Thursday, May 01, 2008

కేజీ బియ్యం అయిదు సెంట్లకు అర్జీ -- 1

* * * *


అమెరికాలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుధ్ధం అప్పుడు కూడా నిత్యావసర వస్తువుల మీద రేషన్ విధించ లేదట. ఆ రేషన్ కోత మొట్ట మొదటి సారిగా ఇప్పుడు కొన్ని స్టోర్ల వాళ్ళు విధించారు. ఆ రేషనేదో ఏ బ్రెడ్డు ముక్క మీదనో ఏ పీట్జా ముక్క మీదనో విధిస్తే అమెరికా ఫుడ్డు కన్నా నా భారత్ ఫుడ్డే మిన్న అని విర్రవీగే నా లాంటి అర్ధ బడాయి గాళ్ళు సంతోషించే వాళ్ళు. పోయి పోయి బియ్యం మీద, గోధుమల మీద పెట్టారు కన్ను. ఏమంటే కొరతంట. ఈ మాట టి.వి. లో వినడం ఆలస్యం చాలా మంది దేశీయులు భారత చిల్లర కొట్లకెళ్ళి వీలయినన్ని బియ్యపు బస్తాలు కారు డిక్కీలో వేసుకొని వచ్చేస్తున్నారు. భారత రెస్టారెంటు గాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ట్రక్కులు తీసుకెళ్ళి నింపేసుకోని వెళ్ళిపోతున్నారట. ఇప్పుడు వెళ్ళి చూస్తే అన్ని చోట్లా బియ్యం నిల్లు, గోధుమ పిండి నిల్లు. కొలెస్టరాల్ వున్న నా లాంటి వాళ్ళ పరిస్థితి ఏమి కావాలో?

పోయిన అక్టోబర్ లో 50 పౌండ్ల బియ్యం ధర $10.84 వుండేది కాస్ట్ కో(చైన్ స్టోర్స్) లో. ఇప్పుడు అది $16.75 వుంది. అలాగే భారత్ నుండి వచ్చే బాస్మతి బియ్యం పది పౌండ్ల బస్తా $8.84 ఇప్పుడు $15.75 పలుకుతోంది. ఇక గోధుమ పిండయితే భారత్ అంగళ్ళలోనే దొరుకుతుంది. అది కూడా ఆరు నెలల కిందటి ధరతో పోలిస్తే రెండింతలయింది. ఆ మధ్య పప్పు ధాన్యాల కొరత అని అందరూ రేట్లు రెండింతలు,మూడింతలు చేసి అమ్ముకోని లెక్సస్ లూ, బెంజిలూ కొనుక్కున్నారు. ఈ సారి విమానాలు, హెలికాప్టర్లూ కొనుక్కుంటారేమో. ఇప్పుడు కొరత లేకపోయినా ధరలు మాత్రం దిగి రాలేదు. ఏమన్నా అంటే అమెరికా కి ఎగుమతులు ఆపేశారంట అని అంటారు. ఇక్కడ ధరలు చంద్రున్ని దాటి అంగారకుడి వీపు ని టచ్ చేస్తుంటే అక్కడ రైతులకు వెయ్యి రూపాయలు గిట్టు బాటు ధర ఇవ్వడానికి రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఈ కొరత భారత్ లోనూ వుందని భారత ప్రభుత్వం యాభై లక్షల క్వింటాళ్ళ బియ్యం సేకరణకు పూనుకొందట.

ఈ కాస్ట్ కో వెధవ... బ్రస్షులకు, పేస్టులకు కూపన్లు పంపిస్తాడు కానీ బియ్యానికి కూపన్లు పంపించడు. తొందర్లో వాటికి మానేసి వీటికిస్తాడేమో చూడాలి. ఇవ్వకుంటే మెంబర్షిప్పు క్యాన్సిల్ చేస్తానని బెదిరించి చూస్తా. ఈ బెదిరింపు వినగానే బాగా తాగున్న చీమ ఏనుగుతో ‘నాకడ్డొస్తే నలిపేస్తా’ అనే కథ గుర్తు తెచ్చుకోకండి.

మొన్నో రోజు మా వాడు ఏదో బొమ్మ కావాలన్నాడు. అది కొనాలంటే ఓ నలభై మైళ్ళు వెళ్ళి రావాలి. వద్దురా అంత దూరం వెళ్ళడం వేస్టు. గ్యాసుకు (అనగా పెట్రోలుకు) బాగా ఖర్చవుతుంది అన్నా. మరి వాడేమో కార్లో వెళ్దామంటే ఒద్దు ఎస్.యు.వి. (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) లోనే వెళ్ళాలంటాడు. దానికేమో సిగ్గెక్కువ ఓ గ్యాలన్ పోస్తే "చీ పొండి" అంటూ ఓ 15 మైళ్ళ తరువాత ఆగిపోతుంది. దాని పొట్ట పీకల్దాకా నింపి వెళితే నాకు గొంతులో వెలక్కాయ్ , బ్యాంకు బ్యాలన్సు లో గిలక్కాయ్ పడుతుంది. గ్యాసు ధరేమో గ్యాలన్ 4 డాలర్లను తాకుతూ దోబూచులాడుతోంది. ఎనభై మైళ్ళు వెళ్ళి రావాలంటే ఓ ఇరవైకి పైగా డాలర్లు ఫట్. అందుకే కొంచెం దూరంగా వున్న వాళ్ళు ఈ మధ్య పార్టీలకు పిలిస్తే "ఐ లవ్ టూ కం టూ యువర్ పార్టీ. ఐ లైక్ పార్టీస్ అండ్ ఫ్రీ బీర్. బట్ అన్‌ఫార్చునేట్లీ మా అవిడకు జలుబు చేసింది. మా బుడ్డిదానికి జ్వరం చేసింది. మొన్న డిష్ వాషర్ లో గిన్నెలు పెడుతుంటే ఎలక నా వేలు కొరికింది." అని తప్పించుకొని గిఫ్టు డబ్బులు, గ్యాసు డబ్బులూ మిగిలించుకొని కరువు కాలం కోసం దాచుకుంటున్నారు.

రెండు మూడు రోజుల ఫ్ల్యాష్ బ్యాక్ :

నేను Born with silver spoon అయుంటే నాకు ఈ బాధలుండేటివి కాదు గదా అని మా అమ్మకు ఫోను చేసి "నేను కడుపులో వున్నప్పుడు వెండి చెంచా ఎందుకు మింగలేదు" అని అడిగా.

"మింగుంటే బావుండేదిరా. అప్పుడు నువ్వు ఏ వికలాంగుడిగానో పుట్టి రిజర్వేషన్‌ క్యాటగిరీలో మనూళ్ళో మండలాఫీసులో రికార్డు అసిస్టెంట్ గా చేరి మా కళ్ళ ముందే వుండే వాడివి..ప్చ్ " అంది.

ఫ్ల్యాష్ బ్యాక్ అయిపోయింది.

అలా మా బుడ్డోడిని బొమ్మ వద్దన్నందుకు వాడు ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు.

"నన్ను లైఫ్ లో కాపాడే వాళ్ళు నలుగురు. వాళ్ళు యమదొంగ, పండు (మహేష్ బాబు), శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., మై హార్ట్ ఈజ్ బీటింగ్ అని పాట పాడే వాడు (పవన్ కళ్యాణ్)".

వీడు అదను చూసి దెబ్బ కొడతాడు. అలా ఎందుకన్నావో చెప్పరా అంటే చెప్పలేదు. ఈ సారి ఏ గాలి పటాలు ఎగరెయ్యడానికో, చేపలు పట్టాడానికెళ్ళినప్పుడో వీడి గడ్డానికి పూజ చేస్తూ మాట్లాడితే గానే మనసు విప్పి చెప్పడు. ఇక్కడే వుంటే వీడు ఇంకా ఇలాంటి మాటలెన్నో అంటాడని భారత్ కు తిరిగి వెళ్ళి పోదామని ఆలోచించడం మొదలు పెట్టా. కానీ అక్కడికెళితే కూడా ఆ ధరల దెబ్బకు బతకలేమని తెలిసిపోయింది. ఏవన్నా ప్రాజెక్టులు పడదామంటే కాంగ్రేస్ పార్టీ లో దగ్గరి బంధులెవరూ లేకపోయిరి. మా ఆవిడ బంధువులెవరన్నా వున్నారేమో అని వాకబు చేస్తే లేరని చెప్పింది.అదో డ్రాబ్యాక్. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలి. దీని మీద ఎందుకైనా మంచిది కొంత మందితో చర్చిద్దాం అని ఆలోచించాను. ఆలోచించిందే తడవు గా నాలాంటి ఎకనామిక్ గాళ్ళందరికీ ఓ ఈ మెయిల్ కొట్టా.

దాని సారాంశం..

"అమెరికాలో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్. మిర్ స్పేస్ స్టేషన్‌ వాళ్ళు హాబులు టెలీస్కోపు నుండి చూసినా కానీ ధరలు కనిపించడం లేదంట. అంతంత డబ్బులు పెట్టి బియ్యం కొనలేం. ఇప్పుడిస్తున్న జీతాలతో మనం బతకలేం. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లో మన వై.ఎస్. ఇస్తున్నట్టు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఇక్కడ కూడా అమలు చేసేటట్లు మన మందరం ప్రయత్నిద్ధాం. అక్కడ డాలర్లు ఇక్కడ రూపాయలు, అక్కడ కేజీలు ఇక్కడ పౌండ్లు లాగా కాకుండా ఇక్కడే కేజీ ఒక్కింటికి (2.2 పౌండ్లు) రెండు రూపాయలకే అంటే అయిదు సెంట్లకే ఇచ్చేట్టు మన జార్జి డబ్ల్యూ బుస్షు ను అడుగుదాం. గ్రీను కార్డులు ఇచ్చినట్లే బియ్యం కార్డులు కూడా అడుగుదాం. అందరం మాట్లాడుకొని అర్జీ పెట్టుకుందాం. మనము అడిగితే కాదనే దమ్ములు ఎవరికీ లేవు. మనం తెలుగు వాళ్ళం కలిసి కట్టు గా సాగుదాం.

-- జై తెలుగు తల్లి "

అల్లూరి సీతారామరాజు సినిమా లోని "తెలుగు వీర లేవరా ..." అనే పాట కూడా అటాచ్మెంట్ గా పంపించా స్పూర్తి కోసం. ఈ-మెయిల్ ఓపన్‌ చెయ్యగానే పాట మొదలయ్యేట్లు చేశా.

అంతా తెలుగు వాళ్ళేనా ఎందుకు ఇతరులను కలుపుకోలేదు అంటే అమెరికాలో వున్న తెలుగు వాళ్ళతో పోలిస్తే ఇతర భారతీయుల శాతం 0.000000000001. ఒక్క తెలుగోడొస్తే వెంటనే లింకు సర్వీసు స్టార్టవుతుంది. మొదట వాడి పెళ్ళాం, ఇద్దరు బామ్మర్దులు వస్తారు. ఆ ఇద్దరు బామ్మర్దుల పెళ్ళాలు. మళ్ళీ ఆ ఇద్దరు బామ్మర్దుల ఇతర బామ్మర్దులు వచ్చేస్తారు. ఈ బామ్మర్దుల రద్దీ ని క్యాష్ చేసుకోవాలని బ్రీటిష్ ఎయిర్ వేస్ వాళ్ళు వాళ్ళ కంపెనీ ని స్పినాఫ్ చేసి జగన్‌ ఎయిర్ వేస్ (ట్యాగ్ లైన్‌: బామ్మర్దుల స్పెషల్ ) అని కొత్త కంపెనీ మొదలు పెట్టబోతున్నారని కూడా విన్నాను.

అలా ముగ్గురికి ఈ-మెయిల్ కొట్టిన నలభైఏడున్నర సెకండ్లకు నా మెయిల్ బాక్సుకు 32 ఈ-మెయిల్స్ వచ్చేశాయి తిరపతి లో గుండు కొట్టుకోవడానికి అప్పుడే గోదావరి ఎక్స్ ప్రెస్ నుండి దిగిన గోవిందయ్య చుట్టూ టాక్సీల వాళ్ళు చుట్టు ముట్టినట్లు.

మొట్ట మొదటి ఈ-మెయిల్ జిడ్డు సుబ్బారావ్ గాడినించి వచ్చింది.

"మామా! నీ అయిడియా అదిరి పోయింది. మామూలుగా నాకే ఇలాంటి అయిడియాలు వస్తాయి అలాంటిది ఇంత వరకు నాకు కూడా రాలేదు ఈ అయిడియా. ఈ మధ్య తెలుగు సినిమాలు చూడ్డం మానేశావా ఏంటి. మనం అందరం తెలుగు వాళ్ళం కలిసి కట్టుగా వుందాం. ఈ వీకెండ్ కలుద్దాం. బీరు కూడా నీదే మామా. నువ్వేమీ బాధపడకు నీకు శ్రమ లేకుండా కావాలంటే బీరు ఓపనర్ నేనే తెస్తా ."

ఉగాది శుభాకాంక్షలు ఈ-మెయిల్ పంపిస్తే చూడకుండానే ట్రాషు చేస్తాడు దొంగ సన్నాసి గాడు. అటువంటిది కెజీ బియ్యం అయిదు సెంట్లకు అనగానే వాయు వేగంతో రిప్లై ఇచ్చాడు. వీడు బీరు ఓపనర్ కారు కీస్ కు వేసుకొని తిరుగుతుంటాడు. మొన్నే ఇక్కడున్న కూర్స్ బీరు కంపెనీ వాళ్ళు వీడిని కంపెనీలోకి రాకుండా బ్యాన్‌ చేశారు. విజిట్ కోసం వచ్చాడు కదా అని సాంపిల్ కోసం కొంచెం తాగమంటే అప్పుడే బయటికి డెలివరీ అవుతున్న ట్రక్కులోని మూడు కేసులు ఓపన్‌ చేసి తాగేశాడట. డబ్బుల్లేక పోతే చేతికున్న పెళ్ళి ఉంగరం లాక్కున్నారట.

ఇంకో మెయిల్ సన్నాయి నొక్కుల సంజీవ్ రావ్ నుండి.

"బాబాయ్!

నేను మీటింగులో వుంటే జనార్ధన్ గాడు వాడి బ్లాక్ బెర్రి కి వచ్చిన ఈ-మెయిల్ చూపించాడు. ఆగకుండా నీకు ఈ-మెయిల్ పంపించేదానికి మీటింగు నుండి వచ్చేశా. మన దేశానికి చాలా దూరంగా వున్నాం. మనకు మనం కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు. తప్పుకుండా కలుద్దాం. మట్లాడుకుందాం. మన తెలుగు వాళ్ళ పవరు చూపిద్దాం.

-- జై జై తెలుగు తల్లి"

వీడికి Y2K లో పంపించిన న్యూ ఇయర్ విషెస్ కి ఇంతవరకు సమాధానం లేదు. కాంకర్డ్ విమానం లో ఇంజిను తీసుకెళ్ళి వాడి ఈ-మెయిల్ సర్వర్లో పెట్టినట్టున్నాడు.జన్మకో శివ రాత్రి అన్నట్లు ఈ-మెయిల్ పంపిస్తాడు. అటువంటిది కేజీ అయిదు సెంట్లనగానే ఈ మెయిల్ పంపించేశాడు. వీడు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగడు. దాన్ని కొత్త బాటిల్ లో పోసేసి ఆమ్వే వాళ్ళకు అమ్మేసి డబ్బులు తీసుకుంటాడు. వీడు వాళ్ళకు మొన్నే బెస్టు బయ్యర్ అవార్డు ఇచ్చాడు.


ఇంకోటి సప్రెస్డ్ శివరామ్‌ నుండి.

"Dear respectable friendly and lovely Mr. Vihaari garu,

Namaste and good morning.

Thanks for sending this to me.(నేను పంపలేదు. ఎవడో ఎకానమీ గాడు ఫార్వర్డ్ చేసింట్టున్నాడు) We need people like you who can take initiative on such a wonderful cause. We are suppressed and oppressed people here. We need a leader like Gandhi and Nehru. And Martin Lutherking too. If you want I can takeover this task from you. You know, I have bald head. We should show telugu power to the people around here. Please..please...please....give me opportunity to become like Abraham Lincoln. (ఎదురుగా వుంటే కాళ్ళ మీద పడే వాడేమో) I will give big credit to you. (అంటే నీకు చాలా ఋణపడి వుంటాను అని అర్థం)

-- Jai Jai Jai Jai ..(అంతా జై జై అనే వుంది. ఎనిమిది సార్లు పేజ్ డౌన్‌ నొక్కిన తరువాత....) Telugu talli."

ఈయనెప్పుడూ మాతృబాష, మాతృబాష అంటూ వుంటాడు ఇంగ్లీషులో. ఏంటో బియ్యానికి suppressed and oppressed కి సంబంధం అర్థం కాలేదు. ఆయన ఆవు మీద వ్యాసం టైపు. జెన్నీఫర్ లోపెజ్ గురించడిగినా , జెల్లీ ఫిష్ గురించడిగినా సప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ అంటాడు. అందుకే ఆయన పేరు సప్రెస్డ్ శివ రామ్‌ . ఆయనతో కాసేపు మాట్లాడితే నెహ్రూ జైల్లో వున్నప్పుడు ఇందిరా నెహ్రూ కు రాసిన ఉత్తరాల నుండి దత్తన్న వై.ఎస్.కు రాసిన ఉత్తారాల వరకు అనర్గళంగా మాట్లాడుతాడు.

తరువాతి ఈ-మెయిల్ చుప్పనేని ఝాన్సీ గాంధి నుండి.

" మీ లాంటోళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది.మనం తప్పకుండా ఈ బియ్యం మీద ఒక ఉద్యమం చేపట్టాల్సిందే. నేను కూడా నా వంతు కృషి చేస్తాను. ఈ వారాంతం మీటింగు కు రాలేను.ఎందుకంటే మా అమెరికన్‌ కొలీగు ఇంట్లో పార్టీ వుంది. దానికి అడల్ట్స్ మాత్రమే అలోడ్. మా ఆయనని మీటింగుకు పంపిద్దామంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ బేబీ సిట్టింగు చెయ్యాలి.అందు వల్ల ఆయన కూడా రాలేరు. మీరు మాట్లాడుకున్న విషయాలు నాకు పంపించండి. దీని కోసం ఏదైనా ఫోరమ్‌ పెడితే చెప్పండి. దానికి డొనేషన్‌ లు వగైరా ఎంతైనా సరే మూడు డాలర్లకు మించకుండా పంపిస్తాను.

-- జై తెలుగు తల్లి"

అబ్బో మూడు డాలర్లంటే చాలా ఎక్కువే. చాలా దాదృత్వం కలదీవిడ. ఈవిడ H-1 వీసా మీదొస్తే వీళ్ళాయన H-4 డిపెండెంట్ వీసా మీదొచ్చాడు. అదీ బడాయి. పిల్లలున్న వెనక సీట్లో వాళ్ళయనుంటే ఈవిడ డ్రైవ్ చేస్తుంది. ఈవిడొస్తే ఆడోళ్ళందరూ మాట్లాడ్డం మానేస్తారు. ఎందుకలా అంటే మాకు అమ్మలక్కల్లాగా మాట్లేడే వాళ్ళుంటే బావుంటుంది అంటారు.

ఇంకో మెయిల్ ఎవరో కొత్త వారి దగ్గరినుండి.

గబ గబా చదువుకోవాలి .

"మాస్టారూ,

మీరెవరో నాకు తెలీదు గానీ మీ అయిడియా బ్రహ్మాండం.
మీరు బ్రహ్మాండం.
ఈ వీకెండ్ కలిస్తే బ్రహ్మాండం.
అందరూ తెలుగు వాళ్ళయితే బ్రహ్మాండం.
నన్ను అర్జీ రాసేదానికి పిలిస్తే బ్రహ్మాండం.
నన్ను మా బావ సాఫ్ట్వేర్ ఇంజినీరు గా చెయ్యక ముందు మా ఊళ్ళోని తాలూకా ఆఫీసులో బ్రహ్మాండమైన చెట్టు కింద కూచోని అర్జీలు బ్రహ్మాండంగా రాసేవాడిని.
మా కుటుంబమంతా మీ ఇంటికి రమ్మంటే బ్రహ్మాండం.
ఎందుకంటే మా ఆవిడ సలహాలు ఇంకా బ్రహ్మాండం.
అన్నింటికీ మించి వైన్‌ వుంటే చాలా చాలా బ్రహ్మాండం.

ఇకుంటా
జై బ్రహ్మాండం. క్షమించాలి జై బియ్యం తల్లి....జై తెలుగు తల్లి. "

ఇన్ని బ్రహ్మాండాలున్నాయి పేరేంటో అని చూస్తే బ్రహ్మాండం భోజేశ్వర రావ్. అప్పుడు గుర్తొచ్చింది కార్గిల్ యుద్ధమప్పుడు డౌన్‌ టవున్‌ లో ధర్నా చేద్ధాం రమ్మంటే నేను బి.జె.పి.కి వ్యతిరేకం. ధర్నా చేస్తే వాళ్ళను సమర్థించినట్లుంది నేను రాను అన్నాడు. దీనికి రిప్లై ఆలస్యం చేయకుండా పంపించేశా.

"డియర్ బ్రహ్మాండం గారు,

మీ ఈ-మెయిల్ బ్రహ్మాండం.
మా ఇంట్లో వైన్‌ బ్రహ్మాండం లేదు.
మా ఇంట్లో అంతమంది పట్టడానికి మా ఇల్లు బ్రహ్మాండం కాదు.
బ్రహ్మాండమైన మీ రెవ్వరూ రావద్దు.
చర్చించిన విషయాల మీద ఓ బ్రహ్మాండమైన కాపీ తీసి ఫెడెక్స్ బ్రహ్మాండం లో మీ ఇంటికే పంపిస్తాం.

అభ్యర్థన: దయచేసి మీ రిప్లై బ్రహ్మాండం అని మళ్ళీ బ్రహ్మాండమైన రిప్లై ఇవ్వకండి.

ఇట్లు,
బ్రహ్మాండం బెండు లాంటి ఫ్రెండు."


(రెండో భాగం త్వరలో )

తరువాతి భాగం ఇక్కడ చదవండి

* * * *గమనిక : ఈ టపాను ఒకే భాగంగా విడుదల చెయ్యాలని మొదట సంకల్పించాను. బుర్ర లోవారం రోజులు గా వున్న కాన్‌సెప్ట్ నిన్న డ్రాఫ్టు లో రాసుకున్నా. ఈ కాన్‌సెప్ట్ లో కొంత ఆంధ్ర జ్యోతి లో కార్టూన్‌ రూపము లో వచ్చేసింది. మిగిలిన ఇంకొంచెం సాక్షి లో రావడము ఇష్టము లేక వున్న దాన్ని రెండు భాగాలు చేసి విడుదల చేస్తున్నా.


* * * *

15 comments:

Raj said...

మా కన్నా మీరే నయం. ఇక్కడ 20 పౌండ్ల బియ్యం బస్తా 16.50 డాలర్లు. అదీ కాక మరి బియ్యం ఇండియానుండి రావని షాపువాడు భయపెట్టడం. చైనా బియ్యం కాస్త ధర తక్కువైనా రోజూ తినలేము. మీరన్నట్లు ఇండియా వెళ్ళినా అక్కడి ధరలను తట్టుకోలేము. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయమేస్తుంది.

oremuna said...

ఇరగ వ్రాశారండీ!

కామెడీ అనే పైకి కన్పించినా మీ సెటర్లు, చురుక్కున ఎవరికన్నా తగుల్తాయేమో!
బ్లాగులోళ్ళ అవిడియాలు పత్రికలు ముందే వ్రాసేస్తున్నాయా? హమ్మా! ఇహ నుండీ పత్రికల్లో వ్రాసే అన్నీ బ్లాగులోల్లని అడిగి వారికి పైప్ లైన్లో లేని అవిడియా అని చెపితేనే ప్రింట్ చేసేట్టు ఓ ఆర్జీ కూడా పెట్టాయి సుమా!!

sujatha said...

లాభం లేదు, మీరిలా బ్లాగుల్లో(నే) కాకుండా ఏదైనా వీక్లీలోనో, కనీసం ఆదివారం ఎడిషన్లో అయినా సరే ఒక ఫీచర్ ప్రారంభించాలండి!

భావకుడన్ said...

నేనొక్కడినే తెలివయిన వాడిని అనుకున్నా (ఐదు బస్తాలు 20kg లవి ఇంట్లో మూలుగుతున్నాయి మరి) చాలా మంది అలాగె చెస్తున్నారు అనమాట. ఇది కూడా ఒక కారణం ధరలు పెరగటానికి అని ఇప్పుడే తెలిసింది :()

అయినా తప్పదు, ముందు ఏషియన్ అంగడికి వెళ్లి ఇంకో అయిదు బస్తాల బా. బియ్యం, ఒ రెండు బస్తాల గో. పిండి, ఒక పది కిలోలు కం. పప్పు తీసుకోస్తా మళ్ళీ ఎప్పటికి తగ్గెనో ధరలు :-)

cbrao said...

త్వరలో మీ దేశం వద్దాం అనుకుంటున్నా. నాతో బాటుగా ఇక్కడి నుంచి బియ్యం తీసుకు రావచ్చా? కస్టం వాళ్లతో సమస్య ఏమన్న వుంటుందా? ఎన్ని బస్తాలు తీసుకు రావచ్చో తెలియచేయగలవు.

phani said...

చంద్రబాబు బియ్యం అయిడియా ను వై.యస్.హైజాక్ చేసినట్లు మీ కాన్సెప్ట్ ను పత్రికల వాళ్ళు హైజాక్ చెయ్యడం మీ బ్లాగు కు బాధాకరం.మాకు హాస్యకరం.

రాధిక said...

మా ఊరిలో ఇరవై పౌండ్ల బస్తా ఇరవై డాలర్లు.అది కూడా ఒక్కొక్కరికి ఒక్కో బస్తా మాత్రమే.పప్పులు,ఉప్పులూ ఎప్పుడో పెరిగిపోయాయి.ఇంక ఏమి తినగలం?ఈ బ్రెడ్డులు,పిజ్జాలూ తిని బ్రతకాలేమో?

Dr. Ram$ said...

ప్రపంచం మొత్తానికి ఎటువంటి అహార కొరత వచ్హిన, మన తెలుగు బ్లాగర్ల కు మాత్రము ఎప్పటకి హాస్య కొరత రాదు..బ్రహ్మాండము లాంటి మీ బ్లాగు పది కాలాలు వున్నంత కాలము.. నిజ జీవితము లో మనకి తటస్త పడే, భిన్న రకాల మనుషుల భినమైన వ్యక్తిత్వాల ని , ఎంతో విభిన్నం గా సుపరిచయము చేయగలిగారు...నెనర్లు.. ఎందుకో సారు వాడు ఈ సారి కేవలము అమెరికా లో ని ధరల నియంత్రణ మీదనే ధౄష్టి నిలిపారు..ఈ ఒక్కసారికి ఇక్కడ మా బాబు సారు గారిని, రాజీవ శేఖరు సారు వాళ్ళ ని వదిలి పెట్టారు.. అందుకే యిదే సరైన సమయము అనుకొని, ధరల మాట ఎత్తడము ఎందుకు లే అని, ఈ సారి నన్ను గెలిపిస్తె గ్యాస్ వుచితము అని ఊదరగొడుతున్నారు బాబు సారు వాడు..అంతేలే గ్యాస్ వుచితంగా ఇచ్హి, ఆ పొయ్యి మీద వండుకొనేవి ఆకాశానికి అంటిస్తే..అహా అమోఘము, భళా రా ఓ రాజకీయ నాయక..నీ చతుర భళ.. "జీవిత కాలానికి ఒక గ్యాస్ బండ" లా, "సగటు బారతీయుడి ఒక గుది బండ" లా తయారయ్యారు.. ఈ వుచిత వాగ్ధానపు వీరులు.. ఇంకా ముందు ముందు ఎన్నెన్ని ఉచితాలు చూపిస్తారో...

Budaraju Aswin said...

కత్తి
కుమ్మెశారు

chandramouli said...

బ్రహ్మండనాయక... మీ టపా పొలికేక

జ్యోతి said...

ఐతే ఈ బియ్యం కథ భలే ఉంది. మన తెలుగు బ్లాగర్లు కలిసి బియ్యం స్మగ్లింగ్ మొదలెడితే లాభసాటిగా ఉంటుందేమో. అమెరికాలో ఉన్న మనోళ్ళకి కాస్త డిస్కౌంట్ ఇచ్చి, మిగతాది వ్యాపారం చేసుకంటే చాలా మిగులుద్దేమో. ఎవరన్నా రెడీనా??

indianminerva said...

ఐతే అక్కడకూడా ఇదే పరిస్తితి అన్నమాట. పెట్రో ధరలు, వెచ్చాల ధరలు అన్నీ సరాసరి aurora borilias వైపు దూసుకు వెళ్తుంటాయ్. బుష్ కి యెమైనా సాయం కావాలనిపిస్తే YSR ని అడగటానికి మొహమాట పదొద్దని చెప్పండేం.

ఒక చిన్న సందేహం. మా వాడు ఒకడు Target systems లో చేస్తున్నాడు. యేమైనా అంటే మా company పెద్ద తురుము company U.S. లో Walmart తరవాత మాదే రాజ్యం అంటుంటాడు. నిజమా?

Siva said...

అనకాపల్లి మీద రాసినా అమెరికా మీద రాసినా మీ సెటైర్ల తో మా సమస్యల నుండి మమ్మల్ని రిటైర్ అయ్యేటట్లు చేస్తున్న మీకు మా థాంక్స్.

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

విహారి గారూ టపా పోస్ట్ చేసిన ఇన్నాళ్లకొచ్చి అర్ధంపర్ధం లేకుండా రాస్తున్నాడు అనుకోకపోతే ఒక మాట
మీ టపా బ్రహ్మాండం
కాన్సెప్ట్ కన్నా ట్రీట్ మెంట్ బ్రహ్మాండం
ముఖ్యంగా ప్రతీ అక్షరమూ బ్రహ్మాండం
చదివినోళ్లందరికీ బ్రహ్మానందం

Anonymous said...

@ రాజ్ గారు,

మనమిప్పుడు విదేశ మిడిలు క్లాసు.

@ చావా/ఒరెమునా,

ధన్యవాదాలు. సెటైర్లు ఎవ్వరి మీదా వెయ్యలేదు గానీ కొన్ని అనుభవాలు రాశా అంతే.

@ సుజాత గారు,

మీరు ఒక పత్రిక పెడితే చెప్పండి. అప్పుడు మీ పత్రిక్కే రాస్తా :-)

ధన్య వాదాలు.

@ భావకుడన్‌ గారు,

మీరు కానీ మా ఊరొచ్చి బియ్యం పట్టుకు పోలేదు కదా?
ధరలు తగ్గవు. మనమే వాటికి సరిపోయేట్లు ఎవరి జేబు నయినా కొట్టెయ్యాలి.

@ రావ్ గారు,

బియ్యం ఎంత తీసుకు రావచ్చో నాకు తెలీదండి.

@ ఫణి గారు,

అందుకే మీరందరూ ముందుండి నా కోసం పోరాడండి. మీ కోసం నేను టపాలు రాస్తా :-)

ధన్య వాదాలు.

@ రాధిక గారు,

అందుకే ఈ మధ్య సాక్షి పేపర్ తిని బతకడమెలా అనే దానిమీద పరిశోధనలు చేస్తున్నా.

@ రామ్‌$ గారు,

మీ అభిమానానికి తడిసి జలుబు చేసింది.
మీ పేరులోని డాలరు మాకిస్తే మేము కొంచెం కష్టాలను అధిగమిస్తాం.

@ అశ్విన్‌, చంద్రమౌళి,

మళ్ళీ తడిసి పోయా.:-)

@ జ్యోతక్కా,

స్మగ్లింగోళ్ళను పట్టిస్తే అమెరికా వాళ్ళేమన్నా కమిషనిస్తున్నారా? మా చేత స్మగ్లింగ్ చేయిద్ధామనే?

@ ఇండియన్‌ మినర్వా గారు,

అవును. వాల్ మార్ట్ తరువాత టార్గెట్ వాళ్ళే తక్కువ ధరలకు వస్తువులు అమ్ముతారు.

@ శివ గారు,

ధన్యవాదాలు.

@ పక్కింటబ్బాయ్ గారు,

వ్యాఖ్య ఎప్పుడన్నా రాయొచ్చు విజయా వారి మాయా బజార్ చూసినట్టు.

మీ కామెంట్లు బ్రహ్మాండం.

-- విహారి