Wednesday, May 28, 2008

పండంటి బ్లాగుకు పదకొండు సూత్రాలు(కొత్త బ్లాగర్ల కోసం మాత్రమే) -- 2

:::::::::

మొదటి భాగం చదివి కాళ్ళు, చేతులు, మొఖమూ కడుక్కోని శుచిగా ఇక్కడికి రండి.అలా న్యూస్ రీల్ అయిపోయిన తరువాత సినిమా ఇలా మొదలవుతుంది.

ఈ సూత్రాలు రాసే ముందు ఒక్కో సూత్రాన్ని విశ్లేషించి ఒక్కో రీలు ఒక్కో టపాగా రాద్దామనుకున్నా కానీ ఇప్పటికే సినిమా రెండో భాగం లో వేసినందుకు కొంత మంది థియేటర్ అభిమాన ప్రేక్షకులకు కోపమొచ్చినందున మొత్తం 11 సూత్రాలు ఇక్కడే ఇచ్చేస్తున్నా :-)


1. బ్లాగు ముఖ్యోద్ధేశ్యం:
మొట్ట మొదటగా బ్లాగును మీరు ఏ ఉద్ధేశ్యంతో ప్రారంభించారు. అందరి నోళ్ళలో నానాలని ప్రారంభిస్తున్నారో లేక మీ వ్యక్తిగత ఆనందం కోసం ప్రారంభిస్తున్నారో లేక గూగులు ప్రకటనలతో నాలుగు రాళ్ళు సంపాదిద్దామని మొదలు పెట్టారో నిర్ణయించుకోండి.


2. ముద్రారాక్షసాలు :
మీరు మొదటిసారిగా టపా రాసేప్పుడు ముద్రణా దోషాలు తప్పవు. ముద్రణా దోషాలు వుంటే మాత్రం చికాకు కలిగించే అంశం.టపాలో వున్న విషయాన్ని బట్టి పాఠకులు స్పందిస్తుంటారు. మొదట్లోనే ఆహా, ఓహో అనిపించేట్టు రాయక పోయినా ఇబ్బంది పెట్టే ముద్రణాదోషాలు రాయొద్దు. ఇప్పుడు బ్లాగులు చాలా ఎక్కువయ్యాయి సావధానంగా చదివి ముద్రణా దోషాలకు స్పందించే వాళ్ళు తక్కువే అని గుర్తు పెట్టుకోవాలి.


3. ఎలా రాయాలి?:
1 పరుగు, 12 బంతులు, అయిదు వికెట్లు వున్నా కూడా గెలుస్తామో లేదో అని టెన్షన్ పడే హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ అభిమాని లాగా కాకుండా 6 బంతులు, 36 పరుగులు, 1 వికెట్ వున్నా తప్పకుండా గెలుస్తామనే రాజస్థాన్ రాయల్సు అభిమాని లాగా ఆత్మ విశ్వాసంతో రాయాలి. మీరేది రాసినా దాన్ని రెండు మూడు సార్లు సమీక్షించుకొని ప్రచురించడం మంచిది. రాసే విషయం లో స్పష్టత అవసరం. బ్లాగుల్లో మన ఇష్టమొచ్చింది రాసుకోవచ్చు కానీ ఆదరణ కావాలంటే మాత్రం స్పష్టత అవసరం. ఇవే ఎక్కువ కాలం మనగలుగుతాయి. మీ టార్గెట్ ఆడియెన్సు ఎవరో ముందుగా తెలుసుకొని అలాంటి వాటి మీద బ్లాగటం ఒక పద్దతి. అలా కాకపోతే మీకు పట్టున్న వాటి మీద మొదలు పెట్టి తరువాత అన్ని రంగాల్లోనూ దూకడం మంచిది. మీ బ్లాగు విజయవంతం కావాలంటే సృజనాత్మకత, పుస్తక పఠనం, స్పష్టత వుండాలి.


4. కొన్నాళ్ళకు ఏమి రాయాలి?:
మొదట్లో మీ దగ్గర వున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్స్ అన్నీ రాసేశారు. తరువాత రాయడానికి ఏమీ లేదు ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు కాలేజీలో రంగారావు చొక్క జేబులోనుండి రెండు రూపాయలు కొట్టేసి మస్తాన్ కొట్లో వన్ బై త్రీ టీ తాగేసిన విషయం వ్రాయండి. వీలయితే లైబ్రరీకి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకం/సినిమా తెచ్చి దాని మీద మీ విశ్లేషణ చెయ్యండి. అలా రాస్తూ పోతే పాఠకులకు మీ మీద ఒక గురి ఏర్పడుతుంది. మొదట్లో అత్యుత్సాహానికి పోయి భూమండలాన్ని బుట్టలో పెడతా, నక్షత్ర మండలాన్ని నాన పెడతా, ఉట్టి మీది వెన్న మింగేస్తా అనే భారీ డవిలాగులు చెప్పకుండా సావధానంగా రాయండి.(నేనయితే ఏ అవిడియా రాకపోతే ఎవరు నేను, ఎవడ్రా రౌడీ, ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలు చూస్తా. చప్పున ఓ అవిడియా వస్తుంది.)


5.మీ బ్లాగును ఆదరిస్తున్నారా?:
అన్నింటికి మించి బ్లాగులు రాసిన తరువాత ఆదరణ లేదని నిరుత్సాహానికి గురి కావటం. ఇందాక చెప్పినట్లు ఇది బ్లాగు ప్రయాణం. అందులో ముందుగా రైలెక్కిన వారికి పాత వాళ్ళతో ఎక్కువ పరిచయ ముండటం సహజం. ఆ చనువుతో కొత్త వారికన్నా పాత వారితో పలకరింపులు ఎక్కువుంటాయి. అంతే. అంత మాత్రం చేత మీరు రాసిన వాటికి ఆదరణ లేదని అనుకోవద్దు. కొన్ని టపాలు కేవలం పది మంది చదివి ఆ పది మంది కామెంట్లిచ్చినంత మాత్రాన మీరు రాసింది తక్కువని కాదు. మీ బ్లాగుకు ఎంత మంది వస్తున్నారు అని తెలుసుకోవడానికి స్టాట్ కౌంటరు లాంటివి పెట్టుకోవడం మాత్రం మరచి పోవద్దు. ఇంకా మై బ్లాగ్ లాగ్ లాంటివి వున్నాయి. దీని ద్వారా మీ బ్లాగుకు ఎంత మంది వచ్చారు అన్నది తెలుసుకోవచ్చు. ఏది రాసినా మంచి బ్లాగుకు ఆదరణ వుంటుందన్న విషయం మరచి పోవద్దు.


6. మీ బ్లాగు పదుగురిలో :
మీరు ఒక్క సారి బ్లాగు ప్రారంభించిన తరువాత బ్లాగు అగ్రిగేటర్లతో నమోదు చేసుకోవడం తో మీ పని అయిపోదు. అప్పుడప్పుడూ మీ ఆలోచనలకు సరిపోయే బ్లాగులను చదివి కనీసం నాలుగు లైన్ల కామెంట్లు వ్రాయండి. అలా వ్రాస్తే ఆ బ్లాగు వాళ్ళకు కూడా మీ బ్లాగు మీద ఆసక్తి కలగొచ్చు. ఇది పరస్పర డబ్బా కాకుండా చూసుకోండి. వచ్చిన కామెంట్లకు స్పందించడం మరిచి పోకండి. (ఇక్కడ మాత్రం నన్నొగ్గేయండి. నేను స్పందిస్తున్నానా అని ప్రశ్నించకండి. నేను దొంగయితే దొంగతనం చెయ్యొద్దు అని చెప్పడం మంచి మాటే కదా )ఈ మధ్యనే బ్లాగు ప్రారంభించిన బొల్లోజు బాబా గారి కామెంట్లు పరిశీలించండి. ఆయన రాసిన ప్రతి కామెంటూ స్పష్టంగా వుంటుంది. ఆయన కామెంటు రాయని బ్లాగు బహుశా లేదేమో.

ఎవైనా సీరియస్ విషయాల మీద వ్యాఖ్యానించే ముందు. రాసిన వ్యాఖ్యలను ఒకటికి రెండు సార్లు చూసుకొని వ్యాఖ్యానించడం మంచిది ఎందుకంటే తరువాత చదివేవాళ్ళు మీ వ్యాఖ్యను విభిన్న కోణాలలో పలు సార్లు స్పృజించి వ్యాఖ్యానిస్తారు. అందులో మీరు చెప్పాలనుకున్నది కాకుండా దానికి వ్యతిరేకార్థం స్పురించొచ్చు.


7. బ్లాగులో ఎన్ని రాయాలి?:
ఎన్నయినా రాయొచ్చు చెత్త రాయనంత కాలం.మీరు రాయటం మొదలు పెట్టిన తరువాత కనీసం రెండు వారాలకొక టపా రాయడం మరిచిపోవద్దు. రాయక పోతే జనాలు మిమ్మల్ని మరిచి పోతారు.


8. తెలుగు బ్లాగులలో ఎలా నడుచుకోవాలి?:
ఇప్పటి వరకు తెలుగు బ్లాగులన్నీ సుహృద్భావ వాతావరణం లో నడుస్తున్నాయి. వుంటే సైద్ధాంతిక విభేదాలుండొచ్చు గానీ వ్యక్తిగత విభేదాలను పెంచుకోవద్దు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలకు దిగితే అనవసరంగా నోరు(బ్లాగు) పారేసుకోవద్దు. మనమేం మానవాతీతులం కాదు. అప్పుడప్పుడూ తేలిక పాటి యుద్ధాలు నడుస్తుంటాయి. వాటికి ఫిరంగులు ఫిక్సు చెయ్యకండి. విమర్శనాత్మక చర్చల్లో పాల్గొన్న బ్లాగులో వచ్చిన తరువాతి టపాకు సానుకూలంగా లేదా ఘర్షణాత్మక వైఖరికి దూరంగా స్పందించండి. అది చాలు అంతరాలు తుడిచి పెట్టుకు పోవడానికి. అలా అని మీరు అవతలి వ్యక్తి అభిప్రాయాలను, ఆలోచనలను అంగీకరించినట్టు కాదు.


9. నేను బాగానే రాస్తున్నానా?:
అక్కడక్కడా బ్లామీక్షలు (సమీక్ష) చూసి అందులో నా టపా లేదేంటబ్బా అని భాధ పడకండి. అవన్నీ వ్యక్తిగత ఇష్టాలు అయుండచ్చు. రాస్తూ వుంటే మీరే పెద్ద బ్లాగరు. మీరే పెద్ద సమీక్షకుడు/సమీక్షకురాలు.


10. ఏవి రాయకూడదు?:
బ్లాగుల్లో వ్యక్తిగత విషయాలు ఎక్కువగా రాయకుండా వుంటే మంచిది. రాసినా తగు జాగ్రత్తలు తీసుకోని రాయండి(ప్రత్యేకంగా ఆడవాళ్ళు). బ్లాగుల్లో ఎక్కువగా చిన్న తనం లో జరిగిన విషయాలు, జీవితానుభవ పాఠాలు రాయడం కద్దు. అలా రాసేప్పుడు అందులోని వ్యక్తుల పేర్లు మార్చి రాయడం మంచిది. ఇంకా అంతర్జాలం చీకటి కోణమెటువంటిదో తెలుసుకోవాలంటే సాలభంజికల మరో మెట్టు చదవండి.


11. బ్లాగులే జీవితం కాదు:
బ్లాగుల ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఎంతో మంచి రచనలతో, పెద్ద రచయితలతో పరిచయభాగ్యం జరగచ్చు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుని వ్యక్తిత్వ వికాసానికి సాయ పడవచ్చు. కానీ మీ వ్యక్తిగత జీవితాలను, దైనందిన వ్యాపకాలను పక్కన పెట్టే అంతగా వుండకూదదు. మీరు అంతర్జాలం లో దొరికే అడ్డమైన చెత్తా చదివే వాళ్ళయితే మాత్రం తెలుగు బ్లాగులు మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

చివరగా వీవెనుకు జల్లెడోళ్ళకు ఓ సలహాభ్యర్థన : కూడలి రైలు పెట్టెకి కూడలండ్రెడ్ లా 'లేత బ్లాగర్లు' అనే పెట్టె తగిలించమని అభ్యర్థన. ఇందులో గత వందరోజులలో నమోదు అయిన లేదా ప్రారంభించబడిన బ్లాగులు వుంటే వారిని ప్రోత్సహించడానికి అనువుగా వుంటుంది.

అనంద బ్లాగింగ్ (Happy blogging)
:::::::::

19 comments:

రాధిక said...

మంచి సూత్రాలు చెప్పారు.కొత్త బ్లాగరులే కాకుండా అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలివి.

వీవెన్ said...

కూడలికి చివరగా చేర్చిన ఓ వంద బ్లాగులు (కొత్తండ్రెడ్): koodali.org/blogs/new

bolloju ahmad ali baba said...

నాలాంటి కొత్తబ్లాగర్లకు చక్కని మార్గదర్శకాలు పొందుపరిచారు. ఈ టపా లింకును కూడలిలో పెర్మనెంటుగా డిస్ల్ప్లేలో ఉంచితే కొత్తవారికందరికీ బ్లాగులపై అవగాహన కలగటానికి అవకాశముంటుందని నా అభిప్రాయం. (అలా చెయ్యటానికి వీలుపడుతుందో లేదో నాకు తెలియదు)

నా కామెంట్ల పై మీకామెంటుకు ధన్యవాదములు.

బొల్లోజు బాబా

రానారె said...

చాలా బాగుంది. ఆసికానికి అక్కడక్కడా ఆంగ్లం వాడినా వ్యాసమంతా మంచి తెలుగు కనిపించింది. "ఆనంద బ్లాగింగ్" అనే చివరి మాటతో "అ టపా బై విహారి" అనిపించారు.

venkat said...

Bagundi sir blog sutralu andraiki upayogapadatayi

vani said...

హుమ్.... నా బ్లాగు విషయంలో కూడా నేను కొంచెం నిరుత్సహాంగానే ఉన్నా...కానీ మీ టపా చదివి గుండెను గుండ్రాయి చేసుకున్నా. స్టాట్ కౌంటరు హిట్ ల విషయానికి వస్తే చాలా సార్లు బ్లాగు డిజైనింగ్ కోసం, టపాల కోసం నా బ్లాగును నేనే కొట్టాను. పాపం!! పిచ్చితల్లి నా బ్లాగు ఎన్ని దెబ్బలు కొట్టినా భరించింది. ఏదో నాకు తోచినట్టుగా ముస్తాబు చేసాను. అంటే విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి కాకుండా దానిలో వ్రాసిన విషయాలు కూడా మంచివే. సరే!!ఎవరు చూసినా, చూడకున్నా నాదైన శైలిలో నేను ముందుకెళతాను. ఏదో ఒక రోజు గుర్తింపు రాకుండా పోతుందా!!!!

జాన్‌హైడ్ కనుమూరి said...

very nice

కొత్త said...

మంచి సూత్రాలు విహారి.

వాణి గారూ, మీరు మంచి టపాలు రాస్తూ ఉంటే తప్పక మీ బ్లాగుకి వీక్షకుల సంఖ్య పెరుగుతుంది.

బండి సున్నా said...

మీరు మర్చిపోయిన పన్నెండో సూత్రం:

మీరు బ్లాగరైతే, మీ బ్లాగు చదివే చాలా మటుకు జనం సాఫ్టువేర్ ఉద్యోగులే అని గ్రహించండి. ఎందుకంటే, మీరు ఎక్కడ్నుంచి పోస్ట్ చేస్తున్నారు, మీ ఐ.పి ఎడ్రస్సు, మీ ఆపరేటింగ్ సిస్టం అన్నీ వాళ్ళకి తెలిసే మార్గాలున్నాయి.

మీ కంపనీలో మీ ఐ.పి. మీ గేట్ వే, అన్నీ షేర్ చేసుకుంటున్నా, మీ ఐ.టి వాళ్ళు డైనమిక్ ఐ.పి ఇచ్చి మీ ఐ.పి మీ కొలీగ్ కి ఇచ్చినా మీరు బ్లాగ్/కామెంట్ పోస్ట్ చేస్తే చదివేవాడు మీరే పోస్ట్ చేసాడనుకుంటాడు. ఇంకో విషయం. అలా మీ ఐ.పి సంపాదించిన పెద్దమనిషి మీ గురించి, వారి స్వంత ఈ-మెయిల్ మీద తన స్నేహితులందరికీ చెప్తాడు. దాంతో మీ బ్లాగు బ్లాక్ లిస్ట్ చేయబడుతుంది. ఏమీ సందేహం లేదు. ఆ తర్వాత మీరు ఏమి రాసినా ఎవరికీ అక్కర్లేదు. ఒకసారి బ్లాక్ లిస్టులో చేరాక అంతే సంగతులు.

తస్మాత్ జాగ్రత్త.

అబ్రకదబ్ర said...

అప్పుతచ్చుల మీద రాసిన వాక్యంలో పెద్ద 'ముద్రాక్షసం' ఉన్నట్లుంది చూడండి.

Usha said...

http://www.blogger.com/comment.g?blogID=4302185437921795709postID=3000702705414851920 నా మాట వ్రాసానండి. guides పెట్టి చదవకపోవటం పాత అలవాటు, కాని code reuse, user manuals వాడటం జీవితంలో భాగమైపోయాక referచెసి చేయటం కొత్త మలుపు నాకు. తరుచు ఇక్కడకి రావాల్సితప్పదేమో!

Anonymous said...

@ రాధిక,

ఈ రాతలు కొంతమందికు ఉపయోగపడినా చాలు.

@ వీవెన్‌ ,

ఈ లంకె నా కోసం స్పెషలా. ధన్య వాదాలు. అభ్యర్థన సగం మాత్రమే ఫలించిందన్నమాట.

@ బొల్లోజు బాబా,

మీరు అలాగే రాస్తూ వెళ్ళండి. ధన్య వాదాలు.
@ రానారె,

నెనర్లు.

@ వెంకట్ గారు,

మీ తెలుగు బ్లాగెక్కడ? మొదలు పెట్టండి.ధన్య వాదాలు.

@ వాణి గారు,

రాస్తూ వెళ్ళండి. అదే పుంజుకుంటుంది. మీరు సేకరించిన వాటికి మూలం కూడా రాయండి.

@ జాన్‌ హైడ్ గారు,

ధన్య వాదాలు.

@ కొత్త పాళి,

ఇంతకూ ఈ కొత్త ఏవిటి? పాళీ ఎందుకు పీకారు?

@ బండి సున్నా గారు,

సున్న పేరు పెట్టుకొని పన్నెండు నుండి మొదలు పెట్టారు :-) మీ సూత్రం కూడా గుర్తు పెట్టుకుంటారు.
ధన్య వాదాలు.

@ అబ్రకదబ్ర గారు,

నాకయితే ఏవీ కనిపించలేదు. ఓ సారి చెబుదురూ.
వ్యాఖ్యానించినందుకు ధన్య వాదాలు.

@ ఉషా గారు,

కొన్ని రోజులాగండి మీరే బ్లాగర్లకు పెద్ద రెఫరెన్సు అవుతారు.
ధన్య వాదాలు. మీ వ్యాఖ్య చూశాను.

-- విహారి

అబ్రకదబ్ర said...

విహారిగారూ,

'ముద్రాక్షసాలు' అనేదే ఆ అప్పుతచ్చనబడే అచ్చుతప్పు. 'ముద్రారాక్షసం' అని కదా అనాల్సింది.

ముద్రారాక్షసం అనే పదం మూలాలమీద చాలా వాదాలున్నాయికానీ దాన్ని అక్షర దోషం అనే అర్ధంలో చాలానాళ్లుగా వాడుతున్నారు. ఆ గొడవలోకి లాక్కండి నన్ను ;-)

Purnima said...

Hi Vihaari,

I've problems with the blog aggregators. Somehow they refuse to show up my entries. :-(

I've sent mail to veeven@gmail.com to add my blog in koodali.org. That didn't work.

Added my blog to jalleda.com. But now the latest entries in m blog aren't displayed.

Can you please help me in this regard? Not sure, if this is the right place to ask for help, but couldn't find a better one.

My blog: http://oohalanni-oosulai.blogspot.com/

Thanks for your help,
Purnima

Anonymous said...

పూర్ణిమ గారు,

మీ బ్లాగు లోనే దీనికి సమాధాన మిచ్చాను.
మీకు ఏవైనా అవసరమైతే ఇక్కడ నిరభ్యంతరంగా అడగవచ్చు.

-- విహారి

Anonymous said...

అబ్రక దబ్ర గారు,

ముద్ర+రాక్షసం = ముద్రాక్షసం అనే అర్థం లో రాసాను. ముద్రారాక్షసమా? ఏదో లెండి అది అర్థాన్ని మరీ మార్చెయ్యదు కదా.

మీరు దాని మీద సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.

-- విహారి

Anonymous said...

"భూమండలాన్ని బుట్టలో పెడతా, నక్షత్ర మండలాన్ని నాన పెడతా...."

ఇటువంటి చమత్కార పదప్రయోగం మీకే సొంతం.

అటు లేత బ్లాగర్లకూ, ఇటు ముదురు బ్లాగర్లకూ మీ సూత్రాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

దిలీప్

Anonymous said...

లేత బ్లాగర్లను ప్రోత్సహించండి.
కూడలి నా బ్లాగ్ పీడ్ వెంటనే ఓకే చేసారు.
jalleda,thenegoodu toooooooo slow

మీ సలహాలు ఆచరించదగ్గవి.

Anonymous said...

@ దిల్ గారు,

నెనర్లు.

@ శివ వాగుడు గారు,

తప్పకుండా.
నెనర్లు

-- విహారి