Tuesday, July 17, 2007

తానాలో ఈ-తెలుగు…..ఉప్చ్.. మిస్సయింది.

(ఇందులో సొంత డబ్బా కూడా కలదు ..)

ఈ సారి తానా లో మన ఈ-తెలుగు( బ్లాగులు, వికీపీడియా వగైరాలు..) గురించి చెప్పేదానికి ఒక స్టాలు కోసం అడగడం జరిగింది. అది కాస్త ముందుగా కార్య రూపం దాల్చలేదు కానీ. తానా సభల రెండో రోజు మాత్రం మనకు స్టాలు దొరికే అవకాశం కలిగింది. నేను స్టాలుకోసం అడిగినతను నన్ను స్టాల్స్ దగ్గరకు తీసుకెళ్ళి కొన్ని ఖాళీగా వున్నాయి తీసుకొంటారా అని అడిగారు. స్టాలు దగ్గర పెట్టాల్సిన సరంజామా లేనందున అన్నింటికి మించి అక్కడ చూసిన “క్రమ శిక్షణ “ వల్ల ఒద్దనేయడం జరిగిపోయింది.

రెండో రోజున యధాలాపం తెలివి మీరి మధ్యాహ్నం భోజనాలు తొందరగా తినేసి అక్కడ ఒక గదిలో “నృత్య పోటీలు” జరుగుతున్నాయంటే అక్కడికెళ్ళి కూలబడ్డా సతీ సమేతంగా. పోటీల్లోని వర్గాలు సీనియెర్స్, జూనియెర్స్, సబ్ జూనియెర్స్. మళ్ళీ అందులో క్లాసికల్, ఫోక్, టాలీవుడ్ వున్నాయి. కొన్ని వర్గాల్లో అసలు పోటీనే లేదు. పాల్గొన్నవాళ్ళే విజేతలు. మా పెద్ద బుడ్డోడు, ఋషీల్, వాషింగ్టన్ లొకల్ వాళ్ళు వేస్తున్న ఒక టాలీవుడ్ నృత్యానికి తూనీగలు అవసరమైతే ఆ వేషం కట్టాడు. వాడికి తోడు తూనీగ వాడి మేనమామ కూతురు, శ్రేయ. ఇద్దరూ అయిదేళ్ళ బుడ్డోళ్ళే. ఇద్దరూ వున్నది “తూనీగా తూనీగా..” పాటలో కాసేపు రెక్కలు కట్టుకుని ఎగరడం అంతే. ఇంకా ఆ పాటతో పాటు ఆ రోజు పాల్గొన్న ఇంకొన్ని నృత్యాల్లో మా ఆవిడ వాళ్ళ అక్క కూతురు, మేఘ, వుండడం వల్ల అక్కడే ఖైదు అయిపోవలసి వచ్చింది. ఈ టాలీవుడ్ డ్యాన్స్ మెడ్లీ లో వున్న పాటలు "గోగులు పూచే…", "ముత్యమంతా పసుపు ముఖమంత..", "తూనీగా తూనీగా.." మరియూ "జల్లంత కవ్వింత కావాలి..." పాటలు. ఈ పాటలకు నేపథ్యంగా డ్యాన్స్ ముందు చెప్పండానికి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పమని నన్నడిగితే కాస్త రాసిచ్చాను. తీరా వాషింగ్టన్ వెళ్ళేసరికి ఆ చదివేదేదో నన్నే వేదిక ఎక్కి చదివెయ్యమన్నారు. ఒప్పుకోక తప్పింది కాదు.

అక్కడ వేసిన డ్యాన్సుల్లో కాస్త మంచి సాహిత్యం వున్న రెండు మూడు పాటల్లో ఇవి కూడా వున్నాయి. మిగిలినవన్నీ “చికి చికి మస్తానా..” “చొక్కా చింపేస్తా..” “లాగు లాగేస్తా..” “తిమ్మప్పల నాయిడో..” లాంటి పాటలు. పోటీలు మాత్రం ఠంచనుగా 2:30 P.M. కి పదునుగా మొదలు పెడతామని 4:00 PM వరకు చెప్పారు. చివరికి ఎలాగెలాగో మొదలు పెట్టారు. మొదలు పెట్టేముందు చిన్న ప్రకటన “ రావాల్సిన జడ్జులు ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ ఎవరన్నా ఉద్ధండ పిండాలు వచ్చి జడ్జిల స్థానంలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము” అని చెప్పారు. దాదాపు ఆరు నెలల ముందునుండి తెలుసు పోటీలు వుంటాయని అలాంటప్పుడు జడ్జీలు ఎలా రాకుండా పోతారు అని సందేహాలొస్తే “ట్రాఫిక్ ఎక్కువయుండచ్చు”. ఇది రోడ్డు మీద కావచ్చు, బుర్ర మీద కావచ్చు. మిగిలిన సందేహాల నివృత్తి కోసం www.ask.com కు వెళ్ళండి.

కార్యక్రమాన్ని ప్రారభిస్తున్నామని ఇక్కడే పుట్టి పెరిగిన ఓ 18 ఏళ్ళ అబ్బాయి మాంచి డెనిం షార్ట్స్ వేసుకుని అచ్చనైన ఆంగ్లమ్న్లో లయ బద్దంగా మాట్లాడి Indian Idol కారుణ్యను వేదిక మీదకు పిలిచి రెండు ముక్కలు మాట్లాడ మన్నాడు. కారుణ్య వేదిక నెక్కగానే కొన్ని కుర్ర కారులు విజిల్స్ వేశాయి. కారుణ్య చిక్కటీ పలుకులు తెలుగులో పలికి కిందికి వచ్చిన తరువాత పోటీలు ప్రారభమయ్యాయి. ఇక పోటీలు ప్రారంభమయ్యాయి. మొదట సీనియెర్స్, తరువాత జూనియెర్స్ ఆ తరువాత సబ్ జూనియెర్స్ అన్నారు. అది నిజమని ఎవరన్నా అనుకుంటే వాళ్ళందరూ $375.00 (జంటకు) డబ్బు కట్టి వచ్చిన వాళ్ళు అని అర్థం చేసుకోగలరు. అలా అనుకోని వాళ్ళు బాగా “స్థా(తా)న” బలము కలిగిన వాళ్ళు అని అర్థం. దీనికోసం మీరు www.ask.com కు వెళ్ళక్కర్లేదు.

ఇక చూసే వాళ్ళ మెదడుకు మేత. ఒక సారి జూనియెర్స్ కేటగిరీ, వెంటనే సీనియెర్స్ కేటగిరీ. చెప్పేదొకటి చేసేదొకటి. ఏలాగయితే నేం ఆ వ్యాఖ్యాత పొట్టి పాంటు వేసుకున్నా గట్టిగానే మ్యానేజ్ చేశేశాడు. ఇక్కడ పుట్టిన వాడా మజాకానా. సీనియెర్స్ విభాగంలో వాళ్ళందరూ ఒకే గ్రూపు అనుకుంటా. గ్రూపులోనూ వాళ్ళే, సోలోలూనూ వాళ్ళే. డ్యాన్సులయితే బాగానే చేశారు. అన్నీ ఊపు పాటలే మరి. సబ్ జూనియెర్స్ విభాగంలో ఒకబ్బాయి “నాయిడో నాయిడో తిమ్మప్పల నాయుడో” పాటకు చేసిన డ్యాన్స్ అందరిని వెర్రెత్తించింది. అలా ఒక దాని తరువాత ఒకటి ఊపు పాటలన్నీ అయిపోయాకా మా బుడ్డోళ్ళ డ్యాన్స్ వచ్చింది. అవన్నీ చూసాక నేను రాసికొచ్చింది చదవను అని చెప్పేశా ఎందుకంటే అన్ని ఊపు పాటల్లో ఇది చదివితే ఎంత మంది బుర్ర కెక్కుతుందో అని. కుదరదు చదవాల్సిందే అన్నారు.

చేసేదేమీ లేక నేను వేదిక ఎక్కి రాసుకొచ్చింది ఇలా చదవటం మొదలు పెట్టా "మన భరతావనికి భాషా, సంస్కృతి,సంప్రదాయాలే పట్టుగొమ్మలు. భాష లేనిదేసంస్కృతి లేదు సంస్కృతి లేనిదే బాష రాదు.అదేబాషకు సంస్కృతికి ఉన్న విడదీయరాని అనుబంధం. కమ్మనైన బాషా సంస్కృతి సౌరభాలను విరబూసివెదజల్లుతోంది వాటికి పుట్టినిల్లయిన ఆంధ్ర దేశం.అటువంటి అంధ్ర దేశంలో ప్రశాంత జీవనానికి కల్మషం లేని మనసులకు ప్రతి బింబాలు మనపల్లెలు.పల్లెటూళ్ళ పేర్లు వినగానే మనకు గుర్తుకువచ్చేది ప్రకృతి అందాలతో అలరారే పల్లె జీవనం.పచ్చని పంట పొలాలు, వివిధ రంగులతో మొగ్గలుగా ప్రకాశించి వికసించే అడవి కుసుమాలు, ఆ పూలకోసం తుమ్మెదలు, పూదోటలో సయ్యాట లాడేతూనీగలు, కోకిలల కిల కిలలు, తీతువు పిట్టల తియ్యటి రాగాలు, వేకువ ఝాము కోడి కూతలు. తెలతెల వారుతుండగా ముంగిళ్ళలో వేసే మనోహరమైనముగ్గులు, పడి లేచి పరుగులు పెట్టే తువ్వాయిలు.వీటికి తోడుగా పండగ సందళ్ళు మొదలైతే... అదిచూసి తొలకరి జల్లు పులకరిస్తే.. ఇన్ని సంబరాలు కనుల ముందు కదలాడుతుంటే పెద్దలకు కూడ ఎగిరి గంతులేయాలనిపిస్తుంది. మనకే అలా వుంటే చిరుజల్లులకే ఒళ్ళు పులకరించి తుళ్ళిపడే చిట్టిపాదాలు,తూనీగలతో ఆడుకునే చిన్నారి చేతులుఎలా స్పందించి ఉప్పొంగి నాట్యం చేస్తాయో మీరే మీకళ్ళతో చూసి ఆనందించండి."

అంతవరకు ఊపు పాటలు చూసిన వాళ్ళకు కాస్త తెరిపిగా అనిపించిందో ఏమో చప్పట్లు కొట్టారు(???). మా బుడ్డోళ్ళు డ్యాన్స్ మొదలు పెట్టారు. అక్కడున్న అందరూ ఇక చప్పట్లు, ఈలలు, కేకలు. ఆ రోజు వున్న అన్ని డ్యాన్సుల్లోకి మంచి కాస్ట్యూంస్, ప్రాప్స్ తో చేసినది ఇది ఒక్కటే. చివరికి ఆ విభాగంలో వీళ్ళకే ప్రైజ్. బహుమతులివ్వడానికి సినీ నటి రమాప్రభని పిలిచారు. ఆవిడ మాత్రం “భూమి కిందకి” టైపు. పిల్లలని బాగా దగ్గరకి తీసుకొని ముద్దులాడుతూ , వళ్ళో కూచోపెట్టుకుని మరీ ఫోటోలు దిగారు.

ఈ టాలీవుడ్ డ్యాన్సు ప్రాప్స్ తోటి చాలా బావుడడం వల్ల తరువాతి రోజు ప్రైం టైంలో పెట్టించాల్సిన కార్యక్రమం అని అందరూ చెప్పేశారు. ప్రైంటైములొ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలే వుంటాయి కదా అని గట్టిగా అంటే అందరూ కిసుక్ 116 అని చూస్తారు. కాకపోతే ప్రైం టైంలో పదేళ్ళ లోపు వున్న పిల్లల కార్యక్రమాలు వుండవ్ అని ఎవరో చెప్పారు. అలాగయితే ఉదయం పెట్టిస్తాము అన్నారు అక్కడ వున్న వాళ్ళు. ఉదయం అంతే 10 నుండి 12 మధ్యలో అన్నమాట. అప్పుడు మూడు నాలుగు వేల మందో వుంటారు పెద్ద వేదిక మీద. సాయంత్రమయితే ఓ ఎనిమిది వేల మంది దాకా వుంటారు. అంటే నేను తానా పెద్ద వేదిక నెక్కొచ్చన్న మాట. వెంటనే నా బుర్రలో వెలిగింది థామస్ అల్వా ఎడిశన్ కనిపెట్టింది. స్వామి కార్యంతో పాటు స్వకార్యం చేస్తే పోలా. వేదిక నెక్కినప్పుడు తెల్ల చొక్కా మీద e-telugu.org అని రాసుకుని ఎక్కడం. అప్పటికప్పుడు అలా చెయ్యడం కుదరకపోతే పిల్లల క్రేయన్లు ఉపయోగించో లేక మరింకేదయినా చేసో చొక్కా మీద రాసెయ్యాలని నిర్ణయించేశా. అలా ఊహాలోకాల్లో తేలుకుంటూ రాత్రి కార్యక్రమాలు చూసేసుకుని (అంటే ఆ వేదిక మీద నన్ను ఊహించేసుకుని) ఇంటికి బయలు దేరుతూ వుంటే ఈ డ్యాన్స్ కోఆర్డినేటర్ (మా ఆవిడ వాళ్ళ అక్క) నుండి ఫోను. మనము పది గంటలకు అక్కడికి చేరాలంటే అందరూ ఇంట్లో ఆరు గంటలకు లేచి బయలుదేరాలి. ఇప్పటికే పిల్లలని చాలా కష్ట పెట్టేశాం. అక్కడ “క్రమ శిక్షణ-సమయ పాలన” చాలా ఎక్కువ మన పిల్ల వాళ్ళు అది భరించలేరు. అందువల్ల మనం పెద్ద వేదిక మీద డ్యాన్స్ చెయ్యడానికి వెళ్ళడం లేదు అని ఏకగ్రీవంగా తీర్మానించేశాం అని చెప్పింది.

అలా రెండో సారి ఈ-తెలుగు గురించి కాస్త చెప్పే అవకాశం పోయింది.

9 comments:

cbrao said...

నృత్యానికి పరిచయం బాగా చెప్పారు. e.తెలుగు గురించి పెద్ద వేదికలలో తెలియచెప్పటానికి ఏదన్నా ఉపాయం ఆలోచించాలి.న్యూ యార్క్ నగరంలో 2008 ATA సభలలో మన తెలుగు వాణి వినిపించేలా చెయ్యాలి. మీకు ATA వాళ్ళు తెలుసా?

కొత్త పాళీ said...

మా ఆవిడ వాళ్ళ అక్క = మా వదిన గారు :-)

తీతువు పిట్టల తియ్యటి రాగాల్తో అదరగొట్టేసి మొత్తానికి తెలుగు సంకృతిని అక్కడ ఏక చేత్తో మోసేశారన్నమాట! అభినందనలు.

ఋషీల్ - శ్రేయ ఐదేళ్ళ బుడ్డోళ్ళు తూనీగ రెక్కల మిద స్టేజంతా ఎగిరటం .. ఊహించుకుంటేనే ముచ్చటేస్తోంది.

spandana said...

తానా మళ్ళీ కళ్ళముందు కదలాడింది మీ బ్లాగు చదువూతూంటే.

కొత్తఫాళీ గారూ,
మా ఆవిడ వాళ్ళ అక్క = మా వదిన గారు అంటే నేను ససేమిరా ఒప్పుకోనండి.
ఇలానే చాలా సమీకరణాలు వున్నాయి.
మా వదిన గారు = మా అన్నయ్య భార్య :)


--ప్రసాద్
http://blog.charasala.com

Ray Lightning said...

మీరు చదివిన ఆ ఉపోద్ఘాతం అదిరిందండి ! చాలా బాగుంది :)

leo said...

నృత్యం చూడలేకపోయాం కానీ మీ పరిచయం అదరహొ!

రానారె said...

www.ask.com ప్రస్తావన చాలా బాగుంది. విసుగుతెప్పించే అనుభవాలను ఇట్లా తమాషాగా రాయాలంటే చాలా ఆరోగ్యంకావాలి. అభినందనలు.

Naga said...

మీలాంటి వారు ఒక్కరున్నా :-] తెలుగు భాషకు వెయ్యేళ్ళు ఢోకా లేదనిపిస్తుంది!! - బాగుంది.

Anonymous said...

@ రావ్ గారు,

థ్యాంక్స్.

ఆటా కమిటీ లోని కొందరు తెలుసు. 2008 ATA సమావేశాలప్పుడు తెలుగు వాణి గురించి చెప్పే అవకాశం ఎక్కువుంది. తానా దెబ్బకి హిప్నోథెరపీ చెయించుకుంటున్నా. కాస్త కంపార్ట్ మెంటలిజం వచ్చాకా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తా :-) (పోగొట్టుకున్నచోటే వెదుక్కోవాలి కదా మరి)

@ కొత్త పాళీ గారు,

ఆ వదిన నాకన్నా చిన్న దయితే ఎలా పిలవాలి?

ఏదో లెండి మానసికానాందం కలిగింది అలా కొంతసేపు మాట్లాడేసరికి.

@ ప్రసాద్ ,

ఇంకా ఎంతో రాయాలనుంది కానీ సమయం తక్కువ. తాజాదనం పోతోంది రాసేసరికి.

రే లైటింగ్ గారు,

థ్యాంకులు. అవునూ మీరు వకీబానా?

@ లియో గారు,

ధన్యోస్మి.

@ రానారె,

ఆరోగ్యం సంగతేమో గానీ. తానా కు వెళ్ళినందుకు ఖర్చు రెండు వేలు. అక్కడి నుండి తీసుకొచ్చిన వైరస్ ను వదల గొట్టుకోడానికి మా పెద్ద బుడ్డోడి ఆస్పత్రి ఖర్చు ఇంకో రెండు వేలు. అలా నాలుగు వేల ఆనందాలు.

@ నాగరాజ గారు,

మరీ ఎక్కువ మోసేస్తున్నారండి :-) ఏదో బడుగు జీవిని.

-- విహారి

krishnamurthy punna said...

మీ బ్లాగు ఆహ్లాదంగా ఉంది. ఈ తెలుగు గురించి ఈ సారయినా చెప్పే అవకాశం రావాలని ఆశిస్తున్నాను.దీప్తిథార భాస్కరరావు గారి ద్వారా ఈ తొలి తెలుగు మెసేజ్ ఇస్తున్నాను.