Sunday, August 05, 2007

స్నేహితుల రోజున బెస్ట్ ఫ్రెండ్ అవార్డ్

:

స్నేహం అంటే ఒక ఆత్మీయ అనురాగం. స్నేహితుడెవడంటే కష్టమైనా నష్టమైనా నీతోనే వుండే వాడు. ప్రపంచమంతా నిన్ను వదిలేసినా నీ వెన్నంటి వుండే వాడు స్నేహితుడు. అలా ఎప్పుడూ సర్వ కాల సర్వాయవస్థలందు కలిసి మెలసి వుండి వెన్నంటి వుండే వాళ్ళకు ఒక అవార్డు ఇస్తే ఎలా వుంటుంది? ఆ ఆలోచన రాగానే మొదటగా నాకు తట్టింది మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. అందుకని ఆ అవార్డుని ఆయనకిచ్చేద్దామని డిసైడ్ అయిపోయా.


అవార్డు ఇవ్వటానికి తీసుకొన్న కారణాలు:


"వాళ్ళు నన్ను గత నలభై ఏళ్ళుగా నమ్ముకుని వున్నారు.వాళ్ళకు ఏదో ఒకటి చెయ్యాలి. అందుకని నాకు తోచిన విధంగా సహాయపడుతున్నా తప్పా?" అని పబ్లిక్ ని ప్రశ్నించడం ఆయన స్నేహ ధర్మాన్ని, స్నేహపు విలువల్ని తెలియ జేస్తుంది.


పార్టీలతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు ఎవడైనా సరే తన వాడు అంటే చాలు అతన్ని ఎలాగైనా గెలిపించడానికి, ఏ సహాయం అయినా అందించడానికి వెనకాడే వాడు కాదు. అసెంబ్లీ లో తన పార్టీ వారికి వ్యతిరేకంగా మాట్లాడి ఎన్ని మైకులు విరగ్గొట్టినా (లెక్క ఓ 54 అనుకుంటా), సొంత పార్టీ వారి సభల్లో రాళ్ళు వేయించినా ఈ రోజుటి వరకు తన తోనే వుండి తనను అభిమానించే స్నేహితులు కలిగివుండటం సామాన్య మైన విషయం కాదు. ఆలా వున్నారంటే ఆయనలో ఒక గొప్ప స్నేహితుడు వున్నాడని అర్థం. తన ఊరి వారి కోసం ఏ ప్రధాన మంత్రీ, ఏ ముఖ్య మంత్రీ చెయ్యనన్ని పనులు భూగర్భ డ్రైనేజీ, రింగు రోడ్డు, ప్రాజెక్టులు, అనుచరులకు కాంట్రాక్టులు ఇలా ఎన్నో మరెన్నో చేశారు. ఇదంతా కేవలం తనను అభిమానించినందుకు ఇచ్చిన నజరానా. సైకిలు కూడా లేనివారికి స్కార్పియోలు రావడం ఈ స్నేహం మాధుర్యం యొక్క ప్రభావం మాత్రమే.


అంతటి ఆత్మీయుడికి "బెస్ట్ ఫ్రెండ్" అవార్డు ఇవ్వాలని నా తరఫున ఇచ్చేస్తున్నా.



:

4 comments:

జ్యోతి said...

నిజమే కదా! వై ఎస్ ఆర్ నిజంగా గొప్ప స్నేహితుడు. ఎంత మందికి సాయం చేసాడో ఎవడేమనుకుంటే నాకేంటీ అని. మొన్న జరిగిన తండ్రుల దినోత్సవంలో కూడా అతనికి గొప్ప తండ్రి అని ఇవ్వాల్సింది. కడప మొత్తం కొడుకుకు ధారాదత్తం చేసాడు.

రానారె said...

అవునా, అలా చేశాడా!? లేక ఆ రెండు పత్రికల్లో చదివింది ఇక్కడ రాస్తున్నారా?

రానారె said...

మీకు నచ్చని బ్లాగుల గురించి రాయడానికి ధైర్యం కూడగట్టుకుంటున్నారా?

Anonymous said...

@ జ్యొతక్కోయ్,

అంత గొప్ప స్నేహితుడిని కోల్పోవటం చంద్ర బాబు దురదృష్టం.

@ రానారె,

ఆ రెండు కాదు ఇరవై రెండు పత్రికలు చెప్పాయి.

నే రాస్తే గా ధైర్యం అవసరమవడానికి :-)

-- విహారి