ప్రమదావనంలో నేను
:::::::::
నా కళ్ళకు ర్యాండం గుణమెక్కువ. ప్రమదా వనం అని పేరు పెట్టినప్పుడే నా తడబడే కళ్ళు ఆ పేరును ప్రమాద వనం లా చదివాయి. అలాంటిది అతిథిగా రమ్మంటే కళ్ళే కాదు ఒళ్ళు కూడా తడబడ్డం మొదలైంది. కాలేజీలో వున్నప్పుడు ఎవరైనా అమ్మాయిలు మాట్లాడితే గొంతు తడారిపోయేది. సినిమాలకు రమ్మని పిలిచిన అమ్మాయిలకైతే ఆ సినిమా థియేటర్ లోనుండి ఎత్తేసే వరకు కనిపించే వాడిని కాదు. ఆడవాళ్ళతో మాట్లాడాలంటే మా అవ్విచ్చిన ధైర్య రసమూ, మాధీఫల రసాయనమూ సమ పాళ్ళలో కలుపుకుని కంచు గ్లాసులో తాగి వెళ్ళే వాడిని. ఇప్పుడు మా అవ్వలేదు, మాధీఫల రసాయనమూ లేదు. మా ఆవిడ నడిగితే అవేంటో తెలీదు అంటుంది. జీవితంలో ఎప్పుడో ఓ సారి రిస్కు తీసుకోక తప్పదని తెలిసింది. అప్పుడే పెళ్ళి కూడా చేసుకున్నా. అలా ఆ రిస్కు తో కొంత ధైర్యం వుంది కాబట్టి అతిథిగా వస్తానని చెప్పేశా.ఆ రోజు డంకనక డంకనక... డంకనక డంకనక... అని వచ్చేసింది. భయ పడుతూ పడుతూ ప్రమాదావనం లో అడుగు పెట్టేముందు
ఇలా వెళితే
అలా బయటికి వస్తానని అనుమానిస్తూ పిల్లిలా అడుగు పెట్టా.
అలా బొమ్మలు మాత్రమే పెట్టేస్తే బ్లాగు లోకానికి అన్యాయం చేసినట్టవుతుంది.అక్కడేమి జరిగిందో తోటి మగ బ్లాగర్లకు చెప్పకపోతే మగ పుట్టకే వేస్టు అంతే కాకుండా మగ బ్లాగు లోకానికి ద్రోహం చేసిన వాడనై నరకాని కెళితే అక్కడ ఆడ రాక్షసుల చేత శిక్షింపబడతానని గ్రహించి ఇప్పుడు రాస్తున్నా.
అది శాలి వాహన శక సంవత్సరం 1930...
స్వస్తి శ్రీ సర్వధారి నామ సంవత్సరం....
వైశాఖ శుధ్ధ చతుర్దశి......
వర్జ్యం లేదు.
సమయం: భారత్ లో ఎగిరే పక్షులు ఇంటికి చేరుకునే సమయం. ఉద్యోగ పక్షులు ఏడుస్తూ పార్కుల నుండి ఇంటికి చేరుకే సమయం.
అమెరికా లో బ్రష్షు బదులు కాఫీ నోట్లోకి తోసే సమయం.
ధైర్యే సాహసే ఉబ్బసమే దగ్గు అని 11 సార్లు అనుకొని ప్రమదా వనం లో అడుగు పెట్టా. నేను అడుగు పెట్టేసరికి కొందరు పెద్ద మహిళా బ్లాగర్లు వచ్చి వెళ్ళి పోయారు. (హమ్మయ్య…మొదటి హమ్మయ్య) అప్పుడు అక్కడున్న బ్లాగరులు జ్యోతక్క, రాధిక, సుజాత శ్రీనివాస్, నిషిగంధ, తెరెసా, వరూధిని వున్నారు. ఇంకా రేణు కూడా మధ్యలో వచ్చి వెళ్ళారు.
కాసేపు పిచ్చాపాటి కబుర్లు నడిచాయి. పిచ్చా పాటి అంటే జన్మ కుండలాలు, జాతక నక్షత్రాలు తెల్సుకోవడమన్నమాట.
అప్పటికి వాతావరణం బావుంది (హమ్మయ్య రెండో సారి. ఐడియా హమ్మ హమ్మ కాదు )
అవన్నీ అయిన తరువాత మెల్లిగా మాటలు చెబుతూ “స్వాగతం దొరా….సుస్వాగతం..” అని ఉష్ణ పీఠం ఎక్కించారు. అదేదో బొబ్బిలి బ్రహ్మన్న సింహాసనమనుకొనేరు. ఎక్కి కూచుంటే కానీ దాని శక్తి తెలీదు. తరువాత మొదలైంది ప్రశ్నల పరంపర. (ఇంక హమ్మయ్యాలు లేవు గమనించగలరు)
మీదే ఊరు?
మేము కొండ దొరలం, కొండల్లో వుంటాం. మంచు కురుస్తుంది కదా మంచు దొరలం కూడా.
గర్లు ఫ్రెండ్స్ వున్నారా?
ఫ్రెండ్సులో గర్ల్సు లేరు.
మీది ప్రేమ వివాహమా?
పెళ్ళయిన తరువాత ప్రేమించిన వివాహం.
మీ ఆవిడ ఇండిపెండెంటా, డిపెండెంటా?
నా మెళ్ళో పెండెంటు.
మీ దగ్గరకో అందమైన్ డబ్బున్న అమ్మాయొచ్చి పెళ్ళి చేసుకుంటా నంటే ఏమంటారు.
ఎగిరి గంతేసి చేసుకుంటా
ఇద్దరూ కలిసే వుండాలంటే ఏమి చేస్తారు?
వాళ్ళు కొట్లాడు కోకుండా ఒకరికి ఈ టి.వి. పెట్టి ఇంకోకరికి కూడలి చూపిస్తా.
మీకు బ్లాగడానికి అవిడియాలు ఎలా వస్తాయి?
చిన్నప్పుడు ఎక్కువగా దొంగతనాలు చెయ్యడం వల్ల. ఇప్పుడు చేయిస్తున్నా.
మీరు సరదాగా వుంటారా , మూడీగా వుంటారా?
సరదా మూడ్ లో వుంటా.
మీ హైటెంత?
సిక్స్ టూ సిక్సు.
మీరేం చేస్తుంటారు?
పిల్లల చేత మారాం చేయిస్తుంటా.
అమెరికా ఎందుకెళ్ళారు?
విమానెక్కాను కాబట్టి
మీరు మందు కొడతారా?
అవును ఇక్కడ మా చెట్లకు తెగులు ఎక్కువ.
మీ కిష్టమైన బ్లాగు
విహారి
అది కాకుండా ఇంకోటి
ఇదీ నా మది
ఊహూ అది కాకుంటా ఇంకొకటి
నాటకాలూ..వగైరా
మీకు తిరకాసోడు అని పేరుందా
అవును నాదగ్గర ఎప్పుడు త్రీ కాసులే వుంటాయి. ఫోర్ కాసులు(నాలుగు రాళ్ళు) వుండవు.
అందరూ హాస్యంగా రాస్తున్నారు గదా మీరు కుళ్ళు కుంటున్నారా?
అవును. బండకేసి బాదుకుంటున్నాను. అందుకే ఇకమీదట సీరియెస్ టపాలు రాస్తాను.
(ప్రమదా వనం కొంత సేపు కంపించింది. రాధిక కంప్యూటరును గట్టిగా బాదడం వల్ల తన కంప్యూటరుకు పగుళ్ళు వచ్చాయి. సరే హాస్యం రాస్తాను అన్న తరువాత అన్నీ సవ్యంగా పని చెయ్యడం మొదలు పెట్టాయి)
అలా రాసుకుంటూ పోతే చాలా వున్నాయి. ఉష్ణ పీఠం మీద నుండి దిగిన తరువాత నేనెలా అయిపోయానో నని మీకు అనుమానం కదూ. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్..బాతు గుడ్డోయ్..ఆమ్లెట్లోయ్.. అని పాట పాడుకున్నానని మీ అనుమానం కదూ. మీ అనుమానం తీర్చుకోవడానికి ఈ కింది బొమ్మ చూడండి. (మైసూర్ మహరాజ్)
మొత్తానికి భూమి మీద నున్న అన్ని ఖండాల లలనాంగనలు అందరూ చేటలు వదిలేసి ఒక్క చోట ముచ్చట్లు పెట్టుకోవడం బావుంది. రేపో మాపో వీవెన్ స్క్రీన్ మీద రాసే సదుపాయమిస్తే సంక్రాంతి ముగ్గులు వేసుకోని గొబ్బెమ్మలు పెట్టేసి హైటెక్ చేస్తారు. ఎవరైనా మహిళామణులు మిస్సయితే తప్పకుండా వెళ్ళి ఆ వనం లో విహరించండి.
గమనిక: ఇందులో కొన్ని కల్పితాలున్నాయి.
:::::::::
13 comments:
@విహారి గారు ,
అల్రేడి జ్యోతి గారు దీని మీద రాసేసారే !!
ఆడమళయాళం మీటింగు మీద ఒక మగ కోణం. బాగుంది.ఇక ప్రశ్నల కి మీ జవాబువిని మిమ్మల్ని పై(చిరిగిన)ఫోటో చెయ్యక వదిలెయ్యడం ఆశ్చర్యమే!
ఈ పాటి కోటింగుకే మిగతా మగబ్లాగర్లు భయపడిపోయారు.మీ ప్రమదావనానికి మేము చచ్చినా రామంటే రాము అంటున్నారు. ఏదో కుర్రాడు సరదాగా ఉంటాడు కదా అని కొంచేం ఝలక్ ఇచ్చాము.
మీ ఆవిడ ఇండిపెండెంటా, డిపెండెంటా?
నా మెళ్ళో పెండెంటు.
:-) good one :-)
BTW, నాకు ప్రెవేటుగా అందిన వేగు ఏవిటంటే, ఇలాగ ప్రత్యేక ఆత్మీయ అతిథుల్ని (బకరాల్ని అని చదువుకోండి) ఇంకా ఆహ్వానించాలని ఆలోచిస్తున్నట్టూ, మొదటి గెస్టు విహారిని పీకి పాకం పట్టేస్తే ఇంకెవరూ రారని స్ట్రాటెజిగ్గా లలిత లైతంగా జరిపించినట్టూ అభిజ్న వర్గాల భోగట్టా!
@kathi - ఏంటి మళయాలం గిళయాళం అంటున్నారు, అంబిలి గానీ గుర్తొచ్చిందా? :-)
మీరు రాజకీయాల్లో చేరితే ఖచ్చితంగా హోమ్ మినిస్టరైపోతారు. ఇప్పుడదేకదా అంటారా? ;) అందకుండా సమాధానాలివ్వడంలో జానారెడ్డి తరువాత మీరే. :-))
ప్రమదావనం ఎప్పుడూ ప్రమోదవనమే గానీ,ఎప్పటికీ ప్రమాదవనం కాదని గుర్తించారన్నమాట.
@కొత్తపాళీ, "ఆడమళయాళం" అనేది తెలుగు భావనేనండీ బాబూ!(అంతగా డౌటైతే సుజాత గారే పూచీ).బాగా వ్యక్తిత్వముండి, మాట్లాడే ఆడవాళ్ళు ఒక చోట చేరితే ఆడమళయాళ మనేస్తారట.
ఏ సుజాత గారు ? :D
కొత్తపాళిగారు,
అదేంటండి. అందరిని అలా భయపెట్టేస్తున్నారు? మీ మగవాళ్లు ఇలాగే మీటింగు పెట్టుకుని పిలవండి, మా ప్రమదావనంలో ఎవరైనా సింగిల్‍గా వచ్చేస్తాం. మీకు అంత భయంగా ఉంటే మీ ఆవిడని పంపించండి ఈసారి. మేమూ మేమూ ముచ్చట్లేసుకుంటాం.
మంచుకొండల్లో వుండే మీరు ప్రమదావనం లో "ఉష్ణ పీఠం" ఎక్కిన తరువాత, మంచులా కరిగిపోయి, ప్రమదావన మహిళలూ మహరాణులు అని పాడుకొనే వైనం చాలా బాగుంది విహారిగా... కాదు మైసూరు మహరాజుగారు. మొత్తానికి మీలాగ మిగతావారు కాసింత అర్ధం చేసుకొంటే చాలు ప్రమదావన పడతులను. మీరు అతిధిగా వచ్చినరోజు మిస్స్ అయినది నేనే. ప్చ్! అంతే లెండి కొన్ని జీవితాలు.
లేచింది నిద్ర లేచింది బ్లాగు మహిళా లోకం
దద్దరిల్లింది బ్లాగు పురుష ప్రపంచం.
ఎపుడో చెప్పెను వేమన గారు
ఇపుడే చెపుతా .........
నేను చెప్పడానికేముంది? అంతా విహారిగారు ( మన మైసూర్ మహరాజు గారు) చెప్పేసిన తరువాత.. ఇంతేసంగతులు చిత్తగించవలెను.
@సుజాత గారూ, ‘మనసులో మాట’ సుజాతగారు పూచీ అండీ ‘గడ్డిపూలు’సుజాతగారూ. వారే నాకు ఈ ఆడమళయాళం విషయం చెప్పారు.
"ఏ ఇంట్లో అయినా సమర్థత కలిగిన ఆడవాళ్ళుంటే అంటుంటారుగా 'అక్కడంతా ఆడ మళయాళం ' అని!"
www.parnashaala.blogspot.com
చాల బాగ వ్రాసారు. మీరు కామెడీ కింగ్
@ భరత్ గారు,
నిజా నిజాలు జనాలకు తెలియాలి కదా. అందుకే ఈ అపరాధ పరిశోధనా వ్యాసం.
వ్యాఖ్యకు నెనర్లు.
@ మహేష్ గారు,
ష్... నిజాలు కొన్ని అలాగే వుంటాయ్. అదేదో సినిమాలో వేణు మాధవ్ ఫేసులాగా పెడితే బావుండదు కదా.
నెనర్లు.
@ జ్యోతక్కా,
అదే జలక్ చూసే కొంత మంది భయపడినట్లున్నారు.
@కొత్త పాళీ,
ఈ సారి మీకొచ్చే ఆ వేగుల్ని ఇటువైపోసారి పంపించండి. తృణమో పణమో చెల్లించి విషయాల్ని రాబట్టు కుంటాం.
@ రానారె,
మీకు నా మీద ఇంత కసి వుందని తెలీదు.జానా రెడ్డి తెలివి తక్కువ వాడని భ్రమింపచేసే 'జాణ' రెడ్డి.
@రాధిక గారు,
మీరెలా చెబితే అలానే.నేనెప్పుడూ మహిళా మణులకు అడ్డు చెప్పను. :-)
నెనర్లు.
@సుజాత గారు,
వచ్చింది. మ.మా. సుజాత గారు కదా?
@రమణి గారు,
మీరూ మిస్సయ్యారూ....
మీ మహిళా బ్లాగులోక స్పిరిట్ ను అలానే కాలి పోనీకుండా వెలిగించండి.
వ్యాఖ్యకు నెనర్లు.
@శివ వాగుడు గారు,
మీ వ్యాఖ్యకు, పొగడ్తకు నెనర్లు. నేను కింగు కాదు ఎగిరి పడే స్ప్రింగును మాత్రమే.
-- విహారి
Post a Comment