నాడు -- నేడు
* * * *
నాడు :
"రేయ్ నిద్దర లేసినావా?" ఇనప గ్రిల్లుకు అద్దం తగిలిచ్చి పెట్కొని స్టూలు మింద పెట్న మగ్గులో నీళ్ళు పోసుకుని, పనామా బ్లేడు తో గడ్డం గీసుకుంటున్న నాన్న అరుపు.
"...."
"రేయ్ నిన్నేరా పిలిసేది. రేత్రంతా లైట్ పోలుకింద మినకర్ బూసిల్తో ఆడి ఇబ్బుడు లెయ్యమంటే రగ్గు కప్పుకోని ఆ పక్కకు తిరగతావా. నిద్దర బొయింది జాలు గానీ లెయ్. "
"ఊ.." ఇంట్లో నవారు మంచం మింద ఆప్కో దుప్పటి కప్పుకొని పండుకున్న కొడుకు.
"పండుకునింది చాల్లే వాయ్. లేసి గూట్లో పెట్న గోపాల్ పండ్ల పొడితో పండ్లు తోముకో. మీ యమ్మ పొయ్యి మింద వుడుకు నీళ్ళు పెట్టింది నీ కోసరమని.బిర్నే లెయ్ లేక్పోతే నీళ్ళు సల్లగయిపోతాయ్. "
"ఊ... నైనింగారుంతసేపు పండుకుంటా"
"రేయ్ నిన్ను.. నీకిట్ల జెబ్తే యాడ లేస్తావ్. నీకిచ్చేది ఇచ్చెయల్లలే . ఆ కట్యాడికి బొయ్యింది.." కట్టి కోసం నాన్న ఎదకతా వుంటాడు.
"ఓయమ్మా నన్ను కొట్టద్దు సామీ నేను లేస్తా.." కొడుకు లేచి బచ్చల్లోకి పరిగెత్తి పూడస్తాడు.
అర్ధ గంట తర్వాత…
తలకు జిడ్డాముదం పెట్టి కుడి పక్కకు దువ్విన క్రాపుతో, నల్ల పట్టీల తెల్ల చొక్కా, వి షేపు ఎర్ర నిక్కరు ఏసుకోని ఉప్మా తట్ట ముందు స్కూలు కెళ్ళే కొడుకు ప్రత్యక్షం.
నేడు:
"నాన్నా కొండలూ.." తన రూములో నుండి లేచి బ్రష్ చేసుకొని, ఆటోమటిక్ షేవర్ తో షేవింగ్ చేసుకుంటూ కొడుకు రూములో అడుగు పెడతాడు నాన్న."గుడ్ మార్నింగ్ నాన్నా! లేయ్. స్కూలుకు టైమవుతోంది"
"ఊహూ..."
"నాన్నా! అదిగో చూడు అందరు పిల్లలూ రెడి అయిపోతున్నారు. స్కూలు బస్సు కూడా వచ్చేసింది."
"ఊ.. ఐ వాంట్ టూ స్లీప్ ఫార్ సమ్మోర్ టైం"
"స్కూలుకు టైమయిపోతుంది కన్నా."
"ఊ హూ.. ఐ సెడ్ ఐ వాంట్ టూ స్లీప్ ఫార్ సమ్మోర్ టైం. "
"అదిగో నీ రూములోకి ఎలకొచ్చింది…"
"ఊ.."
"ఇదిగో పిల్లి కూడా వచ్చింది..మ్యావ్..మ్యావ్"
దుప్పటి కొద్దిగా తెరుచుకుంటుంది ఒక కన్ను మాత్రం దుప్పట్లోంచి బయటకు వస్తుంది.
"అదిగో నీ బ్లాంకెట్ లో కొచ్చింది.."
"ఎక్కడా?"
"ఇదిగో ఇక్కడ"
"ఐ డొన్ ట్ సీ ఇట్.."
"మ్యావ్..మ్యావ్.."
"నో..నువ్వే పిల్లి.."
"ఇదిగో లేచేశావ్. వెళ్ళి బ్రష్ చేసుకో"
"నో.." దుప్పట్లోకి మళ్ళీ.
"అదిగో ఈ సారి పులొచ్చింది...గాండ్రు...గాండ్రు..."
"నో నువ్వే పులి.."
(అలా బోలెడన్ని క్రూర జంతువుల్ని , ఎగిరే పక్షుల్ని, పాకే పాముల్ని, గెంతే కప్పల్ని రూములోకి రప్పించిన తరువాత.)
"అదిగో లేచేశావ్. దా బ్రష్ చేసుకో నాన్నా. స్కూలుకు టైమవుతోంది ”
"అయితే నన్నెత్తుకో" దుప్పట్లోనుండి కొడుకు.
అలా ఉప్పు మూట ఎత్తుకుని బాత్ రూములోకొచ్చి బ్రష్ మీద పేస్టు పెట్టిస్తే రెండు సార్లు లెఫ్టూ రెండు సార్లు రైటూ చేసి బ్రష్షు మళ్ళీ నాన్న చేతిలోకొచ్చేస్తుంది. అప్పుడు నాన్న మిగిలిన లెఫ్ట్లూ, రైట్లూ, అప్ లు, డౌన్ లు చేసి కొడుకును షవర్ లోకి తోస్తాడు.
అర్ధ గంట తరువాత...
లోపల పొడుగు చొక్కా వేసి దాని మీద ష్రెక్ పొట్టి చొక్కా వేసి మడచిన జీన్స్ పాంటూ, పాలిష్ చేసిన బూట్లు వేసుకొని నెత్తిన చిన్న క్యాప్ పెట్టుకొని (ఒక్క ముక్కలో పోకిరి స్టైల్లో ) డైనింగ్ టేబిల్ మీద వున్న ప్యాన్ కేక్ (తీపి అమెరికన్ దిబ్బ రొట్టె) తింటానికి రెడీ.
* * * *
9 comments:
మా అమ్మాయి మాత్రం రాత్రి 9 గంటలకు పక్కెక్కి, పొద్దున ఏడింటికల్లా దిగాల్సిందే! వీకెండు ఎనిమిదింటి వరకూ అనుమతి.కాకపోతే 'అయితే నన్నెత్తుకో' మాత్రం రోజూ ఎదురవుతుంది నాకు.
నాకు ఇంకా "నాన్నా" అనే వారు రాలేదు కాని "ఇంకొంచెం సేపు పడుకుంటాను అండి" మాత్రం బాగా అలవాటే. పొద్దున్న ఏడుకి లేవటమే గగనము పైగా "రాత్రి పదికి నిద్ర పోతారు, పొద్దున్నే ఆరుకి లేస్తారు-ముసలాళ్ళలాగ" అని కొత్త రకం దెప్పిపొడుపు. "కాల మహిమ సార్, ఏం చేస్తాం? తప్పదు."
@ సుజాత గారు,
మీకు ఒక్కరే అనుకుంటా. ఇద్దరొస్తే అంతే సంగతులు.
అందుకే అన్నారు. "One is none. Two is Ten" అని.
@ భావకుడన్ గారు,
సంతోషించండి సార్. కాఫీ ఇంకా రెడీ కాలేదా అని అడగనందుకు. :-)
-- విహారి
కొంపదీసి ఈ వారం కూడా మీ కాన్సెప్ట్ ను ఏ పేపర్ వాళ్ళో,ఏ టీవి వాళ్ళో హైజాక్ చేసారనుకుంటా,అందుకే ఈ అసందర్భోచితమైన అంశం దర్శనమిచ్చింది.
సెటైరు భలే వుంది సార్ :-)
-- విహారి
స్కూల్ వర్కింగ్ డేస్ లో రావాల్సిన అంశం సెలవు ల లో ఎందుకొచ్చిందో అర్థం కాలేదు.
@ సీను గారు,
అమెరికాలో ఇంకా సెలవలు ప్రకటించలేదు సార్.
-- విహారి
http://blogs.oneindia.in/blog.vihaari.net/1/blogsearch.html
ప్రదీప్ గారు,
ఆ లంకె చూపించి నందుకు నెనర్లు.
-- విహారి
Post a Comment