Friday, June 29, 2007

ఐ ఫోను – ఎన్టీఆర్

:

ఈ ఐ ఫోనుకు ఎన్టీఆర్ కు లంకెంటని “హా”శ్చర్య పోకండి. నేను మాట్లాడ బోయేది క్రేజు గురించి అనగా వెర్రి వేయి టైపులు గురించి .


మొన్నా మధ్య అంటే కొన్ని నెలల క్రితం షాపింగ్ కు వెళితే Best Buy షాపు పక్కన సందులో కుర్చీలు వేసుకుని బీరు తాగుతూ, దుప్పట్లు కప్పుకుని ల్యాప్ టాప్ మీద సినిమాలు చూసుకుంటున్నారు కొంత మంది. ఏంటి సంగతి అని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది ఆ రోజు రాత్రి హ్యారీ పాటర్ పుస్తకం విడుదల అవుతోందట. దాన్ని కొనటానికి అలా లైన్లో ఎదురుచూస్తున్నారు. ఆ పుస్తకం మీద వాళ్ళకున్న మక్కువ అంతది మరి. ఇలా ఎంత మందున్నారో అని చూస్తే అది కాస్త హనుమంతుడి తోక లాగా పక్క షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళింది. ఇలాంటి లైను గనుక మన దగ్గర వుంటే “చాయ్..చాయ్ గరం చాయ్“ అని బక్కెట్లో కప్పులేసుకుని అమ్మేవాళ్ళూ, “ టైం పాస్ బఠాణీ సార్, టైం పాస్ బఠాణీ సార్” అని గంపలో రూపాయి పొడవు కూడా లేని చుట్టిన పేపర్లో వేసిన బఠాణీలు అయిదు రూపాయలకు అమ్మేవాళ్ళూ కనిపిస్తారు. ఇక్కడ (అమెరికా) అభివృద్ధి చెందేసిన దేశం కనుక అలాంటి కప్పులోళ్ళను, బఠాణీ గాళ్ళను రానివ్వరు. వారి స్థానాల్లో కెమరాలూ, మైకులు పట్టుకున్న ముద్దు గుమ్మలు కనిపిస్తారు. పైన ఏ “9 న్యూస్” వాడో “తొంభై తొమ్మిదో న్యూస్” వాడో హెలికాప్టర్ లో నుండి ఇంకో కెమరా కిందికి పెట్టి ఫీట్లు చేస్తూ ఆ లైను చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఏ దిక్కుమాలినాడో రాత్రంతా మేల్కొని పొద్దున్నే ఎండ బడకుండా ఓ పుస్తకాన్ని మొహమ్మీద వేసుకుని గురకలు పెట్టేవాడు కనిపిస్తే వాడి ముఖాన్ని క్లోజప్ లో చూపిస్తారు. ఇలాంటి సీను మళ్ళీ ప్రత్యక్షం ఇప్పుడు ఐఫోన్లకోసం.

అసలు విషయంలోకి వచ్చేముందు మన క్రేజు గురించి కొంచెం. నేను మదనపల్లె లో ఇంటర్ చదివేటప్పుడు మా రూము పక్కన ఒక టీ కొట్టు వుండేది. అందులో మస్తాన్ అని ఒక ఎన్టీఆర్ వీరాభిమాని వుండేవాడు. అవి జస్టిస్ చౌదరి, కొండ వీటి సిం హం లాంటి అన్న గారి సినీ జగత్తు శుక్ల మహర్దశ రోజులు. మస్తాన్ టీ కొట్టులో పనిచేస్తున్నందుకు రోజుకు మూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు. అతనికి ఇల్లు కూడా వుండేది కాదు. ఆ వీరాభిమాని అన్న గారి ఫోటో ఫ్రేము ఒకటి చేయించుకున్నాడు ఓ ఇరవై రూపాయలు పెట్టి. దాన్ని దాచుకొనేదానికి స్థలం లేక మా రూములో పెట్టేవాడు. రెండు మూడు రోజులకొకసారి రూముకు వచ్చి ఆ ఫోటో తీసి తనివి తీరా చూసుకుని మళ్ళీ ఆ ఫోటో రూములో భద్రంగా పెట్టి వెళ్ళి పోయేవాడు. పరీక్షలయిపోయాక మేము రూము ఖాళీ చేసేటప్పుడు ఎంతో బాధ పడ్డాడు ఆ ఫోటో పెట్టుకోడానికి మళ్ళీ భద్రమైన చోటు దొరుకు తుందో లేదోనని.


ఐఫోన్లో కొస్తే ఈ ఐఫోన్ల గురించి ఇప్పటికే తెలుగు బ్లాగుల్లోకి వచ్చేశాయి వాటి గురించి ఇక్కడోసారి , ఇక్కడోసారి, ఓపికుంటే ఇక్కడింకోసారి చదువుకోవచ్చు. ఈసారి మాత్రం దీని క్రేజు బాగా నషాలానికంటింది (స్పెల్లింగ్ ప్లీజ్..) మన శివాజీ సినిమా లాగా. వాడెవడో శుక్ర వారం సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యే ఐ ఫోను కొనడానికి సోమ వారం పొద్దున 4 గంటలకు న్యూయార్క్ ఆపిల్ స్టోర్స్ ముందు కుర్చీ వేసుకుని ఎదురుచూస్తున్నాడట. ఇంకోడెవడో దీన్ని కొనటానికి వాడి బైకూ, కారూ రెండూ అమ్మేశాడట ( రెండూ కలిపి అయిదొందల డాలర్లు చెయ్యలేదేమొ). టి.వి. లో వార్తలు పెడితే చాలు ఎవడో ఒకడి ముక్కులో మైకు పెట్టైసి వాడు చెప్పే సోది అంతా వినిపించేస్తున్నారు. వాడు వాడి జబ్బ మీద వున్న తేళ్ళూ పాముల పచ్చ బొట్లు చూపిస్తూ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఇంకొకావిడెవరో నోట్లోని నాలుక మీదున్న రింగులు బయటికి వెళ్ళబెట్టి "నా రింగూ.. ఐ ఫోను రంగూ" అని పళ్ళికిలించేస్తోంది. అందరూ శుభలేఖ సినిమాలో సుధాకర్ అన్నట్టు "బికాజ్ ఐ లవ్ ఐఫోన్" అంటున్నారు.ఇలా లైన్లో వున్నోళ్ళకు నీళ్ళూ, జ్యూసులు అందించే ధర్మ దాతలు కొందరు.


ఇదిలా వుండగా ఆపిల్ కంపెనీ వాళ్ళ లెక్క ప్రకారం 2010 కి వీళ్ళు ఒక కోటి ఐఫోన్లు అమ్ముతారంట. మన GDP ఇప్పుడు ఒక బిలియెన్ డాలర్లు(1$=40Rs). అంటే 2010 కి వాళ్ళ అమ్మకాలు ఇప్పటి మన GDP కి అయిదింతలు.



మన భారత్ లో 2008 కి కానీ విడుదల కావట. కొసమెరుపెంటంటే వీటిని $25 కి unlock చేస్తామని డిల్లీ పాలిక బజార్ వాళ్ళు చెబుతున్నారట. జై హైటెక్ భారత్.


:


లేఖిని
వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.

:

2 comments:

rākeśvara said...

నేనూ ఎక్కడో చదివా, మనవాళ్ళు బాంబే నుండి కొన్ని ఐ ఫోనులు ఆడర్ చేసి, అక్కడ వాటి తాళం తెరిచి, ఇంచుమించు ఒ ముప్పై వేలకి భారతంలో అమ్మేసుకుంటారట. మంచది అనుకున్నా...

Anonymous said...

@ రకేశ్వరరావు గారు,

జానెడు పొట్టకోసం.. జూహూ బీచ్ లో ఇల్లుకోసం చెయ్యక తప్పదు మరి.

-- విహారి