Thursday, June 07, 2007

సీనుగాడి ఇండియా ప్రయాణం - 2

:

అలాగ ఫోను ముందుకు వెళ్ళిన సీనుగాడు” (ఇది ఖచ్చితంగా ఛంద్ర బాబు నాయిడు డవిలాగుకు కాపీ కాదని మరొక్కసారి మీ అందరికి మనవి చేసుకుంటున్నాను) ఫోను ఎత్తగానే అవతల లైన్లో సుబ్రమణ్యం గాడు “ఒరేయ్ మామా నువ్వు ఇండియా వెళ్తున్నావని నాకు చెప్పనే లేదు కదరా. ఎన్ని రోజులకు కెళ్తున్నావ్”


“నేనూ వెళ్ళాలనుకోలేదు కానీ మా బుడ్డి దానికి గుండు తిరుపతిలోనే కొట్టించాలనేసరికి హడావుడి గా టికెట్స్ బుక్ చేసాను. మా బాస్ గాడు పెళ్ళానికి విడాకులు ఇచ్చేసిన ఆనందంలో నా లీవు కూడా సాంక్షన్ చేసశాడు. నేను అయిదు వారాలు వుండి వచ్చేస్తా. మా ఆవిడ కూతురు ఇంకొన్నాళ్ళు……”


మధ్యలో కట్ చేస్తూ “సర్లే మామా నువ్వెళ్తున్నావంటే నాకు చాలా ఆనందంగా వుంది”


నే వెళ్తే వీడికేమి ఆనందం? కొంపదీసి నా కారుని ఉద్యోగం కోసం ఇండియానుండి వచ్చిన వీడి బామ్మర్ది కు గానీ ఇమ్మంటాడా? వీడికి మాత్రం చచ్చినా ఇవ్వకూడదు అని నిర్ణయించేశాడు.


“నేను వెళ్తే నీకు ఆనందమెందుకురా? నాకు డబ్బులు ఖర్చయి పోతే నీకు ఆనందమా”


“అది కాదు మామా, నువ్వు వెళ్తుంటే నాకు కూడా ఇండియా వెళ్తున్నంత ఆనందంగా వుంది”


అనుమానం లేదు వీడు ఖచ్చితంగా నా కారుకి టెండర్ పెట్టినట్టున్నాడు. వీడు పప్పులు నేను వుడకెయ్యను గా అనుకున్నాడు.


“నీకు ఇండియా మీద అంత ప్రేమయితే నువ్వు కూడా ఓ సారి వెళ్ళచ్చుకదా”


“వెళ్దామనే అనుకున్నా కానీ ఈ సారి నయాగర వెళ్దామని మా ఆవిడ అనేసరికి ఆగిపోయా. అవును మామా నువ్వు ఏ ఫ్లయిటుకు వెళ్తున్నావ్?”


అంటే వీడు కూడా నా సూట్ కేసును పావనం చెయ్యాలనుకుంటున్నట్టున్నాడు. తప్పించుకునే మార్గమే లేదు. “నేను లూఫ్థాన్సా లో వెళ్తున్నారా రా”


“మంచి ఫ్లయిట్ రా డబ్బులు పోతే పోయినాయి కానీ జర్నీ కంఫర్టబుల్ గా వుంటుంది. నేను కూడా దాన్లోనే వెళ్ళా చాలా సార్లు. ఈ మధ్య లగేజీ తక్కువ చేసినట్టున్నారు కదా?”


ఆహ మంచి చాన్సిచ్చాడు తప్పించుకోవచ్చు.”అవున్రా చాలా కష్టమయి పోతా వుంది.”


“రేయ్ నువ్వు తిరపతికి పోతున్నావు కదా. నీకు అక్కడ ఏమయినా సహాయం కావాలా? మనకు కొంచెం హవా వుంది అక్కడ”


ఈ సుబ్రమణ్యం గాడు ఎంత మంచివాడు అడక్కుండా సహాయం చేస్తానంటున్నాడు. ఎంతయినా వీడికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని రొమ్మంతా ఉబ్బిచ్చుకోని వాళ్ళావిడ వైపు గర్వంగా చూశాడు తిరపతి కొండ మీద సిఫారసులు చేసే ఫ్రెండ్ దొరికాడని చెప్పడానికి.


“అవున్రా కొంచెం హెల్ప్ కావాలి ఎంత ట్రై చేసినా కాటేజీలు దొరకడం లేదు.”


“నువ్వేమీ ఫికర్ కావద్దురా మనోడొకడున్నాడక్కడ వాడికి ఫోన్ చేస్తా అంతా వాడు చూసుకుంటాడు”


“సరేరా అతని నంబరివ్వు నేను కూడా ఫోను చేసి మాట్లాడతా” ఉబ్బి తబ్బిబ్బయి పోయాడు రొమ్ము పది మీటర్ల డయామీటర్ తో పెద్ద బెలూన్ లాగా అయిపోయింది.


“వాడి ఫోన్ నంబరు ఆఫీసులో వుంది మండే ఆఫీసుకు ఫోన్ చెయ్యి నంబరిస్తా”


“సరేరా మండే ఫోన్ చేస్తా ఇక ఫోన్ పెట్టేస్తా మా ఆవిడని షాపింగ్ కు తీసుకెళ్ళాలి ఇండియా షాపింగ్ చాలా మిగిలిపోయింది”.


“మామా చిన్న హెల్ప్”


“చెప్పరా నీకన్నానా”


“ఏం లేదు నా తమ్ముడికి నైకీ షూ కొన్నా. నువ్వేమనుకోక పోతే కొంచెం తెసుకెళ్తావా”


పది మీటర్ల బెలూను రెండు మిల్లీ మీటర్ల కు వచ్చేసింది. వాళ్ళావిడ వీడి వైపు చూస్తున్నా చూడనట్టు అటువైపు తిరిగి మాట్లాడ్డం మొదలు పెట్టాడు. తప్పుతుందా వీడు కనీసం ఏదో హెల్ప్ చేస్తానంటున్నాడు.” అలాగేరా రేపో ఎల్లుండో వచ్చి షూస్ ఇచ్చి వెళ్ళు” డీలా పడిపోయి చెప్పాడు.


“చాలా థ్యాంక్స్ రా మామా” అని ఫోను పెట్టేశాడు సుబ్రమణ్యం.


“వేలూ మనం ఇంకా ఎంత షాపింగ్ చెయ్యాలి”


“అప్పుడే ఏమయిపోయింది ఇంకా మా తమ్ముడికి ఐపాడూ, చెల్లికి జీన్సు ఫాంట్లూ, లిప్టిక్సూ కొనాలి, ఇంకా మా అన్నయ్య కొడుక్కి ఎక్స్ బాక్స్ కొనాలి కదా?”


“మొన్న ఆ డాలర్ స్టొర్స్ లో చాలా కొన్నాం కదా?”


“చీ అవన్నీ మా వాళ్ళకు ఇవ్వడానికి కాదు. మీ బంధువులకూ, మీ పక్కింటి వాళ్ళకూ, మా పక్కింటి వాళ్ళకూ. అవన్నీ బయట ఖరీదయిన చోట్ల కొనాలంటే మన దగ్గర అంత డబ్బుండద్దూ? కాస్త బ్యాలన్స్డ్ గా ఖర్చు పెట్టుకోవాలి కదా” అని సొంతింటి ఆర్థిక సూత్రాన్ని విప్పి చెప్పింది.


అది విని వుడుక్కున్న సీను గాడు ఏమీ మాట్లాడ లేక “అవును కదా అలా ఖర్చు పెట్టుకుంటూ పోతే మనకేమీ మిగలదు. ఎంతయినా నీ నేర్పరితనం ఎవరికీ రాదులే” అన్నాడు డా|| దుమారం రాసిన "భార్యను సంతోష పెట్టడమెలా" అనే బుక్కులోని పన్నెండో పేజీని గుర్తుకు తెచ్చుకుని.


“మన పాపకు పాలు పట్టాలి వెళ్ళి చూడండి నిద్ర లేచిందేమో” అంది అలి వేలు.


“అలాగే” అని ఇంకో రూములో పడుకున్ని వున్న కూతుర్ని చూసి వచ్చాడు. చక్కగా నిద్రపోతున్న పాప ను తనివి తీర చూసుకుని గుండు కొట్టిన తరువాతేలా వుంటుందో పాపం అనుకున్నాడు. ఆ రూములో నుండి బయటకు వచ్చాడో లేదో మళ్ళీ ఫోను “తొక్కలో తిమ్మిరి..పిక్కలో జాంగిరి.. డొక్కలో డిరి డిరి”


వెళ్ళి కాలర్ ఐడి చూశాడు. ఈ సారి ప్రైవేట్ కాలర్ అని వచ్చింది. తీద్ధామా వద్దా అని అలోచించి ఏమయితే అది అయ్యిందిలే అని ఫోను తీశాడు. అవతల లైన్లో వేణు గోపాల్. ఈయనెందుకు నాకు ఫోను చేశాడు అని అనుకున్నాడు.


“నమస్కారమండి శ్రీనివాస్ గారు, బావున్నారా” అని అడిగాడు వేణు గోపాల్.


వేణు గోపాల్ తను పని చేసే ఆఫీసులోనే పని చేస్తాడు. వీకెండ్ ఫోను చేసి మాట్లాడుకునేంత పెద్ద క్లోస్ కాదు. వాళ్ళబ్బాయి బర్త్ డే కి పిలవడానికి ఫోను చేశాడేమో అనుకున్నాడు.


“ఆ.. నమస్కారమండి. ఏంటి విశేషాలు”


“మీరు వచ్చే వారం ఇండియా వెళుతున్నారట గదా , మీరు చాలా అదృష్ట వంతులండీ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి పోతుంటారు”


వీడొకడు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బీడి కాల్చుకోవటానికి నిప్పు కావాలన్నాడట వెనకటికెవడో. నేను వెళ్ళక వెళ్ళక ఇప్పుడు వెల్తుంటే ఎవడో ఫ్రీ టికెట్టిస్తుంటే నెలకో సారి ఇండియా వెళ్తున్నట్టు సెటైరొకటి. ఈ నంగి గాడికి ఎప్పుడన్నా ఓ సారి నా ఫ్ల్యాష్ బ్యాక్ వినిపించాల్సిందే అనుకున్నాడు.


“ఎంత అదృష్టమో వచ్చే ఫోన్ల ద్వారా తెలుస్తోంది లెండి”


“అయ్యో అదేంటండి నేనేమన్నా తప్పు మాట్లాడానా? మాట్లాడితే క్షమించండి”


“మీరేమీ మాట్లాడ లేదు గానీ. మీరెందుకు ఇప్పుడు ఫోను చేశారో నాకు తెలుసు. మీ గొట్టం తమ్ముడికో అన్నకో ఏదన్న పిండం తీసుకెళ్ళమని నాకిస్తారు. నేను దాన్ని తీసుకెళ్ళి ఇండియాలో పిండ ప్రదానం చెయ్యాలి అంతే కదా” అన్నాడు కోపంగా.


“చా అలాంటి పిండాలు లాంటి వేమీ లేవండి. నాకు గొట్టం, పైపూ, కొళాయి లాంటి వారెవరూ లేరు. మీరు అమెరికా వచ్చేముందు నీటి పారుదల శాఖ లో గానీ పనిచేశారా?” కూల్ గా అడిగాడు వేణు.


“అలా కాకపోతే మీ నాన్నకో అమ్మకో రెండు మూడు బంగారు బిస్కట్లు తీసుకెళ్ళమని చెప్తారు అంతే కదా”


“మీరు భలే సరదాగా మాట్లాడుతారు శ్రీనివాస్ గారు. మీరు ఇలాగే ఎప్పుడూ మీ శ్రీమతి ని నవ్విస్తూ వుంటారా” కూల్ కూల్ గా చెప్పాడు వేణు.


“అవును మా ఆవిడ నా జోకులకు ఖల్ ఖల్ మని నవ్వి పెళ్ళు పెళ్ళు న వాంతి చేసుకుంటుంది. కావాలంటే మీ ఆవిడ ను కూడా పంపించండి. మీ కెందుకు ముందు అసలు విషయంలోకి రండి”


“మీరు అంత సుకుమారంగా, వినయంగా చెప్పిన తరువాత చెప్పకుండా ఎలా వుంటాను. మీరు ఇండియా వెళ్తున్నారు కదా అని నేను ఏమీ లగేజీ ఇవ్వడం లేదు” శాంత మూర్తి వేణు నొచ్చుకుంటూ చెప్పాడు.


లగేజీ ఏమీ ఇవ్వడం లేదు అన్న ఒక్క మాటకు అంటార్కిటికా అంత చల్ల బడి పోయాడు సీను గాడు. పది రోజుల అంధకారం పోయి ఒక్క సారిగా వెలుతురు వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు నవ్వినట్టు, రాజశేఖర్ రెడ్డి హైటెక్ సిటీలో ఒక ఎకరా పోలం రాసిచ్చినట్టు ఫీలయ్యాడు.


“ఓహ్ అలాగా అయితే చెప్పండి వేణు గారూ ఎందుకు ఫోను చేశారో”


“ఆ ఏమీ లేదండి మీరు ఇండియా వెళ్ళేటప్పుడు మా ఏడేళ్ళ కొడుకును కూడా తీసుకెళతారా? హైదరాబాద్ ఏర్పోర్టులో దిగగానేఎ మా నాన్నా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు”


'ఏడేళ్ళంటే కాస్త చెప్పినట్టు వింటాడు. వాడికి చెడ్డీలు వేసేపని ముడ్డి తుడిచే పని చెయ్యక్కరలేదు. పైగా చంటి దానికి ఆడుకోటానికి పనికొస్తాడూ అని తెగ సంబర పడి పోయి “అయ్యో చిన్న పిల్లాడిని తీసుకెళ్ళడానికి అభ్యంతర మేంటండీ.మీరు నిరభ్యంతరంగా పంపించచ్చు” అనేశాడు. పాపం వేణు వాళ్ళ అబ్బాయి క్రమ శిక్షణ తెలియని సీను గాడికి తనెంత తప్పు చేశాడో అప్పుడు తెలియలేదు.


“చాలా థ్యాంక్సండి. మిమ్మల్ని డైరెక్టుగా ఏర్పోర్టులో కలుస్తానండి.” అని ఫోను పెట్టేశాడు.


“వేలూ మనం ఇండియా వెళ్ళేటప్పుడు మనతో పాటు వేణు గారి వాళ్ళ అబ్బాయి కూడా వస్తాడట కాస్త తోడు గా వుండమని అడిగారు. నేను సరే నని చెప్పేశాను.”


అలివేలు సీను గాడి వైపు గుర్రుగా చూసింది.


“అది కాదు పిల్ల వాడు కదా మన పాప కు కూడ కాస్త తోడుగా వుంటాడని నిన్ను అడక్కుండానే చెప్పేశాను.” వేడికోలు గొంతు తో చెప్పాడు.


అలి వేలు కాస్త చల్ల బడింది. “సరే లెండి ఇంకెప్పుడూ అలా హామీ లివ్వద్దు.” అని క్షమించేసింది.


మళ్ళీ ఫోను రింగయింది. శీను గాడు ఫోను తీసుకోబోతుండగా అలివేలు అడ్డుపడి చెప్పింది “ఇదుగో ముందుగానే చెబుతున్నా అడ్డమైన వాళ్ళందరికి వాళ్ళ గడ్డంతా ఇండియా మోసుకెళ్తామని చెప్పకండి” అంది.


“అరే నా మంచి అలివేలు నీ మాట నేనెప్పుడన్నా కాదన్నానా? యువ్ ఆర్ చో చ్వీట్. నీ మాటలు చాలా విలువైనవి.” అన్నాడు “దాంపత్య జీవితంలో సుఖాలు” అన్న బుక్కులోని 58 వ పేజీ గుర్తుకు తెచ్చుకొని. ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ 59 వ పేజీలోని విషయం గుర్తుకు రాలేదు.


ఫోను తీసి కాలర్ ఐడె చూస్తే అది ఇండియా నంబరు. ఇంతవరకు ఇక్కడి వాళ్ళే తమ లగేజీ ఇస్తారనుకుంటే ఇప్పుడు ఇండియానుండి ఫోను చేసి ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు కూడా తయారయినట్టున్నారు అనుకొని ఫోను తీశాడు.


“ఒరేయ్ లడ్డూ, నేన్రా మీ అమ్మని. ఫోను తీయడానికి ఇంత సేపా?”


“లేదమ్మా కాస్త బిజీ గా వుండి…”


“సరేలే మనవరాలు ఎలా వుంది, కోడలు పిల్ల బానే వుందా?”


“మనవరాలు నిద్ర పోతోంది. వేలూ తో మాట్లాడతావా?” అని నాలుక్కరుచుకున్నాడు.


“వేలేంటి”


“అబ్బా అది కాదు కొడలు తో మాట్లాడుతావా అని”


“ఒద్దులే ఇండియా వస్తున్నారుగా ఇక్కడ తీరిగ్గా మాట్లాడు కోవచ్చు. అసలు నేనెందుకు ఫోను చేశానంటే వచ్చేటప్పుడు ఓ పదో పరకో గోల్డ్ కాయిన్స్ తీసుకొని రా”


“ఏంటి పదా? నేనేమన్న గూగుల్ కంపెనీలో పని చేస్తున్నాననుకుంటున్నావా?”


“ఆ మాత్రం సంపాదించకపోతే అమెరికాకు వెళ్ళడమెందుకు. అసలు నాకు తెలీక అడుగుతా ఆ కో-ఆపరేటివె సొసైటీలో కొనుక్కొని ఆ పోస్టాఫీసు డబ్బులుతో సేవ్ చేసుకొని ఏమి సంపాదిస్తున్నావ్ రా?


“అమ్మా అది కో-ఆపరేటివ్ సొసైటీ కాదు. Costco అన్ని తక్కువ ధరకు అన్నీ అమ్మే డిస్కౌంట్ స్టోర్స్. పోస్టాఫీసు డబ్బులు కాదు. Mail-in-rebates అని ఏవన్నా కొంటే కొన్ని రిబేట్ కూపన్లు ఇస్తారు. వాటిని ఫిలప్ చేసి పంపిస్తే తరువాత మెయిల్లో చెక్కు డబ్బులు పంపిస్తారు”.


“ఆ ఏదో ఒకటి నాలుగ్గీక్కోడానికి కూడ పనికి రావు నీ సేవింగ్ డబ్బులు. ఎలాగోలా తగలడి కనీసం అయిదు గోల్డ్ కాయిన్స్ అన్నా తీసుకొని రా. సరేనా ఫోను పెట్టేస్తా”


ఆహా ఏమి నా జీవన సౌందరయ్యము అనే మెడిమిక్స్ సోప్ వాళ్ళ ప్రకటన గుర్తు వచ్చింది సీనుగాడికి.


“ఏమండీ రెడీ అయ్యారా పాపను తీసుకెళ్ళి కార్ సీట్లో వేసి కారు స్టార్ట్ చెయ్యండి నేను వస్తున్నా. లేటుగా వెళ్తే ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్ మాల్ లో రష్ ఎక్కువుంటుంది.”


“ఆహా ఏమి నా జీవన సౌందరయ్యము..ప్రకృతి నుండి పుట్టింది ఆయుర్వేదం…నా మనసు నుండి పుట్టింది నిర్వేదం “ అని బయటకు అనేసి ఎవరూ వినలేదు కదా అని కారు కీస్ కోసం పరిగెత్తాడు.


(సశేషం)

10 comments:

రానారె said...

యర్రంశెట్టి శాయి రచనల్లాగా అద్యంతమూ ఒక మోస్తరు హాస్యం, ఉన్నట్టుండి ఫకాల్ ఫకాల్ మనిపించే సన్నివేశాలు, సంభాషణలు. బాగా రాస్తున్నారు. ముఖ్యంగా డా.దుమారం అనే పేరు, చివర్లో మెడిమిక్సు రీమిక్సు చాలా బాగున్నాయ్.

One Stop resource for Bahki said...

హ హ్హ హ హ్హ ...హి హి....ఒహో..ఇన్నికస్టములా ...భలే చెప్పారు

Srini said...

ఇంకా ముందు ముందు మా సీనూ గాడు ఎన్ని కష్టాలు పడతాడో ఏమో...కథ మంచి రసపట్టులో ఉంది.

వెంకట రమణ said...

రెండోభాగం కూడా మొదటి దానికి ఏమాత్రం తగ్గలేదు. మిగతావి కూడా త్వరగా వ్రాసెయ్యండి.

మంజుల said...

హమ్మయ్య! ఇవ్వాల్టికి సరిపడా నవ్వేసుకున్నా.
పుస్తకాలు చదివి జనాల్ని impress చెయ్యటం..:) ఆయనెవరో నాలాంటాయన లానే ఉన్నాడు. pity.

సిరిసిరిమువ్వ said...

సీను గారూ
మీరు త్వరలో ఇండియా వస్తున్నారని తెలిసింది, మీరేమి అనుకోకపోతే ఇండియా వచ్చేటప్పుడు డాక్టరు దుమారం రాసిన "భార్యను సంతోష పెట్టడమెలా" పుస్తకం అమెరికాలో దొరుకుతుందట కొంచం తెచ్చిపెట్ట్గగలరా?

Unknown said...

ఓ నాకు కూడా ఓ ఎక్స్ బాక్స్ తెద్దురూ...
భలే ఉంది కథ.

రాధిక said...

ఇప్పుడే నేను ఇది చదివి ఖల్ ఖల్ మని నవ్వి పెళ్ళు పెళ్ళు న వాంతి చేసుకున్నాను.అమ్రికా వస్తున్నా,ఇండియా వెళుతున్నా ఈ లగేజీ కష్టాలు తప్పవు.పాపం సీనుగాడికి ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పెట్టబోతున్నారో విహారి గారు?

రాజశేఖర్ said...

విహారి గారు ..
చాలా బాగా వ్రాస్తున్నారండీ..ఇప్పుడే రెండు భాగాలూ చదివాను.
అయినా సస్పెన్స్ తప్పట్లేదు :)

Moyin said...

షాపింగ్ లిస్ట్ చాలా సహజంగా ఉందండి. ఐపాడ్, గోల్డ్ కాయిన్స్, న్యకీ షుస్..... బావుంది. కానివ్వండి. 3,4,5,6... ఎపిసొడ్ ల కోసం ఎదురుచూస్తునాం.