Friday, May 23, 2008

ఈ వారం సిద్ధా-బుధ్ధ (డాలరు, కొత్త పార్టీ)

:::::::::


"అయ్యగారూ"
"ఏరా సిద్ధా"

"మనకు అమెరికా డాలర్ విలువ పెరిగితే మంచిదా తగ్గితే మంచిదా"
"మనకు అంటే ఇక్కడ రెండు రకాలున్నాయి. మన ప్రవాసాంధ్రులకా? లేక మన దేశ ప్రగతి కా?"

"ఆ లెక్కలు నాకు తెలీవు. రెంటికి తేడా ఏంటో చెప్పండి."
"డాలరు విలువ పెరిగితే మన ప్రవాసాంధ్రులకు మంచిది. ఇప్పుడున్న విలువ ప్రకారం ఒక డాలరుకు 42.60 పైసలు రావచ్చు. ప్లాట్లు కొనే వాళ్ళు ఓ వంద చదరపు అడుగులు ఎక్కువగా, భూములు కొనే వాళ్ళు ఓ అరెకరం ఎక్కువగా కొనుక్కోవచ్చు. అలాగే భారత్ లో వున్న ఎగుమతుల కంపెనీలకు కూడా లాభం. కాకపోతే దేశం లోకి దిగుమతి అయ్యే వస్తువులకు పైకం ఎక్కువ చెల్లించాల్సి వుంటుంది. ఇక దేశ ప్రగతి అనేది ఆ దేశపు కరెన్సీ మారకపు విలువ మీద ఆధార పడి వుంటుంది. డాలరుకు తక్కువ రూపాయలొచ్చే కొద్దీ మన రూపాయి బలపడు తున్నట్టు, దేశం అభివృద్ది చెందినట్లు లెక్క. "

"అంటే రూపాయి విలువ పడి డాలరు విలువ పెరిగితే మన దేశ సేవకులు స్విస్ బ్యాంకు లో పెట్టే డబ్బు తక్కువవుతుందన్నమాట.ఆ మధ్య ఓక్సు వాగన్ ఫ్యాక్టరీ కోసం పది కోట్లు అడ్వాన్సు ఇచ్చారు. అది తిరిగి వచ్చిందా ?"
"ఆ కంపెనీ వాళ్ళు ఖర్చులకింద రెండు మిలియెన్ యూరోలు మన ప్రభుత్వానికి ఇచ్చారు."

"ఏదో రూపం లో డబ్బు తిరిగి వచ్చిందన్నమాట. ఆ డబ్బు ప్రభుత్వానికిచ్చారా బొత్స సత్యనారాయణకిచ్చారా? "
"నువ్విలా అడిగితే ఎలా రా. ప్రభుత్వం పేరు మీద ఇచ్చారు. ఎవరికెళ్ళిందో తెలీదు. "

"ఆ కంపెనీ కోసం సేకరించిన భూమి కూడా జనాలకు తిరిగిచ్చారా?"
"తిరిగిచ్చేస్తే దాన్ని ప్రభుత్వం అనరు."

"మరి?"
"తమకు తిరిగివ్వమని రైతులు మొత్తుకుంటుంటే ప్రభుత్వం వాళ్ళు సైలెంటుగా అమ్మేసుకుంటున్నారు."

"అందుకే ఇలాంటి ప్రభుత్వం పోయి మా లాంటోళ్ళందరికి న్యాయం జరగాలంటే మా చిరు రావాల్సిందే."
"ఏంటి నువ్వు మొన్న హాజరయిన సెమినార్ లో ఇవి కూడా చెప్పారా?"

"లేదు ఆ సెమినారుకు వచ్చిన వాళ్ళలో చాలా మంది ఆ కొత్త పార్టీకి అభిమానులట."
"ఓహో, సెమినార్ లు పెడితే చాలా లాభాలున్నాయంటావ్."

"అవును ప్రవాసాంధ్రులు కూడా చాలా సెమినార్లు పెడుతున్నారు. మీరు చూడలేదా?"
"సెమినార్లేం ఖర్మ. ఏ రాజ కీయ నాయకుడొచ్చినా దిగంగానే సూట్ కేసులు మోసే చాలా ప్రవాసాంధ్రులను చూశా."

"వాళ్ళకు సూట్ కేసులు మోసే ఖర్మేమిటి. మరీ చోద్యం కాకపోతే."
"దేశ సేవ నాయనా. దేశ సేవ. తరువాత ఏ ఎమ్మెల్యే టికెట్టో, ఎం.పి. టికెట్టో వస్తే ప్రజలకు దగ్గరగా వుండి సేవ చెయ్యొచ్చని."

"అంటే ప్రవాసాంధ్రులు రాజకీయాల్లోకి రాకూడదా?"
"నువ్వు వేరే అర్థాలు తీయకురా అక్కుపక్షీ. రాకూడదని ఎవరన్నారు. భేషుగ్గా రావచ్చు. అలా వచ్చే వాళ్ళను స్వాగతిద్ధాం. సరే మీ రైలెప్పుడు వస్తోంది?"

"అన్నీ రెడీ అయిపోయాయి పెయింటింగ్ మాత్రం మిగులుంది. రేపో మాపో పట్టాలపైకి వచ్చేస్తుంది."
"మీ రైలొచ్చేలోపే బాలయ్య కూడ రైలెక్కుతున్నాడట గా"

" ఆయనెక్కుతున్నది పాత రైలు.ఇప్పటికే చాలా చోట్ల రిపేర్లొచ్చాయి. మా రైలయితే చాలా ఫ్రెష్షు. కొత్త టికెట్లు, కొత్త సీట్లు, కొత్త బోగీలు. బాలయ్య ఎక్కే రైలుకు టికెట్లు కూడా కొనక్కరలేదు. ఎన్టీఆర్ ఇచ్చిన రైలు పాస్ జేబులో రెడీ గా వుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కచ్చు. కొత్తగా ఎక్కేదేముంది రెక్కమాను డొక్క."

:::::::::"అయ్యా నేను ప్రజల్లో ఒక్కడినేనా?"
"అవును"

"మీరు?"
"నేను కూడా"

"చిరంజీవి?"
"ప్రజల్లో ఒక్కడే"

"వై.ఎస్?"
"వై.ఎస్. కూడా ప్రజల్లో ఒక్కడేరా."

"చంద్ర బాబు కు కల్లో కూడా ప్రజలే కనిపిస్తున్నారట కదా. మీరు, నేను, చిరంజీవి, వై. ఎస్సూ అందరూ ప్రజలయితే మరి చంద్ర బాబెవరు?"
"ప్రజల్లో లేని వాడు అందుకే ప్రజల మధ్యకు వెళుతున్నాడు."


:::::::::


ఓ చిన్న బ్లాగాభిప్రాయ సేకరణ::::::::::

2 comments:

విజయ క్రాంతి said...

ayya viharigaru, Kontha alasyamga choosanu. Bavundi kaani meeru ichina blogabhipraya sekarana IE lo panicheyutaledu. Kevalam rail pettalu kanapaduchunnai. Saricheyagalaru

Anonymous said...

క్రాంతి గారు,

IE 6.0, IE 7 లలో నాకు బాగానే కనిపిస్తోంది. ఫైర్ ఫాక్సు లో కూడా బాగానే కనిపిస్తోంది. ఒక్క సారి మీ cache చ్లేం చేసి మళ్ళీ ప్రయత్నించండి.

చెప్పినందుకు ధన్య వాదాలు .

-- విహారి