అగర్బత్తి పెట్టి మనస్సు లో పూజించుకుంటా?"

"అలాగంటే ఎలాగండీ.. నా జీవితం అడవి కాచిన వెన్నలయిపోతుందే? మిమ్మల్నే నమ్ముకొన్నానే... చా ఆపు ఎదవ నాకొడకా. నువ్వూ నీ ఫ్ల్యాష్ బ్యాకూ. నీకు ఫోనొచ్చింది అమెరికా నుండి. కస్తూరి నుండి కాదు"

"అయ్యో... నువ్వు నా పాత కస్తూరి కాదా.?"

"పాత కస్తూరి కాదు. కలకండా కాదు"

"నువ్వా రా? ఎలా వున్నావ్?"

"ఇదిగో విన్నావు కదా గొంతు. అలా వున్నాను"


:::::::::

21 comments:

Dr.Pen said...

"జీవితం మన్మొహన్ సింగు లాగా నడుస్తోంది నా ప్రమేయమేమీ లేకుండా"-ముసి ముసి నవ్వులు.

"జయంతి కి కన్నీళ్ళు, ఆర్.నారాయణ్ మూర్తికి ఆవేశం ఆగుతుందా చెప్పు.. కస్తూరీ చెప్పు.."-పొట్ట చెక్కలయ్యేలా నవ్వు.

ఏకకాలంలో హాలివుడ్/టాలీవుడ్ సినిమాలను, టి.వి.-9ని, ప్రస్తుత రాజకీయాలను మీ హాస్యపు జల్లులతో తడిపించేశారు.

ఇక ఇప్పటికైనా వైరసోపశమనం జరిగింనుకొంటాను. మా వాడికీ ఆ మధ్య ఓ వారం రోజుల పాటు తగ్గకుండా జ్వరం, జలుబూ...ఇక ఈ వైరస్సులతో వచ్చిన తంటా ఎంటంటే మందులేసుకుంటే వారం రోజులు, వేసుకోకపోతే ఏడు రోజులు! మొత్తానికీ ఏ వైరస్సో తెలియాల్సిందే అని పట్టుబట్టి అన్ని పరీక్షలు చేస్తే చివరికి తేలింది 'ఎప్స్టీన్ బార్ వైరస్' దాని వల్ల వచ్చే జబ్బు 'కిస్సింగ్ డిసీజ్':-) ఇక చికిత్స అంటారా అప్పుడే చెప్పాగా "మం.వే.వా/మం.వే.ఏ" విష్యూ ఎ స్పీడీ రికవరీ-బ్యాకప్ భజ గోవిందం.

oremuna said...

సూపర్!

అన్నట్టూ నాక్కూడా గొంతులో వైరస్ వచ్చినట్టుంది, బయటకి రావాలని తీవ్రంగా పోరాడుతుంది. కానీ మన బాడీ ఇండియన్ కదా పోరాటంలో ఆరి తేరిపొయినది :) అలాగే గొంతులోనే తిష్టవేసినది :(

జ్యోతి said...

విహారి,
ఇప్పుడూ ఇంట్లో అందరూ బాగున్నారా మరి. ఒంట్లో బాగులేకపోతే కూడా జోకులా ???
నువ్వు మారవు>>

Dr. Ram$ said...

ఎక్కడ చిరంజీవి, ఎక్కడ విల్ స్మిత్, ఎక్కడ మన్మోహన్, ఎక్కడ టి వి 99, ఎక్కడ మీ కోసము, ఎక్కడ మీ ఖల్ ఖల్, చివరాఖరి గా అప్పుడెప్పుడొ, సైకిల్ వెనక క్యారేజి లో విరుక్కు పోయిన కస్తూరి పైట దారపు పోగులు..
సార్ ర్ ర్ ... మీకో వందనము,
మీ హస్యానికో చందనము,
చదివిన మాకో నవ వసంతము,
మన్మోహన్ కో బంధనము (రాహుల్, అర్జునుడు),
చంద్రబాబు కో మల బద్దకము( సహ పంక్తి బోజనాల పుణ్యమా అంటూ),
చిరంజీవి కో జంజాటకము (ఇప్పుడు పార్టీ పెట్టనంటే, అభిమానులు, ఓ పిచ్హి తమ్ముడు, ఓ నక్క బావ, పట్టుకు తన్నేట్లున్నారు.. పెడితే, YSR తన్నేట్లున్నాడు),
కె.సి.ర్ కో పితలాటకము (ఉప ఎన్నికలు, రాజశేఖరుడు),
సాక్షి కో కోలాటము (రామోజి బావ తో సయ్యాటలు),
ఈ వేసవి లో పాండు రంగడి కో రసికాటకము (ఎంతైన 13 మంది భామలు, ధ్రాక్షాలు, దానిమ్మలు, నారింజలు కదా)


చివారఖరి గా కొసమెరుపు ఏమిటంటే- అవినీతి సంహరుండైన లోక్ సత్తా జె.పి. నారయణ గారు -నీతివంతులైన సి.పి.ఎమ్ రాఘవులు గారి తో పొత్తు కోసము పాకులాడటము, ప్రజలకి మంచి రాజకీయాలని అందిద్దాము అన్న వుద్దేశ్యమే ఆంటారా??... ఎందరో మహానుభావులు అందరు ఆ కుర్చి కోసమే.. నేను సైతము..

నిషిగంధ said...

దగ్గు పాటలు, కస్తూరి ఎపిసోడ్ మాత్రం అదుర్సండీ :)))

ఇక పోతే I am legend ఒక కళాఖండం.. మా విల్ స్మిత్ కాకుండా ఇంకెవరన్నా ఉండి ఉంటేనా.. అట్టర్ ఫ్లాప్ అయి ఉండేది! :)

రాధిక said...

చిరునవ్వు,ముసి ముసి నవ్వు,పక్కుమని నవ్వు,ఖణేల్ నవ్వు...అన్నీ అయ్యాయి మీ టపా అయ్యేసరికి.
పోయినేడు ఫ్లూ వచ్చిందని,ఈ సారి ముందే మందేసుకుంటే అది గొంతుదాకా వచ్చి ఆగిపోయింది.నేను లెజెండు అని అనుకునే మావారు కూడా లెజెండ్ కాదని తెలిసిపోయింది.
అదేమిటో ఇండియాలో బియ్యాన్ని 2 రూపాయలకిస్తామంటుంటే ఇక్కడ 10$ బేగు కాస్తా 19$ అయ్యి కూర్చుంది.డయిటింగు అంటూ అన్నం మానేసి చపాతీలు తిందామని ఎప్పటి నుండో అనుకుంటున్నా కుదరనివారందరూ ఈ దెబ్బతో చపాతీలు మొదలుపెట్టేసారు.
ఇప్పుడు ఇంట్లో అందరూ కులాసానా?

Unknown said...

మీ హాస్య వైరస్సు బ్లాగులలోనూ అంటించారూ ?
హహళ్... హహళ్...

9thhouse.org said...

విహారి గారూ, ఏం రాశారండీ!! హేట్సాఫ్ టు యూ. మా ఇంట్లోనూ గత మూడు వారాలుగా అందరం ఒకళ్ళతరవాత ఒకళ్ళం పడకలేసేశాం. ప్రస్తుతం నేను ఖళ్ ఖళ్ అంటూనే బండి లాగుతున్నాను. మీ పోస్టు చదివాకా అయ్యో, మీరు రాసినంతగా ఎంజాయ్ చెయ్యకుండానే ఫ్లూ తగ్గిపోతోందే అని బెంగ వస్తోంది.

లైఫులో దేన్నైనా సరదాగా తీసుకోవచ్చని అనిపించేలా రాశారు. మీ పోస్టు చాలా ఎంజాయ్ చేశాను.

రానారె said...

మన్మోహన్, సుఖానికి సుఖవ్యాధులు, న్యూస్ రీడర్ న్యూటన్ రమేశ్, గొంతుల మిక్సింగు, కస్తూరి ఎపిసోడ్... అదిరిపోయాయి. ఈ వసంతకాలంతో ఆహ్లాదపరుస్తున్న చివుళ్లు, పూలూ, పక్షులలాగే ఈ టపాలో హాస్యంకూడా తాజాగా వుంది. ఇదే వసంతంలో సోకే కొన్ని దగ్గుడువైరసుల్లాగే ఈ టపాలోని వాక్యాలు కొన్ని చదివేటప్పుడు గొంతుకడ్డంపడ్డాయి. ఒక్క మార్కు పీకేస్తున్నానందుకే. 9/10.

Rajiv Puttagunta said...

Office lo mee vaalakam choosi, ippatlo blog raayaru anukunna.

Ardham pardham lekunda edanna chesthey "Nakkaki Naagalokaaniki...." antaaru.

Alaagey mee tapaalo yekkadekkado thiriginaa...."Appu chesi pappu koodu" cinema ending laaga ardhavantamga muginchi mee screenplay talent ni maaku parichayam chesaru.

Hatts Off

పావనీలత (Pavani Latha) said...

Enjoyed a lot....

కొత్త పాళీ said...

ఈ మధ్యన బ్లాగ్లోకంలో కొన్ని కామెడీ టపాలు చదివి, విహారికి కొంచెం కాంపిటీషను. అయినా పర్లేదు, కాంపిటీషనుంటేనే ఫీల్డు హెల్దీగా ఉంటుందిలే అనుకున్నా.
కానీ ఈ టపా దెబ్బతో .. మీరు అధిగమించాల్సింది మిమ్మల్నే అని ఋజువు చేసుకున్నారు.

సుజాత వేల్పూరి said...

నిజం చెప్పండి,

మీరు మారువేషంలో ఉన్న చిట్టెన్ రాజుగారు కదూ! ఆయన అమెరికామెడీ కథల తర్వాత ఇంతగా నవ్వింది ఇప్పుడె మరి!

Anonymous said...

ఇస్మాయిల్ సాబ్,

ఇది ఏడు రోజుల్లో తగ్గే జబ్బు కాదు.మా డాక్టర్ ఈ ఫ్లూ కు 'ఇన్‌ఫ్లూఎంజా బి' అని నామకరణం చేసింది. ఇది రాసిన ముఖ్యొద్ధేశం అమెరికాలో పిల్లలున్న వాళ్ళు కాస్త జాగ్రత్త పడతారని. నా జీవితం లో మొదటి సారిగా అనారోగ్యం ఎంత హింస పెడుతుందో తెలిసింది.అందులోనూ అమెరికలో.
ఏదో వారాల కుటుంబం లా ఒక్కోరోజు ఒక్కో ఇంటి భోజనాలతో బతికెయ్యగలిగాం కానీ ఎవ్వరూ లెకుంటే అమెరికలో చుక్కలు కనిపిస్తాయ్.

చావా కిరణ్,

నేను కూడ వచ్చిన కొత్తలో అలానే మహాభారత్ దేహం అని ఫోజులు కొట్టా. ఇప్పుడు ఇమ్యూన్‌ సిస్టమ్‌ అంతా స్ట్యాచూ ఆఫ్ లిబర్టీ ఎక్కింది.

జ్యోతక్కా,

మొన్నీమధ్యనే ఒకటో నంబురు ప్రమాద హెచ్చరిక కూడా తీసేశాం. నెనర్లు.

డాక్టర్ రామ్‌ గారు,

ఎదో మీ అభిమానమండి. మీ కవిత్వం బావుంది. మీరు ఓ కవిత్వ బ్లాగు రాయండి.
సింధా బుద్ధ మూడు వారాలు మిస్సయిందని ఇందులో మిక్సు చేశా.

నిషిగంధ గారు,

నెనర్లు.

ఐయాం లెంజెండ్ సినిమా అందుకే 100 మిలియెన్లకు పైగా వసూలు చేసింది :-)

రాధిక గారు,

నెనర్లు.

మీకు కనీసం $19 కి దొరుకుతోంది. ఇక్కడ మాకు costco,sams club ల నుండి బ్యాగులన్నీ మాయం. మీరు గోధుమ పిండి సరీగా చూసినట్లు లేదు. చపాతీలు తినే వాళ్ళు అన్నం తింటున్నారని వినికిడి. అదని ఇదని కాదు ఈ దేశం లో దాదపు ప్రతిది రేటు పెరిగింది.

కులాసానా అంటారా? చాలా లాసయిన తరువాత ఇప్పుడు దానికి 'కు' చేరింది.

ప్రవీణ్,

నెనర్లు.హాస్య వైరస్ అందరికీ అంటుకుంటే బావుండు. అప్పుడు కోల్గేట్ కూడలి వస్తుంది.

మురళి గారు,

ధన్య వాదాలు. ఎదైనా లైట్గా తీసుకోవడమే నా పని.
కాకపోతే ఈ సంవత్సరం వైరస్ మామూలుది కాదు కొంచెం జాగ్రత్త.

రానారె,

ఈ టపా పేలి పోతుందేమో అనుకున్నా. కానీ పది (నా కామెంటు లేకుండా )అంతకన్నా ఎక్కువే వచ్చాయి కాబట్టి విజయవంతం అయినట్లే. పాస్ మార్కులు 3.5. దానికన్నా ఎక్కువొచ్చాయి. ధన్యోస్మి.

రాజీవ్ గారు,

శరీరానికి అలసట గానీ మనసుకు కాదు గదా. నా బాడీ అదో టైపులే :-)

నెనర్లు.

చందమామ గారు,

మంచి పేరు.
నెనర్లు.

కొత్త పాళీ,

ఏంటో అందరూ కలిసి నా మీద కుట్ర పన్ని నట్టున్నారు. విదూషకుడంటున్నారు ఇంకేదో అంటున్నారు. అలా అని అని అని అని అని అని అని ...నాకు శతృవులు ఎక్కువయ్యారని మా గూఢచారి 116 చెబుతున్నాడు.

నెనర్లు.

సుజాత గారు,

ఏమి చిట్టెన్‌ రాజో నండి. నా బుర్ర ఎక్కడ కాపీకి గురవుతుందో అని ఎవ్వరివీ చదవకుండా కాపాడుకుంటున్నా. అప్పుడప్పుడూ ఏ కౌముదో ఇంకేదో డయాస్పోరానో చదివితే నేను రాయక ముందే నా ప్లాటులన్నీ అక్కడ కనిపించి పోతున్నాయి. నేనేమో మళ్ళీ బావి లోకి దూకి వెదికి కొత్త ప్లాటులు పట్టుకోవాల్సి వస్తోంది :-)

అయినా నన్ను పట్టుకెళ్ళి అయన పక్కన పెడితే ఎలాగండీ? అయినా నెనర్లండీ.

-- విహారి

Keratam said...

Bale bale vihaarii
navvulanu puttinchavu, sarada ga chadavamannavu. samayanni mimaripichavu...chala bagundhi!!!

Kamaraju Kusumanchi said...

మీ పోస్ట్ చదివి పఢీ పఢీ నవ్వుతుంటే పక్కనున్న జనాలందరూ నన్ను ఒక పిచ్చోడి మాదిరిగా చూస్తున్నారు.

I know how bad these viruses can be! అందుకే నేను మార్గదర్శిలో చేరాను. ప్రతీ సంవత్సరం Flu shots వేయించుకుంటాను.

Anonymous said...

@ కెరటం గారు,

ధన్యవాదాలు.

@ కామరాజు గారు,

జాగ్రత్త కింద పడి పోయేరు. :-) ధన్య వాదాలు.

మేము కూడా ఇరవై ఇచ్చి వేయించుకునే చోట కాదని అరవై ఇచ్చి మరీ వేయించుకున్నాం. ఈ సారి ఫ్లూ కొంచెం స్ట్రాంగట. ఫ్లూ షాటేమో పోయిన సారికన్నా వీకట.

-- విహారి

Kathi Mahesh Kumar said...

మీ పోస్టు చదువుతూ నాలోనేను నవ్వేసుకుంటూ ఉంటే, మా తెలుగురాని ఆఫీస్ జనం "నా పనైపోయింది" అనేసుకుని, ఇంటికి పోయి రెస్ట్ తీసుకోమన్నారు.

మహానుభావా ఏమి నీ హాస్యచతురత, ఏమి నీ ఛెళుకులు. జంధ్యాలనూ, ముళ్ళపూడి రమణ నూ కలిపి వడ్డించినట్టుంది నీ టపా.

Unknown said...

విహారి గారూ

మీ "ఐయాం నాటే లెజెండ్" అనే దిక్కుమాలిన వైరస్ కథ నిన్ననే చదివి కడుపుబ్బా నవ్వుకున్నాము. coincidentalగా లాస్ట్ వీక్, మా చిన్న బుడ్డోడికి న్యుమోనియా వచ్చింది. వాడు ఆ అనందం పట్టలేక (లేకపోతే sharing గుణముతోనో, జెలసీ తోనో), మొన్న father's day గిఫ్ట్ గా కొంత నాకు, మిగిలింది మా ఆవిడకీ, మా niece కీ, మా పెద్ద బుడ్డోడికీ బ్రాంకైటిస్ రూపంలో పంచిపెట్టాడు (దశరథుడు తన భార్యలకి పాయసం పంచినట్లు). దాంతో అందరం గత ఐదు రోజులుగా బయట కాలు మోపకుండా ఇంట్లోనే ఉంటూ (except Doctor & Pharmacy), సమిష్టిగా దగ్గుతూ కాలం గడిపేము. ఈరోజే నేను అర్థ దినం కోసం ఆఫీస్ కు వచ్చేను (కొలీగ్స్ కి నా దగ్గు మిమిక్రి వినిపిద్దామని). మిగతా వాళ్ళు ఇంట్లోనే దగ్గు ప్రాక్టీస్ చేస్తున్నారు. మా చిన్న బుడ్డోడు మాత్రం (చూస్కో నా తడాఖా అన్నట్లు - నన్ను రోజూ స్పంజ్ బాబ్, ఆవటార్ చూడనివ్వకపోతే మీకింతే అవుద్ది అన్న స్టైల్లో) హ్యపీగా తిరుగుతున్నాడు.

ఇంతకీ ఒక సందేహం: మాకు వైరస్ రాటానికి కారణం మా చిన్న బుడ్డోడా లేక నేను చదివే మీ బ్లాగుల నుంచా?

సత్యసాయి కొవ్వలి Satyasai said...

నారాయణ స్వామి గారి దయ వల్ల మళ్ళి మీ వైరస్ బారిని పడ్డా.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

నారాయణ స్వామి గారి దయ వల్ల మళ్ళి మీ వైరస్ బారిని పడ్డా.