Thursday, July 12, 2007

ఆనంద రావ్ అనుభవాలు -- 1

ఇది కేవలం కల్పితం. యదార్థ సంఘటనల ఆధారంగా రాయ బడిందని ఎవరైనా అంటే అది వాళ్ళ తప్పే కానీ విన్న వాళ్ళ తప్పు కాదని మనవి. పేర్లు కూడా కల్పితమే.


తెలుగోత్సవాలు జరుగుతున్నయంటే మందహాసం ఆనంద రావ్ పంచెగ్గట్టుకుని టికెట్లు కొనుక్కుని పక్కూరు కెళ్ళాడు. ఉత్సవాలు జరిగే స్థలం దగ్గరికి ఆనంద రావ్ అందరికన్నా ముందు వచ్చాడు కార్యక్రమ టికెట్లు తీసుకొని పోదామని. అక్కడ కౌంటర్ల దగ్గర ఖాళీగా వుంటే అక్కడికెళ్ళి అడిగాడు.

"ఏమండీ నేను అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకున్నా నా టికెట్లెప్పుడు ఇస్తారు"
అక్కడ తెలుగులో వున్న బ్యాడ్జ్ పెట్టుకునివున్నతను
"సారీ సార్ వుయ్ ఆర్ నాట్ గివింగ్ టికెట్స్ నౌ. లుక్ అట్ దట్ కౌంటర్. యు కం దేర్ అట్ త్రీ పీ ఎం. యు విల్ గెట్ యువర్ టికెట్స్ దేర్" అన్నాడు.
"మరిక్కడ ఈ కౌంటరు ఎందుకు"
"దిస్ ఈజ్ ఓన్లీ ఫార్ ఆన్ సైట్ బుకింగ్".

ఓహో అలాగా అని వెళ్ళి పోయి మూడు గంటల తరువాత వచ్చాడు ఆనంద రావ్. లైన్లో అందరూ బుద్దిగా నిలుచున్నారు టికెట్లు తీసుకోడానికి. ఆనంద రావ్ కూడా ఆ లైనులో జననీ జన్మ భూమిశ్చ అని పాడుకుంటూ లైనులో కలిశాడు టికెట్లు తీసుకోవడానికి. ఆ లైను ఎంతకీ కదలడం లేదు. ఇంతలో లైను వెనకనున్నతని దగ్గరికి కోటు వేసుకుని బ్యాడ్జ్ పెట్టుకున్న ఒకతను వచ్చి

"సుబ్బా రావు గారూ పని అయిపోయింది మీరు వచ్చేయండి లైనులోనుండి" అన్నాడు.
సుబ్బా రావు వెంటనే అక్కడనున్న శ్రీమతి సుబ్బా రావుతో "వచ్చెయ్యవే అప్పా రావు గారు మన టికెట్లు తీసుకొని వచ్చేశారు" అన్నాడు. అంతే సుబ్బా రావు కుటుంబమంతా వెళ్ళి పోయింది లైను వదలి. మందహాసం ఆనంద రావ్ అనుకున్నాడు 'చా ఈ వెళ్ళే వాళ్ళెవరో నాముందు నున్న వాళ్ళు వెళ్ళ వచ్చుకదా అప్పుడు చక్కా తాను ముందుకు వెళ్ళుండచ్చు' అనుకున్నాడు.ఇంతలో వెనక సందడి మొదలయింది.


"వెంకట్రావు గారూ, బావున్నారా?" ఓ బ్యాడ్జి బాబూ రావ్ పలకరింపు.
"హలో బాబూ రావ్ గారూ మీరా! బావున్నారా?"
"ఏమిటి టికెట్లు కావాలా? మీ నంబరు చెప్పండి.నేను తీసుకొని వస్తా"
బాబూ రావు రెండు నిముషాల్లో ప్రత్యక్షం టికెట్లతో. వెంకట్రావు మాయం మూడో నిముషంలో.

ఆలోచిస్తూ వుండగా ఎవరో ఆనంద రావ్ ని పలకరించారు.
"డూ యు నో హౌ లాంగ్ ఇట్ ఈజ్ గోయింగ్ టూ టేక్?" లైన్లో వెనకనున్నతను.
ఆనంద రావ్ తెలుగు అభిమాని. తెలుగు కోసం వచ్చిన వాడు తెలుగులో మాట్లాడ లేదని బాధ పడలేదు. బహుశా తనకు తెలుగు రాదనుకుని మాట్లాడి వుంటాడు తను మాట్లాడితే తెలుగులో మాట్లాడుతాడులే అనుకొని.
"తెలీదండీ ఎందుకనో ఈ లైను కదలడం లేదు"
"లెట్స్ సీ..." అని "ఆర్ యు అటెండింగ్ టునైట్స్ డిన్నర్"
"అవునండీ"
"డూ యు నో దె సెడ్ దె విల్ నాట్ అలో కిడ్స్ బిలో 17 ఇయెర్స్"
"తెలీదండీ అలా అని రిజిస్టర్ చేశే టప్పుడు చెప్పలేదే"
"యాక్చువల్లీ ఐ వాంటెడ్ టూ బ్రింగ్ మై డాటర్ కిడ్స్ టూ. బట్ దె ఆర్ నాట్ అలొయింగ్"
వీడెవడ్రా బాబూ ఎంతకీ తెలుగు లోకి షిఫ్ట్ కాడు. అయినా సరే తను తగ్గకూడదనుకున్నాడు ఆనంద రావ్.
"వీళ్ళ నడిగి కనుక్కుంటే సరిపోతుంది" అన్నాడు.

కాసేపు విరామం.

"ఆర్ యు లోకల్"
"లేదు దీనికోసమే ఇమానంలో ఎగిరి వచ్చా"
"ఓ ఐ సీ"
"వాట్ డూ యు డూ?"
"నాది లెక్కలు చూసే ఉద్యోగం. మీరేమి చేస్తుంటారు"
"మై డాటర్ ఈజ్ హియెర్. ఐ హ్యావ్ అ స్మాల్ బిజినెస్"

......

ఆనంద రావ్ ఇంక మాట్లాడలేదు. స్మాల్ బిజినెస్ ఫ్ల్యాష్ బ్యాక్ గుర్తొచ్చింది.
కాసేపటికి ఆ స్మాల్ బిజెస్ మ్యాన్ చేతిలో వున్న పేపర్ చూసి ఒక బ్యాడ్జి అతను వచ్చి "సార్ ఈజ్ దిస్ యువర్ రిజిస్ట్రేషన్ పేపర్" అన్నాడు.
"ఎస్స్..ఎస్సెస్స్...ఎస్స్" అన్నాడు స్మాల్ బిజినెస్స్ మ్యాన్.
"ఓ కె. యు కం దిస్ సైడ్ సార్" అని బ్యాడ్జ్ మ్యాన్ స్మాల్ బిజినెస్స్ మ్యాన్ ని తీసుకుని వెళ్ళిపోయాడు.
మందహాసం మ్యాన్ ఊపిరి పీల్చుకున్నాడు.
స్మాల్ బిజినెస్ మ్యాన్ వెళ్ళి పోవడం వల్ల ఆనంద రావ్ వెనక్కి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు.అందులో ఒకామే " డూ యు నో ఇఫ్ దిస్ లైన్ ఈజ్ ఫార్ ప్రీ రిజిస్ట్రేషన్" అని అడిగింది ఆనంద రావ్ని.
"ఐ థింక్ సో" అని ఊరకున్నాడు మ.ఆ.

ఈ సారి మందహాసం మ్యాన్ అదృష్టం బావుండి ఓ బ్యాడ్జ్ మ్యాన్ వచ్చి అడిగాడు రిజిస్ట్రేషన్ నంబరుందా అని అడిగితే ఉందని ఆ నంబరు చెప్పాడు. బ్యాడ్జ్ మ్యాన్ కాసేపటికి తిరిగి వచ్చి "యు కం విద్ మీ అండ్ స్టే హియెర్ టు కలెక్ట్ యువర్ టికెట్స్" అన్నాడు.
వెంటనే వెనక నున్న ఇద్దరు అందమైన ఆడవాళ్ళు కూడా వచ్చి నిలబడి "థ్యాంక్ గాడ్ వు ఆర్ గెట్టింగ్ అవర్ టికెట్స్" అంది.
ఆనంద రావ్ నవ్వి ఊరుకున్నాడు.

తనకు వచ్చిన టికెట్లను తీసుకుని దూరంగా వెళ్ళి అన్నీ వున్నాయో లేదోనని పరిశీలించు కున్నాడు. ఆ రోజు రాత్రి వున్న ప్రత్యేక కార్యక్రమం టికెట్లు కనిపించక పొయ్యేసరికి వెళ్ళి అక్కడ వున్న ఒక బ్యాడ్జ్ మ్యాన్ ని అడిగాడు.
"మాస్టారూ రాత్రి ప్రత్యేక కార్యక్రమం టికెట్లు రాలేదు. అసలు వున్నాయా లేక అవి అవసరం లేదా"
ఆ బ్యాడ్జ్ మ్యాన్ తెల్ల మొహం వేసి ఇంకొంచెం తెల్లగా వున్న బ్యాడ్జ్ మ్యాన్ దగ్గరకు తీసుకెళ్ళాడు.
ఆ బ్యాడ్జ్ మ్యాన్ ఎంతో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతూ "నువ్వో వెధావాయ్" అని ఫేసు పెట్టి " ఐ డోంట్ థింక్ దేర్ ఆర్ ఎనీ టికెట్స్ యాస్ సచ్" అన్నాడు. అబ్బో కుర్రోడు వృధ్ధిలోకొస్తాడనుకొని అక్కడి నుండి ఆనంద రావ్ వెళ్ళి పోయాడు పెళ్ళాం పిల్లలున్నచోటికి. ఆ టికెట్లు కొన్ని బుక్కులు, బ్యాగూ తీసుకొని లగ్గేజీ ఎక్కువవుతుందని అన్నీ తీసుకెళ్ళి కారులో పడేసి వచ్చాడు.

సాయంత్రాం రానే వచ్చింది. ప్రత్యేక కార్యక్రమానికి ప్రవేశం మొదలయింది. తీరా అక్కడి కెళ్ళి చూస్తే ఏముంది అందరి చేతుల్లో లోపలికెళ్ళ డానికి టికెట్స్ వున్నాయి. అప్పుడు చూశాడు ఏవో అడ్వర్టైజ్ మెంట్ల లాగా వున్న పేపర్లు ప్రత్యేక కార్యక్రమం టికెట్లని.పరుగున వెళ్ళి ఆ టికెట్లు తీసుకుని వచ్చాడు. వస్తూ వస్తూ ఎస్కలేటర్ ద్వారా లోని కి పంపించే దగ్గర టికెట్లు చింపుతున్న బ్యాడ్జ్ మ్యాన్ ని అడిగాడు.

"పిల్లని లోపలికి అలో చేస్తున్నారా మాస్టారూ" అని.
అలో అన్న ఇంగ్లీష్ పదానికి పనిష్మెంట్ గా "వుయ్ ఆర్ నాట్ అలోయింగ్ ఎనీ కిడ్స్ బిలో 17 ఇయెర్స్" అని గట్టిగా చెప్పాడు.
అప్పటికే లోపలికి వెళ్ళి లైను కాళింది మడుగులోని సర్పం లా చుట్టలు చుట్టుకుని పోయింది. పెళ్ళం పిల్లల్ని వదిలేసి ఆ సుడి గుండం లో దూకాడు. ఓ 15 నిముషాలకు ఎస్కలేటర్ దగ్గరకు వచ్చి టికెట్లు ఇవ్వబోతుంటే అక్కడికి వచ్చి దూరు తున్నారు కొంత మంది కోటు బాబులు, రవ్వల నెక్లెస్ రాణులు.

"డాక్టర్ గారూ మీరిలా వచ్చేయండి. అయ్యో శకుంతల గారూ ఆ భరతుడిని ఇలా తీసుకు రండి"
"అయ్యో సీత గారూ రామున్ని ఇలా రమ్మనండి" అన్న మాటలు విన బడ్డాయి. అలా దూరిన వాళ్ళు టికెట్లు చింపుకోకుండానే ఎస్కలేటర్ ఎక్కేశారు. "మనోడా" మజాకానా!!! ఎస్కలేటర్ ఎక్కుతూ డాక్టర్ గారి భార్య "అరే ఈ టికెట్లు తీసుకోలేదే? సరేలే తలా ఒకటి తీసుకోండి" అని అక్కడున్న పెద్దలకిచ్చేసింది. ఇంకా కొన్ని టికెట్లి మిగిలిపోయాయి.

"అరే వీటి నేమి చెయ్యాల్" అని నాలుక్కరుచుకుని అక్కడే తమ తో పాటు వస్తున్న అయిదారేళ్ళ పిల్లలిద్దర్ని పిలిచి "మీరు కూడా తలా ఒకటి
వుంచేసుకోండి" అంది. వాళ్ళు ఆనందంగా తీసుకొన్నారు. ఇంకా ఒక టికెట్ మిగిలి పోయింది ఆవిడ చేతిలో. అప్పుడు మళ్ళీ వెలిగింది ఆ టికెట్లు చింపలేదని. టికెట్లు చింపుకోవాలి అన్న ఒకరి సలహాతో అందరూ వికటాట్టహాసం తో పర్రు పర్రు మని చింపేసి రెండో ముక్కను అక్కడ పడేశారు.ఈ చోద్యమంతా చూస్తున్న ఆనంద రావ్కి ఒళ్ళు మండింది.

తీరా లోపల హాలులో కెళ్ళ బోయే ముందు ఆ రెండో ముక్క ను కూడా తీసుకోడానికి గేట్ కీపర్ గా ఓ నల్ల జాతీయుడిని పెట్టారు. పాపం అతన్ని చూస్తే ఆనంద రావు కి జాలేసింది. అక్కడికెళ్ళి నిల్బడ్డం ఆలస్యం.ఓ ఖద్దరు చొక్కా బ్యాడ్జ్ మ్యాన్ అక్కడికొచ్చి "హె వి.ఐ.పీస్ కమింగ్ మ్యాన్" అన్నాడు

గేట్ కీపర్ "ఓ.కె. యు టెల్ మీ హౌ మెనీ"

ఖ.బ్యా.మ్యా."టెన్" అన్నాడు.లోపలికేమో ట్వెంటీ వెళ్ళి పోయారు "పదండి ముందుకు తోసుకు ముందుకు" అని పాడుకుంటూ. ఆ గేట్ కీపర్ అప్పుడు వాడిన భాష "టెల్ మె ద .... .. నంబర్ మ్యాన్ ".

అలా పాత స్మృతులతో కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ లోపలికి వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు ఆనంద రావ్. పాపం అఆనంద రావ్ కి అటువంటివి ఇంకా ముందు ముందు ఎన్నో వుంటాయని వూహించి వుండడు.లోపలికెళ్ళి అక్కడ తన ఫ్రెండ్ టేబుల్ దగ్గర కొన్ని టికెట్లు వుంటే అవి తీసుకుని బయటికెళ్ళి పెళ్ళా పిల్లలని తీసుకొని ఎస్కలేటర్ లేకుండా లిఫ్ట్ లో హాల్లోకి వచ్చేశాడు. అలా ఆనద రావు కొంచెం తెలివిగా ప్రవర్తించడం నేర్చుకోవడం మొదలు పెట్టాడు. కార్యక్రమం మొదల్లోనే అక్కడ మాట్లాడే ఇంగ్లీషు చూసి డామ్మని పడి పోయాడు. అప్పుడు అతని ఫ్రెండ్ నీళ్ళు చల్లాడు లేపుదామని ఆనంద రావుకు ఎన్ని చల్లినా చలనం లేదు. అలా కాదని ఆ టేబుల్ మీదున్న జగ్గు తీసుకొని అందులోని నీళ్ళు ఆనంద రావు మొహం మీద పొశాడు అతని ఫ్రెండు.

పొసిన నీళ్ళను నోరు తెరిచి గటగటా తాగేశాడు ఆనంద రావ్. ఇలా లాభం లేదని పక్క టేబుల్ మీద నున్న జాగు తీసి ఆనంద రావ్ మొహం మీద పోశాడు. నోరు తెరిచి ఆ నీళ్ళు కూడా తాగేశాడు పాలు తాగేసే వినాయకుడు లాగా. అలా అన్ని జగ్గులు తీసుకుంటూ అక్కడ వేదిక దగ్గరనున్న టేబుల్ వరకు వెళ్ళి పోయాడు ఫ్రెండు. అక్కాడి దాకా వచ్చాము కదా అని అతని ఫ్రెండు అక్కడ కూచున్న చిన్ని కృష్ణ, విభీషణ బాబు, పార్వతి టంగ్ స్టన్ ల దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుని వాళ్ళ టేబుల్ పైనున్న జగ్గులో నీళ్ళు పోశాడు ఆనంద రావ్ మొహమ్మీద. అలా అన్ని జగ్గులు అయిపోయి ఫైర్ ఇంజెన్ కు ఫోను చేద్దామని బయటికి వెళుతుండగా టపీ మని లేచి నిలుచున్నాడు ఆనంద రావ్. ఆనందర్ రావ్ లేచు కూచున్నాడని తెలియగానానే అందరూ గ్లాసులో బీరు పోసుకొని (నీళ్ళు లేనందున) చీర్స్ చెప్పుకొని కార్యక్రమాలు ప్రారంభించారు. ఒక్కో కార్యక్రమం చూస్తూ ఆనంద రావ్ అక్కడ నున్న బీర్లన్నీ తాగేశాడు ఏ ప్రొగ్రామూ నచ్చక. బీర్లయిపోయినా కార్యక్రమాలు నడూస్తూనే వున్నాయి కాసేపటికి ఒకతను చేసిన మిమిక్రీ చూసి హుషారొచ్చి వెరైటీ గా విస్కీ తాగాడు.

ఆ తరువాత కొన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని సన్మానించడం చూసి ఆనంద రావుకు కళ్ళ లో నీళ్ళొచ్చాయి. అంత వరకూ తాగిన నీళ్ళన్నీ కన్నీళ్ల రూపంలో రావడం గమనించిన ఒక తెలివైన బ్యాడ్జ్ మ్యాన్ అన్ని టేబుల్ల దగ్గరనున్న జగ్గులు తీసుకొచ్చి ఆనంద రావు కళ్ళ దగ్గర పట్టాడు. నిండిపోయిన జగ్గులన్నింటి తీసుకెళ్ళి వాటి టేబుళ్ళ మీద పెట్టేశాడు. తరువాత కొంతసేపటికి గొప్పోళ్ళకు అవార్డుల కార్యక్రమం ఆ తరువాత భోజనం అని చెప్పి వ్యాఖ్యాత కిందికి దిగి రాగానే అక్కడున్న కుర్చీలు ఖాళీ అయిపోయాయి. తీరా అక్కడ భూతద్దం వేసుకుని చూస్తే అవార్డులు తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మాత్రం కుర్చీల్లో వున్నారు. ఇదేంటబ్బా ఇలా వుంది అని ఆనంద రావు బయటకు వెళ్ళి చూస్తే అక్కడున్న భోజనాల బఫే దగ్గర ఒక చెయ్యి ఒక కాలు మాత్రమే బయటకు కనిపిస్తూ తోసుకుంటూ ఒకరి తరువాత ఒకరు నిలబడి వున్నారు.
ఆనంద రావు కూడ పాంటుకు బెల్టు టైటుగా కట్టుకుని పరుగులు పెట్టుకుంటూ దూరంగా వున్న బఫే లైన్లో నిలబడ్డాడు. పోలో మంటూ ఇంకో వంద మంది వచ్చి లైన్లో నిలబడ్డారు "వేధవాయ్ నువ్వు నాకన్న ముందొచ్చావా" అనే ఫేసు పెట్టి.

ఆనంద రావ్ ముందు ఒకాయన నిలబడ్డాడు.వెనక వాళ్ళ బంధు వర్గమంతా ఓ ఇరవై మంది నిలబడ్డారు. ముందునున్నతను, "సుబ్బా రావు గారూ మీరంతా ముందు కొచ్చేయండి మన బ్యాచంతా తప్పి పోకుండా ఒక చోటుందాం" అని ఆనంద రావు వెనకనున్న వాళ్ళను లాగడం మొదలు పెట్టాడు. "ఓరి సుబ్బా రావు ఫ్రెండా నీ బ్యాచు అంతా కలిసుండాలంటే నువ్వొక్కడివి నా వెనక్కు వెళితే సరిపోతుంది కదా దానికోసం నీ రెజిమెంటు అంతా ముందుకు రావాలా. నీ తస్సాదియ్య" అని ఓ లుక్కు పదేశాడు. ఆ లుక్కులు పక్కన పెట్టి ఇలాంటివి చాలా చూశాం లేవోయ్ అన్నట్టు అందరికి ప్లేట్లు సప్ప్లై చేసేశాడు. ఆనంద రావు మాత్రం మళ్ళీ అన్నీ దొరుకుతాయో లేదో నని ప్లేటు నిండా పెట్టుకొని హాల్లో తన టేబుల్ దగ్గర కూల బడ్డాడు.అక్కడ చూస్తే కొందరి ప్లేట్లలో జిలేబీలు జాంగ్రీలు కనబడ్డాయి. అరె ఇవి కూడా వున్నాయా అని వాకబు చేసి వెళ్ళేసరికి అన్ని గిన్నెలూ ఖాళీగా కనిపించాయి.అక్కడ వుండాల్సిన రొట్టెల ప్లేటు కూడా ఖాళీగా కనిపించింది. అంటే లేటుగా వెళ్ళిన రొట్టెల పెట్టె ఖాళీ డబ్బా పెట్టె అవును అనే నీతి భోజనాల దగ్గర నేర్చుకున్నాడు(నేరుచుకోబడ్డాడు).

ఆ భోజనాల దగ్గర అందరూ ఒక చోట గుమిగూడి "జై మన అన్నకి" అని వాళ్ళ అన్నలకి జై కొట్టుకోవడం కనిపించింది. లోపలి రాబొతుంటే ఒక ఖద్దరు చొక్కా ఆయన ఎదురొచ్చాడు. ఎవరబ్బ అని ఆలోచిస్తే అయనే చెయ్యెత్తి ఓ ఎలెక్షన్ నమస్కారం పెట్టాడు. వాకబు చేస్తే అయనో ఎమ్మెల్యే అట.


మళ్ళీ ఒకాయన ఇంగ్లీషులో మాట్లాడితే ఆ దెబ్బకు బయటకు పోయి ప్లేటు నిండా పెరుగు తెచ్చుకొని అందులో స్పూన్ లేకుండా చేత్తో తిన్న తరువాత కానీ ఒంట్లో వేడి తగ్గలేదు.(ఆ టైములో పెరుగు దొరికినది అని ప్రత్యేకంగా చెప్పడమైనది)

ఎన్ని సార్లు ఆనంద రావ్ కిందబడ్డాడు? ఇంకెన్ని సార్లు పడతాడో చూస్తూ వుండండి.

5 comments:

రానారె said...

ఓహోహో!! ప్రారంభమే పిచ్చపిచ్చగా ఉంది. తా'నా' మారెనా ... నన్నేమారెనా ... దారీ తెన్ను ఏదీలేక ఈ తీరాయెనా ... అని పాడుకొంటూ దాన్నొక పీడకలగా మరచిపోదామనుకోక మొదటి నుండీ యమానందంగా చెప్పుకురావడం అందరికీ సాధ్యమయేపని కాదు. విహారికి రానారె "ఎలక్షన్ నమస్కారం".

Unknown said...

ఏం కంగాళీనో ???
డబ్బిచ్చి దొబ్బిచ్చుకోవడం అయినట్టుంది.

spandana said...

హ్హ హ్హ విహారీ... పనిలో పనిగా అక్వేరియమ్ అనుభవం కూడా రాయండి.

--ప్రసాద్
http://blog.charasala.com

కొత్త పాళీ said...

వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేసే ఇటువంటి అనుభవాలతో మీ హీరో త్వరలో ఆరితేరిన ఆనందరావ్ కావాలని, ఆ విధంగా ముందుకుపోవాలని ఆశీర్వదిస్తూ .. :))

Anonymous said...

@ రానారె,

"బాధే సౌఖ్యమనే భావన రానీవోయీ..." అంటే ఇదే. మీ వోటు నాకే.

@ ప్రవీణూ,

అప్పుడప్పుడూ జరిగే ఇలాంటివే అనుభవాలు.

@ ప్రసాద్,

ఆక్వేరియెం టపా ఉడుకుతోంది. తిరగమోత పెట్టి వడ్డిస్తా.

@ కొత్తపాళీ గారూ,

మీ ఆశీర్వచనాలతో ఆనంద రావు మరింత ఎత్తుకు ఎదుగుతాడు క్లింటన్ మనవడిని కలుస్తాడు :-)

-- విహారి