Tuesday, August 07, 2007

ఆనంద రావ్ అనుభవాలు -2

:

ఇది కేవలం కల్పితం. యదార్థ సంఘటనల ఆధారంగా రాయ బడిందని ఎవరైనా అంటే అది వాళ్ళ తప్పే కానీ విన్న వాళ్ళ తప్పు కాదని మనవి. పేర్లు కూడా కల్పితమే.

:

అంత పెరుగు తిన్న ఆనంద రావ్ అది అరిగిపోయేలోపు ఆ టేబుల్ మీదనే ఓ నిద్దరేశాడు. చెక్క భజనలు మంద్ర స్థాయిలోకి వెళ్ళగానే నిద్రా దేవి ఆనంద రావ్ నుండి దూరంగా పారిపోయింది. అప్పుడే తెల్లారిపోయిందా అని కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ లేచి నిలబడి భజన బాగుందని చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళతో పాటు చప్పట్లు కొట్టుకుంటూ తోసుకుంటూ హాలు లోపలి నుండి బయటికి వచ్చేశాడు. అలా ఇంటికెళ్ళాక కూడా చప్పట్లు కొట్టుకుంటూ నిద్రపోయాడు. అర్ధ రాత్రి నిద్రలో మెళుకువ రాగానే లేచి చప్పట్లు కొట్టాడు. ఆ దెబ్బకు నిద్ర పోతున్న బుడ్డోడు లేచి “అమ్మోయ్ బుచాడెవడో నన్ను పిలుస్తున్నాడు” అని ఏడుపు లంఖించుకున్నాడు. ఈ భజన చప్పట్లు ఇంతటితో ఆగవని వాళ్ళావిడ ఓ తాడు తెచ్చి ఆనంద రావ్ రెండు చేతులని రివర్సు గా కట్టేసి పడుకుంది. ఆనంద రావుకు వున్న కొన్ని దివ్య గుణాల్లో మతి మరుపు ఒకటి. అదొక వరమని ఎప్పుడూ చెబుతుంటాడు. పొద్దున్నే లేచిన ఆనంద రావ్ ముందు రోజు జరిగిన విశేషాలు మరచిపోయాడు.


యధాలాపంగా రెండో రోజు సంబరాల్లో దూరి పోయాడు. రెండో పేజీలో మూడో ప్రోగ్రాం చూడాలని ఉబలాట పడి అది ఏ రూములోనో కనుక్కుని ఆ రూముకు చేరేసరికి అక్కడ ఉండాల్సిని ప్రోగ్రాం అయిపోయింది. అది పోతే పోయిందిలే భోజనానికి వెళదామని పక్కకు తిరిగితే అక్కడో పెద్ద లైను కనిపించింది.

దాన్ని చూసి అక్కడున్న బ్యాడ్జి వీరుడిని అడిగాడు.
“బత్తిన సోదరులు ఉబ్బసానికి చేప మందు గానీ వేస్తున్నారా? అంత పెద్ద లైను వుంది ఇక్కడ ”

“హహ్హా…హ్హ్హా. యూ నో..దిస్ లైన్ లీడ్స్ టూ కేఫిటేరియా నో ఉబ్బసం మందు. ఓన్లీ ఉదరానికి విందు” అన్నాడు వికటాట్టహాసం చేస్తూ.

“భోజనాలు పెట్టే చోటు పక్క బిల్డింగ్ లో కదా ఇక్కడ కూడా పెడుతున్నారా” అంత సౌకర్యంగా చేస్తున్నారేమో సదుపాయాలన్నీ అని ఆశగా అడిగాడు.

“రెండు బిల్డింగుల్లో పెట్టేంత సీను లేదు. దిస్ లైన్ డిరెక్ట్లీ గోస్ టూ దట్ బిల్డింగ్”


ఆనంద రావ్ టైము చూసుకున్నాడు. అసలే భోజనాలు పెట్టే సమయం 11:30 నుండి 1:30 వరకు మాత్రమే. వెంటనే వెళ్ళక పోతే అక్కడ కూడా గంట కొట్టేస్తారు అని ఒక్క గెంతున లైన్లో చేరిపోయాడు. అక్కడ కేఫిటేరియా ఎంట్రన్సు దగ్గరికి వెళ్ళేసరికి 1:29 అయింది. అందరూ లైన్లో వెళుతుంటే కొంత మంది నెక్లెస్ రాణులు, రంగుల ఉంగరాల రాజులు తాపీగా పక్క నున్న సందులో(నాన్-రాచ మార్గం) నుండి వెళ్ళి పోతున్నారు బ్యాడ్జ్ వీరుల సహాయంతో.


ఆనంద రావు భోజనం టికెట్లు ఇచ్చేసి లోపలికి వెళ్ళాడో లేదో ఆ దారి మూసేశారు. అక్కడ టికెట్లు తీసుకుంటున్న ఆఫ్రికన్ అమెరికన్ సోదరుడు పక్క సందులోనుండి (నాన్-రాచ మార్గం) వస్తున్న వాళ్ళను ఆపేసి “ఐ యాం నాట్ గోయింగ్ టూ అలో ఈవన్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఆఫ్టర్ 1:30 పీ.యెం” అని గట్టిగా అరవడం వినిపించింది.


హడావిడిగా అక్కడ భోజనాలు గావించేసి నృత్యపు పోటీలు తిలకించడానికి వెళ్ళి పోయాడు ఆనంద రావు. ఆ పోటీలన్నీ అయిపోయేసరికి అయిదున్నర అయింది. పెద్ద హాలులో జరుగుతున్న కార్యక్రమాలు చూడ్డానికి వెళ్ళబోతే వాళ్ళావిడ ఆపేసింది.

“ఏం భోజనాలు ఒద్దా” అంది.

“ఏంటి అప్పుడే భోజనాలా? ఎప్పుడన్నా ఈటైముకు నువ్వు ఎసట్లో బియ్యమేశావా. నువ్వు పొయ్యి వెలిగించేదే ఏడున్నరకు కదా”

“అది ఇంట్లో. ఇక్కడ కాదు. పద పద భోజనాల టైము 5:30 నుండి 7:30 వరకు మాత్రమే."

“నాకు ఆకలేయటం లేదే”

“అలా అయితే అక్కడికొచ్చి తిన గలిగినంత దవడల కింద కుక్కుకోండి. తరువాత ఆకలేసినప్పుడు నెమరు వేసుకోవచ్చు”

“అంతేనంటావా?”

“తప్పదు పదా”.

(అక్కడ కన్వెన్షన్ సెంటర్ నియమాల ప్రకారం టైమును పాటిస్తారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి)

వీలయినంత లాగించేసి పెద్ద హాల్లో కొచ్చేశాడు. ముందు సీట్లు చూస్తే అన్నీ ఖాళీగానే వున్నాయి. ముందు కూచుంటే చాలా బాగుంటుంది కదా అని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళాడు. మొదటి వరుసంతా కుర్చీల మీద పేపర్లు కనిపించాయి.


ఓహో ఇవి తెల్ల చొక్కా వీ.ఐ.పి.ల కేమో అని రెండో వరస చూశాడు. అక్కడ కుర్చీల మీద కర్చీఫులు, కట్ బనీన్లు,కట్ డ్రాయర్లూ, ప్యాంట్లూ, షర్ట్లూ కనిపించాయి. అయ్యో పాపం ఎవరో తడిసి ముద్దయి పోయినట్లున్నారు వెనకలేస్తే ఎవరైనా కొట్టేస్తారని ముందు వరసల్లో ఆరేసినట్లున్నారని అది వదిలేసి మూడో వరస చూశాడు.

ఆశ్చర్యం ఈ సారి కూడా సేం కాంబినేషన్ కర్చీఫులు,కట్ బనీన్లు…వగైరా. కాక పోతే డ్రెస్సు కలరు వేరు. ఇలా లాభం లేదని కొద్దిగా దూరంగా వెళ్ళి అన్ని వరుసలు ఒకే సారి చూశాడు. రాఘవేంద్ర రావు సినిమాలో ఇత్తడి బిందెలన్నీ వరసగా పెట్టి శ్రీదేవి చేత డ్యాన్సు వేయించినట్టు ప్రతి వరుసలోనూ ఏదో ఒక వస్త్రం ముక్క పెట్టి వుంది. రాఘవేంద్ర రావే గనుక వచ్చివుంటే ఏ త్రిషానో, స్నేహానో ఆ కుర్చీల మీద పరుగులు పెట్టించి "కట్.. కట్.. కట్.. కట్.. బనీన్లు.. చెఫ్.. చెఫ్.. చెఫ్.. చెఫ్.. కర్చీఫులు.. " అని ఓ పాట తీసుండేవాడు.

అలా ముందుకు చూస్తున్న ఆనంద రావ్ వెనుక నున్న వాళ్ళను గమనించలేదు. తన వెనుక ఐపాడ్ ల కోసం నులుచున్నంత క్యూ వుంది. తను ముందుకు వెళ్ళకుండా అక్కడ నిలబడి చూస్తున్నందుకు గుర్రు గుర్రు మని గస పెడుతున్నారు. ఆనంద రావ్ తేరుకుని పరుగులు పెట్టుకుంటూ ఇరవై అయిదో వరుసలో కూల బడ్డాడు.


వేదిక మీద రక రకాల ప్రొగ్రాములు ఆనంద రావు బుర్రకు పరీక్షలు పెట్టాయి. ఒక నాటకంలో అయితే మరీనూ ఒక పాత్ర మాట్లాడితే రెండో పాత్ర ఏమి సమాధానం చెబుతుందో వినిపించడం లేదు. అంటే ఆ మైకులు సి.ఐ.ఏ. నుండి తెచ్చినవి. రహస్యంగా మాట్లాడుకుంటాయి. మాట్లాడింది బయట వాళ్ళకు వినపడ నివ్వవు.

అక్కడ ఆనందరావు లేచి నిల బడి చప్పట్లు కొట్టింది ఒకే ఒక కార్యక్రమానికి. సినీ నటుడు చిన్ని కృష్ణ ఒక్క ఆంగ్ల పదం లేకుండా తెలుగులో 45 నిముషాలు మాట్లాడినప్పుడు. పన్లో పనిగా నిలుచున్న వాళ్ళందరి చేతా “నేను తెలుగులోనే మాట్లాడు తాను” అని అందరి చేత ప్రమాణం చేయించాడు.

యువతరం వాళ్ళు వేసిన డ్యాన్సులు నిజంగా యువతరానికే. ఆనంద రావ్ తను యువకుడు కాదని బుడ్డోడికి పాలు పట్టడంలో నిమగ్న మైపోయాడు. ఇంతలో ముందు వరసలో పెట్టిన కర్చీఫులు, బనీన్లు వాళ్ళు గొడవ పడుతున్నారు. అక్కడ గాలికి ఒక కర్చీఫు పడిపోతే ఇంకొకాయన వచ్చి కూర్చున్నాడు. ఆ కర్చీఫ్ నేను వేసానంటే లేదు నేను వచ్చినప్పుడు పేపర్ నాప్కిన్ కూడా లేదంటాడీయన. అలా కొంత సేపు గొడవపడి ఒకే కుర్చీ మీద ఇద్దరూ కూర్చున్నారు కర్నాటక లో జనతా దళ్, బి.జె.పి. ముఖ్యమంత్రి పదవిని పంచుకున్నట్లు. ఇలాంటి సన్నివేశాలతో పాటూ వి.వి.వినాయక్ స్టయిల్లో “నువ్వు హైద్రాబాద్ లో దిగు నిన్ను ఏయిర్ పొర్ట్ లోనే లేపేస్తా” లాంటి సీన్లు కూడా చూశాడు.

మూడో రోజుకి ఆనంద రావు పూర్ణ పురుషుడు అయిపోయాడు.

భోజనాల దగ్గర టైముకు ముందే వున్నాడు. ఏ రూములో ఏ కార్యక్రమం జరుగుతోందో పసి గెట్టేశాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే పలకరించడం మానేశాడు. కనిపిస్తే తల తిప్పుకుని వెళ్ళిపోతున్నాడు. చివరికి వాళ్ళే వచ్చి పలకరించడం మొదలు పెట్టారు.

ఏవైనా కొందామని అక్కడ వున్న స్టాల్స్ కు వెళ్ళాడు. తీరా చూస్తే యాభై శాతానికి పైగా రియల్ ఎస్టేట్ వీరుల స్టాల్సే. పెద్ద పెద్ద వలలు పట్టుకుని, రంగు రంగుల బొమ్మలు పెట్టుకుని అచ్చనైన ఆంగ్లంలో మాట్లాడుతూ వాళ్ళ ప్రాజెక్ట్ పొడుగు వెడల్పులు చెబుతున్నారు. భూములు కొనేముందు “భూమి కోసం” సినిమా, ఇల్లు కొనేముంది “ఇల్లు కట్టి చూడు” సినిమా చూసి తరువాత కొనాలని ఆనంద రావ్ ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్ళ లేదు.

ఒక పుస్తకాల షాపు దగ్గరకెళ్ళి పది పేజీలున్న పంచతంత్ర చిన్న పిల్లల పుస్తకం ధర అడిగాడు.

“కోటి రూపాయలు” చెప్పాడా యజమాని.

“ఏమిటి”

“ఈ పుస్తకం ధర కోటి రూపాయలు సార్”

“అంత ధరెందుకు దాని మీద 10 రూపాయలేగా వుంది”

“అక్కడి నుండి ఇక్కడికి షిప్మెంటూ, ట్యాక్సూ అన్నీ కలిపితే అంతే అవుతుంది సార్”. ఆ మాత్రం లెక్కలు తెలీనోడికి వీసా ఎలా ఇచ్చారు అన్నట్లు చూశాడు.

“సరే అయితే ఈ హనుమాన్ డి.వి.డి. ఎంత?”

ఆనంద రావు వైపు కూడా చూడలేదు.“ముప్పై కోట్లు’

ఆనంద రావ్ జేబు చూసుకున్నాడు. కొన్ని పుస్తకాలూ, కొన్ని డి.వి.డి లు తీసుకొని ఎన్నో కోట్లు ఆ షాపు యజమానికి ఇచ్చి వెనుతిరిగాడు.

ఆ షాపు యజమాని వెంటనే వాళ్ళ ఆవిడకు ఫోను చేసి “ఒసేవ్ నీకు డైమండ్ నెక్లెస్ తీసుకు రమ్మన్నావ్ కదూ అదేం కర్మ విలువైన ఎమరాల్డ్ నెక్లేస్ తీసుకొస్తా ఇక్కడ వాషింగ్టన్ లోని ఫేమస్ షాపు నుండి. నీకు నా ముద్దులు.” అని మాట్లాడ్డం వినిపించింది.


ఆ రోజు కార్య క్రమాలు తెగ ఎంజాయ్ చేశాడు.వ్యాఖ్యాత ముద్దు తెలుగులో “ఇక్కడ్ కొచ్చిన్ టెల్గు వారందరికి నమష్కారం” అని మొదలు పెట్టగానే ఆహా ఒక్క ఆంగ్ల పదం కూడా లేదని మురిసి పోయాడు. ఒక కార్యక్రమం అయిపోయిన తరువాత “ఈ ప్రోగ్రాం ఇరగ్ దీషారు కదా” అంటే ఆనంద రావే మొదట చప్పట్లు కొట్టాడు.


మైకులు పని చేయక పోయినా, సౌండు సరీగా లేక పోయినా ఏమీ బాధ పడలేదు. ఒక కేంద్ర మంత్రి “ఏ దేశ మేగిన ఎందు కాలిడినా… అని చాటి చెప్పిన గురజాడ అప్పారావు అడుగుజాడల్లో మీరు నడవాలి.. ” అన్నప్పుడు రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పా రావూ ప్రజల మనుషులే కదా ఎవరు చెబితే ఏంటి అని సమాధాన పరుచుకున్నాడు.


ప్రతి కార్యక్రమానికి చప్పట్లు కొట్టే వాళ్ళలో మొదటి వాడు అయ్యాడు. ఏక్కువ చప్పట్లు కొట్టే ప్రేక్షకుడి అవార్డు తరువాత సంవత్సరం ఇస్తామని అడ్రెస్ తీసుకున్నారు కూడా. వజ్ర శర్మ తను సంగీతం కూర్చిన పాటలు మాత్రమే పాడినా చప్పట్లు కొట్టాడు. ఎదురుగా కూచున్న చిన్ని కృష్ణ భజన చేసుకుంటూ చెప్పిన పాటలు, మధ్యలో తెలివిగా కిలో స్టార్ ని పొగుడుతూ పాడిన పాటలూ అన్నీ చూసేసి “భజనే రా అన్నిటికి మూలం.. ఆ భజన విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం..” అని పాడుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకుని పది తెలుగోత్సవాల అనుభవాలను చంకనేసుకుని బయటికొచ్చాడు.


(సమాప్తం)

2 comments:

క్రాంతి said...

కట్.. కట్.. కట్.. కట్.. బనీన్లు.. చెఫ్.. చెఫ్.. చెఫ్.. చెఫ్.. కర్చీఫులు.. excellent! మీరు ముందే రాఘవేంద్రరావు గారికి మీ పాట ఎందుకు వినిపించలేదు? "శ్రీ రామదాసు"లో పెట్టేవారు కదా.

Niranjan Pulipati said...

సరదాగా బాగా రాశారు :)