కేజీ బియ్యం అయిదు సెంట్లకు అర్జీ -- 2
* * * * * * * *
ఇంతవరకు జరిగిన సస్పెన్సు, యాక్షన్, స్పై, త్రిల్లర్ లేని సంఘటనలు ఇక్కడ చదివి మళ్ళీ చదవాలనిపిస్తే ఇచటకు రండి.
* * * * * * * *
వచ్చిన ఈ-మెయిల్లన్నీ చదివి అందరికీ ఒకే ఈ-మెయిల్ పంపించా.
ప్రియమైన బియ్యపు అభిమానులకు,
మీరు బియ్యం మీద చూపించిన ఆప్యాయానికి కడుంగడు సంతసించితిని. మీరు పోయిన జన్మలో ధాన్య లక్ష్మి ని సరీగా పూజించక పోయి వుండచ్చు. అందువల్ల కలిగిన పూర్వ జన్మ పాపములు, ఎప్పుడైన ధాన్య గింజకు చేసిన ద్రోహం వల్ల కలిగిన గ్రహ దోషములు ఈ సారి బియ్యం మీద చూపించిన అభిమానంతో నివారణ అగును.
మనము ఇక్కడ సమిష్టి వ్యవసాయం చెయ్యలేము కానీ సమిష్టిగా పోరాడవచ్చు. మీలో ఒక సర్దార్ పాపారాయుడు వుండవచ్చు (తుపాకులవసరం లేదు..బారెడు గడ్డం కూడా), బొబ్బిలి బ్రహ్మన్న వుండవచ్చు(కత్తులు అవసరం లేదు..ఎర్రని కళ్ళు, ఉబ్బిన చాతీ మాత్రం మాండేటరీ), రాణా ప్రతప సింగు వుండవచ్చు(గుర్రాలు అవసరం లేదు). మనమందరం మనకు బియ్యపు కార్డులు వచ్చే వరకు కలిసి పోరాడదాం. ఆ తరువాత ఎటూ మన జన్మతః వచ్చిన లక్షణాలవల్ల విడిపోతాం కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు.
అందరం వచ్చే శని వారం సాయంత్రం 4 గంటలకు మా ఇంట్లో కలుద్దాం. మా ఇంట్లో 15 కుర్చీలు, 15 కాఫీ కప్పులు మాత్రమే వున్నాయి. కావున మీలో మీరే మాట్లాడుకుని 15 మంది మాత్రమే రండి. అందరం కలిసి రైతు కూలీ సంఘం లా బియ్యం సంఘం పెట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపిద్దాం. ఇంగ్లీషులో రైస్ అసోసియేషన్ అని రిజిస్టర్ చేద్దాం. పేరులో రైస్ అని వుంది కాబట్టి కండోలిజ్ రైస్ మనతో కలిసి పని చేసే అవకాశం 99% వుంది.
- జై బియ్యం సంఘం (అరిస్తే పోయేదేమీ లేదు)
- జై అమెరికా తెలుగోళ్ళు (అరిచాం కాబట్టి మళ్ళీ అరవచ్చు)
ఈ-మెయిల్ పంపిస్తే పోయేదేమీ లేదని మనసు మార్చుకుని ఇంకొందరికి కాపీ పెట్టా.
* * * * * * * *
జిడ్డు సుబ్బారావు గాడు బీరు కావాలని అడిగాడు కదా. బీర్లు పెట్టాలంటే ఏ ప్రత్యేక లక్షణాలు లేని భర్తలు బాసు దేవిని అడిగి అనుమతి తెచ్చుకోవాలి.
కార్యేషు దాసుడా
కరణేషు మంత్రీ
భోజ్యేసు భీముడా
శయనేషు మన్మధా
సనాతనమైన అమెరికాలోని భారతీయుల్లో సంప్రదాయ సతీవ్రతా శిరోమణులు యాభై శాతం. అంటే నాకు యాభై శాతం మంది మద్దతు వుంది. ప్రతి శుక్ర వారం సతీవ్రతా శిరోమణుల ఇళ్ళల్లో ఈ శ్లోకాలు నియమ నిష్టలతో టెంకాయ కొట్టి ప్రాక్టీసు చేసుకుంటుంటారు. ఈ శ్లోకం వినబడక పోతే వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డు రానట్టు. ప్రతి రోజూ ప్రాక్టీసు చేస్తుంటే వాళ్ళు అమెరికా సిటిజెన్ షిప్పు తీసుకున్నట్లు. ఎవరింట్లోంచయినా ఈ శ్లోకం ఇంకా వినబడలేదంటే వాళ్ళకు గ్రీన్ కార్డు లేదని సహృదయతతో అర్థం చేసుకోవాలి. ఈ విభాగానికి చెందిన వాళ్ళు భారత్ వెళ్ళి వచ్చేప్పుడు అత్తారింట్లో జరిగిన 'మర్యాదలు' గుర్తుకు తెచ్చుకొని 16 గంటల విమాన ప్రయాణంలో వల్లె వేస్తుంటారు.
పాజిటివ్ గా రిప్లై రావాలంటే ఎడమ చెవిలో చెప్పాలంట అని ఓ శాస్త్రజ్ఞుడు చెప్పాడు. ఆ శాస్త్రవేత్త కి నమస్కరించి భక్తి ప్రపత్తులతో బాసు దేవి ఎడమ చెవి దగ్గరకెళ్ళి బీర్లు తాగడానికి అనుమతి కోసం అడగట మాలస్యం కడిగెయ్యడం మొదలయింది. "అసలే బియ్యం కొనటానికి డబ్బుల్లేక పోతే బీరు కావాలా? ఎక్కువ మాట్లాడితే కాఫీ బదులు కషాయం పోస్తా. అంతగా బీరు కావాలంటే మీ వాళ్ళకు ఎవరికన్నా ఫోను చేసి కనుక్కో ఇంట్లోనే కాయట మెలానో. మీ ముత్తాత మూడో తమ్ముడి ముని మనవడు భాకరా పేట అడవుల్లో ఇప్ప సారా కాచి గవర్నమెంటోళ్ళకి అమ్ముతున్నాడట గదా. అదెట్లా చేస్తారొ కనుక్కొని ఆ వచ్చే వాళ్ళకు పొయ్యి" అంది. ఆ శాస్త్రవేత్త గాడెవడో శాడిస్టు గాడు. పెళ్ళాం చేతిలో తిట్లు తిని ప్రపంచం లో వున్న మగాళ్ళందరూ తిట్లు తినాలని థీసిస్ రాసినట్లున్నాడు. పెళ్ళాం చేతిలో తిట్లు తిన్న ఇంకెవడో ఎడిటర్ గుర్నాధం హెల్త్ జర్నల్ లో వేసి పారేశాడు. వాడో సారి కనిపిస్తే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, మిరియాల పొంగలి, ఫ్రైడ్ రైస్, బిర్యానీ రైస్, చింతకాయ రైస్, లెమన్ రైస్ అన్నీ నోట్లో కుక్కేసి బాగా అలవాటు చేయించాలి. అప్పుడు కుదురుతుంది వాడి తిక్క బియ్యం కోసం తిప్పలు పడినప్పుడు.
వారం రోజుల కిందట ఇంటి వెనక నాటిన ద్రాక్ష మొక్క ఆకులు కూడా ఇగురించలేదు ద్రాక్ష తో వైన్ చెయ్యడానికి. అవసరమైతే బిన్ లాడెన్ డెన్ లోకి గన్ లేకుండా బ్రేవ్ మ్యాన్ లా వెళ్ళోచ్చు కానీ అమెరికాలో ఇప్పసారా కాయటం లాంటివి పెట్టుకోకూడదు. ఆ ప్రయత్నానికి తిలోదకాలిచ్చేసి మ్యాచ్ పోయినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టెయ్యాలని " ఛీ.. ఛీ.. ఆ వెధవ పేరెత్తకు. వాడు నేను మొన్న పంపించిన డబ్బుల్తో ఊళ్ళో పంచాయితీ వాటర్ ట్యాంకు కన్నా పెద్ద సైజు డ్రమ్ము కొనుక్కొని అందులో సారా పోసి అమ్ముతున్నాడట. బీరు కన్నా కాఫీ యే శ్రేష్టం. కాఫీ తాగితే క్యాన్సర్ కూడా పోతుందట. యాక్టివ్ గా వుంటే ఇంకా బాగా డిస్కస్ చేసుకోవచ్చు. ఏమంటావ్ నా పుట్ట తేనె!!! జై బియ్యం సంఘం.." అన్నా
ఆ ఫ్లోలో అలా 'జై' బియ్యం సంఘం అనేశాను గాని బాసు దేవి ఇచ్చిన చూపుకి రెండు రోజులు జై అని కానీ, పిల్లాడిని జో జో అని కానీ, బాలా'జీ' అనే పదము కానీ నోట్లోంచి రాలా. ఇంకా నయం హిందీ వాళ్ళం కాకపోతిమి. అయుంటే ప్రతి దానికీ ముక్కులో కోడి ఈక పెట్టుకొని హా... హా... జీ అని అందర్ని పిలవాల్సి వచ్చి నా నా కష్టమ్స్ వచ్చేవి. అప్పుడప్పుడూ గాడ్ ఈజ్ నాట్ క్రేజీ. సమ్ టైంమ్స్ ఐ డూ లైక్ గాడ్ లైక్ బేబీ భక్త ప్రహ్లాద.
వీకెండు 95 డిగ్రీల ఫారెన్ హీటుతో రానే వచ్చింది. సాయంత్రం నాలుగ్గంటలకు అందర్ని రమ్మన్నాం కానీ ఇండియన్ స్ట్రెచబుల్ టైము తో మొదటి శాల్తీ వచ్చేసరికి ఎంత లేదన్నా 6 గంటలు అవుతుందని ఇంటి ముందర గడ్డీ ప్లస్ గాదం పీక్కుటూ చెమటోడ్చి పని చేసుకుంటూ "కుమ్మరి కొలిమి....హుమ్..మ్....సాలెల మగ్గం....హుమ్..మ్... " లా
"కార్పొరేట్ జననం...హుమ్..మ్....
కర్షక మరణం...హుమ్..మ్....
అడుగు బడుగు చెమట భొట్లు...హుమ్..మ్....
అంబానీ గొడుగులో కరెన్సీ కట్లు...హుమ్..మ్....
అయ్యింది నా చేను బీడు...హుమ్..మ్....
అయ్యాడు వై.ఎస్. పెద్ద ఱేడు...హుమ్..మ్...."
అనే ఆర్.నారాయణ మూర్తి పాటలు, గద్దర్ పాటలు, సుద్దాల అశోక్ తేజ పాటలు పాడుకుంటూ పని చేసుకున్నా. ఆ స్పూర్తి తో "రక్త గడ్డ పార - చెమట చెనిగి పార" అనే సినిమా తియ్యటానికి ప్లాటు రడీ అయింది. అప్పటికప్పుడు, ఇంటికి వచ్చే వాళ్ళతోనే సినిమా తియ్యాలనే సంకల్పాని బలవంతంగా ఆపుకొని ఆరు గంటలవుతుందనగా పైకెళ్ళి బాత్రూములో దూరా స్నానం చెయ్యటానికి. సాయంత్రం స్నానమా అనే కొచ్చెన్ మార్కు ముక్కు పెట్టుకోకూడదు. అమెరికాలో అంతే. ఇంకా కొందరైతే శుక్ర వారం ఆఫీసుకు వెళ్ళేప్పుడు చేస్తే మళ్ళీ వచ్చే సోమ వారం దాకా స్నానం చెయ్యరు. వీళ్ళకు గ్లోబల్ వార్మింగు వాళ్ళు వీక్లీ విన్నర్స్ అని బనీన్‌లు,టి.షర్ట్ లు లాంటి ప్రైజులు గట్రా ఇస్తూ వుంటారు. వాళ్ళ లిస్టు సిఎన్ఎన్ డాట్ కాం లో చివరి పేజీలో వేస్తారు. నేనెప్పటికయినా ఈ లిస్టు ఒక్కసారన్న పేరు సంపాదించుకోవాలి అని కృషి చేస్తుంటే ఎదో ఒక పార్టీ తగలబడి నా ప్రయత్నాలకు గండి కొడుతోంది.కాసేపటికి స్నానం చేసి బయటకు వచ్చా. కిటికీ లోనుండి కిందకు చూస్తే రెండు కార్లు కనిపించాయి. ఒకటి టయోటా కరోలా ఇంకోటి హాండా సివిక్. అబ్బో ఆశ్చర్యంగా ఇద్దరొచ్చారు అప్పుడే. ఇవాళ ఈ 95 డిగ్రీలప్పుడు వర్షం పడేట్టుంది గడ్డికి నీళ్ళు పెట్టే అవసరం లేదు అని కిందకు దిగితుంటే లివింగు రూములో 15 మంది కనిపించారు ఒకే ఇంట్లో అయిదు వందలు ఓటర్లున్నట్లు. గబ గబా కింద కొచ్చి చూస్తే సుబ్బి గాడు, రమణ ఇద్దరూ పోట్లాడుకుంటున్నారు.
"రేయ్ అప్పుడే చెప్పా గదా గ్యాస్ చార్జీలు మనం షేర్ చేసుకోవాలి అని. అందరం మా ఇంటి నుండి ఇక్కడికొచ్చినందుకు 33 మైళ్ళకు ఒక గ్యాలన్ పైన అయింది. గ్యాలన్ $3.87 చొప్పున ఎనిమిది మందికి సమానంగా పంచితే 48 సెంట్లవుతుంది. రానూ పోనూ ఒక్కొక్కరు 96 సెంట్లు ఇవ్వాలి. ఇప్పుడు ప్లేటెందుకు ఫిరాయిస్తున్నావ్?."
"నేనొప్పుకోను నువ్వు వస్తూ వస్తూ దార్లో కరి వేపాకు కొంటానికి ఇండియెన్ గ్రాసరీస్ షాపు దగ్గర ఆగావు. అది నీ సొంత ట్రిప్పు కాబట్టి ఆ దూరానికి నేనివ్వను. నేను 77 సెంట్లే ఇస్తా."
"రేయ్ అబద్దం చెప్పకు ఇప్పుడు కరి వేపాకు కూడా బ్యాన్ చేశారు అమెరికాలో. నేను దానికోసం పోలేదు. చిన్నప్పట్నుంచి నాకు హజ్ మోలా అంటే ఇష్టం. అది కొంటానికెళ్ళా అంతే."
"ఒరేయ్ సుబ్బిగా! కొక్కొ కోలా తాగే వయసులో కూడా నీకింకా హజ్ మోలా తినే దురద పోలేదురా. మీరు ఆ తగువేదో మీ ఇళ్ళకు వెళ్ళి తీర్చుకోండి. ఇక్కడ కాదు. అవునొరేయ్ టయోటా కరోలాలో ఎనిమిది మంది ఎలా వచ్చార్రా?" అని అడిగా అమాయకంగా.
దానికి సుబ్బారావ్ గాడు పడి పడి నవ్వాడు. "ఒరేయ్ నీకు ఇంకా తెలీదా అందరూ ఎలా ఆఫీసులకొస్తున్నారో. ఒక్కో కార్లో ఎనిమిది మంది వస్తున్నారు. ముందు ఇద్దరు. వెనకాల నలుగురు ఇక మిగిలిన ఇద్దరూ ట్రంకులో (డిక్కీలో)" చిదంబర రహస్యం చెప్పాడు వాడు.
"వెనకాల ముగ్గుర్నే కదరా అలో చేసేది? కాపు చూస్తే పట్టుకోడూ? ఈ ఎండల్లో ట్రంకులో ఎలా వచ్చార్రా? మాడి మసై పోరూ?"
"భలే వాడివేరా. అందుకోసమే రీ-చార్జబుల్ ఏ.సి. ఒకటి, ఆక్సిజెన్ మిషన్ ఒకటి ట్రంకులో పెట్టుకొనే వచ్చాం. ఏ.సి. మిషన్ 20 సెంట్లకు, ఆక్సిజెన్ మిషన్ 43 సెంట్లకు గరాజ్ సేల్ లో కొన్నా. గ్యాస్ కన్నా దీని ధర తక్కువ కదా."
"మీరు అసాధ్యులు రా. ఈ టెక్నిక్కు లన్నీ నాకెందుకు ముందుగా చెప్పలేదురా. ఒరేయ్ రబ్బరట్ల గబ్బు సుబ్బి గా! ఇన్నాళ్ళ మన స్నేహానికి ఇంత ద్రోహం చేస్తావా. నీకు కాఫీ లేదు. అర గ్లాసు చేపల ట్యాంకులో నీళ్ళు మాత్రమే రా" ఆవేశంగా సమాధాన మిచ్చా.
"అంత పని చెయ్యకురా బాబు. పాల రేట్లు కూడ గ్యాస్ తో పోటీ పడుతున్నాయని నేను కాఫీ అడిగినా మా ఆవిడ ఇవ్వలేదు. ఎటూ మీ ఇంటికొస్తున్న కదా వెళ్ళి మీ ఇంట్లో వారం రోజులకు సరిపడా తాగి రమ్మంది. ఇప్పుడు నువ్విలా అంటే ఎలారా. నీకు తెలుసు కదా నా కాఫీ వ్యసనం. హజ్ మోలా తరువాతా నేను బాగా లైక్ చేసేది కాఫీనే కదరా. కావాలంటే మా ఇంటికొచ్చినప్పుడు ఒక గుక్క కాఫీ ఎక్కువ తాగుదువులే గానీ."
"అలా అన్నావ్ బావుంది. వీళ్ళు అలా వచ్చారు సరే. మీరెలా ఏడు మంది ఒకే కారులో వచ్చార్రా?"
వాళ్ళందరూ కుర్చీల్లోంచి లేచి కింద పడి పొర్లి నవ్వడం మొదలు పెట్టారు.
రెడ్డి గాడిని లేపి చొక్కా పట్టుకుని "ఏరా తమాషగా వుందా? మా ఇంటికొచ్చి నన్ను చూసి నవ్వుతావా? చస్. మీ లాంటి దేశ, రాష్ట్ర, జాతి, మిత్ర ద్రోహులతో నేను చెయ్యికలపను. మీటింగు లేదు గీటింగు లేదు. వాటర్ క్యాన్సిల్. కాఫీ క్యాన్సిల్. కుర్చీలు క్యాన్సిల్. అన్నీ క్యాన్సిల్. వెళ్ళండి బయటికి. నేను వెళ్ళి ఈస్టు కోస్టోళ్ళతో టైయప్పు పెట్టుకొని పని చేస్తా"
"అంత పని చెయ్యకురో కావాలంటే మా ఇంటికొచ్చినప్పుడు నువ్వు భారత్ నుండి తెచ్చిన ఈగల్ ఫ్లాస్కు తెచ్చుకో. మా ఆవిడకు తెలియకుండా నా కాఫీ నీ ఫ్లాస్కులో పోసి ఇస్తా."
"ఇప్పటికి కుదిరిందా దెయ్యం. మీ అందరికీ నేను మంద కృష్ణ మాదిగ ముందు ఆంధ్ర జ్యోతి పేపర్ లా అయిపోయాన్రా. బొత్తిగా భయం లేక పోయింది. ఒకే ఇందాకా చెప్పిన క్యాన్సిల్లన్నీ క్యాన్సిల్. సరే విషయం చెప్పు ఏడు మంది హాండా సివిక్ లో ఎలా వచ్చారు?"
"నీకు చాలా అయిడియాలొస్తాయి కానీ ఇలాంటి వాటిల్లో నువ్వు చాలా పూర్ రా. ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను చూసినప్పుడే నా గుండె కలుక్కుమంటుంది.నా గుండె విదారకంగా మారిపోతుంది. ఇలాంటి సమయాల్లోనేరా నాకు కొడిగట్టిన దీపపు ప్రమిదలోని సల సల కాగే నూనెలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ అప్పుడే ఒక బలమైన ఎర్ర చీమ నన్ను వెనక్కులాగుతుంది. నేను లేక పోతే ఎలా పైకొస్తావో ఏమో. యండమూరి విజయానికి అయిదు మెట్లు పుస్తకం చదవ లేదు కదా నువ్వు. ప్చ్. అసలు ఈ టెక్నిక్ వాళ్ళకు చెప్పిందే నేను. మేమందరం ఆల్రెడీ రీ-చార్జబుల్ ఏ.సి. మిషన్‌లు ఆక్సిజెన్ మిషన్ లు కొనేసుకున్నాం."
"సరే అంతగా బాధ పడుతున్నవ్ కాబట్టి క్షమించేస్తున్నా. ఈ సారి మంచి డీల్ కుదిరితే చెప్పు నేను కూడా రెండు సెట్లు కొంటా. ఒకటి నాకు ఇంకోటి కూడా నాకే. ఇలా అయితే గ్యాస్ మీద చాలా డబ్బు ఆదా అవుతుంది. ఇంకో కండిషన్ ఇలాంటి టెక్నిక్కులు ఇంకా ఏమన్నా వుంటే మొదట నాకే చెప్పాలి. లేకపోతే కాలేజీ లో బెంగాలి అమ్మాయి బితిక నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు కుదరదని చెప్పిన విషయం నిజం కాదని నువ్వే బితిక కు ప్రపోజ్ చేస్తే వాళ్ళ తమ్ముడు తొరొంగో రాయ్ తో నిన్ను కొట్టించిండం వల్లే నీ ముక్కు వంకర పోయిందనే విషయం మీ ఆవిడకు చెప్పేస్తా. అర్థమయిందా"
"నా ఖర్మ బర్నయ్యి నా కాలేజీ గాడివి నువ్వు తగిలావు ఇక్కడ. చస్తానా. రేపో మాపో మా కంపెనీ వాళ్ళు నన్ను లే ఆఫ్ చేస్తే నేను ఇక్కడినుండి ఏ టొర్నాడోనో, తుఫానో వచ్చే రాష్ట్రానికి వెళ్ళి పోతా."
"ఒరేయ్ మీరిలానే పోట్లాడుకుంటారా లేక బియ్యం గురించి మాట్లాడేదేమన్నా వుందా?" రామ సుబ్బా రెడ్డి చెప్పాడు.
అంతలో కాఫీ లొచ్చాయి. అలా కాఫీ రావడం ఆలస్యం ఒక్కోడు లేచి ఎదురెళ్ళి పోయి కాఫీ తెచ్చేసుకున్నారు లేటయితే ఎక్కడ కప్పు మిస్సవుతుందోనని. తాగేసిన తరువాత అందరూ అందులో కొన్ని నీళ్ళు పోసుకోఎని భూచక్రం, విష్ణుచక్రం లా తిప్పి అడుగంటిన కాఫీ కూడా తాగేశారు. కాఫీ పడి కొంచెం తేరుకున్నాకా సమావేశం మొదలైంది.
"ఇవాళ మనమందరం ఇలా కలిసినందుకు నాకు సంతోషంగా లేదు.." అని మొదలు పెట్టానో లేదో.
"అదేంట్రా ఈ-మెయిల్ లో సంతోషంగా వుందన్నావ్ ఇప్పుడేమో లేదంటున్నావ్. నీకు స్ప్లిట్ పర్సనాలిటీ వుందా" సుబ్బి గాడు.
"ఒరేయ్ నిన్ను అందుకే కాఫీ కొంచెం కొంచెం తాగమని చెప్పింది. అది ఈ-మెయిల్ కాబట్టి అలా రాశా. నేను చెబుతోంది బియ్యం రేట్లు అమాంతం పెరిగి పోయి బాధా కరంగా కలుసుకొంటున్నందుకు. సరే విషయం లో కొస్తా. ఇక్కడున్న మనం ఎంతో ధనవంతులని తెలుగుదేశం లో వున్న వాళ్ళందరూ అనుకుంటుంటారు.(ఇక్కడ నరసింహా విజిల్ వేశాడు). కానీ మనం నిజానికి అంత డబ్బున్నోళ్ళం కాదని ఇప్పుడు తేలి పోయింది. బింకానికైనా మనోళ్ళముందు డబ్బున్నట్టు నటించి ఈ అమెరికా గర్నమెంటు వాళ్ళ ముందు డబ్బులేనోళ్ళ లాగా నటించి వై.ఎస్. ఇచ్చిన బియ్యం కార్డులు(సమరసింహా విజిల్ వేశాడు) సంపాయించాలి. మనకు కంపెనీ వాళ్ళు ఎన్ని బోనస్ లు ఇచ్చినా డబ్బులు సరిపోవు.."
"ఒరేయ్ మామా మొన్న మామ సోము టాక్సు బ్రేక్ మనిషికో $600.00, ఒక్కో బుడ్డోడికి $300.00 ఇచ్చాడు కదా.అది కూడా సరిపోదా.." సుబ్బి గాడు.
"సున్నపు భొట్ల సుబ్బా రావ్! వికారాబాద్ లో తుకారాం లా ఆకారానికి వికారం కలిగే మాటలు మాట్లాడావంటే ప్రకృతి సిద్ధ మైన నీ ఆకృతి వికృతంగా మారిపోతుంది జాగ్రత్త"
"సరేరా! నువ్వు మాట్లాడుకో నేను బయటికెళ్ళి ఓ దమ్మేసొస్తా.."
"మంచిది. ఆశీర్వాదం. మళ్ళీ రాకు. . మనమిప్పుడెక్కడున్నాం? బోనస్ ల దగ్గరున్నాం. కావున మనకు ఈ దేశంలో కొన్ని ప్రత్యేక సదుపాయాలు కావాలి. అటువంటి వాటిల్లో మొదటిది. బియ్యం కార్డు. ఓక్క సారి ఈ కార్డు మన చేతికొస్తే దీనికి గ్యాసు, కూర గాయలు జత చేసుకోని పోవచ్చు. ఇంకా ఎక్కువ సేపు మాట్లాడితే మీరు తాగిన కాఫీ అరిగి పోయి మళ్ళీ అడిగే ప్రమాదముంది. అందువల్ల ఇంతటితో ఆపి నా తరువాత సప్రస్డ్ శివరాం గారిని మాట్లాడ మని కోరుకుంటున్నాను."
"ఇవాళ మనమందరం సమావేశమయినందుకు నాకెంతో ఆనందంగా వుంది.ఈ అవకాశమిచ్చిన విహారి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మర్రి చెట్టు మహా వృక్షమయ్యేముందు ఒకప్పుడు అది కూడా ఒక మొక్కే. అలాగే మనం వటవృక్షం లా వేళ్ళూనుకునే ముందు ఒక మొక్క గా ప్రారంభిద్దాం. ఒక హిట్లర్(గ్యాప్), ఒక నెపోలియెన్(గ్యాప్), ఒక ఆబ్రహం లింకన్(రెండు గ్యాప్ లు), ఒక తాంతియా తోపే(రెండు గ్యాప్ లు), ఒక వీర సావర్కర్(ఒక గ్యాప్), ఒక గాంధి(ఒక గ్యాప్), ఒక శివాజీ(జుస్ట్ గ్యాప్), ఒక చిరంజీవి(చాలా గ్యాప్ లు చప్పట్లు కొట్టుకోడానికి. చాలా మంది ఛాతీలు చపాతీలయ్యాయి), ఒక బాల కృష్ణ(అయిదు గ్యాప్ లు కొంత మంది ఛాతీలు పూరీలయ్యాయి), ఒక జగన్(మూడు గ్యాప్ లు), ఒక ఈ టి.వి. సుమన్ (చాలా గ్యాప్ లు)మనలోనే వున్నారని నిరూపిద్దాం. అలా నన్ను నిరూపించుకునే అవకాశమిచ్చిన విహారి గారికి ధన్యవాదాలు. అలాగే 1762 లో ఆఫ్రికాలో అణగదొక్కబడ్డ 'బొకాంగొ సుక్కో ముక్రోసూ' తెగ వారి భూ పోరాటం గురించి చెప్పుకుంటే ఎంతో వుంది. ఎంతో అన్నాను కాబట్టి కొంత చెప్పుకుంటే బావుంటుంది. వాళ్ళు కూడా ఎన్నో ధన(గ్యాప్), ప్రాణ(గ్యాప్..గ్యాప్), మాన(గ్యాప్..గ్యాప్..గ్యాప్) త్యాగాలు చేసి వాళ్ళనుకున్నది సాధించారు. అలాగే మనము కూడా ఇక్కడ అమెరికాలో లెక్కకు మిక్కిలిగా త్యాగాలు చేసి తెలుగు వాళ్ళ త్యాగ నిరతిని ఈస్టు కోస్టు నుండి వెస్టు కోస్టు వరకు, కెనడా నుండి మెక్సికో వరకు, ఆగ్నేయం నుండి వాయవ్యం వరకు, నైరుతు నుండి ఈశాన్యం వరకు చాటి చెప్పాలి. ఇలా చాటి చెప్పే అవకాశాన్ని నాకిచ్చిన.."
"విహారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ఆపేస్తున్నా.ఇప్పుడు అందరూ చప్పట్లు" మనోజ్ అడ్డు పడ్డాడు.
"మనోజ్ గారు మీరు కొచెం ఆగండి ఆయనికి మనం టైము లిమిట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన్ని ఆపలేము. ఆయన్ని కాసేపు మాట్లాడుకోనిద్దాం" అన్నా నేను.
మనోజ్ చెవిలో "చూడండి. ఆయన గురించి మీకు తెలీదు. ఆయనకి ఆపమళ్ళీమొదనియా అనే జబ్బు వుంది. ఒకసారి మధ్యలో అపామంటే మళ్ళీ మొదటి నుండి మొదలు పెడతాడు. అయన చివరలో నమస్తే, జై హింద్ అంటాడు. అంతవరకు ఈ నల్లటి గుడ్డ మీ నల్లని నోట్లో కుక్కుకోండి. ఈ సారి అయన్ని ఆపితే మిమ్మల్ని ఈ కిటికీలోనుండి తోసేస్తా. మరీ ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కోసేసి మా ఇంట్లో బల్లులకు, చేపలకు, చిలకలకు ఆహారంగా వేసేస్తా" అని చెప్పా.
"ఇవాళ సమావేశమయినందుకు నాకెందుకో ఆనందంగా వుంది. అవకాశమిచ్చిన విహారి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మర్రి చెట్టు మహా వృక్షమయ్యేముందు ఒకప్పుడు అది కూడా ఒక చిన్న మొక్కే....(ఈ సారి ఛాతీలు చపాతీలు, పూరీలు అవడం కొంచెం తగ్గింది)...అలాగే 1762 లో ఆఫ్రికాలో అణగదొక్కబడ్డ 'బొకాంగొ సుక్కో ముక్రోసూ' తెగ వారి భూ పోరాటం గురించి చెప్పుకుంటే ఎంతో వుంది.... ఇలా చాటి చెప్పే అవకాశాన్ని నాకిచ్చిన విహారికి మరొక్క సారి ధన్యావాదాలు తెలుపు కుంటున్నాను. మనం ఏ పని చేసినా చాలా తెలివి గా, ఇంటెలిజెంట్ గా చెయ్యాలి. అంటే మనకు ఇంటెలిజెన్సు వుండాలి. ఇంటెలిజెన్సు అంటే ఎలా వుండాలి? అసలు ఇంటెలిజెన్సు అంటే ఏవిటి? .."
"ఇంటెలిజెన్సు అంటే ఇరాక్ లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ వున్నాయని చెప్పేది" ఈ సారి బొబ్బర్లంక వెంకట్ ఓ చెయ్యేశాడు. అంతే మిగిలిన వాళ్ళందరూ ఆయన మీద పడి సేఫ్ వే స్టోర్ ప్లాస్టిక్ కవర్లు నోట్లో కుక్కేశారు.
"మీరు కానివ్వండి శివరాం గారు. ఈ సారి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు బిన్ లాడెన్ బెస్టు ఫ్రెండ్, ఇరాన్ కి అణ్వాయుధాలు సప్ప్లై చేస్తున్నాడు అని బియ్యం అర్జీ బదులు సీక్రెట్ నోట్ ఎఫ్.బి.ఐ. కి పంపించేస్తాం." అన్నాడు గణేష్.
"ఇవాళ సమావేశమయినందుకు నాకెందుకో ఆనందంగా వుందో లేదో తెలియడం లేదు. ఈ అవకాశం మిచ్చిన..(కాసేపటికి అందరూ సెల్ ఫోనులో అడ్రసు బుక్కు చదువుకోవడం లో నిమగ్నమై పోయారు. చాతీలు మామూలుగానే వున్నాయి)... అలాగే 1762 లో ఆఫ్రికాలో అణగదొక్కబడ్డ 'బొకాంగొ సుక్కో ముక్రోసూ' తెగ వారి భూ పోరాటం గురించి చెప్పుకుంటే ఎంతో వుంది....
అలా చెప్పుకుంటూ పోతే దానికి అంతే లేదు. నేను మాత్రం మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తా. నాకీ అవకాశమిచ్చిన... నమస్తే. జై హింద్." అని శివరామ్ కూచున్నాడు.
అందరూ చప్పట్లే చప్పట్లు. "కోర్టు కోర్టుకీ, తీర్పు తీర్పుకి ఇంతే తేడా వుంటే ఎలా యువరానర్ ..." అన్న సర్దార్ పాపారాయుడి డైలాగుకు కూడా అన్ని చప్పట్లు వచ్చుండవ్. అది చూసి శివరామ్ జేబులోనుండి మెక్ డోనాల్డ్స్ పేపర్ నాప్కిన్ తీసి కళ్ళు తుడుచుకున్నాడు.
తరువాత బ్రహ్మాండం భోజేశ్వర్రావ్ ని మాట్లాడ మన్నారు.
" ముందుగా నన్ను ఇంట్లోకి రానిచ్చిన విహారికి ధన్య వాదాలు. నన్ను రావద్దని మెయిల్ పెట్టారట. కానీ అర్జీ అనగానే చేతులు దురదపుట్టి ఆపుకోలేక మా అవిడను ఇంటి దగ్గే ఆపేసి వచ్చేశాను. మా ఆవిడను కూడా తీసుకొచ్చుంటే చాలా సరదాగా వుండేది. ఎనీవే, మీ కందరికీ శ్రమ తగ్గించాలని నేనాల్రెడీ అర్జీ రాసేసి తీసుకొచ్చేశాను. దాన్ని ఆఫీసులో జిరాక్సు చేసుకొని 15 కాపీలు తెచ్చాను. ఇదిగోండి తలా ఒకటి తీసుకోండి" అని బ్యాగు లోనుండి పేపర్లు తీసి ఇచ్చేశాడు.
అందరూ దాన్ని సెహ్భాష్ అని మెచ్చుకొని ఒకే చేశేశారు మూజు వాణీ ఓటుతో.
ఇకే అసోసియేషన్‌కు పేరేం పెట్టాలి అనే దానిమీద అందరూ మల్ల గుల్ల పడ్డారు. అమెరికన్ తెలుగు రైస్ అసోసియేషన్(ATRA), అట్ర అని పెడదామంటే కొంత మంది ఒప్పుకోలేదు. అది కాదని రైస్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(RANA),రానా అని పెట్టాలంటే ఇంకొందరు ఒప్పుకోలేదు. చివరికి అట్రానా అని పేరు పెట్టడానికి ఎవరికీ అభ్యంతరం లేక పోయింది.
అసోసియేషన్ ఆఫ్ తెలుగు ఫార్ రైస్ ఇన్ నార్త్ అమెరికా (ATRANA)
తరువాత ఈ అర్జీకి బుష్షు ఎలాంటి రిప్లై ఇస్తాడో అన్న దాని మీద పందాలు జరిగాయి.
మన అర్జీ చదవగానే "మీరు ఎక్కువగా బియ్యం తింటున్నారు కాబట్టే ఇప్పుడు ప్రపంచానికి ఆహార సమస్య వచ్చింది అని అంటాడు" అన్నాడు వెంకట్.
అలా అన్నాడో లేదో "లేదురా ఇప్పుడు ఆవిషయాన్ని గ్రహించాడు కాబట్టి అలా అనడు. కావాలంటే పందెం కాస్తా." అన్నాడు మనోజ్.
"సరే అలానే అంటాడని పది ఏర్ పోర్టు ట్రిప్పులు పందెం." అన్నాడు వెంకట్.
"అంటే"
"అదే. నా ఫ్రెండ్సు కానీ బంధువులు కానీ ఎవరొచ్చినా నువ్వే ఏర్ పోర్టుకు వెళ్ళి తీసుకొని రావాలి" అన్నాడు వెంకట్.
"అట్లయితే సరే. జీతం కన్నా గ్యాస్ రేటే ఎక్కువ పెరుగుతుంది. నేను ఓడిపోతే నీ కోసం పది ఫ్రీ రౌండ్ ట్రిప్పులేస్తా ఎయిర్ పోర్టు నుండి." ఒప్పుకున్నాడు మనోజ్.
"నో వే అలా అనడు. మన అర్జీ చదవగానే మనకో ప్రశ్నొస్తుంది. అదేంటంటే Are you with us or with them అని" అన్నాడు సుబ్బి గాడు అప్పుడే లోపలికొస్తూ.
"లేదండీ అలా అనడు. అలా అంటే నేను నిన్ను రెండు వారాలు నా కారులో ఆఫీసుకు తీసుకెళ్ళి దిగ బెట్టి వస్తా. పందెమేనా" ఈ సారి సప్రెస్డ్ శివరామ్.
"లేదండీ నేను చెప్పినట్టే జరుగుతుంది. నేను ఓడిపోతే మిమ్మల్ని రెండు వారాలేమి ఖర్మ. ఈ సంవత్సరంలో వచ్చే అన్ని పండగలప్పుడూ మిమ్మల్నీ,మీ ఫ్యామిలీ ని ప్రతి పండక్కీ గుడికి నేను నా కార్లో తీసుకెళతా"
"అయితే సరే. డన్." అన్నాడు సప్రెస్డ్ శివరామ్.
నాకూ బెట్టింగులు చెయ్యాలనే వుంది కానీ బాసు దేవి చెవుల పడుతుందని బెట్టింగులో వేలు పెట్టలేదు.
బెట్టింగులన్నీ అయిపోయిన తరువాత అర్జీని సప్రెస్డ్ శివరాంకు ఇచ్చి వాషింగ్టన్ కు సెర్టిఫైడ్ మెయిల్ చెయ్యమన్నాం. శివరాం ఎగిరి గంతేసి అర్జీని నాలుగయిదు సార్లు అన్ని వైపుల ముద్దు పెట్టుకొని కవర్ లో పెట్టాడు. మళ్ళీ కవర్ ని నాలుగు వైపులా ముద్దు పెట్టుకున్నాడు.
అది చూసి సన్నాయి నొక్కుల సంజీవ్ రావ్ "ఎవరన్నా మంచి జరగాలంటే కవర్ కు పసుపు, కుంకుమ రాసి పోస్టు చేస్తారు. ఈయనేంది మొత్తం ఎంగిలి పూసేస్తున్నాడు. వాళ్ళు కవర్ ని టెస్ట్ చేసి చూస్తే ఏ బయొలాజికల్ వెపనో అని భయపడ ప్రమాదముంది. ముందు ఆ ముద్దులాపండి."
"క్షమించండి నాకు ఏదైనా కొన్నా, కొత్త పని చెయ్యాలన్నా ఇలా ముద్దాడ్డం అలవాటు.మీరేమీ అనుకోకండి"
"ఏంటి మీరు కారు కొన్నప్పుడు కూడ ఈ పని చేశారా?
"అవునండి. ఇల్లు కొన్నప్పుడు కూడా. నిచ్చెనేసుకొని పైకెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది" సిగ్గు పడుతూ చెప్పాడు శివరామ్.
"మీరు ఇండియాలో సేద్యం చేశారా"
"చేశానండి. మీ అనుమానం అర్థమయింది. ఓ సారి చెట్లకు మందు కొట్టమని మా నాన్న తారా-909 ఇస్తే దాన్ని కూడా చాలా సార్లు ముద్దు పెట్టుకొని ఆస్పత్రి పాలయ్యా. ఏదో నకిలీ మందు కాబట్టి బతికి బట్ట కట్టి ఇలా అమెరికా వచ్చి ఈ అర్జీని పోస్టు చేసే చారిత్రాత్మక ఘట్టం లో పాలు పంచుకుంటున్నాను" అని కళ్ళు తుడుచుకున్నాడు.
అది చూసి సంజీవ్రావ్ చలించి పోయాడు. వాడు చలించడం చూసి సుబ్బారావ్ గాడు కూడా చలించి పోయాడు.
వాళ్ళందర్నీ చూసి వెంకటేష్ కి కోపమొచ్చింది. "చస్. ఆపండెహె. మీరు మీ చలించి పోవడాలు. అసలే ఇంట్లో ఆ దిక్కు మాలిన సీరియెళ్ళు చూడలేక్పోతుంటే మీరు కూడా మొదలు పెట్టారు. శివరాం గారు ఇలా మీరు చలించిపోతే కష్టం. పోస్టు డబ్బాలో వేసేప్పుడు మీ చెయ్యి చలిస్తే కష్టం. మీ వల్ల కాదు గానీ నాకివ్వండి నేను పోస్టు చేస్తా" అన్నాడు.
అది విన్న సప్రెస్డ్ శివరాం "ఇక్కడ వేరే వాళ్ళ చేత మనమే సప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ అనుకున్నానండి. కానీ మీరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఒక తెలుగు వాడిని ఇంకో తెలుగు వాడు సప్రెస్ చేస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను. నేను చదివిన ఏ యూరప్ చరిత్రలోనూ, ఆసియా చరిత్రలోనూ, ఆస్ట్రేలియా చరిత్రలోనూ, ఆఫ్రికా చరిత్రలోనూ, ఉత్తర అమెరికా చరిత్రలోనూ, దక్షిణ.."
అయిపోయింది అంతా అయిపోయింది ఎవర్నయితే ఈ సమావేశం జరుగుతున్నంత సేపు జాగ్రత్తగా కూర్చో బెట్టామో ఆయ్యన్నే రెచ్చ గొట్టేశారు. మళ్ళీ ఇదంత స్థిమిత పడాలంటే ఇంట్లో ఇంకో 15 కప్పుల కాఫీ ఖర్చవ్వాలి. అదే జరిగితే నాకు 15 రోజుల పాటు కాఫీ బందు. ఈ దుకాణాన్ని కట్టెయ్యాలి అని వెంకటేష్ ను టి.వి. దగ్గరకు తీసుకెళ్ళి రికార్డు చేసిన మూసీ నది మీద మంచు కొండల సెట్టింగేసి తీసిన చక్రవాక నమ్మాళ్వార్ అనే భక్తి రస కార్యక్రమం పెట్టేశా. వాడిని అలా టి.వి. ముందు పెట్టడం ఆలస్యం అందరూ ఒక్కసారి వాచీ చూసుకొని ముక్త కంఠంతో "అరే తొమ్మిదయిపోయింది వెంటనే వెళ్ళాలి" అని పరుగెత్తుకొని వెళ్ళి కారులో కూర్చున్నారు. ఎప్పుడు కారులో కూచున్నాడో కానీ వెంకటేష్ గాడు శూన్యం లోకి చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నాడు. అలా అందర్నీ వదిలించుకున్నా.
* * * * * * * *
అప్పుడే దశావతారం సినిమా చూసి వచ్చాడు జార్జి బుష్. అందులో తన రోల్ చూసి ఎంతో మురిసి పోయాడు డైలాగులు అర్థం కాలేదు కాబట్టి. వచ్చిన అర్జీని పి.ఏ. చేతికివ్వంగానే నిశితంగా పరీశీలించి బాగా ఆలోచించాడు. అసలే వీళ్ళకు కొంచెం బుర్ర ఎక్కువ కాబట్టి వీళ్ళకు నేరుగా సమాధానం ఇవ్వకుండ ఎదో ఒక తిరకాసు పెట్టాలి. నా టర్మ్ రెండు సార్లు అయిపోయింది. ఎటూ మూడో సారి వచ్చే చాన్సు లేదు. తన పార్టీ రిపబ్లికన్లకు ఓటెయ్యమని అడిగితే పోలా అని అనుకున్నాడు. వెంటనే తన పి.ఏ. ను పిలిచి తన సమాధానాన్ని చెప్పి టైపు చెయ్యమన్నాడు. టైపయిన కాగితాన్ని చూసి ఈ మాత్రం దానికి టైపు చెయ్యడం ఎందుకు గ్లోబల్ వార్మింగుకు తను కూడా ఓ చెయ్యి వెయ్యాలని దాన్ని చించేసి తన లెటర్ ప్యాడ్ మీద చేత్తో రాసి మడిచి కవర్ లో పెట్టి పి.ఏ. ని పోస్టు చెయ్యమన్నాడు.
* * * *:: * * * *
మూడు రోజుల తరువాత.
సాయంతం ఇంటికి వచ్చి చూస్తే ఉత్తరం. అదీ అమెరికా ప్రెసిడెంటు నుండి. ఆత్రంగా చించి చదివా. దాని సారాంశం..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Vote for Obama
God bless America.
(అయిపోయింది)
* * * * * * * *
10 comments:
ATRANA ,సుద్దాల అశోక్ తేజ పాటలు, తారా 909,ఆపమళ్ళీమొదనియా, మామ సోము,బెంగాలీ బితిక, తొరొంగో రాయ్,క్రిష్ణ మాదిగ ముందు ఆంధ్రజ్యోతి,ఇండియన్ స్ట్రెచబుల్ టైము,.....వెరసి మా కడుపు చెక్కలు!
పెద్దదైనా చదువుతూ చాలాచోట్ల చచ్చేలా నవ్వుకున్నా. ఎండింగ్ కొంచెం చప్పగా అనిపించింది... తీసుకెళ్ళి బుష్ చేతిలో పెట్టినందుకు, బుష్ అల్లాంటి జవాబిచ్చినందుకు.
:)
మొత్తానికి మీ బియ్యం బాధలు..బుష్ లెటర్ తో హుష్...ఉసూరు మన్నాయన్నమాట. బాధలు మాత్రం చాలా సరదాగా ఉన్నాయ్..ఇక మీ 15 కుర్చీల చర్చలు అదరహో!
నవ్వు కరవైన ఈ రోజుల్లో బాధల్లోనే నవ్వులపువ్వులు విరబూయిస్తున్నారు.
నవ్వు కరవైన ఈ రోజుల్లో బాధల్లోనే నవ్వులపువ్వులు విరబూయిస్తున్నారు.
బితిక తొరొంగోరఅయ్ బుష్ చస్త్చొ బియ్యం .కడుపుబ్బా నవ్వించారు.
మీ ముత్తాత మూడో తమ్ముడి ముని మనవడు భాకరా పేట అడవుల్లో ఇప్ప సారా కాచి గవర్నమెంటోళ్ళకి అమ్ముతున్నాడట గదా. అదెట్లా చేస్తారొ కనుక్కొని ఆ వచ్చే వాళ్ళకు పొయ్యి"
Avunaaa nijama!! monna PILER ki vellinappudu kanukkuni untey bagundedhi. ee sari kanukunnta HYD lo 'Mandhu Baadahlu' ekkavayyayi..andhukey neney saara kaaasukunta inka.
Please meeru BAAKARAPET ki phone chesi matter kanukkoni naaku kooda chepthy neeku BIYYAM 3 cents vacettu manage chestha ;)
KEKAAAAAAAAAAAAAAAA
@సుజాత గారు,
నెనర్లు.
@రాఘవ గారు,
ఎండింగు బానే వుందనుకున్నా. ఒక్కోసారంతే. మార్గదర్శి లో చేరామనుకుంటాం కానీ...
నెనర్లు.
@ఒరెమూనా,
:-) (రెండు)
@ మహేష్ గారు,
నెనర్లు.
@విజయ మోహన్ గారు,
మీ అభిమానానికి ధన్యవాదాలు.
@కృష్ణుడు గారు,
అవి అసలు పేర్లు మరి :-)
నెనర్లు.
@ ధృవ గారు,
మా వాడికి పోటీ పెట్టేస్తారా ఏంటి :-) ఆయనే వుంటే ...వాడితో పనేంటి అన్నట్టు అదే తెలిస్తే ఇలా అమెరికా వచ్చి కష్టాలెందుకు పడతా.హాయిగా ఇప్ప సారా అమ్ముకోని కోట్లకు పడగలెత్తుండే వాణి.
@స్నేహితుడు గారు.
:-) (కేక స్మైల్)
-- విహారి
Post a Comment