Wednesday, July 25, 2007

మీకిలా అనిపిస్తుందా?.... అలాగయితే అడిక్టే.

:


* రోడ్డు మీద వెళుతూ వుంటే ఒక మాంచి సీను కనిపిస్తుంది. దీన్ని ఫోటో తీసి బ్లాగులో పెడితే ఎలావుంటుంది.

* ఆఫీసులో పని సరీగా చెయ్యలేక బాసు క్లాసు పీకితే “ థూ ఈ బ్లాగులొకటి ” అని అనుకొంటుంటారు.

* ఫ్రెండుతో మాట్లాడుతూ వుంటే అవాకులు చవాకులు పేలుతూ వుంటాడు. వాడిని ఏమీ అనలేక వీడిని బ్లాగులో పెట్టి ఉతికి ఆరెయ్యాలి.

* ఆ రోజు పేపర్ చూడగానే సంచలన వార్త ఒకటి కనిపిస్తుంది. ఎలాగయినా దీన్ని ముందుగా నేను బ్లాగులో పెట్టి మార్కులు కొట్టెయ్యాలి.

* టి.వి. ఆన్ చెయ్యగానే ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో జుంబారె తెగ వారు ఆనందంతో ఒకరి ముక్కులు ఒకరు కోసుకుంటూ సంబరాలు చేసుకొవడం చూస్తారు. అది చూసి ఇది తప్పకుండా బ్లాగులో పెట్టెయ్యాలి.

* పేపర్లో సాహితీ సంపద అన్న వర్గం కిందా కొన్ని పద్యాలు కనిపిస్తే వాటి మీద ఒక వ్యాసం రాసెయ్యాలి.

* ఆఫీసులో కోడ్ రాసేటప్పుడు code బదులు koeD అని రాస్తుంటారు.

* వర్షమొచ్చినప్పుడు ఇంట్లోనో వీధిలోనో బజ్జీలు తింటూ కాఫీ తాగుతుంటే కొన్ని కవితల పదాలు దొర్లుతాయి. వాటిని కూర్చి ఒక కవిత రాసెయ్యాలి.

* వీధిలో కుక్క పిల్లను పిల్లలు రాళ్ళతో కొడుతూ వుంటే చూసి భరించలేక పిల్లల్ని తరిమేసి ఆ కుక్కను దగ్గరకు తీసి ఒక టపా రాసెయ్యాలి.

* హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సినిమా టికెట్లో, బుక్కో లేక వస్తువో చూసి దీని గురించి ఓ టపా నా బ్లాగులో పెట్టెయ్యాలి.

* ఇంగ్లీషులో Ramudu అని టైపు చెయ్యాల్సి వచ్చినప్పుడు rAmuDu అని రాసేస్తుంటారు.

* రెండు ప్రపంచాలున్నాయి. ఒకటి మామూలు ప్రపంచం రెండోది బ్లాగు ప్రపంచం అని గాఢంగా నమ్ముతుంటారు.

* ఆఫీసులో బ్లాగులు చదువుతూ వుంటే కరంటు పోతుంది. “ఇప్పుడే కరంటు పోవాలా. కోడు రాసేటప్పుడు పోవచ్చుగా” అని అనుకొంటుంటారు.

* మౌ(మన)సెప్పుడూ కూడలి..తేనెగూడు.. జల్లెడ.. తెలుగు బ్లాగర్స్.. అంటూ పరుగులు పెడుతూ వుంటుంది.

* రోడ్డు మీద ట్రాఫిక్కులో ఇరుక్కుపోయి వున్నప్పుడు అక్కడ అడుక్కునే వాళ్ళ మీద జాలితో ఒక కథనం రాయాలనిపిస్తుంది. ఇంటికెళ్ళాక ఏమీ గుర్తుకు రాదు.

* పైవన్నీ చదివిన తరువాత ఈ టపా రాసినోడికి ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలే వస్తాయి “వీడో పెద్ద అడిక్టు” అని మనసులో అనిపిస్తుంది బయటికి చెప్పడానికి సంకోచిస్తారు.



:


:

6 comments:

Unknown said...

చెప్పడానికి నేను సంకోచించను గా...
మీరో పెద్ద అడిక్టు.

జ్యోతి said...

ఫికర్ జేయకు తమ్మి..నీ అసుంటోళ్ళు ఇక్కడ సానా మందున్న్రరులే...

కొత్త పాళీ said...

డాక్టరు గారు ఇప్పుడే చెప్పారు - మీరు చెప్పిన రోగ లక్షణాలన్నీ నాకున్నాయిట :-)

రవి వైజాసత్య said...

మీరు రోగలక్షణాలకు నెంబర్లెట్టేసుంటే ఫలానా 2, 4 5 లక్షణాలు మాకున్నాయని తేలిగ్గా డాక్టరు దగ్గరికెళ్ళకుండానే రోగం ఎంత ముదిరిందో హోంటెస్ట్ చేసుకుని స్కోర్ చెప్పేవాళ్లం కదా

రాధిక said...

నాకు లక్షణాలు వేరేగా వున్నాయి.ఏదన్నా వార్త చదవగానే దాని గురించి మన బ్లాగులోళ్ళు ఏమన్నా రాసారా అని వెంటనే కూడలికి వచ్చేయడం,ప్రసాదు గారు ,విహారి గారు ఏమన్నా రాసారేమో అని రోజుకి ఒక 5 సార్లు వీళ్ళ సైట్లకు వెళ్ళి చూడడం.....ఇలా అన్నమాట.మరి దీన్నేరోగం అంటారో?

netizen నెటిజన్ said...

బ్లాగోసైటిస్ అంటండి!
తెలుగుబ్లాగర్లందరూ, కూడలి దగ్గిర లేఖినికోసం జాలం విసిరుతుంటే, తేనెగూడునుంచి వచ్చిన బ్లాగులు క్విల్ల్‌పాడ్ తో గుచ్చి,గుచ్చి ఈ వైరస్ అంతర్జాలమంతా పాకుతోందటండి. ఈనాడులో కూడా దీని గురించి వ్రాసాడండి.
మీరు చదవలేదా?