Wednesday, June 11, 2008

అమెరికాలో టిక్కెట్లు – ఇక్కట్లు

:::::::::


ఏరా? ఎందుకలా ఏడుపు మొహం పెట్టుకున్నావ్?
టికెటొచ్చింది.

మామా! కార్లేమీ రావడము లేదు. రారా రోడ్డు దాటేద్దాం.
నేను రాన్రా. మొన్న ఇలా దాటినందుకే జే వాకింగ్ అని టికెటిచ్చాడు వెధవ.

ఏవిటే అంత దూరంగా పార్క్ చేస్తున్నావ్? స్టోర్ దగ్గర పార్కు చెయ్యొచ్చు గదా. మళ్ళీ ఇంత దూరం నడవాలా? హఁబ్బా!
దగ్గరుంది కదా అని మొన్న రెండు కార్ల మధ్యలో దూరి పార్క్ చేసి వెళ్ళా తీరా వచ్చి చూస్తే విండ్ షీల్డ్ మీద టికెట్టుంది డబులు పార్కింగు చేసినందుకు. అసలే డ్రైవింగు కొత్తగా నేర్చుకుంటున్నా. నువ్వు టెన్షన్ పెట్టకుండా లోపలికి పద.
:::::::::

ఇప్పటికి సగం మందికి అర్థమయుంటుంది. మిగతా సగం మంది అదేంటో తెలుసుకోవాలంటే కాసేపు చదవండి. అమెరికాలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఇచ్చే రశీదునే టికెట్ అంటారు. ఒక్క సారి టికెట్ వచ్చిందంటే అది మీ డ్రైవింగు రికార్డుకు నక్షత్రకుడి లా జత చేయబడతాయి. సాధారణంగా సోషల్ సెక్యూరిటీ నంబరు లేనిదే డ్రైవింగు లైసెన్సు ఇవ్వరు. అంతర్జాతీయ డ్రైవింగు లైసెన్సు వుంటే కూడా ఇక్కడ డ్రైవింగు చెయ్యచ్చు. నియమ నిబంధనలు అతిక్రమిస్తే టికెట్ ఇస్తారు. కాక పోతే పాయింట్లు వుండవు ఫైను కట్టాల్సి వస్తుంది. కట్టకుండా కూడా దేశం నుండి చెక్కెయ్యొచ్చు. దాని గురించెందుకులే ఇప్పుడు.

ప్రతి ట్రాఫిక్ నిబంధన అతిక్రమణ కు కొన్ని పాయింట్లు ఇస్తారు దానితో పాటు కొంత ఫైను వేస్తారు. ఉదాహరణకు మీరు 60 మైళ్ళ స్పీడు వున్న చోట 75 మైళ్ళ స్పీడుతో వెళుతుంటే రెండు పాయింట్లు $60 డాలర్ల ఫైను వుంటుంది. అదే స్కూలు దగ్గరో ఇళ్ళ ప్రాంతం లోనో 25 మైళ్ళ స్పీడు వున్న చోట 35 వెళ్ళారంటే 4 పాయింట్లు $125.00 ఫైను వుంటుంది. స్కూళ్ళ దగ్గర క్లాసులు మొదలయ్యే ముందు స్కూలు వదిలేటప్పుడు మాత్రం 30 మైళ్ళు వున్న చోట 15 మైళ్ళ స్పీడు తో వెళ్ళాలని సూచిస్తూ లైట్లు ఫ్ల్యాషు అవుతుంటాయి. అలాంటి చోట్ల ఫాస్టు గా వెళ్ళిన వాడికి ఆ రోజు మూడిందనే అర్థం. పెద్ద విస్తరేసి రాక్షస గరిట తో 6 పాయింట్లు వడ్డించి $300.00 ఫైనేసినా ఆశ్చర్యం లేదు. ఇంకా పోలీసుకు తిక్క రేగితే లైసెన్సు క్యాన్సిల్ చెయ్యమని రెకమండ్ చేసి పారేస్తాడు. తరువాత డౌన్‌లోడ్ చేసుకున్న MP3 పాటలినుకుంటూ బస్సులో తిరుగుతూ వచ్చే పోయే కార్ల నంబర్లు చదువుకుంటూ కాలం గడపాల్సి వస్తుంది. లైసెన్సు పోతే అమెరికాలో కారు నడపలేము. అమెరికాలో కారు లేక పోవడం కాళ్ళు లేక పోవడం రెండూ ఒకటే.

అమెరికాలో ఎట్టి పరిస్థితిలోనూ మందు తాగేసి కారు నడపకండి. ఒక్క సారి DUI (Driving under influence) కింద పట్టుబడ్డారంటే జీవితం నరక ప్రాయమవుతుంది. ఉద్యోగాలివ్వరు. లైసెన్సు వుండదు. ఒక షెరీఫ్(పోలీస్ ఆఫీసర్) డ్యూటీ అయిపోయిన తరువాత DUI కింద అరెస్టయి ఉద్యోగం పోగొట్టుకొని నానా కష్టాలు పడ్డం చూశాను.

ఈ పాయింట్లేంటంటే... ఒక 12 నెలల కాలం లో మొత్తం 12 పాయింట్లు వస్తే లైసెన్సు ను ఒక్క సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తారు. ఇంకా 24 నెలల కాలం లో 16 పాయింట్లు వచ్చినా ఇదే సూత్రం వర్తిస్తుంది. రాష్ట్రాన్ని బట్టి కొన్ని నిబంధనలు మారుతుంటాయి. ఈ పాయింట్లు మూడు సంవత్సరాల కాలం పాటు కర్ణుడికి కవచాల్లా డ్రైవింగు రికార్డుకు అతుక్కొని వుంటాయి. ఒకటో రెండో పాయింట్లు రాగానే గోతి కాడ నక్కలా కాచుక్కూచున్న కారు ఇన్సూరెన్సు సారు వాడు డింగుమని లేచి "హ్యాపీ డేస్...హ్యాపీ డేస్..." అని పాడుకుంటూ ఇన్సూరెన్సు ప్రీమియం పెంచేస్తాడు. అదృష్టం కొద్దీ ఇన్సూరెన్సు వాళ్ళు నెలకో సారి మన డ్రైవింగు రికార్డు చెక్ చెయ్యడు. ఇన్సూరెన్సు కాల పరిమితి పొడిగించేప్పుడు మాత్రం చూసి నీకు ప్రైజొచ్చిందని నెలకు $30 కట్టే వాడి చేత $300 కట్టించుకొని "డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు" అని వాడు సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఇలా పాయింట్లు పెంచుకుంటూనో లేక అప్పుడప్పుడూ వేరే కార్లు చాల ముద్దు గా వున్నాయని సరదాగా ముద్దులిస్తూనో వుంటే ఇన్సూరెన్సు వాడు ఇంటికి రాకుండా ఆఫీసుకొచ్చి ఆఫీసు వాళ్ళిచ్చే జీతం నేరుగా వాడి అక్కౌంట్ లోకి తీసేసుకుంటాడు ఖామెడీగా. అందుకే ఈ దేశం లో మరీ ప్రమాదకరంగా వాహనాలు నడిపేవాళ్ళు చాలా తక్కువ. కొంచెం మిడి మాలం గాళ్ళుంటారు. వాళ్ళు జైలుకి రెగ్యులర్ విజిటర్లు అయుంటారు.

పట్టుబడిన రెండు వారాల వరకు కోర్టుకు వెళ్ళి చాలెంజ్ చెయ్యడానికి లేదు. రెండు వారాల తరువాత ఫోను చేస్తే "నీకు నాలుగు పాయింట్లు తోమాము కదా. నువ్వు వెంటనే ఫైను కట్టేసి మాకు కోర్టు పని తగ్గిస్తే నీకు తోమిన రెండు పీకేసి మిగిలిన రెండే ఇస్తాం. సరేనా సార్." అని మర్యాదగా బార్ గైన్‌ ప్లీ ఇస్తారు. కాదంటే "ఒరేయ్ నీ ఖర్మ రా చెబితే వింటావా?. అయితే ఫలానా రోజు కోడి కూసే టైముకు కోర్టుకు వచ్చి మిట్ట మధ్యాహ్నం 12 గంటల వరకు మాడు వెధవ సారు" అని కొంచెం తెలివైన మర్యాద చేస్తూ చెబుతారు. మనం ఎక్కడో బేస్ మెంట్ లో పడేసిన టై కోసం వెదికితే అది బుడ్డోడి నడుముకు చుట్టుకొని వుంటాడు. వాడికి మూడు ఐస్ క్రీములు, నాలుగు చాక్లెట్లు ఇస్తే ముక్కు తుడుచుకొని తిరిగి ఇస్తాడు. దాన్ని కట్టుకొని వెళ్ళి బాగా వాదించిన తరువాత జడ్జి గారు జాతకం చెప్పే చిలక కార్డు తీసినట్టు లామినేట్ చేసిన తీర్పునొకదాన్ని తీసి మొత్తం చదివి డ్యాషున్న చోట మన పేరు పెట్టి, ఆ పేరు ముందర అవసరమున్నా లేకున్నా మిస్టర్ పెట్టి మిసరబులు చేసి "ఈ నాలుగు తో నలుగు పెట్టుకో. ఆ కౌంటర్ లో డబ్బు కట్టుకో" అని నవ్వేసి "నెక్స్ట్" అంటాడు. అప్పడు మనకు కోర్టు ఖర్చుకు కట్టాల్సిన ఎక్ స్ట్రా ముప్పై, ఎక్కడో ఊరి చివర్న వున్న కోర్టుకు రావడానికి అయిన పెట్రోలు ఖర్చు, బాసు ఏడుస్తూ ఇచ్చిన పర్మిషనూ, బుడ్డోడి ఐస్క్రీము గుర్తుకు వస్తాయి. ఆనంద భాష్పాలు కొన్ని టైకి రెండు వైపులా దేవాదుల ప్రాజెక్టు పైపు లీకయినట్లు కారుతుంటాయి.

సాధారణంగా కాపులు (దీని మీద కాపులు, రెడ్లు అంటూ మిమిక్రీ శివా రెడ్డి చెప్పే జోకు భలే వుంటుంది. భలే అంటే నాకు గుర్తు లేదని అర్థం.) అంటే పోలీసులు స్పీడుగా వెళ్ళే వాళ్ళను పట్టుకోటానికి ఏ చెత్త కుప్పల వెనకాల్నో, విరిగిపోయిన చెట్ల వెనకాల్నో రాడార్ గన్నులెట్టుకొని కాపు కాస్తారు. గంగమ్మ జాతరప్పుడు వేషాలేసినట్టు ఒళ్ళంతా బొట్లు పొడిపించుకొని, కట్ బనీను హాఫ్ కట్ చేసికొని జుట్లో దాసరోళ్ళ పూసలేసుకొని ఊగుతూ రెండు చేతులూ గాల్లో పెట్టేసి వాహనం నడిపే వాళ్ళు దొరగ్గానే పెళ్ళి బ్యాండు, ఈస్ట్ మన్‌ కలర్ రంగుల లైట్లు వేసుకోని వచ్చి టికెట్ పెళ్ళి చేస్తారు.వాళ్ళు కాపు కాయడం చూసినప్పుడు చిన్నప్పుడు ఆడిన దొంగ-పోలీసు ఆట గుర్తుకు వస్తుంది. ఈ ఆట బాగా ఆడిన వాళ్ళకు ట్రాఫిక్ టికెట్లు తక్కువ వస్తాయి.

పొద్దున్నే ఆఫీసు కొస్తూ కాపు గాడి జాక్ పాట్ తో టికెట్టొస్తే వాడు టికెట్ చేతిలో పెట్టి మన సంతకం అయిపోగానే "హ్యావ్ ఏ బెట్టర్ డే" అంటాడు. అప్పుడు కాలినట్టు తండూరి పెనం కూడా కాలదు. కావాలంటే తండూరి పెనం పక్కన పెట్టుకొని స్పీడుగా నడిపి చూడండి.

ట్రాఫిక్ టికెట్ల నుండి తప్పించు కోడానికి కొంత మంది చాలా ట్రిక్కులు ప్లే చేస్తారు(ట). మా ఆఫీసులో ఒకావిడ కాప్ పట్టుకోగానే బోరు మని ఏడ్చేస్తుందట. పోయిన జన్మలో తమిళ నాడు లో పుట్టి వుంటుంది. అలా ఆవిడకి చాలా సక్సస్ రేటు వుందిట. ఇంకొకతను "సార్ చాలా అర్జంటు సార్... వెళ్ళకపోతే పాంటు సార్ ... తడిచిపోతుంది సార్..." అని చెప్పి తప్పించుకుంటాడట. న్యూయార్కు లాంటి చోట్ల కొంత మంది తాయిలం ఇచ్చి మరీ తప్పించుకుంటారట. ఇంకా కొన్ని వున్నాయి. వాటిని బ్లాగులో రాస్తే బాగోదని రాయట్లేదు. ఈ ట్రిక్కులన్నీ అన్ని సమయాల్లోనూ వర్కవుట్ కావు. నేనయితే రెండు సార్లు తప్పొప్పేసుకోని "నిజమే సార్.. చూసుకోలేదు సార్... మీరు చాన మంచోళ్ళు సార్" అని చెప్పేసి తప్పించుకున్నా. మిగతా ఆరు సార్లు మాత్రం కుక్కరు సరీగా లేక పప్పులు వుడక లేదు.

కారు కొన్న కొత్తలో పార్కింగు లాట్లలో కూడా ఫిరంగి గుండు లా దూసుకు పోయే వాడిని. అరవై మైళ్ళ పోస్టింగు వున్న చోట నూరు దాటించినప్పుడు కూడా పట్టుకోలేదు చేత కాని సన్నాసులు. ఏ కాబోయే పెళ్ళికొడుకు గాడ్నో ఏర్ పోర్ట్లో డ్రాప్ చేసి సెక్యూరిటీ చెక్ దాటించి వాడి ఇండియా విమానం టేకాఫ్ అయ్యే లోపు రయ్యిమని వచ్చి ఇంట్లో గరాజ్ లో కారు పార్క్ చేసే వాడిని. గ్రహచారమేంటంటే ఎప్పుడైతే మోజు తీరి జాగ్రత్త గా వెళ్ళడం మొదలు పెట్టానో అప్పట్నుండి టికెట్లు సాక్షి పేపర్ సైజులో రావడం మొదలు పెట్టాయ్..ప్చ్.

గాడ్స్ మస్ట్ బీ క్రేజీ ఐ సే.


:::::::::

13 comments:

Anil Dasari said...

సవరణ: డ్రైవింగ్ లైసెన్స్ కి సోషల్ సెక్యూరిటీ నంబర్ తప్పనిసరి కాదు. ఐ.ఆర్.ఎస్. వాళ్లిచ్చే ట్యాక్స్ ఐడి ఉన్నా చాలు. ఈ సడలింపు 1999లో వచ్చినట్లు గుర్తు.

మీకు గుర్తులేని శివారెడ్డి జోకు:

శ్రీనివాసరెడ్డి అమ్మా నాన్నా అమెరికా వచ్చారు. కొడుకు కోడలు ఉత్సాహంగా పెద్దాళ్లిద్దరినీ కార్లో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతున్నారు. ముసలాళ్లిద్దరూ వెనక సీట్లలో కూర్చుని ఉన్నారు. అలవాటు లేకపోవటం వల్ల ఇద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు.

ఒక చోట కాప్ కాపుగాసి రాడార్ ఎక్కుపెట్టి చూస్తున్నాడు. ముందు సీట్లో ఉన్న కోడలు పిల్ల అది గమనించి కంగారుగా 'అత్తయ్యా బెల్టు పెట్టుకోండి. ఎదురుగా కాపున్నాడు' అని కేకేసింది.

రెండు రోజులనిండీ ఈ మాట వినీ వినీ అత్తగారు విసుగెత్తిపోయున్నారు. కొత్త కోడలి మీద ఎలాగో దాచుకుంటూ వచ్చిన చిరాకు బయటపెట్టేస్తూ ఆమె కూడా అరిచేసింది: 'ఎహె. వాడు కాపైతే మనకేంది? మనం రెడ్లం! ఇదేం దేశమమ్మా, మరీ విడ్డూరం కాకపోతే కాపోడ్ని చూసి భయపడేదేంది?'

వికటకవి said...

శివారెడ్డి జోకు బాగుంది. కాకపోతే, వాడు కాపైతే ఏంది, మనం పెదకాపులం అంటుందేమో అనుకున్నా.

సుజాత వేల్పూరి said...

మా వారికి అమెరికాలో ఈ టికెట్ రాకపోయుంటే ఈ టపా చదివి ఇంత ఎంజాయ్ చేసేదాన్ని కాదు. కొలరాడొ వెళ్ళేటపుడు, కన్సాస్ లో అనుకుంటా...70లో వెళ్ళల్సిన చోట కారు నిండా పది మంది జనాల్ని పెట్టుకుని 85లోనో, 90లోనో 'మేఘాలలో తేలిపోతున్నది..' అను పాడుకుంటూ తోలుతుండగా,నక్సలైట్లు దాచిన మందుపాతర లాగా చెట్లల్లో దాక్కున్న దాక్కున్న పెద కాపు లైటు వేసాడు.వాడు ఇంకా బాండు మేళం మొదలు పెట్టకముందే, 'నాయనా, వాడు లైటు కొడుతోంది నీకే! పక్కకు తీయ్' అని మేమే ఆపించాం! 80 డాలర్ల కు రాసినట్టు గుర్తు చెక్కు. దీన్ని బట్టి ఎన్ని పాయింట్లో లెక్కేసుకోండి!

కాని ఎవరో ఒక ఫ్రెండు చెప్పాడు. తెల్ల పోలీసుల కంటే నల్ల పోలీసులు కొంచెం దయగా ఉంటారని! మీరు చెప్పిన సాకుల్ని వాళ్ళు చాలా సార్లు ఒప్పేసుకుని..'సరెలే ఫో! ఇహనుంచి వొళ్ళు దగ్గరుంచుకో " అని వదిలేస్తారటగా!(అందరూ కాదనుకోండి)

ఈ టపా లింకు ఇప్పుడే మా వారికి పంపిస్తున్నా!

Anil Dasari said...

(మీరు బే ఏరియాలో ఉంటే) మన్లో మాట. ఈ మధ్య బే ఏరియాలో కాపులు మరీ ఇస్ట్రిక్ట్ అయిపోయారు. ఇంతకు ముందు ఎనభై మీద కూడా చూసీ చూడనట్లుండేవాళ్లు ఇప్పుడు డెబ్భై మీదనే ఉదారంగా టికెట్లిచ్చేస్తున్నారు. విషయమేంటని ఆరా తీస్తే తెలిసిందిది. సబ్ ప్రైం దెబ్బకి హౌసింగ్ మార్కెట్ ఠా అనటంతో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు తగ్గిపోయి కౌంటీల ఖజానాలకి పెద్ద చిల్లు పడిందట. దాన్ని పూడ్చుకోటానికి కాపులు, షరీఫులూ చోదకుల మీద పడిపోయి ఎడా పెడా వాయించేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఐదారు మైళ్లు ఎక్కువ వేగంగా నడిపినా టికెట్టు తెచ్చుకున్న వాళ్లు ఈ ఆరు నెలల్లో చాలామందున్నారు. కాబట్టి మీరు బే ఏరియాలో ఉంటే జర భద్రం.

ఇంకో సంగతి. పది రోజుల్నించీ సి.హెచ్.పి. వాళ్లు we are hiring అనే బోర్డుల్ని బస్సులకంటించి తెగ తిప్పుతున్నారు. చూడబోతే ట్రాఫిక్ టికెట్లివ్వటానికి ఎక్కడి కాపులూ సరిపోతున్నట్లు లేరు!

నిషిగంధ said...

అయితే మీరు టికెట్ల ఆల్బం మెయిన్ టెయిన్ చేస్తున్నారన్నమాట :))

అబ్రకదబ్ర గారూ, బే ఏరియా లో ఉండే మా ఫ్రెండు కి పోయిన నెల్లో ఒకే రోజు రెండు టికెట్లు వచ్చాయి.. ఒకటి స్పీడింగ్ కని కాప్ ఇస్తే, ఇంకోటి రెడ్ లైట్ పాస్ అయిందని ట్రాఫిక్ లైట్ దగ్గర కెమెరా ఇచ్చింది!! ఇంత స్ట్రిక్ట్ అసలు కనీ వినీ ఎరుగం అని ఒకటే వాపోయింది!

Anil Dasari said...

ఆల్బమా పాడా. పదేళ్లనుండీ ఒక్క టికెట్టూ సంపాదించలేని అభాగ్యుడిని నేను :-) నా ఫ్రెండొకడు పన్నెండేళ్లపాటు టికెట్ లేకుండా రికార్డ్ సృష్టించాడు. వాడి రికార్డు బద్దలు కొట్టాలనేది నా ఆశయం. దానిక్కొన్ని చిట్కాలున్నాయి. కాస్త అదృష్టం కూడా తోడవ్వాలనుకోండి. మచ్చుకొకటి: ఫ్రీవేలమీద వెళ్లేటప్పుడు పెద్ద పెద్ద ట్రక్కులు అతివేగంగా వెళుతుంటే ఆ దగ్గరలో కాపు లేడని అర్ధం (ట్రక్కుల వాళ్లు కాపుల సమాచారం రేడియో ద్వారా ఒకరికొకరు చేరవేసుకుంటారు)

చిట్కాలు చెబుతున్నానని పరిమితికి మించిన వేగంతో నడపమంటున్నానుకోవద్దు. మితిమీరిన వేగమెప్పుడూ ప్రమాదమే. రూల్సున్నది మనకోసమే కదా. అవి పాటించటమే మంచిది - మనకిష్టమున్నా లేకున్నా.

రానారె said...

గతనెలలో నేనూ నా ఒక్కగానొక్క ట్రాఫిక్ టికెట్టుకు మొదటివార్షికోత్సవం జరిపాను. ఈ టికెట్ వల్ల నాకు చాలా కొత్తవిషయాలు తెలిశాయి.

Unknown said...

ఈ మధ్య మా అపార్టుమెంట్ లొ పార్కింగ్ లేకపోవడంతో రోడ్దు పక్కన పార్క్ చేసా. ఆరోజు రాత్రి ఉరుములు మెరుపులతో భారి వర్షం కురిసింది. ఉదయం ఆఫీసుకి వెళ్తున్నప్పుడు చూస్తే టిక్కెట్ ఉంది. అది తెల్లవారు జామున 3 గంటలకు ఇచ్చారు. విషయం ఏమిటంటే, ఫైర్ హైడ్రెంట్ కి 5 అడుగుల దూరంలొ పార్క్ చెయ్యాలి, కాని నువ్వు అంతకంటే దగ్గరగా పార్కింగ్ చేసావు అందుకని ఇచ్చుకో 10 డాలర్లు అని వుంది. వాడు ఆ టైములో అంత చిన్న విషయానికి టిక్కెట్ ఇచ్చినందుకు ఏడవాలో లేక 3 గంటలకు వర్షంలో కూడ వాడి డ్యుటీ చక్కగా చేస్తున్నందుకు అభినందించాలో తెలియలేదు. :(

మరొక్క విషయం, మా రూమ్మేట్ ఒకసారి 5 డాలర్ల పార్కింగ్ టిక్కెట్ కట్టలేదు. కొన్ని రోజుల తరువాత ఒక నొటీస్ వచ్చింది. దాని సారాంశం - రేపటికల్లా టిక్కెట్ డబ్బులు కట్టక పోతే, నీ పై అరెస్టు వారెంటు జారీ చేయబడును. దెబ్బకి మావాడు 5 డాలర్లు మరియు ఫైను కట్టాడు.

Anil Dasari said...

పార్కింగ్ వయొలేషన్ కొచ్చిన టికెట్ల వల్ల మరీ అంత బాధ లేదు లెండి. అది మీ చోదక చరిత్ర లోకెక్కదు.

పార్కింగ్ టికెట్ల స్కామొకటి ఆ మధ్య శాన్ ఫ్రాన్సిస్కోలో బయటపడింది. స్కామంటే ఏ డిపార్టువాళ్లో కూడబలుక్కుని చేస్తున్న అవినీతి కాదు. ఇది వేరే. విషయమేమిటంటే, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి మహానగరాల్లో రోడ్ల పక్కన పార్క్ చేసిన వాళ్లు తెలిసీ తెలియక ఏదో ఒక పార్కింగ్ వయొలేషన్ చేయటం, టికెట్లు తెచ్చుకోవటం, కిమ్మనకుండా ఫైన్ కట్టటం సాధారణం. చాలా మంది విండ్ షీల్డ్ మీద టికెట్ చూడగానే వివరంగా చదవకుండానే ఫైన్ కట్టేస్తారు. సరిగా ఈ అలవాటునే ఉపయోగించుకుంటున్నారు కొందరు అతి తెలివిగల వాళ్లు. ఉదాహరణకి, నాకు పార్కింగ్ టికెట్టొచ్చిందనుకోండి. దాన్ని ఎవరూ చూడకుండా పక్క బ్లాక్ లో ఉన్న వేరే కారు విండ్ షీల్డ్ మీద పెట్టేసి చక్కాపోతా. ఆ కారు ఓనర్ సరిగా చూసుకోకుండా ఫైన్ కట్టేస్తాడు.

ఒక వేళ ఆ కారు యజమాని టికెట్ తనది కాదని కనుక్కుని ఫైన్ కట్టకుండా మానేసినా నాకు పోయేదేమీ లేదు. ఎలాగూ నెలా పది రోజుల్లో సిటీ వాళ్లు నాకు నోటీసు పంపుతారు, ఫైన్ ఇంకా కట్టలేదని. అప్పుడు నేనే కట్టేస్తాను. అదీ సంగతి.

ఇది శాన్ ఫ్రాన్సిస్కోకి మాత్రమే సొంతమైన మాయ కాకపోవచ్చు. కనుకి మీకీసారి పార్కింగ్ టికెట్ వచ్చినప్పుడు వివరాలు సరిగా చూసుకుని కానీ ఫైన్ కట్టవద్దు. అది మీ టికెట్ కాకపోవచ్చు!

కొత్త పాళీ said...

హ హ్హ హ్హ .. అనుభవ మయిందన్నమాట

నా టిక్కట్ల ఇక్కట్లు ఈ కింది పేజీలో రెండవ గల్పికలో చదవండి. అందులో సుబ్బారావు నేనే అని వేరే చెప్పక్కర్లే దనుకుంటాను.
http://www.eemaata.com/em/issues/200005/763.html

రవి వైజాసత్య said...

మీకు తెలుసా ఒక రాష్ట్రంలో టికెట్టొచ్చినట్టు ఒంకో రాష్ట్రంలోని పోలీసులకు తెలీదు (కొన్ని బాగా సంబంధాలున్న రాష్ట్రాల మధ్య తప్ప)..
కొన్ని రాష్ట్రాల్లో ఒక సంవత్సరం పాటు మరే టికెట్టూ తెచ్చుకోకపోతే మొదటిదాన్ని కూడా తుడిచేసే పథకం ఉంది.
ఇలాంటి బోలెడన్ని చిట్కాలున్న సర్వటికెటోపనిషత్తు కాపీ కోసం వంద డాలర్ల డీ.డీ రవి వైజాసత్య పేరున తీసి పంపించండి :-)

Rajiv Puttagunta said...

Ilaanti vishayalu public gaa raayadam aarogyakaram kaadhu kabatti raayaledhu. Vaija satya garu tickets gurinchey chepparu. Ekangaa license vishayamlo kooda idhi vartisthundi (vartinchindi) konni states lo.

Anonymous said...

@అబ్రకదబ్ర గారు,
అవును మీరు చెప్పింది కరక్టే. నాకనుమానమొచ్చే సాధారణంగా అని రాశా.
మీకు శివా రెడ్డి జోకు బానే గుర్తుంది.మా ఊళ్ళో శివా రెడ్డి కార్యక్రమమప్పుడు స్టేజి వెనక నుండి వాళ్ళకు కాఫీలు టీలు అందించడానికే సమయం సరిపోయింది.విన్నదేం గుర్తులేదు.
మేము కొండల్లో ఉంటాం కదా. బే ఏరియా దెబ్బలు మాకుండవు.
అబ్బో చాలా టెక్కునిక్కులే వున్నాయి. ఇంతకు ముందు పాత సాఫ్ట్వేర్ వాడేప్పుడు మనం ఫైను కట్టి చెక్కు క్లియర్ అయితే కానీ మన అకౌంట్ లోకి పాయింట్లు వచ్చేటివి కాదు. మామూలు ఫైను కన్నా ఓ రెండు డాలర్లు ఎక్కువ చెక్కు పంపిస్తే వాళ్ళు చెక్కు వేసుకొని మిగతా రెండు డాలర్లకు రిటర్న్ చెక్ పంపించే వాళ్ళు. ఆ రెండు డాలర్ల చెక్కు ఎన్‌క్యాష్ అయితే గానీ ట్రాంసాక్షన్‌ పూర్తయి పాయింట్లు వచ్చేవి కావు. ఇప్పుడు దాన్ని సరి చేశారు.

అవును నిషిగంధ గారు అన్నది మిమ్మల్నా నన్నా?

@వికటకవి గారు,
మీ వ్యాఖ్యకు నెనర్లు.

@సుజాత గారు,
అలా లాంగు ట్రిప్పులేసినప్పుడు బ్యాండు మేళం సందడి లేకపోతే ఎలా. ఇప్పుడు హైదరాబాద్ లో రోజూ హారన్‌ మేళాలే వుంటాయి కదా. నెనర్లు.

@నిషిగంధ గారు,
అలా టికెట్లిస్తుంటే మాత్రం అమెరికా ఎకానమీ చాలా ప్రమాదమ్లో వున్నట్టే. నెనర్లు.

@రానారె,
ఈ టికెట్లు భద్రంగా ఎత్తి పెట్టుకుంటే ఎప్పుడన్న వేలం వేసుకుంటే చాలా డబ్బులొస్తాయ్.

@కొత్త పాళి,
మీ నిజమైన కథలో నల్లని త్రాచులా కాపు కారు భలే వుంది.

@రవి గారు,
ఆ ఉపనిషత్తుల పుస్తకం మీద రైట్లు అన్నీ నాకే కావాలి. నెనర్లు.

@రాజీవ్ గారు,
నిజాలు చెప్పకండి మీ లైసెన్సు రద్దవుతుంది.

-- విహారి