Thursday, May 15, 2008

ఈ వారం సిధ్ధా- బుధ్ధ (గోల్డు క్వెస్టు, మహిళా బ్లాగర్ల సమావేశం )

:::::::::


"అయ్య గారూ.."
"ఆఁ, సిద్ధా! "

"నాకు.. నాకు.. "
"ఆ నసుగుడెందుకు విషయం చెప్పు.. "

"నాకు సెలవులు కావాలి? "
"ఓస్ అంతేనా దానికెందుకు నసగడం. నువ్వడగడం నేను కాదనడమూనా. "

"మీరివ్వరని కాదు గానీ మొన్నా మా సంఘపోళ్ళు పెట్టిన మీటింగుకు వెళితే యజమానులను మెప్పించడమెలా అనే దాని మీద సెమినార్ ఇచ్చారు. అందులో, యజమానంటే భయపడుతున్నట్టు నటించడం ఒక టెక్నిక్ అంట. అందుకే అలా నసిగా. "
"బావుంది. నటించడమేనా ఇంకా గొడ్డళ్ళతో, గన్నులతో, పెన్నులతో భయ పెట్టి పనులెలా చేయించుకోవాలో కూడా చెప్పారా? "

"అది రెండో సెమినార్ లో చెబుతారంట. దానికి ఫీజు కట్టాలంట. "
"అలా అయితే నీకు పెర్మనెంట్ సెలవులు ఇస్తా. తీసుకుంటావా? "

"అయ్య బాబోయ్ అలా అంటా రేంటండీ. నేనేదో సరదాకెళ్తేనో. అది కూడా మా రంగడు బలవంత పెట్టి తీసకబోతే. "
"రంగడంటే గోల్డ్ క్వెస్ట్ గాడేనా? "

"అరె భలే గుర్తుపట్టేశారే. మీక్కూడా తెలుసా. "
"తెలుసా ఏంట్రా బాబూ, మొన్న నువ్వు బయటికెళ్ళినప్పుడు నీ కోసమొచ్చి గోల్డు క్వెస్టు గురించి చెప్పి నా మెదడు ఫలహారం కింద మింగేశాడు. . "

"రజనీకాంత్ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, బాలకృష్ణ ఫ్యామిలీ అందరూ ఇందులో వుండారని చెప్పాడా? "
“వాళ్ళ పేర్లు చెప్పలేదు గానీ ఇంకో పది మెట్లెక్కి ఇందులో అమితాబచ్చన్, ధీరూ భాయ్ అంబానీ, ముఖేష్ అంభానీ, బిన్ లాడెన్, ఫీడెల్ కాస్ట్రో ఫ్యామిలీ వాళ్ళు కూడా వున్నారని చెప్పాడు. "

"వీడి దుంప తెగ. అమ్మో వీడు చంద్రమోహన్ దగ్గర ట్రైనింగు తీసుకున్నానని చెప్పాడే. చూడబోతే చంద్ర మోహన్ కే ట్రైనింగు ఇచ్చినట్లు వున్నాడు. వీడిని ఈ సారి మైకు పెట్టి సతికేస్తా. "
"సతికితే సతికావు గానీ తమ్మా రెడ్డి భరద్వాజ లాగ బి సీరీసు, జి సీరీసు పదాలు టి.వి. కెమరా ముందు మాట్లాడకు. పేపరోళ్ళు నిన్ను హెడ్లైన్లో పెట్టి నన్ను బాక్స్ అయిటం చేస్తారు. "

"మీరూరుకోండి. ఇప్పుడు పేపర్లో మన గురించి రాసేంత చోటెక్కడుంది వాళ్ళకి. అంతా ఉప ఎన్నికల గురించి రాస్తున్నారు. కొద్దో గొప్పో ఖాళీ వుంటే నాలుగేళ్ళ పాలనలో ప్రగతి అంటూ ఊదర కొట్టుకుంటారు. ఈ సారి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? "
"ఇంకెవరు టి.ఆర్.ఎస్. "

"మీరు కూడా అలా డిసైడయిపోయారా. ఏటూ వాళ్ళే గెలుస్తారని తెలిసినప్పుడు వాళ్ళ వల్లే ఎన్నికలొచ్చాయని వాళ్ళకు బుద్ది రావాలంటే ఓడించండి అని ఇతర పార్టీలు అరవడమెందుకు? హాయిగా వాళ్ళకే వదిలేసుంటే ఎన్నికల ఖర్చు మిగిలేది, సమయం ఆదా అయ్యేది. అప్పుడు మేమే అనవసర ఖర్చు ఆప గలిగాం అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకొని నిజంగా ఇది ‘మీ కోసం’ అని బాబు చెప్పుకొనుండచ్చు. వై ఎస్సేమో ఈ డబ్బును ప్రాజెక్టులకు ఖర్చు పెడతాం అని ప్రజల దగ్గర మార్కులేయించుకొని వుండచ్చు. ప్చ్... చాన్సు మిస్సయింది. "
"ఏంటి మీ సంఘం మొదటి సెమినార్లో ఇన్ని విషయాలు చెప్పారా? మీటింగుకు వెళ్ళొచ్చిన తరువాత తెలివి తేటలు బాగానే పెరిగాయే. "

"అప్పుడే ఏమయ్యింది బ్లాగులో మహిళ లందరూ సమావేశం పెడుతున్నరు గదా. మా ఆడది కూడా సమావేశానికి వెళతానని సంబర పడుతోంది. అప్పుడు చూడాలి నా సామి రంగా మా ఓల్ ఫ్యామిలీ తెలివితేటలు. "
"నిన్ను బ్లాగులు చదవమని చెబితే ఆ దురద మీ ఆవిడకు కూడా అంటిస్తావా? ఇంతకూ వాళ్ళేం మాట్లాడు కుంటున్నారో తెలుసా? "

"వాళ్ళు అసలు విషయం చెప్పట్లేదు. అందుకే గదా గూఢచారి లా మా ఆడదాన్ని పంపిస్తోంది. మీరు అట్లా ఏమీ తెలీనట్లు నటించండి. గుట్టంతా మా ఇంటిదాని చేత చెప్పిస్తా. అప్పుడు అవన్నీ మీ బ్లాగులో పెట్టుకోవచ్చు. "

"అవుడియా బానే వుంది కానీ. మీ ఆవిడ కూడా ఒక బ్లాగు మొదలు పెట్టేస్తే పరిస్థితి ఏంటి? "
"అవునండోయ్, అప్పుడు తాకిడికి గురయ్యేది మీ కంప్యూటరే. మనకు టైము దొరకదు. "

"వాళ్ళేమి మాట్లాడుకోని వుంటారో నాకు బాగా తెలుసు. "
"అదేదో నా చెవిన కూడా పడెయ్యండి. "

“... దు....”
"ఓహో అలానా...”

“.........కు.....”
"ఇంకా.... "

"…తె... "
"అమ్మా ఇవి కూడా? "

".....నా..... "
"అయ్య బాబోయ్"

"...లీ..... "
"నా కళ్ళు తెరిపించారు కదా. "

"రా........ "
"అలాగే ఎవరికీ చెప్పనులెండి. "

"వీళ్ళ మీటింగుకు నేదురుమిల్లి రాజ్యలక్ష్మిని పిలుచుంటే ఏమయ్యేది? "
"సమావేశం పేరు ప్రమదావనం కాకుండా ఇందిరా మహిళా బ్లాగర్ల సమేవేశం అయుండేది"

"వై.ఎస్. ను పిలుచుంటే? "
"సోనియమ్మ మహిళా బ్లాగర్ల సమావేశం అయుండేది. హైదరాబాద్ లో జరిగే సమావేశానికి రాజీవ్ బ్లాగర్ల సమావేశం అని పేరు పెట్టుకోమని పోరొచ్చుండేది"

"జగన్ ను పిలుచుంటే? "
"సాక్షి మహిళా బ్లాగర్ల సమావేశం అని పిలిచి అందరి ఫోటోలు తీసుకొని రెండు రూపాయలకే అన్ని పత్రికలూ రావాలని నినదించిన మహిళా బ్లాగర్లు అని ఫ్రంటు పేజి లో వచ్చుండేది. "

"బాబును పిలిచుంటే? "
"మీ కోసం మహిళా బ్లాగర్ల సమావేశం అని చెప్పి రోజాను పంపించి వుండే వాడు. "

"కె.సి.ఆర్. ను పిలిచుంటే? "
"............."

"చెప్పవేరా? "
"............"

"ఎందుకలా పారి పోతున్నావ్? "
"............"

"చెప్పు ఎందుకలా పారిపోతున్నావ్? "
"ఇంకా అర్థం కాలేదా?.... సింబాలిక్ గా చెప్పా. ":::::::::

8 comments:

Sharma VJ said...
This comment has been removed by the author.
Sharma VJ said...

ఎప్పటిలాగే అదుర్స్

sujatha said...

విహారి గార్ని పిలుస్తే ఏమై ఉండేదో చెప్పనే లేదు మీరు!
(విహారి గార్ని పిలుద్దామని సూచించాను ! (ఇక్కడ మీరు కూడ ఏ సుజాతో తెలీయక తికమక పడితే బాగుండు) మీరైతే ఏ ప్రశ్నకైన తడుకుముకోకుండా సమాధానాలు చెప్పేస్తారని నాకు నమ్మకం!

రాధిక said...

మా సమావేశంలో వచ్చిన ఏకయిక మగ బ్లాగరు పేరు మీదే.వచ్చేవారం మీరు అతిధిగా వస్తే గూఢచర్యం నిర్వహణా ఖర్చులు మిగులుతాయిగా.వాటితో మీరో ప్రాజెక్టు మొదలుపెట్టొచ్చు.

జ్యోతి said...

విహారి,
నిన్ను రమ్మని మర్యాదగా ఆహ్వానం ఇచ్చాముగా,మళ్ళి ఆ పనోడి చెవులు కొరకడమేమిటీ. వాడేమొ పెళ్ళాన్ని పంపుతాననడమేమిటీ. ఈ రాజకీయ నాయకులు ఎవరొచ్చినా చివర్లో చెప్పినట్టు కెసిఆర్ గతే పట్టిస్తాము. అది ఖాయం. ఐతె వస్తున్నావుగా ఈ ఆదివారం మీ ఆవిడ కొంగట్టుకుని..

Srividya said...

భలే వుంది.అయినా మీకిన్ని ఐడియాలు ఎలా వస్తాయండి..?

Anonymous said...

@ శర్మ గారు,

ధన్య వాదాలు.

@ సుజాత గారు,

నా పేరు చెప్పేస్తే స్వొత్కర్ష అవుతుంది. ఇప్పటికే బ్లాగుల్లో ఇది వుందని, అది వుందని కొందరు చెవులు గోక్కుంటున్నారు.

మీరు నా పేరు చెప్పినందుకు మహదానందంగా వుంది. కాకపోతే నా బుర్ర మైనస్ పది క్యాండిల్స్ బల్బు.
అది ఓ పట్టాన వెలగదు. ఆ బల్బు కూడా పి.వి. నరసిహ్మా రావు మార్కు. ఠక్కున ఆరిపోతుంది కానీ వెలగదు.

@ రాధిక గారు,

నా పేరొక్కటే వచ్చిందా? ఇదేదో గూడు పుఠాణీ వ్యవహారం లాగుందే. అలోచించాలి అయితే.

నెనర్లు.

@ జోతక్కోయ్,

అంత మర్యాదగా పిలిస్తే రాక తప్పుతుందా. తప్పకుండా వస్తా. మా ఆవిడకు బ్లాగులో కొస్తావా అని చెప్పినప్పటి నుండి మా ఇంట్లో రెండు కేజీల దూది కనిపించడం లేదు. వెతగ్గా వెతగ్గా మా ఆవిడ చెవిలో కనిపించింది. ఏక వీరుడినై వస్తా. మెయిల్ పంపించు comcast account కు.

@ శ్రీవిద్య గారు,

నేను చిన్నప్పుడు బాగా దొంగతనాలు చేసే వాడిని లెండి.
మీ అభిమానానికి ధన్యుణ్ణి.

-- విహారి

జ్యోతి said...

విహారి,
ఆహ్వాన పత్రిక పంపేసాను. రేపు సాయంత్రం ఆరుగంటలకు( ఇండియా) మీకు ఆదివారం ఉదయం ఎనిమిదన్నరకు వచ్చేయ్. మేము ఎదురు చూస్తుంటాము..