సమస్య సమస్యను పరిష్కరిస్తుంది
ఇంద్ర సభ అయిపోయింది అందరూ వారి వారి విశ్రాంతి గదులకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. సభ ప్రారంభ మయినప్పట్నుండి ఎస్.వి.రంగారావు ఎన్టీఆర్ ను గమనిస్తూనే వున్నాడు. ఎన్టీఆర్ ఎంతో విచారంగా కనిపించాడు. అది చూసిన ఎస్వీ రంగా రావ్ తన పక్క నున్న పి.వి.నరసింహా రావు చెవిలో ఏదో వూదాడు. పి.వి.నరసింహా రావు వడివడిగా అడుగులు వేసి పరుగున ఎన్టీఆర్ ను చేరాడు.
“ఏమిటి రామా రావ్ గారు ఎందుకు విచారంగా వున్నారు?” పి.వి. అడిగాడు.
“ఎందుకు లెండి బ్రదర్ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది” ఎన్టీఆర్ సమాధానం.
“అది కాదండీ బాధ చెప్పుకుంటే తగ్గుతుంది ఆనందం పంచుకుంటే పెరుగుతుంది. మీరేమీ అనుకోకపోతే మీ విచారానికి కారణం సెలవిస్తే మాకు తోచిన సాయం చేస్తాం” అన్నాడు పి.వి.
“ఏముంది బ్రదర్ మొన్ననే నా పుట్టిన రోజు నా తెలుగు తమ్ముళ్ళు ఘనంగా చేశారని ఆనందించాను. నా గురించి మహానాడులో గొప్పగా కూడా చెప్పారు. కనిష్ట జామాత కూడా నా గురించి అంత బాగా చెబుతాడనుకోలేదు”.
“అవును నేను కూడా గమనించాను. మన తెలుగు దేశంలో మీ మీద ప్రేమ చెక్కు చెదర్లేదు. అందులో విచారించడానికి ఏముంది చెప్పండి” పి.వి. చెప్పాడు.
“అంతటితో ఊరుకున్నారా? మహా నాడులో నా గురించి చెప్పినదానికి నా జ్యేష్ట పుత్రిక ఒక ప్రకటన ఇచ్చింది. దానికి విరుగుడుగా తెలుగు తమ్ముళ్ళు ఇంకో ప్రకటన ఇచ్చారు. అంతటితో ఆగక జ్యేష్ట జామాత ఇంకో సెటైరు”
అంతలో అక్కడికి వచ్చిన ఎస్వీఆర్ “చూడు సోదరా నువ్వేమీ బాధ పడకు ఏ డొంగ్రే ఎలా మాట్లాడినా మీ గొప్పతనం ఎక్కడికీ పోదు. సింహం ఆంధ్ర లోకంలో వున్నా ఇంద్ర లోకంలో వున్నా సింహం సింహమే” అన్నాడు పులి బోన్లో వున్నా బయట వున్నా పులి పులేరా డోంగ్రే అన్న దాన్ని గుర్తుకు తెచ్చుకొని.
“అలా కాదు బ్రదర్ నేను సింహన్నే కానీ నా తోక పట్టుకుని వీళ్ళు పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. నేను పార్టీ పెట్టిందే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం. అది పుట్టినదే కాంగ్రేసు కు వ్యతిరేకంగా. తెలుగు వాడు ప్రధాని అవుతున్నాడని మన బ్రదర్ పి.వి. నంద్యాలలో ఎం.పి.గా నిలబడినప్పుడు పోటీ కూడా పెట్టలేదు. అంతటి తెలుగు అభిమానిని నా బొమ్మ పేరు పెట్టుకుని నా గురించి చులకనగా మాట్లాడుతారా?”
“నిర్భయంగా మాట్లాడలేని అర్భకులు. కాసుకు కొరగాని హీనుల కేకలకు కలత వలదు సోదరా..కలత వలదు” అన్నాడు ఎస్వీఆర్
“నా మనసు కుదుట పడటం లేదు బ్రదర్”
“చూడండి రామా రావు గారు, మీరు దానికే ఇంత చింతిస్తే మొదటి తెలుగు ప్రధాని అయిన నా పార్ధీవ శరీరాన్ని సరీగా దహనం చెయ్యకుండా కట్టెలకోసం కక్కుర్తి పడ్డ మా వాళ్ళనేమనాలి. ఏదయినా సమస్య వస్తే దానికి పరిష్కారము ఏంటో తెలుసా? ఎప్పుడైనా సమస్య వస్తే.. ఎప్పుడైనా సమస్య వస్తే.. ఎప్పుడైనా సమస్య వస్తే.. దానికి పరిష్కారం.. దానికి పరిష్కారం..”
“మా మతులు గతి తప్పి పోవుచున్నవి. ఆలసింపక ఆ ఆలోచనను అనుగ్రహించండి అది ఆచరణీయమో కాదో తేల్చి చెప్పెదము” అన్నాడు ఎస్వీఆర్.
“బ్రదర్ మీరు మమ్ములను మరింత విచారమునకు గురి చేయుచున్నారు. తొందరగా చెప్పండి” అన్నాడు ఎన్టీఆర్.
“ఏదయినా సమస్య పరిష్కరించాలంటే దానికి ఒకటే మార్గం ఏమీ చేయకుండా పోయినచో సమస్య సమస్యను పరిష్కరిస్తుంది. మీరు ఇదొక సమస్య అనుకొన్న ఏడల ఈ సమస్యను సమస్య పరిష్కరిస్తుందని ఊరుకోండి చాలు ” అన్నాడు పి.వి.
“అవును బ్రదర్ మీరు చెప్పింది కరక్టే అనవసరంగా నా మనసును పాడు చేసుకున్నాను. ఇక వస్తాను బసవ తారకం గారు నా కోసం ఎదురు చూస్తున్నారు.గుంటూరు శేషేంద్ర శర్మ గారు మొన్ననే వచ్చారు. వారికి అన్ని సౌకర్యాలూ చూసిపెడతానని చెప్పాను. సతీ సమేతంగా వెళ్ళి వారిని కలిసి వచ్చెద.”.
--: 0 :--
7 comments:
ఇంద్ర సభలో మీ విహారం అదిరింది.
-నేనుసైతం
http://nenusaitham.wordpress.com
చాలా చక్కగా ఉంది మీ టపా. రామారావు, ఎస్వీ రంగారావు, పి.వి.ల భాష చక్కగా కుదిరింది.
బ్రహ్మాండం.
జామాత అంటే అల్లుడా?
చాలా బాగుంది.
వరెవ్వా!! ఎవ్వరిమాటలు వాళ్లకు అతికినట్టు సరిపోయాయి.
S.V. రంగారావు గారు వాడుక భాషలో మట్లాడితే మరింత బాగుండేది...
రంగారావు గారి “నిర్భయంగా మాట్లాడలేని అర్భకులు. కాసుకు కొరగాని హీనుల కేకలకు కలత వలదు సోదరా..కలత వలదు” డయిలాగ్ అదిరింది
చాలా బాగుందండీ. రామారావుగారి చాలా గొప్ప మనిషి.
మీ టపా చదువుతున్నంతసేపూ ఏదో ఉద్వేగం.
Post a Comment