Wednesday, May 21, 2008

పండంటి బ్లాగుకు పదకొండు సూత్రాలు(కొత్త బ్లాగర్ల కోసం మాత్రమే) -- 1

:::::::::

మట్టిబుర్ర, ఒట్టి బుర్ర, తొట్టి బుర్ర, బంక బుర్ర కాదేదీ బ్లాగడానికి అనర్హం

అదేమిటి సూత్రాలేవన్నా వుంటే పది వుండాలి లేకుంటే పన్నెండు వుండాలి కానీ అనుకుంటున్నారా?
అక్కడే చూపించాలి కొత్తదనం. ఆ కొత్తదనం అనేది వైవిధ్యంగా వుండాలి. వైవిధ్యం పేరు చెప్పి నన్నయా, తిక్కనా క్లాస్ మేట్స్. వాళ్ళిద్దరూ ఎదురు బొదురు ఇళ్ళలో వుండే వాళ్ళు అని చెప్పేస్తే బ్లాగులోకి బుల్లెట్లొస్తాయ్. కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి.

సరేనోయ్ ఇదెందుకు రాస్తునావో ఒక ముక్క చెబ్తావా?
గత ఆర్నెల్లుగా బ్లాగులు రాసే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎక్కువయ్యారు అంటే మొదలు పెట్టే వాళ్ళు మాత్రమే ఎక్కువయ్యారు అని అర్థం. అవి కొనసాగించే వాళ్ళు చాలా తక్కువ మందయ్యారు. బ్లాగు పేర్లు నమోదు చేసుకొన్న వాళ్ళు చాలా మంది. అలా నమోదు చెయ్యడం కూడలి లో కావచ్చు, జల్లెడ లో కావచ్చు, తేనె గూడు లో కావచ్చు, తెలుగు బ్లాగర్స్ లో కావచ్చు. ఇంకా చక్రెడో అని ఒకటుందనుకుంటా. ఇప్పుడు ఇండీబ్లాగర్స్ అని ఒకటి వచ్చింది. అలా ప్రారంభించిన లెక్క చూస్తే ఎనిమిది వందలకు పైగా వుండొచ్చు. మొన్నా మధ్య కూడలి కొచ్చే యునీక్ హిట్లు ఎంత అని వీవెన్ ను అడిగితే సాధారణ రోజుల్లో 300+. వారాంతాల్లో ఇంకా తక్కువ అన్నారు. నేనయితే ఈ ఎనిమిది వందలు కాకుండా ఇంకో అయిదు వందలు ఉంటారు. తక్కువలో తక్కువ ఓ వెయ్యి మంది రోజూ బ్లాగులు చదువుతుంటారనుకొన్నా. వాస్తవంగా అది నిజం కాదు అని తెలిసి కళ్ళలో నీళ్ళు కారబోతుంటే స్పాంజి పెట్టి ఆపి బాధ పడ్డా. జల్లెడ, తేనె గూడు, తెలుగ్ బ్లాగర్స్కు ఎంత మంది వస్తారో తెలీదు(కనుక్కోలేదు సరైన సమాచానం).

బ్లాగులంటే ...
అమెరికాలో అయితే "హౌ టూ డ్యాష్ ఎఫెక్టివ్లీ" (డ్యాష్ ఖాళీలో ఏదైనా పూరించుకోండి) అని ఒక పుస్తకం రాస్తే మూణ్ణెల్లలో ఆరు ముద్రణలకు నోచుకుంటుంది. డిల్లీ సెంట్రల్ హాల్లో లైట్లేసి ఆ రచయితకు కలువభూషణ్ అని బిరుదు కూడా ఇస్తారు. మన తెలుగు వాళ్ళు అట్టే పుస్తకాలు (కొని) చదవరు. ఎక్కడన్నా పుస్తకం దొరికితే "మాస్టారూ, దీన్ని పట్టుకెళ్ళి చదివేసి రేపు ఉదయం మీ ఇంటి ముందు మీరు ముగ్గెయ్యక ముందే తెచ్చిస్తా" అంటారు. ఆ పుస్తకం తిరిగొస్తే టి.వి.యాంకరమ్మ తెలుగు మాట్లాడినంత ఒట్టు. ఇప్పుడు పుస్తకాలు కొనే వాళ్ళు తక్కువై పోయారు. వీళ్ళందర్నీ లైన్లో నిలబెట్టి ఆ లైన్లో నడుచుకుంటూ ముందుకు వస్తే నా మొహం రెండోది అయుంటుంది.అరువు ఇచ్చేవాళ్ళు అంతకన్న తక్కువై పోయారు. పాపం వీళ్ళనెందుకు అవమానించడం అని వీళ్ళని కూడా లైన్లో పెడితే, ఈ లైన్లో నా మూడు క్యాండిల్స్ మొహం మొదట కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పుస్తకాల కొరత తీర్చడానికి అంతార్జాలమొచ్చింది. దాదాపుగా ఏది కావాలన్నా అందులో దొరుకుతుంది. దాని నెత్తి మీద గూగులొచ్చింది. అందువల్ల పుస్తకాలు కొనే వాళ్ళు లేరు, అడుక్కునే వాళ్ళు లేరు. ప్రతి దానికి గూగ్లేయడమే.(కొంత మంది పద్దతి గా అజో విభో ఫౌండేషన్‌ కి వెళ్ళి పుస్తకాలు కొంటారు) అలా వెబ్ లో చాలా విషయాలు లాగుతున్న వాళ్ళ లోంచే పుట్టికొచ్చిందే ఈ బ్లాగ్.

అందులో తెలుగు వాళ్ళు లేకపోతే ఈ టపా రాసే అవసరముండేది కాదు. అలా ఎప్పుడూ తెలుగు వార్తలు, కథలు, నవలల కోసం వెదుకుతున్న వాళ్ళందరూ కలిసి ఈ వెదుకులాటకు ఏదైనా పేరు పెట్టాలనుకొన్నారు. కానీ మన పక్క నున్న పక్క రాష్ట్రం వాళ్ళు వుంటే తమ పేరు పెట్టుకోవడం కష్టమని గ్రహించి వాళ్ళందర్ని ఒక రూములో కట్టేసి, పులిహోర పేకెట్లు, దద్ధోజనం పేకెట్లు ముందర పడేసి దీనికి "వెబ్ లో లాగుడు" అని పేరు పెట్టారు. కాల క్రమేణా అది "వెబ్ లాగుడు" అయింది. ఇది చూసిన ఫ్రెంచి వాళ్ళు, డచ్చి వాళ్ళు "మాకు డు పలకడం రాదు" అని దానికి "వెబ్ లాగు" అని పేరు పెట్టారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇవ్వక పోయిన ఫరవా లేదు కానీ నవీనంగా మేము కనిపెట్టినదాని పేరు మారుస్తారా? అని అడ్డం పడ్డారు మన వాళ్ళు. "లాగు అంటే మా ఐ.ఎస్.ఐ. మార్కు పట్టా పట్టీల నిక్కరు కాబట్టి మేమొప్పుకోం" అని తెలిసినోళ్ళందరికీ ఈ-మెయిల్ పంపించారు. ప్రతి ఈ-మెయిల్ లో కింద మీరొక్కరికి ఫార్వర్డ్ చేస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆరు సెంట్లిస్తారు అని నోట్ కూడా పెట్టారు. సరిగ్గా ఈ సమయం లోనే పంధ్రాగస్టు స్పీచిలు టి.వి.లో చూడ్డం జరిగింది. సో అందరూ అదొక ఉద్యమంగా తీసుకొని ఈ డచ్చి వాళ్ళని ఇప్పుడే ఆపకపోతే తరువాత బ్రిటీషు వాళ్ళొస్తారు ఆ తరువాత నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేస్తారు అని డచ్చి వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. పిల్లులు రొట్టె కోసం పోట్లాడుకుంటుంటే కోతి రావాలి కదా వెంటనే అదోచ్చి (పజిల్: ఎవరో మీరే చెప్పుకోవాలి) "వె..వ్వె..వ్వె.." అని వె పీకేసి "బ్లాగు" అని నామకరణం చేశారు. ఎవరన్నా బ్లాగు ఎలా పుట్టిందని వేరే వాళ్ళు చెబితే నమ్మకండి. ప్రత్యేకంగా పశ్చిమ దేశస్తులను. మీ ఇంట్లో పెద్ద రాళ్ళు గట్రాలుంటే వాటి మీద ఈ స్టోరీ ఎక్కించేసి మీరు నీళ్ళకోసం తవ్విన ఖాళీ బావిలో పెట్టి చుట్టూ రెండు పాత రాగి రేకులు వేసి పాతెయ్యండి. పాతేసి మన తెలుగు ప్రాచీనాన్ని కాపాడండి.
ఈ టపాకి సంబందించిన బ్లాగు నిర్వచనం అయి పోయింది.


మీరు కొత్తగా బ్లాగు ప్రారంభించిన తరువాత కామెంట్లు రాక పోవడమో, హిట్లు రాకపోవడమో జరిగి "బ్లాగు గతి ఇంతే.." అని విరహ గీతాలు పాడుకోవద్దు. నా లాగే రాసిన వేరే కొన్ని టపాలకి కామెంట్లొస్తున్నాయి గానీ నాకు రావట్లేదు అని విచారానికి గురి కావద్దు. ఈ బ్లాగు ప్రయాణం అనేది రైలు ప్రయాణం లాంటిది. మీకన్నా ముందే రైలెక్కిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం సహజం. దాన్ని చూసి నిరాశకు లోను కావద్దు.

ఈ బ్లాగు ప్రయాణం లో నాకు కనపడిన రైళ్ళు రెండు ఒకటి 'కూడలి', రెండు 'తెలుగు బ్లాగర్స్'. నేను చూసినప్పుడు అవి మీటర్ గేజీ మీద నడుస్తుండేవి. ముందరో ఇంజెను పెట్టె వెనకో ప్యాసింజెర్ పెట్టె వుండేవి అంతే. ఈ రైల్లో పని చేసే డ్రైవరూ, గ్యాంగ్ మెన్, టికెట్ మాస్టర్ తదితర ఉద్యోగ వర్గమంతా ఎవరో బాగా తెలిసేది. అలాగే అందులో ప్రయాణించే వాళ్ళు కూడా ఒకరికొకరు బాగా తెలిసే వారు. రాను రాను ప్రయాణీకులెక్కువయిపోయారు రైలు పెట్టెలెక్కువయి పోయాయి. కూడలి కయితే ఏ.సి., నాన్ ఏ.సి. లాగా రకరకాల పెట్టెలు కలిసాయి. ఆ పెట్టెలకు పేర్లు పెట్టేశారు కూడలండ్రెడ్ , సాహిత్యం, రాజకీయం, హాస్యం, సేకరణలు, సినిమా అని. ఇప్పుడు అది బ్రాడు గేజీ మీద నడవడమే కాకుండా సూపర్ ఫాస్టు రైలు బండిలా పరిగెడుతోంది. తేనె గూడు కూడా బ్రాడ్ గేజులో కొచ్చేసింది. తెలుగు బ్లాగర్స్ కాస్త స్లోగా నడుస్తోంది. దట్స్ తెలుగు వాళ్ళు కూడా బ్లాగు బాట పట్టారు.

కొత్త బ్లాగోడి మనసు ఎలా వుంటుందో ఫ్ల్యాష్ బ్యాకు లో చదువుకోవాలంటే ఖైదీ నంబరు 300 కెళ్ళి కాసేపు చదువుకోండి.

సుత్తి సరే విషయమెక్కడ?
వస్తునానన్నా వస్తున్నా. అక్కడికే వస్తున్నా. సినిమా మొదలయ్యే ముందు మంచి అడ్వర్టైజ్మెంట్లు వుంటాయి. ఎందుకనుకుంటున్నారు? సినిమా బాగా లేకపోతే అవి చూసిన తృప్తయినా మిగులుతుందేమో అని. అందుకే నేను బోనస్ లు ఇస్తుంటా. ఫ్లాపు సినిమా కెళ్తే ఆడియో సి.డి.లు ఉచితంగా ఇవ్వడమనే ప్రక్రియే నాకు పూర్తి స్పూర్తి.

సరే అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది సినిమా మొదలు పెట్ట వేంటి?
అక్కడే మెక్సికో లో పండించిన పెసర పప్పు లో కాలేశారు. సినిమా థియేటర్ లో అడ్వర్టైజ్మెంట్ తరువాత ఏఁవొస్తుంది? న్యూస్ రీల్ రాదా? అన్నీ చెప్పాలి...ఈఁ

మేము న్యూస్ రీల్ చూసి చాలా కాలమయింది. మీది పాత థియేటరా?
అవును పాత థియేటరే. ఇది నా థియేటరే కాబట్టి న్యూస్ రీలు పూర్తి కాకుండా సినిమా మొదలవదు. డెత్ నట్లు చూడాల్సిందే. ఈ టైములో గేట్లు మూసేస్తాం బయటికెళ్ళలేరు. ఇక న్యూస్ చూడండి.

భారత్ ఇండియా పెద్ద లోగో..
చిన్న లొగో...
ఇంకా చిన్న లోగో...
చిన్న చుక్కయిన లోగో ...
ఏమీ లేని లోగో...

ఇప్పుడు వెనక గ్రవుండు లో పాట

మన్మే హై విశ్వాస్....
మన్మే హై విశ్వాస్....

పాట ఎక్కువ సేపు వుండదు. బట్టీ పట్టేసి పార్లమెంటుకొచ్చి పాడతారని భయం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ అందిస్తున్న వార్తలు

ఏడమ వైపు తాడు కాలిపోతూ ..కుడి వైపు తొలకరి వాన పడుతున్న వెండి తెర పై..

గూని పల్లెలో శంఖు స్థాపనలు.
కోడి ఈకల పాలెం లో శంఖు స్థాపనలు.
బుట్టాయి గూడెం లో శంఖు స్థాపనలు.
ఐతె పల్లె లో శంఖు స్థాపనలు.

న్యూస్ రీల్ అయిపోయింది.

అసలు సినిమా రెండో భాగంలో మొదలవుతుంది.

:::::::::

7 comments:

కొత్త పాళీ said...

హమ్మ విహారీ.. ఎంత పని చేశావూ?? ఊరిస్తూ ఒరిస్తూనే మొత్త చదివించేశావుగా ఏం చెప్పకుండానే!

రానారె said...

అందుకే నాకు కోపమొచ్చింది.

Kolluri Soma Sankar said...

"మీకన్నా ముందే రైలెక్కిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం సహజం. దాన్ని చూసి నిరాశకు లోను కావద్దు". - బాగా చెప్పారు.
హాస్యంగా రాసిన, మంచి సూచనే చేసారు!
కొల్లూరి సోమ శంకర్

kasturimuralikrishna said...

విహారి గారు,స్వైర విహారం,వీర విహారం,హాస్య విహారం అన్నే అన్నీ వచ్చేసాయి.మీరు ఇవ్వల్టి నా బ్లాగమ్షము చూడుడి.హాస్యంగా చెప్పినా మీరు చెప్పినవన్నీ చేదు నిజాలు.రచయితలను ఒక చోట కలపాలన్న మా ప్రయత్నములో చేరుడీ.పరిస్థితి మార్చుదాము.

netizen నెటిజన్ said...

వెబ్బులో లాగుడు - వెబ్బులాగు - వెబ్ + లాగు - వెబ్లాగ్ - బ్లాగు బాగుంది.
:)

Anonymous said...

@ కొత్త పాళి,

అదో టెక్కు నిక్కు కాదు కానీ.... ఒకే సారి డోసు ఒద్దని అలా..

@ రానారె,

:-)

@ సోమ శంకర్ గారు,

ధన్యవాదాలు

@ మురళి కృష్ణ గారు,

నమోన్నమః

@ నెటిజెన్‌,

ధన్యోస్మి.

-- విహారి

SV GOPI KRISHNA GOPARAJU said...

bhaliga baga balgu barakavu