Friday, June 27, 2008

మా యవ్వ -- 4

* * * * * * * *


మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం

* * * * * * * *


చానా తూర్లు మాదిరి ఒగ తూరి మా మామంగడి కాడికి బొయినా మా యత్త చక్కిరి దెచ్చుకోవల్లంటే. చక్కిరి మూట్లు ఆణ్ణే వుంటాయి. మామెవురిదో చేను రిజిస్ట్రేషనుంటే వాళ్ళకి సాయింగా వాయిల్పాడుకి బొయినాడు. మాముంటే "ఆడ చెయ్యి పెట్టగాకప్పా.. అది షాక్ కొడుతుందప్పా.. బీరువా అద్దం పగులిపోతుందప్పా.. పగిలితే దెబ్బ తగుల్తుందప్పా.." అని అంటానే వుంటావుడు అయనకింగేంపన్లా పిలకాయిలంటే కింద పడకుండా, మూతో, ముక్కో పగలగొట్టుకోకుండా వుంటారా ఏంది. ఈ పెద్దోళ్ళకేం తెలీదు. అందుకే మా యత్త అంగిడి కాడికి బోతా వుందంటే యాడికీ బోకుండా ఆణ్ణే వుంటా. అబ్బుడబ్బుడూ మా యత్తేమో "ఆడెక్కబాకప్పా... ఈడెక్కబాకప్పా... పడతావప్పా.." అంటుంది. ఏందో ఈమె గూడా అంతే పిళ్ళోళ్ళనింతర్వాత దెబ్బలు తగిలిచ్చుకోకుండా వుంటారా? మా మామకి సరైంది దొరికింది. యీళ్ళకన్నా మా యవ్వే చానా మేలు. ఏం జేసినా "జాగ్రత్తప్పా.. తగుల్తుందప్పా.." అంటుంది. తగిలిచ్చుకున్యాక ఏ తంగేడాకో ఏసి కట్టు గడుతుంది. కుంటితే ఎత్తుకోని తిరుగుతుంది.

అట్ల మా యత్త అంగిడి తెరిచిందో లేదో ఎదురింటి బువ్వమ్మొచ్చె నాకు కొంజేపు పోలీసు లేకుండా జేసేదానికి. బయట్నే బువ్వమ్మతో అరట్లు కొడతావుంటే ఇదే సందు రా నాయినా అని సర్రమని నేను లోపలికి దూరి బొయినా. ఆ మిద్ది లోనే చెనిక్కాయి మూట్లు, ఒడ్లు మూట్లు, చక్కిరి మూట్లు ఏసుంటారు. మన కన్ను మిద్ది లో ఈ మూల నుండి ఆ మూలకు ఏలాడ దీసిన రాగి రిబ్బను యాంటెన్నా మింద పడె. ఇస్టూలు దెచ్చి దానిమిందెక్కి ఒగ కాలు బెట్టి ఇంగో కాలు ఆడుండే చెనిక్కాయిల మూటల మింద బెట్టి ఆ యాంటెన్నాను పట్టుకుంటే అది పుటుక్కుమని తెగి పాయె. ఇట్లాంటియ్యన్నీ ఎబ్బుడూ కాసింత చేతులుండే పిళ్ళోళ్ళ చేతుల్లోనే ఎందుకు తెగి పోతాయో నాకర్థం కాలా. ఏమి జెద్దాం రో యబ్బో.. మామయితే తిడతాడు, అవ్వయితే పడితే కట్లు గడతాది, అమ్మయితే ఇంగేం ల్యా ఓనిమెంబడి పరిగెత్తిచ్చి చింత బరస తో గొడుతుంది. టీచురు గదా ఆ బుద్దులేడ పోతాయీ. చిన్నగ సౌండు జెయ్యకుండా కిందకు దిగేసి యాడుండే ఇస్టూలు ఆడే బెట్టేసి తేలు గుట్న దొంగలా బయటకొచ్చేస్తి. ఆడ జూస్తే ఏముంది మా యత్త ఇంగా బువ్వమ్మతో కచేరి పెడతా వుంది. వాల్ల కొడుక్కి మాల్లో (మహల్ - ఊరి పేరు) పెండ్లయిందంట. దాని గురించి జెబతా వుంటే ఇంటా వుంది. అబ్బుటికి ఇంగా పెండ్లి సీను కాడికి గూడా రాలా పెండ్లి కోసరం ఏమేమి గొన్యారో జెబ్తా వుంది. వోళ్ళు సాయిబూలు గదా ఆ జుంకీలు, పూసల నగల గురించి జెబ్తా వుంటే ఇంటా వుంది. ఈ ఆడోళ్ళింతే రోల్డు గోల్డు నగల గురించి జెబ్తా వున్యా చెవులకు సమ్మగా వుంటాది.

రామాయిణం కథ ఇంగా చానా వుందని మనం మల్లా లోపలికి బొయి చక్కిరి మూట తెరిచి రొండు సార్లు బొక్కాలాడేస్తిమి. ఒగ పక్క చక్కిరి మీసమొచ్చె. దాన్ని చోక్కా పైకెత్తి తుడుచుకుంటా వుంటే ఎంబ్రాయిడరీ తెల్ల గుడ్డ గప్పిన పెద్ద రేడియో కనిపిచ్చే. ఏందో మా మాముంటే ఏమీ కనిపిచ్చవ్ ఆయన జెప్పే మాట్లే ఇనిపిస్తాయ్. మల్లా ఇస్టూలేసుకోని రేడియో నాబు బట్టుకోని రొండు మూడు సార్లు తిప్పితి. సౌండు రాలా. రేడియో కొంజెము ముందుకు లాగితి. ఎనకాల క్లిబ్యాడు (ప్యాడ్) మాదిరి చెక్క కనిపిచ్యా. చిటికెనేలు బెట్టి దాన్ని లాగితే మొత్తం అట్ట ఊడి చేతిలోకొచ్చె. లోపలంతా జంతర్ మంతర్. పెద్ద పెద్ద బల్పులు కమ్మర కట్ల మాదిరి, ట్రాన్స్ ఫార్మర్లు మైసూర్ పాకుల మాదిరి , ఇంగొన్నేమో కజ్జి కాయిల మాదిరి , కెపాసిటర్లు చిన్న అత్తిరాసాల మాదిరి , సీసం ముద్దలు ఎన్న ముద్దల మాదిరి కనిపిచ్చినాయి. తీపి తినే వోళ్ళకు అన్నీ అట్లే కనిపిస్తాయని మా యవ్వ ఎబ్బుడూ జెప్పేది. అన్నీ ఓ తూరి చేత్తో నిమిరి కొన్నింటిని లాగి మల్లా ఆణ్ణే పెట్టేసినా. ఏన్ని జేసినా సౌండు రాలా. మా మామ షోక్కోసరం పాడై పూడిసిన రేడియో పెట్టుకొనుండాడ్లే అని అట్ట పెట్టి మూసేసి కిందకొచ్చేస్తి. సౌండు లేని రేడియోలెందుకు బెట్టుకుంటారో ఈ పెద్దోళ్ళు అనుకున్యా. సౌండ్యాలొస్తుంది వాన బడితే కరంటు షాకు గొడుతుందని మా మామ కరంటు ప్లగ్గు పీకి పాయె. అది మనకు తెలక పాయె.

సాయింత్రమయినంక వాయిల్ పాడ్నుంచి మా మామొచ్చె. రాంగానె బొయ్యి చేతిలో సంచీ పీకేస్తి. "వుండుప్పా నీ కోసం కలకండ తెచ్చినా" అని పెద్ద పెళ్ళ ఒగటిచ్చె. మిగిలింది దాంపెట్టేదానికి అంగిడికి కాడికి బాయె. ఇంట్లో వుంటే మనం చప్పరిచ్చేస్తామని మామకు చానా బయిం. ఈ బయిము అన్ని చోట్లా వుంటే బాగుండె అనుకుంట్ని గానీ అది మన చేతుల్లో లేకపాయెనె. అంగిడి కాడి నుండి తిరిగొచ్చినంక ఇంగ జూసుకో నా సామిరంగ.ఱంకెలెయ్య బట్టె.

"మ్మేయ్. ఎవురు రేడియో ని కలబెట్టింది. ఈణ్ణి గానీ అంగడికి కాడికి దీస్కోని బొయింటివా. ఈడు దుడుకోడు. ఈణి చేతులెబ్బుడూ చిమ చిమ లాడతా వుంటాయి. ఈణి చెయ్యి నిమ్మళంగా వుండదు. ఇబ్బుడది రిపేరీ జెయిచ్చల్లంటే కలకడ పోవల్ల " అని అత్తనడగతా వుంటే నా చెవుల్లో బడె. ఆడుంటే మనకి పెండ్లి జేస్తార్రా సామి అని గోడ మింద నుండి ఎరువుదిబ్బ మిందకు దూకేసి గానిగ తోపులోకి వురుకో వురుకు.

ఇంటికొచ్చినంక అవ్వ సపోర్టుతో ఈపు సాపుగానె వుండిపాయె.

* * * * * * * *


ఈ పెద్దోళ్ళకు బయిమూ లేదూ ఇంగా ఏమీ పనీ లేదు లీవూల్లో పిల్లోళ్ళు ఏట్లంబడి, బాట్లంబడి, చెట్లంబడి, పుట్లంబడి తిరక్కుండా వుంటారా ఏంది? సందు దొరికితే సొక్క కాలరు బట్టుకొని కూసోబెట్టిస్తారు. అవ్వలు తాతలు అయితే పరవాలా. వాళ్ళ కింద నుండే తరముంది గదా ఈళ్ళే ఈళ్ళ సొమ్మంతా బోయినట్టు మనల్ని కూసోబెడతారు. అట్లా కుదరకపోతే వాళ్ళకన్నా పెద్దోళ్ళకు జేబ్తారు పిలకాయిలకు ఏమన్న నేర్పిచ్చచు గదా అని. ఇట్లే వాళ్ళ మాయ దారి మాటలు నమ్మి మా యవ్వ నన్నోసారి "ఎండన బడి పోగాకు నాయినా. ఇట్లా ఒచ్చి ఆ సింత సెట్టుకిందేసిన నులక మంచెం మింద కూసో. దాని మింద పరుపేస్తా గొంచెముండు" అనే. చింత చెట్టు కింద సల్లగా గాలోస్తా వుంది. ఆ ఎండకి సల్ల గాలికి సగిచ్చినట్టుగా వుంది. ఒగ సారి పండుకుంటే చింత సెట్టెగిరిపోయేట్టు గురకలు బెట్టి నిద్దర బోతా. అబ్బుటికి ఆడుకునే దానికి ఎవుడూ రాలా. ఇట్లా మా యవ్వ సట్లు కడిగేసి నార పరుపెత్తుకొని సెట్టికిందకొచ్చె అట్ల ఆడుకునేదానికి బోడోడొచ్చె. ఏందిరాయబ్బో ఎట్ల తప్పిచ్చుకునేదని పిల్లి ముందర ఎలక మాదిరి దిక్కులు జూడబెడ్తి. ఇంగే ముంది మా యవ్వ నులక మంచమ్మింద గూచెబెట్టె. కూసోని ఊరికే వుంటుంద్యా ల్యా. ఏ జెక్కీకి పాటో పాడితే నేను డ్యాన్సేస్తా ల్యాకుంటే కావమ్మ కథ జెబ్తే ఇంటా. అట్లా గాకుండా ఏందో శ్లోకం జెబ్తా పాయె. అదేందో "ఓం సిద్ధమ్న మహః" అంట. జెప్పేసి చెంబులో నీళ్ళు తాగి ఆపక్కన తిరిగి పండుకోకుండా నువ్విబ్బుడు జెప్పుప్పా అనె. "ఓం సిద్ధమ్న మహః సిద్ధమ్మని గద్దలెత్తుకుని పాయె.. సిద్ధప్ప కట్టె బట్టుకుని వాటెంబడి పరిగెత్తా పాయె.. నేను గూడా పరిగెత్తా పోతా " అని నేను నాలుగు దుముకు లేసి పరిగెత్తు కుంటా వురుకో వురుకు. "ఏం బిడ్డలురా నాయినా మీరు" అని ఆ మంచమ్మిందనే కునుకు తీసె ఇంగ. అట్లన్యా మనకు తెలుసు సాయంత్రం మనం గుడ్డలు గలీజు జేసుకోని రాంగానే టెంకాయి బొచ్చుతో మురికంతా రుద్ది రుద్ది నీళ్ళు బోసి ఏరే గుడ్డలేసి మెట్ల మింద గూసోబెట్టి మచ్చల కోడి పెట్ని గుడ్డు తో మనకు అట్టేసి పెడుతుందని. ఇంగంతే కదా అవ్వలంటే.

* * * * * * * *


ఇట్లే ఒగ సారి ఏట్లోకి బొయ్యి నీళ్ళల్లో ఈత గొట్టి అంటే కాళ్ళు నీళ్ళలో, చేతులు గడ్డ మింద పెట్టి నీళ్ళలో బాగా మునిగి ఇంటి కొచ్చినా చీగటి బడి గొడ్లు ఇంటిగొచ్చేటబ్బుడు. ఏమీ తినకుండా పండుకోని నిద్దర బోతి. అబ్బుడు మనకు అయిదెండ్లుంటాయేమో.స్పారకం లేకుండా నిద్దర బొయినా.కడుపుకేం దెలుస్తుంది స్పారకమేందో. అది కోడు గుడ్డు జాములో లేసి కోలాటమేసె. నేన్‌ లేసి "నా కన్నమో.. నా కన్నమో.. నా కన్నమో.." అని గలాట జేస్తి చేతుల్ని ఏతాము మాదిరి తిప్పుకుంటా. మా యమ్మకు కోపమొచ్చె. "ఎన్ని తూర్లు జెప్పినాన్రా నీకు కాసింత అన్నం తిని పండుకోమని ఇంటావా నువ్వు" అనె. అర్ద రేత్తిరి కాడ లేసి అరిస్తే ఎవురికి కోపం రాదు. చానా మందికొస్తుంది గానీ మా యవ్వకు రాదు. "అరె పా..నువ్వూర్కో అమ్మణ్ణీ. పాపం పిలగాడు అర్ద రేత్తిరికాడ అన్నమంటావుంటే కసురు కుంటావే. నేను రూంత ముద్దలు కలిపి పెడతా. నువ్వు పండుకో " అనె.

కన్ను బొడుచున్యా ఏమీ గనిపిచ్చదు. కిరసనాయిలు బుడ్డీ ఎలిగిచ్చుకోని అన్ని సట్లల్లో జూసె. యాడా ఒగ మెతుగ్గూడ దొరకలా. పులుగూ బూసి వుంటాయణ్యా ఇనకుండా ఆ చీగట్లోనే గాడ్డామి కాడికి బొయ్యి కొంచెం ఎండు గడ్డి దెచ్చి దాని మింద కిరసనాయిలు బోసి పొయ్యిలో ఏసి జొన్న కర్రల్తో పొయ్యెలిగిచ్చె. కొంచెం అన్నమూ, కొంచెం చిన్నెరగడ్ల తాళింపు చేసి పెట్టె. మనమేడ? ఎబ్బుడో ఎరగడ్లు పొట్టు ఒలిచేబ్బుడే నిద్దర్లోకి జారుకుంటిమి. లేపి "తిన్నాయినా. నీకిష్టమని ఎరగడ్ల తాళింపు జేసినా" అనె. నేనేమో "నా కొద్దో.. నా కొద్దో.." అనబడితి. "కొంజిము తినుప్పా.. లేగపోతే నిద్దర బట్టదు.మా చిన్ని కదా..లే నాయినా.." అనె మల్లా. మనమేమో దుప్పటి గప్పుకోని "నా కొద్దో..నా కొద్దో.." అని రికార్డు ఎయ్యబడ్తిమి. మా యమ్మకు మళ్ళీ కోపమొచ్చె. మా యవ్వేమో "పొన్లేమ్మా. బిడ్డకు నిద్దరొస్తా వుంది. పండుకోనీలే" అని కాపాడె. నన్నెనకేసుకొచ్చే దానికే అవ్వ బుట్టిందేమో.

* * * * * * * *


అబ్బుడెబ్బుడో జెప్పినా గదా ఒగ తూరి మనం చానా చిన్నగా వుణ్ణప్పుడు మనల్ని ఆస్పత్రిలో జేరిపిచ్చినారని. మదనపల్లి గౌషాష్పత్రి ఓళ్ళు నన్ను జూసి "అయ్యో ఈ పిల్లోనికి ఎన్ని మందులేసినా తగ్గ లేదే. మా వళ్ళ కాదు గానీ వేలూరి పెద్దాసుపత్రికి తీస్కోని పొండి. నేను జెయ్యాల్సిందంతా జేసినా. ఈ రోగమేందో నాకు తెల్లా. ఆడ పెద్ద డాక్టరు, ముత్తయ్య డాక్టరుండాడు ఆయినికి చీటీ రాసిస్తా" అని డాక్టర్ జెప్పె. ఇంగ జూసుకో మా యమ్మేడిశా, మా నాయినేడిశా, మా మామేడిశా, మా పెద్దమ్మేడిశా. ఇంగ మాయవ్వుంటుంద్యా "అయ్యో మారాజట్ల పిలగోనికి ఏమి రోగమొచ్చినో ఏమో" అని చీర కొంగు నోట్లో దోపుకునే.

(సశేషం)

* * * * * * * *

5 comments:

dhrruva said...

Viharee.

Mana Accent lo POST raayali antye guruvu appa.

Maa yavva kooda MAHAL lo nanu maharaja maaadiri choosukunidhi.

Ibbudu mana maadiri andhariki avvalu chesi pedathaaara emi?

Avva antye nijjam gaa devathey nappa..enni thhorlu debbalu tpapinchukuni untaamo avva unda batti.

కత్తి మహేష్ కుమార్ said...

ఇప్పుడే మన యాసలో నువ్వు రాసింది చదువుతాఉండా..శానా బాగుందయ్యా. మాదీ కలకడ పక్కన రాతిగుంటపల్లే. శిన్నప్పుడు మాతోటోళ్ళతో మాటాడిన మాట్లు జ్ఞప్తికొస్తాండాయ్.

శెనిక్కాయలూ,పరేందికాయలు,రేణిగాయలూ తింటా గడిపిన ఎండాకాలం లీవులు గుర్తుశేస్తివే..ఈ యిశాలమీద నేనూ ఒక టపా రాసెయ్యాలనిపిస్తాందబ్బీ! రాసెయ్మంటావా?

Gireesh K. said...

అబ్బాయా, నువ్వు రాసింది సదువుతావుంటే, నాక్కూడా మా అవ్వోల్లూరు రేణిగుంట గుర్తుకొస్తావుండాది! ఈ పెద్దోల్లతొ ఇదే గదా తలకాయ నొప్పి. పిల్లోలన్నాక రచ్చ వుండదా ఏంది? కాలాస్త్రిలో ఉన్నప్పుడు, మా నాయనతో గూడా ఇదే తగరారు...

మై గాడ్! మొదటి సారి మన యాసలో కొంచమైనా వ్రాసానండీ. చాలా బాగా వ్రాసారండీ... నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి!

Anonymous said...

@ ధృవ గారు,
అవ్వలుంటేనే వీపు సాపుగా వుంటుంది లేక్పోతే విమానం మోతలు తప్పవు.
నెనర్లు.

@ మహేష్ గారు,
బిడువు లేకుండా రాసి పారెయ్యప్పా. మొలకల్పుణ్ణమి గురించి గూడా రాయిప్ప నీకు పుణ్యిముంటాది.

రాతిగుంట పల్లెలో మీకు చలపతి నాయుడు తెలుసా? వాడు బి.టి.కాలేజు నా క్లాస్మేట్. నేను వాళ్ళింటికి వెళ్ళా ఒ సారి.ఇప్పుడు తిరపతిలో లెక్చరర్ అనుకుంటా.

@గిరీష్,
ఏందిబ్బా. మీది గూడా సిత్తూరేనా?
నెనర్లు.

-- విహారి

venu... said...

even i am frm chittoor.. ee posts enni saarlu chadivaano naakey lekka theleedu.. thnx a lot vihaari gaaru.. :)